వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

అంటువ్యాధి ఉత్పాతాలు అనేవి సమాజాలలో హఠాత్తుగా, ఎలాంటి హెచ్చరికా లేకుండా జరిగే యాదృఛ్చిక సంఘటనలు కావు. అందుకు విరుద్ధమైనవి. ప్రతీ సమాజమూ తనవైన బలహీనతల్ని సృష్టించుకుంటుంది. వాటిని అధ్యయనం చేయడమంటే, ఆ సమాజపు సాంఘిక నిర్మాణాన్నీ, జీవన ప్రమాణాలనీ, దాని రాజకీయ ప్రాధాన్యతలనీ అర్ధం చేసుకోవడమే.

– ఫ్రాంక్ స్నోడెన్ , ఎపిడెమిక్స్ అండ్ సొసైటీ, ఫ్రమ్ బ్లాక్ డెత్ టు ది ప్రజంట్

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థని నడిపించే చోదకశక్తిగా ‘అదృశ్య హస్తం’ అన్న భావనని ఆర్థికవేత్త ఆడం స్మిత్ పద్ధెనిమిదవ శతాబ్దంలో ప్రస్తావించాడు. ప్రస్తుత ప్రపంచం ఒక ‘అదృశ్య క్రిమి’తో పోరాడుతున్నది. దేశదేశాలలో ప్రాణనష్టాలతో పాటు, మున్నెన్నడూ కనీవినీ ఎరగనంతటి స్థాయిలో ఆర్ధిక వ్యవస్థలని అతలాకుతలం చేస్తున్న మహా ఉత్పాతాన్ని సృష్టించిందీ అదృశ్య క్రిమి. న్యూయార్క్ నగరపు ఈశాన్యాన హార్ట్ ఐలండ్ ప్రాంతంలో సామూహిక ఖననం కోసం సమాధులని తవ్వుతున్న దృశ్యం మహా విషాదానికి అద్దం పడుతున్నది. ఆర్ధిక రంగంలో చూస్తే, 2020 ఆర్ధిక సంక్షోభం, 1908 నాటి మహా సంక్షోభానికి మించిన స్థాయిలో వుండవచ్చునని ఐ ఎం ఎఫ్ చెబుతున్నది. ఐ ఎం ఎఫ్ అధికారులు స్థూల ఆర్ధిక చిత్రపటాన్ని రూపొందించడంలో వ్యాధుల వ్యాప్తి పై పరిశీలనలు జరిపే పరిశోధకులు సహాయపడుతున్నారనీ, ఇలా చరిత్రలో ఎన్నడూ జరగలేదనీ చెబుతున్నారు. ఏం జరగబోతోందో ఊహించడం కష్టమని ఆ నిపుణులు చెబుతున్నారు. వెనక్కి తిరిగి చూస్తే, అంటువ్యాధులని సంపూర్ణంగా నిర్మూలించగలమనీ, కనీసం పాశ్చాత్య ధనిక దేశాలలో వాటిని రూపుమాపగలమనీ కొందరు గతంలో ప్రకటించారు. ఆ ధనిక దేశాలు అంటువ్యాధుల జాడ కూడా లేని పూలతోటలుగా మారతాయని అనుకున్నారు. ముప్ఫయి, నలభై సంవత్సరాలనాటి అతిశయపు ఊహలవి. ఇప్పుడు ఆ పూలతోటలకి సైతం నిప్పంటుకుంది!

అయితే, ఇప్పటి ఉత్పాతం ఎవరూ ఊహించకుండా, హఠాత్తుగా ఊడిపడిన సంఘటన కాదు. ఊహాన్ నగరంలో వైరస్ గురించి 1981లోనే ప్రస్తావించిన డీన్ కూంట్జ్ నవల గురించో, అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన అంటువ్యాధి గురించి ముందే ఊహించిన 2012 నాటి హాలీవుడ్ సినిమా ‘కంటేజియన్’ గురించో చెబుతుంటే వినీ, వినీ విసుగు పుడుతుంది. కానీ, అమెరికా ప్రభుత్వం మశూచి వ్యాధి వ్యాపింపజేసే దాడి గురించి ఊహించుకుని 2001లో డార్క్ వింటర్ పేరుతో జరిపిన ప్రయోగాన్ని గురించి విన్నా, ఇంకా, చైనా నుంచి అమెరికాకి ఇన్‌ఫ్లుయెంజా వ్యాధిని వ్యాపింపజేసే ఒక కల్పిత దాడిని ఊహించుకుని 2019 ఆగస్టులో ‘క్రిమ్సన్ కంటేజియన్’ పేరుతో జరిపిన ప్రయోగాన్ని గురించి తెలుసుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. వింతగా కూడా అనిపిస్తుంది. ప్రస్తుత ఉత్పాతానికి కొన్ని నెలల ముందే జరిగిన ‘క్రిమ్సన్ కంటేజియన్’ ప్రయోగం, ప్రస్తుత పరిణామాలకి చాలా దగ్గరగా వుంది కూడా. అలాంటి (కల్పిత) పరిణామాలని ఎదుర్కోవడంలో లోపాలని ఆ ప్రయోగాలు ముందే స్పష్టంగా ఎత్తి చూపించాయి. అయినా, అవి వాస్తవ రూపంలో ఎదురయ్యే సరికి, ఎలాంటి తయారీ లేకుండా నిస్సహాయంగా చేతులెత్తేసిన పరిస్థితిని మనం ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య భద్రతా సూచి (2019) ప్రకారం మొట్టమొదటి స్థానంలో నిలిచిన అమెరికాలోనే ఇటువంటి పరిస్థితి దాపురించడం గమనించాల్సిన విషయం. ఇలాంటి ఉత్పాతాల గురించి హెచ్చరిస్తూ 2000 సంవత్సరంలోనే సిఐఎ ఒక నివేదికని కూడా సమర్పించిందన్న విషయం తెలిస్తే మరీ వింతగా అనిపిస్తుంది. పాత, కొత్త సంక్రామక వ్యాధులతో ఆరోగ్యానికి ముప్పు పెరగడంతో పాటు, రానున్న ఇరవై సంవత్సరాల కాలంలో ఆ అంటు వ్యాధుల రూపంలో అమెరికాకీ, ప్రపంచ భద్రతా వ్యవస్థకీ ప్రమాదం పొంచి ఉందని కూడా సిఐఎ నివేదిక పేర్కొంది. సరిగ్గా ఇరవై సంవత్సరాల తర్వాత అలాంటి ప్రమాదమే ముందుకొచ్చింది. అయినా ఎటువంటి సన్నద్ధతా లేని నిష్క్రియాపరత్వం ఒక వైపు, మూర్ఖత్వం మూర్తీభవించిన నిర్లక్ష్యం మరొకవైపు ఆవరించిన స్థితిలో మనమున్నాం!

