వియోగపు పరదా

పనిలో తప్పిపోయే కార్మికుడిని కదా
ఈ రోజులోకి ఎప్పుడు
తప్పిపోయానో
గుర్తు లేదు

నిన్ను కలవాలన్న
కోరిక దహిస్తుంటుంది
నిట్టనిలువునా ఎండకాలంలో
అంటుకునే అడవిలా-

అయినా అరుగుతున్న కాళ్ళు
తిరుగుతూనే ఉంటాయి
కోసుకుపోతున్న వేళ్ళ మధ్య
పనిముట్లు మొగ్గలౌతూనే ఉంటాయి

ఏం చేయాలి బతుకుపోరులో
నిత్య సైనికుణ్ణి
యజమాని సాలెగూట్లోంచి తప్పించుకొని
ఎలాగోలా చేరుకోవాలనుకుంట
నా చింతలన్నీ తీరే నీ చెంతకు

కానీ
పని అనే గుబురు వనంలో
ఒక్కసారి చిక్కుకు పోయామా
గంటలు గడిచిపోతుంటే
ఘడియలు శూన్యం ముఖంతో
వేలాడుతాయి
రోజులు ఎడారి మన్ను పాలౌతుంటై
ఓయాస్సిస్సుల్లో ఓలలాడే ఓడలేం లేవు
ఎండమావుల అనుకొండ కొరలకేం తక్కువ లేదు

దేహం చెమట ఊట
తల తలపోటు తండ్రి బిడ్డ
నేనెవరో నాకే తెలియని అస్తిత్వపు తంటా

నేను పనిముట్లని వాడుతున్నానో
పనిముట్లు నన్ను వస్తువుని చేసి ఆడిస్తున్నాయో తెలియని
సందిగ్ధ కాలపు కార్ఖానాలో బతుకు దగ్ధమౌతూ ఉంటుంది

అలసట గుండె మీద తన్ని
ఊపిరి కాసేపు ఆగినప్పుడు
నువ్వు గుర్తొస్తావు
నీ జ్ఞాపకాల ప్రాణం నరాల్లో బలంలా
ఊపిరితిత్తుల్లో గాలిలా ప్రవహించి
బతుకుని బతకనిస్తుంది

కాలం
నొసటి వెక్కిరింత వేయి వంకర్లు గా
నీ ఎదురుగా నిలబడి ఉండగా
నువ్వూ వేచి ఉంటావు కదా నా కోసం-
ఇలాంటివే భావాల భారపు వదనంతో-

గుర్తుపట్టలేని జన్మరహస్యం
కాదు కదా బతుకు నీకూ నాకూ!
అవసరాల అడవిలో తప్పిపోయి
అప్పుల మాయాజాలం వల్ల
అంతరాత్మ మాయమయ్యీ
అదెంత వికృతంగా నవ్వినా
కష్టాల ఎడారి ని ఎదుట నిలబెట్టి
విశృంఖలంగా గాయాలు చేసినా

పర్లేదులే !

నేనెక్కడున్నా,
నా తోడుగానే ఉంటుంది
నువ్వు నా కోసం చాలా
ఆలోచనని వెచ్చిస్తూ ఉంటావనే
దిగులు-

దిగులు …హా ….
ఈ దిగులొక్కటే
మనలో ప్రేమ‌ మిగిలి
ఉందనడానికి దాఖలా

వచ్చేస్తా… కష్టాల సూర్యుడి ముఖం పాలిపోయి
వలస అనే ఈ జీవితపు సాయంకాలం కరిగిపోనీ…

మన బతుకు గడపకు అడ్డంగా వేలాడుతున్న
ఈ లోహపు వియోగపు పరదా
కాలిపోనీ…

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply