శికారి – ఓ ఒంటరి సమూహం

కొన్ని దశాబ్దాలు యీ నేలలో తిరిగాను. శికారి నవల చదువుతూ మళ్ళీ ఆ గాలి పీల్చాను. గతాన్ని పలకరిస్తూ, పలవరిస్తూ అసహనంగా, క్రోధంతో, దుఃఖంతో బంగారు పేటంతా కలియతిరిగాను. కె.సి కెనాల్‌ పక్కన రాళ్ల కుప్పల మీద కుప్పగా కూలిపోయాను. యీ క్షణాన నా మనసు గుమ్లి చేసిన సారాయి తాగాలని కోరుతున్నది నిజానికి.

అనాగరికులుగా పిలువబడ్డ ఆ తెగలో కాస్త చదువుకొని చైతన్యం పొందినందుకు ప్రతిఫలంగా సారా కాంట్రాక్టర్లచే హత్య చేయబడ్డ శామూ హంద్రీ నది యిసుకలో కలిసిపోయినా ఇంకా నా కళ్ళ ముందే నిలబడి వున్నాడు. నవలగా ఏ ఒక్క పాత్రో ప్రధానం కాకుండా శికారీల జీవితాన్ని తెలియజేసే పాత్రలన్నీ నా మనసులో తిరుగాడుతున్నాయి.

మనుషులు ఎట్లా వుంటారు. యెంత యోధులు, యెంత భీరువులు, యెంత గంభీరులు, యెంత శాంతమూర్తులు. యెంత వేదన వాళ్ళ గుండెల్లో, బతుకుల్లో. అయినా జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు. దేన్నీ తిరస్కరించకుండా జీవించడమే తెలిసిన మనుషులు. దుఃఖంలో కన్నీరు తాగి, ఆనందంలో సారాయి తాగి మానవుల్లా వ్యవహరిస్తారు. వెన్నెల్లో, మామిడి వనంలో, అమ్మ దేవత ముంగిట్లో, తప్పెట్ట్ల మోతలతో జీవితమంతా మహోత్సవంగా.
నాగరిక సమాజంచే నేరస్థులుగా ముద్రవేయబడి, దూరంగా వుంచబడిన శికారీలు ఒక మాదిగ బజారిని తమలో కలుపుకోడానికి నిరాకరిస్తారు.

వేటలో భయమనేదే ఎరుగని వాళ్లు కులం కట్టుబాట్లను దాటితే నిలువెల్లా ఒణికిపోతారు.
దళితుడు దేవసహాయం శికారీల కంటే రాజకీయంగా, ఆర్థికంగా యెత్తున వుండి వాళ్ళ అమ్మ దేవత గుడిని తొలగించాలని చూస్తాడు.

భూమి లేని ఉన్నత కులపు రెడ్డి కాస్తంత భూమి వున్న శికారీని మోసం చేస్తాడు.
వంద పేజీల నవల నిండా అంతులేని రాపిడి. సాదాగా కనిపించే ఈ మనుషుల్లో చూసేకొద్దీ లోతు. ముట్టుకొనేకొద్దీ తీరని దుఃఖం.

ఏంది తండ్రీ యీ బతుకు. ఇంత సంక్లిష్టమా?

చదవడం పూర్తయ్యాక ఈ నవలలోని ‘నానా’ లెక్కనే నేనూ చేతలుడిగి నిలబడి పోయినాను.
యీ నేల మీద కులం- వర్గం రెండూ జమిలిగా యెంత బలంగా పనిచేస్తున్నాయో యీ నవల బొమ్మ కట్టింది.

మరో ప్రత్యేకత యీ నవలలోని మాండలికం, కర్నూలు పట్టణ స్వంతం. పాత్రలన్నీ వాటి సహజమైన భాషతో మనతో కనెక్టయిపోతాయి. శికారీల దుర్బర జీవితం, దానిలోని దు:ఖ విషాదాలు కలగలసిన మానవ జీవన సౌందర్యాన్ని కళాత్మకం చేసిన భాష ఇది.

ఇందులోని ప్రదేశాలు, పాత్రలు, సంఘటనలు అన్నీ వాస్తవం. వీరిని నేను గుర్తించగలను. కొన్ని సన్నివేశాలు కల్పితం కావచ్చు. వాస్తవాన్ని మరింత గాఢంగా చెప్పడానికి రచయిత చేసిన ఊహ కావచ్చు.
యిది పూరాగా మన పాత లెక్కలను పూర్వ పక్షం చేసే కథ.!

శికారి – ఒక వొంటరి సమూహం :
మీరు చదివిన శీర్షిక సరైనదే. సందేహం లేదు. నగరం నడిబొడ్డున ఒక వొంటరి సమూహం!. ఊహించగలమా? దేశంలోనే ఒక అరుదైన తెగగా కర్నూలు జిల్లాలో మనుగడ సాగిస్తున్న నీర్‌ శికారీల జీవితాన్ని యీ నవలలో చూడబోతున్నారు. అనేక ప్రత్యేకతలతో చరిత్రకారులు కొంత గుర్తించారు. వ్యవహారంలో ఒక అరుదైన తెగ అయిన శికారీ కులంగా గుర్తింపు పొందింది. అయినా కర్నూలులో నివసించిన చాలా మందికి (నాలాంటి వారు) యీ తెగ గురించి పూర్తిగా తెలియకపోవడం ఆశ్చర్యం.

శిలాజాలు నేలలో కప్పబడి వుండి భవిష్యత్తు పరిశోధకులకు దొరుకుతాయి. కానీ కళలు, భాషలు, నీతి నియమ వ్యవస్థలు అలా ఉండిపోవు. అవి మూడు శతాబ్దాల కంటే మించి బతకవు. అమెరికన్‌ నాగరికత ప్రభావం వల్ల రెడ్‌ ఇండియన్‌ తెగల జీవితం నిర్మూలించబడింది. వారి కళలు, భాషలు అదృశ్యమయ్యాయి. వారి నీతి నియమ వ్యవస్థ నీరుకారి పోయింది. వారి చరిత్ర, సంస్కృతి తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే అవి గుర్తించలేనంతగా మరుగున పడిపోతాయి.

శికారీలైనా అంతే. భౌతికంగా ఉన్నప్పటికీ వాళ్లు వాళ్లుగా మిగలకపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నవల సందర్భంలో వాళ్ల గురించి తెలుసుకుందాం.

చరిత్ర చెప్పిన సంగతులు :
స్థూలంగా భారతదేశం, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లుగా పిలవబడే మన ఉపఖండ ప్రాంతంలో వేల యేళ్ళ కింద ఆహార సంపాదనకు కేవలం వేట మాత్రమే ప్రధానమైన సమాజాలు వుండేవి. అంటే ఆర్యులు వచ్చే నాటికే ఇక్కడి సమాజాలు ఆ వేటదశను దాటి చిన్న స్థాయిలోనైనా వ్యవసాయాన్ని ఒక ఆహార వనరుగా మార్చుకుని వున్నాయి. స్థిర వ్యవసాయం మొదలైన తరువాత పాత గుంపు సమాజపు తాలూకు వేట ఒక వినోద కార్యక్రమంగా మారిపోయింది. ప్రతి దసరా, సంక్రాంతి వంటి పెద్దపండుగల తరువాత వచ్చే ‘పారువేట’ రూపంలో అది మన సంస్కృతిలో ఒక అవశేషంగా ఇంకా మిగిలివుంది.

యిలా మానవ సమాజం తను దాటివచ్చిన అన్ని సామాజిక దశలనూ ఏదో ఒక రూపంలో ఇముడ్చుకుని వుంటుందని సమాజ శాస్త్రవేత్తలు నమ్ముతారు. అవి మనలో ఇంకా అవశేషాలుగా మిగిలిన ఆచారాలుగానో, సంస్కృతి రూపంలోనో లేదా మనం అనుకునే నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో బతికే తెగల జీవన విధానంలోనో, మనలో మిగిలివున్న కట్టుబాట్ల రూపంలోనో ఒక మాయపొర చాటున అస్పష్టంగా బయటికి కనిపిస్తూ వుంటాయి. మనం గమనించగలిగితే కుటుంబపు పెళ్లి, చావు తంతుల్లో యీ అవశేషాలు ప్రధానంగా నిక్షిప్తమై వుంటాయి.

యీ నవల చదువున్నంత సేపూ ప్రతి పేజీలో నాకు మోర్గాన్‌ పురాతన సమాజం గుర్తుకొచ్చింది. శికారీల గురించిన ఈ కాల్పనిక రచన సామాజిక చరిత్ర నడచి వచ్చిన దారుల గురించి ఆసక్తి కలిగించింది. ఆ దారులను వెతకడానికి, అక్కడి నుంచి తిరిగి నవలలోకి రావడానికి ప్రయత్నించాను. ఇట్లా సామాజిక, సాహిత్య పరిశీలన చేసే క్రమంలో ప్రాచీన సమాజ అధ్యయనం తప్పనిసరి అయింది. అలాంటి అధ్యయనానికి, విశ్లేషణకు మోర్గాన్‌ అనుసరించిన పద్ధతి గొప్పది. ఒక సమాజంలో ప్రజలు తినే తిండి, సంస్కృతి, స్త్రీ పురుష సంబంధాలు, ఆ తెగ కట్టుబాట్లను నిర్ణయించే, అమలుపరిచే బీజరూపంలోని రాజ్యమూ అన్నీ అంతిమంగా ఆనాటి ఉత్పత్తి విధానంపైననే ఆధారపడి వుంటాయని ఆయన రుజువు పరిచాడు. అందుకనే ఎంగెల్స్‌ ‘‘కుటుంబం-రాజ్యం- సొంత ఆస్తి ఆవిర్భావం’’ రాయడానికి మోర్గాన్‌ పరిశీలనలనే ప్రధానం చేసుకున్నాడు.

