వీరుడు-4

(గత సంచిక తరువాయి…)

6

1985 మే నెలలో కోల్‌ ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ వాళ్ళ సమ్మె జరుగుతుంది. బొగ్గు బాయి పనిలో బొగ్గు నింపే కార్మికులదే ప్రధానమైన పాత్ర. మొత్తం కార్మికుల్లో ఎక్కువ శాతం మంది కార్మికులు వాళ్ళే ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా కార్మికులందరు వారికి సపోర్టింగ్‌ పాత్ర అని చెప్పవచ్చు. ఉత్పత్తిలో కీలకమైన పాత్ర వహించే ఫిల్లింగ్‌ కార్మికులది పీసు రేటు వర్క్‌, అంటే ఎంత పని చేస్తే అంత లేదా ఎన్ని టబ్బులు నింపితే అంత జీతమన్నమాట, మిగతా కార్మికులందరిది మంత్లిరేటు లేదా డేలిరేటు లెక్క జీతాలు ఇస్తరు.
ఒకే సంస్థలో పనిచేసే కార్మికుల మధ్య ఎందుకు ఈ తేడాలున్నవి అన్న అనుమానం రావచ్చు. ఇక్కడే మేనేజుమెంటు తెలివి ఉంది. ఎక్కడ ‘కీ’ ఇస్తే మొత్తం యంత్రాంగమంతా నడుస్తుందో అటువంటి ‘కీ’ని మేనేజుమెంటు తన గుప్పిట్లో పెట్టుకుంది. అంటే మేనేజుమెంటుకు ఏది లాభసాటి అయితే అది చేస్తుందన్నమాట.

1980 తరువాత సింగరేణిలో క్రాప్టు సంఘాలు పుట్టుకొచ్చినవి. సింగరేణిలో వివిధ క్యాటగిరిల్లో పనిచేసే కార్మికులందరూ తమ తమ సమస్యలను పరిష్కరించటంలో జాతీయ సంఘాలు పట్టించుకోవటంలేదని, దాంతో అసంతృప్తి చెందిన వివిధ సెక్షన్ల కార్మికులు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో క్రాప్టు సంఘాలు ఏర్పాటు చేసుకొన్నారు. అటువంటి సంఘాల్లో కోల్‌ ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ బలమైనది.

వారం రోజులగా ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు పనులు బందుపెట్టి సమ్మె చేస్తున్నారు. దాంతో బావులు సక్రమంగా నడువని పరిస్థితి ఉంది.
అసోసియేషన్‌ వాళ్ళ డిమాండ్లు ఏమిటంటే ముఖ్యంగా ఇటీవల మేనేజుమెంటు కొన్ని బావుల్లో ఫేసులో (ఫిల్లింగ్‌ పని చేసే స్థలంలో) కార్మికుల సంఖ్యను పెంచింది. పదిమంది పనిచేసేకాడ, పన్నెండు మందిని పెట్టింది. దాంతో సమస్య వచ్చింది. మేనేజ్‌మెంటు గుట్టు చప్పుడు కాకుండా ఫేసుల్లో ఫిల్లర్స్‌ సంఖ్య పెంచటం ద్వారా క్రమంగా కార్మికుల అందరి మీద ఆ మేరకు పనిభారం పెంచింది. బొగ్గునింపే పేసులు ఇరుకుగా ఉంటాయి. అందులో పది మంది మెదలటమే కష్టమయ్యే చోట పన్నెండు మంది మెదలటం కష్టమైతాంది. దానికి తోడు ఎన్ని టబ్బులు నింపితే అంత జీతం కాబట్టి తొందరగా బొగ్గు నింపాలనే యావలో వారిలో వారికే తెలియని పోటీ ఏర్పడిరది. మరో వైపున ఇతర కార్మికులకు కూడా ఆ మేరకు పని భారం పెరిగింది. టబ్బులు సప్లయి చేసే ట్రామర్‌ కార్మికులు గతంలో పదిమందికి టబ్బులు సప్లయి చేసే కాడ పన్నెండు మందికి టబ్బులు సప్లయి చెయ్యాల్సి వచ్చింది. అలాగే బొగ్గు దగాయించే కార్మికులు ఇప్పుడు పన్నెండు మందికి సరిపడ బొగ్గు దగాయించాల్సి వస్తుంది. లేకుంటే బొగ్గు సరిగా కూల్చలేదని ఫిల్లర్‌ కార్మికులు లొల్లిపెట్టేవాళ్ళు, మైనింగ్‌ సర్దార్లు, వోవర్‌మెన్లు కూడా పది మంది బాగోగులు చూడాల్సిన చోట పన్నెండు మంది అవసరాలు చూడాల్సి వచ్చింది. ఫేసులో ఇద్దరు పిల్లర్స్‌ కార్మికులను ఎక్కువ చేయటం అనే చిన్న మార్పుతో మేనేజుమెంటు దాదాపు ఇరువై శాతం పనిభారం పెంచింది.

దీన్ని ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకించింది. దానికి తోడు బదిలీ ఫిల్లర్స్‌ పర్మినెంటు చేయటంలో ఉన్న రూల్స్‌ను అతిక్రమించి, కంటిన్యూ సర్వీస్‌ నిండకుండా అర్నెల్లకో మూడు నెల్లకో ఒక రోజు టర్మినేషన్‌ చేసి మళ్ళీ పనుల్లోకి తీసుకొనేది. దీని వల్ల బదిలీ కార్మికులు అండర్‌ గ్రౌండ్‌లో ఒక సంవత్సరములో నూట ఎనభై మస్టర్లు నిండితే పర్మినెంట్‌ చెయ్యాలనే మైనింగ్‌ రూల్‌ అమలులోకి రాకుండా పోయ్యేది. దాంతో బదిలీ ఫిల్లర్స్‌ ఏండ్లకు ఏండ్లు పర్మినెంటుకు నోచుకోక వెట్టి చెయ్యాల్సి వచ్చేది. ఇట్లా మరికొన్ని సమస్యలు కలిపి అసోసియేషన్‌ సమ్మె నోటీసు ఇచ్చింది కాని మేనేజుమెంట్‌ పట్టించుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సాగదీస్తుంది…
దాంతో వాళ్ళు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయటం కోసం ఆ రోజు మందమర్రి జనరల్‌ మేనేజర్‌ ఆఫీసర్‌ ముందు ఉదయం పది గంటలకు ధర్నా కార్యక్రమం ఉంది.
‘‘తప్పకుంటా రావాలన్నా’’ అంటూ అసోసియేషన్‌ నాయకుడు సత్యనారాయణ మరీ మరీ ఫోన్‌ చేసి చెప్పిండు.
ధర్నాకు బయలుదేరుదామని బండి తీస్తుంటే బయటగేటు తీసుకొని లోపలికి వస్తూ రాజు కన్పించిండు. ఒక్క క్షణం నిలబడి పోయాను. మరుక్షణం మా ఇద్దరికే పరిమితమైన చిర్నవ్వు ఒక్కటి ఇద్దరి మొఖల్లో వెలిగింది.

రాజుది మందమర్రిలో మేముండే క్వార్టర్‌కు ఆవలివైపున ఒర్రె ఒడ్డున ఉండే దీపక్‌ నగర్‌ ఏరియా.. అక్కడంత ఎక్కువగా కూలినాలీ చేసుకొని బ్రతికే జనం ఉంటారు… రాజు తండ్రి ఉప్పరి పని చేసేవాడు. తరువాత ఏమైందో ఏమోగాని తాగుబోతుగా మారి కుటుంబం గురించి పట్టించుకొనేవాడు కాదు. తాగివచ్చి పెండ్లాం పిల్లలను కొట్టేవాడు.. ఆ బాధలు పడలేక రాజు తల్లి నాతో చెప్పుకొని ఏడ్చేది.. ఒకటి రెండు సార్లు పిలిచి మందలించిన. మందలించినప్పుడు ‘ఇంకోసారి అట్లా చెయ్యనని’ బుద్ధిగా తలూపేవాడు. కాని మళ్ళీ తాగితే మాత్రం వెర్రి కుక్క అయిపొయ్యేవాడు… ఒకసారి రాజును వాళ్ళ అయ్య కొడితే చెయ్యి విరిగి పదిహేను రోజులు పట్టి కట్టుకొని తిరిగిండు.. సరైన తిండి తిప్పలు, చదువు సంధ్యలు లేక బక్కగా పీలగా గాలివీస్తే కొట్టుకుపోయే విధంగా ఒంటి ఊపిరి ప్రాణంతో ఉండేవాడు. కాలరీ ప్రాంతంలో అటువంటి నిరుపేద కుటుంబాలకు లెక్కలేదు…
నా పనిలో నేనుండిపోయి వారి విషయం మరిచిపోయిన దాదాపు రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయింది. అటువంటి సమయంలో ఒక రోజు రాజు ఇంటికి వచ్చిండు. మనిషిలో మార్పు కనిపించింది. ఒకప్పుడు రాజు భయంగా బెరికి బెరికి ఒదిగినట్టుండేవాడు. ఇప్పుడుకాస్త పొడువైండు.. మూతిమీద సన్నగా మొలిచిన మీసకట్టు యవ్వనఛాయలు తెలియ చేస్తున్నయి. కండ్లలో మాత్రం ఇదివరకున్న బెరికితనం పోయి, స్థిరమైన చూపులతో ఉత్సహంగా ఉన్నాయి.
‘‘ఏమైందీ రాజు కనిపిస్తలేవు… ఇక్కడ ఉంటలేవా?’’ అని యధాలాపంగా అడిగాను…
‘‘ఉంటలేను సారు, రామక్రిష్ణాపూర్‌లో మా మేనత్త ఇంటికాడ ఉంటున్న’’ అన్నాడు ఉత్సాహంగా…
‘‘ఏం చేస్తున్నావు?’’
‘‘గదే ఉప్పరి పని’’ అన్నాడు నవ్వుతూ…
కాసేపు అది ఇది మాట్లాడిన తరువాత ‘‘ఏం పనిమీద వచ్చినవు?’’ అని అడిగాను..
‘‘కాస్త పనిమీదే వచ్చిన’’ అంటూ అటు ఇటు చూసి ఎవ్వరు లేరని నిర్ధారించుకొని రొంటి జేబులో పెట్టుకున్న మడిచిన కాగితం ఒక్కటి తీసి ఇచ్చిండు…
‘‘ఏంటదీ?’’
‘‘అశోకన్న పత్రిక ప్రకటన కోసం స్టేట్‌మెంటు పంపించిండు’’ అన్నాడు…

ఆ మాట విని ఒక్కసారి షాకు తగిలినట్టు అయ్యింది. ఎందుకంటే రాజును ఆ అవతారంలో చూస్తానని నేను ఊహించలేదు… అప్పటికి అశోక్‌ అజ్ఞాతంలోకి వెళ్ళి యాడాది దాటింది. పోలీసులు ఆయన కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నరు.
కాగితం విప్పి చూసాను.. రామక్రిష్ణాపూర్‌ ఏరియా హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం వలన సకాలంలో సరైన వైద్యం అందక కార్మికుని భార్య బాలింతరాలు చనిపోయింది. దాన్ని ఖండిస్తూ తక్షణమే ఏరియా హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్‌ చేస్తు అశోక్‌ ఇచ్చిన స్టేట్‌మెంటు అది..
‘‘సరే ఇవ్వాల పంపిస్తా, బహుశా రేపు పత్రికలో రావచ్చు’’ అన్నాను.
‘‘సరే అన్నా నేను వెళ్తా’’ అంటూ రాజు వెళ్ళిపోయిండు. కాని నా ఆలోచనలు ఇంకా రాజు చుట్టే తిరుగుతున్నవి… నదులన్నీ చివరికి సముద్రంలో కలువాలి అన్నట్టుగా ఎంత చేసినా కడుపు నిండక పేదరికంలో కునారిల్లే బ్రతుకులన్నీ చివరికి చేరాల్సిన గమ్యం అదే కదా! అనుకున్నాను.
అట్లా రాజు నాకు కొత్త రూపంలో కన్పించిండు. రాజు వచ్చిండు అంటే అశోక్‌ దగ్గర నుడి ఏదో పత్రిక ప్రకటన వచ్చినట్టే లెక్క…..
రాజును చూసి నేను ఇంట్లోకి వచ్చిన. నా వెంటే అతను లోపలికి వచ్చిండు.

