వీరుడు-1

(ఒక సామాన్య గని కార్మికుడు భూమి పొరల్లో నిప్పు రవ్వల్నిరగిలించాడు. కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నినదించాడు. తల్లినీ, కొడుకునీ ఒకరికి తెలియకుండా మరొకరిని విప్లవోద్యమంలోకి నడిపించిన విప్లవకారుడు. వందలాది పోలీసు బలగాలు చుట్టుముట్టినా వెనుకడుగు వేయని విప్లవ యోధుడు. ప్రజల కోసం చివరి నెత్తురు బొట్టు వరకు బొగ్గు గనుల మధ్య అగ్గిబరాటయి వెలిగిన “వీరుడు”.  భారత బొగ్గు గని విప్లవోద్యమంలో ఆరిపోని ఉద్యమ కాగడాకు అక్షర రూపమే పి.చందు రాసిన ‘వీరుడు’ నవల…)
1
జూన్‌ 23, 1996 ఆదివారం
ఆరోజు ఉదయం 10 గంటలకు మంచిర్యాలలో జిల్లా యస్పీ ప్రెస్‌ మీట్‌ ఉందని డిఎస్పీ ఆఫీస్‌ నుండి పొద్దున్నే ఎస్సై ఒక్కరు ఫోన్‌ చేసిండు. ప్రెస్‌ మీట్‌ కు బయలుదేరుదామని అనుకుంటుండగానే ‘‘ఏమైంది సార్‌ బయలుదేరిండ్లా?’’ అంటూ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ మళ్ళీ ఫోన్‌ చేసిండు.
‘‘వస్తున్న. దారిలోనే ఉన్నాను’’ అని చెప్పి బయలుదేరాను.

మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ రైల్వే స్టేషన్‌కు పోయే దారిలో రోడ్డుకు ఎడమవైపు విశాలమైన స్థలంలో ఉంటుంది.
సకాలంలో వర్షాలు ప్రారంభం కావడంతో చెట్లు పచ్చదనం సంతరించుకొని వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంది.
పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోకి పోయేసరికి భుజాల మీద తుపాకులు పెట్టుకుని కడక్‌ బట్టలు వేసుకొని అటెన్షన్‌లో నాలుగు వరుసల్లో నిలుచున్న పోలీసులు కన్పించిండ్లు. వాళ్లు తమదైన పద్ధతిలో యస్పీకి స్వాగతం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు.
వరండాలో నిలుచున్న సర్కిల్‌ నన్ను చూసి ముఖం మీదకి చిర్నవ్వు తెచ్చుకొని ‘‘రండి రండి మీదే ఆలస్యం, యస్పీ గారు ఆల్‌రెడీ బెల్లంపల్లి నుండి బయలుదేరిండ్లట’’ అన్నాడు.

సర్కిల్‌ పైకి నవ్వుతూ మాట్లాడినా పోలీసులకు నేనంటే మాత్రం కోపంగానే ఉంటది. ఎందుకంటే నేను ఎవ్వరికి భయపడకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వాస్తవాలను వాస్తవంగా రిపోర్టు చేస్తాను. అది వాళ్ళకు కోప కారణం అయ్యేది.

డియస్పీ గారు కూచునే విశాలమైన గదిలోనే కొన్ని కుర్చీలు వేసి విలేఖర్ల సమావేశంకు ఏర్పాటు చేసిండ్లు. అప్పటికే స్థానిక మా విలేఖర్‌ సోదరులు వచ్చి ఉన్నరు. వారితో పరిచయాలు పలకరింపులు జరుగుతుండగానే చాయ్‌ బిస్కట్స్‌ వచ్చినవి.

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సర్కిల్‌తో ‘‘ఏంటి సార్‌ ఇవాల్టి ప్రెస్‌ మీట్‌ ప్రత్యేకత’’ అని అడిగాను.
‘‘యస్పీ సాబ్‌ టూర్‌లో ఉన్నాడు కదా! పనిలో పనిగా ప్రెస్‌వారితో మాట్లాడుతామన్నారు.’’ అంటూ ముక్త సరిగా సమాధానం ఇచ్చిండు.
గత సంవత్సరము ఆగష్టు నెలలో మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత పీపుల్స్‌వార్‌ దాని అనుబంధ సంస్థలపై మళ్ళీ నిషేధం విధించిండు. దాంతో మళ్ళీ ఎన్‌కౌంటర్ల పరంపర మొదలైంది. తెలంగాణ మరోమారు రక్తసిక్తమైంది.
సింగరేణిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికుల సమ్మెలు ఆగలేదు. గత నవంబర్‌లో సికాస నాయకత్వంలో కార్మికులు ఐదవ వేజుబోర్డును సత్వరం పరిష్కరించాలని ముప్పయి రోజులు సమ్మె చేసి విజయం సాధించటం ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ఆ సమ్మె తరువాత సింగరేణి ప్రాంతానికి మరిన్ని కేంద్ర సాయుధ బలగాలు వచ్చినవి.

ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ఉద్యమానికి, సింగరేణిలో విప్లవ కార్మిక ఉద్యమానికి బెల్లంపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా పనిచేసింది. ఎంతోమంది విప్లవకారులను అందించింది. ఆ పోరాటంలో ఎంతోమంది అమరులైండ్లు. అక్కడ విప్లవ ఓనమాలు నేర్చుకొని రాటుదేలిన నాయకులెందరో అటు తరువాత దేశవ్యాప్త విప్లవోద్యమంలోకి కీలక నాయకులుగా ఎదిగారు. అంత కొడితే నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో ఉండే బెల్లంపల్లి పట్టణం విప్లవానికి పుట్టినిల్లు. అదే సమయంలో విప్లవోద్యమాన్ని అణిచివేయటానికి ప్రభుత్వం అనేక ప్రయోగాలు చేసింది. ఆ చిన్న పట్టణంలోనే వేలాదిమంది బలగాలను మోహరించింది. అనేక రకాల అమానుష నిర్భంధాలను అమలు జరిపి పదుల సంఖ్యలో విప్లవకారులను ఎన్‌కౌంటర్‌ పేర హత్య చేసింది. పోలీసుల అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు ఎదుర్కొనకుండా ఏ ఒక్క యువకుడు ఉండేవాడు కాదంటే అతిశయోక్తికాదు.

గత ఏప్రిల్‌ మొదటి వారంలో బెల్లంపల్లి దగ్గర ఉండే రాళ్ళపేట గ్రామం వద్ద రాళ్ళపేటకు చెందిన చిలుముల శేఖర్‌, బెల్లంపల్లి శాంఖని బస్తికి చెందిన గోద శ్రీనివాస్‌, సాలగాం శ్రీనివాసు అనే ముగ్గురు యువజన సంఘ సభ్యులను వివిధ ప్రాంతాలలో పట్టుకొని రాళ్ళపేట వద్ద ఎన్‌కౌంటర్‌ పేర పోలీసులు హత్య చేసిండ్లు. అంతకుముందు కొద్ది రోజుల క్రిందట ‘సికాస’ వాళ్ళు, అగ్రేసివ్‌గా ముందుకు వచ్చి చాలామంది యువకులను అరెస్టులు చేసి అందులో కొంతమందిని ఎన్‌కౌంటర్‌ చేసిన హెడ్‌కానిస్టేబుల్‌ ఒకరిని పట్ట పగలు నడిబజార్‌లో కాల్చి చంపిండ్లు. అందుకు ప్రతిగా పోలీసులు రాళ్ళపేట ఎన్‌కౌంటర్‌ చేసిండ్లు. ఇలా దాడులు, ప్రతిదాడులతో కోల్‌బెల్టు అట్టుడికి పోతుంది.

ఈ నేపధ్యంలో యస్పీ బెల్లంపల్లిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పనిలో పనిగా మంచిర్యాలకు వచ్చిండు.
బయట వాహనాలు వచ్చి ఆగిన చప్పుడు విన్పించింది. ఆ వెంటనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎవరో పెద్దగా కాషన్‌ ఇస్తుంటే బయట ఫార్మేషన్‌లో ఉన్న పోలీసులు బూట్లు తడిస్తూ సెల్యూట్‌ చేసిండ్లు. లోపల గదిలో ఉన్న మాకు ఆ హడావిడి ఏమి కన్పించటం లేదు.

మరికాసేపట్లోనే డియస్పీ వెంటరాగ యస్పీ ఉల్లాసంగా వచ్చాడు. యస్పీ యువకుడు, ఎర్రటి వొళ్ళు, ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి. ఐ.పి.యస్‌.గా సెలెక్టు అయి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ క్రింద పోస్టింగ్‌ ఇచ్చారు. మొదట్లో ఏయస్పీగా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే ఆదిలాబాద్‌ జిల్లా యస్పీగా ప్రమోషన్‌ మీద వచ్చిండు.
కాకి బట్టల్లో యస్సి నీటుగా కడిగేసినట్టున్నడు. ఆయన ఉత్సాహంగా కుడి చెయ్యి ఎత్తి గాల్లో ఆడిస్తూ అందరి వైపు చూసి రెండు చేతులు జోడిరచి వచ్చిరాని తెలుగులో ‘‘అందరికి నమస్కారం’’ అంటూ చిర్నవ్వులు చిందిస్తూ వచ్చి మాకు ఎదురుగా ఉన్న టేబుల్‌ ఆవలి వైపు కుర్చీలో కూచున్నాడు.

డియస్పీ తన లావాటి వొళ్ళును కదల్చుకుంటూ వచ్చి పరిచయ పూర్వకంగా ఏవో నాలుగు మాటలు మాట్లాడి నేరుగా యస్పీని మాట్లాడవలసిందిగా విన్నవించిండు.
యస్పీ మాట్లాడటానికి లేచిండు. తన ముందు టేబుల్‌ మీదున్న సన్నటి మైక్‌ పై చిన్నగా చిటుక వేసి, అది సరిగా పనిచేస్తున్నదని నిర్ధారించుకొని ఉత్సాహంగా అందరివైపు చూసిండు.
మేము నోట్‌ బుక్‌లు పెన్నులు పట్టుకొని రడీగా ఉన్నాం.
ఆయన హిందీలో మాట్లాడడం మొదలు పెట్టిండు.
‘‘ప్రజాస్వామిక వ్యవస్థకు నాలుగో స్తంభంలాంటి పత్రిక వ్యవస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులంటే నాకు ఎంతో గౌరవం ఉంది’’ అన్నాడు ఉల్లాసంగా.
‘‘మనది గొప్ప ప్రజాస్వామిక దేశం. మనకు ప్రపంచంలోనే పెద్దదైన లిఖిత రాజ్యాంగం ఉంది. ఈ దేశ పౌరులమైన మనం అందరం దాన్ని గౌరవించాలి. రాజ్యాంగం మనకు హక్కులను, బాధ్యతలను కల్పించింది. మనకు ఏదైన సమస్య వస్తే చట్ట పరిధిలో పరిష్కరించుకునే అవకాశం కల్పించింది. నిరసన తెలియజేసే హక్కు, ఆందోళన చేసే హక్కు ఉంది. చట్టాన్ని గౌరవించటం మన అందరి బాధ్యత. కాని కొంతమంది తమ స్వార్థం కోసం చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని సమాజంలో అరాచకం సృష్టిస్తున్నారు. అటువంటి వారిపట్ల పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టాన్ని కాపాడటం కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది.’’

అతను అందరికేసి సూటిగా చూస్తూ మాట్లాడ సాగిండు. అతని గొంతులో కాఠిన్యత పెరిగింది.

