భారతీయ సమాజంలో కనీసం మనిషిగా గుర్తింపు లేకుండా ఇంటిలో వెట్టిచాకిరి, బయట సమాజంలో అవమానాలు, కన్నీళ్లు, వివక్షకు గురవుతున్న వైధవ్యం పొందిన మహిళల స్థితిగతులపై తెలుగు సమాజంలో తొలిసారిగా లోతైన అన్వేషణ ‘భారతదేశంలో వితంతు వ్యవస్థ’ గ్రంథానికి ప్రధాన సంపాదకురాలుగా ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత నేతృత్వంలో చక్కని పుస్తకం మన ముందుకు తెచ్చారు. కొమర్రాజు రామలక్ష్మీ, చందనాల సుమిత్ర, తమ్మెర రాధిక కూడా సంపాదకీయంలో భాగస్వామ్యం పంచుకున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఏడాది కాలం, ఆర్థిక భారాన్ని రుద్రమ పబ్లికేషన్స్ భరించింది. మహిళల అభ్యుదయం, ప్రగతిశీల ఆలోచన దృక్పథం పెంపొందించడానికి మహిళ రచయిత్రుల ఆలోచనలు వెలికితీయడానికి రుద్రమ పబ్లికేషన్స్ తనదైన పథంలో కృషి చేస్తోంది. తెలుగు సాహిత్యంలో అరుదైన పరిశోధన గ్రంథమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విశ్వవిద్యాలయాలు చేయాల్సిన సాహిత్య పరిశోధన అంశాన్ని ఎంచుకొని విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రధాన సంపాదకురాలు అనిశెట్టి రజిత సఫలమయ్యారు.
ఈ పుస్తకంలో నాలుగువందల ఎనభై ఐదు పేజీల్లో భారతీయ సమాజంలో వితంతు వ్యవస్థపైన పద్దెనిమిది ‘సామాజిక వ్యాసాలు’, ఇరవై ‘సాహిత్య వ్యాసాలు’ ఉన్నాయి. అదేవిధంగా వితంతువుల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక విప్లవకారుల ‘వ్యక్తిత్వాల’పై ఏడు వ్యాసాలు. తమ జీవిత అనుభవాలు, పరిశీలన నేపథ్యాలు, క్షేత్రపర్యటన నివేదికలతో పదమూడు ‘కథనాలు’ పాఠకులను ముందుకు నడిపిస్తాయి.
‘వితంతువు’ పదం పుట్టుపూర్వోత్తరాలు ఏదీ ఏమైనప్పటికీ ‘వితంతు వివక్ష`చట్ట బద్దత’ వ్యాసంలో డాక్టర్ బి.విజయలక్ష్మి వ్యాఖ్యానించినట్లుగా ‘మాంగళ్య ధారణ సమయంలో, పురోహితులు వేదమంత్రాల్లో ‘మాంగళ్యం ‘తంతు’ నానేన మమ జీవన హేతునా’’ అని ఉచ్చరిస్తారు. అంటే ఇక్కడ మాంగళ్యధారణ ఒక తంతు మాత్రమే. ‘‘మమ జీవన హేతునా’’ అంటే నీకు తోడుగా నేనున్నానని చెప్పడం’’ భర్త మరణిస్తే వివాహంలో భాగమైన ‘తంతు’ అనే ఒక మాంగళ్యం తీసివేస్తే వితంతువుగా భావించాలి. బొట్టు, గాజులు, పసుపు, కుంకుమలు భర్త ఇచ్చినవి కాకపోవడం వలన తీసివేయాల్సిన అవసరం లేదని మన ఆధునిక నాగరికులకు తెలియజెప్పాల్సిన ఉంది. వైధవ్యం పొందిన మహిళకు మేమున్నామనే భావనను కుటుంబం, సమాజం, తోటి మహిళలు భరోసా కల్పించాల్సిన అసరం ఉంది. వితంతువు మహిళలు కేవలం చాదస్తపు ఆలోచనలకు బానిసలు కాకుండా పురుషాధిపత్యంపై ధిక్కార స్వరం వినిపించాలంటారు.