‘‘పిల్లర్స్‌ అసోసియేషన్‌ వాళ్ళ ధర్నా ఉంది. కదా! అక్కడికి పోదామని బయలుదేరిన, నిముషం ఆలస్యమైతే దొరకక పోదును’’ అన్నాను. ‘‘పిల్లర్స్‌ అసోసియేషన్‌ సమ్మె మీద అన్న స్టేట్‌మెంటు ఇచ్చిండు’’ అంటూ తన అంగి జేబులో జాగ్రత్తగా మడిచిపెట్టుకున్న కాగితం తీసి ఇచ్చిండు… విప్పి చూశాను. నాకు అలవాటైన గుండ్రటి అందమైన అక్షరాలు. ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ సమ్మెకు మిగతా కార్మికులు కలిసి రావల్సిందిగా కోరుతూ సికాస ఇచ్చిన స్టేట్‌మెంటు అంది. స్టేట్‌మెంటు రెండు పేజీలున్నది. దాని సారం ఏమిటంటే ‘‘జాతీయ కార్మిక సంఘాల వైఫల్యం వలన సమస్యలు పేరుకపోయి, తమ సమస్యల సాధనకు అసోసియేషన్లు ఏర్పడి పోరాటాలు సాగిస్తున్నవి. ఇటువంటి సందర్భంలో వారి న్యాయమైన పోరాటానికి మిగతా కార్మిక వర్గం మద్దతుగా నిలబడాలి. అందరి సమస్యలకు మూలం మేనేజుమెంటు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, దోపిడియే కారణం, మన అందరి ఉమ్మడి శత్రువు ఒక్కరే, వారికి వంతపాడుతూ కార్మికులను అన్యాయం చేస్తున్న జాతీయ సంఘాలకు వ్యతిరేకంగా మనమంత ఐక్యంగా పోరాడాలి… కార్మికుల ఐక్యత మన బలం, విడిపోతే ఓడిపోతాం… ఇవ్వాళ ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ వారి సమ్మె కేవలం వారి సమస్య మాత్రమే కాదు, మేనేజుమెంటు అణిచివేత విధానంలో భాగంగానే చూడాలి…. కావున ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ ఇచ్చిన సమ్మె పిలుపుకు మిగతా కార్మికులు తమకెందుకు అని భావించి, డ్యూటీలు చేస్తే చివరికి మేనేజుమెంటు కార్మికులను విభజించు పాలించు అనే కుట్రకు బలికాక తప్పదు… కావున కార్మిక సోదరులు ఫిల్లర్స్‌ అసోసియేషన్‌ సమ్మెకు మద్ధతుగా సమ్మెలోకి రావల్సిందిగా కోరుతున్నాం…తద్వారా కార్మికుల ఐక్యతను చాటుదాం, మేనేజుమెంటు కుట్రలను ఓడిద్దాం’’ అని ఉంది.

అశోక్‌ నుండి వివిధ సందర్భాల్లో ఏదో ఒక ప్రకటన రావటం కొత్తేమి కాదు… ఆ స్టేట్‌మెంట్‌ చివర అశోక్‌ అనే సంతకం ఉండేది… కాని ఈసారి ఇచ్చిన స్టేట్‌మెంటు చివరలో అశోక్‌ అనే బదులు ‘‘రమాకాంత్‌’’ అని వ్రాసి ఉండడం ఆశ్చర్యం కల్గించింది.
గుండ్రంగా ఎంతో అందమైన అక్షరాలతో వ్రాసే అశోక్‌ స్టేట్‌మెంటు నాకు ఎరుకే… అదే రాత కాని క్రింద పేరు వేరుగా ఉండటం ఆశ్చర్యం కల్గించి అదే విషయం రాజును అడిగాను…
‘‘అశోకన్నే వ్రాసిండు’’అన్నాడు నింపాదిగా
‘‘అదే పేరు మార్చుకున్నడా?’’
‘‘అదేం లేదన్నా పత్రికా ప్రకటన ఇవ్వాలనుకున్నప్పుడు వివిధ పేర్లతో ఇచ్చినప్పుడు కార్మికుల్లో కొంత కన్‌ఫ్యూజన్‌ వస్తున్నది… ఒక ఏరియా బాధ్యుడు ప్రకటన ఇస్తే ఆ ఏరియాకు సంబంధించిందనే భావన ఏర్పడి కార్మికుల్లో గందరగోళం సృష్టిస్తున్నది. అట్లా కాకుండా సింగరేణి వ్యాపితంగా సికాస ఒకే పేరుమీద ప్రకటనలు ఇవ్వాలని కోల్‌ బెల్టు కమిటీ నిర్ణయించింది. అందుకే రమాకాంత్‌ పేరు మీద ప్రకటన వచ్చింది… భవిష్యత్‌ సింగరేణి వ్యాపితంగా ఏ ఏరియాలోనైనా ఏ సమస్య మీదనైన సికాస ప్రకటన ఇవ్వాల్సి వస్తే రమాకాంత్‌ పేరు మీదనే ప్రకటనలు వస్తాయి’’ అన్నాడు…

అప్పటి నుంచి అశోక్‌ ప్రకటనలన్నీ రమాకాంత్‌ పేరు మీదనే వచ్చేవి… క్రమంగా ‘రమాకాంత్‌’ అనే పేరు సికాసకు మారు పేరుగా కార్మికుల్లో ఆదరణ పొందింది.

