విషవలయం

స్వరూప చూస్తోంది. రెప్పవేయడం మర్చిపోయినట్టుగా అలాగే గమనిస్తోంది. నెమ్మదిగా నడిచే వాహనాలను మెలికలు తిరుగుతూ మాయమయ్యే బైకులను ఓ చెయ్యి చూపిస్తూ రోడ్డు దాటేస్తున్న జనాలను పొద్దుకుంగుతున్న కొద్దీ నిద్ర విదిలించుకున్నట్టుగా జిగేల్ల్మంటున్న నగరాన్ని అలా వింతగా విచిత్రంగా బస్సద్దాల్లోంచి చూస్తూనే ఉండిపోయింది. ఎప్పుడైతే చూపు స్థిరపడిందో మనసు చలించడం మొదలుపెట్టింది. కళ్లముందు కనిపిస్తున్న దృశ్యాలు వాటంతటవే కనుచూపుమేర పరుచుకున్నాయి. రెండురోజులకింద తనకూ మురారికీ మధ్య సంభాషణ సన్నివేశంలా కనిపించసాగింది.

“లిప్స్టిక్ వేసుకో. అందంగా కనపడు. గంటకోసారి రెస్టురూంకెళ్లి రీఫ్రెష్షవ్వు. కార్పొరేట్ కమ్యూనికేషన్సులో జాబ్ రావాలంటే ప్లెజెంట్ గా కనపడాలి. పల్లెటూరి సరుకును తెచ్చి నేరుగా కుర్చీలో కూర్చోబెట్టలేం కదా. మైండుతోపాటూ బాడీనికూడా పాలిష్ చేసుకోవాలి.” ఒళ్లంతా తడిమినట్టున్న కళ్లతో తనవంక చూస్తూ మాట్లాడుతున్న కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ మురారిని చూసి అప్రయత్నంగా చున్నీ సరిచేసుకుంది స్వరూప.

“ఇలాంటివే పల్లెటూరి వేషాలు. మైక్రోలూ మినీల జనరేషన్ ఇది. జాబ్ కావాలనుకుంటే సరిపోదు. పబ్బులకూ పార్టీలకూ వెళ్లడానికి సిద్ధపడాలి. కాస్త ఓపెన్ గా అవేలబిల్గా ఉండాలి.” వయసుతో వచ్చిన పెద్దరికాన్ని ఆసరాగా తీసుకుని చాలా విషయాలు నిస్సిగ్గుగా మాట్లాడే మురారి చివరి రెండు పదాలు స్పష్టంగా తెలుగులో చెప్పలేక దర్జాగా అధికారిక భాషలో ముగించాడు. తాను చెప్పాల్సింది అయిపోయిందన్నట్టుగా క్షణంపాటూ స్వరూప వైపు చూపునిలిపాడు. హేళన అపహాస్యం సమపాళ్లలో విరజిమ్ముతున్న ఆ కళ్లను చూసి స్వరూప అవమానంతో తలదించుకుని అక్కడే నిల్చుండిపోయింది.

మురారి మెల్లగా చూపు మరల్చాడు. కళ్లను మ్యూట్ లో ఉంచిన టీవీపై నిలిపాడు. అయిష్టంగా ముఖం చిట్లించాడు. తెరపై కదలాడుతున్న రంగుబొమ్మలను కాసేపు ఆసక్తిగా గమనిస్తున్నట్టుగా నటించాడు. మరుక్షణంలోనే భావరహితంగా వాటిని చూడసాగాడు. ఏదో గుర్తొచ్చినట్టుగా ఎదురుగా ఉన్న మొబైల్ ను విసురుగా కుడిచేతిలోకి తీసుకున్నాడు. హడావిడిగా బొటనవేలు చకచకా స్క్రీన్ పై కదిపాడు. తర్వాత అటు పక్కగా ఉన్న టీవీ రిమోట్ని చూస్తూ క్రీగంట స్వరూపను గమనిస్తూ ఎడమ చేతి చూపుడువేలితో టీవీ వాల్యూం పెంచాడు. ఎదుటివాళ్లు వెళ్లొచ్చు అని చెప్పకనే చెప్పడం అతనికి చాలా ఇష్టమైన పని. ఇవేవీ అర్థంకాని స్వరూప ముదిరిన తొండలా రంగులు మారుస్తున్న అతని హావభావాల్ని వింతగా గమనిస్తూ నిలుచుండిపోయింది.

“యు కాన్ గో నౌ” ఉన్నట్టుండి మురారి స్వరం ఖటువుగా గద్దించింది.

“సారీ సర్…” అసంకల్పితంగా అని నిస్సత్తువగా ఛాంబర్ నుంచి బయటికి అడుగుపెట్టింది స్వరూప. కార్పొరేట్ ప్రపంచంలో తన తప్పేం లేకపోయిన సీనియర్సును క్షమించమని అడగడం… వారి ఇగోని తాత్కాలికంగా బుజ్జగించడం… ఒక బేసిక్ రూల్!