‘‘కోల్‌ బెల్ట్‌ ప్రాంతంలో కొన్ని శక్తులు ముఖ్యంగా సింగరేణి కార్మిక సమాఖ్య అరాచకం సృష్టిస్తున్నది. శాంతి భద్రతలకు భంగం కల్గిస్తున్నది. కార్మికులను బెదిరించి రెచ్చగొట్టి సమ్మెలు చేయిస్తున్నారు. కార్మికులకు ఏదైనా సమస్య వస్తే శాంతియుతంగా మేనేజుమెంటుతో చర్చించి పరిష్కరించుకోవాలి. అందుకు కార్మిక సంఘాలున్నాయి. చర్చలతో సమస్యలు పరిష్కారం కాకుంటే లేబర్‌ కోర్టుకు పోవచ్చు, చట్టప్రకారం సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మె చేయవచ్చు. కార్మికులు చట్ట పరిధిలో ఏం చేసినా దానికి మేము వ్యతిరేకం కాదు. కాని సికాస కార్మికులను తుపాకులతో బెదిరించి కొట్టి వారితో బలవంతంగా ఇల్లీగల్‌ సమ్మెలు చేయిస్తుంది. ఫలితంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతున్నది. పారిశ్రామిక అశాంతి ఏర్పడుతున్నది. దేశ అభివృద్ధికి ఆటంకం కల్గిస్తున్నారు. ఇటువంటి అరాచక శక్తులను సహించేది లేదు’’ అన్నాడు కఠినంగా.

ఆయన అలా మాట్లాడుతుండగానే స్థానిక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లోనికి చొచ్చుకొని వచ్చిండు. అట్లా వచ్చిన వాడు ఒక్క క్షణం నిలబడిపోయి తటపటాయించిండు. మళ్ళీ ఏమనుకున్నడో ఏమో కాని మెల్లగ వచ్చి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని డియస్పీ గారి చెవిలో ఏదో గుసగుసలాడిండు.
డియస్పీ మొఖంలో ఆశ్చర్యంగా రంగులు మారాయి. వెంటనే కూచున్న కాన్నుంచి లేచి మాట్లాడుతున్న యస్పీకేసి చూసిండు. కాని యస్పీ అదేమి పట్టించుకోకుండా తన ధోరణిలో తాను మాట్లాడుతున్నాడు.

‘‘సికాస పబ్లిక్‌ లోకివచ్చి లీగల్‌గా ఎటువంటి పోరాటాలు చేపట్టినా మాకేమి అభ్యంతరం లేదు. కాని ఆయుధాలు పట్టుకొని రహస్యంగా ఉంటూ కార్మికులను, అధికారులను, చివరికి యూనియన్‌ నాయకులను అందరిని బెదిరిస్తూ తమ అరాచకాలు కొనసాగిస్తామంటే మాత్రం సహించేది లేదు’’ అన్నాడు.

డియస్పీ తాను కూచున్న కుర్చిలో నుండి లేచి సర్కిల్‌ వెంటరాగా ప్రక్క గదిలోకి ఫోన్‌కాల్‌ అటెండ్‌ కావటానికి పోయిండు..
యస్పీ తన సహజ ధోరణిలో ఆవేశంగా మాట్లాడుతూనే వున్నాడు. ‘‘అసలు సికాస వాళ్ళు చేసే సమ్మెకు అర్థం పర్థం ఉంటున్నదా మీరే ఆలోచించండి. గోరుతో పోయే సమస్యలను సమ్మెలు చేయటం వలన కార్మికులకు ఏమన్న ప్రయోజనం ఉందా! ఇదేనా వీళ్ళు కోరే విప్లవం’’ అంటూ ఆయన తన దైన పద్ధతిలో సికాసపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డాడు. చివరగా ఆయన ‘‘ఇటువంటి సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవటం కేవలం ఒక్క పోలీసుల బాధ్యతే కాదు. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరి బాధ్యత. ముఖ్యంగా జర్నలిస్టుల బాధ్యత ఎంతో ఉంది.’’ అంటూ అందరివైపు చూసి నాపై దృష్టి నిలిపి మాట్లాడ సాగిండు.
‘‘కొంతమంది జర్నలిస్టు మిత్రులు కూడా తెలిసో తెలియకో సికాస కార్యకలాపాలను గ్లోరిఫై చేసి వ్రాస్తున్నారు. దానివల్ల వారికి పేరు వస్తుందనో, పత్రిక సర్కిలేషన్‌ పెరుగుతుందనో అనుకుంటే అనుకోవచ్చు. కాని సమాజానికి జరుగుతున్న నష్టం గురించి ఆలోచించాలి. కలిసి పని చెయ్యాల్సిన సమయం. మీకు ఏదైన సమస్య ఉంటే పరిష్కరించటానికి మావోళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాలేదనుకుంటే నేరుగా నాతోనే మాట్లాడవచ్చు. మీకు ఆల్‌వేస్‌ వెల్‌కం’’. అన్నాడు రెండు చేతులు చాపి…
డియస్పీ హడావిడిగా లోనికి రావటం చూసి యస్పీ ఒక క్షణం మాటలు ఆపి ఏంటన్నట్టుగా చూసిండు.
డియస్పీ వినయం ఉట్టిపడగా యస్పీ చెవిలో మెల్లగా ఏదో గుసగుసలాడిరడు. ఆ మాటలు వింటున్న యస్పీ మొఖం సంతోషంతో వెలిగి పోయింది.
విషయం చెప్పిన డియస్పీ కాలు తాడిస్తూ సెల్యూట్‌ చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పోయిండు.
సాధారణంగా ఉన్నత స్థాయి అధికారులు వచ్చినప్పుడు క్రిందిస్థాయి అధికారులు ఎంతో వినయం ఉట్టిపడగా కుక్క తోకలా వెంట తిరుగుతారు. ఇటువంటి ఏదైనా ప్రెస్‌మీట్‌ల సందర్భంలో అయితే మీటింగ్‌ అయిపోయ్యేంత వరకు బుద్ధి మంతుల్లా తలలు ఆడిస్తూ కూచుంటారు. అటువంటిది ప్రెస్‌మీట్‌ మధ్యలో డియస్పీ వెళ్ళిపోవటం ఆశ్చర్యం అన్పించింది.

‘డియస్పీకి ఏదో అర్జంటు పని బడ్డట్టున్నది’’ అన్నాడొక జర్నలిస్టు మిత్రుడు.
‘‘ఏంటో అంత అర్జంటు’’
‘‘పోలీసులు అన్నప్పుడు ఎన్నో ఉంటయి అన్ని మనకు చెప్పుతారా?’’
‘‘ఇక ప్రెస్‌మీట్‌ అయిపోయినట్టేనా?’’ అంటూ మరో మిత్రుడు లేవటానికి ప్రయత్నించిండు.
అంతవరదాక మాట్టాడటం అయిపోయి కూచున్న యస్పీ సడన్‌గా లేచి చెయ్యి ఆడిస్తూ ‘‘ఫ్రెండ్స్‌ కూచోండి ఒక్క నిముషం’’ అన్నాడు ఉత్సాహంగా.
లేచిన వాళ్ళు మళ్ళీ కూచొని ఆయన మళ్ళీ ఏం చెప్పుతాడో అని ఎదురు చూసిండ్లు.
‘‘మరికాసేపట్లో మీకు ఒక సెన్సేషనల్‌ న్యూస్‌ చెప్పబోతున్నాను’’
‘‘సెన్సెషనల్‌ న్యూసా?’’
‘‘అవును’’
‘‘ఏంటిసార్‌?’’ అంటూ మరో జర్నలిస్టు ఉత్సాహం ఆపుకోలేక అడిగిండు.
అందుకు బదులుగా యస్పీ కండ్లు మూతలు పడుతాంటే నిండుగా నవ్వి ‘‘సాయంత్రం మనం మళ్ళీ కలుస్తాం… అప్పుడు చెప్పుత సెన్సేషన్‌ న్యూస్‌’’ అంటూ లేచిపోయిండు…

మేము బయటికి వచ్చినం….

ఇంటికి రావటంతోనే ఫోన్లు ఏమైన వచ్చినవా అని యధాలాపంగా చూసే సరికి మూడు మిస్స్‌డ్‌ కాల్స్‌ ఉన్నవి… ఎవరని చూస్తే ఆ మూడు కాల్స్‌ కూడా శ్రీరాంపూర్‌ వార్త విలేకరి ఆగయ్య నుండి వచ్చినవి… విషయం ఏమిటా అని మళ్ళీ అతనికి ఫోన్‌ చేసాను….

అవతల నుండి ఫోన్‌ ఎత్తిన మిత్రుడు… నేను విషయం ఏమిటని అడగకముందే ‘‘ఏందన్నా అప్పటి నుంచి ఫోన్‌ చేస్తుంటే ఎత్తటం లేదు’’ అన్నాడు ఆత్రంగా..
‘‘మంచిర్యాలలో యస్పీగారి ప్రెస్‌ మీట్‌లో ఉంటి, ఇప్పుడే వచ్చిన’’ ఎంటీ సంగతి’’ అన్నాను.
‘‘అన్నా ఇక్కడ ఘోరం జరిగిపోతుంది’’
‘‘ఘోరమా?’’
‘‘అవునన్నా’’
‘‘ఎక్కడా?’’
‘‘నస్పూర్‌లో కొత్తగా కట్టిన ‘డి’ టైప్‌ క్వార్టర్స్‌ కాడ పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి ఒక ఇంటిని చుట్టు ముట్టారు.’’
‘‘ఎందుకు?’’
‘‘ఆ ఇంటిలో నక్సలైట్లు ఉన్నారట.. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావటం లేదు.’’
‘‘ఎవరు ఉన్నారట?’’
‘‘ఎవరన్నది తెలియటం లేదు….మొత్తానికైతే సికాస నాయకులున్నారంటున్నారు’’’
‘‘సికాస నాయకులా.. ఎంతమంది?’’
‘‘ఎంతమంది అన్నది తెలుస్తలేదు’’ పోలీసులు ఎవ్వరిని దగ్గరికి రానివ్వటం లేదు….’’
‘‘సరే నేను వస్తున్నా’’ అని వెంటనే బయలుదేరాను.

2
బండిమీద పోతున్నాను కాని మనసులో పరిపరి విధాల ఆలోచనలు చుట్టుముట్టాయి…..
మంచిర్యాల నుండి చెన్నూరుకు పోయే రహదారిలో ఒక చోట నస్పూర్‌ ఊరిలోకి పోయే దారి కలుస్తుంది. ఆ దారికి ఒకవైపు కంపెని నూతనంగా కార్మికుల కోసం నిర్మించిన ‘డి’టైప్‌ క్వార్టర్స్‌ ఉన్నవి. ప్రదాన రహదారికి క్వార్టర్స్‌కు మధ్య విశాలమైన మైదానం ఉంది.

అంతకు ముందు వారం రోజుల క్రింద ముసురు పెట్టి కురిసిన వర్షాల వలన నల్లటి బొగ్గు దుమ్ముతో పేరుకపోయినా వాతావరణమంత కడిగేసినట్టుగా ఉంది. చెట్లు పచ్చదనం నింపుకున్నవి. మబ్బు విడిచినా ఎండతీక్షణంగా ఉంది.

