శిలా విలాపం

ఆధునిక ప్రపంచపు వేగం ఆ కారు టైర్లకింద నలిగిపోతోంది. స్టీరింగ్ పట్టుకున్న శివ కళ్లలో అలసట మెరుస్తోంది. ఏదో ప్రాజెక్టు పనిమీద పక్క జిల్లాకు వెళ్తుంటే, దారి మధ్యలో ఒక పాత బోర్డు కనిపించింది… ఒడ్యారం.

శివ గుండె ఒక్కసారిగా ఆగింది. అది ఊరు కాదు, ఒక పచ్చి గాయం. పదేళ్లు దాటిపోయింది ఆ మట్టిని వదిలేసి.
ఒడ్యారం.. అది కేవలం ఒక ఊరు కాదు, వడ్డెరల శ్రమకు, పౌరుషానికి నిలువుటద్దం. పూర్వం కోటలు కట్టాలన్నా, గండిపడ్డ చెరువులను బాగుచేయాలన్నా ‘వడ్డె రాజులు’ రావాల్సిందే అనే నానుడి ఉండేది. ఆ వారసత్వాన్నే పుణికిపుచ్చుకున్న ఒడ్యారం ఊరి మనుషులు రాతిని పిండి చేయడంలో సిద్ధహస్తులు. ఒకప్పుడు ఈ ఊరి గన్నుల దెబ్బకు కొండలు తలవంచేవి. కానీ, కాలక్రమేణా ఆ రాళ్ల మీద రాసిన వీరి చరిత్ర క్వారీల్లో ఊపిరిని మింగేసే దుమ్ములో కలిసిపోయింది. ఊరి నిండా రాళ్లే. మనుషుల గుండెల్లోనూ ఆ రాళ్ల రాపిడి చేసే గాయాలే. అటువంటి వడ్యారం పొలిమేరల్లోనే శివ బాల్యం రాళ్లతో ఆడుకుంటూ మొదలైంది.

కారు మెల్లగా ఊరి వీధుల్లోకి సాగింది. శివ కళ్లు తన పాత ఇంటి కోసం వెతికాయి. కానీ, ఒక్క వీధి కూడా గుర్తుపట్టేలా లేదు. సగం విరిగిన గోడలు. కూలిపోయిన కప్పులు. పాడబడ్డట్టు ఉన్న ఆ గూళ్లను చూస్తుంటే ఊరంతా వలస పక్షులయిపోయినట్టు అర్థమైంది. మనుషుల అలికిడి లేని ఆ పాత ఇళ్లు, శివ మనసును మరింత భారంగా మార్చేశాయి. ఈ మట్టిని నమ్ముకున్న వాళ్లంతా పొట్ట చేతబట్టుకుని ఎక్కడికి పోయారో అన్న బాధతో, దిగులుగా కారును క్వారీ వైపు పోనిచ్చాడు.
కారు ఆపి దిగేసరికి, ఆ రాళ్ల దుమ్ము అతని ఇస్త్రీ చొక్కా మీద పలకరింపుగా వాలింది.

క్వారీ లోపలికి నడుస్తుంటే శివకు తన బాల్యం కళ్లముందు కదలాడింది. అమ్మానాన్నలు రామయ్య, గంగమ్మ. వాళ్ల ఆరడుగుల ఆజానుబాహుల దేహాలు రాళ్లతో కుస్తీ పడుతుంటే, తను పుస్తకాల సంచి పట్టుకుని బడికి వెళ్లేవాడు.

బడిలో శివ అస్తిత్వం ఎప్పుడూ ఒక వెక్కిరింతే. “అరేయ్.. నువ్వు తొడుక్కున్న పేల్కలు ఎట్లున్నయిరా? ఒడ్డెరోని తీర్గ… రంగు ఎలిసిపోయి, మాసిపోయి… ఇట్ల సూత్తే అచ్చం బండలు కొట్టేటోని లెక్కనే ఉన్నవ” అని తోటి పిల్లలు నవ్వుతుంటే, ఆ అవమానం శివ లోపల ఒక నిశ్శబ్ద మంటను రగిలించేది. అదే బళ్ళో బరువైన పనులు మాత్రం చేయడానికి తనని పిలిచే పంతుళ్ళ చూపుల్లో, “నువ్వు ఇందుకే పనికొస్తావ” అన్న వెక్కిరింపు శివ వెక్కి వెక్కి ఏడిచే ఏడుపుకు కారణం అయ్యేది.

శివకు ఆరోజు అర్థమైంది. ‘సమాజానికి మా శ్రమ కావాలి, మేం తొవ్విన బావులు కావాలి. మేం కట్టిన మేడలు కావాలి. కానీ, మేం మాత్రం ‘ఒడ్డెరోళ్ళలా’ ఉండకూడదు.’

