వెలుగు దారుల మిణుగురులు ఈ పుస్తకాలు

2020లో నేను చదివిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయని చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. గత ఏడాది చివర్లో ప్రారంభం అయిన సి‌ఏ‌ఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొవటం ఒక్కటే కాదు, దాని తాలూకూ వార్తలనూ విశ్లేషణలనూ ఫాలో అవుతూ పోవడం, ఆ తరువాత జరిగిన ఈశాన్య ఢిల్లీ దాడులు -ఆ వరవడిలో పడి కొట్టుకొని పోతూ కూడా పుస్తకాలు చదివే ఆనందాన్ని కోల్పోయాను. కరోనా కాలం సృష్టించిన అలజడి మనశ్శరీరాలను ఒక దగ్గర ఉంచక వేరే చోట్లకు మోసుకొని పోయింది. సరే ఎన్ని చెప్పుకొన్నా, చదవాల్సినన్ని పుస్తకాలు ఈ సంవత్సరం చదవలేదు. 80 శాతం చదువు, 20 శాతం రాత అనే నిష్పత్తి ఈసారి పుస్తకాల విషయంలో వర్తించలేదు.

మొన్న ఎవరో అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి, ఎవరిదో దృష్టి కోణం మనం ఎందుకు తెలుసుకోవాలి, మన కామన్ సెన్స్ కు తట్టినవి చాలవా అని రాసింది చదివాను. ఒక విషయంలో నిర్ధారణకు రావటానికి మన కామన్ సెన్స్ సరిపోదు. మన అనుభవాల ద్వారా పొందిన జ్ఞానాన్ని ఆత్మానుగతం చేసుకోనే ముందు, ఇతరుల అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మన కామన్ సెన్స్ చాలాసార్లు తప్పు నిర్ధారణలు చేయిస్తుంది. ఆఫ్టర్ ఆల్ అది కూడా భౌతిక చర్యల వలన వచ్చిన జ్ఞానమే కదా. మనం పొందామనుకొన్న జ్ఞాన సారంలో కల్తీని కనిపెట్టే ఆకురాయిలే పుస్తకాలు. ‘No book is bad’ అని అందుకే అంటారు. సమయం చాలక కానీ, పుస్తకాలు అన్నీ చదవాల్సినవే. పుస్తకం అంటే కాగితాల సమూహం కాదు. కొన్నిఅనుభవాల సారం.

‘How to read’ అనే పుస్తకంలో ఈ విషయాలను బాగా చర్చించారు. పుస్తకాన్ని చదివేటపుడు రచయిత చెప్పదలుచుకొన్న విషయాన్ని యధాతథంగా గ్రహించటం ఒక ముఖ్య విషయం. అతను ప్రతిపాదించిన విషయాన్ని మనం అంగీకరిస్తామా లేదే అనే సంగతి వేరే విషయం. పుస్తకం ఏ విషయాన్ని చెబుతుంది? దానికి ఉన్న సార్వజనీయత ఎంత? ఆ విషయం ఎంతవరకూ నిజం అనే విషయాలను గ్రహిస్తే -ఆ పుస్తకం గురించి విమర్శనాత్మకంగా చదవగలం అంటారు రచయితలు మొర్టిమార్ జె అద్లార్, చార్లెస్ వాన్ డోరెన్ లు.

చదవటంలో శిక్షణ పొందిన మెదడుకు విశ్లేషణాశక్తి, విమర్శనాశక్తి పెంపొందుతాయి. చర్చించే లక్షణం పదునౌతుంది. చర్చలు చేయటానికి సహనం పెరిగి -వాదనలను సహనంగా, సానుభూతిగా డీల్ చేసే అవకాశం ఇస్తుంది. మన అభిప్రాయాలను ఇతరుల పైన జంతు ప్రవృత్తితో రుద్దే అలవాటుకు చెక్ పెడుతుంది. ప్రతి విషయాన్ని నిజమా కాదా అనే నిర్ణయించటానికి హేతువుకే అధికారం ఉంటుందని నేర్చుకొంటాము. ప్రతి వివాదంలోనైనా హేతువూ, రుజువు- ఈ రెండూ మాత్రమే వాదించుకొంటాయని తెల్సుకొంటాము. న్యాయమైన విషయాలను అభిప్రాయబలంతో నిర్ణయించలేము. హేతువుకు మనం తలవంచాల్సిందే.

‘మంచి పుస్తకాలు చదవటం అనే ప్రక్రియ పుస్తకాన్ని మూసి వేయగానే అంతటితో ముగిసిపోకూడదు. పుస్తక పఠనం ఒక గౌరవప్రదమైన మానవ జీవితం గడపటానికి సోపానమవ్వాలి. పుస్తక పఠనం మనిషి స్వేచ్ఛా మానవుడిగా, స్వేచ్ఛాపౌరుడిగా బతకటానికి తోడ్పడాలి. అంటే అలాంటి బతుకు కోసం, పుస్తకం చదివిన పాఠకుడు ఏమి చేయాలో అది చేయాలి’ అని చెబుతారు పై రచయితలు.

చదవటం, చదవటం ద్వారా ఆలోచించటం, నేర్చుకోవటం- ఇవన్నీ ఆ పుస్తకాన్ని సరిగ్గా చదివిన వారికే సాధ్యమౌతాయి. మనం మానవ జీవితం గడపాలంటే ఆలోచించటం, నేర్చుకోవటమే కాదు ఇంకా కొన్ని చేయాల్సి ఉంటుంది. కార్యాచరణ జరగాలి. మన విరామ సమయాన్ని ఆసక్తి లేని విషయాలకు దాచుకొంటే మన ఆచరణాత్మ బాధ్యతలను కుదించుకొన్నట్లే. తెలివైన భావ ప్రసారం ద్వారా మనుషులు స్నేహితులు అవుతారు. అలాంటి భావ ప్రసారం, అభిప్రాయ ప్రకటన, కామన్ ఐడియాలనూ ఉద్దేశ్యాలను చెప్పుకోవటం ఒక మంచి సమాజంలోనే సాధ్యమౌతుంది. అభిప్రాయాలు వెల్లడించలేని పిరికితనం, దుర్మార్గాలను ఖండించలేని అస్సహాయిత ఉన్న సమాజంలో భాగమౌతూ, రాజీ పడిపోతూ వుంటూ పుస్తకాలు చదవటం వలన పెద్ద ప్రయోజనం ఉండదంటారు ఈ రచయితలు.

మంచి సమాజం కోసం పని చేయటానికి పుస్తక పఠనం తోడ్పడాలి. ఒక మంచి పుస్తకం చదవటం పూర్తికాగానే, చెప్పులు వేసుకొని వీధులు వెతుక్కొంటూ న్యాయమైన పోరాటాలు జరుగుతున్న దగ్గరకు వెళ్లిపోగలగాలి. అప్పుడే ఆ పుస్తక పఠనానికి సార్ధకత ఉంటుంది.

2020లో కొన్న పుస్తకాలు ఎక్కువ. చదివినవి తక్కువ. ఏదైనా రాసేటపుడు అవసరం అయినంత వరకూ ఒక పుస్తకంలో కొన్ని అంశాలు మాత్రమే చదవటం ఎక్కువగా జరిగింది. అలా కాకుండా పూర్తిగా చదివిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి.

  1. 2020లో జనవరి 1న, నా పుస్తక పఠనం శ్రీకాంత్ కవిత్వంతో ప్రారంభమయ్యింది. సి‌ఏ‌ఏ ఉద్యమంలో మహిళలు ఉదృతంగా పాల్గొంటున్నపుడు, దేశం స్త్రీ అయి ప్రతిఘటిస్తున్నప్పుడు, మనశ్శరీరాలు గాయమయ్యి ఆగ్రహం స్రవిస్తున్నప్పుడు, శ్రీకాంత్ ఇంటి గుమ్మంలో వాలి పిలిచాడు. స్త్రీవంటూ, ఆమె అంటూ, అమ్మా అంటూ, గాయబడ్డ ఆమెను కృతజ్ఞతలతో, స్వాంతనతో, ఆర్తితో పలకరించాడు. ప్రతీకలకందని ఆమెను ఆమె వాస్తవ కొలతలతో కీర్తించాడు.
  2. ఈ సంవత్సరం నేను ఎక్కువగా non fiction చదివాను. కశ్మీర్ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాను. అలా చదివిన ఒక పుస్తకం Kashmir: The Unwritten history By Christopher Snedden. రచయిత ఒక ఆస్ట్రేలియన్. వాస్తవం ఎప్పుడూ హిమాలయాల్లో ప్రవహించే నదుల నీటి అడుగులాగా స్పష్టంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా కనిపిస్తుంది. అవాస్తవం ఎప్పుడూ తార్కికత, స్పష్టత లేక అల్లాడుతూ ఉంటుంది అని నిరూపించే పుస్తకం ఇది. ఎంతో పరిశోదన చేసి 2013లో రాసిన ఈ పుస్తకంలో, సగభాగం ఆయన రాసిన వాటికి ఆధారమైన డాక్యుమెంట్స్ ను చేర్చి పుస్తకానికి పూర్తి విశ్వసనీయత తెచ్చాడు. 1947 ఆగస్టు 14,15లలో భారత, పాకిస్తాన్ లకు స్వాతంత్ర్యం వచ్చి సంబరాలు జరుగుతున్నపుడు జరిగిన విభజన, హింస గురించి కొంత మనకు తెలుసు. కానీ అదే సంవత్సరం ఆగస్టు నెల మొదటి నుండి నవంబర్ చివరి వరకు జమ్మూకశ్మీర్ లలో జరిగిన హింసలో 200000 ల మందికి పైగా ముస్లిములు మరణించారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. లక్షల్లో ఒక మతానికి సంబంధించిన మనుషులు చంపబడటం, మహిళలను అపహరించి అమ్మటం -కశ్మీర్ విలీన సందర్భంగా ఫ్యూడలిజం, ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్న దిశగా మారుతున్నప్పుడు జమ్మూకశ్మీర్ కు -ఇచ్చిన కానుక. ఇది ప్రజల మధ్య జరిగిన హింస కాదు. సాక్షాత్తు అప్పటి డోగ్రా హిందూ ప్రభుత్వం కక్ష కట్టి తన సైన్యం ద్వారా జరిపించిన మారణకాండ. ఈ హింస తరువాత జమ్మూ ప్రాంతంలో ముస్లిముల శాతం 60 నుండి 30కి తగ్గిపోయింది. జమ్మూ కశ్మీర్ అంతా ఒకే ప్రదేశంగా చూడటం తప్పంటాడు స్నిడెన్. కశ్మీర్ గురించి తెలుసుకోలంటే చదవాల్సిన పుస్తకాల్లో ఇది ఒకటి. ఆజాద్ కశ్మీర్ ఏర్పడటానికి కారణాలు, హరిసింగ్ హడావుడిగా విలీన సంతకం చేయటానికి ప్రధానమైన కారణమని చెబుతున్న పాకిస్తాన్ గిరిజన తెగల దండయాత్ర, ఈ ఉద్యమంలో పాకిస్తాన్ పాత్ర ఎంతవరకూ అనే విషయాలను చక్కగా వివరిస్తుందీ పుస్తకం.
  3. అలాంటిదే ఇంకో పుస్తకం Victoria Schofield రాసిన Kashmir in Conflict. విక్టోరియా స్కాఫీల్డ్ బ్రిటిషర్. భారత దేశ విభజన రాజకీయాల్లో కశ్మీర్ ఎలా పావుగా మారిందో రాసిందామె. నెహ్రూకు కశ్మీర్ మీద ఉన్న మోజు, షేక్ అబ్ధుల్లాతో అతను చేసిన స్నేహం -కశ్మీర్ ప్రజలకు ఎలా ప్రాణంతకాలుగా మారాయో ఈ పుస్తకంలో చెబుతుంది ఆమె.
  4. కేంద్ర ప్రభుత్వం చైనా యుద్ధం ప్రహసనాన్ని మొదలు పెట్టినపుడు Servant of Sahibs పుస్తకం భారతదేశమంతా చాలామంది చదివారు. నేనూ చదివాను. ఈ పుస్తక రచయిత గులాం రసూల్ గల్వాన్. ఇండియా చైనా బార్డర్ లో నడిచిన తన జీవితాన్ని గురించి ఆయన తనకొచ్చిన బ్రోకెన్ ఇంగ్లీష్ లో రాశాడు. ఈ పుస్తకాన్ని అప్పటి రసూల్ యజమాని (సాహిబ్) అయిన ఆంగ్లేయుడు ‘యోన్ గూస్ బాండ్’ భార్య ‘ఫ్రాన్సి యోన్ గూస్ బాండ్’ ప్రచురించింది. అతని చేతనే అతని జీవిత చరిత్రను రాయించి, అనేక సంవత్సరాలు దాన్ని ఎడిట్ చేసి ప్రచురించారు. మొత్తం 14 సంవత్సరాల కాలం ఈ పుస్తకం తయారీకి పట్టింది. తెలిసిన విషయం చెప్పటానికి భాష అంత ఎక్కువగా అవసరం లేదని ఈ పుస్తకం చెదివితే అర్ధం అవుతుంది. 18వ శతాబ్ధం చివరి భాగం, 19శతాబ్దం ముందు కాలం నాటి పరిస్థితులు, దుర్బేధ్య దారుల్లో లేహ్ నుండి అప్పటి యార్ఘండ్ కు ప్రయాణం ఇవ్వన్ని కళ్లకు కట్టినట్లు అతను రాశాడు. ఈ యార్ఘండ్ పట్టణం దగ్గరే ఇప్పుడు ఉయింఘర్లు ఉన్నారు. ఈ ముస్లిం మైనారిటీలను కశ్మీరీలాగానే చైనా అణచివేస్తుంది. దాదాపు 10 లక్షల మంది ఉయింఘర్లను re education పేరుతో కాన్సన్ట్రెషన్ కాంపుల్లో పెట్టింది. ఈ ప్రాంతం ఇప్పటి జిన్ జియాంగ్ రాష్ట్రం (గతంలో ఈస్ట్ టర్కిస్తాన్) లో ఉంది. ఇప్పుడు వివాదంలో ఉన్న అక్సాయి చిన్ నుండి గల్వాన్ నది ప్రవహిస్తుంది. ఈ నదికి, ఆ లోయకూ ఆ పేరు రసూల్ గల్వాన్ వలనే వచ్చింది. గత జమ్మూ కఃశ్మీర్ రాష్ట్రానికి చెందిన లోయ ఇప్పుడు మనకులేదు.
  5. కశ్మీర్ మూడు దశాబ్ధాలుగా మిలటరీ పహరాలో ఉంది. దాదాపు లక్షమంది యువకులు చనిపోయారు. పదివేల మంది అదృశ్యమయ్యారు. భర్తలు అదృశ్యమైన (చనిపోయిన కాదు) భార్యల జీవితాలు ఎలా ఉంటాయి? కొడుకు తిరిగి వస్తాడని ఈ మూడు దశాబ్ధాలుగా కళ్లు కాయలు కాసేటట్లు ఎదురు చూస్తున్న తల్లి కళ్ల లోతును కొలిచేదెవరు? Ather Zia తన పుస్తకం ‘Resisting Disappearance’ లో ఈ విషయాన్ని చర్చించింది. కశ్మీర్ జీవితాన్ని చిందరవందర చేసిన రాజకీయ హింస గురించి ఇక్కడ ప్రతి ఇల్లూ ఒక కథ చెబుతుంది. APDP (Association of Parents of Disappeared Persons) సభ్యురాలిగా Ather Zia అనేకమంది బాధిత మహిళలను కలిసి వారి కథనాలను డాక్యుమెంట్ చేసింది. Ather Zia స్వయానా ఒక కవయిత్రి కూడా. ఆమె ప్రతిఘటనా కవిత్వం అంతర్జాతీయంగా పేరు తెచ్చుకొన్నది. ఈ పుస్తకంలో ప్రతి వాక్యంలో ఆ కవితాత్మక పదును ఉంటుంది.