అక్కడికి చేరుకునే సరికి నన్ను చూసి ఆగయ్య మరికొంతమంది జర్నలిస్టు మిత్రులు దగ్గరికి వచ్చిండ్లు. అప్పటికే జనం రోడ్డు మీద క్వార్టర్స్‌ ముందు, వెనుకవైపు పోగై గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నరు. ఎవరి మొఖంలో చూసిన ఏదో ఆందోళన, ఏం జరుగబోతుందోనన్న ఆత్రుత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
‘‘ఎక్కడ?’’ అని అడిగాడు….
‘‘అదిగో అన్న ముందు వరస క్వార్టర్స్‌లో మొదటి బ్లాక్‌ కాడ’’

అప్పటికే పోలీసులు ఆ క్వార్టర్స్‌ను ఆనుకొని గోడల పొంటి కిటికీల పొంటి నిలుచొని ఆయుధాలు పట్టుకొని ఏ క్షణంలోనైనా కాల్పులు జరుపటానికి సిద్ధంగా ఉన్నారు. మరికొంతమంది పోలీసులు జనాన్ని దగ్గరికి రాకుండా లాఠీలు ఆడిస్తూ గెదుముతున్నారు. అంత ముప్పయి నలుభై మంది పోలీసులున్నారు. దూరంగా పోలీసు వాహనాలు నిలిపిన చోట డియస్పీ, శ్రీరాంపూర్‌ స్థానిక సి.ఐ. సాయిలుతో మాట్లాడుతూ కన్పించిండు. వారి ప్రక్కన శ్రీరాంపూర్‌ యస్సై లక్ష్మీనారాయణ, మరో కొత్త యస్సై కన్పించిండు…
‘‘ఆ కొత్త యస్సై ఎవరు?’’ అన్నాను జర్నలిస్టు మిత్రునితో
‘‘అసిఫాబాద్‌ యస్సై వెంకటేశ్వర్లు’’ అన్నారొకరు.
‘‘ఆయనెందుకు వచ్చిండు?’’ అని అడిగిండు మరొకరు.’’
‘‘మొత్తానికి పక్కా సమాచారంతో పకడ్బంది ప్లాన్‌తోనే వచ్చినట్టుంది.’’ అన్నారు మరొకరు.

అంత పక్కా సమాచారం పోలీసులకు ఎట్లా తెలిసింది? అయినా పోలీసులు సికాస కార్యకర్తల పట్టుకోవటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఉత్తర తెలంగాణలో వివిధ జిల్లాల్లో విస్తరించి ఉన్న కోల్‌ బెల్టు ప్రాంతంలో సికాస ఉద్యమాన్ని అణచటానికి సమన్వయం లేకుండా పోతుందని భావించిన ప్రభుత్వం ఇటీవల కోల్‌బెల్టు ప్రాంతంను ప్రత్యేక పోలీసు జిల్లాగా ప్రకటించింది. దానికి ఐజి స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించింది. కొత్త పోలీసు స్టేషన్లు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లు వచ్చినవి. అంతకు ముందు కోల్‌ బెల్టు ప్రాంతంలో అడపాదడపా పోలీసులు కన్పించేవాళ్ళు. కాని ఇప్పుడు ఎక్కడ చూసినా అటోమెటిక్‌, సెమిఅటోమెటిక్‌ ఆయుధాలు ధరించిన సాయుధ పోలీసులు కనిపిస్తున్నారు. గుంపులు గుంపులుగా రాత్రి, పగలు తిరుగుతూ హఠాత్తుగా బస్తీలను చుట్టుముట్టి వెతకటం, అనుమానం వచ్చిన వారిని పట్టుకపోవటం సహజమైంది.

దీనికి తోడు వివిధ ఏరియాలలో స్థానికంగా సికాస ఆర్గనైజర్స్‌గా పని చేస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకొని యస్సైస్థాయి అధికారితో ఆంటీ నక్సల్స్‌ స్క్వాడ్‌ ఏర్పరిచిండ్లు. వాళ్ళకు వేరే పనులేమి ఉండవు. రాత్రిపగళ్ళు తమకు టార్గెటుగా ఉన్నవాని గురించి సమాచారం సేకరించటం వెతకటమే పని. ఒకవేళ దొరికితే అక్కడికి అక్కడే కాల్చి చంపే ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది ప్రభుత్వం.

కార్యకర్తల ఆచూకి తెలుసుకోవటం కోసం సివిల్‌ డ్రెస్‌లో పోలీసులు చిన్న చిన్న ఆయుధాలను కనబడకుండా బట్టల్లో దోపుకొని చిల్లర వ్యాపారస్తుల్లా చిలక పంచాంగం చెప్పెవారుగా, బిచ్చగాళ్ళుగా రకరకాల వేషాలు వేసుకొని వేట సాగిస్తున్నారు.

ఇక ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ ఎంతగా పటిష్ఠంగా తయారు చేసారంటే, ఎవడు ఇన్‌ఫార్మరో ఎవడు కాదో తెలియకుండా ఉంది. ఇన్‌ఫార్మర్‌కు డబ్బులు, చిన్న చిన్న ఆయుధాలు ఇవ్వడమే కాకుండా కంపెనీలో రిక్రూట్‌ కూడా చేయించిండ్లు… ఇట్లా రిక్రూట్‌ అయిన ఇన్‌ఫార్మర్స్‌కు కంపెనిలో చేసే పనులేమి ఉండవు. ఎంతసేపు కార్యకర్తల గురించి ఎంక్వైరీ చేయటం, ఎవరెవరు సికాసకు సహకరిస్తున్నారో వివరాలు సేకరించటమే పని, అటువంటి ఇన్‌ఫార్మర్‌ ఒకరు రామక్రిష్ణాపూర్‌ హస్పిటల్‌లో రిక్రూట్‌ అయి అన్నల గురించి ఆరాలు తీస్తుంటే ఆ విషయం బయటపడి సికాస వాళ్ళు చంపేస్తారని భయపడి పత్తాలేకుండా పారిపోయిండు.

ఇన్‌ఫార్మర్స్‌ చాలావరకు బయట పడకుండా చాటు మాటుగా ఉండి. పోలీసులకు ఉప్పందించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాని కొంతమంది లంపెన్స్‌, గుండాటైప్‌ మనస్తత్వం ఉన్నటువంటి వారిని చేరదీసి పోలీసులు వారికి ఆయుధాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి వారు ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడినా, అరాచకాలు చేసినా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ప్రోత్సహించిండ్లు… అటువంటి వారిలో శివకుమార్‌ అనే వాడు ఒకడు. అశోక్‌ ఆర్గనైజేషన్‌ పరిధిలోకి వచ్చే రామక్రిష్ణాపూర్‌ కేంద్రంగా పనిచేసేవాడు. ఆ రోజుల్లో వాడు చెయ్యని అరాచకం లేదు. లంపెన్‌ గ్యాంగులను వెంటేసుకొని అందరికి బహిరంగంగా కనిపించేట్టు రెండు చేతుల్లో రెండు రివాల్వర్లు పట్టుకొని ఊరేగేవాడు..

వాడు ఎవరిని పడితే వాన్ని బెదిరించేవాడు. ముఖ్యంగా సికాస కార్యకర్తలు, వారి సానుభూతి పరులను లక్ష్యంగా దాడులు చేసేవాడు. సికాసలో పని చేస్తున్నారని అనుమానం వస్తే చాలు వాన్ని ఎత్తుక పోయి చిత్రహింసలు పెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నించేవాడు. విననివాన్ని దారుణంగా చంపేసేవాడు. వాటికి దాతు ఫిర్యాదు ఉండేది కాదు.

అటువంటి సంఘటన ఒకటి రామక్రిష్ణాపూర్‌ ‘బి’జోన్‌ ప్రాంతంలో జరిగింది. ఆర్కె సెవన్‌ బాయిలో పనిచేసే కార్మికుడొకరు సికాసలో పని చేస్తున్నాడని అనుమానించిన శివకుమార్‌, ఆ కార్మికున్ని డ్యూటీ చేసి తిరిగివస్తుంటే కిడ్నాప్‌ చేసి కొట్టి చంపి కాలనీని అనుకుని ఉండే డ్రైనేజి ట్యాంక్‌లో పడవేసిండు. ఆ విషయం జనం అందరికి తెలిసింది. కాని ఎవ్వరు భయంతో నోరెత్తలేదు.

ఇక యువకుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేది. రాడికల్‌ విద్యార్థి, యువజన సంఘంలో పని చేస్తున్నాడని తెలిసినా వారిపై దాడులు చేసేవాడు. అలా ఒకసారి రామక్రిష్ణాపూర్‌లో కార్మికుని కొడుకైన జంజపల్లి శ్రీధర్‌ అనే యువకునిపై దాడి చేసిండ్లు. శ్రీధర్‌ ఇంటర్‌ వరకు చదువుకొని ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండేవాడు. అతను మంచి కరాటే ఫైటర్‌ కూడా. శివకుమార్‌ ముఠా దాడి చేసినప్పుడు వారిని సమర్థవంతంగా ఎదుర్కొని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. లేకుంటే ఆ రోజు చనిపోయేవాడే. అట్లా పారిపోయిన శ్రీధర్‌ మళ్ళీ ఇంటి మొఖం చూడలే. అటు తరువాత ఆయన పూర్తికాలం ఉద్యమంలోకి పోయి సికాస నాయకుడుగా ఎదిగిండు.

మంచిర్యాల పట్టణంలో మార్కెట్‌ రోడ్డులోని ఆర్‌.యస్‌.యస్‌.కార్యకర్త దండేకర్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లోనో, బెల్లంపల్లి చౌరస్త వద్దనో తన గుండా గ్యాంగ్‌తో అడ్డాలు వేసి బహిరంగంగానే చేతిలోని రివాల్వర్‌ తిప్పుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేసేవాడు.

శివకుమార్‌ అరాచకాలు పోలీసులకు తెలియంది కాదు. వాస్తవానికి వాన్ని తయారు చేసిందే వాళ్ళు. విప్లవ ఉద్యమాలు బలంగా కొనసాగినప్పుడు వాటిని అణచటానికి సోకాల్డు ప్రజాస్వామిక వ్యవస్థలో చట్టపరంగా వ్యవహరించటం కష్టమని భావించినప్పుడు, తమ చేతికి మట్టి అంటకుండా విప్లవకారులను, వారి సానుభూతిపరులను మట్టుబెట్టడానికి పాలకులు ఇటువంటి నల్ల దండు ముఠాలను సృష్టించి అరాచకాలు చెయ్యటం చరిత్రలో కొత్తదేమి కాదు.
వాడేమో ‘‘అశోక్‌ గాన్ని నేనే చంపేస్తా’’ అంటూ బహిరంగంగానే ప్రకటిస్తూ ఊరేగేవాడు.
వాడి అరాచకాలకు అడ్డుకట్ట వేయటానికి ‘సికాస’ వాళ్ళు చాలానే ప్రయత్నం చేసిండ్లు. కాని వానికి రక్షణగా ఎప్పుడు వెన్నంటి ఉండే సివిల్‌ డ్రెస్‌ పోలీసులు కాపాడుతూ వస్తున్నారు. దాంతో వాడు చిక్కటం లేదు… చూడాలి ‘ భూదేవికి నక్క పైస బాకీ పడ్డట్టు ఇది ఎంతవరకు సాగుతుందో?