**

అంతవరదాక అణిచి పెట్టిన ‘బంతి’ ఒకసారిగా పైకి లేచినట్టుగా సికాస ఆవిర్భావం తరువాత పెద్ద ఎత్తున కార్మికుల సమ్మెలు వచ్చినవి. చాలా సమ్మెలు జరుగటానికి కారణం మేనేజుమెంటు చట్ట ప్రకారం వ్యవహరించకపోవటం వల్ల జరిగినవే… బావుల్లో రక్షణ సరిగా లేదనో, పని చేసేకాడ గాలి ఆడటం లేదనో, లేదా తాగటానికి మంచినీళ్ళు కావాలనో, బూట్ల సప్లయి సరిగా ఉండాలనో, బొగ్గునింపే టబ్బులు సప్లయి సరిగా ఉండాలో, హాస్పిటల్లో మందులు సరిగా ఉండాలనో ఇలా చాలా చిన్న చిన్న కారణాలతో జరిగిన సమ్మెలే ఎక్కువగా ఉన్నాయి.
కాని అంతవరదాక ఎదీ ఉన్నా లేకున్నా తలలు వంచుకొని పనిచేసే కార్మికులు ఇలా తలలు ఎత్తి నిలదీయటం అధికారులకు పడని విషయమైంది. గతంలో కార్మికులకు ఏదైనా సమస్య వస్తే యూనియన్‌ నాయకుల దగ్గరికి పరుగులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు యూనియన్‌ నాయకులను అస్సలు లెక్క చేయకుండా తమ సమస్యలపై తామే నిలబడి పోరాటం చెయ్యటం అటు మేనేజుమెంటుకు యూనియన్‌ నాయకులకు మింగుడు పడటం లేదు. ‘‘కార్మికులు చెడిపోయిండ్లు’’ అంటూ కోపంతో రుస రుస లాడసాగిండ్లు…
‘‘ఇట్లా చీటికి మాటికి సమ్మెలు జరిగితే టార్గెటు ఎట్లా వస్తది… చివరికి కంపెనిని మూసేసుకోవల్సిందే’’ అంటూ మేనేజుమెంటు యూనియన్‌ నాయకులు కలసి మంతనాలు చేసిండ్లు….
ఇల్లీగల్‌ సమ్మెలు అణచటానికి స్ట్రయిక్‌ కంట్రోలింగ్‌ కమిటీ’లు ఏర్పాటు చేసిండ్లు.. అందులో యూనియన్‌ నాయకులు, మస్టర్లు పడి పనులు చేయకుండా అధికారుల చుట్టు తిరుగుతూ గాలి వాటంగా బ్రతికే వాళ్ళతోని, కంపెని తొత్తులతోని కమిటీలు ఏర్పాటు చేసిండ్లు… కార్మికులు ఏదైన సమస్య వచ్చి పనులు బందు పెడ్తే స్ట్రయిక్‌ కంట్రోలింగ్‌ కమిటి నాయకులు ముందుకు వచ్చి ‘‘సమ్మెతో మాకేమి సంబంధం లేదు…. మేం బాయిలోకి దిగుతాం’’ అంటు జులుం చేసేవాళ్ళు.

ఎన్నడు బాయిలో దిగి తట్టెడు బొగ్గు ఎత్తని వాళ్ళు సమ్మెను విఫలం చెయ్యటానికి ముందుకు రావటం సమ్మెకారులకు కోపకారణమయ్యేది. దాంతో సమ్మె చేసే కార్మికులకు, కమిటీ సభ్యులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడేది. కొన్నిసార్లు ఈ ఘర్షణలు కొట్లాటదాక పోయేది.

చివరికి మేనేజుమెంటు స్ట్రయిక్‌ కంట్రోలింగ్‌ కమిటీల వల్ల లాభం లేదనుకొని గ్రీవెన్స్‌ ప్రొసిజర్‌ అంటూ కొత్త ఎత్తుగడ ముందుకు తెచ్చింది.
దాని ప్రకారం కార్మికునికి ఏదైనా సమస్య వస్తే ముందుగా బాయి అధికారుల ముందుకు తీసుకుపోవాలి, అక్కడ పరిష్కారం కాలేదనుకుంటే ఏరియా పరిధి అధికారుల దృష్టికి తీసుకుపోవాలి. అక్కడ పరిష్కారం కాకుంటే కార్పోరేటు స్థాయిలో పరిష్కరించుకోవాలి. ఇలా మూడంచల్లో సమస్య పరిష్కారం కాకుంటే అప్పుడు సమ్మె నోటీసు ఇచ్చి అక్కడ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే అప్పుడు మాత్రమే కార్మికులు సమ్మెలోకి పోవాలి. అది గ్రీవెన్స్‌ ప్రోసీజర్‌ పద్ధతి.
‘‘నీ అవ్వ అయ్యగారు వచ్చేదాక అమవాస్య అగుద్దా! బావుల్లో తాగేందుకు నీళ్ళు లేవంటే, ఫేసుల్ల రూప్‌ చిటపటలాడుతాంది. నొప్పులు వచ్చిన ఆడదాని తీర్గ ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉంది…. ఎప్పుడు బండపడ్తదో ఎప్పుడు ప్రాణాలు పోతయో తెలియకుండా ఉందంటే, నీయవ్వ కంపినోడు ఈ ప్రొసీజర్‌ ఆ ప్రోసిజర్‌ అంటూ కాలయాపన చేస్తే ఎప్పుడు సమస్య పరిష్కారం అయ్యేది? అంతవరదాక కార్మికుని ప్రాణాలు నిలువద్దా?’’ అంటూ కార్మికులు గ్రీవెన్స్‌ ప్రొసీజర్‌ను తిరస్కరించిండ్లు.

మేనేజుమెంటు ఎత్తులు పనిచెయ్యలేదు. సమ్మెలు ఆగిందిలేదు.. సరికదా మరింత పెరిగిపోయినవి.
మేనేజుమెంటు సామ దాన భేదోపాయాలు విఫలం కావటంతో దండోపాయానికి దిగింది.
యాడాది తిర్గేసరికి బావుల మీద సిఐయస్‌ఎఫ్‌ క్యాంపులు వచ్చినవి. ‘‘బొగ్గుబావుల మీద స్క్రాప్‌ దొంగతనాలు, బొగ్గు దొంగతనాలు పెరిగిపోయి కంపెనీకి నష్టం జరుగుతుంది. దొంగలను అరికట్టడం కోసం సిఐయస్‌ఎఫ్‌ జవాన్లు వచ్చిండ్లు’’ అంటూ మేనేజుమెంటు నమ్మబలికింది.
కాని సిఐయస్‌ఎఫ్‌ జవాన్లు వచ్చిన తరువాత ఏ దొంగతనాలు ఆగింది లేదు. అధికారులు బొగ్గు ట్రాన్స్‌పోర్టు కంట్రాక్టర్లతో లారీలకు లారీలు మాయం చెయ్యటం ఆగలేదు. సరికదా సిఐయస్‌ఎఫ్‌ అధికారులు బ్లాక్‌ దందా చేసే కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి గుట్టు చప్పుడు కాకుండా సంపాధనకు ఎగబడ్డారు.

సిఐయస్‌ఎఫ్‌ వాళ్ళు మొదట బావుల మీదికి వచ్చినప్పుడు కార్మికులను పులుకు పులుకున చూస్తూ ఎవ్వలని ఏమి అనేవారు కాదు. కాని రాను రాను బావుల మీద వారి పెత్తనం పెరిగిపోయింది. సమయం తప్పి వచ్చేవారిని నిలదీయటం సోదాలు చెయ్యటం ఎక్కువైంది. దొంగల సంగతి దేవుడెరుగు చివరికి ఇది ఏలా మారిందంటే బొగ్గు బాయిలో పనిచేసే కార్మికులు ఎవరైన బొగ్గు పొయ్యి అంటించుకోవటానికి పనికి రాని తుంటనో, బొగ్గు పెల్లనో, సైకిల్‌కు పెట్టుకొని తీసుకపోతుంటే పట్టుకొని కేసులు పెట్టడం, చార్జిషీటు ఇవ్వటం సస్పెండ్లు చెయ్యటం వరకు పోయింది.