1814లో రాజారామ్మోన్రాయ్ ‘సతిసహగమనం’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. దీంతో భారత గవర్నర్ విలియమ్ బెంటింగ్ 1829 డిసెంబర్4న సతీసహగమనంపై నిషేధం విధించారు. ఆ సంస్కరణ ప్రభావాలు క్రమంగా దక్షిణాది ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. 1856 నుంచి వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. మద్రాసు రాష్ట్రంలో 1881, డిసెంబరు 11న కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో తొమ్మిదేళ్ల బాల వితంతువు గౌరమ్మను గోగులపాటి శ్రీరాములుకు ఇచ్చి వివాహం చేశారు. నలభైకి పైగా పెళ్లిలు చేశారు. దీనికి నేపథ్యం బెంగాల్లో సాంఘిక సంస్కరణోద్యమకారుడు రాజారామ్మోరాయ్ కృషి ఫలితమే. క్రమానుగతంగానే వితంతువుల సేవాసంస్థలు, వ్యక్తులు పుట్టుకువచ్చారు. అందులో ప్రధానంగా లుంబా ఫౌండేషన్ కూడా కీలకంగా పనిచేసింది. లుంబా పౌండేషన్ వ్యవస్థాపకులు లార్డ్లుంబా తల్లి పుష్పవతి లుంబా 1954, జూన్ 23న కీర్తి శేషులయ్యారు. ఆమె కోరిక మేరకు తనయుడు పౌండేషన్ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘లుంబా ఫౌండేషన్’ వితంతువులకు సాంఘిక, ఆర్థిక హోదా కల్పించడానికి చేసిన కృషిని గుర్తించి 2010లో ఐక్యరాజ్య సమితి జూన్ 23ను ‘‘అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం’’గా ఖరారు చేసింది. ప్రపంచదేశాలకు అమలు చేయాలని యుఎన్ఓ ప్రధానకార్యదర్శి బాన్ కీ మూన్ ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 258 మిలియన్ల వితంతువులు ఉండగా 1.36 మిలియన్ బాల్య వితంతువులు ఉన్నట్లు సర్వేలు తెలుపుతున్నాయి. మనదేశంలో అత్యధికంగా వితంతువులున్న రాష్ట్రాలు పాండిచ్చేరిలో 67శాతం, పశ్చిమ బెంగాల్లో 65 శాతం, కర్నాటకలో 63.2శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 63శాతం ఉండగా అత్యల్పంగా నాగాలాండ్‌లో 24.5శాతం, సిక్కింలో 32.1శాతం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళల వైధవ్యానికి కారణాలు గమనిస్తే ప్రధానంగా పురుషులు మద్యపాన వ్యసనం, కాలుష్య పరిశ్రమలో పనిచేస్తూ అనారోగ్య, అకాల మరణాలు, ఉపాధి అవకాశాలు లభించక బలవన్మరణాలకు గురవుతున్నారు. ఈ మరణాలను సైతం వైధవ్యం పొందిన బాధిత మహిళలనే కారకులుగా ప్రచారం చేసే కర్మసిద్ధాంతం బలపరిచే భావవాదుల అజ్ఞానానికి అడ్డుకట్ట వేయనంతకాలం భారతీయ వితంతు మహిళకు భరోసా ఎండమావిలాంటిదే మరి.
ఈ గ్రంథంలో ప్రతీ వ్యాసం నూతనమైన చారిత్రక, సాంస్కృతిక, సామాజిక దృక్పథాలు వెలిగించే రచనలుగా కనిపిస్తాయి. సాహిత్య, సామాజిక రంగాల్లో ప్రజాదృక్పథంతో పనిచేస్తున్న సీనియర్ అకాడెమిషియన్స్ ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, డాక్టర్ కొల్లాపురం విమల, డాక్టర్ తెన్నెటి విజయచంద్ర, డాక్టర్ తిరునగరి దేవకిదేవి, కె.ఎన్.మల్లీశ్వరి, డాక్టర్ కె.రామలక్ష్మీ, డా.మెట్టా ఉషారాణి, డా.ఆకునూరు విద్యాదేవి పరిశోధక వ్యాసాలు చాలా విలువైన విశ్లేషణలు మనల్ని మరో ప్రపంచంలోకి కదిలిస్తాయి.
