శత సహస్ర సత్యవసంతమై…

“మీరు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళాలని

దయచేసి పట్టు పట్టకండీ,

 వసంతానికి వెళ్ళే మార్గం గురించి మాత్రమే 

 యిక్కడ విరబూసిన గుండెల్ని అడగండి!”

                                                        – రూమీ.

అబ్బాయీ, యెలా వున్నావు? బహుశా బోలెడంత బెంగగా వుండి వుంటావు. అంతే… యెంత ప్రయత్నం చేసినా కొన్ని ఆనవాళ్ళని అస్సలు చెరుపుకోలేం.

నమ్మిన బాట కోసమో, యిచ్చిన మాట కోసమో అలవోకగా ప్రాణాల్ని యిచ్చేసేంత సులువేమీ కాదు. ఆనవాళ్ళనీ, జ్ఞాపకాలనీ, గాయాలని చెరుపుకోవడం.

యీ రోజు వేకువ జామున మసక వెలుతురులో కొండ అంచున చెమ్మ బారిన బాటలో ఆ తడిలోంచి తలెత్తి చూస్తున్న రంగురంగుల గరిక పువ్వులని తొక్కేయ్యకుండా జాగ్రత్తగా నడుస్తున్నప్పుడు హఠాత్తుగా నిశ్శబ్ధాన్ని చీలుస్తూ కోకిల కూత వినగానే హఠాత్తుగా ఆగిపోయాను. వో క్షణం అలాగే నిలబడి విన్నాను. యీ యేడాది యీ వనాల్లోకి వసంతాగమనానికి సూచికగా కాస్త త్వరగానే చొచ్చుకొచ్చిన తొలి కోయిల పిలుపది. మనం గాడి తప్పించేసిన రుతువులకి అనుగుణంగా కోయిల పాటా ముందుకొచ్చేసిందా అబ్బాయి. యేమో…  

మనం మాట్లాడుకున్నాం గుర్తుందా? అందంగా వుండే పక్షులు, అందంగా సాగే పక్షులు, కూతపెట్టే పక్షులు అన్నీ మగవేనని. యీ తొలి కూతలో కూడా బెంగటిల్లుతున్న యేదో వ్యధ. నేను వేటగత్తెని కాదు. అది క్రౌంచ్య పక్షీ కాదు. కానీ లోలోపల నుంచి యేదో దుఃఖం వుబికి వచ్చేసింది. పక్షుల్లాంటి ఆకుల్ని రాల్చేసుకున్న కదంబం చెట్టు మాను కింద కూర్చుండిపోయాను. పొడవైన మావి చివురు రంగు ఆకులు కూడా వసంతాన్ని నింపుతూ కొత్త సోయగాన్ని వీస్తున్నాయి. మలంకురాత వృక్షాలు కూడా అప్పుడే యెర్రటి పూమొగ్గలతో నిండిపోయాయి. సల్దూపా, యెన్నెమారా చెట్లు సైతం పచ్చని తెల్లని పూలతో కళకళడుతున్నాయి.  షికెల్ముడి నిటారుగా యోధుడిలాగా నిలబడి పచ్చని చివుర్ల తో దాల్చిన పరిమళాల్ని వీస్తుంది. యీ ఆనవాళ్ళనీ, యీ పచ్చదనాన్ని, యీ చెమ్మనీ, యీ చినుకుల్నీ యెంత చెరిపేసుకుందామనుకున్నా సాధ్యం కావడం లేదు.

పాలి, బాలాగీ పళ్ళ చెట్లు అప్పుడే పిందెలతో నిండిపోతున్నాయి. బహుశా యీ చెట్లు, గుట్టలు, కొండలు, దారులు, పచ్చిక యివన్నీ నా దేహంలోనే జన్మించాయేమో? నా నరాల్లోకి వాటి వేళ్ళు చొచ్చుకొని వుంటాయి. వాటి చుట్టూ పరిభ్రమించే రుతువులు నాలో అణువణువున  వాటి మూలాల్ని దించుకొని వుంటాయి. యెలా చెరుపుకోగలను. 

                “గత రాత్రి నీవు జార్చుకున్న జ్ఞాపకమేదో 

                  నిశ్శబ్ధంగా నా గుండెని తట్టి లేపింది 

                  వసంతకాలం గుంభనంగా యీ అరణ్యాన్నిఆవరించుకున్నప్పుడు,

                   యెక్కడో యెడారిలోని నీ పదధ్వని యిక్కడ ప్రతిధ్వనిస్తుంది,

                   స్వేచ్ఛా కాంక్ష యేదో… 

                   అత్యంత నెమ్మదిగా, మృదువుగా రెక్క విప్పుతుంది 

                   నీ తలపులలో చిక్కుకున్న ప్రేమ మారాకు వేస్తుంది.

                   ప్రియతమా! నన్ను పిలు…

                   కోకిలలానో, చివురాకుల రెపరెపలానో!”  ఫైజ్ అహ్మద్ ఫైజ్ మెదిలారు.

నిజానికి వసంతం అంటే మనకు సహజంగా టక్కున ‘వోడి టు స్ప్రింగ్ ‘ ‘డఫోడిల్స్’ లాంటివి గుర్తుకొస్తాయి. తీవ్రమైన వేదనతో వెతుకులాటతో వసంతం గురించి పలవరించిన రూమీ, జైలు గోడల మధ్య కృంగదీసే రుతువుల మధ్య నుంచి యెలుగెత్తిన ఫైజ్ అహ్మద్ ఫైజ్ గాని గుర్తుకు రావడం అంటే మీ గుండెకి యేదో మరమత్తు అవసరమండీ అని మిత్రులు అంటున్నారు. కఠోరమైన యుద్ధ కవితలు రాసిన వాల్ట్ విట్మన్ కూడా గుర్తుకొస్తున్నారనీ చెప్పాను. యెందుకైనా మంచిదన్నట్టు నాకు కొంచెం దూరంగా నడవడం మొదలుపెట్టారాయన.

             “వో గాలీ! వసంత కాలపు శుభాకాంక్షలు తెలియజేయి 

             నేను యీ తోటని వదిలి పంజరంలోకి వెళ్ళిపోతున్నాను 

             యీ వసంత మాసపు గాలి జైలులో వున్న వాళ్ళని 

             మరింతగా యిబ్బంది పెడుతుంది గుండె మీద కత్తి పెట్టినట్టుగా

             యీ రోజు గాలిలో యేదో వున్మాదం వుంది 

              బహుశా బయట ప్రపంచంలో వసంతరుతువుందేమో 

              యీ వసంతం వుదాసీనతను చూసినప్పుడు

              నేను నా హృదయంలో వొక తోటనే సృష్టించుకున్నాను” ఫైజ్ గారు మెదిలితే చాలు యీ ప్రపంచాన్నిశత సహస్ర హృదయాలతో హగ్ చేసుకుంటామేం.

నిజమే ప్రేమ వూపిరి పోస్తుంది వూహలకి. వూహల్లోని తోటలకి. తోటల్లో విరిసే యెర్రని గులాబీలుకి ‘నీ దేహ పరిమళం లాంటి అందమైన యెర్రని గులాబీలు తిరిగి వికసిస్తాయి, ఆ యెరుపు బహుశా ప్రేమికుల రక్తమేమో? దూరంగా నెట్టేసిన దుఃఖం తిరిగి వస్తుంది. సుదూరాన వున్న స్నేహితుల జ్ఞాపకాలు కల్లోల పరుస్తూనే వుంటాయి’ అన్న ఫైజ్ గారు వసంతం అనగానే గుర్తు రావటం సహజమే కదా.

వెదురు గుబురులన్నీ పచ్చని ఆకుల్ని రాల్చుకుని మోడువారి పోయాయి. ఆ గుబురుల్లో దూరిన వసంత మాసపు చిరుగాలి వేణువుల్లా ఆ వెదురు కణుపుల్లో వొదిగిపోతుందేమో. జుమ్మని అడవి పాడే పాట గుండెల్ని తడుతుంది. చెప్పు… యిది ప్రేమే కదూ?

కొద్దిపాటి దూరం… వేరు వేరు ప్రాంతాలలో… వేరు వేరు స్థలాలలో… వేరు వేరు దేశాలలో వున్నప్పుడు ఫోన్ లో మాట్లాడుకునే వీలున్నా సరే ఆ దూరం, ఆ యేకాంతం మనసున మనసైన వాళ్ళు వొకే చోట లేనప్పుడు బెంగటిల్లుతూ మనసు యెన్నెన్నో లేఖలను… ప్రేమలేఖలను రాస్తూనే వుంటుంది కదా.

ప్రేమలేఖలు రాయని వాళ్ళు అరుదనుకుంటాను. 

స్వల్ప దూరమైనా, సప్త సముద్రాలు దాటే దూరమైనా మనసు కలవరింతల్లోనో… పలవరింతల్లోనో నా యేకాంతంలో నువ్వు వున్నావు… నువ్వు మాత్రమే వున్నావ్ అని పట్టి యిచ్చేవి ప్రేమలేఖలే కదా.

దూరం అనగానే యేదో వొక కారణంగానో… కారణాలు లేకుండా కూడా జైల్లో వున్నవారు గుర్తొస్తూనే వున్నారు. సమస్త ప్రపంచం నుంచి దూరంగా నెట్టి వేయబడే పరిస్థితుల్లో వున్నవారు, ముఖ్యంగా  ప్రపంచానికి అక్షరాలకి మధ్య వొక యినుప తెర లాగిన అనేకానేక సంఘటనలు, సందర్భాలు గుర్తొస్తున్నాయి.