ఇదే శ్రీరాంపూర్‌లోని ఆర్కె సిక్స్‌ బావి వద్ద సెకండ్‌ షిప్టు డ్యూటి చేసి ఇంటికి పోతున్న ఒక కార్మికున్ని సి.ఐ.యస్‌.ఎఫ్‌.జవాన్లు అకారణంగా కొట్టినప్పుడు కార్మికులు తిరగబడ్డారు. ఆ సందర్భంగా సిఐయస్‌ఎఫ్‌ జవాన్లు కాల్పులు జరుపగా ఎనిమిది మంది కార్మికులకు గాయాలైనవి. ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ కార్మికులు మూడు రోజులు సమ్మె చేసారు. దాంతో దిగివచ్చిన మెనేజుమెంటు జవాన్లతో క్షమాపణలు చెప్పించింది. ఆ రోజుల్లో ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. సిఐయస్‌ఎఫ్‌ జవాన్లు అరాచకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

మార్చి 1985లో రాష్ట్ర అసెంబ్లీకి అర్ధాంతరంగా ఎన్నికలు జరిగాయి. అంతకు రెండు సంవత్సరాల ముందు జనవరి 1983లో సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు, అంతవరదాక రాష్ట్రంలో ఎదురు లేకుండా పాలన చేసిన కాంగ్రెసు పార్టీని, ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఊరూర తిరిగి ప్రచారం సాగించిండు. ఆ సందర్భంగా మా మందమర్రి మార్కెటులో కూడా భారీ బహిరంగ సభ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం మంటగలిపిందని, నక్సలైట్లు దేశభక్తులని చాలా చెప్పుకొచ్చిండు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభంజనం సృష్టించిండు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడిరచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. కాని ఎన్టీరామారావులోని అహంభావ ధోరణి, పెత్తందారీ తనం భరించలేక పార్టీలోని రెండవశ్రేణి నాయకులు ఎన్టీరామారావు ఆరోగ్య నిమిత్తమై అమెరికా వెళ్ళిన సందర్భంలో ఆగష్టు 1984లో నాదెండ్ల భాస్కర్‌ రావు నాయకత్వంలో తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిండు.

కాని ప్రజలకు ఎన్టీరామారావు నిజస్వరూపం అప్పటికింకా అనుభవంలోకి రాలేదు. దాంతో ప్రజలు నాదెండ్ల భాస్కర్‌ రావు తిరుగుబాటును వ్యతిరేకించి, ప్రజాస్వామ్యం పరిరక్షించాలనీ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసిండ్లు.
సింగరేణి వ్యాప్తంగా కూడా ఆ ఉద్యమం సాగింది. దాంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున నిరసన రావటంతో అంతవరదాక తెరవెనుక ఉండి చక్రం తిప్పిన కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి గవర్నర్‌ రాంలాల్‌ను వెనక్కి పిలిపించి నూతనంగా రాష్ట్ర గవర్నర్‌గా శంకర్‌ దయాల్‌ శర్మను నియమించింది.

శాసనసభలో నాదెండ్ల మెజార్టీని నిరూపించుకోవటంలో విఫలం కావటంతో సరిగ్గా నెలరోజులకు నాదెండ్ల ప్రభుత్వం కూలిపోయింది. ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయిండు. కాని అహంభావం తలకెక్కిన ఎన్టీరామారావు ఆర్నెల్లకే శాసనసభను రద్దుచేసి మార్చి 1985లో ఎన్నికలకు పోయిండు. ఎన్నికల్లో మెజార్టీ సాధించి తిరిగి ముఖ్యమంత్రి అయిండు.
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్టీ రామారావు నిజ స్వరూపం బయట పడసాగింది. అంతకు ముందు నక్సలైట్స్‌ దేశభక్తులు అన్న నోటి నుండే నక్సలైట్లను అణచటానికి తీవ్ర నిర్భంధం అమలు జరిపిండు. ఆ విధంగా ప్రజా ఉద్యమాలపై మొదటి దశ నిర్బంధం మొదలైంది.
సిఆర్‌పిఎఫ్‌, స్టేట్‌ పోలీసులకు తోడుగా దేశ సరిహద్దులో రక్షణ చూడాల్సిన బియస్‌ఎఫ్‌, ఐటిబియస్‌ఎఫ్‌, వంటి సైనిక బలగాలను కోల్‌ బెల్టులో మోహరించారు. పోలీసులు ఏం చేసినా చెల్లుబాటు అయ్యే విధంగా విస్తృత అధికారాలు కల్పించారు.

తెలంగాణ పల్లెల్లో సాయుధ బలగాల క్యాంపులు వెలిసాయి. అత్యంత ఆధునికమైన ఆటోమెటిక్‌ ఆయుధాలతో, మిలిట్రి డ్రెస్‌లతో గుంపులు గుంపులుగా తిరుగుతు ఊళ్ళల్లో వాళ్ళు చెయ్యని అరాచకం లేదు. రైతాంగ కార్యకర్తలను పట్టుకొని కాల్చి చంపటం, కార్యకర్తల ఇండ్లను కూల్చటం, తిండి గింజల్లో విషం కలుపటం లేదా బావుల్లో పారబోయటం, సామూహికంగా అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టడం, అరెస్టు చేసి రోజుల తరబడి చిత్రహింసలు పెట్టడం వంటి అరాచకాలకు పాల్పడ్డారు. సాయుధ బలగాల ఇనుప పాదాల క్రింద తెలంగాణ పల్లెలు వణికిపోయాయి. ఎప్పుడు ఎవలని పట్టుకపోయి కాల్చిచంపుతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. తల్లిదండ్రుల కండ్లముందే కొడుకులను పట్టుపోయి కాల్చి చంపటం చేసారు. ఫాసిస్టు దమనకాండతో తెలంగాణ పల్లెలు రక్తసిక్తమయ్యాయి.

సింగరేణిలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఎందుకంటే సింగరేణి దక్షణాది రాష్ట్రాల పారిశ్రామిక అవసరాలను తీర్చే బొగ్గు అందించే సంస్థ. అటువంటి కీలక పరిశ్రమలో విప్లవోద్యమాన్ని అణిచి వెయ్యకుండా తమ మనుగడ సాధ్యం కాదని గ్రహించిన పాలక వర్గాలు సంగరేణిలో తీవ్ర నిర్భంధం అమలు జరిపారు. సింగరేణిని ప్రత్యేక పోలీసు జిల్లాగా ప్రకటించి డిఐజి స్థాయి అధికారిని నియమించి కోల్‌బెల్టు పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికుల రిక్రియేషన్‌ క్లబ్‌లు, ఆట మైదానాలు, కమ్యూనిటీ సెంటర్‌లు, కొత్తగా వచ్చిన సాయుధ బలగాలతో కిట కిల లాడుతున్నాయి. బావుల మీద క్యాంపులు వెలిసాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా గుంపులు గుంపులుగా సాయుధ పోలీసులు వీధుల్లో తిరుగుతు భయభ్రాంతులకు గురిచేశారు. రోడ్ల మీద జనాలను, వాహనాలను ఆపి చెక్‌ చేయటం. చీకటి మాటున దాగి హఠాత్తుగా మీదపడి దాడి చెయ్యటం, పట్టుకొని కొట్టడం, అనుమానంతో అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడం మొదలైంది. కార్మిక బస్తీలను ఒకసారి వందలాది మంది చుట్టుముట్టి ఇల్లిలు వెతకడం చేసేవాళ్ళు.

అంతకు ముందైతే పోలీసులు అంతగా కనిపించేవాళ్ళే కాదు. ఏదైన సమ్మె జరిగితే బావుల మీదికి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కాలరీ ప్రాంతంలో ఎక్కడ చూసిన వాళ్ళే కనిపిస్తున్నారు. చిప్ప టోపిలు పెట్టుకొని ఆధునిక ఆటోమెటిక్‌ ఆయుధాలతో మన భాష యాస తెలియని కొత్త మొఖాలు జనాలను భయపెట్టేది. రాత్రులందు తిరుగాలన్న, డ్యూటీ చేసి ఇంటికి రావాలన్న జనం భయపడసాగిండ్లు…
వీటికి తోడు సికాస కార్యకర్తల అనుమానాలు తెలుసుకోవటం కోసం, చిన్న చిన్న ఆయుధాలను అంగీల క్రింద దాచుకొని కార్యకర్తల ఆచూకి కోసం తిరిగే సివిల్‌ పోలీసులు కూడా ఎక్కువైండ్లు.
దానికి తోడు జులాయిగా తిరిగే యవకులను చేరదీసి వారికి డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి ఇన్‌ఫార్మర్లుగా మార్చుకోవటం చేసేవాళ్ళు. చివరికి ఇంటెలిజెన్స్‌ డిపార్టుమెంట్‌ వాళ్ళు మారువేషాలు వేసుకొని చిలుక పంచాంగం చెప్పేవారుగా, వీధిల్లో తిరిగే చిల్లర వ్యాపారస్తులుగా వేట సాగించేవాళ్ళు. పోలీసులు సాంస్కృతిక దళాలను ఏర్పాటు చేసిండ్లు. భారతి వంటి నాటకాలను ప్రదర్శిస్తూ నక్సలైట్లకు వ్యతిరేకంగా ప్రచారం సాగించేవాళ్ళు. అటువంటి ప్రదర్శన ఒకటి మందమర్రి మార్కెట్‌లో ప్రదర్శించినప్పుడు నేను చూసాను. కాని జనం స్పందించేవాళ్ళు కాదు. ఒక మాటైన మాట్లాడకుండా మౌనంగా పులుకు పులుకున చూసేవాళ్ళు.

చివరికి ఇది ఎలా మారిందంటే ఎవరైనా ఏదైనా పనిబడి ఏ అర్ధరాత్రో, అపరాత్రో తిరిగి రావాలన్నా భయపడేవాళ్ళు.. అటువంటి సంఘటన ఒకటి మా వాడకట్టున్నే జరిగింది.
ఒక్కరోజు పొద్దున్నే ఒకావిడ ఏడ్చుకుంటూ మా ఇంటికి వచ్చింది… ఆమె నాకు తెలిసినావిడే… ‘‘ఏమైందక్కా ఎందుకేడుస్తున్నావు?’’ అని అడిగాను…
ఆమె ఏడ్పును ఆపుకొని ‘‘అన్నా మా ఆయన ఊరెల్లి నిన్ననే రావాల్సి ఉండే, ఎందుకు రాలేదని ఫోను చేస్తే మొన్ననే బయలుదేరిపోయిండని తెలిసింది. ఏమైందో ఎటుపోయిండో తెలియక నేను గాబరాపడి వాళ్ళను వీళ్ళను అడిగితే అర్ధరాత్రి వస్తాంటే పోలీసులు పట్టుకపోయిండ్లట.. పోలీస్టేషన్‌కు పోయ్యి అడిగితే వాళ్ళేమో మేం ఎవ్వరిని పట్టుకరాలేదంటాండ్లు.. ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తాంటే అన్న దగ్గరికి పో ఏదైనా దారి దొరుకుద్ది అని నీ దగ్గరికి పంపించిండ్లు’’ అంది.
‘‘సరే అక్కా నేను తెలుసుకుంటాను, నువ్వేమి ఫికర్‌ పడకు’’ అని చెప్పి పంపించిన.

జర్నలిస్టు వృత్తిలో ఉంటాం కాబట్టి స్థానిక పోలీసులతో ఏదో విధమైన సంబంధాలుంటాయి. కొంతమంది అభిమానంతో చూస్తే, మరికొంత మంది మనసులో కోపం ఉన్నా పైకి మాత్రం మంచిగానే మాట్లాడుతారు.
నాకు తెలిసిన యస్సైకు ఫోను చేస్తే ‘‘అవునన్న నిజమే.. రాత్రి పెట్రోలింగ్‌ చేస్తాంటే అనుమానం వచ్చి పట్టుకున్నాం. చెక్‌ చేస్తే ఏముంది వాని దగ్గర గొడ్డలి దొరికింది. స్టేషన్‌కు తీసుకొచ్చినం’’ అన్నాడు..
‘‘అతను నాకు తెలిసినతను, పై ఇంక్లెయిన్‌లో జనరల్‌ మజ్దూర్‌ సొంతూరికి పోయిండట… తిరిగి వస్తూ ఎందుకైనా పని చేస్తదని ఇంటికాడున్న గొడ్డలిని తెచ్చుకుంటే ఇంత రాద్ధాంతం ఎందుకయ్య’’ అన్నాను.
యస్సై చిన్నగా నవ్వి ‘‘ఇంటారాగేషన్‌లో కూడా అదే తెలిసింది సర్కిల్‌ వచ్చినంక వదిలిపెడుతాం’’ అంటూ ఆ రోజు సాయంత్రం వదిలిండ్లు. ఇటువంటి సంఘటనలు చాలా జరిగినవి.