  6. షాహిన్ బాగ్ లో మహిళలు నిర్వహించిన అపూర్వ ఉద్యమానికి కరోనా వలన విరామం వచ్చింది. ఈ ఉద్యమానికి సంబంధించి రెండు పుస్తకాలు వచ్చాయి. ఒకటి Ziya Us Salam, Uzma Ausaf లు కలిసి రాసిన Shaheen Bagh- From a Protest to a Movement. రెండు Seema Mustafa ఎడిట్ చేసిన Shaheen Bagh -And Idea of India అనే వ్యాస సంపుటి. ఇవి రెండు ఆసక్తికరమైన పుస్తకాలే. సి‌ఏ‌ఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పి‌ఆర్ వ్యతిరేక ఉద్యమాన్ని రికార్డ్ చేసిన పుస్తకాలు ఇవి.
  7. ఈశాన్య రాష్ట్రాల గురించి వచ్చిన ఒక మంచి పుస్తకం In the Name of the Nation. Sanjib Baruah అనే అస్సాం రచయిత రాసిన ఈ పుస్తకం వలసానంతర భారతదేశ ఆశక్తుల కోసం బలవంతంగా భారతదేశంలో కలుపుకొన్న ఈశాన్య రాష్ట్రాల గురించి చెబుతుంది. 1951లోనే ఈ ప్రాంతాల్లో AFSPA లాంటి నల్ల చట్టాలు పురుడు పోసుకొన్నాయి. ఇప్పుడీ రాష్ట్రాలు ప్రపంచ వ్యాపారానికి కీలకంగా ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సాయుధ పోరాటాన్ని భారతదేశం Insurgency అని ముద్దుగా పిలవటం గురించి రచయిత ప్రశ్నిస్తాడు. ఇక్కడ జరిగే ఎన్నికల భాగోతం గురించి, ఇక్కడ పునాదులు స్థిరపరుచుకొంటూ క్రిస్టియానిటీ గురించీ, దాన్ని అధిగమిస్తూ వస్తున్న ఆర్ ఎస్ ఎస్ లాంటి హిందుత్వ సంస్థల గురించి చెబుతుంది ఈ పుస్తకం.
  8. Ilina Sen రాసిన Inside Chattisgarh -A Political Memoir ఈ సంవత్సరం నేను చదివిన ఇంకో మంచి పుస్తకం. Ilina Sen తన జీవిత చరిత్రను, జీవితాల చరిత్రకు ముడి వేసి రాసింది. డల్లీ రాజ్రా ప్రాంతంలో ఇలీనా కార్యకర్తగా పని చేసింది. కార్మిక ఉద్యమంలో మహిళా ఉద్యమాల ఆవశ్యకతను నాయకత్వానికి అర్థం చేయించింది. శంకర్ గుహ నియోగి ప్రోత్సాహంతో మహిళా కార్మికులను మద్యం షాపులకు వ్యతిరేకంగా ఉద్యమింపచేసింది. ఆ కార్మిక సంస్థ ‘ఛత్తీస్ గఢ్ మైన్స్ శ్రామిక్ సంఘ్’ ప్రణాళికలో ‘మహిళలు’ ‘కుటుంబ సంక్షేమం’ అనే అంశాలను చేర్పించగలిగింది. మహిళలు ఏ ఉద్యమంలో ఉన్నా జరిగే ప్రయోజనాలు ఇలాగే ఉంటాయి. గనులు తవ్వకానికి ఎక్కడెక్కడి నుండో వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగుల సంస్కృతులలో సాధారణ విషయాలను వెదికి వాటిని కాపాడే ప్రయత్నం చేసింది. వలసలు ధ్వంసం చేస్తున్న గ్రామీణ సామూహిక జీవితాలను భద్రం చేసే ప్రయత్నం చేసింది. ఉమ్మడి కార్యక్షేత్రాలు ఉద్యమ బరులే కాదు, సామూహిక సాంస్కృతిక ఆవరణలుగా కూడా ఉండాలని భావించింది. గోండాల తండాల్లో కూడా బడి, వైద్య కేంద్రం లాంటి ఉమ్మడి