సమాజ పరిణామంలో అనాగరిక దశ నుండి నాగరిక దశకు మారే క్రమంలో మానవుడి మనసులో ఆస్తి భావం చాలా చిన్న రూపంలో మొదలయ్యింది. పెరిగి పెరిగి అదే చివరకు మన జీవితాశయంగా మారింది. స్వంత ఆస్తిని సృష్టించడం, రక్షించడం, అనుభవించడం ప్రధాన లక్ష్యంగా సమస్త ప్రభుత్వాలు, యంత్రాంగాలు, చట్టాలు ఏర్పడ్డాయి. మన అంచనాలన్నీ స్వంత ఆస్తి కొలమానంతోనే ఉంటాయి కాబట్టి స్వంత ఆస్తిలేని ఆదివాసులు మన అవగాహనకు అందనే అందరు. వాళ్ళు అనాగరికులనీ, సమాజ విలువలను వాళ్ళు పట్టించుకోరనీ తరచూ ఫిర్యాదు చేస్తాం కూడా. స్వాతంత్య్ర పూర్వం టి.వి స్టీఫెన్స్‌ అనే బ్రిటిష్‌ అధికారి అటువంటి ఫిర్యాదే చేశాడు. అంతే కాదు దొంగతనాన్ని వాళ్ళ కుల వారసత్వమని కూడా చెప్పాడు.

‘‘అనేక కాలాల నుంచి ఇక్కడి కులవ్యవస్థ వృత్తులను నిర్దేశించింది. బట్టలనేత, వడ్రంగం, కంసాలి వంటివి వారసత్వపు ఉపాధి అయ్యాయి. అలాగే దొంగతనం చేయడాన్ని కూడా పార్ధీ, నీల్‌ శికారీలు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా తెచ్చుకున్నారు’’ అన్నాడు ఆయన.
మనకు స్వాతంత్య్రం వచ్చాక 1952లో యీ తెగల పేరును నేరస్థ జాతులు అని తొలగించి సంచార జాతులు అని మార్చారు. అయినా ప్రజలలో గానీ, అధికారుల అవగాహనలో గానీ ఏ మాత్రం మార్పు రాలేదు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు, ఎక్సయిజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికీ ఈ జాతుల నడకను, నడతను అనుమానంగానే చూస్తున్నాయి. ఆధునిక ప్రజాస్వామ్యం ఏ మాత్రం మానవీయంగా లేదనడానికి ఇదొక్కటి సరిపోతుంది.

జైభీమ్‌ సినిమాలో అక్రమంగా దొంగతనం మోపబడి పోలీసులపాలై స్టేషన్‌లో చంపబడ్డ సినతల్లి భర్త, మాయం చేయబడిన అతని బంధువులు తమిళనాడులో పాములు పట్టి బతికే ఇరులి అనే తెగ ప్రజలు. వాళ్లు తమదైన ప్రత్యేకతలున్న శికారీల వంటివారే. అట్లాంటి వేలాది తెగలు, కులాలు వ్యవస్థీకృత హింసను, జైభీంలోలాంటి ప్రభుత్వ హింసను అనుభవిస్తున్నారు. ఈ హింసలో వ్యవస్థీకృత మూలాలు ఉన్నట్లే ఆధునిక చట్టబద్ధ మూలాలు కూడా ఉన్నాయి. వాటిని మనం బ్రిటిష్‌ కాలం నుంచి చూడవచ్చు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఒకనాడు మనదేశంలో సుమారు 150 కి పైగా ఇటువంటి తెగలను నేరస్థజాతులుగా ముద్రవేసే ఒక చట్టాన్ని తెచ్చింది. బ్రిటిష్‌ రాజ్యం పోయి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, 75 ఏళ్ల అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నా ఇటువంటి జాతుల పట్ల మన ప్రవర్తన, వారిని చూసే కోణం, వారి నేరాల పట్ల మన అవగాహన ఏమీ మారలేదనీ, బ్రిటిష్‌ మెదడు నుంచి ఒక్క ఇంచి కూడా పక్కకు జరిగి ఆలోచించడం లేదనీ ఇటీవల విడుదల అయిన టైగర్‌ నాగేశ్వరరావు సినిమా రుజువు చేసింది.

‘‘ఆహార సేకరణ మీద ఆధారపడే తెగలు ఏవైనా సహజంగా కనపడ్డ ఆహారాన్ని ఏరుకొని, జంతువులైతే వేటాడి పట్టుకుని మనుగడ సాగిస్తాయి. స్వంత ఆస్తి మీద ఆధార పడిన వర్గ సమాజం దీన్ని దొంగతనంగా భావిస్తుంది. ప్రతి వస్తువును ఎవరో ఒకరి ఆస్తిగా ప్రకటించడం వల్ల వాళ్ళను బలవంతంగా దొంగలుగా మారుస్తుంది. శాసనాలంటే ప్రేమ వున్న బ్రిటిష్‌ వాళ్ళు వీళ్లకు నేరస్థజాతులు(క్రిమినల్‌ ట్రైబ్స్‌) అని పేరు పెట్టారు. ఆదివాసుల వంటి మార్జినలైజ్డ్‌ సెక్షన్లకు.. తమను తాము నాగరికులు అనుకునే ఆధునిక సమాజానికి మధ్య ఎప్పుడూ ఒక అంతరం వుంటుంది. ప్రభుత్వాలు యీ అంతరాన్ని తగ్గించడానికి పని చేయాలి. కానీ మన ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల యీ అంతరం మరింత పెరిగి వాళ్ళు ఇప్పటికీ నిత్య అనుమానితులుగా, నేరస్తులుగా, అభద్రతతో జీవిస్తున్నారు’’ – బాలగోపాల్‌

ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించామని అనుకొనే మనం, మన అవగాహనకు వున్న యీ పరిమితిని గుర్తుపెట్టుకుంటేనే ఆదివాసీ తెగల జీవిత మూలాలకు, ‘ఆధునిక’, ‘చట్టబద్ధ’ వ్యవస్థలకు మధ్య ఎలా వైరుధ్యం తలయెత్తిందో, ఎందుకది నిరంతర ఘర్షణగా మారుతున్నదో ఎరుక పడుతుంది.


చారిత్రక విభాత సంధ్యల మానవ కథా వికాసమెట్టిది? :
మన దేశ జనాభాలో ఆదివాసీ వివరాలు యిలా వున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్‌ తెగలు దేశంలోని మొత్తం జనాభాలో 8.6 శాతం ఉన్నారు. ఇది గ్రామీణ జనాభాలో 11.3 శాతం. ఈ జనాభా లెక్కల ప్రకారం దేశంలో 10.42 కోట్ల మంది భారతీయులు షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌.

ఈ సంఖ్య మన మొత్తం జనాభాలో లెక్కించదగినదా? విస్మరించదగినదా? అనే చర్చకంటే మన సామాజిక చారిత్రక వికాసంలోని అతి ముఖ్యమైన మలుపులను, చిక్కుముడులను గుర్తు పట్టడానికి ఆదివాసీ తెగల జీవన అధ్యయనం ఉపయోగపడుతుందా లేదా అనేదే ముఖ్యం. నిస్సందేహంగా శికారీ నవల అందుకు దోహదం చేస్తుంది. అయితే ఆదివాసీ తెగల్లో ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేక పరిస్థితుల్లో మనుగడ సాగిస్తుండగా యీ పరిశీలన సాధ్యమా? ఏమో ! చూద్దాం.

ఏ ఖండంలో వున్నా ఒకే దశలో వున్న మానవుల నైపుణ్యాలు, నైతిక నియమాలు, జీవిత పద్ధతులు ఒకే విధంగా వుంటాయి. శికారి వంటి తెగల పరిశీలన ఒక రకంగా మనం పరిణామ క్రమంలో గడచి వచ్చిన మన దారులను వెతకడం. అవి నిజానికి ఇప్పటి మన సమాజానికి మూలాలు. కాబట్టి ఓర్పుగా, సహనంతో సామాజిక, చారిత్రక విశ్లేషణ చేయాలి. ఇందుకు అందుబాటులో వున్న కాల్పనిక సాహిత్యాన్ని కూడా ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే రచయితలు నిరంతర సమాజ పరిశీలకులు. సమాజ గతికి వ్యాఖ్యాతలు. యే దృక్పథమూ లేదని చెప్పుకునే రచయితలు కూడా తమకు తెలియకుండానే సమాజాన్ని సవ్యంగానో, అపసవ్యంగానో ప్రతిఫలిస్తూనే ఉంటారు. శికారీల జీవితాన్ని చిత్రించే క్రమంలో ఈ నవలా రచయిత దృక్పథం వల్ల మనం నడిచి వచ్చిన దారులు కనిపిస్తాయి. కాబట్టి నవలలోకి వెళ్లే ముందు ఆదివాసీ తెగలకు సంబంధించిన కొన్ని సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలను చూద్దాం.

ఈ తెగల ప్రాథమిక ఆర్థిక వ్యవస్థలు :
‘‘ఆదివాసీ తెగల జీవన మార్గాలను మూడు రకాలుగా గుర్తించవచ్చు. అవి 1.వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణ 2. సాగు, కలపను మార్చడం, 3.నిశ్చల సాగు, పశుపోషణ. మన దేశంలోని ఆదివాసీ తెగలు అనేక చారిత్రక, స్థానిక ప్రత్యేకతలనుబట్టి ఈ మూడు రకాల జీవన మార్గాల్లో ఏదో ఒకదాని దగ్గర ఆగిపోయాయి. కొన్నితెగలు మార్పులకు లోనయ్యాయి.

