విమేద్రి

“అమ్మే….యిమేద్రే” పిలుపు వినిపించి బండిబాట మీద నడుస్తోన్న విమేద్రి టక్కున ఆగిపోయింది. పక్కనే ఏవో కబుర్లు చెప్పుతూ రోజుతున్న విజయ కూడా గసపోసుకుంటూ ఆగింది. బండిబాట పక్కనే వున్న పొగాకు చేను గట్టు నుంచి చేతిలో లిక్కి, క్యారేజీ బాక్స్ వస్తోన్న రాజమ్మ కనిపించింది.

“ఎందే పిల్లలూ… అట్టా ఉరుకుతున్నట్లు నడుస్తున్నారు? అని అడిగింది రాజమ్మ.

“ఏం లేదత్తా పిల్లోడు స్కూలు నుంచి వచ్చే టైమవుతోంది. పొద్దున లేటయిపోయిందని చద్దనం తినేసి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయాడు. ఆడొచ్చేలోగా కాస్త ఏదైనా వుడకేసి పెడదామని”. చెప్పింది విమేద్రి మళ్ళీ నడక వేగం పెంచుతూ…

కలుపుతీతకెళ్ళోత్తాన్నారా? రాజమ్మ…

“లేదత్తా. మిరపకోత నుంచి వస్తున్నాం” విమేద్రి…

“ఎవరి చేను?” రాజమ్మ…

“ఈ ముసల్దానికి అన్నీ ఆరాలే” కాస్త మెల్లగా గొణిగింది వెంట ఉన్న విజయ.

“పెదంకటరెడ్డి చేనత్తా” విమేద్రి…

ముగ్గురూ బండిబాట మీద నడుస్తున్నారు. విజయ సగంలో ఆపేసిన సిన్మా కథ చెప్పడం మొదలు పెట్టింది.

“పిల్లలిద్దర్నీ ఒంగోలు హాస్టల్ లో చేర్పించానన్నావు గదమ్మే” రాజమ్మ…

మళ్ళీ విజయ కథకు బ్రేక్ పడింది.

“పిల్లోడు ఈ ఏడాది పదో తరగతిలోకి వచ్చేడత్తా, హాస్టల్ లో చదువు సాగడం లేదని చెప్పి ఇంటి నుంచే స్కూలుకెళుతున్నాడు. స్కూలు నుంచి వచ్చి ప్రవేటుకెళ్తున్నాడు. విమేద్రి…

“ఎట్టా ఉండే దానివి ఎట్టా అయిపోయావు. కాపురాని కొచ్చిన కొత్తలో విరిసిన ముద్దబంతి పువ్వులా ఎంత కళకళలాడుతుండే దానివి. యిప్పుడు జూడు ఎట్టా ఎముకలు తేలన్నాయో వాన లేదు, ఎండ లేదు, వరదా లేదు, వరుపు లేదు, పొలం పనుల కాడ్నించి మట్టి పనుల దాకా నాగా లేకుండా చేస్తుండావు. అయినా మెళ్ళోకి ఒక్క దారమన్నా చేయించుకోలేకపోయావు” రాజమ్మ అలా తన ధోరణిలో మాట్లాడుతూనే వుంది. ఆ ప్రయత్నంగా విమేద్రి చేయి మెడని నిమిరింది. ఊరికి దగ్గరగా వచ్చారు.

సూర్యుడు కోపం కక్కుతూ పడమటి కొండల్లోకి వాలిపోతున్నాడు. ఎద్దుల మెడల్లోని గంటల చప్పుళ్ళతోనూ, తిరగేసి కట్టిన నాగళ్ళని బర బర లాగుతున్న శబ్దాలతోనూ, మేకల మేమే ఆరుపులతోనూ, గొర్రెల మందలు రేపుతోన్న దుమ్ముతోనూ, పిల్లల ఆరుపులతోనూ, ఆటలతోనూ, ఊరంతా గోలగోలగా, సందడి సందడిగా వుంది.