మమ్ముల్ని చూసి తెలిసిన కార్మికులు కొందరు వచ్చి మా చుట్టు మూగిండ్లు.
‘‘ఎట్లా జరిగింది?’’ అన్నాను. నాకు తెలిసిన ఒక కార్మికునితో.
ఆ కార్మికుడు ప్రక్కనే ఉన్న మరో కార్మికుని కేసి ‘‘కొంరన్నా ఏం జరిగిందో అన్నకు చెప్పు’’ అని నాకేసి చూసి ‘‘కొంరన్న క్వార్టర్స్‌ కూడా ఇక్కడే’’ అన్నాడు.
నేను కొంరయ్య కేసి ఆసక్తిగా చూసాను…

ఊహించని సంఘటనకు ఏం జరుగుతుందో ఏమోనని మనిషి కంగారుపడుతున్నడు. భయంతో మొఖం వెలవెల పోయింది.
‘‘అదిగో నాది ముందు వరుసలో నాల్గో బ్లాక్‌…’’ అంటూ చెయ్యేత్తి అటు చూయించి ‘‘ఆదివారం కదా మార్కెటు పోయి ఏదైనా ఇంత తెచ్చుకుందామని ఇంట్లకేలి ఇట్లా బయటికి వచ్చిన్నో లేదో బయట చాలామంది పోలీసులు కన్పించిండ్లు. ఏం జరిగింది.. ఇంతమంది పోలీసులు ఎందుకొచ్చిండ్లు అనుకుంటనే ఉన్న పోలీసులు నా దగ్గరికి వచ్చిండ్లు… ఎవ్వర్ర నువ్వు అంటూ లాఠీతో బెదరిస్తూ అడిగిండ్లు… అయ్యా నాది ఇదే ఇల్లు అన్న… పో…ఇంట్లకు పోయి తలుపేసుకోపో’’ అంటూ దబాయించిండ్లు… అయ్య బజారుకు పోతున్న అంటే సరే పో….. అని చూస్తుండగానే మా ఇంటికి బయటి నుండి గొల్లం పెట్టిండ్లు… ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక నేను దూరంగా వచ్చి నిలుచున్నా… ఇక్కడ ఎవ్వడు ఉండవద్దు దూరంపోండ్లీ అంటూ అందరిని గెదిమి ముందు వరుసలో ఉన్న ఇండ్లకు బయటి నుండి గొళ్ళాలు పెట్టిండ్లు. అప్పుడు మొదటి బ్లాక్‌లో రెండవ క్వార్టర్‌ ముందు తుపాకులు పట్టుకొని చాలామంది పోలీసులు ఉన్నారు.’’..
‘‘ఎవ్వరిల్లు అది?’’ అని అడిగాను
‘‘టింబర్‌మెన్‌గా పనిచేసే క్రిష్ణారెడ్డి అనే కార్మికునిది.’’
‘‘ఆయన లేడా?’’
‘‘ఏమో అన్నా’’ అన్నాడు కొంరయ్య
‘‘అరే పొద్దున ఏడు గంటలకు క్రిష్ణారెడ్డి ఎటో హడావిడిగా పోతుంటే నేను చూసిన. ఏందో ఏం పని మీద పోతాండో అనుకున్నా’’అంటూ మరో కార్మికుడు ఆశ్చర్యంగా నోరెల్ల బెట్టిండు.
‘‘అయితే ఇంట్ల ఎవరున్నరు’’ అంటూ మరో కార్మికుడు ప్రశ్నించిండు
‘‘ఇంట్లో ఆయన భార్య నిరంజనే ఉంటది… పిల్లలు ఎక్కడో చదువుకుంటాండ్లు’’ అన్నాడు కొమురయ్య.
మొదటి బ్లాక్‌ ముందు పోలీసులు హడావిడి పడుతున్నారు… వారికి కాస్త దూరంలో నిలుచున్న పోలీసు అధికారి ఒకరు తీక్షణంగా చూస్తూ మారు మాట్లాడకుండా చేతులతో కొంతమంది ముందు వెనకకు పొమ్మనట్టుగా సైగలు చేస్తున్నాడు.


తుపాకులు పొజిషన్‌లో పట్టుకొని కొంతమంది పోలీసులు క్వార్టర్‌ వెనుక వైపుకు పరుగెట్టిండ్లు…
‘‘చూడబోతే అన్నా పోలీసులు కాల్పులు మొదలు పెట్టేట్టుంది’’ అంటూ మా విలేఖరి ఒకరు కంగారు పడ్డాడు.
‘‘అన్నా మనం ఏం చెయ్యలేమా?’’ అన్నాడు ఆగయ్య బాధగా…
‘‘ఏమైనా అవకాశాలుంటే ప్రయత్నిస్తాం, పోయి డియస్పితో మాట్లాడుదాం పద’’ అంటూ అందరికి అందరం అటువైపు కదిలాం….
మమ్ముల్ని కనిపెట్టిన స్థానిక సర్కిల్‌ సాయిలు గబ గబ మా దగ్గరికి వచ్చిండు.. రెండు చేతులు అడ్డంగా ఆడిస్తూ ‘‘ఎవ్వరు దగ్గరికి రావద్దు వస్తే మీకే ప్రమాదం’’ అంటూ హెచ్చరించిండు…

‘‘సార్‌ ఒక నిమషం’’ అంటూ ఆయన దగ్గరికి పోయాను.
ఆయన తలెత్తి ఏందీ అన్నట్టుగా చూసిండు…
‘‘కాల్పులు జరుపకండి సార్‌ అవసరమైతే మేం వారితో మాట్లాడి లొంగిపోయేలా ప్రయత్నం చేస్తాం’’ అన్నాను.
ఆయన ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయిండు. కాని మళ్ళీ అంతలోనే ఆయన గుండ్రటి మొఖం గంభీరమైపోయింది.
‘‘లాభం లేదు మా డియస్పీ వినడు’’ అంటూ క్షణమాగి ‘‘కాసేపట్లో మేమే విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేస్తాం అంత వరదాక ఓపిక పట్టండి’’అంటూ అక్కడ ఉన్న పోలీసులను మేం దగ్గరికి రాకుండా ఆపమని పురమాయించి సరసర వెళ్ళిపోయిండు…


పోయి నేరుగా డియస్పీ తోనే మాట్లాడుదాము అనుకుంటే మా ముందు దడికట్టిన పోలీసులు ముందుకు పోనివ్వటంలేదు.
చూడబోతే పోలీసులు వచ్చిన అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేనట్టు కన్పిస్తుంది. దాదాపు పదమూడు సంవత్సరాలుగా అశోక్‌ను పట్టుకోవటానికి వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. అటువంటిది అతన్ని మట్టుబెట్టే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవటానికి ఇష్టపడుతారా?

మనసు ఎటు పాలుపోవడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మా కండ్ల ముందు ఘోరం జరుగబోతుంటే చూస్తూ ఊరుకోవాలా?
అసలింతకు ఆ ఇంట్లో ఎవరున్నారు?.. ఉన్నది అశోకా మరొకరా! ఉంటే ఎంతమంది ఉన్నారు?… దాదాపు ముప్పయిమంది పోలీసులు రావడం, వాళ్ళ హడావిడి చూస్తుంటే పక్కా ప్లాన్‌తోనే వచ్చినట్టుంది..

ఎక్కడి నుంచి చూసిండో ఏమో కాని పెద్ద మనిషి నర్సింగరావు హడావిడిగా నా వైపు రావటం కన్పించింది… ఎప్పుడు సరదాగా నవ్వినట్టుండే మొఖంలో విషాదం కమ్ముకొన్నది.. బస బస బీడి తాగుతూ మాట పలుకు లేకుండా నిలుచున్నాడు.. మా ఇద్దరికి మాత్రమే పరిచయమైన విషాదమైన చూపులతో మనసు భారమైంది. మందికి కాస్త దూరంగా జరిగి ఒంటరిగా నిలుచున్నాం.


ఆయన ఉండి ఉండి మెల్లగా లొగొంతుకతో గుస గుస లాడుతున్నట్టుగా ‘‘నాకు శివకుమార్‌ గాని మీదనే అనుమానంగా ఉంది’’ అన్నాడు భారంగా.
‘‘ఎందుకు?’’
‘‘ఎందుకంటే గత కొద్ది రోజులుగా శివకుమార్‌ మనుషులు అశోక్‌ కోసం వెతుకుతున్నారని తెలిసింది’’
‘‘శివకుమారా?’’ అన్నాను ఆశ్చర్యంగా
నర్సింగరావు భారంగా నిట్టూర్చి ‘‘కొద్ది రోజుల క్రింద శివకుమార్‌ గాని మనుషులు నన్ను కూడా బెదిరించిండ్లు.. కాని నేను భయపడలేదు.. ఏం పీక్కుంటారో పీక్కోపోండి అన్నా’’ అన్నాడు ఆవేశంగా… బీడి ముట్టించుకుని గప గప తాగి లంజ కొడుకులు ఎవరిని ఏ రకంగా లొగదీసుకుంటాండ్లో తెలియటం లేదు… ఇదంత పోలీసులు ఆడుతున్న దొంగ నాటకం.’’

జనం అంతకంతకు ఎక్కువవుతున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు నస్పూర్‌ పోయే రోడ్డు మీద కాలనీకి ఎదురుగా ఉన్నా మైదానంలో ఎక్కడ చూసిన జనం. అందరి మొఖాల్లో ఏదో జరుగబోతుందని ఆందోళన కనిపిస్తుంది.
ముందుకు చొచ్చుక వస్తున్న జనాలను ఆపటం పోలీసులకు కష్టమౌతుంది. ‘‘ఎవరు ముందుకు రావద్దు వస్తే మీకే ప్రమాదం’’ ఎవడో పోలీసు వాడు లాఠీ ఆడిస్తూ హెచ్చరిస్తున్నాడు… కాని లాభం లేకుండా పోతుంది.
అంతవరదాక గోడల పొంటి నక్కి నిలుచున్న పోలీసులు పట పట మంటూ తుపాకులు పేల్చిండ్లు…
ఒక్కసారి జనం ఉలిక్కి పడ్డారు.. దగ్గరికంటూ పోయినవాళ్ళు వెనక్కి భయంతో పరుగు పెట్టిండ్లు…
దూరంగా నిలుచున్న పోలీసు అధికారి ఒకరు చేతులు ఆడిస్తూ బిగ్గరగా ‘‘అటుకాదు…. ఇటు… వెనుకవైపు’’ అంటూ అరుస్తున్నాడు.
‘‘కాల్పులు జరుపుతాండ్లు చంపేస్తరా’’ అంటూ బాధగా బిగ్గరగా కేకేసిండు ఒకరు… అతని కంతలు తేలిన నల్లటి మొఖం వివర్ణమైంది. ఏం చేయలేని నిస్సయతతో మొఖంలోని దౌడలు బిగుసుకున్నాయి.

జనం తలో మాట మాట్లాడుతున్నరు.
‘‘లొంగదీసుకునే అవకాశం ఉండగా కాల్పులు జరపటం ఎందుకు’’ అన్నారొకరు
‘‘పోలీసుల తీరు చూడబోతే చంపటానికే వచ్చినట్టుంది’’
‘‘పోలీసులు ఎక్కడ ఆగుతలేరు… మొన్న మా ఊరిలో మా పెద్దనాన్న కొడుకు ఇంట్ల పన్నోన్ని తీసుకపోయి ఊరవతల తాళ్ళల్ల కాల్చి చంపిండ్లు.’’ అన్నారు ఒకరు బాధగా
‘‘పోలీసుల పట్ట పగ్గాలు లేకుండా పోతానయి’’
‘‘వాళ్ళను అనేమి లాభంలేదు. ప్రభుత్వమే వాళ్ళకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చింది.. ఎంతమందిని చంపితే అన్ని ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహిస్తుంది’’
‘‘మంచోళ్ళను బ్రతకనిస్తలేరు… లంగలు దొంగలదే రాజ్యమైంది’’ మరొకరు భారంగా నిట్టూర్చిండు.
నస్పూర్‌ కాలనీలో పోలీసులకు సికాస నాయకులకు మధ్య కాల్పులు జరుగుతున్న వార్త గాలి కంటే వేగంగా ప్రాకి పోయింది.

ఏం జరుగుతుందో చూద్దామని కొందరు, చేస్తున్న పనులను ఆపి మరికొందరు… బజార్లుకు వచ్చిన వాళ్ళు విషయం తెలిసి అటు నుంచి అటే పరుగు పెట్టి వచ్చిన వాళ్ళు… స్త్రీలు పిల్లలు వృద్దులని తేడా లేకుండా ప్రవాహంలా వచ్చిపడుతున్న వారితో నస్పూర్‌ రోడ్డు కిక్కిరిసింది.