‘‘ఇనుప పనిముట్లో, కంచు పనిముట్లో రాగానే మానవుడు రాతి పనిముట్ల వాడకం మానేయలేదు. ఇనుము వచ్చాక కూడా కంచు పనిముట్లు వాడారు’’ -మోర్గాన్‌

ఈ నవలలోని శికారీలు మిగతా ఆదివాసీ తెగలకంటే భిన్నంగా తమదైన ప్రత్యేక జీవన మార్గంలో ఉన్నారు. కాలక్రమంలో వాళ్లు ఈ మార్గంలోకి వచ్చారు. అందులో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులను, వాటికి కారణమైన ఆర్థిక సాంస్కృతిక సంఘర్షణలను శికారీల జీవితాన్ని చలనంలో చిత్రించే ప్రయత్నం చేసింది యీ నవల. శికారీల్లోని అంతర్గత సాంస్కృతిక నైతిక వ్యవస్థను, వాళ్లు జీవిస్తున్న బైటి రాజకీయార్థిక వ్యవస్థనూ, పరస్పర ప్రభావాలనూ ఈ నవల చిత్రించింది. రెండు వైపులా సాగిన చలనాలను సూక్ష్మరూపంలో సాహిత్యీకరించింది.

ఒకప్పుడు గిరిజన తెగ అయిన శికారీలు ఎక్కడో అడవుల్లో లేరు. గత 200 ఏళ్లకు పైగా కర్నూలు నగరం నడిబొడ్డున వున్నారు. వీళ్ళు తమ పరిసరాలలోని యే కులంతోను కలవరు. ఎటువంటి సంబంధాలను నెరపరు. పూర్తిగా ముడుచుకుపోయి (షశ్రీశీంవస) వుండే ఒక తెగ. అటు పూర్తిగా అడవులకు పరిమితమైపోయిన గోండు, కోయ, చెంచుల వంటి జీవితం కాదు. పల్లె పల్లెకూ తిరుగుతూ పొట్ట పోసుకునే యానాది, ఎరుకల వంటి సంచార జాతి కూడా కాదు, నగరంలోగాని, నగరానికి దగ్గరలోని పల్లెలలోగాని స్థిర నివాసం వుండే ప్రజలువీళ్ళు.

ఇలాంటి శికారీలకు తమ గురించి తాము ఘనంగా చెప్పుకొనే గతం ఉన్నది. ప్రతి కులానికి, తెగకు ఇలాంటి కథనాలు కొన్ని ఉంటాయి. అవి తమ అస్తిత్వాన్ని కాపాడుకోడానికి, తమ ప్రత్యేకతలను చాటుకోడానికి ప్రేరేపిస్తుంటాయి. శికారీలు తమను తాము శివాజీ వారసులమని చెప్పుకుంటారు. మార్వాడీలు తమ సవతి తల్లి పిల్లలని, వారు కులంలో తమకంటే తక్కువని అభిజాత్యం కూడా పోతారు. మరాఠా శివాజీ ఎక్కడ? గుజరాతీ, రాజస్థానీ మార్వాడీలు యెక్కడా? కర్నూలు శికారీలు ఎక్కడ?

ఏదో లింక్‌ తప్పినట్టు అనిపిస్తుంది కదూ?
ఇక్కడే మన అన్వేషణ ప్రారంభిద్దాం.

‘శికారి’ నవలా రచయిత పాణి కూడా బహుశా ఇటువంటి అన్వేషణతోటే మొదలయ్యి వుంటాడు. నవలలో ‘నానా’ అనే పాత్ర ఉంది. తమ సమూహపు మూలాలలోకి, వర్తమాన పరిణమాలలోకి చూడగల చూపు నానాకు ఉంది. తమ జాతి గురించి గర్వంగా చెప్పుకుంటాడు.
ఆ పాత్ర నానా సింగ్‌ మాటల్లో ‘‘అసలు మాది ఈ దేశమే గాదు. మా అబ్బ, వాల్లబ్బకంటే ముందు మహారాష్ట్ర అడవుల్నుంచి ఇటుకెల్లి వచ్చినాము. శికారోడంటే యాటే. ఇంకో మాటేల్యా. అది తప్ప యింగోటి మాకు తెలేదు. మాది సన్న కత గాదులే. రాజుల యుద్దాలు గూడ మేం లేకుండ కాలా. ఆడి నుండి దావ పట్టుకొని అట్లా అట్లా ఈడికొచ్చిపడినాము. మేమేమీ పొట్టకు, లొట్టకు లేక ఈడిదనక రాలా. బవాని మాకు దేవత. శివాజీ మారాజుతోపాటు కర్నాటక దేశం మీదికెల్లి వచ్చినాము. వాయనే మమ్మల్ని ఈడ ఉండమని చెప్పినాడో, మేమే ఈడ ఆగిపోయినామో తెల్దు. ఈన్నుంచి వాయిన సక్కక శ్రీశైలం బోయి బవాని తల్లికి దేవర జేసి యుద్దానికి పోయినాడంట. అట్లని మా పెద్దలు చెప్పేటోల్లు’’

నానా అక్కడికి ఆగలేదు. ‘‘యిది నేను కయిగట్టి సెప్పేది కాదు. మా పెద్దోల్లు సెప్పినారంటే యింగ అది నిజమంటే నిజమే…’’ అంటాడు.

శికారీలాంటి తెగలకు తమ గతం గురించి ఎలాంటి సందేహాలు ఉండవు. తమ నమ్మకమే, తమ గురించి తాము చెప్పుకొనే కథనాలే సత్యమని అనుకుంటారు. ఇతరులకంటే తాము పూర్తి భిన్నమైన వాళ్లమనే విశ్వాసం మీద వాళ్ల ఉనికి ఆధారపడి ఉంటుంది. అంత మాత్రాన అది కేవలం విశ్వాసమే కాదు. జీవిత వాస్తవం. ఈ నవల శికారీలకు తమ గురించి తమకు ఉండే విశ్వాసాలను, నమ్మే కట్టుబాట్లను, భౌతిక జీవిత వాస్తవికతను దేనికదిగా చిత్రించలేదు.
విశ్వాసాలకు, వాస్తవాలకు మధ్య ఘర్షణలోంచి ఈ నవల వచ్చింది. అందువల్లనే ఇది నిశ్చల సౌందర్య దృశ్యంలా కాక చలనశీల చిత్రం అయ్యింది. వాళ్ల జీవితంలోని దుఃఖం, ఆగ్రహం, ఆనందం, విషాదం, ప్రేమ మొదలైన అన్నిటినీ వెలికి తీసుకొచ్చింది. అవి పూర్తిగా వాళ్లకే చెందినవి. అందుకే ఈ నవలలో నానా ‘‘మీ జాతికి మా జాతికి సమ్మందమే లేదు. మాకు ఎనక దిక్కు శానా కత ఉండాది. మేం యిప్పటోల్లం కాదు…’’ అంటాడు. శికారీల నిజ జీవితంలోని ఈ నమ్మకాల వెనుక ఏమైనా చారిత్రక ఆధారాలు దొరుకుతాయా?

ఈ నవలలో వచ్చిన కొన్ని ప్రస్తావనలను మనం వివరించుకోవచ్చు. శికారీలకు మహారాష్ట్రలోని పార్థ, మహాపార్థ తెగలతో, కర్ణాటక (బళ్ళారి) లోని శికారీతో ఇప్పటికీ వివాహ సంబంధాలు వున్నట్టు రఘు యాదవ్‌ అనే చరిత్ర పరిశోధకుడు రాశాడు. కర్నూలు శికారీలు చాలా కాలం పాటు బళ్ళారి పున్నమ ఉత్సవానికి కర్నాటక పోయే వాళ్ళని, అక్కడి పోలీసుల వేధింపులు తట్టుకోలేక అక్కడికి పోవడం క్రమేణా మానుకున్నారని యీ నవలలోని పాత్రలు కూడా చెబుతాయి.

‘‘మొదట్లో మొక్కులు తీర్చుకోనీక యాడాదికోపారి బల్లారి పోయేటోల్లు. ఆడ కాళియార్‌ గుడి ఉంది. ఆడికి పోతా వస్తా ఉంటే బల్లారి పోలీసులు కేసులు బెట్టి దుడ్లు గుంజవట్టిరి. దుడ్లుగిన ల్యాకపోతే జైల్లో పెట్టేటోల్లు. సారాయి దెచ్చి అమ్ముతున్నారనో, ఆన్నుంచి కొండబోతున్నారనో కేసులు బెట్టేటోల్లు. మీ దేశంలో దొంగతనాలు జేసి, గొంతులు కోసి తప్పించుకోనీక ఈడికొస్తారా అని బెదిరిచ్చేటోల్లు. ఆయన్నీ అనుబగించే వల్లగాక నలబయ్యేళ్ల కిందటనో యింకా ఎనకనో తుంగబద్ర గడ్డన బవానీ దేవతను నిలబెట్టుకుండాము’’ అని ఒక పాత్ర అంటుంది.

శికారీల సాంస్కృతిక ప్రత్యేకతల్లో, చారిత్రక మూలాల్లో మిగతా అనేక ప్రాంతాలతో వాళ్లకు సంబంధాలు ఉన్నాయి. కర్నూలు పట్టణం మధ్య స్థిర నివాసం ఏర్పాటు చేసుకోడానికి వెనుక వేర్వేరు ప్రాంతాల నుంచి చేసిన వలస ప్రయాణం వాళ్లకు ఉన్నది. అట్లాగే తమ తెగలోనే ఇతర గుంపులతో, మిగతా తెగలతో, ఉప తెగలతో సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ మిగతా వాటి పరిణామం ఒకలా సాగితే కర్నూలులోని శికారీల సామాజిక ఆర్థిక పరిణామం ఇంకోలా జరిగింది.