వితంతువు జీవనభృతి అత్తవారింటికి నైతిక బాధ్యత. వైధవ్యం పొందిన కోడలిని ఉమ్మడి కుటుంబంలో పోషించాల్సిన బాధ్యత మామదే. వితంతువుకు పునర్వివాహం హక్కు ఒక సంస్కరణే కాదు చట్టం కూడా. ఆమె పునర్వివాహం చేసుకుంటే, మరణించిన మొదటి భర్త ఆస్తిలో కూడా వారసత్వం వుంటుందని అత్యున్నత కోర్టుల తీర్పులిచ్చాయని డా. బి.విజయలక్ష్మీ ఆలోచనలు మరింత భావజాల వ్యాప్తిలో పెట్టాల్సిన అవసరం ఉంది. భర్త మరణించిన తర్వాత భర్తకు ప్రాథమిక వారసుల పట్టికలో వారసురాలిగా పరిగణించబడుతుందని వారసత్వ చట్టంపై అవగాహన మహిళలకు కల్పించాల్సిన అవసరముందని చెప్పవచ్చు.
భారతీయ సమాజం శాస్త్ర, సాంకేతికరంగాల్లో ముందుకెళ్లుతుందని పాలకుల మన్‌కీ బాత్‌లో నిత్య ప్రవచాలు వినిపిస్తున్నాయి. ఒక సమాజం అభివృద్ది చెందుతుందని చెప్పడానికి ఒక్క ఆర్థికాభివృద్ధి మాత్రమే కాదు. సామాజిక, సాంస్కృతిక, ప్రగతిశీల దృక్పథమే ప్రమాణికంగా తీసుకోవాలి. ఇవాళ భారతీయ ప్రజల్ని ‘సనాతన ధర్మం’ దారిలో బలవంతంగా నడిపించడానికి పాలకులు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. సనాతన ధర్మానికి పునాదిగా పనిచేసే బ్రాహ్మణీయ హిందుత్వ పితృస్వామ్య బూజుపట్టిన ఆలోచనలే కారణం. ప్రజలను అనాదిగా వస్తున్న ఆచారాల ముసుగులో అంధ విశ్వాసాలు, మూర్ఖపు భావనలు మహిళలపై బలవంతంగా అమలు చేస్తున్నారు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు మహిళను వీరమాతగా సందర్భానుసారంగా కీర్తిస్తారు. వారి జీవన సాంస్కృతిక అస్తిత్వం మీద బ్రాహ్మణీయ పితృస్వామ్యం తీవ్రమైన అణచివేతను కొనసాగించడానికి ఆచారాల అంధకారంలో ప్రజల్ని బందీలను చేసిందని గమనించవచ్చు.
బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి మూలాలు మనుస్మృతి నుంచి ప్రజల్లోకి రాచరిక వ్యవస్థలోని అగ్రకుల ఆధిపత్య వ్యవస్థ వీటిని చట్టాలుగా ప్రచారంలో పెట్టాయి. నవనాగరికత తెలిసిన మనుషులుగా ఎంతో ఆధునికత సమాజంలోని ప్రజల జీవితాల్లో చోటు చేసుకున్నప్పటికీ వాటిని పురుషాధిపత్యానికి అనుకూలంగా సూత్రీకరిస్తూనే మహిళల మనోభావాలకు స్వేచ్ఛనివ్వకుండా నియంత్రణ కొనసాగడం గుర్తించాల్సిన విషయం.