రాత్రి బదిలీ చేసి ఇంటికి పోతున్నా కార్మికుడు ఒకరు మార్గ మధ్యలోనే విషయం తెలిసి ఇంటికిపోకుండా ఇటు నుంచి ఇటే పరుగున వచ్చిండు. రాత్రంత నిదురలేక అలసిన మొఖంలో విషాదం కమ్ముకోగా వచ్చి ‘‘ఎవరున్నారట?’’అంటూ ప్రక్కవాడిని ఆత్రుతగా అడిగిండు.
అంతవరదాక పోలీసుల కాల్పులకేసి బీరిపోయి చూస్తున్న వాడల్లా ఒక క్షణం ప్రక్కకు తిరిగి ‘‘అదే తెలుస్త లేదు’’ అన్నడు.
ఇందాకటి కార్మికునికి ఆ సమాధానం సంతృప్తి ఇచ్చినట్టు లేదు… అతను అసహనంగా గునుక్కుంటూ మందిని పాపుకుంటూ ముందుకు పోయిండు….

ఒకవైపు గుంపుగా నిలుచున్న స్త్రీలలో నడీడు వయసున్న స్త్రీ ఒకరు నెత్తిని బాదుకుంటూ పెద్దగా ఏడుస్తున్నది. ఆమెను ఊకుంచాలన్న ఆలోచన కూడా ఎవ్వరికి వచ్చినట్టు లేదు.. ఎవరికి వారు కొంగును నోటికి అడ్డం పెట్టుకొని పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపట్టుకున్న వాళ్ళు, కొందరైతే మాట పలుకు లేకుండా బీరిపోయిండ్లు…. వాళ్ళను కరుసుకొని పోయి ఏం జరుగుతుందో ఏమో అర్థంకాక భయంతో బిక్కసచ్చిపోయిన పిల్లలు….
చుట్టు ప్రక్కల ఉన్న క్వార్టర్స్‌కు బయటి నుండి పోలీసులు గొల్లాలు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక, ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో వణికిపోతున్నరు….

లోపల ఉన్నవాళ్ళు లోపలే ఉన్నరు. దరిదాపులో ఎవరు లేకుండా తరిమివేయటం వలన నం దూరంగా నిలబడి చూస్తున్నారు.. క్వార్టర్స్‌ను అనుకొని కొందరు.. కాస్త దూరంలో నిలబడిన పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టుకొని ఒకసారి రెండవ నెంబర్‌ క్వార్టర్స్‌కేసి మరోసారి దూరంగా నిలుచొని ఆదేశాలిస్తున్న అధికారులకేసి భయం భయంగా చూస్తున్నారు. ఎందుకంటే క్వార్టర్స్‌ లోపల ఉన్నది సికాస నాయకులు, ప్రాణాలకు తెగించినోళ్ళు… వాళ్ళ దగ్గర ఆయుధాలుంటయి…. ఏదైనా ఎటమటం అయితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనే భయం పోలీసుల కళ్ళల్లో కనిపిస్తుంది. అడుగు ముందుకు వెయ్యాలంటే ఎనకా ముందాడుతాండ్లు… వారికి కాస్త దూరంలో పోలీసు వాహనాలు నిలిపి ఉన్న చోట చుట్టూ రక్షణగా నిలుచున్న సాయుధ పోలీసుల మధ్య డియస్పీ తోక తొక్కిన పాములా బుసలు కొడుతూ ఏవో ఆదేశాలు ఇస్తున్నాడు కానీ దూరంగా ఉన్న మాకు ఆయన మాటలేమి విన్పించటం లేదు.

కొందరు పోలీసులు రెండవ నెంబర్‌ క్వార్టర్‌ ముందుకు చేరుకున్నారు. అందరి చేతిలో ఎస్‌.యల్‌.ఆర్‌, ఏ.కె. వంటి ఆధునిక ఆయుధాలున్నాయి. ఏ క్షణంలోనైనా కాల్పులు జరిపేలా పొజిషన్‌ తీసుకొని నిలుచున్నరు.
యస్సై ఒకరు వారికి నాయకత్వం వహిస్తున్నాడు.. అతను ఏదో సైగ చేసిండు…
కొంతమంది పోలీసులు ముందుకు కదిలి తలుపుకు రెండు వైపులా నక్కి చేతులు చాచి తలుపును బడ బడ బాదుతూ.. ‘‘తలుపు తీయండి’’ అంటూ పదే పదే అరవ సాగిండ్లు…
కాని తలుపులు తెరుచుకోలేదు.. దాంతో తలుపు కాడ నిలుచున్న పోలీసులకు ఏం చెయ్యలో తోచక యస్సైకేసి చూసిండ్లు.

యస్సై తన రెండు చేతులతో రివాల్వర్‌ పట్టుకొని గోడ వారగా వచ్చి తలుపుకు కుడివైపు చేరుకున్నాడు. పెద్దగా గొంతు పెంచి ‘‘లోపల ఎవలున్నా వచ్చి సరెండర్‌ కావాలి. లేకుంటే కాల్పులు జరుపుతం’’ అంటూ బిగ్గరగా అరిచిండు…
కాని అటు వైపునుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు… దాంతో ఆయనకు ఏం చెయ్యాలో అర్థంకాక దూరంగా నిలుచున్న డియస్పీకేసి చూసి లాభం లేదన్నట్లుగా చేతులు ఆడించిండు…
తదేకంగా అటువైపే చూస్తున్న పోలీసు అధికారి అసహనంతో కోపంతో రగిలిపోయిండు. తలుపు బద్దలు కొట్టమన్నట్టుగా, కాల్పులు జరపమన్నట్టుగా పెద్దగా అరుస్తూ రెండు చేతులతో సంజ్ఞలు చేసిండు.

తలుపు రెండు వైపులా నిలుచున్న పోలీసులు తుపాకులు మర్లేసి తలుపులు బాదసాగిండ్లు. మరోవైపు కిటికీల పొంటి అంతవరదాక నిలుచున్న పోలీసులు తుపాకులు పొజిషన్‌లో పట్టుకొని మెల్లగా మెడలు చాచి లోపల ఎవరున్నరో తొంగి చూసిండ్లు.

సామాన్యంగా కార్మికులు పాతిక ముప్పయేండ్లు సర్వీస్‌ చేస్తే కాని క్వార్టర్‌ రాదు… అది కూడా అందరికి రాదు.. ఎటువంటి క్వార్టర్‌ సౌకర్యం రాకుండానే చాలమంది కార్మికులు జీవితాలు గడిచిపోతాయి. ఇంటి కిరాయి క్రింద కంపెనీ చెల్లించే అలవెన్స్‌తో ఒంటిగది రేకుల షెడ్డు కూడా రాదు. దాంతో మెజార్టీ కార్మికులు తాము స్వంతంగా వేసుకున్న గుడిసెల్లోనే ఉంటారు. అక్కడ ఏ కనీస మానవ అవసరాలు కూడా ఉండవు. పాతికేండ్లో ముప్పై ఏండ్లో సర్వీస్‌ చేసిన తరువాతనో కంపెని సీనియార్టీ ప్రకారం ఏ కొందరికో కంపెనీ క్వార్టర్స్‌ ఇచ్చినా అందులోకి పోయేవాళ్ళు కూడా తక్కువే… ఎందుకంటే అప్పటికే ఎక్కడో అక్కడ గుడిసెలు వేసుకొని సెటిలయిపోయి ఉంటరు…. కంపెనీ ఇచ్చే క్వార్టర్‌ అంతకొడితే నాలుగైదు వందల అడుగుల విస్తీర్ణం మించి ఉండదు. ఒక చిన్న ముందు గది… దాన్ని అనుకొని ఒక మంచం పట్టెంత పడకగది.. దాని వెనుక వైపు వరండా, వరండాలో ఒకవైపు నాల్గు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల పొడవు ఉండే చిన్న వంటగది.. క్వార్టర్‌ వెనుక వైపు గోడల అనుకొని నడుము వరకు ఎత్తులో నిర్మించిన కాంపౌండ్‌కు వెనుక వైపున ఒక దర్వాజ మరో మూలన బాత్‌రూమ్‌, పాయఖాన ఉంటుంది.

బెడ్‌రూమ్‌ కిటికి తలుపులు మూసి ఉంది. ముందు గదిలో మూడున్నర ఫీట్ల ఎత్తు ఒక ఫీటు వెడల్పు ఉన్న కిటికీ కొద్దిగా తెరిచి ఉంది. ఆ కిటికి నుండి లోపలికి తొంగి చూసిన జవాన్‌ ఒక్కసారిగా పరుగున యస్సై దగ్గరికి ఉరికి వచ్చిండు…
భయంతో అతను ఎంతగా వణికిపోతున్నాడంటే అతనికి నోట మాట రావడం లేదు. చమటతో తడిసిపోయిండు…
‘‘ఏమైంది ఏమైంది?’’ అంటూ యస్సై దగ్గరికి వచ్చిండు.
ఆ జవాను అతికష్టం మీద ‘‘సార్‌ లోపల ఎక్కడున్నడోనని ఇలా కిటికి కొద్దిగా జరిపి చూస్తున్న అంతలోనే తుపాకి పేలింది. సర్రున తల వెనక్కి లాగానో లేదో గుండు నాకండ్ల ముందు నుండే సర్రున పోయింది. ఒక క్షణం అటు ఇటయినా పుచ్చ పేలి పోయేది’’ అంటూ వణుక సాగిండు…

‘‘లోపల ఎంతమంది ఉన్నారంటావు?’’ అసహనంగా గుణిగిండు యస్సై.
‘‘అదే అర్థమైతలేదు సార్‌ మొత్తానికైతే చాలమందే ఉన్నట్టుంది’’ అన్నాడు జవాన్‌ బేలగా…’’
అంతా విన్న యస్సై డియస్పీ దగ్గరికి పరుగుపెట్టిండు. డియస్పీ ఆలోచనల్లో పడ్డాడు. చాలామందే ఉండి ఉంటారు అన్న భావన ఆయన మనసులో మెదిలి, ఒకే సమయంలో సంతోషం విచారం కల్గించింది. ఎందుకంటే ఒకేసారి సికాసకు చెందిన చాలామంది నాయకులను తుడిచిపెట్టే అవకాశం వచ్చినందుకు మనస్సులో సంతోషంగా ఉంది. అదే సమయంలో ఏదైనా ఎటమటమై నష్టం జరిగితే ఎట్లా అన్న బాధ కల్గి దాంతో అతను వెంటనే ఎటు తెల్చుకోలేక పోయిండు. ఆ వెంటనే పై అధికారులకు ఫోన్‌ చేసిండు.
పై నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో ఏమో కాని ఆయన కాల్పులు ఆపించి స్థానిక సర్కిల్‌ యస్పైలతో కాసేపు మంతనాలు చేసిండు. కాల్పులు ఆగే సరికి జనం ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఏం జరుగుబోతుందోనని ఆందోళన చెందిండ్లు.