ఆరోజు అతడు ఏడుస్తూ ఇంటికి వస్తే, రామయ్య అతని భుజం మీద చేయి వేశాడు. ఆ చేతి కాయలు శివ చర్మాన్ని గుచ్చుకున్నాయి. “కొడుకా… ఈ కాయలు సూశినవా? ఇయి కాయకష్టానికి గుర్తులు. ఆల్లు నిన్ను అవమానించింది నీ బట్టలను సూశి కాదు, నీ ఎనక ఉన్న మా కష్టాన్ని సూశి. ఆ కష్టానికే యిలువ లేనపుడు, ఈ మనుషుల మాటలకు యిలువ ఎక్కడిది? సదువుకో. ఈ రాళ్లను పగలగొట్టినట్టు ఆల్ల అహంకారాన్ని పగలగొట్టు” అన్నాడు.

జ్యోతి గుర్తొచ్చింది. శివతో పాటు ఒకే బెంచీ మీద కూర్చుని చదువుకున్న పిల్ల. లెక్కల్లో శివ కంటే చురుగ్గా ఉండేది. ‘అన్న… అన్న… అనుకుంట తిరుగుతుండే … ఇప్పుడు ఎట్లుందో’ అనుకున్నాడు.

తల్లీదండ్రులు చెమటతో వారి దేహ ధారుడ్యాన్ని కరగదీసి చదివించడంతో ఏదో గొప్ప గవెర్నమెంట్ కొలువు సంపాదించాలని అహర్నిశలు శ్రమించాడు. కానీ, వ్యవస్థ వేసిన రాతి గోడలు అక్షరాలను కూడా అణచివేస్తాయని శివకు అప్పుడు అర్థం కాలేదు. ఇంటర్వ్యూ బోర్డు ముందు కూర్చున్నప్పుడు అతని తెలివికంటే, అతని నేపథ్యం మీదనే వెటకారపు ప్రశ్నలు వచ్చాయి. చివరకు ఏ ఉన్నత ఉద్యోగమూ రాక, బతుకుదెరువు కోసం పట్నంలో చిన్నచిన్న సివిల్ కాంట్రాక్టులు చేయడం మొదలుపెట్టాడు. ఆఫీసర్ కావాల్సిన వాడు, చివరకు అదే రాళ్లను కొనే ‘థర్డ్ క్లాస్ కాంట్రాక్టర’ అయ్యాడు. పైన ఆఫీసర్లకు కమిషన్లు ఇస్తూ, కింద లేబర్‌ని పిండాలి. తను ద్వేషించిన అదే వ్యవస్థలో భాగమయ్యాడు.

శివ పట్నం వెళ్లిన కొత్తలోనే రామయ్య క్వారీ రాళ్లకింద నలిగిపోయి కాలం చేశాడు. ఆ పుట్టెడు దుఃఖంలోనే గంగమ్మ కూడా త్వరగా కన్నుమూసింది. తనకంటే పన్నెండేళ్లు చిన్నదైన చెల్లెలిని ఈ రాళ్ల దుమ్ముకు దూరం చేయాలనే కసితో, శివ ఆ పట్నం రొంపిలోనే తలదాచుకున్నాడు.

క్వారీ లోపలికి నడుస్తుంటే, చంద్రి కనిపించాడు. చిన్నప్పటి సోపతి… వంటి నిండా దుమ్ము, కళ్లు లోతుకుపోయి, పిల్లి కూతలా వినిపిస్తున్న ఊపిరి..సిలికోసిస్ రాక్షసుడు అతని ఊపిరితిత్తులను రాళ్లతో నింపేస్తున్నాడు. అక్కడ మాస్క్ లేదు. రక్షణ లేదు. పక్కనే జ్యోతి రాళ్లను గంపల్లోకి ఎత్తుకుని. బరువులు మోస్తూ… గడ్డపార దెబ్బ తిన్నట్టు శివ గుండె ఒక్కసారిగా బద్ధలైంది.
“శివనే గదా… నువ్వు? ఎట్లున్నవ్…? దా…
జ్యోతీ…! సూడు ఎవలచ్చిన్లో…” చంద్రి కేకేశాడు.
“జ్యోతీ నాతోటిదానివే కదా.. గిట్లయినవేంది? నా కంటే జెర్రంత మంచిగనే సదువుతుంటివి గదా…? ఇదేందీ ఈడ గిట్ల?!” అడిగాడు శివ.

చంద్రి నిట్టూరుస్తూ, “శేటు దగ్గర దూసిన బాకీ మా కుతికెకు ఉరై కూసున్నది శివా… నువ్వు మొగోనివి అయి అవుతలికి పోయి సదువుకున్నవ్. జ్యోతికి గా మోక యాడుండే? ఎట్లైనా రేపు ఇంకో క్వారీల అయినా బండ మోసుడే. ఈపాటి ఏశానికి చదువు ఎందుకని దాని కలలను గీ దుమ్ముల కలిపిండ్రు… నాకిచ్చి లగ్గం చేసిండ్రు” అన్నాడు చంద్రి.

“ఏ మాట కా మాట గానీ మా జ్యోతి మీ అమ్మ గంగమ్మత్త తీర్గనే… నాతోటి సమానంగ పంజెస్తది… యాడ సుతం ఎనుకకు పోదు.” చెంద్రి చెప్తానే ఉన్నాడు.