“క్రీచ్ చ్ చ్…” ఆ చప్పుడుకి స్వరూప ఆలోచనలన్నీ చెల్లాచెదరయ్యాయి. ఆమె కళ్లు బస్సు ఫ్రంట్ గ్లాసెస్ మీదనుంచి కంగారుగా కదిలాయి. శబ్ధాన్ని ఫాలో అవుతూ పెద్ద కుదుపుతో బస్టాపు కాస్త దూరంలో బస్సాగింది. స్వరూప చేయి గేర్బాక్సు చుట్టూ ఉన్న పైపుపైన బిగిసింది. ఇంతలో బరువైన బియ్యపు మూటను వీపుమీద పడేసినట్టు మీదపడ్డారు వెనుకనుంచున్న వాళ్లు. ఎవరో తరుముకొస్తున్నట్టు దిగుతున్నారు కొందరు. దిగుతున్నవారిని తోసుకుంటూ బస్సు ఎక్కేస్తున్నారు మరికొందరు. “అరె జర దిగనియ్యరాదమ్మా” కసురుతోంది ఓ నడివయస్సు కంఠం.

డ్రైవరు అసహనంగా కదిలాడు. చెమటలు కక్కుతున్న ముఖాన్ని చేత్తో తుడుచుకున్నాడు. బస్సు మెల్లగా ముందుకు ఉరుకుతోంది. లేడిపిల్లల్లా పరిగెత్తే టీనేజీ అమ్మాయిల వారి వెనుక పెద్ద పెద్ద అంగలతో నడిచే యువతులు వారిక్కాస్త దూరంలో నడిచీనడవలేని స్థితిలో నడివయసు మహిళలు. అందరిదీ ఒకే తాపత్రయం. ఎలాగైనా తమ శరీరాన్ని బస్సులోకి చేర్చాలని ! వీరందరినీ వెనక్కునెట్టేస్తూ బస్సు వేగం పుంజుకుంది. బస్సు మిస్సయిందన్న నిరాశ లిప్తపాటులో మర్చిపోయి ఆ వెనుకే కొంత దూరంలో ఆగిన మరొక బస్సును అందుకోవడానికి అటువైపు పరుగులు పెట్టారు జనాలు!. పెద్దపెద్ద కళ్లద్దాల్లాంటి బస్సు ఫ్రంట్ గ్లాసెస్ నుంచి రోడ్డుమీద జనాల్ని గమనిస్తోంది స్వరూప. బస్సు కొద్దిసేపు పరుగులు పెట్టి ట్రాఫిక్లో చిక్కుకుంది. మళ్లీ స్వరూప మనసు గతాన్ని మననం చేసింది.

మరుసటి రోజు ఎప్పటిలానే ఆఫీసుకెళ్లింది. గంట తర్వాత మురారి వచ్చాడు. క్రీగంట స్వరూపను గమనిస్తూ క్యాబిన్లోకి వెళ్లగానే రెండుసార్లు బజర్ నొక్కాడు. ఉలిక్కిపడి లోపలికి పరుగెట్టింది స్వరూప.

“నీదేవూరన్నావ్”

చెప్పింది.

“పల్లెటూరి వేషం మార్చు. సిటీ స్పీడ్ ఎంత త్వరగా అందుకుంటే అంత పైకొస్తావ్…” ఆశ పెడుతున్నట్టుగా అన్నాడు మురారి. “నిన్న ఇంటర్వ్యూకు వచ్చిన అమ్మాయిని చూసావుగా ఎలా రెడీ అయివచ్చిందో” బదులురాకపోవడంతో రెట్టించాడు మురారి.

“హైర్ చేసారా సర్” కుతూహలంగా ప్రశ్నించింది. ఇంటర్న్షిప్ చేసినదగ్గరే ఉద్యోగం సంపాదించాలన్న ఆశ స్వరూపది.

“క్రాస్ క్వశ్చన్లకేం తక్కువ లేదు. అమ్మాయిలు అలా ఉండాలి అని చెబుతున్నాను. అది బేసిక్ రూల్” నొక్కి చెప్పాడు మురారి. “అలా ఉంటే ఇక్కడ దొరక్కపోయినా ఇంకోచోట వెతుక్కోవచ్చు” మాటలు చాలా నెమ్మదిగా వదిలినా తన మనసులోని వెటకారాన్ని కళ్లలో చూపిస్తూ అన్నాడు మురారి.