పాలిపోయిన మొఖం చింపిరి గడ్డం కలిగిన కార్మికుడు ఒకరు.. ఆందోళన చెందుతూ ‘‘చాలామంది ఉన్నరంటా’’… అన్నాడు బాధగా…
‘‘అందరికి అందరా’’ అంటూ ఆశ్చర్యంగా నోరెల్లబెట్టిన కార్మికుడొకరు ‘‘అట్లయితే సికాసకు పెద్ధ లాసే’’ అంటూ విషాదంగా తలాడిరచి భారంగా నిట్టూర్చిండు….
‘‘ఇంతకు ఎవ్వరున్నరట?’’ అన్నారోకరు ఉత్కంఠతో..
‘‘అశోకన్న ఉన్నడా?’’ మరొకరు ఆత్రంగా అడిగిండు….
‘‘ఏమో తెలియదు’ అన్నాడు భారంగా…

3
ఎవరు బయటికి ఏం చెప్పటం లేదు కాని ఏదో తెలియని బాధ అందరి మనసులో గూడు కట్టుకొని ఉంది. బహుశా తమకు ఎంతో ఆత్మీయుడు తమ కండ్లముందే కనుమరుగు అవుతుంటే ఏమి చెయ్యలేని నిస్సహాయస్థితిలో వాళ్ళంత మునిగి పోయిండ్లు…


ఇన్ని వేల మంది కార్మికుల ప్రేమను సికాస నాయకులు ఎలా పొందగలిగారు.. బొగ్గు బాయిలో నిత్య ప్రమాదాల మధ్య, చావు బతుకుల మధ్య నోరులేని మూగ జీవుల్లా ఎనకటి నిజాం దొరలను మరిపించే బాయి దొరల పెత్తనాల క్రింద నలిగిపోయారు. చిన్న పనిపడ్డా, అవసరం వచ్చినా న్యాయంగా రావాల్సింది రావాలన్నా ఫలానా పనికి ఫలానా రేటు అంటూ ముక్కు పిండి వసూలు చేసే సోకాల్డు కార్మిక నాయకుల మోసాలకు బలైపోయారు.

భయం భయంగా బ్రతికే కార్మికుల గుడిసే గుడిసెకు తిరిగి, వాళ్ళు పెట్టింది తిని వాళ్ళలో ఒకరుగా రాడికల్స్‌ కలిసిపోయి, వాళ్ళ బాధను తమ బాధగా మలుచుకొని వాళ్ళను చైతన్య పరిచి అగ్ని కణాలుగా చేసింది వాళ్ళే కదా!

ఇవ్వాళ బాయి దొర గుడ్లు ఉరిమితే భయపడే కార్మికుడు లేడు. ఇవ్వాళ కార్మికులు ఎటువంటి భయం బెదురు లేకుండా దొరల కండ్లలోకి సూటిగా చూస్తూ సమస్యలపై నిలదీస్తున్నారు. బొగ్గుబాయి కార్మికుల ప్రాణాలకు గడ్డిపోచ విలువ ఇవ్వకుండా ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవటం పేరుమీద బొగ్గుబాయి రక్షణ సూత్రాలను తుంగలో తొక్కే విధానలను సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతవరదాక కాలిక్రింది దుమ్ములాగ అణిగిమణిగి ఉండే కార్మికులు ఎదురు తిరిగి ప్రశ్నించేసరికి దొరలకు మింగుడు పడటం లేదు. ‘‘అంత చెడిపోయిండ్లు’’ అంటూ గొణుకుంటున్నారు. ‘ఎటు తిరిగి ఎటు వస్తుందో ఎందుకొచ్చిన తంటా తమకు’ అంటూ పట్టిపట్టనట్టు ఉంటాండ్లు. అంతకు ముందయితే కార్మికున్ని ‘అరేయ్‌ తురేయ్‌’ అని తప్ప పిలువని బాయి దొరలు ఇవ్వాళ కార్మికులను పేరుపెట్టి పీలుస్తాండ్లు… ‘మేము ఉద్యోగులమే’ అంటూ సన్నాయినొక్కులు నొక్కుతాండ్లు.

ఇక జాతీయ సంఘాల నాయకుల పరిస్థితి అయితే మరింత దిగజారింది. మేనేజ్‌మెంట్‌ సంకలో దూరి మునపటిలా కార్మికులను మాయమాటలు చెప్పి మత్పరించే పరిస్థితి లేదు. కార్మికులు ఏదైనా సమస్య మీద సమ్మె చేస్తే ఆగమేఘాల మీద ఉరికివచ్చి ‘మేం మాట్లాడుతాం, కొట్లాడుతాం’ అంటూ మాయమాటలు చెప్పి బాయిలకు దించేవారు. ఇప్పుడు అటువంటి మాయమాటలు నడువకుంటా పోయినవి. గతంలో మాదిరి ఎవ్వరైనా యూనియన్‌ నాయకుడు సమ్మెలను విఫలం చెయ్యాలని ప్రయత్నిస్తే వాళ్ళ మెడలో వెయ్యటానికి పాత బూట్లదండను కార్మికులు రడీగా పెట్టుకుంటాండ్లు… కార్మికుల్లో ఇంత చైతన్యం ఎలా వచ్చింది…?

తమ ప్రాణాలు లెక్క చెయ్యకుండా కార్మికుల కోసం, వారి హక్కుల కోసం వారికి మెరుగైన జీవితం కావాలని, మనుష్యుల్లా బ్రతికే సమాజం కావాలని ఎంతమంది అమరులు తమ ప్రాణాలు పణంగా పెట్టిపోరాడారు.
ప్రజలను పీడిస్తూ దోపిడీ చేసే పాలకులకు దోపిడీ పీడనలను ప్రశ్నించటం నేరం అయింది. ఎదురు తిరిగి పోరాడటం అంతకంటే పెద్ద నేరం అయింది. దాంతో అంతవరదాక శాంతి కాముకులుగా, ప్రజాస్వామికవాదులుగా ముసుగులు వేసుకుని తిరిగే పాలకవర్గాల అసలు రంగు బయట పడిరది. ఒక నగ్నమైన కృారత్వం వికట్టా హాసం చేస్తుంది. క్రూరమైన దాడి మొదలైంది. ఘనత వహించిన రాజ్యాంగం అది కల్పించిన హక్కులు అన్ని భుక్తమై పోయాయి. ప్రశ్నించే గొంతుకల పీక నులుముతాండ్లు. ఎదిరించే చేతులు నరికివేయబడుతున్నాయి. ప్రజల రక్తం ఏరులై పారుతుంది. తుపాకీ మొన మీద శాంతి పావురాన్ని ఎగరేసి శాంతి భద్రతలు పరిరక్షణ చేస్తున్నారు. సింగరేణిలో జరిగింది అదేకదా!

సింగరేణి కార్మికులు ఏమి అడిగారని ఇంత హింస. ప్రకృతి విరుద్ధంగా భూమి పొరల్లో వందల అడుగుల లోతుల్లో ఊపిరి ఆడని గర్మిపేసుల్లో గుక్కెడు గుక్కెడు నీళ్ళు తాగుతు తమ చెమటతో బొగ్గు పెల్లలను రక్తం అద్ది ఉత్పత్తి చేసి బొగ్గు లోకానికి వెలుగు పంచితే కార్మికుని గుడిసెల్లో మాత్రం ఒక బల్బు కూడా వెలుగలేకపోయింది. నీ చట్టం నిర్దేశించిన బొగ్గు గనుల రక్షణ సూత్రాలను అమలు జరుపాలన్నందుకు, మురికికూపాల్లాంటి మా గుడిసెలకు త్రాగేందుకు గుక్కెడు నీళ్ళు కావాలన్నందుకు, చదువు సంధ్యలు లేక తెర్లయిపోతున్న మా పిల్లలకు స్కూళ్ళు కావాలన్నందుకు, బొగ్గు బాయి ప్రమాదాల్లో దెబ్బలు తాకి చావు బ్రతుకుల మీద ఉన్నప్పుడు, రోగాలకు సరిపడ మందులు కావాలన్నందుకు కార్మికుల ఇళ్ళు వొళ్ళు గుల్లచేసే సారాయి మహమ్మారిని బందు పెట్టాలని అడిగినప్పుడు… కార్మికుల రక్తాన్ని జలగల్లా పీల్చుకుని లాభాలుగా మలుచుకోవటం తప్ప, కార్మికులను మనుష్యుల్లా చూడని దుర్మార్గమైన పరిస్థితులను వ్యతిరేకించినందుకు పాలకులకు ఎంత కోపం!అణిగి మణిగి ఉండాలి తప్ప, ఎదురు తిరిగి ప్రశ్నించకూడదని, హక్కుల గురించి అసలే అడగకూడదని పాలకులకు ఎంత కోపం…..?

కార్మికులు ఎప్పటిలా అణిగి మణిగి ఉంచాలని దేశంలోని సకల సైనిక బలగాలను కాలరీ ప్రాంతంలో మోహరించి, బాయి బాయికి వాడ వాడకు సాయుధ పోలీసుల క్యాంపులు పెట్టి, కార్మికుల కుత్తుకల మీద బాయినెట్‌లు పెట్టి వారితో బలవంతంగా పనులు చేయించే దుర్మార్గం చెలాయించారు. సమస్యలతో సతమతమయిపోయి, ఇక భరించలేమని కార్మికులు తప్పని సరై సమ్మెలు చేస్తే పాలకుల ఎంత హైరానా?

సమ్మెలను అణచటానికి, సమ్మెకారులను భయబ్రాంతులకు గురి చేయటానికి కార్మికవాడల్లో సైనిక కవాతులు, ఫ్లాగ్‌మార్చ్‌లు.. ఇండ్ల మీద దాడులు చేసి ఇంట్ల ఉన్న వారిని బలవంతంగా ఎత్తుకపోయి పోలీసులు పహారా మధ్య ఎటు కదలకుండా చేసి బలవంతంగా పనులు చేయించాలని చూసిండ్లు.
కాని తుపాకులు బొగ్గు తవ్వలేవుకదా! బొగ్గు తీయాలంటే కార్మికులు పని చెయ్యాల్సిందే.. అంత నిర్బంధ పరిస్థితిలో కూడా చావనైనా చస్తాంకాని బొగ్గు పెల్ల ముట్టేది లేదంటూ భీష్మించుకకూచున్న కార్మికుల మొండితనం, చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది?

తమ బాకాలూదే మీడియాలో మంత్రులు, స్వయంగా ముఖ్యమంత్రి కూడా ‘అసలు కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావటం లేదంటూ’ అమాయకంగా మొఖం పెట్టి ప్రశ్నించినప్పుడు… ఎంత నటన…..
అసలు కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారో తెలియని అమాయకులా వీళ్ళు? అన్ని తెలిసి సమ్మెలను అణచటానికి నిర్భంధం అమలు జరుపుతూ, అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, కార్యకర్తలను బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమారుస్తూ చెయ్యవలసిన బీభత్సం అంతా చేస్తూనే ఎంత ప్రజాస్వామికవాదులుగా, శాంతికాముకులుగా ఫోజులు కొట్టే రాక్షసత్వాన్ని ఏమనాలి?

అంతవరదాక కాల్పులు ఆపుకొని, పోలీసు అధికారులంతా ఒక చోట గుమికూడి మంతనాలు జరిపిండ్లు. పోలీసులలో మళ్ళీ కదలికలు మొదలైనవి.
‘‘ఏం జరుగబోతుంది.. మళ్ళీ కాల్పులు జరుగుతాయా?’’ ఎవరో కీచు గొంతుకతో అరిచిండు
దాడి చెయ్యటానికి పోలీసులు రెండు బ్యాచీలుగా చీలిండ్లు. ఒక బ్యాచ్‌ ముందు వైపుకు, మరో బ్యాచ్‌ క్వార్టర్‌ వెనుక వైపుకు దారితీసిండ్లు.
‘‘అన్ని వైపుల నుండి దాడి చేస్తారేమో’’


‘‘ఎత్తుకు ఎత్తు ఒడ్డు పొడుగు ఉన్నవాడు శ్రీరాంపూర్‌ ఎస్సై లక్ష్మీనారాయణ కదూ’’ అంటు వెనుక వైపు పోతున్న పోలీసు బ్యాచ్‌కేసి చూసి అన్నారెవరో…
‘‘అవును వాడే’’
మనసు ఉద్విగ్నత చెందింది. బుర్ర పని చెయ్యటం లేదు. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. నా చుట్టూ ఉన్న జర్నలిస్టు మిత్రులు, జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.