జనాభా పెరుగుదల ఆహార అవసరాలు, ప్రకృతి అననుకూలతలు వంటి కారణాలవల్లనో లేదా ఏదైనా ప్రత్యేక కారణం వల్లనో ఒక గణంలోని కొంత మంది సమూహంగా విడివడి దూరంగా పోతారు. తొలినాళ్ళలో తమ సొంత పూర్వీకులవలే వున్నా ఆ గణం వెళ్లిన ప్రదేశాన్ని బట్టి ఆ సమూహం కొత్త ప్రాంతీయతను సంతరించుకుంటుంది. ఆచారాల్లో స్వల్ప మార్పులు రావచ్చు. మారిన పరిసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వారి భాషలో, వ్యవహారాల్లో మార్పు వస్తుంది. కొత్త మాండలీకంగా ఆ భాష రూపు దిద్దుకుంటుంది. కొన్ని వందల ఏళ్ల తరువాత పార్థ, మహాపార్థ`శికారీ గణాలు పూర్తి భిన్నమైనవిగా మనకు అగుపిస్తాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే రెండిరటిలో ఒకే మూల బాషా పదాలు, ఆచారాలలోని పోలికలు, ఒకే రకమైన అమ్మ దేవతలు, సరిపోల్చగల ఆరాధన పద్ధతులు ఆ సమూహాల మధ్య గతబంధాన్ని తెలియపరుస్తాయి.

కర్నూలులోని నీర్‌ శికారీలకు మైసూరు, మండ్య, బెంగళూరు నగర శివార్లలోని హక్కి-పిక్కి తెగలతో చాలా పోలికలు వున్నాయి. రెండూ అర్ధ-సంచార జాతులే. ఇద్దరికీ వేట ప్రధానమే, ఇద్దరి భాష ఇండో ఆర్యన్‌ వర్గానికి చెందిన వాఘ్రి (గుజరాతీ మూలాలు కలిగినది) అని భాషా శాస్త్ర వేత్తలు అంటారు. అయితే హక్కి పిక్కీ తెగ ప్రజలు స్వాతంత్య్రానంతర కాలంలో తమ జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు. వన మూలికలు, మూలికా నూనెలు, మందు దినుసులు అమ్మడం, ప్లాస్టిక్‌ దండల అల్లికలు, అలంకరణ సామగ్రి వంటి వస్తు అమ్మకాలలోకి మారిపోయారు.

ఇటువంటి మార్పు కర్నూలు పట్టణంలో, పరిసరాల్లో నివసిస్తున్న నీర్‌ శికారీలలో రాకపోవడానికి కారణమేమిటో సమాజశాస్త్ర పరిశోధకులు శోధించాలి.

కర్నూలు పట్టణం, దాని చుట్టూపక్కల పసుపుల, మునగాలపాడు, గూడూరు, ఓర్వకల్లు గ్రామాల్లో శికారీలు వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలనా నివేదికలో కూడా వీరిని నేరస్థజాతులతో కలిపే ప్రస్తావించారు.

వీళ్ళు మరాఠాలుగా చెప్పుకుంటున్నా రాజపుత్రులుగానే భావించాల్సి వుంటుంది. రాజపుత్ర కుదురును సూచించే సింగ్‌ శికారీల పేర్ల చివర వుంటున్నది. (ఉదాహరణకు నానాసింగ్‌ sIo సోనూ సింగ్‌ కర్నూలు శికారీల పెద్ద). మహారాష్ట్రలోని పార్థీలకు మరాఠా, గుజరాతీలతో సామ్యమున్న పవార్‌, చవాన్‌, రాథోడ్‌ వంటి పేర్లు కూడా వున్నాయట. రాజస్థాన్‌ నుంచి తొలి వలస మహారాష్ట్రకు అక్కడి నుంచి గుజరాత్‌కు జరిగింది (స్వాతంత్య్ర పూర్వం ఇవన్నీ ఒకే ప్రావిన్స్‌లో వుండేవి). రెండో వలసలో దక్షిణ భారతదేశంలో విభిన్న ప్రాంతాలకు వెళ్లారని అనుకోవచ్చు. కర్ణాటకలోని హక్కీ పీక్కీ తెగ గురించి రాసిన, మహారాష్ట్ర పార్థీ గురించి రాసిన అందరు పరిశోధకులు వాళ్లలో కొందరు తెలుగు కూడా మాట్లాడతారని రాశారు. మరి మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత శికారీలకు తెలుగు ఎలా వచ్చింది? అంతేకాదు, శికారీలు తమలో తాము మాట్లాడుకునే భాష రాజస్థానీ మాండలికానికి దగ్గరగా వుంటుంది. గుజరాత్‌కు వలసపోయినప్పుడు ఆ సమాజంతో కలిసి వుండటం వల్ల మార్వాడీ పదాలు, సంస్కృతి ఎంతగా వచ్చిచేరాయంటే మార్వాడీల కులదేవత కొడియార్‌ (బహుశా కాళియార్‌ కావచ్చు) మాత శికారీలకూ కులదేవత అయ్యింది.

ప్రస్తుతం యీ జాతులు మాట్లాడుతున్న భాష రాజస్థానీ, గుజరాతీ మాండలికాలు కలగలిసిన వాగ్ధి( వాఘ్రి కావచ్చు) అని కొందరి వాదన. ఇది నిజమైతే భిల్‌ భాషల సముదాయానికి చెందినదిగా గుర్తించాల్సి ఉంటుంది. యీ భాషకు లిపి లేకపోవడంతో యే ప్రాంతంలో నివసిస్తే ఆ ప్రాంతీయ భాషా పదాలు కూడా కొత్తగా వచ్చి చేరాయి. ఉదా. శికారీల భాషలోని తెలుగు పదాలు.

బహుశా మూల కుదురు నుంచి విడిబడే నాటికి యీ తెగలకు లిపి లేదు. కేవలం భాష మాత్రమే వుంది. ఒక ముక్కగా ప్రధాన స్రవంతి నుంచి విడిపోయాక అక్కడి పాత సమూహానికి లిపి ఏర్పడి ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ కొన్ని తరాలు గడిచేసరికి మూల కుదురు నుండి మళ్లీ కలవలేనంత దూరం వచ్చేశారు వీరు. కొత్త ప్రాంతీయతలనూ సంతరించుకున్నారు.
పైన ప్రస్తావించిన యీ అర్ధ సంచార జాతులన్నీ నైపుణ్యం గల వేటగాళ్లు. అంబు, బాణాలు, యీటెలు, కత్తులు వంటి సాంప్రదాయిక ఆయుధాలు వాడడంలోను, పక్షులు జంతువులు పట్టడానికి వుచ్చులు పన్నడంలోను నిష్ణాతులు. ఇదే వొకానొక కాలంలో వాళ్ళను గెరిల్లా యుద్ధ నిపుణులను చేసింది. బ్రిటిష్‌ ప్రభుత్వానికి తలనొప్పినీ తెచ్చింది. 1857 తిరుగుబాటులో ఇటువంటి జాతులు కొన్ని పాల్గొన్నాయని, చాలా గిరిజన తెగలు పితూరీలలో భాగం అయ్యారని ఇంగ్లీషు వారి ఆరోపణ కూడా. గిరిజన తెగలను నియంత్రణలో ఉంచడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం (1871లో) నేరస్థజాతుల చట్టం అప్పుడు తెచ్చిందే. సుమారు 150 తెగలను పుట్టుకతోనే నేరస్తులని బ్రిటిష్‌ ప్రభుత్వం ముద్రవేసింది. వారి కదలికలపై నిఘా వుంచేందుకు, ఎప్పుడైనా అరెస్టు చేసేందుకు ఆనాడు పోలీసులకు విశేష అధికారాలనూ కట్టబెట్టింది.

శికారిల జీవితంలో వేట, సారా, దొంగతనాలు అనే మూడూ ప్రధానంగా ఉండేవి. ఇతరులకు శికారీలంటే ఇవే గుర్తుకు వచ్చేవి. వాళ్లు చాలా దురుసుగా ఉంటారని, దేనికైనా తెగిస్తారని ఇప్పటికీ బైటివాళ్లు అనుకుంటారు. శికారీలు ఎందుకట్లా మారవలసి వచ్చిందో పరిశీలించింది ఈ నవల.

‘‘శికారోల్లకు సొంతం కోసం సారాయి గాచుకోడం తెలుసు, అమ్మడం మొదటి నుండి అలవాటు లేదు. యాటకు పోవడం, అడక్కొచ్చుకోడం అంతే. జింకల్ను, కుందేల్లను యాటాడుకుంటా తాండ్రపాడు, పంచలింగాల దాకా పోయేటోల్లు. అడవులు పల్చబడి యాట దొరక్కపోయేది. అడక్కొచ్చుకుందామంటే ఊర్లోవాల్లు గదుముకుంటాండిరి. తిండి కోసం ఊరిడిసి ఎట్లబోయేటోల్లు అట్ల పోబట్టిరి. యాడికిబోయినా ఆకలి ఆకలే.

అప్పుడే కొంతమంది చిన్నా సితక దొంగతనాలకు దిగిరి. కెనాలు దాటితే అవతలికెల్లి అన్నీ పొలాలే. జొన్నకంకులు, వరికంకులు యిరుసుకొని వచ్చేటోల్లు. గొర్రెల్ను, మేకలను ఎత్తకొచ్చేటోల్లు. అవి యాన్నో అమ్ముకొని అయిదో పదో తెచ్చుకొనేటోల్లు. దొంగసొమ్ముగావట్టి అంతో యింతో చేతిలో పడేది. చేలల్లోంచి పంటగాని, గింజలుగాని బండ్లమీద ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిగాచి, మీదబడికొట్టి చేతికొచ్చిన కాడికి ఎత్తకపోయేటోల్లు. కడాకు కూలిపన్లకు పోయేటోల్లను బెదిరిచ్చి సద్దిమూటలు గొండబోయేటోల్లు. కడుపాకలికి బుక్కపడతా ఉండిరి’’ అని శికారీల జీవిత పరిణామాన్ని చెబుతుంది.