“జగద్గిరి గుట్ట… లాస్ట్ స్టాప్” కండక్టరు గట్టిగా అరవటంతో ఈ లోకంలోకొచ్చింది స్వరూప. వాచీ చూసుకుంది. సమయం ఎనిమిదవుతోంది. ఆరున్నరప్పుడు పంజగుట్టలో బస్సెక్కింది. రోడ్డుపక్కనే ఉన్న చిన్న ఫ్యాన్సీస్టోర్కి వెళ్లి తనకు కావాల్సింది కొని జాగ్రత్తగా హేండ్బాగులో దాచింది. ‘ఈ లిప్స్టిక్ వేసుకుంటే ఉద్యోగం ఇస్తాడేమో’ రోడ్డు పక్కగా నడుస్తూ చిన్నాన్న ఇంటివైపు అడుగులేసింది. కడుపులో ఏదో బాధగా అనిపించింది. ఆకలిగా ఉంది. మధ్యాహ్నం ఖాళీ చేసిన లంచ్ బాక్సు. తిండికీ డబ్బుకీ ఉన్న అనుబంధం స్వరూపకు ఎప్పుడూ విలోమానుపాతంలో ఉంటుంది. పదిరూపాయలు పెట్టి టీ తాగాలన్నా భయమే. పదినిముషాల తర్వాత ఇల్లు కనిపించింది. వామ్ వైట్ లైటు వెలుగుతో కళ తప్పినట్టుగా ఉంది. అయిష్టంగా ముందుకు నడిచింది. బాబాయ్, పిన్ని నేలమీద చెల్లి, తమ్ముడు పక్కనే ఉన్న మంచంమీద కూర్చుని టీవీ చూస్తున్నారు.

స్వరూపను చూసీచూడనట్టుగా ప్రవర్తించారు వాళ్లందరూ. ఆకలి చచ్చిపోయినట్టనిపించింది స్వరూపకు రోజులానే.

“కాళ్లూ చేతులూ కడుక్కుని అన్నం తినరా” రాగంతీస్తూ అంది పిన్ని. గిన్నెలో ఉన్న అన్నం కొంచెం ప్లేట్లో వేసుకుంది స్వరూప.

“ఇంకొంచెం పెట్టుకో అక్కా”

“నాకు ఆకలిగా లేదు చెల్లీ”

“నువ్వు కొంచెమే తింటే మళ్లీ ఆ చద్దెన్నం పొద్దున అమ్మ తినాల్సి ఉంటుంది. ఆ మిగిలింది అంతా తినేసెయ్” ఒకింత అధికారం ధ్వనించింది సంధ్య స్వరంలో. అది స్వరూపకంటే ఐదేళ్లు చిన్నది.

మౌనంగా అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంది.

“నీకోసమే కదా ఎక్కువ వండాల్సి వచ్చింది. లేకపోతే సరిగ్గా మాకు సరిపోయేంత మాత్రమే వండుకుంటాం” రెట్టించింది సంధ్య.

ముద్ద దిగడం కష్టంగా అనిపించింది స్వరూపకు. ఆకలికి గొంతే పిడచగట్టుకుపోయిందో అసహాయతే దుఃఖంగా మారి అన్నవాహికకు అడ్డుపడిందో.

‘డబ్బులుంటే హాస్టల్లో ఉండేది కదా. వీళ్లతో ఈ మాటలన్నీ భరించాల్సి వచ్చేది కాదు.’ అనుకుంది. వయసులో తాను పెద్దదైనా లేమివల్ల సంధ్య ముందు ఇలా చిన్నబోక తప్పదేమో అనుకంది నిరాశగా. ఎలాగైనా జాబ్ సంపాదించాలి. ఇక్కడినుంచి మళ్లీ ఇంటికి వట్టి చేతులతో వెళ్లకూడదు. స్థిరంగా అనుకుని ఫ్యాన్ గాలికి గట్టిగా మారిన అన్నం మెతుకులను మెల్లగా నములుతోంది.

“తినక్కా. మేం నిద్రపోవాలి. గింతసేపు తింటర ఎవరన్నా…” దెప్పిపొడిచింది సంధ్య.

గబగబా నాలుగు ముద్దలు నోట్లో కుక్కుకుని పళ్లెం పట్టుకుని నీళ్ల బకెట్ దగ్గరికి పరుగుతీసింది స్వరూప. కడుపులోంచి గొంతు దాటిన వెక్కిళ్లను ఆ నీళ్ల చప్పుడే అక్కున చేర్చుకుంది.

“అరె ఇంత తినుడు ఇంత పడేసుడు. మీ ఇండ్లళ్ల గిట్లనే చేస్తరా… ఆకలి లేనట్టుందే. వండుడు బందువెట్టు రెండ్రోజులు. ఆఫీస్ల తినొచ్చిందేమోనే… సార్లు బయటికి తీస్కెళ్తరు గదా. అన్నీ మనకుజెప్తర ఏంది.”

వెనుకనుంచి వినిపిస్తున్నాయి సంధ్య మాటలు. మిగిలిన వారంతా మౌనంగా ఉండిపోయారు. స్వరూప ఉనికి తమకు నచ్చనట్టు. ఒక్కోసారి వాళ్లే దాన్ని తనమీద ఉసిగొల్పినట్టుగా అనిపిస్తుంది స్వరూపకు. ‘ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక్కడి తిండిఖర్చు మెత్తం వీళ్లకు ఇచ్చేయాలి’ కసిగా అనుకుంది స్వరూప.