దూరంగా నర్సింగరావు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. మనిషి ఎంతగా ఆందోళన చెందాడంటే మొఖమంత జేవురించుకపోయి చమటలు పట్టినవి. ఉద్వేగ్నాన్ని ఆపుకోలేక బీడి మీద బీడి తాగుతున్నాడు.
నా దగ్గరి దాక వచ్చి ‘‘అన్నా మనం ఏం చెయ్యలేమా?’’ అంటూ గుణిగిండు..
‘‘పోలీసులు ఏమన్న అవకాశం ఇస్తే కదా! ఏమన్నా మాట్లాడేది’’ అన్నాను బాధగా
‘‘లేదు లేదు వాళ్ళు చంపాలనే వచ్చిండ్లు’’ అసహనంగా తలాడిస్తూ గుణిగిండు.
ఏదో జరుగబోతుందని తెలిసి ఆత్రంగా జనం ఇంకా వస్తూనే ఉన్నారు.

శ్రీరాంపూర్‌ వైపు నుండి జనం ఒక గుంపుగా వస్తున్నారు. ఆ గుంపు ముందు వరుసలో నిలుచున్న యువకుడు ఒకరు పిడికిలి బిగించి మెడనరాలు ఉబ్బిపోగా ‘‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’’ అంటూ నినదించిండు. మిగిత జనం కూడా ‘‘నశించాలి’’ అంటూ పెద్దగా అరిచిండ్లు.


వాళ్ళు అలా గుంపుగా నినదిస్తూ రావటం దూరంగా నిలుచొని పర్యవేక్షిస్తున్న డియస్పీని కలవరపరిచింది. పోలీసులు చూస్తనో ముప్పయి నలుభైమందికంటే ఎక్కువ లేరు. ఇన్‌ఫార్మర్‌ నుండి సమాచారం అందటంతోనే స్థానిక సర్కిల్‌ ఆ విషయం మంచిర్యాల డియస్పీ ఆఫీసుకు ఫోన్‌ చేసి చెప్పిండు… ఏమాత్రం ఆలస్యం అయినా చేతికి చిక్కిన పిట్ట పారి పోతుందని వీలైనంత తొందరలోనే పని ముగించుకోవాలని ఆదరబాదరగా వచ్చిండ్లు.


శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న పోలీసు ఫోర్స్‌ను వెంటేసుకుని సర్కిల్‌ హుటా హుటిన బయలుదేరి వచ్చిండు. ఈ లోపున డియస్పీ కూడా వచ్చిండు..
అంత పది నిమిషాల్లో పని ముగిసిపోతుందనుకున్న పోలీసులకు అటువైపు నుంచి కూడా ప్రతి ఘటన ఏర్పడటంతో పని అనుకున్నంత ఈజీ కాలేదు.
గట్టు చప్పుడు కాకుండా ‘పని’ అయిపోతుంది అనుకుంటే కాలేదు. పొద్దటి పూట కావడంతో ఆ సమాచారం బయట పడి జనం రావటం, జనం అంతకంతకు ఎక్కువ కావటం డియస్పీకి ఎటు పాలు పోవడం లేదు…. ఇప్పుడిక జనం నినాదాలు చేస్తూ ముందుకు రావటం ఆయన్నీ మరింత కలవర పరిచింది. ఊహించని పరిణామంకు ఆయన మొఖంలో నెత్తురు చుక్కలేకుండా పేలిపోయింది. మరింత ఆలస్యం చేస్తే పరిస్థితి చెయ్యిదాటి పోతుందని భావించి రెండు చేతులు ఆడిస్తూ బిగ్గరగా ‘‘జనాలను దగ్గరికి రాకుండా దూరంగా గెదమండి’’ అంటూ అరిచి కాల్పులకు ఆర్డర్‌ వేసిండు.

పటపట మంటూ పోలీసుల వైపు నుండి ర్యాపిడ్‌ ఫైరింగ్‌ మొదలైంది. లక్ష్యం లేకుండా పోలీసులు గుడ్డిగా క్వార్టర్‌కేసి కాల్పులు చేస్తున్నారు.
తెలంగాణలో జనాలకు ఎన్‌కౌంటర్ల గురించి వినటం కొత్తకాదు. ఎన్‌కౌంటర్‌ అంటే పోలీసులు ఏ అర్థరాత్రో, అపరాత్రో, ఊళ్ళ మీదికి వచ్చి ఇండ్ల మీద దాడులు చేసి ప్రక్కలో పండుకున్న వారిని, తల్లిదండ్రుల ముందు భార్య పిల్లలు చూస్తుండగానే పట్టుకపోయి ఏ ఊరవతలో కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌ కట్టు కథలు అల్లడం కొత్తేమికాదు. అసలు ఎన్‌కౌంటర్‌ అంటేనే పట్టుకపోయి కాల్చి చంపటం అనే అర్థం జనంలో స్థిరపడిపోయింది… కూంబింగ్‌ వెళ్ళిన పోలీసులకు నక్సలైట్లు తారసపడ్డారని అట్లా తారసపడ్డ వారిని పోలీసులు లొంగిపొమ్మని పలుమార్లు హెచ్చరించినా వినకుండా తమపై కాల్పులు జరుపగా ఆత్మ రక్షణార్థమై ఎదురు కాల్పులు జరిపామని, కాల్పుల అనంతరం పోయి చూడగా అక్కడ పలానా నక్సలైటు చనిపోయి ఉన్నాడని చెప్పే కట్టుకథలు విని విని జనం విసిగిపోయిండ్లు.
కాని ఇప్పుడు తమ కండ్లముందే నిజమైన ఎన్‌కౌంటర్‌ జరుగుతుండటంతో జనం ఊపిరి బిగపట్టిండ్లు… భయంతో బిగుసుకపోయిండ్లు…

జడివానలా పోలీసులు కాల్చిన గుండ్లు గోడలకు కిటికిలకు తాకి క్రింద పడిపోతున్నవి. తుపాకులు పేలినప్పుడు వచ్చే శబ్ధాలు, సన్నటి పొగలు చూసి జనం కొందరు పరుగులు పెట్టిండ్లు… మరికొందరు ఆసక్తిగా మరింత ముందుకు పోయి చూడ సాగిండ్లు.
‘‘అయిపోయింది… అయిపోయింది అన్నలను చంపేస్తాండ్లు చంపేస్తాండ్లు’’ అంటూ జనం హాహాకారాలు చేస్తున్నారు….
మేమంత ఊపిరి బిగపట్టి చూస్తున్నాం…
క్వార్టర్‌కు వెనుక వైపు వెళ్ళిన పోలీసు బ్యాచ్‌ అంత ఎత్తులేని గోడల మీదుగా తొంగి చూస్తూ కాల్పులు జరుపుతున్నారు. వెనుక వైపు మూసి ఉన్న తలుపులకు తూటాలు తగిలి నేలరాలుతున్నవి…

కంపెనీ చేపట్టే అన్ని కాంట్రాక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకున్నట్టు గానే క్వార్టర్స్‌ నిర్మాణంలో కూడా అవినీతి చోటు చేసుకొన్నది. ఆ క్వార్టర్స్‌ నిర్మించిన కాంట్రాక్టర్‌ అంత నాణ్యత లేని తలుపులు పెట్టిండు.. రివ్వున వచ్చే తుపాకి గుండ్లకు తలుపు చెక్కలు బిచ్చలు బిచ్చలుగా పేళ్ళు లేచి పడుతున్నవి.

క్వార్టర్‌ వెనుక వైపు తలుపు మూసి ఉండటం ఎంతకు తెరుచుకోక పోవటం, అటువైపు నుండి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాకపోవటం యస్సైకి కొంత ధైర్యం కల్గించింది. వెనుక వైపు కాంపౌండ్‌లోకి పోయి దగ్గరి నుండి కాల్పులు జరుపాలని భావించిండు. ఆ ఆలోచన వచ్చిందే తడువు, ఒక కానిస్టేబుల్‌ను కాంపౌండ్‌ గోడకున్న తలుపులు తెరువాలని ఆదేశించిండు.
ఆ కానిస్టేబుల్‌ ఒకసారి పిట్టగోడను పరికించి చూసి, ఏం ప్రమాదం లేదని భావించి ఒక్క ఉదుటున పిట్టగోడ దునికి గొల్లెం తీసిండు.
ఆ వెంటనే యస్సై, ఆయన వెంట మరో నల్గురు పోలీసులు కాల్పులు జరుపుతూ రివ్వున లోపలికి చొచ్చుకపోయిండ్లు.

ఈ లోపున ఏమైందో ఏమోకాని ఒక్క క్షణం తలుపు తెరుచుకొని లోపలి నుండి రివ్వున చొచ్చుకొచ్చిన గుండు లోపలికి ఉరికివస్తున్న యస్సైకి తాకి ఆయన అక్కడికి అక్కడే కుప్పకూలిపోయిండు.
యస్సై పడిపోవటం చూసి మిగతా పోలీసులు ప్రాణభయంతో అరుచుకుంటూ వెనక్కి పరుగు బెట్టిండ్లు..
ఆ ఒక్క నిముషం చాలు.
పోలీసులు కంగారులో ఉండి తేరుకోకముందే రివ్వున వెనుక తలుపు తెరుచుకొని అశోక్‌ బయటికి వచ్చిండు. మరు క్షణంలో ఆయన ప్రక్కన ఉన్న ప్రహారి గోడ దునికిండు.

‘‘అదిగో అశోకన్నా పారిపోతుండు’’ ఎవరో పెద్ద గొంతుకతో ఆనందం పట్టలేక అరిచిండు.
క్వార్టర్‌కు వెనుకవైపున ఉన్న జనం ఆశ్చర్యంగా చూస్తుండగానే మరో రెండు గోడలు దూకిండు. కాని ఎక్కడ చూసిన చుట్టుముట్టి ఉన్న పోలీసులే కనిపించిండ్లు. ఇక ముందుకు పోవడం లాభం లేదనుకున్నాడో ఏమోకాని ఐదవ నెంబర్‌ క్వార్టర్‌ వెనుకవైపు తలుపు తీసి ఉన్నది గమనించి రివ్వున అందులో చొచ్చుకపోయి తలుపు వేసుకున్నడు.
చుట్టు ఉన్న జనమే కాదు… తేరుకున్న పోలీసులు కూడా అది గమనించిండ్లు…
‘‘అశోకన్నా ఐదవ నెంబర్‌ క్వార్టర్‌లోకి పోయిండు’’ ఎవరో పెద్దగా అరిచిండ్లు.
‘‘ఎవరి క్వార్టర్‌ అది’’
‘‘గొల్ల శంకరయ్యది ఆయన శ్రీరాంపూర్‌ బావిలో మాతోనే పనిచేస్తడు’’ అంటూ మరో కార్మికుడు బదులిచ్చిండు.
‘‘వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా’’
ఇందాకటి కార్మికుడు సమాధానంగా ‘‘బహుశా ఉండే ఉంటరు. ఎందుకంటే శంకరయ్యకు పది రోజుల క్రింద బాయిలో ప్రమాదం జరిగి కాలు విరిగింది. మొన్ననే ఏరియా హస్పిటల్‌కు పోయి సిమెంట్‌ పట్టి వేయించుకొని వచ్చిండు.’’ అన్నడు.

