‘ప్యాసా’, ‘కాగజ్ కె ఫూల్’ నటుడు, దర్శకుడు గురుదత్ ఆత్మకథలైనట్లే ‘కోర్టు’ సినిమా వీరా సాథీదార్ ఆత్మకథ అని చెప్పవచ్చు. అక్కడి వరకే పోలిక. గురుదత్ సాహిర్ లుధియాన్వీ వలె ప్రగతివాద కవి, కళాకారుడు కావచ్చు కానీ ప్రధానంగా స్వాప్నికుడు. అధోలోకం మీద ప్రేమ వరకే వీళ్ళ పోలిక. పుట్టుకలో, జీవనశైలిలో, మరణంలోమాత్రం ఏ పోలిక లేదు. గురుదత్ కలకత్తాలోని కళాకారుల భద్రలోక్‌లో పుట్టి ఆ ప్రపంచాన్ని హిందీ సినిమాలు తీసి విస్తృతించడానికి బొంబాయికి వచ్చి సినిమాల్లో విజయాలు సాధించి ప్రేమ సాఫల్యానికి, చేదు జీవిత సత్యాలకు మధ్యన రాజీపడక ఆత్మహత్య చేసుకున్నాడు. వీరా సాథీదార్‌గా మనకు, ప్రపంచానికి పరిచయమైన విపుల్ వరగడే విదర్భలో ఒక దళిత కుటుంబంలో 61 సంవత్సరాల క్రితం పుట్టాడు. వార్ధా జిల్లాలోని ఒక పల్లెటూరులో పుట్టి పశుల కాపరి బాల్యాన్ని మాత్రమే చూశాడు. దళితులు, ముఖ్యంగా డప్పు కొట్టే చమార్‌లు, పశువులను కాయడానికి, కూడేయడానికి ,పసితనం లోనే పాటలు , పిల్లనగ్రోవి వంటి వాద్యాలు నేర్వక తప్పని వెట్టివాళ్లు (పల్లెటూరి పిల్లవాడా, పశుల కాసే మొనగాడా, పాలు మరచి ఎన్నాళ్లయ్యిందో) శుష్కించిన తల్లి స్తన్యంతో కడుపు నిండకుండానే ఉగ్గుపాలతో జానపద పాటకు, వాద్యాలకు ఆకర్షితులవుతారు. అట్లా బాల్యంలోనే వీరా సాథీదార్ జానపద పాటకు, కవిత్వం, కళలకు ఆకర్షితుడయ్యాడు. ఆయన పుట్టడానికి నాలుగయిదు సంవత్సరాల ముందే ఆయన పుట్టిన నాగపూర్ లోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ‘పుట్టుక తన చేతిలో లేనందున హిందువుగా పుట్టినా హిందువుగా చావదలచుకోక’ బౌద్ధాన్ని ఐదు లక్షల మంది దళితులతో పాటు స్వీకరించాడు, బొంబాయిలో మరణించాడు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఈ ఆనంద విషాదాలు రెండూ వీర సాథీదార్ బాల్యాన్ని ప్రభావితం చేసినవి . తనకు తాను రాడికల్ అంబేద్కరైట్ నని ప్రకటించుకునే వీరా సాథీదార్ మరణించేనాటికి, విచిత్రంగా అటు ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా) నాగపూర్ యూనిట్ కు అధ్యక్షుడు. ఇటు ‘విద్రోహి’ ద్వైమాసిక పత్రిక సంపాదకుడు.