తోమిన గిన్నెల బుట్ట లోపలికి తీసుకొస్తుండగా ‘అరె ఎందుకురా నువ్వు జేస్తున్నవ్. పొద్దుటే నేను జేస్కుంటుంటి గదా’ అన్నది పిన్ని. గిన్నెలు సర్ది వంటిల్లు తుడిచి ముందు గదిలోకి వచ్చేసరికి టీవీ కట్టేసి నేలమీదున్న పరుపుపై నిద్రపోతోంది సంధ్య. నటిస్తుందో నిజమో తేల్చుకోలేకపోయింది స్వరూప. మెల్లగా బుక్కుతీసి చదవడం మొదలుపెట్టింది.

“ఆ పేజీలు తిప్పక్. నిద్ర ఖరాబైతుంది.” చిరాగ్గా, గట్టిగా అంది సంధ్య.

“దాన్ని పండుకోని రాదమ్మా. పొద్దస్తమానూ సతాయిస్తనే ఉంట్రు. నువ్వైనా జెప్పవే సరూపకు.” ఒకింత ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు బాబాయి.

చేసేదేం లేక పుస్తకం మూసి కళ్లు మూసుకుంది స్వరూప. తనకు ఉద్యోగం వచ్చినట్టు… హాస్టల్లో చేరినట్టు ఊహించుకుంటూ చాలా సేపటికి నిద్రపోయింది. నిద్రలోనూ అవే కలలు.

“యెంతసేపు పండుతరే. ఇంటికి దరిద్రం” అన్న మాటలు వినిపించి ఉలిక్కిపడి నిద్రలేచింది స్వరూప. పక్కన సంధ్య లేదు. ఆరవుతోంది. గబగబాలేచి పక్కబట్టలు ఎత్తేసింది. ఇల్లూడ్చింది. ఇంట్లో వారంతా కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మాత్రమే తను బాత్రూం కి వెళ్లాలని మొదట్లోనే సంధ్య రూల్ పాస్ చేసింది.

ఆ ఇంట్లో పదహారేళ్ల ఆ పిల్ల చెప్పిందే శాసనం. అద్దమ్ముందు జడేసుకుంటుండగా మురారి చెప్పిన మాటలు మళ్లీ గుర్తొచ్చాయి సంధ్యకు. అంతకు ముందు రాత్రి స్టోర్లో కొన్న లిప్ లైనర్ తీసింది. పిన్ని సంధ్య ఏమంటారో అన్న సంశయం కన్నా ఉద్యోగం కావాలన్న కోరిక బలమైంది. పెదవులపై మెరుస్తున్నబర్గండీ కలర్ తనరూపానికే మరింత సొగసద్దినట్టుగా అనిపించింది స్వరూపకు.

“అక్కా ఎంత బాగున్నావో తెలుసా. ‘అతడు’ సినిమాలో హీరోయిన్లా ఉన్నావ్.” సినిమా చూడ్డానికొచ్చిన పక్కింటమ్మాయి గట్టిగా అనేసింది. స్వరూప కళ్లు ఆనందంతో మెరిసాయి.

ఆ మాటలు విన్న సంధ్య పక్కరూంలోంచి పరుగున వచ్చింది. లిప్స్టిక్ తో కొత్త అందాన్ని సంతరించుకున్న స్వరూప మొహాన్ని చూసి ముఖం మాడ్చుకుని అంతే వేగంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి పిన్ని వచ్చింది. ఆమెను తెరిపార చూసి ‘బాగుందిరా’ అంది. బాబాయి అప్పటికే బయటికి వెళ్లాడు. ఆఫీసుకు బయల్దేరింది స్వరూప. ఎప్పుడూ నడిచే దారే కొత్తగా తోచింది. ఎప్పుడూ పట్టీపట్టనట్టుగా గమనించే కళ్లిప్పుడు ఆరాధనగా చూస్తున్నట్టు అనిపించింది. ఆనందంగా ఆఫీసు ఆవరణలోకి అడుగుపెట్టింది స్వరూప. మెల్లగా మెట్లెక్కుతూ పై ఫ్లోరుకు వెళుతున్న భారీ ఆకారాన్ని వెనుకనుంచి తేలిగ్గానే పోల్చుకుంది.

“గుడ్మార్నింగ్ సర్…” ఉత్సాహంగా వినిపించిందా స్వరం.

అవస్థపడుతూ నెమ్మదిగా మెట్లెక్కుతున్న మురారి ఓ క్షణం ఆగాడు ఊపిరితీసుకున్నట్టుగా. గొంతు తనకి సుపరిచితమే. చటుక్కున వెనక్కి తిరిగితే మెడపట్టేయడం ఖాయం మనసులో అనుకున్నాడు. ఓ క్షణం తర్వాత మెడను చాలా జాగ్రత్తగా యాభైఐదు వసంతాల శరీరంతోపాటే తిప్పుతూ వెనక్కితిరిగాడు.

ఇవేమీ తెలీని స్వరూప చకచకా మెట్లెక్కుతూ మురారికి రెండుమెట్ల కిందే ఆగిపోయింది.

“నువ్వు పద… యంగ్ జనరేషన్” ఓ వారగా నిల్చున్నాడు మురళి.