తుపాకి గుండు దూసుకవచ్చినప్పుడు యస్సైకి క్షణకాలం ఏం జరిగిందో అర్థం కాలేదు. సన్నగా ఏదో తొడకు తాకినట్టు అయ్యింది. ఏం జరిగిందోనని చెయ్యితో తడిమే సరికి చివ్వున రక్తం పొంగుతుంది. అది చూసి భయంతో వణుకుతూ నేల మీద పడిపోయిండు. మరుక్షణం తెరుకొని తల ఎత్తి చూసేసరికి తనకండ్ల ముందు నుండి రివ్వున ఉరికి వచ్చి అశోక్‌ గోడను దునకటం లీలగా గుర్తుంది. చుట్టు చూసే సరికి దరిదాపులు జవాన్లు ఎవ్వరు లేకుండా పారిపోయారు. ప్రాణభయంతో మెల్లగా చేతుల మీద ప్రాకుతూ వెనుక దర్వాజ కాడికి చేరిండు.
యస్సై పడిపోయేసరికి పోలీసులు గందరగోళానికి గురైండ్లు. కాల్పులు అగినవి. ఊహించని సంఘటనకు డియస్పి కంగారుపడ్డాడు. యస్సై బ్రతికి ఉన్నాడా? చనిపోయాడా అన్నది మొదట ఆయనకు అర్థం కాలేదు. ఆ వెంటనే ఆయన గాయపడిన యస్సైను తీసుక రావాలని తన క్రింద ఉన్న పోలీసులను ఆదేశించిండు.

మరి కాసేపట్లో పోలీసులు గాయపడిన యస్సైని చేతుల మీద ఎత్తుకొని పోయిండ్లు.
ఆ ఇంట్లో నక్సలైట్లు ఎవ్వరు లేరని నిర్ధారించుకున్న తరువాత పోలీసులు ఆ ఇంటిని మళ్ళీ చుట్టు ముట్టిండ్లు. తుపాకి మడమలతో తలుపును బాదుతూ ‘‘తలుపు తెరువ్‌, లేకుంటే బద్దలు చేస్తం. ఇంట్ల ఉండగానే తగులబెడ్తం’’ అంటూ అదే పనిగా అరవసాగిండ్లు.

4
భయంతో వణికిపోతు నిరంజన తలుపులు తెరిచింది. ఆ వెంటనే లోనికి చొచ్చుక వచ్చిన పోలీసులు నిరంజన మీద తుపాకి మడమలతో బాదుతూ దాడి చేసిండ్లు. మరికొంత మంది పోలీసులు తుపాకులు ఎక్కు పెట్టుకొని భయం భయంగా మిగతా గదులు గాలించిండ్లు. కాని ఎవ్వరు కనిపించలేదు….
‘‘మొగన్ని బయిటికి పంపి మిండనితోని కులుకుతున్నవానే లంజె’’ అంటూ పోలీసు వాడొకడు తుపాకి మడమతో మొఖం మీద గుద్దిండు.
మూతి మొఖం చిట్లి బల్లున రక్తం కారింది… నాలుగు వైపుల నుండి లాఠీలు విరుచుకపడుతున్నాయి. దెబ్బలకు తాళలేక నిస్సయంగా భయంతో పెద్దగా అరుస్తూ కుప్పకూలిపోయింది.

పడిపోయిన తరువాత కూడా పోలీసు లాఠీలు ఆగలేదు. క్రింద పడిపోయిన నిరంజన దెబ్బలకు తాళలేక అరుస్తుంది.
‘‘అ లంజెదాన్ని బయటికి గుంజుకరాండ్లీ’’ బయట నిలుచున్న యస్సై అరిచిండు.
రెండు జబ్బల క్రింద చేతులు వేసి ఇద్దరు పోలీసులు పట్టుకోగా మరికొంత మంది కాళ్ళవైపు పట్టుకొని అప్పటికే దాదాపు సోయితప్పే స్థితిలో ఉన్న నిరంజనను బయటికి గుంజుకొచ్చిండ్లు.
‘‘వాళింట్ల మన్నుపొయ్య పొల్లను చంపేసిండ్లా?’’ అంటూ జుట్టంత నెరిసిపోయి, రేగినజుట్టుతో మొఖమంతా పీక్కపోయి ఉన్న ఓ అవ్వ గుండెలు బాదుకుంటూ అరిచింది.
‘‘అరే మొగోళ్ళు అయితే మొగోళ్ళతోని పెట్టుకోవాలి. ఇంట్ల ఉండి వండిపెట్టే ఆడోళ్ళ మీదనా మీ ప్రతాపం?’’ అటూ నోరంత తెరుచుకొని పోలీసుల మీద విరుచుక పడింది.
‘‘ఏయ్‌ ముసల్దానా నోరు మూసుకో… లేకుంటే మొఖం పచ్చడైతది’’ అంటూ కోపానికి వచ్చిన పోలీసు వాడు తుపాకి మర్లెసిండు.
కాని ముసల్ది ఏమాత్రం జంకినట్టులేదు. మరో అడుగు ముందుకొచ్చి ‘‘ఏందిరా కొడ్తావురా కొట్టు… ఏం పాపం చేసినమని కొడ్తవురా’’ అంటూ గయ్యిమని లేచింది.

ఇందాకటి జవానుకు నిజంగానే కోపం వచ్చి చేతిలోని లాఠీ ఎత్తి ముసల్దాని మీదికి ఉరికిండు. కాని మరో కానిస్టేబుల్‌ ‘‘ గా ముసల్దానీతోని ఎందిరా’’ అంటూ వారించి వెంట తీస్కోని పోయిండు.
అప్పటికి పోలీసులు నిరంజనను గొర్ర గొర్ర గుంజుకపోయి పోలీసు వ్యానులో కుదేసిండ్లు…
అదంతా చూసి మనసు ఉండబట్టలేకపోయింది. ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. మందిని పాపుకుంటూ సరసర ముందుకుపోతుంటే ‘‘ఏందన్నా ఎటుపోతానవు?’’ అంటూ ఆగయ్య అడిగిండు.


‘‘దా పోయి పోలీసు అధికారితో మాట్లాడుదాం’’ అన్నాను ముందుకు నడుస్తూ
‘‘ఏం మాట్లాడుదాం?’’
‘‘ఏదో ఒకటి ప్రయత్నం చెద్దాం’’
‘‘ఏమోనన్న పోలీసులు వింటారన్న నమ్మకం లేదు’’ అంటూనే నా వెంట నడిచిండు…
అప్పటికే గాయపడిన యస్సైను హస్పటల్‌కు పంపించి ఏం చేద్దాం అన్న ఆలోచనల్లో ఉన్నారు పోలీసులు.
మేము ముందుకు రావటం చూసిన డియస్పీ మొఖం ప్రశ్నార్ధకంగా మారింది. అంతవరదాక తన క్రింది స్థాయి అధికారులతో మాట్లాడుతున్న వాడల్లా మాటలు ఆపి మావైపు కోపంగా చూసిండు. మిగతా పోలీసు అధికారులు కూడా నిలువు గుడ్లేసుకుని చూస్తున్నారు….

యస్సై గాయపడటం పోలీసులు ఊహించలేదు… అంత సజావుగా ఆపరేషన్‌ జరిగిపోతుందనుకున్నారు. ఒకటి అరా తప్ప ఇంతవరకు పోలీసులు చెప్పే ఎన్‌కౌంటర్లన్నీ ఏకపక్షంగా జరిగినవే. ఎక్కడైనా నిజంగానే పోలీసులకు నక్సలైట్లకు ఎదురు కాల్పులు జరిగితే ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డ విప్లవకారుల ముందు పొట్టకూటి కోసం పోలీసైన వాళ్ళు నిలబడలేకపోయేవాళ్ళు. వాళ్ళకు బ్రతుకు భయం ఉంటుంది. పెండ్లాం పిల్లలు గుర్తుకు వస్తరు. అందుకే తెగింపు ఉండదు. వాళ్ళకు ఆజ్ఞలు ఇచ్చే పై అధికారులేమో దూరం దూరంగా ఉండి జవాన్లను ముందుకు తోసి తాము మాత్రం సేఫ్‌ సైడ్‌లో ఉంటారు… ప్రభుత్వం నుంచి ఏదైనా అవార్డులు రివార్డులు వచ్చేకాడ మాత్రం ముందు వరుసలో ఉంటరు…


మేము డియస్పీ దగ్గరికి పోతుంటే, అంతవరదాక డియస్పీకి రక్షణగా వలయాకారంలో నిలుచున్న సాయుధ పోలీసులు ఒకరు ఆపిండు…
‘‘మేము జర్నలిస్టులం సార్‌తో మాట్లాడేదుంది’’ అన్నాను…
ఏం చెయ్యమంటారు అన్నట్టుగా జవాన్‌ డియస్పీకేసి చూసిండు..
డియస్పీ చిరాకు పడిపోతూ రానియ్‌ అన్నట్టుగా చెయ్యి ఆడించిండు.
ఏంటీ అన్నట్టుగా డియస్పీ మా వైపు కొత్తగా అప్పుడే చూస్తున్నట్టుగా కోపంగా చూసిండు…
ఇదే డియస్పీ పొద్దున ప్రెస్‌ మీట్‌ సందర్భంగా చిరకాలం పరిచయం ఉన్న మిత్రుడైనట్టు ఎంతో కలివిడిగా మాట్లాడిన మొఖానికి, ఇప్పటి మొఖానికి పోలికే లేదు… కండపట్టిన అతని ఎర్రటి మొఖం కోపంతో ఉక్రోషంతో ఉడికిపోతుంది. మేము రావటం ఆయనకు ఇష్టం లేనట్టుంది.

‘‘ఏం కావాలి మీకు?’’ అంటూ కోపంగా గుచ్చి చూసిండు…
‘‘సార్‌ ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు సార్‌ మాకో అవకాశం ఇవ్వండి’’ అన్నాను.
‘‘అవకాశం ఇస్తే ఏం చేస్తరు?’’ అంటూ గయ్యిమన్నడు. కోపంతో అతని పెదాలు వణికినవి.
‘‘అశోక్‌తో మాట్లాడుతం లొంగిపొయ్యేలా చేస్తాం… అటు తరువాత చట్టప్రకారం చెయ్యల్సింది చేయవచ్చు’’ అన్నాను.


‘‘ఏం మాకు చట్టం గురించి చెప్తానవా? ఏం చెయ్యలో మాకు బాగా తెలుసు’’ అన్నాడు కోపంగా…. ఆ వెంటనే ఆయన తన చుట్టూ ఉన్న క్రిందిస్థాయి అధికారులకేసి చూసి ‘‘ఆ లంజ కొడుకు మన యస్సైని కాలిస్తే సచ్చేటోడు బ్రతికిండు… అటువంటి వానితోని ఈయన పోయి మాట్లాడుతడట… లొంగిపొయ్యేలా చేస్తడంట, మనమేమో గాజులు పెట్టుకొని కూచోవాలంట’’ అంటూ వ్యంగ్యంగా దీర్ఘం తీసిండు….
‘‘లేదు సార్‌, ఆయన లొంగిపోతడో లేదో తెలియదు… ఒక ప్రయత్నం చేస్తే ఎటువంటి నష్టం ఉండదు అందరికి మంచిదేకదా’’ అన్నాను…


‘‘ఏది మంచో ఏదీ చెడ్డో మాకు తెలుసు…. మీరు మాకేమి చెప్పవద్దు మేం చేయాల్సింది ఏమిటో చేస్తం. మా పనికి అడ్డురాకండి’’ అన్నాడు కటువుగా.
‘‘సార్‌ ఒకసారి ఆలోచించండి’’ అన్నాను నా మాట పూర్తికాక ముందే డియస్పీ తన చుట్టు నిలుచొని ఉన్న జవాన్లతో ‘‘వీరిని బయటికి పంపించండి’’ అంటూ చెయ్యి ఆడించిండు.


(ఇంకా ఉంది…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply