కవిత్వంలో మొజార్ట్- విస్లవా సింబోర్స్కా

ఒక రకంగా సంగీత చరిత్రతో పరిచయమున్న ఎవరికైనా వోల్ఫ్ గ్యాంగ్ ఆమడేజ్ మొజార్ట్ అంటే గుర్తొచ్చేది ఒకటి : ఆయనొక మహా మేధావి అని.  మార్క్స్ నుండి లెనిన్ దాకా, బీతోవెన్ నుండి చార్లీ చాప్లిన్ దాకా, కొన్ని తరాల సంగీతాభిమానులను, సంగీతకారులను తీవ్రంగా ప్రభావితం చేసినవాడు మొజార్ట్. బహుశా మొజార్ట్ తన సంగీతం ద్వారా మనుషుల లోతుల్లో పాతుకుపోయిన భావోద్వేగాలను ఎలా వెలికితీస్తాడో సింబోర్స్కా కవిత్వం చదివినప్పుడు కూడా మనగురించి మనకే తెలియని ఆలోచనలేవో అలవోకగా మనకు తడతాయని కావచ్చు, ఆమెను సుప్రసిధ్ధంగా ‘A Mozart of Poetry’ అని పిలుస్తారు. 

విస్లవా సింబోర్స్కా (Wislawa Szymborska) పోలాండ్ దేశపు కవి. ఒక పక్క స్టాలినిస్టు రష్యా మరొక పక్క నాజీ జర్మనీ పోలాండ్ ని బలవంతంగా ఆక్రమించిటం వల్ల ఆత్మస్థైర్యం కుంచించుకుపోయిన తరానికి చెందిన కవి. తూర్పు ఐరోపా దేశాల సాహిత్యంలో కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఒకటుంది : వర్గ స్పృహ కలిగి ఉండటమే గొప్ప కవిత్వం రాయటానికి precondition అనే ఆలోచన అప్పటి ఐరోపా, రష్యా తదితర ప్రాంతాల సాహిత్య విశ్లేషణలలో, మార్క్సిజం ప్రభావం తీవ్రంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో, మేధావుల సంభాషణలలో చాలా ప్రాచుర్యంలో ఉండేది. కానీ తూర్పు ఐరోపా సాహిత్య కారులు, బహుశా తాము చూసిన చరిత్ర వల్ల కావచ్చు, అలాంటి ఆలోచనను తిరస్కరిస్తారు. ఒక రకమైన aesthetic స్పృహతో ప్రపంచాన్ని చూసినప్పుడు అప్పటిదాకా కనిపించని కొత్త కోణాలు తారసపడుతాయని నమ్మినవారు. Zbignew Herbert అనే పోలిష్ కవి, సింబోర్స్కా సమకాలీనుడు, ‘స్టడీ ఆఫ్ ది ఆబ్జెక్ట్’ అనే కవితలో ఇట్లా అంటాడు:

‘“The most beautiful is the object
which does not exist.”

సింబోర్స్కా రచనలలో కూడా ఇలాంటి ఒక sensibility కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణ ‘రైల్వే-స్టేషన్’ అనే కవిత.

ఆమెపైన తీయబడిన ఒక documentary లో ఒక చిన్న పిట్టకథ చెప్తుంది: “ఐన్‌స్టీన్ స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవుడ్ని ఇలా అడుగుతాడు. ‘ఈ విశ్వాన్నంతా నిర్వచించే ఫార్ములా ఏంటి? వీటన్నిటిని నువ్వే కదా సృష్టించింది.’ అని. దేవుడు బోర్డు మీద బలపంతో ఓ పొడవాటి ఫార్ములా రాస్తాడు. దాన్ని ఐన్‌స్టీన్ సుదీర్ఘంగా చూసి ‘ఈ లెక్కలో ఇక్కడ తప్పు ఉంది’ అని వేలు చూపిస్తాడు. దేవుడు నవ్వి, ‘ఇదే ఆ సూత్రం’ అంటాడు.”

సింబోర్స్కా కవిత్వ-ఆత్మలో కనిపించే ఓ అల్లరితననానికి పునాది ఇలాంటి కాస్మిక్ విశ్వసంబంధ, అస్తిత్వసంబంధ, ఉనికిసంబంధ హాస్యంలోనే ఉంటుంది. అందుకే ఒక ఇంటర్వ్యూలో “ప్రపంచంలోని ఏ విషయాన్నైనా సరిగ్గా చూస్తే దాని వెనకనున్న హాస్యం బోధపడుతుంది” అంటుంది. ఆమె కవిత ‘మూడు విచిత్ర పదాలు’ ఇలాంటి హాస్యానికి నిదర్శనం.

ఆమె జీవితానికి సంబంధించిన మిగిలిన విషయాలకోసం వికీపీడియా చూడొచ్చు. ఆమెకు 1996లో సాహిత్యానికి నోబెల్ బహుమతి ఇచ్చారు.

పైన ఉదహరించిన సింబోర్స్కా రెండు కవితలూ ఇక్కడ:

మూడు విచిత్ర పదాలు

భవిష్యత్తన్న పదం పలికేలోగా
మొదటి శబ్దం గతంలోకి జారుకుంటుంది

నిశబ్ధమన్న పదం పలకగానే
అది ధ్వంసమవుతుంది.

శూన్యమన్న పదం పలకటంతో
ఉనికినెరుగని ఏ ప్రాణీ పట్టుకోలేనిదేదో సృష్టిస్తాను.

రైల్వే-స్టేషన్

N. అనే నగరానికి నేను వెళ్లకపోవటం
సరిగ్గా అనుకున్న సమయానికి జరిగింది.

నేను పంపించని ఉత్తరం ద్వారా
నేను చేరుకోలేనన్న సంగతి తెలియచేసాను.

మనమనుకున్నట్టే టైముకి
నువ్వు రాలేదు.

మూడవ ప్లాట్ఫారం దగ్గర రైలు ఆగింది.
ఎంతో మంది స్టేషన్లో దిగారు.

బయటకి నడుస్తున్న జనసందోహంతో
నేను-లేని-తనం కూడా కలిసింది.

నా స్థానాన్ని ఆక్రమించటానికి
గుంపులోని మహిళలు పోటీపడ్డారు.

వారిలో ఒకరి దగ్గరికి ఒకతను
పరిగెత్తుతూ వచ్చాడు.
అతనెవరో నాకు తెలియదు.
ఆమె మాత్రం వెంటనే గుర్తుపట్టింది.

మనవి కాని పెదవులతో వారు
ముద్దుపెట్టుకున్నారు;
ఒక సూట్ కేసు మాయమయింది-
అదీ నాది కాదు.

ఈ రకంగా
N. నగరంలోని రైల్వేస్టేషన్
తన బాహ్య ప్రతిపత్తిని
నిరూపించుకుంది.

ప్రపంచమంతా అక్కడే
నిలిచిపోయింది.
వివరాలన్నీ పట్టాలను వెంబడిస్తూ
వెళ్లిపోయాయి.

నిశ్చయింపబడిన చోటులోనే
రహస్య కలయిక జరిగింది.

మన ఉనికి చేరుకోలేని
ప్రదేశమది.

శక్యమనే
చేజారిన స్వర్గం.

ఇంకెక్కడో
ఇంకెక్కడో:
ఈ పదాల శ్రుతి!

(తెలుగు అనువాదం: రోహిత్)

పుట్టింది అనంతపురంలో.  అక్కడి వింతైన, విచిత్రమైన గాథలను వింటూ పెరిగాడు.  వృత్తి రీత్యా డాక్టర్. తెలుగు నుండి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుండి తెలుగుకు అనువాదాలు చేయటం, ఇంగ్లిష్ లో కవిత్వం రాయటం చేస్తుంటాడు.  కవిత్వాన్ని చాలా వరకు ఫేస్బుక్ లో పెడుతుంటాడు.  తన కవిత్వం The Bombay Literary Magazine, The Punch, Sunflower Collective తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

One thought on “కవిత్వంలో మొజార్ట్- విస్లవా సింబోర్స్కా

Leave a Reply