స్థలాలను ఏర్పాటు చేసుకొనేటట్లు చేశారు ఇలియానా దంపతులు. అతి సాధారణమైన భాషలో సంక్లిష్టమైన విషయాలను వివరించగలిగిన రచయిత్రి, అతి విలువైన జీవితాన్ని గడపగలిగిన మానవి ఇలీనా సేన్. స్వేచ్ఛగా ఆలోచించటం, స్వంతంత్ర ఆచరణను నిర్ణయించుకోవటం ఆమె వ్యక్తిత్వానికి కారణాలు. ఇలీనా రాతలో వ్యంగ్యం, హాస్యం, పదును, కళ్ళకు కట్టే దృశ్యీకరణ ఉంటాయి. పుస్తకం మొదలు పెట్టినప్పటినుండి వదలకుండా చదివించింది.
  9. ఈ సంవత్సరం నేను చదివిన పొయెట్రీ లో Maumita Alam రాసిన The Musings of the Dark చాలా చాలా నచ్చింది. భారత ఆంగ్ల మహిళా కవయిత్రులలో పోలిటికల్ గా సరిగ్గా ఉన్న కవయిత్రి మౌమిత. అద్భుతమైన, గాఢమైన కవిత్వం రాసింది ఈమె.
  10. Elie Wiesel రాసిన Night నేను చదివిన ఇంకో మంచి పుస్తకం. ఈ పుస్తకం రాసినందుకు ఎలీ కి నోబెల్ శాంతి బహుమానం 1986లో వచ్చింది. నాజీ కాంపుల గురించి, జర్మన్ల ఫాసిస్టు చర్యల గురించి అనేకానేక పుస్తకాలు వచ్చినా -ఆని ఫ్రాంక్ రాసిన డైరీ, నైట్ పుస్తకం బాగా ప్రసిద్ధి అయ్యాయి. ఈ పుస్తకం నాజీ కాంపుల్లో ఇలీ వీసెల్ ప్రత్యక్ష అనుభవం గురించి రాశాడు. నాజీల కాన్సెంట్రేషన్ కాంపుల నుండి బతికి బయటకు వచ్చి ఇలీ రాసిన ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కువమంది చదువరులు చదివారు.
  11. కశ్మీర్ గురించి వచ్చిన ఇంకో మంచి పుస్తకం Jaffna Street. Mir Khalid అనే కశ్మీరీ సర్జన్ రాసిన ఈ పుస్తకం కశ్మీరీ సంక్షోభం సృష్టించిన అల్లకల్లోలానికి ఒక చారిత్రాత్మక వనరులాంటిది కథనాల ద్వారా, వృత్తాంతాల ద్వారా రచయిత కశ్మీర్ వాస్తవ స్థితిని మనకు అర్థం చేయిస్తాడు. అలా చేసేటపుడు ఈ రచయిత కశ్మీరీగా తన అస్తిత్వానికి రద్దు చేసుకొని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాడు.
  12. Khalid Bashir Ahmad రాసిన Kashmir – Exposing the Myth Behind Narrative కశ్మీర్ చరిత్రను కొత్త కోణంలో చూపిస్తుంది. భారతీయ కోణం ఎప్పుడూ కశ్మీర్ ను దోషిగా నిలబెడుతుంది. కశ్మీరీ చరిత్రకారులు ఇప్పుడు వాళ్ల చరిత్రను వాళ్లే రాసుకొంటున్నారు.. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కశ్మీర్ గడ్డ గురించి చారిత్రక పరిశీలన చేసిన పుస్తకం ఇది. కశ్మీర్ వివిధ కాలాలలో వివిధ మతాలను ఆలింగనం చేసుకొంటూ వచ్చి చివరకు ఇస్లాం లోకి మారిన పరిస్థితులను పరామర్శించాడు రచయిత. 1930 నుండి కశ్మీర్ లో జరిగిన రాజకీయ కదలికలు, 1947 నాటి ద్రోహం, తరువాత కాలంలో వచ్చిన మార్పులు గురించి సవివరంగా చెప్పిన పుస్తకం ఇది.