అయిష్టంగానే ముందుకు కదిలి చకచక మెట్లెక్కుతోంది స్వరూప. “భలే ఫాస్టుగా ఎక్కుతున్నావే. గుడ్! పెదాలకు రంగుకూడా వేసుకున్నావ్…” అంటూ స్వరూప వీపుపై తడుతూ చేతినితెచ్చి నెమ్మదిగా నొక్కి ఆ వెంటనే తీసేసాడు. ఏం జరిగిందో ఒక్క క్షణం అర్థం చేసుకునేలోపే ‘గుడ్మార్నింగ్ సర్’ అంటూ ఆఫీస్ బోయ్ విష్ చేయడం, తన చేతులో ఉన్న ఫైళ్లు బోయ్ కి ఇచ్చి హాస్పిటల్ ఓపీ కెళ్తానని కిందకి దిగి మురారి వెళ్లిపోవడం జరిగిపోయాయి. అవమానంతో ముఖమంతా ఎర్రగా మారింది స్వరూపకు. మెల్లగా మెట్లన్నీ ఎక్కి ఆఫీసులోకి నడిచింది. సీట్లో కూర్చుండిపోయింది. టేబిల్ మీద నీలిరంగు ఫైల్ కళ్లనిండా నిండిపోయినట్టుగా అనిపించింది. కన్నీరు కంటి కొలనుల్లోనుంచి జారకముందే చున్నీతో అద్దేసింది స్వరూప.

“పబ్లిక్ సెక్టార్ వాళ్లు పని బాగా నేర్పిస్తారర్రా. ప్రయివేట్ వాళ్లు వేస్టు. సర్టిఫికేట్కి వాల్యూ ఉండదు. మిస్ బిహేవ్ చేసినా అడిగే వాళ్లుండరు. బాస్ పేరుతో అసభ్యంగా ప్రవర్తించే వాళ్లే ఎక్కువగా ఉంటారు.” ఇంటర్న్ కంపెనీల గురించి వివరిస్తూ ఓ ప్రొఫెసర్ అన్న మాటలు మరోసారి గుర్తొచ్చాయి స్వరూపకు.

“టీ” అన్న పిలుపు అతి దగ్గరగా వినిపించడంతో ఉలిక్కిపడింది స్వరూప. ఆమె చేయి కప్పుకు తగిలి టీ మొత్తం ఒలికిపోయింది. చిరాకేసింది స్వరూపకు. బోయ్ ని తిట్టాలనుకుంది. అనవసరంగా రాద్ధాంతం చేస్తే తనకి జాబ్ దొరకదేమో అన్న భయం ఆ ఇరవైమూడేళ్ల అమ్మాయి స్వరాన్ని నొక్కేసింది.

“సారీ రామూ” అలవాటుగా తప్పంతా తనమీద వేసుకుంది.

“ఎక్కడినుంచొస్తారో ఎర్రబస్సెక్కి” స్వరూపకు వినబడేలా గొణుక్కుంటూ ట్రే పట్టుకుని ఆఫీస్ కిచెన్ వైపు నడిచాడు రాము. ‘ట్రైనీలపై ఆఫీస్ బోయ్స్ కూడా పెత్తనం చెలాయిస్తారులా ఉంది.’ ఆవేదనగా అనుకుంది స్వరూప. అసలు అంత దగ్గరగా వచ్చి ముఖం లో ముఖం పెట్టి టీ తీసుకొమ్మని అడగకపోతే ఇలా జరిగేది కాదు కదా అనుకుంటూ హ్యాండ్బేగ్ పై చేయి వేసింది. చేతికి వేడిగా తగలడంతో తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టింది. లంచ్ బాక్సు తీసి ర్యాక్ లో పెడుతుండగా పొద్దున సంధ్యకు తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.

ఉదయం కూరకలిపిన అన్నాన్ని బాక్సులో సర్దుతోంది స్వరూప.

“అంత కర్రీ వేసుకోకు అక్కా… అసలు కలుపుకుని వెళ్లకు. కొంచెం కర్రీ బాక్సులో వేసుకుని ఆఫీసులో కలుపుకుని తిను” సలహాలిస్తోంది సంధ్య. పక్కనే ఉన్న పిన్ని ప్రశంసాపూర్వకంగా చూసింది కూతురివైపు.

“నా బ్యాగులో ఒకే బాక్సు పడుతుంది సంధ్యా. అందుకే కలిపి తీస్కెళ్తున్నాను.”

“కవర్లో పెట్టుకో బ్యాగులోనే ఎందుకు”

“కవర్లో తీసుకెళ్లొచ్చు నిజమే… బస్సులో సీటు దొరక్కపోతే కవర్ పట్టుకు నిల్చోవడం కష్టం కదా. అందుకే ఇలా” నెమ్మదిగా చెప్పింది స్వరూప.

“దానికేం ఎదురు జెప్పకమ్మా… అది మా యమ్మ. దానిని ఊర్కనే పరెషాన్జేయకండి” గట్టిగా అరిచాడు పక్కనే వార్తలు చూస్తున్న బాబాయ్.

