విషపు గోళ్ళ మధ్య

చెరసాలలు సిద్ధపరుస్తున్న
అశాంతి శక్తుల ముందు నిలబడ్డ గుంపులో
నేనూ మనిషిగీతానికి కోరస్ పాడుతుండాను

ముందుగా
గాయాల్ని సమూలంగా కూల్చే పాట పాడిన
మా నేపధ్య గాయకుడు
సంకెళ్లలో బంధీయైన సింహంలా
తలవంచకుండానే లోపలికి నెట్టబడుతాడు..

ఆ వెంటనే నేనూ
నా ముందు వాళ్ళు
నా వెనుక వాళ్ళు
పిడికెడు ప్రేమను
కాసింత కరుణను
శాశ్వతం చేయాలని తపిస్తున్న వాళ్లంతా
చరిత్ర కాలపు దుఃఖాన్ని తోడిపొయ్యాలని
వివక్ష మురుగు పెంచుకు బతుకుతున్న
కుట్రలపురుగులన్నింటికి
చరమగీతం పాడాలని తలపోతున్న స్వాప్నికులంతా
పాలనా కాలానికి మొలిచిన విషపుగోళ్ల గోడల మధ్య
ఖైధు చేయబడతారు.!

నిజాలకు నిషిద్దాలు కొత్తకావని తెలుసు
సత్యాలకు సంకెళ్ళూ కొత్తగావని తెలుసు
తెలిసే నిలబడ్డాను
గోడుగోడమంటున్న గొంతులకోసం గొంతుల్తో గొంతునై
నిషేధపు కంచెలు నిర్మిస్తున్న వాడికే తెలీదనుకుంటా
ఏ ఆలోచనా పక్షులను
కట్టుకథలతో కట్టడిచేయడం అంత తేలిక కాదని.!

స్వేచ్ఛను చెరబట్టే వాడు
బత్తాయిరంగు చేతులూపుకుంటూ వస్తున్న దారిలో
అన్నీ తెలిసే ఎదురు నడుస్తున్నాను..!

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

3 thoughts on “విషపు గోళ్ళ మధ్య

  1. పక్షులను కట్టు కథ లతో కట్టడి చేయడం

  2. చాలా భావోద్వేగాలతో నిండిన కవిత సర్

Leave a Reply