కర్ణాటకలోని హక్కి పిక్కి లాగానే మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని గవ్‌ పార్థి తెగ పూర్తిగా వ్యవసాయదారులుగా మారి నేరస్థ జాతి ముద్రనుంచి బైట పడగలిగింది. కానీ కర్నూలు శికారీలు మాత్రం 1970 వరకు కొత్త వృత్తులలోకి ప్రవేశించలేకపోయారు. వేటనే నమ్ముకొని బతికారు. ‘వేట దొరికితే శికారి లేకుంటే బికారి (బిచ్చగాడు)’ అనే నానుడిని చెప్పుకుంటారు శికారీలు.

ఆధునిక రాజ్యంతో తప్పని సంఘర్షణ :
కర్నూలు కడప కాలువగా చెప్పుకునే కె.సి కెనాల్‌ నిర్మాణం 1866లో జరిగింది. డచ్‌ దేశానికి చెందిన మద్రాసు ఇరిగేషన్‌ అండ్‌ కెనాల్‌ కం, లిమిటెడ్‌ అనే సంస్థ ఈ కాలువ నిర్మాణం చేపట్టింది. 1882లో బ్రిటీష్‌ ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలో తుంగభద్ర నదిపై 8.23 మీటర్ల ఆనకట్ట నిర్మించారు. 304 కిలోమీటర్ల పొడవునా 84.9 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 52.746 హెక్టారుల సాగుభూమికి నీరందించే విధంగా కృష్ణా పరివాహక ప్రదేశం నుండి పెన్నా పరివాహక ప్రదేశం వరకు దీని నిర్మాణం సాగింది. యీ కె.సి కెనాల్‌ నిర్మాణంలో తమ పూర్వీకులు పనిచేసినట్టు శికారీలు చెబుతున్నారు. అదే నిజమైతే కాలువ నిర్మాణ పనులు పూర్తి అయ్యాక వీళ్ళు ఉపాధి కోల్పోయి మళ్లీ జీవిక కోసం వేటనే నమ్ముకొని వుండాలి.

దేశ స్వాతంత్య్రం వచ్చిన ముందు వెనుకల అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్‌గా వున్న రావు సాహెబ్‌ బంగార కర్నూలు నగరంలో( రైల్వే స్టేషన్‌ ముందువైపు వున్న) కె సి కెనాల్‌ వెంట వీళ్లకు ఉచితంగా ఇళ్ళ స్థలాలను కేటాయించాడు. ధర్మపేట నుంచి ఆనంద్‌ టాకీసు వరకు వున్న శికారీల కాలనీని ఆయన పేరు మీదనే బంగారు పేటగా పిలుస్తారు.

నీలి శికారీలు 1970 వరకు కర్నూలు పక్కన వున్న రిజర్వు ఫారెస్ట్‌, బయలు ప్రదేశాల్లో వేట చేసేవారు. అదే వాళ్లకు ప్రధాన ఆహార వనరు. అప్పుడు జనావాసాలు ఇప్పుడున్నంత తీవ్రంగా కిక్కిరిసి వుండేవి కాదు కాబట్టి కర్నూలు చుట్టు ముట్టు తుప్పలతో కొంత అడవి వుండేది. అందులో కుందేళ్ళు, అడవి పిల్లులు, అడవి పందులు వంటి జంతువులూ దొరికేవి. నగరాలు పెరిగి రిజర్వు ఫారెస్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ దాహానికి బలయిపోగా వేట అనే ప్రధాన ఆహార వనరును వాళ్ళు కోల్పోయారు. వ్యవసాయం తెలిసిన తెగ కాకపోవడంతో వ్యవసాయ కూలీలుగానూ మారలేకపోయారు. పైగా పరిమిత ప్రదేశంలో, పరిమిత జీవన ఆధారాలతో వుండటం వల్ల కూడా వాళ్ళ అభివృద్ధి నెమ్మదించింది.

‘‘మానవ పరిణామంలో విల్లు అంబులు ముఖ్యమైన కల్పన. దీనితో ఆటవిక యుగం ఎగువదశ ప్రారంభమైంది. వేట ద్వారా మాత్రమే అహార సంపాదన చేసే తెగలు పశువుల మచ్చిక ద్వారా పాలు మాంసం, తద్వారా వ్యవసాయమూ నేర్చిన తెగలకంటే నైపుణ్యంలోనూ, ఎదుగుదలలోనూ యెంతో వెనుకబడ్డాయి’’ -మోర్గాన్‌

జీవనోపాధి మూలాలు విస్తరిస్తేనే మానవాభివృద్ధి దశలు పురోగమిస్తాయి. అలా విస్తరించుకోగలిగిన తెగలు మిగతా వాటి కంటే ముందుకు రాగలిగాయి. ముందు దశలకు పోగలిగాయి. ఉపాధి మూలాలను విస్తరించుకోలేక పోయిన శికారీ వంటి తెగలు కొంతకాలం నిలబడి పోయాయి. ఆ తరువాత చిన్నాబన్నా ప్రయత్నాలు చేసినా వ్యవసాయం వంటి స్థిర ఉపాధి వైపు మళ్ళ లేకపోయాయి.

తమ స్వంత వృత్తికి దూరం చేయబడిన యే సమూహమైనా కొత్తవృత్తిని ఎంచుకోవడంలో రెండు మెలకువలు పాటిస్తుంది. 1. పోటీలేని వొక ఆధునిక వృత్తిని వెతికిపట్టు కోవడం (ఉదాహరణకు ముస్లింలు సైకిల్‌ రిపేర్‌ షాపులు, మోటార్‌ సైకిల్‌ రిపేర్‌, సైకిల్‌, స్కూటర్‌ పంచర్‌ షాపులు వున్నట్టు) 2.ఆ కొత్త వృత్తులకు సాంప్రదాయిక కులాలతో స్పర్థ లేకుండా వుండాలి.( అట్లా హైదరాబాద్‌లో సంచార జాతి బంజారాలు ఆటో ఓనర్లు, డ్రైవర్లు అయ్యారు). శికారీలు యీ రెండు జాగ్రత్తలనూ పాటించారు.

మార్పు అనివార్యమైనది సరే- అది యెలా జరిగింది?:
వేట ఆహార వనరుగా వున్న యే సమాజానికైనా తీరిక, విశ్రాంతి చాలా వుంటుంది. అంటే వేట వున్నప్పుడే పని. మిగతా సమయం ఖాళీనే. వృత్తి మార్పులో కూడా అటువంటి వెసులుబాటే వున్న, సాంప్రదాయ కులపోటీ లేని సినిమా బ్లాక్‌ టికెట్ల అమ్మకాన్ని వాళ్ళు జీవికగా ఎంచుకున్నారు. (సుమారుగా 1970 నుంచి – యీ సమయంలోనే కర్నూలు పట్టణంలో సినిమా థియేటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరగటం కలిసివచ్చింది.) అయితే తమ జనాభా కూడా పెరుగుతుండటం వల్ల థియేటర్ల వద్ద బ్లాక్‌ టికెట్‌ అమ్మకం మాత్రం ఎంతమందిని ఇముడ్చుకోగలుగుతుంది? పైగా అది రోజూ లభ్యమయ్యే స్థిర ఆదాయ వనరు కూడా కాదు. కాబట్టి అనివార్యంగా కొంత కాలంలోనే వారు మరొక కొత్త జీవికను వెతుక్కోవాల్సి వచ్చింది.

అంతక ముందు సారా కాచడం, తాగడం అనేవి శికారీల సాంస్కృతిక జీవితంలో విడదీయలేదని భాగం. ఎంతగానంటే ఈ నవల ఆరంభం సారా తాగి డొక్కోడు, అతని భార్య గుమ్లి నడి రోడ్డు మీద కొట్లాటతో మొదలౌతుంది. కొడియార దేవత దగ్గర బళ్లారి పున్నమి రోజు అప్పటి దాకా ఉన్న తగాదాలన్నీ మర్చిపోయి, ఆంక్షలను అధిగమించి, తాగి అందరూ సామూహిక నృత్యం చేయడంతో నవల ముగుస్తుంది.

ప్రతి గిరిజన సంస్కృతిలో విధిగా వుండే స్వంత సారా తయారీ శికారీలలోనూ వుంది. ఆ తరువాత తరువాత అదే వాళ్ళ ఆదాయ వనరుగా మారింది. విచిత్రం ఏమంటే మన ‘సంక్షేమ రాజ్యం’లో ప్రభుత్వాలకు కూడా ప్రధాన ఆదాయ వనరు సారా అమ్మకమే. కాబట్టి సారా తయారీ, అమ్మకం ప్రక్రియలను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. పర్మిట్‌ వున్నవాళ్ళు మాత్రమే చెయ్యాలనే విధాన నిర్ణయం చేసింది. దాని నియంత్రణకు ఒక సారా పాలసీని తయారు చేసింది. దాని అమలుకు ఒక డిపార్టుమెంటును (ఎక్సైజ్‌) తెచ్చింది. అత్యల్ప సంఖ్యాకులైన శికారీలు ఆ విధంగా ‘ఆధునిక’ రాజ్యం అనే అతిపెద్ద శత్రువుతో తలపడాల్సివచ్చింది.

కర్నూలులో ఫ్యాక్షనిజాన్ని, అధికార రాజకీయాలను నడిపిన కేశవులు గౌడ్‌ సారాయి వ్యాపారానికి, శికారీల నాటుసారాయికి మధ్య ఘర్షణ తలెత్తింది. కేవువులు గౌడ్‌ మనుషులు శికారీ పేట మీద దాడి చేసేవారు. సారాయి కాచడానికి వీల్లేదని బెదిరించేవారు. శికారీలకు ఇదంతా తెలియకపోవచ్చు గానీ వాళ్ల పరిమితమైన ‘లోకజ్ఞానాని’కి అందినంత మేరకు అర్థం చేసుకున్నారు.

