విషాధ మాథం లోంచి… విలక్షణ యుద్ధం లోకి…!!

ఇది పోయే కాలం కదా…
ఇది పోగొట్టుకునేకాలం కదా…

అయిన వాళ్ళనూ…
అంటుగట్టుకున్నోళ్ళనూ…

జ్ఞాపకాల సీసాలోకి
మనసు గాయాలు మాన్పే
అమ్మఒడి స్పర్శగా
తర్జుమా చేసుకుని
ఔషధంలా ఒంపుకుని
బిరడా బిగించుకుని
బరిగీసుకు బతుకుతున్నది
నిజమే కానీ…

ఆస్తులో ఆత్మాభిమానాలో
హోరెత్తిన హోదాలో…
అందలాలో ఆలింగనాలో…

బంపర్ ఆఫర్లుగా
కలిసొచ్చిన
కలసొచ్చిన వైరల్ రుతువులో…
క్లియరెన్సు సేల్ ధమాకాలో…

సీరీసు సీక్వెన్స్ మ్యాచ్లుగా
మూడుముక్కలాడించిన
జబర్దస్త్ జవురుకొనుడు
భజరంజక మారక జాతరలో
మాధ్యమమైనది ఏమిటి…?!
అది ద్రవ్యమా…!!

ఒడిసి పట్టిన
నెత్తుటి త్యాగాల గద్దెలు
తాకట్టు పెట్టిన
దగుల్బాజీ తనమా…??

ఏమైందనీ
ఏమైపోయిందనీ
ఇప్పుడెందుకీ
తలపోతంటావా…

వీళ్లంతా
నావాళ్ళనుకున్న నమ్మకం…
వీళ్ళు మాత్రమే
నావాళ్ళనుకున్న భ్రమా
తేలిపోయిందిప్పుడు…
మనసు తేటబారిందిప్పుడు…

కురిసే మబ్బుల
కరచాలనం కోసం
వొళ్ళంతా చిట్లిన
బిడ్డల నెత్తుటి చారలు
త్యాగాలు తలకెత్తుకుని…

తలదాచుకునే మట్టిగోడలన్నీ
ఎర్రమన్ను అలికి
తెల్లని ఆశలు విరబూసే
సఫేదు సున్నపు ఛీటాల్లో…

హరివిల్లై విరబూసే
హరియాలీలను దర్శిస్తూ…

మా అమ్మీలు పాడే
చెక్కు చెదరని ఆశల
మొహరం మాథం
విషాద గీతాలు

భుజంమీద చెయ్యేసి
నన్నెప్పుడూ
ఓదారుస్తుంటాయి…

ఆకురాలు కాలం
అడవి లేని కాలం కాదనీ…

రాలిపడ్డ ఆకులతో
రాజ్యం రాజేసే నిప్పు
పొగబార్చొచ్చు గానీ…

జల్ జంగల్ జమీన్ల
మానుతున్న గాయాల
పోటెత్తే పెదాల మీంచి
చిగురు తొడిగే
చిరునవ్వుల గుబురుల్నీ…

ఆగుండెల్లో
గూడుకట్టుకున్న గువ్వల్నీ…
చెరిపెయ్యలేవనీ…

ఔను…
ఆశలైనా…
నమ్మకాలైనా…
ఎవరిమీదైనా…

ఇది…
కోల్పోయే కాలం మాత్రమే కాదు…

విల్లంబులూ…
విశ్వాసాలూ…
ప్రోది చేసుకునే కాలం కూడా…
పదును పెట్టుకునే కాలం కూడా…

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

Leave a Reply