అప్పుడే వచ్చి ముఖాన్ని చెంగుతో తుడుచుకుంటూ గుడ్డ ఉయ్యాల్లో ఉన్న బిడ్డను ఎత్తుకొని పాలియ్యడానికి తయారవుతూ జ్యోతి నెమ్మదిగా అంది, “అవ్ శివన్నా.. మొగోళ్లు గడ్డపారతోటి తవ్వేటి పని సేసుట్ల భుజాలు, ఛాతిల నొప్పిలేత్తే… బండను తట్టలల్లకు పారతోటి గుంజి… బరుతోటి గంపలను నెత్తిమీద ఎత్తుకుని అంతంత దూరాలు నడుస్తే…పెయి అంతా పుండైనట్టు నొప్పులతోటి నీకన్న పదేండ్లు ఎక్క వైసున్న దాని మారెం కనిపియ్యనా మరి… నడుము విరిగిపోయేతట్టు నొప్పితోటి ఒక్కోమాల్క పొల్లకు పాలిద్దామన్న కూడా తక్లీబు అయితది… ఇగో ఇది మూడోది. నువ్వు కాంట్రాక్టరువని విన్న.. శివన్నా!… ఏదో ఒక ఊర్ల మా అసుంటోల్ల తాన్నే కదా రాయి కొనేది? ఆ కాంట్రాక్టులు ఇసారం సేసేటప్పుడు నువ్వైనా కనీసం మా కూలీల భద్రత గురించి, ఆడోళ్ళ సౌలతుల గురించి గా శేట్లను అడుగన్నా… మా పాణాలు ఆ రాళ్ల కంటే అగ్వయి పోతున్నయి.” మాడ వొత్తుకుంటూ అన్న ఆమె మాటల్లో తన యజమాని గురించే కాదు, యజమానులందరిని ఉద్దేశించిన వేదన ఉంది.

సాయంత్రం అవుతోంది. యజమాని అరుస్తున్నాడు, “పని ఆపకుండ్రి , రేపు లోడు పంపాలె.”

శివ తన కారు తాళాలను జేబులో గట్టిగా పట్టుకున్నాడు. పట్నంలో తను ఇప్పుడు చేస్తున్న రోడ్డు కాంట్రాక్ట్ సక్రమంగా ముగిస్తేనే తన చెల్లెలి పై చదువులకు ఫీజు కట్టగలడు. ఆ కాంట్రాక్ట్ పూర్తి కావాలంటే తను కూడా ఇలాంటి మరో క్వారీ యజమాని దగ్గర తక్కువ ధరకు రాళ్లు కొనాలి. అంటే మరో జ్యోతిని, మరో చంద్రిని పరోక్షంగా పిండాలి.

ఈ వ్యవస్థలో తను ఎదిగానని అనుకున్నాడు. కానీ, నిజానికి తను కూడా ఒక బలి పశువే. ఒక చెల్లెలిని ఆ కూపం నుండి బయట పడేయడం కోసం, తను ఇంకో పది మందిని అదే కూపంలోకి నెట్టే వ్యవస్థకు సంతకం పెడుతున్నాడు.

తిరిగి కారు దగ్గరకు వెళ్తుంటే, రామయ్య, గంగమ్మల సమాధులు కనిపించాయి. ఆ రాళ్ళు మాట్లాడుతున్నట్లనిపించింది: “నువ్వు ఎదిగినవు. కానీ మమ్ముల ఇడిసిపెట్టినవు.” అని.

కారు ఎక్కి స్టార్ట్‌చేశాడు. రివర్స్ తీస్తుంటే, క్వారీలో పెద్ద పేలుడు శబ్దం. ఎవరో అరిచిన కేక వినిపించింది. కానీ, కారు వేగంగా ఊరు దాటి వెళ్లిపోతోంది. ఏసీ ఆన్ చేసినా గుండెల్లో వేడి తగ్గలేదు. అద్దంలో వెనక్కిచూశాడు. దుమ్ము ఆకాశాన్ని కమ్ముతోంది. ఆ దుమ్ములో తన వాళ్ల ఆశలు, జ్యోతి కోల్పోయిన స్వేచ్ఛ, తన అసంపూర్ణ ఓటమి అన్నీ కలిసిపోయాయి.
చెరబండరాజు పాట శివ తలలో దిమ్ము దిమ్మున మోగుతున్నది.
“కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మా నెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో…”
శిలలు కరుగుతాయేమో కానీ, వ్యవస్థ రాతి గుండె మాత్రం కరగదు.

కథా రచయిత, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్, ఆడియో ప్రెసెంటేటర్, వాయిస్ ఆర్టిస్ట్, వ్లాగ్ మేకర్. కాకతీయ యూనివర్సిటీ నుంచి కామర్స్ లో మాస్టర్స్ చదివారు. 150 కవితలు, పది కథలు రాశారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మిత్రులతో కలసి 'పొయ్యిరాళ్లు' పేరుతో ఛానెల్ ప్రారంభించారు. నాలుగు షార్ట్ ఫిల్మ్స్ రాసి దర్శకత్వం వహించారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో జోనల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రస్తుతం హన్మకొండలో ఉంటున్నారు.

Leave a Reply