1997లో బొంబాయి ఘాట్ట్కోపర్ రమాబాయి నగర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి దుండగులు చెప్పుల దండ వేసాక రగిలిన దళిత ఆగ్రహాన్ని ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్ కాల్పులతో చల్లార్చ చూసినపుడు పదకొండుమంది దళితులు అమరులై, ఆవాన్ నాట్యమంచ్ ప్రజా వాగ్గేయకారుడు విలాస్ ఘోగ్రే ఆత్మహత్య నుంచి వేదన, తిరుగుబాటుతో ప్రభవించిన దళిత మైనారిటీ ముస్లిం ఐక్య సంస్థ ‘విద్రోహి’ పత్రిక. ఆ పత్రిక సంపాదకుడు, ఆ సంస్థ కన్వీనర్ సుధీర్ ధా ధావ్ లే తర్వాత కాలంలో బొంబాయిలో ‘రిపబ్లిక్ పాంథర్స్’ అనే సంస్థను అమెరికాలోని బ్లాక్ పాంథర్స్ మహారాష్ట్ర లోని దళిత్ పాంథర్స్ (1972) ప్రేరణతో పెట్టాడు . ఇటు ఫూలే, అంబేడ్కర్‌ల ప్రభావం, నక్సల్బరీ ప్రభావాలతో ఏర్పడిన దళిత ప్యాంథర్స్ వలెనే ‘రిపబ్లికన్ ప్యాంథర్స్’ ఫూలే, అంబేడ్కర్ భావాలు, శాస్త్రీయ సామ్యవాద భావాలు సాంస్కృతిక రంగంలో ప్రచారం చేయడానికి పూనుకున్నారు. భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో ఉన్న కన్వీనర్ సుధీర్ ధావ్లే అరెస్టు తర్వాత రిపబ్లిక్ ప్యాంథర్స్‌కు, ఎల్గార్ పరిషత్‌కు నాగపూర్‌లో కన్వీనర్‌గా వున్న వీరా సాథీ దార్ ‘విద్రోహి’ సంపాదకత్వం చేపట్టాడు.
‘కోర్టు’ సినిమాలో వీరా సాథీదార్ నారాయణ కాంబ్లే పాత్రను పోషించాడు. అందులో అతడు తన నిజ జీవితంలో వలెనే కవి, ప్రజా గాయకుడు, క్రియాశీల కార్యకర్త. వీరా సాథీదార్ మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భ, నాగపూర్ లలో దళిత బస్తీలలో ఈ పాత్రను పోషిస్తే సినిమాలో నారాయణ కాంబ్లే బొంబాయి దళిత బస్తీలలో ఈ పాత్రను పోషించాడు. కవి, ప్రజాగాయకుడు, కార్యకర్త అయిన పాత్ర కోసం దర్శకుడు చైతన్య తంహనే వెతుకుతూ ప్రకటించినపుడు వయసు, రూపం కూడా ఆయన మనసులో ఊహించుకున్నట్లు ఉన్న ఈ లోక్ షాయర్, క్రియాశీల కార్యకర్త నిజరూపాన్ని పట్టి ఇచ్చే ఫోటోలనిచ్చిండ ట. ఈ ఫిల్ములో నారాయణ కాంబ్లే వలె వీరా సాథీదార్ వున్నాడని దర్శకుడు అనుకున్నాడు. వీరా సాథీదార్ వలె నారాయణ కాంబ్లే వున్నాడని మహారాష్ట్రలో ఆయన తెలిసిన వాళ్లనుకున్నారు.
నారాయణ కాంబ్లే పాత్ర కోసం ఎందరో లోక్ షాయెర్ లను, క్రియాశీలంగా సాంస్కృతిక రంగంలో పని చేస్తున్న వాళ్ళను అడిషన్ చేసినట్లు దర్శకుడు చెప్పాడు. అతనికి సినిమా గురించి, అంటే తెరపై కనిపించడమేమిటో తెలిసి వుండాలి. పాడగలగాలి, నటించగలగాలి. సినిమా పట్ల ఆసక్తి వుండాలి. ఇబ్బంది లేకుండా మరాఠీ మాట్లాడగలిగి వుండాలి – అని వెతికి వెతికి ఇంక షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు తన మనసులోని, లేదా సినిమాకంట్లో ఊహించుకున్న నారాయణ కాంబ్లే వలె సాథీదార్ తారసిల్లాడని చెప్పి, ఆయన చనిపోయాడంటే తాను ఇంకా నమ్మలేకపోతున్నానని, తాను కలిసిన మనుషుల్లో ఎంతో ఉత్తముడైన వాడని చైతన్య తంహనే చెప్పాడు. “నేను అతనితో కలిసి నటించిన సీన్లు సినిమాలో కొంచెమే అయినా మా మధ్య ఎన్నో చర్చలు జరిగేవి. అతడు తన రాజకీయాదర్శాలతో తన జీవితాన్ని నిర్మించుకున్నాడు. ఏం చెప్పాడో అది ఆచరించాడు. అతడు నిజమైన విప్లవకారుడు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభావవంతమైన మార్పును తెస్తాయని ఆయన నిజంగా విశ్వసించాడు. ఆయన మా కెంతో నేర్పాడు” అని ఆయనతో కలిసి నటించిన గీతాంజలి కులకర్ణి చెప్పింది.