చావులు, విధ్వంసం పరివ్యాప్తమౌతున్న వేళ కనిపించని ఈ క్రిమి పుట్టుక గురించి విస్తృతమైన చర్చలు జరుగుతున్నాయి. ఇది సహజంగా ప్రకృతినుండి పుట్టిందేనా? లేదంటే మిలిటరీ ప్రయోగశాలలో సృష్టించిన జీవాయుధమా అని చర్చిస్తున్నారు. ఇది కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించింది కాదని శాస్త్రీయంగా నిర్ధారించినా, ఆ కుట్ర సిద్దాంతాలు మాత్రం ప్రచారం అవుతూనేవున్నాయి. ఇది వికటించిన ప్రయోగంతో సంభవించిన ప్రమాదమా, లేక ఎదుగుతున్న ఒక దేశపు ఆర్ధికాన్ని కుప్పగూల్చడానికి సృష్టించిన ఉపద్రవమా అని కూడా చర్చిస్తున్నారు. కరోనా వ్యాధి క్రిమిని సృష్టించిన/ వ్యాప్తిలోకి తెచ్చిన ప్రయోగశాల చైనాలోని వూహాన్ లో ఉంటుంది. లేదంటే అమెరికా లోని ఫోర్ట్ డెట్రిక్ లో ఉంటుంది.అది ఆ సిద్ధాంతాలని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళ ఉద్దేశాలని బట్టి మారుతూ ఉంటుంది.. ఈ ప్రచారాలని నిజనిర్ధారణ చర్చలతో ఆపలేము. నిజానిజాల్ని ఇప్పటికిప్పుడు ఇదమిద్ధంగా తేల్చలేము. ఎందుకంటే వాటి సృష్టికర్తలు వట్టి విపరీత అనుమానాలతో తలచెడిన వ్యక్తులు కాదు. ఆ ప్రచారాల వెనుక ఆయా దేశాల ప్రభుత్వాలే వున్నాయి. ఆయా దేశాల ప్రభుత్వాల మధ్యనున్న అపోహలకీ, అపనమ్మకాలకీ ఈ ప్రచారాలు అద్దం పడుతున్నాయి. స్నేహాన్ని నటించే దౌత్య ప్రకటనలు ఆ అనుమానాల్ని కప్పిపెట్టలేవు. ఆయా దేశ రాజ్యాల భౌగోళిక రాజకీయ ప్రయోజనాల మధ్య పెరుగుతున్న పోటీని కూడా ఈ ప్రచారాలలో మనం చూడవచ్చు.

ప్రస్తుత కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాల విధానాలు దారుణంగా వున్నాయి. అలక్ష్యం, బుకాయింపులు, దాచివేత, దాటవేత, అలసత్వం, అసమర్ధత, నేరపూరిత నిర్లక్ష్యం లాంటి వైఖరులు వివిధ స్థాయిలలో వ్యక్తమయ్యాయి. కొన్ని దేశాలు, ప్రాంతాలలో అక్కడక్కడా సత్వర చర్యలు, కొంత మెరుగైన పద్ధతులను అనుసరించినా, అత్యధిక భాగం దేశాలలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో వైఫల్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చరిత్రలో మునుపు ఎన్నో అంటువ్యాధి జాడ్యాలు అనేకమందిని బలిగొన్నాయి. విధ్వంసాన్ని సృష్టించాయి కూడా. ఆ వ్యాధులకు అసలు కారణాన్ని తెలుసుకోలేని అజ్ఞానం రాజ్యమేలిన సందర్భాలలో వివిధ జాతులు, తెగలు, మతాల ప్రజల పట్లా, ఆయా ప్రజల ఆహారపు అలవాట్ల పట్లా చులకన, వ్యతిరేకత, ద్వేషం నిండిన వైఖరులు ముందుకొచ్చినట్లు చరిత్ర మనకు చెబుతుంది. ప్రస్తుత ఉత్పాతం విషయంలో కూడా అదే జరుగుతోంది. దేవుడి ఆగ్రహం, మనుషుల పాపాలకు విధించిన శిక్షయే ఈ అంటువ్యాధుల వ్యాప్తికి కారణమంటూ వివరిస్తున్న వివిధ మత ఛాందసవాదుల మూర్ఖత్వం ఇప్పుడుకూడా అనేక దేశాలలో కనిపిస్తూనేవుంది. రోమ్ నగరంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు, పాపులని శిక్షించేందుకు అతని ఇంటిముందు దేవదూత ఆగ్రహంతో నిలబడిన చిత్రాన్ని 19వ శతాబ్ది చిత్రకారుడు జూల్స్ ఎలీ డెలనీ గీశాడు. ఇప్పటికీ అలాంటి వైఖరులనే మనం చూస్తున్నాం. కాకపోతే, ఆ వైఖరి ఇప్పుడు అన్ని మతాలలోనూ వ్యక్తమౌతూ వుంది. మరొకవైపు, దేశదేశాలలో వలసకార్మికులు తాము పని చేస్తున్న మహానగరాలలో ఉపాధికోల్పోయి, పొట్ట చేతబట్టుకుని సొంత ఊర్లని చేరేందుకు వందల మైళ్ళ దూరాన్ని సైతం లెక్కచేయక కాలినడకన బయలుదేరిన విషాదాన్ని, మార్గమధ్యంలో ఆపేస్తే, దిక్కుతోచక స్వదేశంలోనే కాందిశీకులవలే ఆకలితో అలమటిస్తున్న కన్నీటి దృశ్యాలని, నడిచీ, నడిచీ దారిలోనే అనాధలుగా కన్ను మూసిన అభాగ్యజీవుల వ్యధార్త గాధలనీ వింటున్నాం. టీవీలలో కళ్లారా చూస్తున్నాం. అభివృద్ధి నమూనాలోని బీభత్సానికీ, అధికార యంత్రాంగపు నేరపూరిత నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమే ఈ విషాదం. కళ్ళకి కనిపించకుండా గంతలు కట్టినా, ఎత్తైన గోడలు కట్టినా దాగని దారిద్ర్యమిది. పనిలేకుండా పస్తులుండి ఆకలితో చావడమా, కరోనా కాటుకి గురయి చావడమా అన్నదే వాళ్ళ ముందున్న ప్రశ్న. చావు మాత్రం తప్పించుకులేని వాస్తవం. ప్రభుత్వం తీసుకున్న చర్యలని మితిమీరినవిగా చూడాలా, అందుకు భిన్నంగా విపత్తుని తక్కువ అంచనా వేసిన చర్యలుగా చూడాలా అని ఎంతైనా చర్చించవచ్చు. అసలు యంత్రాంగం వైపునుండి ఎలాంటి సన్నద్ధతలూ లేకుండా, బాధ్యతారహితంగా స్పందించిన తీరు పరిస్థితులని మరింత జటిలంగా మార్చింది.