కాలరీ ప్రాంతం చాలా చిన్న ఏరియా, ప్రతి డివిజన్‌లో అక్కడొకటి ఇక్కడొకటి గుది గుచ్చినట్టుండే కార్మిక బస్తిలు ఉంటాయి. అక్కడే బొగ్గు బాయిలో పనిచేసే కార్మికులు ఎక్కువగా ఉంటారు. వారికి తోడు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూనో, ఇతరత్రా పనులు చేసుకుంటూ బ్రతికే వాళ్ళుంటారు… జనాభా చాలా తక్కువ. కాని అటువంటి చోట ప్రభుత్వం వేలాదిమంది బలగాలను మోహరించింది.

గతంలోనైతే సమ్మెలకు ముందు నిలిచి మాట్లాడే సికాస నాయకులు బావుల మీద కనిపించేవాళ్ళు. కాని అటువంటి వారిని గుర్తించి అరెస్టు చేసి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టడంతో గతంలో సికాస నాయకులుగా చెలామణి అయిన నాయకులు చాలామంది పోలీసు వేధింపులు భరించలేక మౌనం వహించిండ్లు. మరికొంతమంది దిగజారిపోయి సికాసకు రాజీనామాలు చేసిండ్లు.

అయినా సమ్మెలు అగకపోవటం ఆశ్చర్యం కల్గింది. బావుల మీద సమ్మెలు జరిగినప్పుడు నేరుగా పోలీసులే వచ్చి జోక్యం చేసుకుంటున్నారు. తుపాకులు చూపించి కార్మికులను బలవంతంగానైనా దించటానికి ప్రయత్నించిన సందర్భాలున్నాయి. అటువంటి సందర్భంలో బావుల మీద కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగినవి… పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తే, అక్రమంగా అరెస్టు చేసిన తోటి కార్మికులను విడుదల చెయ్యాలని కార్మికులు ధర్నాలు, ఊరేగింపు చేసిన సందర్భాలున్నాయి.

చిన్న చిన్న ప్యాకెట్లలో వేలాది సాయుధ బలగాలను దింపి, ఆయా ఏరియాలో సికాస అజ్ఞాత నాయకులను టార్గెటుగా చేసుకొని ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి, ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇంటెలిజెన్స్‌ డిపార్టుమెంటు వాళ్ళు మారు వేషాల్లో అణువు అణువు గాలించేది. ఇంత తీవ్ర నిర్భంధం కొనసాగుతుంటే సికాస నాయకులు అజ్ఞాతంలో ఉండి ఎలా మనుగడ కొనసాగిస్తున్నారో నాకు అర్థం అయ్యేది కాదు.

**

మాది మూడు తరాలుగా సింగరేణితో ముడిపడిపోయిన జీవితం. మా తాత బెల్లంపల్లి బొగ్గు గనుల్లో బోరింగ్‌ డిపార్ట్‌మెంటులో పనిచేసిండు. మా నాన్న పని చేసిండు. మూడవ తరం వాడినైన నేను కూడా బొగ్గు గనుల్లో పనిచేస్తున్నాను. నాన్న ఐదేండ్ల క్రింద దిగిపోయిండు. మాది పెద్ద కుటుంబం ముగ్గురు అన్నదమ్ములం, నలుగురు ఆడపడుచులు. అందరికి పెండ్లీలు అయినవి. అందరిలోకి నేనే పెద్దవాన్ని కావటంతో అందరి బరువు బాధ్యతలు చూడాల్సివచ్చేది.

ఈ వయస్సులో మీరు వేరుగా ఉండటం ఎందుకు నాన్న మాతోనే ఉండమంటే కాళ్ళు చేతులు ఆడినంత కాలం మా బ్రతుకేదో మేమే బ్రతుకుతాం’ అంటూ ససేమిరా అన్నాడు. అట్లా వాళ్ళు మంచిర్యాల రైల్వేస్టేషన్‌ అవలివైపున ఉండే హమాలి వాడలో ఇల్లు తీసుకొని అక్కడే ఉంటున్నారు.. అమ్మకు బి.పి., షుగరు వంటి వృద్ధాప్య సమస్యలు ఉండేవి. వారానికి రెండు మూడు సార్లయిన పోయి మంచి చెడ్డలు చూసేవాన్ని…

నాన్న గంభీరంగా ఉండేవాడు.. చాలా తక్కువగా మాట్లాడేవాడు. అమ్మ అందుకు భిన్నం.. అందుకే మాకు అమ్మ దగ్గర చనువు ఎక్కువ. ఆమెది దయార్థ్ర హృదయం కలది. తోటివారు ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటే కరిగిపోయి కన్నీరు కార్చేది.. చేతనైన సహాయం చేసేది. నాన్నది చాలీ చాలని జీతం. దానికి తోడు పెద్ద కుటుంబం.. తిండి తిప్పలు చదువు సంధ్యలు, రోగాలు రోష్టులతో కాలం భారంగా గడిచేది. అయినా ఉన్నంతలో అమ్మ పొదుపుగా నెట్టుకొచ్చేది.

చిన్నప్పటి నుండి నాది కాస్త దుడుకు స్వభావం. ఏదైనా చెడు అనిపిస్తే ఎంత పెద్దవారినైనా వ్యతిరేకించే వాన్ని.. దాంతో తగాదాలు కొట్లాటలు జరిగేవి. అటువంటివి జరిగినప్పుడు నాన్న కోపానికి వచ్చి ‘‘వీని పనేందో వీడు చేసుకొక ఊరి మీద లొల్లీలన్ని వీనికెందుకంటూ నా మీద కోపాన్ని అమ్మ మీద తీర్చేవాడు. అమ్మ ఏమి అనేది కాదు. పైగా మంచి కోసం నిలబడటం చాలా కష్టం బిడ్డా’ అనేది.