  13. Aparna Vaidik రాసిన My Son’s Inheritance – A Secret History of Lynching and Blood Justice in India అనే పుస్తకం ఈ సంవత్సరమే ప్రచురణ అయ్యింది. మూక హత్యలకు మూలాలను ఈ పుస్తకం వెదుకుతుంది. ఆర్య సమాజం తయారు చేసిన గోరక్షకుల చరిత్ర గురించి చెబుతుంది ఈ పుస్తకం. హింస పట్ల మౌనం వహించే అహింసను రచయిత్రి ఎత్తి చూపుతుంది. దక్షిణ భారతదేశంలో ముందుకొస్తున్న ద్రావిడ, దళిత ఉద్యమాల గురించిన ప్రస్తావనలు కూడా ఈ పుస్తకంలో ఈమె చేసింది.
  14. Unni R రాసిన The Cock is the Culprit ఒక చిన్న వంద పేజీల నవల. సమకాలీన భారతీయ నిర్బంధ పరిస్థితులపై ఒక గాఢమైన సటైర్ ఈ నవల. కేరళ సమాజంలో అంతర్గతంగా దాగి ఉన్న కులం, మతోన్మాదం, మూఢ నమ్మకాలు, నిలువ నీరు లాంటి భావాలను ఎత్తి చూపుతుంది ఈ నవల. మలయాళంలో ఉన్ని ఆర్ రాసిన ‘ప్రతి పూవన్ కోళి’ అనే నవల ఇంగ్లీష్ అనువాదం. అనువాదకురాలు జె. దేవిక. ఈ నవల 2019లో మలయాళంలో మొదటి వచ్చి, దాదాపు 10000 కాపీలు వెంటవెంటనే అమ్ముడుపోయాయి. అతిశయ హిందుత్వమీద, సాంప్రదాయ కేరళ సమాజం మీద, పెద్ద అడుగులు వేయటానికి ఇష్టపడని కమ్యూనిష్టుల మీద వ్యంగ్య విమర్శ ఈ నవల.
  15. ఉన్ని ఆర్ కథల సంపుటి One Hell of a Lover. Magic realism అనే రచనా పద్దతిని ఆశ్రయించి ప్రస్తుత భారతీయ పరిస్థితుల మీద విమర్శనాత్మకంగా రాసిన కథలు ఇవి.
  16. ఈ సంవత్సరంలో చివరిగా చదివిన పుస్తకం Wandana Sonalkar రాసిన వ్యక్తిగత డైరీ Why I am not a Hindu Woman. ఈ పుస్తకం కూడా ఈ సంవత్సరమే ప్రచురణ అయ్యింది. వందనా వ్యక్తిగత కథ అన్నట్లు మొదలుపెట్టినా ఆమె, ఆమె జీవిత కాలంలోని కొన్ని శకలాలను సందర్భోచితం (contextualise) చేసింది ఈ పుస్తకంలో. ప్రజలకు దగ్గరగా మసిలినవాళ్లు, వ్యక్తిగత అనుభవాలను సమాజ నడకలో ప్రతిఫలించుకొని చూసుకోగలిగిన వాళ్లు కొద్దిమందే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి వందనా సోనాల్కర్ జీవితానుభవాలు, వాటినుండి ఆమె గ్రహించి చెబుతున్న సారం -విలువైనవి.

స్వస్థలం ఒంగోలు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటిక్నిక్ కాలేజీలో ఎలక్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ బ్రాంచ్ హెడ్ ఆఫ్ సెక్షన్ గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. 'మాతృక' బాధ్యతలు చూస్తున్నారు.

Leave a Reply