ప్రస్తుత కరోనా విపత్తు కేవలం ఒక అదృశ్య క్రిమి ద్వారా సంక్రమించిన ఒకానొక ‘అంటువ్యాధి’ ఫలితం మాత్రమే కాదు. ఈ వ్యాధి వ్యాప్తికీ, విస్తృతికీ దారితీసిన నిర్దిష్ట సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాలున్నాయి. ప్రస్తుత పరిణామాలు ఆ కారణాలకి సంబంధించిన ప్రశ్నల్ని ముందుకుతెస్తున్నాయి. వ్యాధి కట్టడి, నివారణ విషయంలో తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలలో లోటుపాట్లని చర్చించే సమయంలో ఈ ముఖ్యమైన ప్రశ్నలగురించి కూడా మనం మాట్లాడుకోవాలి.

ప్రపంచీకరణ దిశ ఎటువైపు?

చరిత్ర కొంచెం చిత్రమైనది. మునుపు 1894లో కూడా చైనాలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. చైనా అసలు మారనే మారని ప్రాచ్యదేశమనీ, పాశ్చాత్య నాగరికతనుండీ, విజ్ఞానం నుండీ నేర్చుకోవడానికి అక్కడి ప్రజలు మూర్ఖంగా నిరాకరించి, తలుపులు మూసుకోవడం వల్లనే అక్కడ ప్లేగు వ్యాధి తలెత్తిందనీ ఆనాడు వలసవాదులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలలో వున్న వలసవాద, జాత్యహంకార దృక్పథాన్ని కాసేపు విస్మరిస్తే, ప్రస్తుతం చైనాలో వచ్చిన మార్పులు, అక్కడ తలుపులు బార్లా తెరిచిన విధానాల పర్యవసానంగానే ఇప్పుడీ విపత్తు ప్రపంచానికి కూడా పాకిందని తేలికగానే గుర్తించవచ్చు!

చరిత్రలో అంటువ్యాధుల వ్యాప్తితో ఎన్నో ఉత్పాతాలు సంభవించాయి. అయితే, విస్తృతి రీత్యా, విధ్వంస స్థాయి రీత్యా ఇంతపెద్ద విపత్తుని మనం చూస్తున్నాం. సూటిగా చెప్పుకోవాలంటే, ఇది ఉత్పత్తిలో, వాణిజ్యంలో, రవాణా, ప్రయాణ రంగాలలో ప్రపంచీకరణతో వచ్చిన పెను మార్పులతో ముడిపడివుంది. కలరా, మశూచి, ప్లేగు వంటి అంటువ్యాధుల వ్యాప్తితో మునుపు చరిత్రలో ముందుకొచ్చిన విపత్తులు కూడా వాణిజ్యం, రవాణా, సైనిక దాడులు, తీర్ధ యాత్రలవంటి వాటితోనే వ్యాప్తి చెందాయి. అయితే, ఇప్పుడు ప్రపంచీకరణతో పాటుగా వస్తువులనీ, మనుషులనీ అత్యంత వేగంగా సుదూర గమ్యాలకి చేర్చగలిగే ఆధునిక రవాణా సదుపాయాల మూలంగా వ్యాధికారక క్రిములు కూడా దేశదేశాలకి అంతే వేగంగా వ్యాపించే అవకాశం ఏర్పడింది. ఒక్క ఉదాహరణలో దీన్ని చూడవచ్చు. మధ్యయుగాలనాటి గుర్రపు బండ్లు, నౌకల ప్రయాణ వేగం సగటున గంటకు 10 మైళ్ళు ఉండేది. అదే, ప్రస్తుతం జెట్ విమానాలు అంతకు 50, 60 రేట్లు వేగంగా, గంటకు 500-600 మైళ్ళ వేగంతో ప్రయాణించగలుగుతాయి. దీనితో వ్యాధి కారక క్రిములు ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే, అంటే ప్రయాణించే వ్యక్తులలో వ్యాధి లక్షణాలు ఇంకా బయట పడక ముందే, ఆ వ్యాధి ప్రపంచ దేశాలన్నిటికీ వ్యాపించే అవకాశం కూడా ఏర్పడింది. ఇంతకుముందు కట్టడి చేశామనీ, నిర్మూలించగలిగామనీ అనుకున్న పాత అంటువ్యాధులు కొన్ని దేశాలలో తిరిగి తలెత్తుతున్నాయి. వీటికి తోడుగా ప్రపంచ దేశాలలో కొన్ని కొత్త అంటువ్యాధులు కూడా తలెత్తుతున్నాయి. వ్యాధికారక క్రిములని అవి తలెత్తిన, వ్యాపించిన కొన్ని దేశాల సరిహద్దుల లోలోపలే కట్టడి చేయగలుగుతామనే భ్రమలు ఇప్పుడు తొలిగిపోతున్నాయి. వ్యాధులనీ, క్రిములనీ ప్రాంతీయ, జాతీయ సరిహద్దులకు పరిమితమైనవిగా చూసే దృక్పథం నుండి బయటపడి, ప్రపంచ స్థాయిలో అవి వ్యాపిస్తున్న తీరుని అధ్యయనం చేయాలని ప్రస్తుత విపత్తు మనకు చెబుతున్నది.