గుమ్లి నోట్లోని నస్సెం ఎంగిలి ఊంచి ‘‘వాల్ల లెక్క మనమేం లచ్చలు లచ్చలు దెంగే యాపారం చెయ్యడంలా. తాగేకి, పిల్లగాల్లకింత కడుపుకి పెట్టుకోనీకి గాచుకుంటా ఉన్నం. ఈ నడమ ఎంగిలాకులు నాక్కుండ నాలుగుపైసలు కళ్లజూస్తున్నం గదా. కడుపులో మంట. గబ్బు నాకొడుకులకు’’ అన్నది.

ప్రభుత్వ సారా అమ్మకాల చుట్టూ అక్రమ ఆదాయాలు, ఫ్యాక్షన్‌ రాజకీయాలు ఇనుపగూళ్ళు కట్టాక నీల్‌ శికారీలు స్వంతంగా సారా కాయటం తీవ్ర నేరమైంది. శికారీలు నిత్య నేరస్థులు అయ్యారు. ఎవరో ఒకరు జైలు పాలు అవటం నిత్య కృత్యం అయ్యింది. ఎన్టీఆర్‌ మీద అభిమానంతో మీకు ఓట్లేసి గెలిపిస్తే మా మీదనే దౌర్జన్యం చేస్తారా అని తెగించి ఓ శికారీ యువకుడు అడుగుతాడు.

ఆ ఘర్షణ ఎట్లా ఉందో చూడండి.

‘‘ఓట్లు ఊకేసినారా, బంటికింత లెక్క దెంగ లేదా? ఎయ్యకపోయింటే ఆ పొద్దే పేటలో ఒక్కడు మిగిలిండేటోడు గాదు. యిదే ఆకరు. మల్లా సారాయి అమ్మినారంటే సూడి…’’ అని ఎడం చేతి చూపుడేలు ఊపి బెదిరిచ్చినాడు ఎంఎల్‌ ఏ కేశవులు గౌడు తమ్ముడు.

‘‘నియ్యక్క! శికారోని నాటు సారాయి ముక్కోని లచ్చల యాపారాన్ని దెబ్బగొడ్తదంటనా?’’ డొక్కోడు యాన్నో కొంచెం తాగిండె… తుపక్కున ఊంచి గబ్బు తిట్లకు లేచినాడు.

‘‘సారాయి, బాంది షాపుల మీదే ఆనిగాన్ల రాజ్జెం నడుస్తా ఉంది. పది రూపాయలు పక్కకుపోయినా తట్టుకోలేరు. కడుపులో అగ్గిబడినట్ల్లయితది’’ నానా అన్నాడు.

‘‘అయితే ఏందంట! వాల్ల ఊపిరి సారాయిలో ఉందంటున్నవే. బానే ఉండది. మరి మన పానమో! సారాయి ల్యాకండ ఎట్లా బతుకుతం! మనం అమ్మితేగదా వానికి నొప్పయ్యేది. అమ్మొద్దు. తాగనీకైనా గావాల కదా. దానికైనా బట్టీ పెట్టాలా వొద్దా. నువు జెప్పరాదా! ఈ నా కొడుకులు బూమ్మీద పడక ముందర్నించి మనం వొండుతా లేమా? తాగుతా లేమా?’’ లొంగ కళ్లలోకి ఉగ్రంగా చూచినాడు.

ఈ సందర్భంలో సారా రాజకీయార్థిక శక్తులతో ఘర్షణకు నానాసింగ్‌ కొడుకు శామూ అనే కొద్దిగా చదువుకున్న పిల్లవాడు దిగాడు. అతడ్ని ఫ్యాక్షనిస్టులు హత్య చేశారు. అప్పటికి శికారీలలో చదువుకున్న మొదటి వ్యక్తి శామూ.

ఆధునిక ఉత్పత్తి విధానం మీద ఆధారపడాల్సిన రాజ్యం చట్టబద్ధంగానే సారాయి వ్యాపారం చేసి ప్రజల బలహీనతను రెచ్చగొట్టి ఖజనా నింపుకొని పాలన చేస్తున్నది. అలాంటి రాజ్యం తన ఆర్థిక పునాదిని కాపాడుకోడానికి సారాయిని ఒక ఆహార అలవాటుగా, పరంపరాగతమైన సంస్కృతిగా ఉన్న శికారీలపై దండయాత్ర చేసింది. ఈ నవలలో అనేక సాంఘిక ప్రత్యేకతలు ఉన్నప్పటికీ అందులో రెండు రకాల ఘర్షణలు కనిపిస్తాయి. బైటి రాజకీయార్థిక శక్తులతో ఘర్షణ. రెండు` స్వీయ సాంఘిక సాంస్కృతిక ఆంతరంగిక వ్యవస్థతో ఘర్షణ. ఈ రెంటికీ వాళ్లు భయపడుతూ ఉంటారు. ఉదాహరణకు పోలీసులు, కేసులు, కేశవులు గౌడ్‌ మనుషులు అంటే ఎంత ఘర్షణ పడతారో అంత తెగించి మొండిగా నిలబడతారు. అట్లాగే కట్టుబాట్లకు లోబడి భయం భయంగా జీవిస్తూ ఉంటారు. నానా తన యవ్వనంలో సారా కేసులో డబ్బులు ఇచ్చుకోలేక, పోలీసులకు భయపడి గేరి వదిలి దొంగ రైలు ఎక్కడికో వెళ్లిపోతాడు. అక్కడ ఒక ఆడామెతో లైంగికంగా కలుస్తాడు. జాతి కట్టడి తప్పి వేరే స్త్రీతో కలిస్తే భవానీ మాత నల్చిపారేస్తుందని భయంతో ఊరికి తిరిగి వచ్చి నాయక్‌ చేతిలో కొరడా దెబ్బలు తింటాడు. ఈ సంఘటన శికారీల ఆంతరంగిక కట్టుబాట్లు ఎంత బలీయమైనవో తెలియజేస్తుంది. అదే శికారీలు ఓ ఇరవై ముపై ఏళ్లు గడిచాక అనర మాదిగ బజారీతో సంబంధం పెట్టుకుంటే తిడతారేగాని బంగారు పేటలోనే గుడిసె వేసుకొని ఉండమని ఉదారంగా అంటారు. కాకపోతే వాళ్లతో ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదని తమ మీద తామే కట్టడి పెట్టుకుంటారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో డొక్కోడు దాన్నీ ఉల్లంఘిస్తాడు. వాడికి శిక్ష తప్పదని అందరూ అనుకుంటారు. కానీ నాయక్‌ లొంగ చూచీ చూడనట్లు ఒదిలేస్తాడు. కట్టుబాట్ల మీద ఉదాసీనత వచ్చి ఇలా ప్రవర్తించడం లేదు. ఒక తెగగా శికారీలు ఇలా తమ స్వీయ సాంస్కృతిక, నైతిక వ్యవస్థతో నవల పొడవునా ఘర్షణ పడ్డట్లు కనిపిస్తుంది. ఒక దశను దాటి మరో దశలోకి ఈ తెగ ప్రయాణించడం ఇట్లా లోపలా, బైటా సంఘర్షణతోనే జరిగిందని చెప్పవచ్చు.

ఈ మార్పులను వాళ్ల సహజ భావోద్వేగాలతో, ఆరాటాలతో, మొరటుదనాలతో, వాటి అడుగున ఉన్న అద్భుతమైన మానవీయ స్పందనలతో ఈ నవల చిత్రిస్తుంది. సారా కాచడం, అమ్ముకోవడం, తాగి కొట్టాడుకోవడం అనే తెగ అస్తిత్వాన్ని ఎంత చిత్రించిందో, సారా కాంట్రాక్టర్‌, రాజకీయ నాయకుడు కూడా అయిన రాజ్య ప్రతినిధితో పడిన ఘర్షణను అంతే చిత్రించింది.

భారతదేశంలో (ఎక్సైజ్‌ వంటి) కొన్ని రంగాల్లో చట్టాల అమలును ప్రభుత్వ యంత్రాంగం చేయదు. లైసెన్సుడ్‌ తయారీదారే స్వంత సైన్యంతో వచ్చి శికారీల ఇళ్లపై బడి సారా బట్టీలను ధ్వంసం చేస్తాడు. ఎక్సైజ్‌ పోలీసులు వూరికే చూస్తూ ఉంటారు. ఆనిక కేసు రాస్తారు. అంటే శికారీలకు ఫ్యాక్షన్‌ నాయకులు నేరుగా శత్రువులయ్యారు. అదే సమయంలో వాళ్లే రాజకీయ నాయకులు కావడంతో కేసు మరీ క్లిష్టం అయినప్పుడు మద్దతు కోసమో, మాఫీ కోసమో వారి పంచనే చేరాల్సివచ్చేది. ఏకకాలంలో వారితో ఐక్యతా వుండేది, ఘర్షణా వుండేది. ఇలా ఫ్యాక్షనిస్టులతో, నేరస్థులతో శికారీల సంబంధాలు పెరిగాయి. సరిగ్గా యీ సమయంలోనే ఫాక్షనిస్ట్‌లకు తమ వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం కిరాయి పనులు పనిచేయగల సాహసుల అవసరం పెరిగింది. నేరస్తులుగా ముద్రపడ్డ కొద్ది మంది శికారీ యువకులు ఫ్యాక్షనిస్టుల ప్రైవేట్‌ సైన్యంలోనూ భాగమయ్యారు.