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒక్కటే అనుకుని సీట్లో కూర్చుంది.

పేపర్లన్నీ చూసి కావాలసిన ప్రకటనల క్లిప్పింగ్స్ కట్ చేసింది. తెల్లకాగితంపై అంటించి అవి పబ్లిషయిన తేదీ, పేపరు పేరు రాసి, ఫైల్ చేసి టేబిల్ మీద ఉంచింది. పదకొండు అవుతుందనగా మురారి, అతని పిఎ చలపతి వచ్చారు. రెండోసారి బజర్ మోగింది.

మళ్లీ ఏం తిట్లు పడాల్సి వస్తుందో అని ఆందోళనగా కాబిన్ లోకి అడుగుపెట్టింది స్వరూప. చల్లటి ఏసీ గాలి ఉక్కిరిబిక్కిరి చేసింది. వెన్నులో ఒకలాంటి వణుకుపుట్టింది.

“గుడ్ అన్నీ పనులు చేసేసావ్. యు కెన్ గో” మురళి స్వరంలో బాసిజం. ఇందాకటి సంఘటన ఏమీ గుర్తులేనట్టుగా ఉంది అతని ప్రవర్తన.

నెమ్మదిగా బయటికి నడిచింది స్వరూప.


“హలో అమ్మా…”

“పెద్దోడా… చెప్పమ్మా. ఎలా ఉన్నావ్.”

“అమ్మా నాకో రెండువందలు పంపుతావా. ఇంటర్న్షిప్ రేపటితో అయిపోతుంది. బస్ పాస్ ఇంకో వారంరోజులుంటుంది. ఆలోపు ఏదోక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. రెజ్యూమె జిరాక్సులకోసం, ఇంటర్నెట్ ఖర్చులకు మనీ కావాలి.”

“నీకు ఇంటి పరిస్థితులు తెలుసుకదే. ఇప్పటికిప్పుడు రెండొందలు ఎక్కడ పుడతాయి. అదే కంపెనీలో ఉద్యోగం ఇస్తారన్నావ్. ఏమైందే. ఇచ్చాడా.”

“లేదమ్మా. వాడు ఇచ్చేలా లేడు. ఏమో మళ్లీ రేపు అడుగుతాను.” నిస్సత్తువగా అంది.

“సరేలేవే. ఏం టన్షన్ పడకు. మనకు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. అదేదో అయిపోగానే నేరుగా ఇంటికొచ్చెయ్. కలోగంజో తాగి బతుకుదాం. అక్కడ ఒంటరిగా నువ్వేం కష్టపడక్కర్లేదు.”

“సరేగానీ లిప్ట్సిక్ వేసుకుంటున్నావట. పిన్ని చెప్పింది. ఏంటి సంగతి.”

“లేదమ్మా. ఆఫీసులో అలా వేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. ఉద్యోగం ఇస్తాడేమో అని” నసిగింది స్వరూప.

“నీ బొంద! ఉద్యోగం కోసం వాడు చెప్పినట్టు చేయడమేంటి. చెప్పిచ్చుకు కొట్టాల్సింది. సిటీలో గుంటనక్క బాడ్కొవ్ లకు కొదవుండదు. పిచ్చిమాలోకంలా ప్రవర్తించకు. చేసింది చాలు రైలెక్కి ఇంటికొచ్చెయ్.”

“సరేమ్మా. ఇక ఉంటాను.”

ఎందుకో ఆ రాత్రి తల్లీబిడ్డలిద్దరికీ నిద్రపట్టలేదు.


భారంగా తెల్లారింది. బరువుగా ఆఫీసులోకి అడుగుపెట్టింది స్వరూప.

“సర్ నాకు ఇంకేదైన పని చెప్పండి”.

“ఏం చేస్తావ్. అయినా ఇక్కడ బయటివాళ్లకు పనులు చెప్పరు. మా సీక్రెట్స్ మాకుంటాయ్ కదా.” అలవాటుగా చూపు మరల్చాడు.

స్వరూప కదల్లేదు.

చిరాగ్గా ఆమె కళ్లల్లోకి చూసాడు.

“సర్… ఇక్కడే ఏదైనా జాబ్ దొరుకుతుందా.”

“ఓహ్. ఈ రోజే నీ లాస్ట్ డే కదా. ఏంటి ప్లాను?”

“పోనీ ఏదైనా జాబ్కు రికమండేషన్ చేస్తారా” అభ్యర్థనగా అంది స్వరూప.

“ఇక్కడ నీకేం జాబ్స్ ఉంటాయ్. మీదే ఊరన్నావ్?”

ఇది వరకు చాలా సార్లు చెప్పిన విషయమే. అయినా మళ్లీ చెప్పింది.