గోడలు మధ్య బందీ అయిన శరీరంలో ప్రవహించే తలపులని యే తలుపులూ బంధించలేవని యెందరో కవులని, కళాకారులని చూస్తే అర్ధమవుతూనే వుంది.

గదులేమో చీకటితో. అటువంటి చోట బందీ అయిన వాళ్ళకి యేకాంతం చుట్టు ముట్టినప్పుడు కలవరింతో పలువరింతో గుండెల్లో గుబులుగా  తిరుగుతూంటే రాసిన  కవిత్వాన్ని మనం చదువుకొన్నాం కదా. అసలు ప్రపంచ సాహిత్యంలోనే గొప్ప ప్రేమలేఖలు జైలు నుంచి వచ్చిన కవిత్వమే కదా అని మనిద్దరం మాటాడుకోవటం గుర్తొస్తోందబ్బాయి. మన పైజ్ గారు తన భార్య ఐరా గారికి కి రాసిన  కవిత్వం మరుపురానిది. అపురూపమైనది.

యెన్నెన్నో ప్రేమలేఖలు. తమ యింటి వారికో, హృదయానికి సంబంధించిన దగ్గర వాళ్ళకో మాత్రమే రాసినవి కాదు. వారివారి రాజకీయాల వల్ల జైళ్ళల్లో వున్నవారు, వారు కవులూ, రచయితలూ కాకపోయినా వారు సమానత్వం, స్వేచ్ఛా కోసం గొంతెత్తే ధిక్కారమే  గొప్ప విలువైన ప్రేమలేఖలు అనేవాడివి.   

“నిద్ర పట్టని నిరంతర దీర్ఘ రాత్రులలో

కటకటాల వెనుక జీవితం గురించి 

శతాధిక గీతాలు రాస్తాను 

వొక్కొక్క గీతం పూర్తయినప్పుడల్లా 

కలం కింద పెట్టి కటకటాల నుంచి 

సుదూర స్వేచ్ఛాకాశాన్ని చూస్తాను” హోచిమిన్ గారి కవిత్వమంతా రాజకీయాలతో నిండిన ప్రేమలేఖలే  కదా యీ సమాజానికి.

“గాలాడని యీ గదిలో 

పదేపదే నీ పేరుని వల్లెవెయ్యడం కన్నా 

సంతోషకరమైనది యీ ప్రపంచంలో మరేదీ లేదు 

నీ చూపు తప్ప నా గొంతుకకు 

యే తాడూ వురైయ్య లేదు

యే నదీ నన్ను ముంచలేదు

యే తుపాకీగుండూ,

యే విషమూ 

నా  ప్రాణాన్ని తీయలేవు  

నా మీద యే శక్తీ పని చేయదు”  అని మనందరికీ యిష్టమైన మయకోవస్కీ గుర్తొచ్చేసారు. వారు రాసిన ప్రేమ కవిత్వమంతా కూడా దాదాపు జైల్లో నుంచి రాసిందే కదా. 

మనం కలవరింఛి పలకరించిన కలిసి మాట్లాడిన కాళోజి గారు యెంత కవిత్వం రాశారో కదా. 

యిక వుద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళని నాలుగు గోడల మధ్య బంధించినప్పుడు వారు జైల్లోంచి రాసిన కవిత్వాన్ని పదేపదే చదువుకొంటూనే వున్నారంతా.  

“ముళ్ళే లేని మల్లెపువ్వు మీద

రాత్రంతా కురిసిన నా వూహల స్వర్గాన్ని

యింటర్ సెప్టె చేసి పరిశోధించవచ్చునట పరాయివాళ్ళు

ప్రేమ రహస్య పేటికని పగలగొట్టి చూస్తానంటున్నది

అది పావురమా క్రూరమా?”  వివి సర్ జైల్లో వున్నప్పుడు రాసిన కవిత్వమంతటా యెంతో ప్రేమ, యెంతో కన్సర్న్ యీ ప్రపంచం మీద.

శివసాగర్ గారు వెలిగించిన వెన్నల మామూలుదా… కె.వి.ఆర్ గారు, చెరబండరాజు గారు యే ఫామ్ అయినా కావచ్చు అవన్నీ యీ ప్రపంచానికి రాసిన ప్రేమలేఖలే  అని మనం భలే తీర్మానాలని పాస్ చేసేసుకునే వాళ్ళమి. 

మన తారకం గారు జైలు నుంచి రాసిన కవితల్లో ‘నీకు చెప్పనేలేదు’ కవితని చదివినప్పుడు మనమెంత రెస్ట్ లెస్ గా తిరిగామో కదా. యిప్పుడు సాయిబాబా గారు రాస్తున్నకవిత్వం వొక్క వసంత గారికే కాదు అది యీ ప్రపంచానికే రాస్తున్న ప్రేమలేఖ.

“యీ ప్రేమని అనుభవించలేని వాళ్ళు నదిలాగా ప్రవహించ లేరు 

వేకువ జామున వొక కప్ప వసంతాన్ని నీళ్ళలాగా తాగలేదు 

సూర్యాస్తమయంలాంటి వర్ణాల విందుని ఆరగించలేరు 

మారడానికి యే మాత్రం యిష్టపడని వారిని అలాగే నిద్రపోనీయండి. 

ప్రేమ అంటే తత్వశాస్త్రానికి మించిన అధ్యయనం” – రూమి. యెంతో బాగుందో కదా. 

అబ్బాయీ, నిన్ను బాగా మిస్ అవుతున్నాను. 

యీ రుతువులు, రంగులు, యీ పూలూ, పున్నములు, యీ వెన్నెలలు, యీ వేకువలు, యే వేదనలూ, యే బెంగలూ,యే గాయాలూ లేకుండా మన బతుకుల్లో యిమిడిపోతాయా? వేదనా, బెంగ అనగానే జిబానానంద్ దాసు గారు మనసుని తిప్పనివ్వరు. మళ్ళీ మళ్ళీ యెక్కడి సుధూరాల నుంచో కోకిల గానం. తనెందెందుకలా బాధ పడుతోంది? యీ కూత వినగానే దేహం నుంచి యేవో రెక్కలు మొలుచుకొచ్చినట్టుగా వుంది. పల్చని సీతాకోకచిలుక రెక్కలు. యే వనాల్లో యే రంగుల సీతాకోకచిలుకలు తమ రెక్కల్ని నిష్కారణంగా రాల్చుకున్నాయో?

ప్చ్… వో కోయిల తొలి పాట యెన్నింటిని మనసులో జైంట్  వీల్ యెక్కించిందో.  కోయిల యీ యేడాది కాస్త త్వరగా వచ్చిందా… యేమో రుతువులు క్రమం తప్పుతున్నప్పుడు కోయిలలూ ముందూ వెనుకా స్వరాన్ని విప్పటం సాధ్యమే కదా. యిది  నెమలీకలు పూసే కాలమో కాదో కానీ మిలమిలలాడే నెమలీక నా చూపులకి అడ్డంగా విచ్చుకొంది. అందుకున్నాను. పోయిన యేడాది యీ సమయంలో సిగ్నల్స్ కి అందుబాటులో వున్నాను. యెన్నెన్ని ఆఫర్స్ … మీ ప్రేమని వ్యక్తపర్చటానికి అసలుసిసలైన ఆనవాలు యీ బుజ్జి డైమండ్ వుంగరమని… వాచ్ అనో ఆఫర్ స్స్ ఆఫర్స్.  వజ్రం  తళ్ళుక్కుమనగానే ‘బ్లెడ్ డైమండ్’ కస్సుక్కున  మనసులో దిగుతుంది. ఆ సినిమా వచ్చినప్పుడు యిప్పుడున్నన్ని డైమండ్ నగల  హోర్డింగ్స్ లేవనీ మా ప్రొఫెసర్ అంటుండేవారు. యిప్పుడు ప్రేమని వ్యక్తపర్చటానికి డైమండ్ అత్యంత ముఖ్యమైన ఆనవాలు. యిలాంటివి చెపితే చాదస్తం అంటారు కొందరు… కొందరేమో ప్రేమ వ్యాపార వస్తువైయిందంటారు. మార్కెట్ డిజైన్ చేసినట్టు ప్రేమని వ్యక్తపరుస్తోన్న వారి కళ్ళు చమక్ చమక్ మంటూనే వున్నాయి. లవ్ బెలూన్స్ కానుకగా యిచ్చుకునే వారి చూపుల్లోనూ మిలమిలలే. గులాబీ పువ్వుని బహుమతిగా అందించేవారి నయన సౌగంధపు ప్రభాత రశ్మి.  యేమిచ్చినా యే కానుకా యివ్వకుండా మనలోని యిష్టాన్ని ప్రకటిస్తామనేది వారివారి వ్యక్తిగత ఛాయిస్ కదా.  అబ్బాయీ, యీ నెమలీకనిస్తాను… వో తెల్లకాగితాల నోట్ బుక్ లో పెట్టుకో…  మన కవితలవుతాయి… ప్రపంచానికి యివ్వు… యీ భూమి మీద ప్రేమ నిత్యనూతనమై యెల్లలోకాలల్లోనూ చిరంజీవి… యేమంటావ్… హ్యాపీ వాలెంటైన్స్ డే అబ్బాయి.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

2 thoughts on “శత సహస్ర సత్యవసంతమై…

Leave a Reply