2000 సంవత్సరం తరువాత అంటే చంద్రబాబు తన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ స్థిరంగా నిలదొక్కుకున్నాక ఫ్యాక్షనిస్టుల ఆదాయ వనరు మారింది (ఆ తరువాత 2004లో ముఖ్యమంత్రి అయిన వైయస్‌ కూడా ఇదే విధానాన్ని కొనసాగించాడు). వ్యవసాయ భూములు, సారా కంట్రాక్టుల కంటే రియల్‌ ఎస్టేట్‌, ప్రభుత్వ రోడ్లు, ఆనకట్టలు, భవనాలు వంటి నిర్మాణ కాంట్రాక్టులు ప్రధానం అయ్యాయి. బినామీల ద్వారా నేరుగా తామే చేపట్టడమో, లేదా బయటి వాడు ఎవరైనా పోటీకి వచ్చి కాంట్రాక్ట్‌ తన్నుకుపోతే వాళ్లనించి సుంకం వసూలు చేయడమో సులభం అయ్యింది. తామే నేరుగా శాసన వ్యవస్థలో భాగం కావటం వల్ల మునుపటిలా కిరాయి సైన్యాన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేకపోయింది. పైగా 1990ల్లో సీమలో జరిగిన సాయుధ ముఠాల వ్యతిరేక ఉద్యమం తమను రాక్షసులుగా ప్రపంచానికి ప్రొజెక్ట్‌ చేసింది. కాబట్టి మునుపటి కరకు భూస్వామ్య ముఖాన్ని వదలి చిరునవ్వుతో అదే పనులు చేయగల ఆధునిక కార్పొరేట్‌ ముసుగు తొడగడం ప్రభుత్వానికి కూడా అవసరమైంది. దాంతో వాళ్ళ నీడన వున్న ఆ కొద్దిమంది శికారీలకు ఫ్యాక్షనిస్టుల వద్ద ఉపాధి పోయింది. మళ్లీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు.

‘‘దొంగతనం చేసినోడ్ని, చెయ్యనోడ్ని గూడ కేసుల్లో యిరికిచ్చి తిప్పలాడుతా ఉండిరి. ఈ ఎవారాలతో బేజారొచ్చి దొంగతనాలు మానేసిరి. అయినా కేసులు పోలే. దొంగతనాలు చేపించిన మారాజే ఎదురు తిరిగి కేసులు పెట్టిస్తా ఉండె..’’. దీంతో మళ్లీ ఉపాధి మార్పు తప్పనిసరి అయ్యింది. 2000ల సంవత్సరానికల్లా శికారీ యువతరం శూద్ర, అతి శూద్ర కులాల పెళ్లి బారాత్‌లకు (మెరవణి) ఉపయోగించే భారీ డోలు, ఆధునిక తప్పెట్లు, క్లారినెట్‌ వంటి సంగీత సాధనాలతో బ్యాండ్‌ బాజా బృందాలుగా ఏర్పడి సరి కొత్త జీవితాన్ని ఎంచుకుంది.
ఇట్లా నడుస్తున్న శికారీల జీవితంలోకి అనుకోని ఉపద్రవం వచ్చి పడిరది. మునగాల పాడులో తుంగభద్ర ఒడ్డున భవాని మాత గుడి ఉన్న భూమి చేతులు మారి దేవసహాయం అనే దళిత ఎంఎల్‌ఏ చేతికి వచ్చింది. గుడి వెనుక అతనికి నాలుగు ఎకరాల పోరంబోకు ఉంది. గుడిని తీసేస్తే కిందికి మీదికి ఏకం అవుతుంది. ఆ విషయం తెలిసి..

‘‘ఆ నాకొడుక్కి కొల్లబోయినంత ఉంది. కనిపించినవన్నీ కొంటానే ఉండాడు. ఇంగేం కావాల్నంట? మజ్జలో గుడి ఏం అడ్డమొచ్చిందంట. మన మీద జిద్దుకు కాకపోతే. ఇదంతా బేకనై చేస్తుండాడు’’ సవాస్సింగు అన్నాడు.

‘‘తోటలోకి అడుగుపెట్టమను. ఆయమ్మ చూస్తా ఊకుంటదా? నాగు పామై పడిగలు పైకెత్తి కండ్లు పొడిచి పార్దెంగుతాది…?’’ ఈరా కుడిచేతి రెండేల్లు కస్సున గాల్లోకి విసిరి ఊగిపోతా అనింది.
శికారీ పెద్దలు వెళ్లి దేవసాయంతో మాట్లాడారు. ఆయన ‘‘మీ గుడి స్థలం నాకెందుకు’’ అన్నాడు. ఆ ఏడాది బళ్లారి పున్నమిని అక్కడే శికారీలు మహోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాదికి జరుపుకోనీలే అని మనసులో దేవసాయం అనుకుంటాడు. భూమి అతి పెద్ద వ్యాపార సరుకుగా మారుతున్న కాలంలో శికారీల విశ్వాసాల ప్రతీక అయిన భవానీ గుడిని తొలగించడానికి దేవసాయం సిద్ధపడతాడు.

సంస్కృతే కైవారం… అదే సంకెల :
ఆర్థిక జీవితం ఏదైెనా కావచ్చు.. సామాజిక సంబంధాలలో మాత్రం సమగ్ర ఐక్యత వుంటుంది. వేట ప్రధాన వనరు కావడం వల్ల, సొంత ఆస్తి పెద్దగా లేకపోవడం వల్ల పూజ అయినా, పెళ్లి అయినా, చావు అయినా సమష్టిగానే చేసుకుంటారు.

కానీ తమ సంస్కృతి అయిన సారాయిని వ్యాపారంగా మార్చుకున్నాక శికారీల ప్రవర్తనలో మార్పు వచ్చింది. దొరికిన వేటను సమిష్టిగా పంచుకునే ఒకప్పటి తత్వం పోయి అమ్ముకునే స్వభావం వచ్చింది.

భారతదేశంలో అన్ని తెగలకూ , కులాలకు ఏనాడూ ఒకే ఆరాధనా పద్ధతి లేదు. ప్రతి తెగ, ప్రతి కులం దానికదిగా ప్రత్యేకం. ప్రతి కులానికీ తమదైన గోత్ర పద్ధతి, కుల గురువుల, పూజారుల పద్ధతి వుంది. శికారీలలో కొరబియ, కొడియార, హికోతియ, హర్కథియ, మండియో,చవాన్‌ దియా, పింపలాజ అనే యేడు గోత్రాలు వున్నాయి. అందరికీ విడివిడిగా ఇంటిదేవతలూ వున్నారు. యీ అందరూ మళ్లీ దుర్గ, భవానీ మాతను శాక్తేయ పద్ధతిలో పూజిస్తారు. రాజపుత్రులవలె జంతుబలి ఇస్తారు. దేవర చేస్తారు.. ప్రపంచం లోని అన్ని గణాలు గతంలోని యీ దశను దాటి వచ్చినవే. ఉదాహరణకు రోమనుల శాక్రా మన జాతర వంటివి. సామూహిక మత కర్మకాండ బలుల రూపంలోనే జరుగుతుంది. బళ్ళారి పున్నమ సరిగ్గా అటువంటి ఉత్సవమే.

వొక తెగలో జీవించడం అంటే స్వీయ సంస్కృతిని ఆచరించడం, కాపాడుకోవడం, దానిలో సంకెళ్లుగా ఉన్నవాటితో ఘర్షణపడటం. మానవ జీవితమే వస్తువైన సాహిత్య రచనలో సంస్కృతి చిత్రణ ముఖ్యమైనది. ఆర్థిక సామాజికంగానే కాక సాంస్కృతికంగా కూడా మార్పులకు లోనవుతున్న తెగ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్త్రీల గురించి మాట్లాడకపోతే ఈ పరిశీలన అసమగ్రమే.

ఈ నవలలో పురుష పాత్రలకు సమానంగా స్త్రీ పాత్రలు ఉన్నాయి. శికారీలు లోపలా, బైటా పడిన ఘర్షణ యీ నవలలో అనివార్యంగా స్త్రీ పురుష సంబంధాల వైపు నుంచి వ్యక్తమయ్యింది. ప్రేమలు, పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, కట్టుబాట్లకు బైట మనువులు వంటివెన్నో ఇంత చిన్న నవలలో కనిపిస్తాయి. అసలు గుమ్లి, డొక్కోడు, రానూ వంటి స్త్రీ పురుషుల వివాహ సంబంధాల చిత్రణలో, కుటుంబ నిర్వహణలో శికారీల సాంస్కృతిక జీవితం ధారగా కనిపిస్తుంది.

తమ జీవితాన్ని, ఈ లోకాన్ని శికారీ స్త్రీలు ఎట్లా చూస్తున్నారు? అనేది ఈ నవలలో ఒక ఆసక్తికరమైన కోణం. మగవాళ్లు ఎట్లా వ్యవహరించినా స్త్రీలలో సమన్వయం, ఐక్యత, బాధ్యత కనిపిస్తాయి. పాత తరం స్త్రీల ప్రస్తావన నవలలో ఉన్నప్పటికీ లీల, అనర వంటి స్త్రీలు సంస్కృతిలో మార్పు కోరుకున్నారు. మిగతా వాళ్లకంటే ఏది సబబో గ్రహించే ప్రయత్నం చేశారు.

శికారీల్లో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. నాటు సారాయి కాయటం, అమ్మడం, హంద్రీలో గడ్డి కోయడం, అమ్మడం, సినిమా టాకీసుల వద్ద బ్లాకు టికెట్లు అమ్మడం, భవానీ గుడిలో పూజ చేయడం.. మొదలైన పనులన్నీ స్త్రీలే చేస్తారు. పురుషుడితో సమానంగా స్థైర్యం కనపరుస్తారు. తేడా వస్తే భర్తలపై తిరగబడి కొట్టే స్వేచ్ఛ తీసుకుంటారు. గుమ్లి తిరగబడి డొక్కోడిని కొట్టడంతోనే యీ నవల ప్రారంభం అవడం కాకతాళీయం కాదు.