‘కోర్టు’ మన న్యాయవ్యవస్థను చిత్రించిన సినిమా, ఒక సఫాయి కర్మచారి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే నేరారోపణలో ఒక అభ్యుదయ భావాలు గల ప్రజా గాయకుణ్ణి మన సెషన్స్ కోర్టులు ఎట్లా విచారిస్తాయో చూపే కోణం నుంచి సినిమా నిర్మించబడింది. 2014లో విడుదలైన ఈ సినిమా వెనిస్ అంతర్జాతీయ 71వ ఫిల్మ్ ఉత్సవాలలో రెండు అవార్డులు గెలుచుకున్నది. ఇక్కడ 62వ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమా అవార్డు పొందింది. ఒక డాక్యుమెంటరీ అంత వాస్తవికతతో కోర్టు చుట్టూ తిరుగుతూ మన న్యాయవ్యవస్థ స్వభావాన్ని చిత్రించింది. ఒక్క మాటలో – మంచి అభిరుచిని, విలువలను, ఆశయాలను వాస్తవిక జీవితం నుంచి అన్వేషించింది.
హైదరాబాదులో 1930ల ద్వితీయార్థంలో ఏర్పడిన కామ్రేడ్స్ అసోసియేషన్ ఆదర్శాలను, విలువలను పరిరక్షించడానికి అది ఏర్పరచినవారి ఒక కుటుంబ సభ్యులు ఇచ్చిన భవనము, ఆవరణలోని
‘లామకాన్’ 2016 లో ‘కోర్టు’ సినిమా ప్రదర్శనతో పాటు, ప్రసంగించడానికి నారాయణ కాంబ్లే పాత్రధారి వీరా సాథీదార్‌ను పిలిచింది. తనను ‘యాక్టర్‌గా చూడవద్దు, కల్చరల్ యాక్టివిస్ట్’ గా చూడాలని విజ్ఞప్తి చేశాడు. అప్పటికే కోర్టు సినిమా చూసి వున్న తెలుగు సినిమా యువ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాపై, నారాయణ కాంబ్లే పాత్రధారిపై గౌరవంతో ఆయనను వినడానికి వచ్చి ప్రేక్షకుల వెనుక నిలబడ్డాడు. అట్లా వీరా సాథేదార్‌తో హైదరాబాదుకు, ముఖ్యంగా విరసంకు అనుబంధం ఏర్పడింది. విరసం – ‘యాభయ్యేళ్ళ నక్సల్బరి’ రెండు రోజుల అఖిల భారత స్థాయి సదస్సు నిర్వహించినప్పుడు రెండవ రోజు సాయంత్రం బహిరంగ సభలో మాట్లాడడానికి ఎంచుకున్న ఏకైక ప్రధాన వక్త వీరా సాథీదార్ కావడం- అట్లా ఏర్పడిన అనుబంధంతో ఆయన తాత్విక చింతన తెలియడమే.
2018 జనవరి లో మహబూబ్‌నగర్‌లో విరసం మహాసభలకు కూడా బహిరంగ సభలో ఆయన ప్రధాన వక్త. ఆయనను ఆహ్వానించిన నాటికి భీమా కోరేగావ్ సంఘటన జరగలేదు కానీ 2018 జనవరి 15 నాటికి అది అనివార్యంగా విరసం వేదిక మీద చర్చనీయాంశం అయింది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం కీలక అంశంగా జరిగిన మహాసభలకు ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే ప్రారంభోపన్యాసకుడు కావడం, ముగింపు వక్త వీరా సాథీదార్ కావడం యాదృచ్ఛికం కాదు గానీ, భీమా కోరేగావ్ ఒక చర్చనీయాంశం కావడం మాత్రం తాజా పరిణామమే. అందుకు ముఖ్యంగా ప్రేరణ అయింది జనవరి 8 ఆంధ్రజ్యోతిలో ‘వైర్’ నుంచి అనువాదం అయి వచ్చిన ఆనంద్ తేల్తుంబ్డే వ్యాసం. ఆయన ఆ వ్యాసంలో భీమా కోరేగావ్‌లో రెండు వందల సంవత్సరాల క్రితం ఈస్టిండియా కంపెనీ సైన్యానికి, పీష్వాలకు జరిగిన యుధ్ధంలో నలభై మంది మహర్లు అమరులైన ఉదంతాన్ని దళిత చైతన్యానికి ప్రతీకగా చూడ కూడదు, మన దేశంలో కంపెనీ పాలన, ఆ తర్వాత బ్రిటిష్ పాలనకు దారితీసిందని రాశాడు. చరిత్రలో ఒక సంఘటనగా, ఎక్కువ మంది దళితులు అమరులైన సందర్భంగానే తప్ప వాళ్ళు పీష్వాలను ఓడించే చైతన్యంతో పోరాడారని చెప్పలేం అని రాసాడు . కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 1921లో భీమాకోరేగావ్‌ను సందర్శించినపుడు వర్తమాన దళిత పోరాట చరిత్రలో ఈ సంఘటనను దళిత పోరాట చైతన్యం మలచుకునే త్యాగంగా చూడాలని, ఇక నుంచి దళితులను పోరాటానికి ఉత్తేజపరచే సంస్మరణగా జరుపుకోవాలన్నాడు.
అందుకే భీమా కోరేగావ్ కు 1 జనవరి 2018 సంవత్సరం లక్షలాదిమంది దళితులు తరలివచ్చి ‘నయీ పీష్వాయీ నహీ చలేగీ’ అని నినదించారు. జనవరి1, 2018కి ముందురోజు 2017 డిసెంబర్ 31న పూనే శనివార్‌వాడాలో మహారాష్ట్రలోని 265 సంస్థలు కలిసి ఏర్పాటుచేసిన ఎల్గార్‌పరిషత్ భీమాకోరేగావ్ దళిత అమరుల 200 వార్షికోత్సవాన్ని ‘నయీపీష్వాయీ ప్రతిఘటనా దినం’ గా జరపడానికి నిర్ణయించి మహారాష్ట్ర నలుమూలల నుంచి దళిత, ఆదివాసీ, ముస్లిం తదితర మైనారిటీ, బిసి, మరాటాలతో సహా, ప్రజాస్వామ్య సంఘాలు, వ్యక్తులతో ఒక కమిటీ వేసింది. పశ్చిమ, తూర్పు మహారాష్ట్ర ల నుంచి, విదర్భ నుంచి ఎల్గార్‌పరిషత్‌కు, భీమాకోరేగావ్‌కు బ్రాహ్మణీయ హిందుత్వ వ్యతిరేక శక్తులనన్నిటినీ తరలించడానికి పిలుపు నిచ్చింది. ఆ కమిటీ ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు జడ్జిగానూ, ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్‌గానూ పదవీ విరమణ చేసిన పిబి సావంత్ (ఇటీవలెనే మరణించారు), వైస్‌ఛైర్మన్‌గా బొంబాయి హైకోర్టు రిటైర్డ్ జడ్జీ కోల్సే పటేల్ వ్యవహరించారు. ప్రకాశ్ అంబేద్కర్, జిగ్నేష్ మేవానీ, వేముల రాధిక, సోనీ సోరీ, ఉమర్‌ఖలీద్ వంటి వాళ్లెందరో పాల్గొన్నారు. ఈ జాతరకు విదర్భ నుంచి, నాగపూర్ నుంచి నయీపీష్వాయీ వ్యతిరేక శక్తులను తరలించే బాధ్యతను చేపట్టినవాడు ‘విద్రోహి’ తరఫున, రిపబ్లికన్ ప్యాంథర్స్ కోకన్వీనర్‌గా ఉన్న వీరాసాథేదార్. తాను ఆ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహించిన రెండువారాల తర్వాత మహబూబ్‌నగర్ విరసం బహిరంగసభకు ప్రధానవక్తగా వచ్చాడు. కనుక మొదటరోజు ఉదయమే కులనిర్మూలనపోరాట సమితి అధ్యక్షుడు దుడ్డుప్రభాకర్ భీమాకోరేగావ్ దళితుల అమరత్వాన్ని తమ సంఘం దళితుల ఆత్మగౌరవ పోరాటంగానూ, పీష్వాలకు వ్యతిరేకంగానూ జరిగిన పోరాటంగా చూస్తుందని, అది ఇప్పటి సామ్రాజ్యవాద దళారీ బ్రాహ్మణీయ హిందుత్వ పాలకులకు, శక్తులకు
నిర్దిష్టంగా చెప్పాలంటే సంఘ పరివారీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఉద్దీపనగా, ఆదర్శంగా తీసుకుంటామని చెప్పాడు. మర్నాడు బహిరంగసభలో వీరా ఎల్గార్‌పరిషత్, భీమాకోరేగావ్ సంఘటనను తను ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవంతో వివరించడం – సహజంగానే దానికి ఒక సాధికారత వచ్చింది.
తిరుగుప్రయాణంలో తనతో హైదరాబాదుకు వెళ్లిన విరసం సభ్యులకు భీమాకోరేగావ్ సంఘటన ఈనాడు సంఘపరివార్‌కు దళిత, బహుజన, మైనారిటీ, ప్రజాస్వామ్య, విప్లవ శిబిరానికి మధ్య పదునెక్కుతున్న ఘర్షణగా చూడాలని దారిపొడుగునా చెప్పి
తాను మరాఠీలో రాసిన పుస్తకంలో అదే వివరించానని ఆ పుస్తకం ఎవరితోనైనా అనువదింపచేయమని వదిలి మర్నాడు నాగపూర్‌కు వెళ్లాడు. నాగపూర్ శాసనసభ నుంచి పోటీచేసి ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్‌ను పీష్వా వంశ వారసుడుగా చూపుతూ నగరమంతా బిజెపి` బలపరచిన శక్తులు పోస్టర్లు వేసాయని చెప్పాడు.
బహిరంగసభ జరుగుతుండగానే భీమా కోరేగావ్ లో జరిగిన హింసాత్మక ఘటనలకు, బాధ్యులని – ముంబై రిలయన్స్ కంపెనీ కార్మిక సంఘ నాయకులు – తెలంగాణకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారన్న వార్త వచ్చింది. కనుక ఒక విధంగా భవిష్యత్ పరిణామాలకు మహబూబ్ నగర్ విరసం మహాసభల వేదిక సీస్మో -గ్రాఫ్ అయింది. అదంతా ఇపుడు చరిత్రలో భాగం. 2020 ఆగస్టులో ఎన్ ఐ ఏ దేశంలో మూడు వందల మంది ప్రజాస్వామ్యవాదులను, ప్రజా సంఘాల బాధ్యులను పిలిపించి ప్రశ్నించినపుడు అందులో వీరా సాథీదార్ కూడా ఉన్నాడని చెప్పడం ప్రస్తుతం అవుతుంది.
వీరా సాథీదార్ ఏప్రిల్ 12, 2021 న నాగపూర్ ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్‌లో కోవిడ్-19తో మరణించాడు. అంతకు రెండు మూడు రోజుల ముందే ఒక మిత్రునికి ఆ ఆసుపత్రిలో ఒక డాక్టర్ ద్వారా ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్స్ మీద వున్నట్లు తెలిసింది. వెంటనే ఆయన వీరా సహచరి పుష్ప కు ఫోన్ చేస్తే, ఆయనకు కరోనా వచ్చి ఆసుపత్రిలో చేర్చాం కానీ ఐసియులో వున్నట్లు గానీ, వెంటిలేటర్ మీద పెట్టినట్లుగానీ తెలియదని చెప్పింది. మరణించాక కొడుకు రాహుల్ ఎయిమ్స్‌లో ఆయనకు న్యుమోనియా వల్ల క్లిష్ట పరిస్థితులు తలఎత్తి మంగళవారం (ఏప్రిల్ 12, 2021) ఉదయం 4 గంటలకు మరణించినట్లు చెప్పినట్లుగా ఇండియన్ ఎక్‌ప్రెస్‌లో వచ్చింది. రెండో దశ కోవిడ్-19 ముంబై స్లమ్స్‌లో ఎందుకు రావడం లేదని అడిగితే ధారావిలో ఉన్నవాళ్ళు మాకు ఏసీలు లేవు కదా అన్నారు. వీరాకు ఐసియు లో ఏ. సీ వల్ల న్యుమోనియా సోకిందా? తన 89 ఏళ్ల జీవితంలో ఎన్నడూ ఏ.సీ గదిలో పడుకునే అలవాటు లేని కాళోజీ కాలు విరిగి నిమ్స్ లో చేర్చినపుడు ఐ. సి. యూ లో ఏ . సి వల్లనే న్యు మోనియా సోకి మరణించాడని తెలంగాణ ప్రభాకర్ వంటి ఆయన అటెండెంట్ లు భావించారు .
కోర్టులో ఒక సఫాయి కర్మచారి డ్రైనేజిలో దిగి అందులోని విషవాయువుల వల్ల చనిపోతే, అతడు నారాయణ కాంబ్లే పాటల ప్రేరణతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. పోలీసులు. మరి వీర సాతెధార్ను సామాజిక దూరం, దృష్టి, స్పర్శ దోషాన్ని పాటించేది మాత్రమే కాదు ప్రపంచమంతా వైరల్ అయిన గ్లోబల్ సామ్రాజ్యవాద వైరస్ చంపిందనవచ్చునా?