సాహసంతో ఎత్తైన ఎవరెస్టును మహిళలు అధిరోహిస్తున్నారు. చంద్రమండలం మీద తమ పాదం మోపారు. ఇతర గ్రహాల రహస్యాలను శోధిస్తున్నారు. మానవ పరిణామక్రమంలో ఊహించని పురోగతిని సాధించుకుంటున్నారు. సాటి ఆడ మనిషి, అందులో వితంతువుల పట్ల వివక్షకు, వెలివేతకు కారణమవుతున్న పుక్కిటి పురాణాల కట్టు కథల నేపథ్యాలుగా అమలవుతున్న బ్రాహ్మణీయ సాంస్కృతిక అధిపత్యాన్ని ఎందుకు తిరస్కరించలేకపోతున్నారనేది నేటి ప్రశ్న. విద్యాప్రణాళిక రూపకల్పనలోనే వైఫల్యాలు ఉన్నాయని గుర్తించాలి. ఆధిపత్య దోపిడీ వర్గాలకు తమ పాలన కొనసాగించడానికి అవకాశమున్న ప్రతీచోట అణచివేతనే సాధనాలు అమలు చేస్తూనే ఉంటారు. ఆ క్రమంలోనే కులం,వర్గం,లింగ అసమానతలు పేరుతో కల్పిత సాంస్కృతిక వైరుధ్యాలు భావవాద దృక్పథాల ప్రచారంలో భాగంగానే వితంతువులు భారతీయ సమాజంలో అట్టడుగు పొరల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజల మౌలిక ఆలోచనల్లో మార్పు రానంతవరకు బ్రాహ్మణీయ పితృస్వామ్య ఆధిపత్యాలు సమాజంలో భిన్న సాంస్కృతిక రూపాల్లో వ్యక్తమవుతాయని విశ్లేషణాత్మక రచనల్లోని సారం మనకు దృగ్గోచర చేస్తున్న పుస్తకమిది. ఈ పుస్తకంలోని వ్యాసాల మధ్యలో చారిత్రక వ్యక్తులు అబలాబోస్, లుంబా ఫౌండేషన్, ఆర్.ఎస్.సుబ్బలక్ష్మీ, పూలే చెప్పిన వితంతువు స్త్రీ కథ, 19వ శాతాబ్దిలో సంస్కరణ వాదులు’ తదితర చారిత్రక విశేషాల సమాచరం పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తాయి.
మనువాద బ్రాహ్మణీయ భావజాలం నుంచి పుట్టుకొచ్చిన సాంఘిక దురాచారాల్లో వితంతువు వ్యవస్థ ఒకటి. 19వ శతాబ్దంలో ద్వితీయార్థంలో తెలుగు ప్రాంతాల్లో పునర్వివాహం హక్కు కల్పిస్తూ చేపట్టిన ప్రచారంలో తెలుగు సాహిత్యకారుల కృషి భిన్న ప్రక్రియల్లో సాహిత్యం కీలకంగా పనిచేసిందని డా. తెన్నేటి జయచంద్ర పేర్కొన్నారు. తెలుగులో వితంతువు పునర్వివాహ సంస్కరణ, బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ చాలామంది రచయితలు సమాజాన్ని చైతన్యం చేశారు. సోమంచి శ్రీదేవి రాసిన నవల ‘‘సంగమం’’ గురించి మనువాద భావజాలం వేళ్లూనుకున్న సమాజంలో ఒక వితంతువు పునర్వివాహం, దాని పర్యవసానాలపై డా.కొమర్రాజు రామలక్ష్మీ ‘‘తంత్రులు తెగిన వీణను సవరిస్తే’’ వ్యాసంలో చక్కగా విశ్లేషించారు. మాలతీ చందూరు రచించిన ‘శతాబ్ది సూరీడు’ నవల ఒక వితంతువు జీవిత నేపథ్యంగా వచ్చింది. శతాబ్ది ఆరంభానికి ముందే మొదలై వందేళ్ల ఒంటరితనం అనుభవించి మరణించిన బ్రాహ్మణ వితంతువు సూరమ్మ కథ. డా.