ప్రస్తుత కరోనా విపత్తు, దాని కట్టడి విషయంలో దేశదేశాలలో చేపడుతున్న చర్యలలో ఒక వైరుధ్య భరిత సన్నివేశాన్ని మనం చూడవచ్చు. దాదాపు 200 దేశాలకు వ్యాపించిన ఈ ఉత్పాతం ఒక ప్రపంచ స్థాయి విపత్తు. అందుకని దీనిని, ప్రపంచ స్థాయిలో, వివిధ దేశాల మధ్య, అంతర్జాతీయ స్థాయి సంస్థల మధ్య సమన్వయంతో ఎదుర్కోవాల్సిన అవసరం వుంది. అదే సమయంలో, వ్యాధి వ్యాపించకుండా కట్టడి చేయడానికి తీసుకుంటున్న వాటిలో ఒక ముఖ్యమైన చర్య – ఆయా దేశాలు తమ, తమ సరిహద్దుల్ని మూసివేసుకోవడం. దేశాల మధ్య, దేశంలోని ప్రాంతాల మధ్యన రవాణా, ప్రజల ప్రయాణాలని నిలిపివేయడం. ఇదొక వైరుధ్య భరిత చిత్రం. ఇంకొక వైపు, చికిత్సకి అవసరమన్న మందులు, వ్యాధిని గుర్తించే పరీక్షా పరికరాలు, వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు, సాధారణ ప్రజలకి అవసరమైన మాస్కులు వంటి వాటికోసం ప్రపంచ దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని వుంది. మందుల కోసం అమెరికా బెదిరింపులకు దిగుతున్న వార్తలు వున్నాయి. వైద్య పరీక్ష పరికరాలున్న విమానాల దారి మళ్లింపు (హైజాకింగ్), సముద్ర మధ్యంలో నౌకల దారి మళ్లింపు, మాస్కుల కోసం ‘యుద్ధం’ అంటూ యూరప్, అమెరికా దేశాల మధ్య పోటీ గురించి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు, అందులో ఉపయోగిస్తున్న పదజాలం చూస్తే వనరుల కోసం, సంపద కోసం మునుపు చరిత్రలో దేశాల మధ్య జరిగిన దాడులు, యుద్ధాలు మళ్ళీ గుర్తుకురాక మానవు.

చరిత్రలో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం ఎప్పటినుంచో వున్నదే. అయితే, సోవియట్ యూనియన్, దాని ఉపగ్రహారాజ్యాల పతనంతో ప్రపంచీకరణ క్రమం ఊపు అందుకుంది. మునుపెన్నడూ ఎరగని స్థాయిలో ఉత్పత్తి, పంపిణీ రంగాలలో ప్రపంచీకరణ వేగం పుంజుకుంది. ఆర్ధిక వ్యవస్థలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సంబంధాలు పెరిగేయి. దీనితో, ‘ఉత్పత్తి, వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో భౌగోళికంగా తీవ్రమైన తేడా లూ, కేంద్రీకరణా పెరిగిపోయాయి. తయారీ, సేవా రంగాలలో ముప్పాతిక వంతు, వ్యవసాయంలో తొంభై శాతం ఉత్పత్తి కేవలం 15 దేశాలలో కేంద్రీకృతమై వుంది. వస్తువులు, సేవలు, వ్యవసాయ రంగాలని తీసుకుంటే, మొత్తం ప్రపంచ వాణిజ్యంలో ఐదవ వంతు వాణిజ్యం ప్రతీ రంగంలోనూ రెండు ప్రధానమైన దేశాల మధ్యనే జరుగుతూ వుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో కూడా ఇదే ధోరణి. ఇతర దేశాలలో పెట్టిన విదేశీ పెట్టుబడులలో 80 శాతంకి పైగా 15 దేశాలనుండే వస్తున్నది.'(పీటర్ డికెన్, గ్లోబల్ షిఫ్ట్, 2015)

ప్రస్తుత విపత్తుతో వివిధ రంగాల సరఫరా వ్యవస్థలలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. దీని ఫలితాలనే మనం చూస్తున్నాం. తమ సరఫరాలకు ప్రధానంగా చైనా మీదనే ఆధారపడిన సంస్థలు, పరిశ్రమలు బాగా దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నది. అయితే, కరోనా విపత్తు కేంద్రం మొదట చైనా నుంచి ఇప్పుడు ఇతర పాశ్చాత్య దేశాలకి మారింది. దీనితో, ముందుముందు ఆ దేశాల మీద కూడా ప్రభావం పడక తప్పదు. చరిత్రలో మునుపటి విపత్తులూ, వాణిజ్య యుద్ధాలూ ఇంతకు ముందు కూడా ప్రపంచ సరఫరా వ్యావస్థలని అతలాకుతలం చేశాయి. అయితే, ప్రస్తుత కరోనా విపత్తు ప్రభావం, దాని విస్తృతి, పర్యవసానాల రీత్యా మునుపెన్నడూ మనకి అనుభవంలోకి రాని విపత్తు.

ప్రపంచీకరణ అన్నది అడ్డూఅదుపూలేకుండా, అవిచ్ఛిన్నంగా, తిరుగులేని రీతిలో కొనసాగే క్రమమేమీ కాదు. ప్రపంచవ్యాపితంగా వివిధ దేశాలలో మితవాద, జాతీయ దురహంకార రాజకీయ శక్తుల ప్రాబల్యాన్ని మనం గడిచిన పదేళ్లలో చూస్తున్నాం. ప్రపంచీకరణ ఫలితాలు, విపరిణామాలపట్ల ఆయా దేశాలలో ముందుకొచ్చిన వ్యతిరేకతయే ఈ ధోరణుల ప్రాబల్యానికి పునాది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలం అంటే, 1919 – 1939 మధ్య పరిణామాలని చరిత్రలో ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. 1870 నుంచి 1913 వరకూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో సంబంధాలు అంతకు ముందు చూడని స్థాయిలో పెరిగాయి. అయితే , అవి ఆ తర్వాత కాలంలో తగ్గుముఖం పట్టాయి. మహా ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రతీ దేశమూ తమ తమ ఆర్ధిక వ్యవస్థలని పరిరక్షించుకునే ధోరణి పెరగడంతో అంతకుముందు కొనసాగిన క్రమం వెనక్కి మళ్ళి పోయింది.

ప్రపంచీకరణ క్రమం మీద కరోనా విపత్తు ప్రభావం ఎలా వుండబోతోంది? ‘మనం ఇంతవరకూ చూసిన ప్రపంచీకరణ క్రమం ముగిసిపోయింది, దానికి పూర్తిగా భిన్నమైన, ఒక కొత్త యుగంలోకి ఇప్పటికే మనం అడుగుపెట్టామం’టూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు కూడా. చైనా నుంచి తరలి వచ్చే తమ పరిశ్రమలకి ప్రోత్సాహాన్ని అందిస్తామంటూ ఒక ఉద్దీపన పధకాన్ని జపాన్ ఇప్పటికే ప్రకటించింది. ఇతర దేశాలు కూడా దీనినే అనుసరిస్తాయా? ఉత్పత్తి, పంపిణీ రంగాలలో లోతైన పరస్పర సంబంధాలు, ఆ సంబంధాలని తెగతెంపులు చేసుకోవడంలో తలెత్తే చిక్కులు, వీటిని దృష్టిలో ఉంచుకుంటే, భవిష్యట్ చిత్రపటాన్ని ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా వూహించడం తేలిక కాదు. అయితే, ప్రస్తుత విపత్తు నేపథ్యంలో, ప్రతీ దేశమూ, ప్రతీ రంగమూ, ప్రతీ పరిశ్రమా తమ తమ సరఫరా వ్యవస్థలని పునఃపరిశీలించుకుంటాయి. సరఫరా వ్యవస్థలలో తమ, తమ బలహీనతలని అధిగమించేందుకూ, ఇతరుల మీద (కనీసం ఒకే దేశం మీద) ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకూ ప్రయత్నిస్తాయి. ఈ క్రమం మనం ఇంతవరకూ చూసిన ప్రపంచీకరణ గతినీ, స్థితినీ, రూపురేఖలనీ మార్చక తప్పదు. ప్రపంచీకరణ విషయంలో ప్రస్తుత పునరాలోచనల నేపథ్యంలో మనం ఎంచుకోబోయే మార్గం ఏమిటి, అది ఎలా ఉండాలి? ఇది మనముందున్న ఒక ముఖ్యమైన ప్రశ్న.

ప్రజారోగ్యమా? ప్రయివేటు లాభార్జనా?

గత శతాబ్దపు చివరి దశకంలో ఊపందుకున్న ప్రపంచీకరణతో సన్నిహితంగా ముడిపడివున్న ఒక ముఖ్యమైన అంశం – వ్యవస్థాగత సర్దుబాట్ల పేరిట ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకులు వివిధ దేశాలపైన రుద్దిన ఆర్ధిక సంస్కరణలు. ఈ సంస్కరణల బలవంతపు అమలులో భాగంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా కుదించారు. ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సదుపాయాలని క్రమంగా ఎత్తివేశారు, ఆరోగ్య సేవలలో ప్రయివేటీకరణకి పట్టంగట్టారు. ఈ నయా ఉదారవాద దాడి ప్రజారోగ్య వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసింది. 2009 సంవత్సరంలో జరిగిన ఒక అధ్యయనం దీని పర్యవసానాలని స్పష్టంగా తెలియజేసింది. 1980 నాటి ఆయుర్దాయ ప్రమాణాన్ని ప్రారంభ బిందువుగా తీసుకుని, 2000 సంవత్సరం నాటికి అందులో వచ్చిన వాస్తవ మార్పులు ఒక వైపు, అందుకు భిన్నంగా 1980 నాటి పరిస్థితులు, లేదా అప్పటివరకూ కొనసాగిన ధోరణులే 2000 వరకూ కొనసాగివుంటే ఆ ఆయుర్దాయ ప్రమాణంలో ఎలాంటి మార్పులు వచ్చివుండేవో మరొక వైపు అంచనా వేసి పోల్చిచూశారు. దీనిప్రకారం తేలిందేమిటంటే, ఆ ఇరవై సంవత్సరాల కాలంలో మనుషుల ఆయుర్దాయంలో అంతకుముందు దాకా సాధించిన ప్రగతి నంతటినీ ప్రపంచీకరణ వెనక్కి నెట్టివేసింది. వైద్యశాస్త్రంలో అభివృద్ధితో మెరుగైన ఆరోగ్యంతో విజయం సాధిస్తే, ప్రపంచీకరణతోపాటు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఎయిడ్స్ వంటి ఇతర పరిణామాలు ఆ విజయాన్ని వెనక్కి నెట్టి వేశాయి. పెరిగిన ఆయుర్దాయాన్ని హరించివేశాయి. ఆర్ధిక వ్యవస్థలలో కీలకమైన మార్పులు చేపట్టిన దేశాలలోనూ, దక్షిణ సహారా ఆఫ్రికా దేశాలలోనూ ఈ నష్టాన్ని స్పష్టంగా గమనించారు. ‘సరళీకరణ- ప్రపంచీకరణ విధానాల దుష్పరిణామాలకీ, ఆర్ధిక విధానాల వైఫల్యానికీ, అనారోగ్యకరమైన పరిస్థితులకి అతి దగ్గరి సంబంధం ఉంద’ని ఆ పరిశీలన సూటిగా వెల్లడి చేసింది.

ఈ సంస్కరణలు వివిధ ప్రపంచ దేశాల మధ్య, ఆయా దేశాలలో ప్రాంతాలు, ప్రజల మధ్య వైద్య ఆరోగ్య సేవల అందుబాటు విషయంలో అసమానతలని మరింతగా పెంపొందించాయి. మునుపు వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంటువ్యాధులు ప్రబలంగా ఉండేవి. అభివృద్ధి చెందిన దేశాలలో అందుకు భిన్నంగా ఇతర వ్యాధులు, ప్రధానంగా జీవన శైలికి సంబంధించిన వ్యాధులు (అంటువ్యాధులు కాని మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్ వగైరా వ్యాధులు) ప్రబలంగా ఉండేవి. అయితే క్రమేపీ జనాభా మార్పులతో పాటు ఇతర ప్రపంచీకరణ పరిణామాలతో వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంటువ్యాధులతో పాటు, జీవన శైలికి సంబంధిన వ్యాధుల ప్రాబల్యం కూడా పెరగడం మొదలైంది. వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్ధిక సంస్కరణలు ప్రజారోగ్య వ్యవస్థల్ని విధ్వంసం చేయడంతో అక్కడ మునుపు ఒక మేరకి అదుపులోకి వచ్చిన అంటువ్యాధులు తిరిగి అక్కడక్కడా తలెత్తడం ప్రారంభమైంది (ఉదా: మలేరియా, పోలియో, క్షయ). కొత్తగా ముందుకొచ్చిన అంటువ్యాధులు (ఉదా: ఎయిడ్స్) వీటికి తోడయ్యాయి. జీవనశైలికి సంబంధించిన వ్యాధులు పెరగడంతో అది ప్రయివేటు ఆరోగ్య సేవలకు మంచి లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. ఆరోగ్యసేవలు అందుబాటులో ఉండాలన్న భావన స్థానంలో, ఇన్సూరెన్సు, డబ్బుల చెల్లింపు తోటే ఆరోగ్య సేవలు అందుతాయన్న ఆలోచనలు ముందుకొచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు పెద్దగాలేని ప్రాంతాలలో నిధుల లేమి, సిబ్బంది కొరత కారణంగా ప్రాధమిక ఆరోగ్య సదుపాయాలు కుదించుకుపోగా, నగరాలలో కార్పొరేట్ పెట్టుబడులతో ప్రత్యేక ఆసుపత్రులు, ప్రవేటు రంగంలో తామరతంపరగా ముందుకురావడం మొదలైంది. ఆరోగ్య సేవలు అత్యధికులకు అందుబాటులో లేకుండా పోవడం మొదలైంది. జబ్బు పడితే జేబుకు చిల్లిపడే ఖరీదైన వైద్యంతో పేద ప్రజలు, కార్మికులు మరింత నిరుపేదలుగా మారిపోయారు.