ఒక్కరోజు సాయంత్రం మంచిర్యాలలో ఒక ప్రెస్‌ మీట్‌ ఉంటే, దానికి హాజరై పనిలో పనిగా అమ్మను చూసి వస్తామని ఇంటికి పోయిన…
అప్పటికి రాత్రి ఎనిమిది అయినట్టుంది. నేను ఇంట్లోకి పోయేసరికి ఎవరో క్రింద కూచోని భోజనం చేస్తున్నారు. ఆయనకు ఎదురుగా అమ్మ కూచోని వడ్డన చేస్తూ ఏదో మాట్లాడుతున్నది.. నన్ను చూసి ‘‘ఏమైందిరా ఇప్పుడేనా?’’ అంటూ మొఖం విప్పారగా పలకరించింది. అన్నం తింటున్న వాడల్లా అతను మొఖం తిప్పి చూసి చిన్నగా నవ్విండు.
ఒక్కసారి షాకు తిన్నట్టుగా ఆశ్చర్యం కల్గింది. ఎవ్వరి కోసమైతే వేలాది మంది పోలీసులు శ్రీరాంపూర్‌ ఏరియాలో అణువు అణువు గాలిస్తున్నారో, ఎవ్వరి పేరు చెప్పితే మెనేజుమెంటు యూనియన్‌ నాయకులు వణికిపోతారో, ఆయన ఒక్క పిలుపు ఇస్తే చాలు, ఆయన పేరు మీద ఒక్క ఎర్ర పోస్టర్‌ పడినా కార్మికులు మంత్రముగ్దులై పోరు బాటలో నడుస్తారో. అదిగో అతనే అశోక్‌. ప్రభుత్వానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి అమ్మకెట్లా తెలుసు.. అసలు అమ్మకు ఆయన గురించి తెలుసా? అన్న సందేహంతో అమ్మ మొఖంలోకి చూసాను.
అమ్మ నిండుగా నవ్వి ‘‘ఎప్పుడైనా ఆకలైతే అమ్మా అని వస్తడు’’ అంది నింపాదిగా…
అమ్మకు అన్ని తెలిసినట్టే అన్పించింది. అంతకు మించి నేనే ఏం మాట్లాడలేదు… అతను భోజనం చేసి వచ్చి నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూచొని నింపాదిగా ‘‘అమ్మ కడుపు నిండి పోయింది’’ అన్నాడు… కాసేపు అది ఇది మాట్లాడి ‘ఇక నేను పోతా అమ్మా’ అంటూ లేచిండు…
‘‘సరే బిడ్డా’’ అంది అమ్మ.

నేనింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. ఇదంత నిజమా కలా అన్న భ్రమలో ఉన్నాను.. అతను బయిటికి పోతున్న వాడల్లా ఒక్క క్షణం నిలబడి పోయి నాకేసి చూసి ‘‘అమ్మ నీకే కాదు, నాకు అమ్మే’’ అంటూ చిర్నవ్వు నవ్వి బయటికి నడిచి చీకట్లో కలిసిపోయిండు.
నేను ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అమ్మకేసి చూసాను. అమ్మ భారంగా నిట్టూరింది ‘‘లంగల దొంగల రాజ్యమైంది.. నల్గురి మంచి కోసం పనిచేసే వాన్ని బ్రతకనివ్వని పాడు రోజులు వచ్చినయి… ఈ పాపం ఎన్ని రోజులు నడుస్తదో ఏమో!’’ అంది.

చాలీ చాలనీ బ్రతుకులతో జీవితమంతా కష్టాలు పడ్డ అమ్మకు తాను తన కుటుంబం తప్ప ఏం తెలియదు అనుకున్న అమ్మ అశోకన్న అప్పుడప్పుడైనా ఇక్కడికి వచ్చి పోతాడన్న విషయం నాకెప్పుడు మాట మాత్రమైన చెప్పలేదు.. అంతగా అతన్ని కడుపులో పెట్టుకున్నది.
ఆ రోజు అమ్మ నాకు కొత్తగా కనిపించింది.
కార్మికులు బస్తీలు తడకలతో అల్లుకున్న ఇరుకు ఇరుకు గుడిసెలు. ఒకటి రెండు గదుల కంటే ఎక్కువ ఉండవు. అవి కూడా ఒకదానిని అనుకొని మరొకటి ఉంటాయి. వాటిలో బాత్‌రూంలు, పాయఖాన్లకు బయిటికి పోవాల్సిందే… మూత్ర విసర్జన కోసం బయిటికి వచ్చినా చుట్టు ప్రక్కల ఎవరో ఒకరి కంట పడే పరిస్థితి ఉంటది.. అటువంటి కార్మిక బస్తీలే విప్లవకారులకు పెట్టని కోటలు, పొద్దంత తిరుగలేని పరిస్థితి, సంధ్య చీకట్ల వేళ, మనుషులు అటు ఇటు తిరుగాడే వేళ మాత్రం షెల్టర్‌కుపోవాలి. మళ్లీ ఏ చీకట్లో తిరిగి వెళ్ళాల్సి వచ్చేది… ఒకసారి షెల్టర్‌కు వస్తే మళ్ళీ చీకటయ్యే వరకు బయిటికి పోయ్యే పరిస్థితి ఉండదు… ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితిలో రహస్య కార్యకర్త మూత్రానికో దొడ్డికో పోవాల్సి వస్తే ఏ కుండల్లోనో, పేపర్లోనో దొడ్డికి పోవాల్సి వచ్చేది.. అటువంటి సమయంలో ఆ తల్లులు ఎంతో ఓపిగ్గా తన కడుపులో పుట్టిన బిడ్డల మల,మూత్రాలు తీసినట్టుగా విప్లవకారుల సేవలు చేసి కడుపులో దాచుకునేవాళ్ళు. ఏమాత్రం ఎక్స్‌పోజ్‌ అయిన ప్రాణాలు పోతయని తెలిసి కూడా కడుపులో పెట్టుకొని తమ కంచంలోని అన్నం పెట్టి సాదుకునే తల్లులే లేకుంటే విప్లవోద్యం ముందుకు సాగేదా! విప్లవకారులు బ్రతికిబట్టకట్టేవాళ్ళా…..
అటువంటి వేలాది మంది తల్లుల ప్రేమకు నోచుకున్న విప్లవకారులు నిజంగా ధన్యజీవులు. ఇంత నిర్భంధంలో కూడా కాలరీ ప్రాంతంలో విప్లవకారులు ఎలా బ్రతుకుతున్నారో నాకు అప్పుడు అర్థమైంది.

(మిగతా భాగం వచ్చే సంచికలో…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

Leave a Reply