“హ అక్కడే చూస్కో ఏదోకటి. నీ టాలెంట్ కి ఊరే బెటర్. ఇక్కడ జాబ్ రావాలంటే చెప్పిన విషయాలన్నీ ఫాలో అవ్వాలి. అయినా నీకంత సీన్లేదులే. పోయిరా…” బిచ్చగత్తెకి నాలుగు పైసలు వేసి చెప్పినట్టుగా చెప్పాడు మురారి. ‘మర్చిపోయాను ఆ సర్టిఫికేటేదో ఈ రోజే తీస్కెల్లు. కావాలంటే ఫ్రీగా ఫోన్ కాల్సు చేసుకో. దానిక్కూడా ఈ రోజే ఆఖరు.’ ఫక్కున నవ్వాడు.

గబగబా పేపర్లన్నీ తిరగేసింది. ఆఫీసునుంచే కొన్ని ఫోన్ కాల్సు చేసుకుంది. నాలుగ్గంటలకో ఇంటర్వూ ఉంది. ఆరుగంటలకు మరోటి.

ఏం అభ్యంతరం లేకుండానే పర్మిషన్ దొరికింది. మద్యాహ్నమే ఆఫీసునుంచి బయటపడింది.

బస్సెక్కింది. కొన్ని స్టాపులతర్వాత సీటు దొరికింది. “ఎక్కడికమ్మా వెళ్తున్నావు” పక్కనకూర్చున ఆవిడ పలకరించింది. ఆవిడది బహుశా తన తల్లి వయసుండొచ్చు.

చెప్పింది స్వరూప.

“చాలా దూరం కదా. ఇప్పుడెందుకు బయల్దేరావ్. అలా పేపర్లో యాడ్ చూసి వెళ్లకూడదు పాపా. సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి.”

మౌనంగా ఉండిపోయింది.

“నువ్వు దిగాలనుకుంటున్న స్టాపు తరువాత వస్తుంది. నేనిక్కడే దిగేయాలి జాగ్రత్తమ్మా” అభిమానంగా చెబుతోంది ఆవిడ.

బస్సు దిగి గబగబా ఇంటర్వూ జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంది. అదో ఏజెన్సీ. కేవలం రెజ్యూమేస్ తీసుకుని పంపేస్తున్నారు. దానికీ పెద్ద క్యూ ఉంది.

అక్కడినుంచి బయల్దేరింది స్వరూప. ఇంకో ఇంటర్వ్యూకి అటెండవ్వాలంటే మూడు బస్సులు మారాలి.

ఆటోలో వెళ్లేందుకు డబ్బుల్లేవు. బస్సుకోసం అరగంట సేపు ఎదురుచూసింది. షేరింగ్ ఆటోలో బయల్దేరింది.

అప్పుడు సమయం ఆరైంది.

అప్పుడప్పుడే మేల్కొంటోంది నగరం. దీపాల ధగధగలను విచిత్రంగా గమనిస్తూ నడుస్తోంది. ప్లాట్ నెంబరు సరిచూసుకుంది. సందేహం లేదు. అదే బిల్డింగు. ఐదో అంతస్తుకెళ్లాలి. కంపెనీ పేరు కనిపించలేదు. బోర్డులేవీ లేవు. వెనక్కి వెళ్లిపోతే! ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగ వేయకూడదు. పట్టుదలగా అనుకుంది. లిఫ్టు కోసం వెతికింది. కనిపించలేదు. సెక్యూరిటీ గార్డుకూడా లేడు. నెమ్మదిగా మెట్లెక్కుతోంది.

మూడో అంతస్తులో భారీ ఆకారంలో ఇద్దరు మగవాళ్లు. తోడేళ్లలాంటి చూపులు. ఏదో చెడు జరగబోతోందనుకుంది స్వరూప. సెక్యూరిటీ కాబోలు అని సరిపెట్టుకుంది. నాలుగో అంతస్తుకు రాగానే వెన్ను జలదరించింది. ఎందుకో వెననక్కి వెళ్లిపోమ్మని చెబుతోంది అంతరాత్మ. కానీ ముందుకు నడిచింది.

ఐదవ అంతస్తులోకి అడుగుపెట్టింది. పాలిపోయిన ముఖంతో అమ్మరూపం కళ్లముందు కదిలినట్టయింది. ఎలాగైనా ఇంటర్వ్యూ అటెండయితే తన కష్టాలు తీరొచ్చేమో అనుకుందా అమ్మాయి. ఏదో మాయలో ఉన్నట్టుగా లోపలికి అడుగుపెట్టింది. మగవాళ్ల గొంతులు. సిగరెట్ పొగ. మందు వాసన. అనుమానంగా చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ‘ఇక్కడ ఇదంతా కామన్’ మురారి మాటలు చెవుల్లో నాగస్వరంలా మోగాయి. వెనక్కి వెళ్లిపోవాలన్న ఆలోచనే రాలేదు. ‘జాగ్రత్త’ బస్సులో తనను హెచ్చరించిన మహిళ మొహం మరోసారి అస్పష్టంగా కనిపించింది. స్వరూప లెక్కచేయలేదు.