అన్న చనిపోతే వదినను పెళ్ళాడటం, తమ్ముడు చనిపోతే మరదలును పెళ్లాడటం అనే ఆచారం వీళ్లలో వుంది. గుమ్లి మొగుడు డొక్కొడు అట్లా రానూను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఎందుకంటే రానూ మొగుడు డొక్కోనికి అన్న వరస. వాల్లది ‘కొడియార’ గోత్రం. కానీ నియమం ఏమంటే పెండ్లి చేసుకోకుండా సంబంధం పెట్టుకోరాదు. అట్లాంటి ఆలోచన కూడా రారాదు. కావాల్సుంటే నలుగుర్నయినా, అయిదు మందినైనా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా సంబంధం పెట్టుకుంటే శిక్ష 25 కొరడా దెబ్బలు. అంతకంటే పెద్దశిక్ష భవానీ దేవతకు కోపం కలిగించడం. రెండోది మాత్రం శికారీ తట్టుకోలేడు.

ఆఫ్రికన్‌ నీగ్రో తెగల గురించి మోర్గాన్‌ చెప్పిన మాట ఇక్కడ వర్తిస్తుంది. ‘‘పశ్చిమ ప్రాంత తెగలలో పెద్దవాని ఆస్తి, స్త్రీలు, బానిసలు వగైరా తరువాత తమ్ముడికి సంక్రమిస్తుంది. అలాగే కడగొట్టువాడు చనిపోతే ఆస్తి, స్త్రీలు, బానిసలు వగైరా అన్నకు చెందుతుంది’’.

ఒకవేళ పెళ్లి అయిపోయాక స్త్రీ తన భర్తను వదులుకోవాలంటే భర్త తరపు వాళ్లకు అయిన పెళ్లి ఖర్చులో సగం ఇవ్వాలి. యెంత యివ్వాలి అనేది పెద్దమనుషులు నిర్ణయిస్తారు. భర్తనే యీ మనువు వద్దనుకుంటే మాత్రం భార్యకు ఏమీ ఇవ్వవలసింది లేదు. ఇటువంటి స్త్రీ పురుష అసమ న్యాయం వీరిలోకి ఎప్పుడు ప్రవేశించివుంటుంది ?

నాకు మళ్లీ మోర్గాన్‌ విశ్లేషణనే దారి చూపింది. అనాగరిక యుగం ఎగువ దశలోనే జంటల మధ్య వివాహం వుండింది. అయితే అది స్థిరమైనది కాదు. వారు తమ ఇష్టం వచ్చినంత కాలం మాత్రమే కలిసి వుంటారు. జంట కుటుంబం నుంచి దంపతీ కుటుంబం ఏర్పడే క్రమం చాలా సమయమే తీసుకుంది. యీ మార్పును పాత సమాజం అంత త్వరగా అంగీకరించలేదు కూడా. కొంత కాలం పాటు రెండూ కొనసాగి వుండవచ్చు. దంపతీ వ్యవస్థను స్థిరపరచే నియమాలు, నిషేధాలు అలిఖిత చట్టాలు ఆచారాల రూపంలోనో వచ్చి వుండాలి. అందువల్లనే దంపతి వ్యవస్థ స్థిరపడ్డాక పాతకాలపు జంట విడిపోవాలంటే గణసమూహానికి పరిహారం చెల్లించాలని నియమం వచ్చింది. అటువంటి నియమమే శికారీలలో అమలులో వుంది.

అంతేకాదు శికారీలలో నాకు పునలాన్‌, సింధియాస్మియన్‌ కుటుంబాల ఛాయలు కనిపించాయి. సింధియాస్మియన్‌ కుటుంబంలో భర్తకు ఇష్టం లేకపోయినా, భార్యకు ఇష్టం లేకపోయినా విడిపోవచ్చు. పిల్లలు మాత్రం తల్లికే చెందుతారు. విడిపోవడంలో స్త్రీ పురుషులకు సమాన హక్కు వుంది.

సమాజంచే ఇంతగా దూరం పెట్టబడిన శికారీలు, దళితులను మాత్రం అంటరాని వాళ్ళుగానే చూస్తారు. మాదిగ బజారిని పెండ్లి చేసుకున్న అనరను దూరం పెట్టారు. తండ్రితో సహా ఆ గుంపు వాళ్ళు ఎవరూ మాట్లాడటానికి లేదు. ఒక తక్కువ కులం వాడు మరో తక్కువ కులం వాడిని అంటరానివాడుగా చూడటమే మన దేశ వైచిత్రి. ఈ నవలలోని అన్ని పాత్రలతో తిట్లు తినేలా వ్యవహరించే డొక్కోడు ఆపత్సమయంలో మాదిగ బజారిని ముట్టుకుని, అతనికి సాయం చేయడం ద్వారా కట్టడి మీరడం ఆ పాత్రలోని సహజ మానవ స్పందనను తెలియజేస్తుంది. యీ ఘటన తరువాత తమ కట్టుబాట్లు కొన్ని అమానవీయమైనవని శికారీలకే అనిపించడం, ఆ సమూహంలో ఏర్పడుతున్న ప్రజాస్వామిక విలువలకు నిదర్శనం.

ఇదీ స్థూలంగా పాణి రాసిన శికారీ నవలలోని సామాజిక సాంస్కృతిక జీవితం. నవల చదువుతూ వుంటే ప్రేమ, అసూయ, ద్వేషం, జీవిక కోసం నిత్యపోరాటం, సంతోషం, విషాదం కలగలసిన రక్త మాంసాలున్న మనుషుల జీవితం మన కళ్ళ ముందు
ఆవిష్కృతమ వుతుంది .

నవలలో కథా కాలం స్థూలంగా 2003కు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకో ఇరవై ఏళ్ల కాలం గడిచింది. ఇంకేం మార్పులు వచ్చాయో తెలియదు. కొనసాగింపును యే రచయిత అందుకుంటాడో! ఎదురుచూస్తున్నాను.

నవల ముగింపులోని చివరి వాక్యాలు మీతో పంచుకొని ముగిస్తాను.

‘‘సగం రేత్రి నుంచే దూరబారాల నుంచి జనాలు రాబట్టినారు. గుల్‌బర్గా, బల్లారి, అనంతపురం, హైదరాబాదు… నాలుగుదిక్కుల నుండి ఒకటే జనం. పైటాలకల్లా మామిడివనం నిండిపోయింది. ఈరా, షాహూ బవానీ కాడ ఉంటే, వచ్చినోల్లు వచ్చినట్లే యాపచెట్టు కింద కోళ్లను కొయ్యడం తలకాయ, కాల్లూ తీసి యాపచెట్టుకు యాలాడదియ్యడం, పక్కకు గొండబొయ్యి బొచ్చు వలిచి ముక్కలు చేసి ఆడోల్లకియ్యడం… సరిపోయింది’’

కొన్ని ఏండ్లుగా పలకరించుకోని చెల్లెలు జాతరకు వచ్చింది దుఃఖపడింది, ఓదార్పు పొందింది. అన్ని కార్పణ్యాలు మరచి ఒక మానవ సమూహం ఏకమయ్యింది. అన్ని వైషమ్యాలనూ మరిచి ఒక్కటయ్యారు. డొక్కోడు, వాని యిద్దరు భార్యలూ, కులం తప్పి పెళ్లి చేసుకున్న అనర, మాదిగ బజారి అందరూ ఏకమయినారు.

ఆ సమయాన అక్కడ ఆ సమూహంలో కట్టుబాట్లు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఏ కట్టుబాట్లూ లేని మానవ సామూహికత పునస్సంఘటితం అవుతున్నది.

పదిమంది గాదు, ఇరవైమంది కాదు, నాలుగయిదు వందల మంది. లోలోన దాగిన సత్తువంతా కాళ్ళలోకి వచ్చింది. నేలను ఆకాశాన్ని కలిపేతట్ల వొళ్లు ఇరుసుకోని పైకి లేస్తా ఉంది.
చెమటలు కారి వెన్నెల్లో మొకాలు మిలమిల మెరుస్తుండాయి. కాల్ల కింది నుండి లేచిన దుమ్ము మామిడి వనమంతా పాకింది. చెట్ల కొమ్మలు దాటుకొని పై పైకి పోతా ఉంది. పై నుంచి వెన్నెల అబ్బురపడి చూస్తా ఉంది.

ఆ వెన్నెల్లో నాతో పాటు మీరూ ఓలలాడండి.

ప్యాపిలి గ్రామం, కర్నూలు జిల్లా. 'కర్నూలు మూర్తి'గా కథా ప్రపంచానికి పరిచితుడు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసినవారిలో ఒకడు. శ్రీనివాసమూర్తి బృందం పాతికేళ్ల కిందట తీసుకొచ్చిన 'పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు' పుస్తకాలు కర్నూలు వైపు కథా పాఠకుల చూపును మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన ‘అడివోడు”, ‘మెడమీద వేలాడే కత్తి’, కథ -95, కథ -96 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కశ్మీర్ నేపథ్యంగా రాసిన “ఖబర్ కె సాత్’ కథ కథాసాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు పదహైదు కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా ప్యాపలి గ్రామంలో. ప్యాపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిల్లో పి.హెచ్.డి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం రసాయనశాస్త్ర అధ్యాపకులుగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పనిచేస్తున్నారు.

One thought on “శికారి – ఓ ఒంటరి సమూహం

  1. వర్తమాన సమాజంలో ఉనికి సమస్య తల ఎత్తి జీవన పోరాటంలో తల మునకలవుతున్న షికారి తెగ ప్రజల జీవితం మీద వచ్చిన ఈ నవలలో విశ్లేషణ మోర్గాన్ కాలం నుంచి ప్రస్తుత తెగల జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞాన ఉపకరణంగా ఉంది.

Leave a Reply