భారతదేశ ఆరోగ్యవ్యవస్థ కూడా ఇదే దిశలో ప్రయాణాన్ని కొనసాగించింది. 1946నాటి భోర్ కమిటీ సిఫార్సుల నుంచి చాలా దూరమే ప్రయాణించింది. సామాజిక న్యాయం, సమాన సేవలు, వ్యాధుల చికిత్స, నివారణలో ప్రజల భాగస్వామ్యం, ఆరోగ్య సేవలలో గ్రామీణ ప్రజల అవసరాలకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి సూత్రాల మీద ఆధారపడినవే భోర్ కమిటీ సిఫార్సులు. అయితే ఆచరణ మాత్రం అందుకు భిన్నంగానే కొనసాగింది. ఆరోగ్య రంగానికి కేటాయింపులు చూస్తే, ఆ సిఫార్సులలో సూచించిన దానికంటే చాలా తక్కువ మొత్తాన్ని కేటాయించారు. కాలక్రమంలో ప్రాధాన్యతలు కూడా మారేయి. ఉదాహరణకి తీసుకుంటే, ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తంలో అంటువ్యాధుల నివారణకు మొదటి ప్రణాళికలో 28.4% కేటాయించగా, ఎనిమిదవ ప్రణాళిక నాటికి అది 4.2% కి దిగజారింది. అదే సమయంలో కుటుంబ నియత్రణకి కేటాయింపులు 1.3% నుండి 26% కి పెరిగాయి. వ్యవస్థాగత సర్దుబట్ల కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య రంగంలో చేపట్టిన సంస్కరణలు దేశంలో ఆరోగ్య సేవల రూపురేఖలనే మార్చివేశాయి. 2005 నాటికి ఆరోగ్య సేవలలో 80% ప్రయివేటు రంగంలోనే అందుతున్న స్థితికి మనం చేరుకున్నాం. ఇక 2015 నాటికి ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ముందుకొచ్చింది. పబ్లిక్ రంగంలో ఆరోగ్య సేవలని పెంపొందించాలన్న ప్రస్తావన పైన అది విరుచుకు పడింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తయారు చేసిన జాతీయ ఆరోగ్య విధాన ముసాయిదాపై నీతి ఆయోగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ లేఖ రాసింది. ప్రవేటు రంగాన్ని నీతి ఆయోగ్ లేఖ దాపరికం లేకుండానే సమర్ధించింది. అందరికీ ఉచిత ఆరోగ్య సేవలు అన్న భావన ఒక అందమైన, అసాధ్యమైన కల అని అది కొట్టిపారేసింది!

విపరీతంగా పెరిగిన ఆరోగ్య సేవల ధరలు, వైద్యం కోసం వున్నదంతా వూడ్చిపెట్టక తప్పని పరిస్థితులలో జనం అల్లాడుతుంటే లాభపడిందెవరు? పెట్టుబడుల మదుపుపై రేటింగ్ ఇచ్చే సంస్థ ఐసీఆర్ ఎ విశ్లేషణ ప్రకారం, మార్చి 2017 నాటికి, దేశంలోని ఐదు అతి పెద్ద గొలుసు ఆసుపత్రుల ఆదాయం రూ. 12,990 కోట్లకి చేరింది. మార్చి 2012 నాటికి వాటి ఆదాయంతో పోల్చితే, ఐదేళ్ల కాలంలో ఇది 80% పెరుగుదల. లాభాలనే తీసుకుంటే 2012 నాటికి రూ. 770 కోట్లు వున్న వాటి లాభం 2017లో రూ. 1890 కోట్లకి చేరుకుంది. అంటే వాటి లాభాలలో ఇది 68.75% పెరుగుదల. ఆరోగ్య రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి చెప్పుకోకుంటే ఈ కథ పూర్తికాదు. 2012-2017 కాలంలో ఆరోగ్య సేవలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రికార్డు స్థాయిలో, అంటే 169% పెరిగాయి.