అక్కడి వాతావరణంలో కంటికి కనిపించని కఠినత్వం ఉంది. అది ఆమె వివేకాన్ని స్పర్శించింది. ఆ జలదరింపును స్వరూప పట్టించుకోలేదు. కొడిగట్టిన ప్రస్తుతాన్ని వెలుగుల భవిష్యత్తుతో నింపాలనే ఆశ ఆమెను ఇవేమీ గమనించలేని అచైతన్యస్థితి లోకి తీసుకెళ్లింది. ఇప్పుడామె అణువణువూ ఉద్యోగంకావాలనే ఆరాటమే. కుటుంబాన్ని ఒడ్డెక్కించాలన్న పోరాటమే! అదే తపనతో చుట్టూ అల్లుకుపోతున్న సాలెగూడును చూడలేకపోయింది. ఏదో తెలియని ఆవేశం ఆమెను మరింత ముందుకు నడిపించింది. ఆ ఒక్క ఎమరుపాటే ఆమెను గాఢాంధకారంలోకి లాగేసింది. చుట్టూ పరుచుకున్మ ఉన్న చీకటి ఒక్కసారిగా తన రాకాసికోరలతో ఆమెను చుట్టుకుపోయింది. ‘ఇదంతా ఒక పీడకల’ గట్టిగా కళ్లు మూసుకుంది స్వరూప. కళ్లు తెరిచి వెలుగును చూడాలని అనుకోవడమే అత్యాశగా మారబోతోందని మూసిన ఆ కనురెప్పలకు తెలీదా క్షణంలో!

సరిగ్గా అదే సమయంలో,

“అమ్మా మనం కరెంటు తీగ లాగుదామా…”

“వద్దురా దొంగపనులు మనకు పడదు. కరెంటాయన వస్తే పరువుపోతాది” కసిరింది.

“సర్లే ఇంత తిని పండుకోరా. మీ అక్కకు ఉద్యోగం దొరికితే జనరేటరే పట్టుకొచ్చుకుందాం…” సంబరంగా అందామనుకున్నా ఎందుకో గొంతులో విచారం ధ్వనించింది.

పొద్దు మరింత కుంగింది. చీకటి మందం పెరిగింది. ఫ్లోరోసెంట్ దీపాలతో డాబాలు దర్జాగా వెలుగులు చిమ్ముతున్నాయి. కొన్ని ఇళ్లు నారింజపండు బల్బులతో తమ శక్తిమేర చీకటితో పోరాటం చేస్తున్నాయి. వాటికి దూరంగా ఉన్న కొన్ని పాకల్లో కిరోసిన్ దీపాలు మాత్రం తమను కారు నలుపు మింగేస్తుందేమో అన్న భయంతో మిణుకుమిణుకు మంటున్నాయ్.

చీకటి వేగంగా విస్తరిస్తోంది. బుడ్డీలో కిరోసిన్ అడుగంటుతోంది. దీపం వెలుగు క్షణక్షణానికీ తగ్గిపోతోంది. బుడ్డోడు పడుకున్నాడు. భర్త లేడన్న వెలితి, బిడ్డ ఎలా ఉందో అన్న ఆరాటం ఆ తల్లి మనసును నమిలేస్తోంది. మెతుకులు మింగుడు పడలేదు. చెంబు నీళ్లు అన్నం గిన్నెలో పోసి మూతపెట్టింది. చాపమీద ఓ పక్కకు ఒత్తిగిల్లి కాళ్లు కడుపులో దాచుకుంది. దీపం వైపు చూస్తుండిపోయింది. అప్పటివరకూ నిర్జీవంగా వెలిగిన ఆ దీపం అకస్కాత్తుగా పెద్ద వెలుగును విరజిమ్మి ఆ వెంటనే ఆరిపోయింది. పాక మొత్తం ఒక్కసారిగా చీకటిపరుచుకుంది.

ఆకాశంలో ఎక్కడో ఓ పక్షి హృదయవిదారకంగా అరుస్తున్న శబ్దం తెరలు తెరలుగా వినిపిస్తోంది.

కథా రచయిత, జర్నలిస్టు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో జర్నలిజం పాఠాలు చదివాను. ఇరవయ్యేళ్ల వయసులో ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో చేరి, ఆ పత్రిక ఫీచర్స్ డెస్కులో సబెడిటర్ గా కెరీర్ ప్రారంభించారు. సండే మ్యాగజైన్ ‘స్నేహ’ లో క్యాంపస్ ఛాట్ శీర్షిక నిర్వహించారు. టీవీ9లో కొంతకాలం పనిచేశారు. పెళ్లయ్యాక సాప్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. మళ్లీ సాహిత్యాభిలాషతో కథలురాయడం ప్రారంభించారు. మొదటి కథ ‘గాజుబొమ్మ’ విహంగ పత్రికలో ప్రచురితమైంది. పెళ్లి పేరుతో స్త్రీలపై జరిగే హింసను వివరించే ‘విముక్తి’, ట్రాన్స్ జెండర్స్ ఎదుర్కొనే వివక్షను చూపే ‘ఓ శిరీష్ కథ’ విహంగలోనే పబ్లిషయ్యాయి. స్త్రీలపై, హిజ్రాలపై జరుగుతున్న హింస, వివక్షలపై సమాజంలో అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.

Leave a Reply