బండారి సుజాత ‘శతాబ్ది సూరీడు’ వ్యాసంలో విశ్లేషించారు. వాసిరెడ్డి సీతాదేవి ‘సమత’, వైతరిణి, తిరస్కృతి వితంతువుల బతుకు చిత్రాలను పరిచయం చేసిన నవలల గురించి ‘సీతాదేవి నవలలువితంతువు స్త్రీల చిత్రణ’ పేరుతో అన్వేషి సంక్షిప్త పరిచడం పాఠకులను ఆకట్టుకుంటుంది. శీలా సుభద్రాదేవి రచించిన ‘గోడలు’, ‘గుండెల్లో గాయాలు’, ‘నేనున్నాను కనుకే’ మూడు కథల అంతరంగాన్ని అనిశెట్టి రజిత ‘స్త్రీ జీవితం సుడిగుండాలమయం’ అంటూ పరిచయం చేశారు. అదేవిధంగా గంటి భానుమతి రాసిన ‘రాములమ్మ’ కథ, రంగనాయకమ్మ 1960లో రాసిన ‘విధవలపట్ల మన కనీస ధర్మం కథ’ వితంతువుల వ్యధార్థ గాధలు మొదలు పెడితే చదవకుండా వదలనీయవు. డాక్టర్ కె.ఎన్.మల్లీశ్వరీ ‘సహజ జీవన చిత్రాలు
కొకు కథల్లోని వితంతువు పాత్రలు’ వ్యాసంలో ‘పెంపుడు తల్లి’, ‘దత్త పుత్రుడు’, ‘మళ్లీ పెళ్లి’ మూడు కథల్లో వితంతువుల చుట్టూ ఉంటే జీవిత చిత్రణలో ఒక వితంతువు తన లైంగిక అనుభవాలను, లైంగిక వ్యక్తిత్వం, లైంగిక సహచరుని ఎంపి విషయం కనిపిస్తుంది. డా.తిరునగరి దేవకీదేవి రాసిన ‘చలం సాహిత్యంలో వితంతువు’, డా. ఆకునూరి విద్యాదేవి ‘వితంతు స్త్రీల విజయగాథ’(వైట్ రెయిన్బో కథ), తమ్మెర రాధిక ‘శ్రీపాద కతల్లో వితంతువులు’ వ్యాసాలు తప్పక చదవాల్సినవి. తెలుగు సాహిత్యంలో వితంతువుల జీవన చిత్రణ గురించి చేసిన కథలు, నవలలు పాఠకులకు ఒకే దగ్గర లభించేవిధంగా చేసిన కృషిని చదివితే తప్ప సంపాదకుల కృషిని అభినందించలేము.
ఈ పుస్తకంలోని వ్యాసాల మధ్యలో చారిత్రక వ్యక్తులు అబలాబోస్, లుంబా ఫౌండేషన్, ఆర్.ఎస్.సుబ్బలక్ష్మీ, పూలే చెప్పిన వితంతు స్త్రీ కథ, 19వ శాతాబ్దిలో సంస్కరణ వాదులు’ తదితర చారిత్రక విశేషాల సమాచరం పాఠకులకు ఆసక్తి కలిగిస్తాయి.సమాజంలో సంఘసంస్కరణ ఉద్యమం, సాంఘిక విప్లవకారులుగా పేరొందిన కేశవ ధోండొ కర్వే, జ్యోతిరావుపూలే, సావిత్రిభాయి పూలే, రమాబాయి సరస్వతి, కందుకూరి వీరేశలింగం, మాళవిక హేగ్డే, మోహినిగిరిల సామాజిక సేవలను పరిచయం చేస్తూ వారి ‘వ్యక్తిత్వాల’పై ఏడు వ్యాసాలు ఉత్తమ సమాచారాన్నిస్తాయి. చివరగా ఈ గ్రంథం రూపకల్పనలో బాధ్యత పంచుకున్న రచయిత్రుల జీవన అనుభవాల్లో ఎదురైన వితంతువుల సమస్యలను ఎదుర్కొన్న తీరు, నేపథ్యాలు, పరిష్కారాలను, ఆయా సందర్భాల్లోని క్షేత్రపర్యటన నివేదికలపై పదమూడు కథనాలు పాఠకులను ఆసక్తిగా చదివింప చేస్తాయి.