వెంటరాని తనం

ప్రాణాలు ఆకులై రాలుతున్న భయానక వేళ
ఏదో రాద్దామని కూర్చున్నానా
వెలితిగా ఉన్న బాల్కనీ మీద
పిట్ట పాట కడుపు నింపింది
ఎటుచూసినా ఒంటరితనం
గడియారం ఒక్క సారి తిరిగొచ్చే లోపల
ఎవరు మిగులుతారో దాటిపోతారో అనే దిగులు
శరీరాలన్ని దూరం దూరంగా
గోడల మధ్యన తీరుబడిగా జొరబడి
కూర్చున్న మనోవికారాల వలయాల్లో
జ్ఞాపకాలని ఒక్కమారు తైపారు వేస్తున్నాను
ఇదంతా పాతదే అని నువ్వు ఆవులించినా
వ్యక్తిగత సామాజిక దూరాల తనాన్ని
అలవాటైన పనిగా ఆర్తి తో నేను హత్తుకుంటున్నాను
అనుభవాలు నేర్పిన పాఠాల ముందు
ఏది దేనికి సరి పోలదు
పదాలకు ఆకారాలే తప్ప అవయవాలుండవు
ఆత్మ నిండుగా ఇంకిపోయి వివశుల్ని చేస్తుంది
వ్యయం కాబడుతున్న కన్నీటి చుక్కల మధ్యలో
గుమ్మం ముందు నుంచి నడిచిపోతున్న
అడుగుల శబ్దాల హడావుడిలో
నిన్ను కలుపుకు పోకుండా
నువ్వు తిరిగి సమాధానం చెప్పలేని
నీ వెంటారానితనమేదో నిన్ను నిలదీస్తుంది.

పుట్టింది విజయవాడ. కవి. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ (కామర్స్)పూర్తి చేశారు. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చదువుతున్నారు. 2014 లో మిత్రులతో కలిసి "తీరం దాటిన నాలుగు కెరటాలు" పేరుతో ఒక సంకలనం తెచ్చారు. రచనలు : 'ఎనిమిదో రంగు' (2017), 'స్పెల్లింగ్ మిస్టేక్' (2019)అనే కవితా సంకలనాలు ప్రచురించారు. వెబ్ మ్యాగజైన్ 'రస్తా'లో దివంగత రచయితల మీద 'స్మరణ' అనే కాలమ్ రాస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రయివేట్ సంస్థలో అక్కౌంట్స్ విభాగంలో పని చేస్తున్నారు.

3 thoughts on “వెంటరాని తనం

  1. చాలా బాగుంది అన్న..కవిత..

  2. ‘నీ వెంటరానితనమేదో..నిన్ను నిలదీస్తుంది…’
    అద్భుతంగా ఉంది సర్ అభినందనలు

Leave a Reply