గత మూడు దశాబ్దాల కాలంలో ప్రజారోగ్య సదుపాయాలు క్షీణిస్తూ ఉంటే, ప్రయివేటు ఆరోగ్య సేవల విస్తరించాయి. వాటి లాభాలు పెరిగిపోయాయి. ఈ రెండింటి మధ్య దగ్గర సంబంధం వుంది. కరోనా విపత్తులాంటి వాటిని ఎదుర్కోవడానికి మన ఆరోగ్య సదుపాయాలు ఎంత మాత్రమూ సరిపోవని ప్రస్తుత సంక్షోభం రుజువు చేసింది. ఇదేదో కరోనా ఉత్పాతం ఆకస్మికంగా రావడంతో తలెత్తిన గడ్డు పరిస్థితి కానే కాదు. దశాబ్దాలపాటు ప్రజారోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేసిన నిర్లక్ష్యం, పాత, కొత్త అంటు వ్యాధుల వ్యాప్తిని పసిగట్టి కట్టడి చేయడంలో ప్రదర్శించిన అలసత్వం, లాభార్జనే లక్ష్యంగా ముందుకొచ్చిన ప్రవేటు ఆరోగ్య సంస్థల అభివృద్ధి – వీటన్నిటి పర్యవసానమే ప్రస్తుత దుస్థితి. ప్రయివేటు ఆరోగ్య రంగం – అత్యాధునిక సాంకేతికత మీద ఎక్కువగా ఆధారపడింది, అది లాభసాటి వ్యాపారం పైన, వ్యక్తుల జీవనశైలి వ్యాధుల పైన, అత్యాధునిక యంత్రాలు, ఖరీదైన పరికరాలతో రోగులని ప్రాణాపాయ స్థితినుంచి కాపాడే చికిత్సపైన, ఐదు నక్షత్రాల సౌకర్యాల పైన కేంద్రీకరించిన వైద్యం. ఇన్సూరెన్సు వ్యాపారంతో చెట్టపట్టాలు వేసుకున్న వ్యాపారం అది. ప్రజారోగ్య వ్యవస్థ దీర్ఘకాల నిర్లక్ష్యంతో మంచం పట్టిన వాస్తవాన్ని సూటిగా ముందుకు తెచ్చిన విపత్కర పరిణామమే ప్రస్తుత విపత్తు. లాభార్జనపైనా, వ్యక్తిగత సేవలపైనా కేంద్రీకరించిన ప్రయివేటు ఆరోగ్య రంగం ఇటువంటి విపత్తులని ఎదుర్కోవడానికి ఉపయోగపడవని ఇప్పటికైనా గుర్తించడం అవసరం. వైద్య, ఆరోగ్య సేవలలో ప్రాధాన్యతలనీ, లక్ష్యాలనీ పునర్నిర్వచించుకోవాల్సిన ఈ సమయంలో మనం ఎంచుకోవలసిన మార్గమేమిటి? ఇది మనముందున్న రెండవ ముఖ్యమైన ప్రశ్న.

ఎచటికి పొతామీ రాత్రి? పెనం నుంచి పొయ్యిలోకేనా??

అవునూ, ఆకాశాన్ని కళ్ళతో చూసేందుకు
మనిషి ఎన్ని సార్లు తల పైకెత్తి చూడాలి?
అవునూ, మనుషుల రోదనలు వినిపించాలంటే
మనిషికి ఎన్ని చెవులు కావాలి?
అవునూ, చాలామంది చనిపోయారని తెలియాలంటే
ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలి?

– బాబ్ డిలాన్

కరోనా విపత్తుని ఎదుర్కోవడంలో వేటిని ఎంచుకోవాలి, వేటిని త్యాగం చేయాలి, ఎవరు త్యాగం చేయాలి, ఎవరిని త్యాగం చేయాలి అనే ఇబ్బందికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలాసార్లు ప్రశ్నలు వేసుకోకుండానే జవాబులు ఎంచుకుంటున్నారు. ‘ఇది యుద్ధమే కదా, తప్పదు కదా’, ‘పెను విపత్తునుంచి మానవాళిని తపించాలంటే, కఠినమైన, కఠోరమైన నిర్ణయాలు తప్పవుకదా, చిన్నచిన్న త్యాగాలు తప్పనిసరికదా’ అన్న అన్న తర్కంతో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే, 1897 వలస పాలన నాటి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ని అమలులోకి తెస్తున్నారు. 21వ శతాబ్దపు వ్యాధి కట్టడికోసం 19వ శతాబ్దపు నిరంకుశ చట్టాన్ని అమలులోకి తేవడం ఒక చారిత్రిక పరిహాసం. 1897లో బొంబాయి నగరంలో ప్లేగు వ్యాధి కట్టడిలో బ్రిటిష్ వలస పాలకుల విధానాలని విమర్శించిన నేరానికి బాల గంగాధర తిలక్ ని పద్ధెనిమిది నెలలపాటు కారాగార శిక్ష విధించి, నిర్బంధించారనే విషయాన్ని గుర్తుంచుకుంటే మన ప్రయాణం ఎటువైపు సాగుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. దీనిని ఒక పీడకల లాంటి చరిత్ర జ్ఞాపకం అని సరిపెట్టుకోలేము. విషయాలని చర్చించుకుంటే, చరిత్రని గుర్తుపెట్టుకోకుంటే, భవిష్యత్తు కూడా ఒక పీడకలగానే పునరావృతమయ్యే ప్రమాదం వుంది.

అనేక దేశాలలో, ప్రాంతాలలో వ్యాధి వ్యాప్తికి కారణమంటూ జాతి, మత దురహంకారాలని రెచ్చగొడుతున్న విద్వేష ప్రచారంతో వాతావరణం విషపూరితంగా మారింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు సైతం అలాంటి ప్రచారాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితి వుంది. మరొక వైపు వ్యాధి వ్యాప్తిని కట్టడి చేసే పేరిట వ్యక్తుల కదలికలపై నిఘా వేసే సాంకేతికతని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చైనా అలాంటి సాంకేతికతని ఉపయోగించింది. మనదేశంలోనూ ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. భారత పౌరులందరి కదలికలనీ నిఘా పరిధిలోకి తేవడమే కాక, కుటుంబసభ్యులు, స్థిరచరాస్తులు, లావాదేవీలన్నిటి వివరాలని సేకరించే సమగ్ర సమాచార సేకరణకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. తెరవెనక తెలియకుండా, నిఘా నీడలో పౌరుల స్వేచ్ఛని కాలరాయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూనే వున్నాయి. పద్ధెనిమిదవ శతాబ్దపు బ్రిటిష్ సామాజికవేత్త జెరెమీ బెంథామ్ ఖైదీల పర్యవేక్షణకు ప్రతిపాదించిన కట్టడంలాంటి సమాచార నిఘా యంత్రాంగాన్ని ఉనికిలోకి తేవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. కరోనా విపత్తు దీనికొక సాకుగా, ముసుగుగా మారిపోయింది. మానవ మనుగడకు, అస్తిత్వానికే ప్రమాదం ముందుకొచ్చిన సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత వంటివాటిని వదులుకుంటే, త్యాగం చేస్తే తప్పేముందన్న సమర్ధనలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక చర్చ ఉండేది. వామపక్ష భావజాలం వ్యక్తి స్వేచ్ఛకి విరుద్ధమైనదనే విమర్శ ఉండేది. అలాంటి విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు నిరంకుశ నిఘా నేత్రాలకి సమర్ధకులుగా మారడం ఒక వైచిత్రి. కరోనా విపత్తు కట్టడి పేరుతో ముందుకొచ్చిన ఈ యంత్రాంగం, సమాచార సేకరణ అక్కడితో ఆగిపోదన్న విషయం మనం గుర్తించాలి.

కరోనా విపత్తుని కట్టడి చేసే బాధ్యని ఎక్కువభాగం శాంతిభద్రతల యంత్రాంగానికి అప్పగించేసి, దాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చిన వైఖరులని మనం చూస్తున్నాం. దీనికి మరొక పార్శ్వం కూడా వుంది. ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఉద్యోగుల, కార్మికుల హక్కులని క్రమంగా హరించివేసే ప్రయత్నాలు ముమ్మరం కానున్నాయి. షిఫ్ట్ పనిగంటలని పన్నెండు గంటలకు పెంచాలనే ప్రయత్నాలు ఇందులో భాగమే. వేతనాల్లో కోత, వాయిదా, కరవుభత్యం పెంపుదలని స్తంభింపజేయడం వంటివి మున్ముందు రానున్న చర్యలకి సంకేతాలు మాత్రమే.

చప్పట్లు, దీపారాధనల సంగతటుంచితే, లక్షలాదిమంది వలస కార్మికుల కడగండ్లని దేశమంతా మౌనంగా చూస్తూనే వుంది. కరోనా విపత్తు కట్టడి కోసం కొందరికి, కొంతకాలంపాటు కష్టాలు తప్పవని జవాబు చెబుతున్నారు. కొందరి ప్రాణాలు కాపాడడానికి కొందరిని పణంగా పెట్టవలసిందేనని వాదించడమే ఇది. ఎవరి ప్రాణాలకోసం ఎవరు మూల్యం చెల్లించాలి? ఈ నిర్ణయం తీసుకుంటున్నదెవరు? ఇలాంటి నిర్ణయాలు రహస్యంగా, బహిరంగంగా జరుగుతూనే వున్నాయి. వైద్య సదుపాయాల కొరతతో, అందరికీ చికిత్స అందించలేని పరిస్థితులలో ఇటలీలో వృద్ధులని చావుకు వదిలేశారు. అమెరికా వృద్ధులు చావుకు సిద్ధపడాలని కొందరు రాజకీయ నాయకులు బహిరంగంగా పిలుపునిచ్చారు. ఇతర చోట్ల, అంత సూటిగా, బహిరంగంగా ప్రకటించక పోవచ్చు. దానర్ధం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కాదు, అలాంటి ఎంపికలు జరగడం లేదని కాదు. పేదవాళ్ళు, వృద్ధులు, కూలీలు, కార్మికులు, పీడితులపైన త్యాగాల భారం మోపుతున్నారు. ప్రాణం పేరుతో కొందరి జీవితాలని హరిస్తే, జీవితం పేరుతో జీవికని నిరాకరిస్తే, జీవిక పేరుతో స్వేచ్ఛని కాలరాస్తే అది స్వేచ్ఛా సమాజం అనిపించుకోదు, సమాధుల వరుస అవుతుంది..సమాధుల వరుసని మనం ఎంచుకోవాలా? నిరాకరించాలా? ఇది మనముందున్న మూడవ ముఖ్యమైన ప్రశ్న.

18, 19, 20వ శతాబ్దాలలో సంక్షోభాలు, విపత్తులు ఎదుర్కోవడంలో మానవ సమాజం మూల్యం చెల్లించింది. విలువైన అనుభవాలూ లభించాయి. 21 శతాబ్దంలో ఎదురైన ప్రస్తుత విపత్తుని ఎదిరించడంలో మునుపటి పద్ధతులు, మార్గాలనే ఎంచుకోవాలా, వాటిని అధిగమించే నిర్ణయాలు తీసుకోవాలా అన్నదే మన ముందున్న అసలు సమస్య.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

5 thoughts on “వ్యాధి, విధ్వంసం, విలయం, అవి లేవనెత్తుతున్న కొన్ని ప్రశ్నలు…

  1. మంచి విశ్లేషణ. శాస్తీయం గాను మానవీయంగానూ ఉంది

    1. ఒక సంక్షోభాన్ని ఎన్ని కోణాల్లో చూడాలో దాదాపుగా అన్నింటినీ తడిమి చూపించిన లోతైన వ్యాసం. సంక్షోభ సమయాల్లో పాలకులు ఒకానొక స్వభావం కలిగిన సమస్యను మరొక సమస్యగా చూపడానికి ఎలా రంగులు పూస్తారో, తమ అసమర్థతను కప్పిపుచ్చుకోడానికి ఎలా వినియోగించుకుంటారో, జాతి దేశం వారసత్వం లాంటి ఉద్వేగాలను రెచ్చగొట్టి తమ ఓటు బ్యాంకును ఎలా పదిలం చేసుకుంటారో, కార్పోరేట్ల కొమ్ము ఎలా కాస్తారో గుట్టు విప్పిన వ్యాసం. విపత్తుల్ని వ్యాపారులు ఎలా నగదుగా మార్చుకో జూస్తారో కళ్ళకు కట్టారు రచయిత. అలా యువతకు ముఖ్యంగా వర్ధమాన రచయితలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రచయిత సుధా కిరణ్ గారికి ధన్యవాదాలు.

  2. Very analytical article written with historical perspective. Also deals the failures of developed& developing states failures, hardships of poor people.Article addresses the evils of globalisation that caused privatisation of health sector. Deeply touched all issues of pandemic. Congrats to Sudakiran for his thoughtprovaking article

  3. డియర్ కిరణ్ కరోనా పైన నీ విశ్లేశణాత్మక చాలా విషయాలను స్పృశించింది. అదృశ్య క్రిమి పేరున జరుగుతున్న ఆర్ధిక, రాజకీయ, సాంఘీక క్రీడల గురించి, ప్రపంచ దేశాల మధ్య వున్న సంభందాలు, మారబోయే లేదా రాబోయే పరిణామాలగురించి విపులంగా ఈ వ్యాసం లో చర్చించబడింది. ఈ కష్టసమయాల్లో సైతం పాలకులు లేదా వారి అనునాయులు చేస్తున్న అబద్దపు ప్రచారాలను ఎండకట్టడంలో, పాటకులను ఎడ్యుకేట్ చేయడం లో ఈ వ్యాసం చాల ఉపయోగంగా వుంది, అందుకు నీకు అభినందనలు.

  4. లోతైన విశ్లేషణ చాలా స్పష్టంగా, సూటిగా చెప్పినారు. పాలకులకు అర్థం కాకున్నా, చదివిన ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తు ఊహించుకునే అవకాశం కల్పిస్తుంది.

Leave a Reply