“ఏయ్..ఎహ్ అని బళ్ళని తోలుతున్న అరుపులతోనూ, నెత్తి మీద గడ్డి మోపులతోనూ హడావుడిగా అందరూ పొలాల నుండి, పనుల నుండి ఇళ్ళకు చేరుతున్నారు. ముగ్గురు బండ్ల బాట నుంచి చెరువు కట్ట మీద రొడ్డెక్కారు. పెద్ద చెరువు. చెరువులో గేదెల్ని కడుగుతూ సందడిగా వుంది. చెరువు గట్టు మీద ఏనాటిదో పెద్ద రావిచెట్టు. దాని చుట్టూ కట్టిన చట్టా. ఊరికి అదే బొడ్డురాయి. నలుగురు కుర్చోని మాట్లాడుకునే చోటు, కూడలి అన్నీ అదే. అక్కడ నుంచి ఊరిలోకి మూడ దారులు చీలతాయి. తన దారిలోకి నడుస్తూ

“అక్కో! రేపు కూడా ఎంకట్రెడ్డి చేనుకే వెళ్ళమని చెప్పింది. రాణమ్మ మేస్త్రీ” అరిచినట్లు చెప్పి విజయ వాళ్ళయింటి దోవ పట్టింది.

రాజమ్మ చెట్టు కింద ఎవరితోనో నిలబడి మాట్లాడుతూ వుండిపోయింది.

గబగబ నడుచుకుంటూ ఇల్లు చేరిన విమేద్రి చేతిలో ఉన్న అన్నం డబ్బాని అంట్లు తోమే తొట్టి కాడ పడేసి, భుజం మీద వున్న తువ్వాల్ని దండెం మీదకి ఇసిరేసింది. మూలనున్న కొబ్బరి పుల్లల చీపురు తీసుకొని పంచ, ఇంటి ముందు దబ దబ ఊడ్చి, కసువెత్తి తట్టలో వేసింది. నీళ్ళ తొట్టి దగ్గరకెళ్ళి మిరప ఘాటుకు చుర చుర మండుతున్న చేతుల్ని, మొఖాన్ని, కాళ్ళని తోమి తోమి కడుక్కొని పైట కొంగుతో తుడుచుకుంటూ, చూరులో పెట్టిన తాళంచేయి తీసి, తాళం తీసి లోపలకెళ్ళింది. చెంబు నిండా బిందెలోని నీళ్ళు ముంచుకొని తాగి, పొద్దునే తోమకుండా వదిలేసిన కుండా, చట్టి, తోమాల్సినవి వెతికి అంట్లు తోమే గాబు దగ్గర వేసి వాటి మీద నీళ్ళు చల్లింది.

రెండు రోజులుగా గంపలోపడున్న పిల్లాడి బట్టలు, తనవి తెచ్చి యింత సర్పు వేసి బక్కెట్లో నానబెట్టింది. లోపలికి వెళ్ళి డబ్బాలోని బియ్యం చేటలో వేసి చెరిగి, అన్నం తపెళాలో పోసి, కడిగి ఎసరు పోసి మూత పెట్టింది. బడికి, ప్రైవేటకు అంటూ పిల్లాడు చదువుతో అలిసిపోతున్నాడు. వేడి వేడిగా ఏదైనా కూర చేసి పెట్టాలి. పొద్దునింత సద్దన్నం తిని వెళ్ళాడు. మధ్యాహ్నానికి బాక్స్ తీసుకెళ్ళలేదు. ఆలస్యమైపోయి దంటు అలానే వెళ్ళిపోయాడు. ఈ పుటన్నా వండి పెట్టాలి. చదువు ద్యాసలో పడి ఉరుకులు, పరుగులు పెడుతూ పిల్లోడు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నాడు. నేనైతే కలో, గంజో తాగి, కాళ్ళు ముడుచుకొని పడుకొని, తెల్లారి లేచి ఒండుకునేదాన్ననుకుంటూ కూరగాయల బట్టలో వెతికింది. నాలుగు టమాటా కాయలు, కొంచెం పచ్చి మిరపకాయలు కనిపించాయి. దడిలో పడి మొలిచిన వంకాయ మొక్కకు రెండు వంకాయలున్నట్లు గురొచ్చి, కంది బేడల్లో వేచి వండుదామని ఇంకొక తపేళ తీసుకొని, బేళ్ళ సంచి దగ్గరకెళ్ళి గిద్దతో గిద్దడేసి, సంచిని సీలకు తగిలించింది. బేళ్ళని కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళుపోసిన బోచ్చెలోనే పోసి, బేళ్ళలో నీళ్ళు పోసి మూత పెట్టింది. పిల్లాడొచ్చే సరికి వంట చేయాలి. మళ్ళీ ట్యూషన్ అంటూ పరిగెడతాడు అని బూడిద గిన్నె తీసుకెళ్ళి అంట్ల గాబు దగ్గర కూర్చొని దబ దబ గిన్నెలు తోమడం మొదలుపెట్టింది.

అంట్లు తోముతున్నా పిల్లాడి గురించిన ఆలోచనలే. పిల్లాడ్ని తలుచుకుంటే ఆమె కళ్ళు మిల మిలా మెరిశాయి. పిల్లాడు బుద్ధిమంతుడని, తెలివైన వాడని, బాగా చదువుతాడని, అల్లరిచిల్లరిగా తిరగదని బడిలో మాష్టర్లు, ట్యూషన్ మాష్టారు, చుట్టుపక్కనోళ్ళు చెప్పే మాటలు జ్ఞాపకం వచ్చి గండె పొంగింది. ముఖంలో చిరునవ్వు మొలిచింది. హాస్టల్లోనే ఉండి ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురు ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు అనిపించింది. పిల్ల కూడా తెలివైనదే. బాగా చదువుతుంది. ఇద్దరిని నా రెక్కల కష్టం మీద చదివించగలనా? యిందాక రాజమ్మత్త మాటలు గుర్తొచ్చి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. తనకు కాకపోయినా ఎదుగుతున్న పిల్లకైనా చెవులకీ, మెళ్ళోకీ, వస్తువులు చేయించాలి. వాళ్ళ నాన్న ఉంటే ముగ్గురికి ఈ కష్టం వచ్చేదా? అనుకుంటూ కళ్ళలో ఊరిన నీటిని భుజానికి తుడుచుకుంది. అంట్లు తోమడం పూర్తి కాగానే గబ గబా బట్టలుతికి ఆరేసింది. తోమిన గిన్నెలు తీసుకెళ్ళి గోడ పక్కన పెట్టింది.

పొయ్యి వెలిగించి కంది బేళ్ళ తప్పేళ్ళ దాని మీదేసి, టమాటాలు, పచ్చి మిరపకాయలు, ఉ ల్లిపాయ నీళ్ళ గిన్నెలో వేసింది. దడి దగ్గరకెళ్ళి వంకాయల్ని తెంపుకొచ్చి ఆ గిన్నెలోనే వేసి కడిగి, కత్తిపీట తీసుకొని దబ దబ కోసి వేరే మూకిట్లో వేసి, గిన్నె కడిగి, తోమిన గిన్నెల మీద బోర్లించింది. నీళ్ళ బేసిన్ తీసుకెళ్ళి కుడితి కుండలో పోసి, దాన్ని కూడా కడిగి బిందె మీద బోర్లించింది. చీపురు తీసుకొని ఇల్లూడ్చింది. పొయ్యి దగ్గరకొచ్చి ఉడుకుతున్న కంది బేళ్ళ మూత తీసి, కోసినవి అందులో వేసి మూత పెట్టి పొయ్యి ఎగదోసింది.

బేళ్ళ మీద పొంగులా విమేద్రికి ఆలోచనలు పొంగుకొచ్చాయి. రాజమ్మత్త మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. నిజంగానే ముద్దబంతి పువ్వులానే ఉండేది తాను. చేతులకేసి చూసుకుంది. ఎండకు కమిలి తాటి మట్టల్లా ఉన్నాయి.

అమ్మ, అయ్యా కూలినాలి చేసుకొని నలుగురు కూతుళ్ళని పద్ధతిగానే పెంచి ఉన్నంతలో మంచి వాళ్ళకే, పద్ధతిగా ఉన్న వారికే ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారు. అక్కాచెల్లెళ్ళు నలుగురం అమ్మనాన్నలతో పాటు కూలీనాలీ చేసి పనిపాట నేర్చుకున్నాం. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఈయన కష్టపడి పనిచేసేవాడు. కూటికి, గుడ్డకి లోటు లేకుండా ప్రేమగా, ఆప్యాయంగా ఒకళ్ళకోకళంగా బతకాం. అబ్బాయి, అమ్మాయి పుట్టగానే ఇక చాలని ఆపరేషన్ చేయించాడు.

పిల్లకి ఏడో నెల నడుస్తుండగా ట్రాక్టర్ తిరగబడి తనకి మొగుడు, పిల్లలకు తండ్రి లేకుండా పోయాడు. కంటికి మంటికి ఏకధాటిగా ఏడ్చింది. ‘గుండెదిటవు చెసుకో, పిల్లల్ని బతకించుకోవాలి, పనుల్లో బడితే కొంత మరుపు వస్తుందని అక్కాచెల్లెళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉండి ధైర్యం చెప్పేళ్ళారు. వాళ్ళ కున్నంతలో నన్ను ఆదుకున్నారు.

దిగులును దిగమింగుతూ మెల్లగా నలుగురితో కలిసి పనులకెళుతూ ఆయన పని, తన పని తానే చేస్తు, పిల్లలని బతికించడానికి పొలం పనుల కాడ్నించీ, బేలారి పని వరకు ఒక్కరోజు కూడా పాలు మాలకుండా ఏ పని దొరికితే ఆ పని కాళ్ళు, చేతులు అరిగిపోయేటట్లు చేస్తుంది.

ఆయనున్నప్పుడు పచ్చ పచ్చని చేనుగా ఉన్న జీవితం, యిప్పుడు కాళ్ళకింద నలిగిన తొక్కుడు గుడ్డి లాగుంది. కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ కట్టెలెగేసి, మంట పెద్దది చేసింది.

“యిమేద్రక్కా…. యిమేద్రక్కా… విజయ పరిగెత్తుకొచ్చి ఒక్క క్షణం నోటిలో మాట రాకుండా ఆందోళనతో రొప్పుతూ నిలబడిపోయింది.

“యిప్పుడేగా యింటికెళ్ళావు ఏమైందే” అంటూ చేతుల్ని పైటకి తుడుచుకుంటూ లేచి నిలబడింది విమేద్రి.

“అన్నని వైర్లతో చెరువు కట్ట మీది చెట్టుకి కట్టేశారు. నువు రా..ముందు” రొప్పును అణుచుకుంటూ విజయ…

విమేద్రికి నెత్తిన పిడుగు పడ్డట్లు రాయిలా అయిపోయింది. మెల్లగా గొంతు పెగల్చుకుంది. కాని మాట పైకి రాలేదు. మరోసారి సోయి తప్పుతున్నట్లయి తేరుకుంటూ గట్టిగా అడిగింది.” ఎందుకు కట్టేశారు?”

అప్పటికి కాస్త తేరుకున్న విజయ “మా ఊరు రావద్దు, ఆ యమ్మితో మాటాడొద్దు. లేకుంటే ఆ యమ్మిని పెళ్ళి చేసుకో” అంటున్నారు. పొయ్యి మీద కూర దించి పొయ్యి ఆర్సేయని, విజయతో చెప్పి పరిగెడుతున్నట్లు చెట్టు దగ్గరకు నడవడం మొదలుపెట్టింది విమేద్రి. అది నడకలా లేదు పరిగెడుతున్నట్లు వుంది. తల తిరుగుతున్నట్లుంది. తలలో ఆలోచనలు, ఆందోళన.

పనులకెళ్ళేటప్పుడు పక్క ఊరి ముసలయ్య కొడుకు రమణయ్యతో పరిచయం అయింది. అప్పటికి ఆయన చనిపోయి ఐదేళ్ళయింది. ఉప్పుకారం తింటున్న మనిసి కదా!. రమణయ్యతో అయిన పరిచయం పెరిగి దగ్గర సంబంధం ఏర్పడింది. ఇందులో తన తప్పు ఎంతో? అతడి తప్పు ఎంతో? తనకిప్పటికి అర్థంకాలేదు. విషయం మెల్ల మెల్లగా అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఇదేమిటీ?’ అని నిలదీసి అడిగింది ఎప్పుడూ లేదు. తమ సంబంధాన్ని తాము దాచి పెట్టింది కూడా ఎప్పుడూ లేదు. పిల్లల్ని బడుల్లో చేర్పించడం, హాస్టళ్ళల్లో చేర్పించడం అన్నింటిలోనూ అతడు తోడున్నాడు. పిల్లల్ని చుద్దానికి కూడా తామిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అలాంటిది కొత్తగా ఇప్పుడేమైంది. తాము దాచి పెట్టని విషయం. ఇప్పుడు కాని విషయం ఎందుకైంది. ఆందోళనను అణుచుకోవటానికన్నట్లుగా రెండు చేతులతో జుట్టుని గట్టిగా లాగి ముడి వేసుకుంది.

పదో తరగతిలోకి వచ్చాక హాస్టల్ లో చదవనని, ట్యూషన్లో చేరతానని చెప్పి యింటి నుండే బడికి, ట్యూషన్ కి వెళ్ళేస్తున్నాడు తనకొడుకు. అప్పట్నించీ గతంలోలా కాకుండా తాము కలవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రమణయ్యది కాస్తో కూస్తో కలిగిన కుటుంబమే. కొదో గొప్పో పొలం వుంది. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఒక్క అక్క, ఒక చెల్లి వున్నారు. తామిద్దరి కులాలు వేరు. అతడికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని తెలిసి మీ వాళ్ళు చూపినసంబంధాల్ని చేసుకో, మీ యింట్లో నువ్వొక్కడివే కొడుకువి. తల్లి దండ్రుల్ని చూసుకోవాలి. మన సంబంధం యిక ఆపేద్దాం. ఇప్పటికే మీ అమ్మా నాన్న, అక్క చెల్లుళ్ళూ నా వల్లే నువ్వు పెళ్ళి చేసుకోవడం లేదని తిడుతున్నారు. అని నచ్చజెపుతూ వస్తోంది.

ఇద్దరు ఎదిగిన పిల్లలున్న తల్లి తాను. అతడి కంటే పదేళ్ళు పెద్ద దాన్ని, తన చుట్టు అతను పెళ్ళి చేసుకోకుండా తిరగడం చూస్తే తనకు బాధనిపించేది. ఏడుపోచ్చేది. అందుకే ఈ మధ్య అతడ్ని కలవడం తగ్గించింది. పిల్లోడు, ఇంట్లో వుంటున్నాడన్న సాకుతో.

చెరువు కట్ట మీద చెట్టు ఊరికి కూడలి. ఊరు, పల్లె, చాకలి, వడ్డెర, కుమ్మర పాలేలు అన్నీ చెరువు చుట్టూనే ఉండటంతో ఎవరు ఎటువెళ్ళాలన్నా, ఆ చెట్టు దగ్గరికి రావాల్సిందే.

అతనెప్పుడు ఎకాఏకిన తనింటికి రాలేదు. కట్ట మీద చెట్టు దగ్గరకొచ్చి అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతువుండేవాడు. అతన్ని చూసి అటుపోతున్న వాళ్ళు, ఇటు పోతున్న వాళ్ళు తనకు అమ్మే! అన్నొచ్చాడు, అమ్మే మామొచ్చాడు, అమ్మే బావొచ్చాడు అని ఎవరొఒకరు చెప్పేవాళ్ళు.

తాను అతనికి కనబడేటట్లు రోడ్డు మీద కెళ్ళి నిలబడేది అతను చూసే వరకు. యిది అందరికి తెలిసిందే. అతడొచ్చినట్లు అందరూ చెప్పినోళ్ళే. ఎలాంటి దాపరికం లేదు. మరి ఇప్పుడెందుకు కట్టేసినట్లు? పిడికెళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. పరుగు వేగం అందుకుంది. యిప్పుడేం చేయాలి? యిప్పుడేం చేయాలి? వెనుక విజయ రొప్పుకుంటూ పరిగెత్తుకోస్తోంది.

పరిగెత్తుకుంటూనే కట్ట దగ్గరికి చేరింది విమేద్రి. ఊరంతా అక్కడే ఉన్నట్లున్నారు. పనుల నుంచి యిళ్ళకు వచ్చేవాళ్ళు, పనులు లేనివాళ్ళు, పనుల్ని మధ్యలో ఆపి మరీ వచ్చినవాళ్ళతో ఆ ప్రాంతం అంతా కిటకిటలాడుతోంది. అందరి మాటలతో గోలగోలగా ఉంది. ఆ గోల ముందుచెట్టు మీద వాలిన కాకుల, పక్షుల అరుపులు వెలవెలబోతన్నాయి. విమేద్రిని చూసే సరికి అక్కడొక్కసారిగా నిశ్శబ్దం చోటుచేసుకుంది. మాటలు గుసగుసల స్థాయికి చేరాయి. చెట్టు మీద కాకుల అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. జనాన్ని పక్కకు తోసుకుంటూ చెట్టు దగ్గరికి చేరింది విమేద్రి. వెనుకే వచ్చిన విజయ జనంలోనే నిలబడిపోయింది.

చెట్టుకు కట్టేసున్న అతడ్ని, అవమానంతో తలని వంచి దాచుకునేందుకు ప్రయత్నిస్తున్న రమణయ్యని చూడగానే, అప్పటి దాకా ఉగ్గబెట్టుకున్న ఏడుపు కట్టలు తెంచుకుంది విమేద్రిలో. కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్ళు, అలుగు పట్టక కట్ట తెగిన నీటిలా బుగ్గల మీద కారాయి. దుఃఖం స్థానే విపరీతమైన ఆవేశం తన్నుకొచ్చి ముందుకు కదిలి, చెట్టు దగ్గరికి చేరి “ఏ నా కొడుకు చేశాడీ పని? వాడి చేతులిరగ అంటూ గబగబా కట్లుప్పి, వైర్లు వరుచుకుపోయిన చోట చేతితో రుద్దింది. సిగ్గుతో ఎర్రబడి, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్న అతడి మొఖాన్ని, కళ్ళని తన పమిటి కొంగుతో తుడిచి, చప్టా రాయి మీద కూర్చోబెట్టి, ధైర్యాన్ని నింపుతున్నట్లు అతని తలపై చేతితో నిమిరింది. అప్పటి దాకా నిశ్శబ్ధంగా ఆ దృశ్యాన్ని చూస్తున్న జనాల్లో మళ్ళీ గుసగుసలు బయల్దేరాయి. గుసగుసలు కాస్తా మాటలుగా మారాయి. విమేద్రి ఒకడుగు ముందుకేసింది. తన ముఖంలో అప్పటి దాకా ఉన్న దు:ఖం స్థానంలో ఆవేశం తన్నుకొచ్చి గ్రీష్మ ఋతువులో పగటి సూర్యుడిలా మండిపోతూ..

“ఈ అబ్బి ఏం చేశాడని కట్టేశారు? యిందులో నా తప్పుకూడా వుంది కదా! నన్ను కూడా కట్టేయండి”? గర్జిస్తున్నట్లు అరిచింది విమేద్రి. ఎవరూ మాట్లాడలేదు.

“మేమే తప్పు చేస్తున్నామా? చాటుమాటుగా చేస్తున్నామా? అమ్మే అన్నొచ్చాడు, అమ్మే బావొచ్చాడు, అమ్మే మామోచ్చాడు అంటూ నిన్నటి దాకా మీరంతా కబుర్లు మోసికొచ్చినోళ్ళే కదా? ఆళ్ళదీ తప్పే కదా ఆళ్ళందర్నీ తీసుకొచ్చి కట్టేయండి? ఇన్నాళ్ళు యిదేమిటే అని మంచి, చెడ్డ చెప్పినోళ్ళు ఒక్కరూ లేరు కదా? ఆళ్ళదీ తప్పేకదా? ఆళ్ళందర్నీ తెచ్చి కట్టేయండి? ఈ ఊళ్ళో అందరూ ఏ తప్పుడు పనులు చేయని పత్తిత్తులా? మీరంతా శుద్ధి గొద్దెలా? నేను నోరిప్పితే చాలా సంసారాలు కూలతాయి”. కొండ మీద నుంచి వరద నీళ్ళు దూకుతున్నట్లు వస్తోన్న విమేద్రి మాటల్లో దు:ఖం పోయి, పూర్తిస్థాయి ఆగ్రహం చొచ్చుకొచ్చి పెదాలను, వంటిని కుదిపేస్తున్నాయి.

నిజంగానే విమేద్రి నోరు తెరిస్తే ఊళ్ళో సగం మంది పరువు గంగలో కలుస్తుందని భావించి “అది కాదే. పెళ్ళి చేసుకోండి. పిల్లాడు బాధపడుతున్నాడు” రామయ్య నెమ్మదిగా అన్నాడు.

రామయ్యా మామా! ఈ వయస్సులో, ఎదిగిన ఇద్దరి పిల్లల తల్లిని ఏ పెళ్ళి చేసుకోమంటారు? తలంబ్రాల పెళ్ళి చేసుకోనా? దండల పెళ్ళి చేసుకోనా? మీటింగ్ పెళ్ళి చేసుకోనా? మీరే చెప్పండి”, ఒక్క క్షణం ఊపిరి తీసుకొని

ఈ అబ్బి ఆళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. ఆళ్లకీ, తోబుట్టువులకు దూరం చేయనా? ఆళ్ళ అమ్మా, నాయనా నన్ను ఇంట్లోకి రానిస్తారా? రా అమ్మారా అంటూ తోరణాలు కట్టి పిలుస్తారా? నా పిల్లలను రానిస్తారా? పెళ్ళి చేసుకుంటే ఆయబ్బి అక్కా చెల్లెళ్ళ పరిస్థితి ఏమిటి? అమ్మ అయ్యల్ని దిక్కులేని వాళ్ళలా వదిలేయాలా? వాళ్ళని చూసే పూచీ మీరంతా తీసుకుంటారా?”

ఆగ్రహాన్ని అణుచుకుంటున్నట్లు గుండె మీద చేయేసుకొని ఓ క్షణం ఊపిరి తీసుకుంది విమేద్రి. అందరూ నిశ్శబ్ధంగా వింటున్నారు. చెట్టు మీద కాకుల రొద కూడా కాస్త తగ్గింది. సందె పొద్దు మెల్లగా వాలిపోతుంది.

“ఇక ఈ సంబంధం అంటారా? ఏదో తప్పో వప్పో జరిగిపోయింది. అయినా మనూళ్ళో లేనిది ఎవరికి? ఎంత మందికి ఈ సంబంధాలు లేవు? గుండెల మీద చేయ్యేసుకొని చెప్పండి? మీకు తెలియదా? నేను నోరు విప్పేదా? పెళ్ళాలున్నా మొగుళ్ళు, మొగుళ్ళున్న పెళ్ళాలు తిరగడం లేదా? విషయాలు తెలిసినా కుటుంబాలు పాడైపోతాయనో, పరుపుపోతుందనో, పిల్లల భవిష్యత్ కోసమనో సర్దుకుపోతూ, కొట్టుకుంటూ తిట్టుకుంటున్నోళ్ళు ఎందరు లేరు? నేనేమి చాటుమాటుగా తిరగడం లేదే? అలా అని తప్పుచేయడం లేదని అనడంలేదు.

ఒకవేళ ఈ అబ్బికి పెళ్ళయి వుంటే పెళ్ళాని వదిలేసి రమ్మనే వాళ్ళా? అప్పుడు ఆమె ఏంకావాలి? పెళ్ళి కాలేదు కాబట్టి పెళ్ళి చేసుకోమంటున్నారు. చేసుకున్నా అప్పుడు కూడా ఏదో ఒకటి అనరా మీరు? కాకుల్లా పొడుచుకుతినరా? ఇప్పుడు మేం చేస్తుంది తప్పే. పదేళ్ళ క్రితం నాకు గానీ, ఆ అబ్బికి గానీ ఇయన్నీ తెల్సా? అప్పుడే ఇది తప్పమ్మా అని ఒక్కరూ చెప్పలేదేం? పదేళ్ళ నాడే చెప్పి వుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? విమేద్రి గొంతులో ఆగ్రహంతో పాటు దు:ఖపు జీర. గుమ్మడికాయ దొంగల్లా ఎవరూ నోరు విప్పడం లేదు. నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లు ఉంది. అప్పటి దాకా బెక బెకమంటున్న చెరువులో కప్పలు కూడా ఒక్కసారిగా బెక బెక ఆపేశాయి. ఫుల్లుగా పట్టించి వచ్చిన తాగుబోతు వెంకట్రావు జనాన్ని చూచి

“ఓరేయ్ ఎవర్రా నన్నేది? ఎన్ని గుండెల్టా? ఒక్కొక్కడిని నరుకుతా, నేనే రాజుఠా నా కొడకల్లారా” అంటూ తొడ కొట్టుకుంటూ జనం మీదకి వెళ్ళాడు. అప్పటి దాకా మౌనంగా నిలబడ్డ వాళ్ళంతా పక్కున నవ్వారు.

ఎహే.. పోరా తాగుబోతాడా” అంటూ పెద్దాళ్ళు వెంకట్రావుని దూరంగా నెట్టేసి వచ్చారు. దాంతో అప్పటి దాకా మండిన నెగడు కొంత నెమ్మదించినట్లయింది.

“అమ్మా విమేద్రి! నీ కొడుకు బాగా చదువుకునే కుర్రాడు. తెలివైనవాడు. యిప్పుడిప్పుడే విషయాలన్నీ ఆడికే తెలుస్తున్నాయి. ఈ మధ్య కాస్త దిగులుగా, మౌనంగా ఉంటున్నాడేందని దగ్గరకు తీసుకొని గుచ్చి గుచ్చి అడిగితే తొటి పిల్లోడెవరో మీ ఇద్దరి సంగతి ఎత్తి అవమానించాడట. పిల్లోడు తనలో తానే కుమిలి పోతూ, చెప్పలేక చెప్పాడు” అని రమణయ్యని కట్టేసే పనికి నాయకత్వం వహించిన ట్యూషన్ చెప్పే మునిస్వామి మాష్టారు తాను చేసిన పనిని సమర్ధించుకున్నట్లు అన్నాడు.

‘పిల్లోడు’
‘పిల్లోడు’
మాన్పడిపోయింది విమేద్రి.

పిల్లాడు ప్రసక్తి వచ్చే సరికి ఆశ్చర్యపోయింది. మాట రాని మూగదైపోయింది. ఆవును ఈ మధ్య పిల్లోడు మౌనంగానే ఉంటున్నాడు. పదో తరగతి గదా చదువుతో ఆలసిపోతున్నాడేమోననుకొని, ఉన్నంతలో అన్నీ శ్రద్ధగా చేసి పెడుతోంది. కొడుకు గుర్తుకొచ్చే సరికి ఒక్కసారిగా పెళ్ళున ఏడ్చేసింది. సాయంకాలం వెలుతురు మెల్లగా తనలోనికి ముడుచుకుపోయింది. రావాల్సిన చంద్రుడు ఎక్కడో తూర్పు మబ్బుల్లో దాక్కున్నట్లున్నాడు.

ఏడుస్తూనే రమణయ్య వైపు చూసింది. ఈ లోకంలో ఉన్నట్లుగా లేడు. చుట్టు జరుగుతున్నందమేమిటో కూడా తెలుస్తున్నట్లుగా లేదు. అంతకు ముందు వెన్నెల కురిపించిన చంద్రుడు, నల్ల చీకటి మబ్బులోకి వెళ్ళి దాక్కున్నట్లుగా ఉన్నాడు.

తనకు తనకే తెలియంది ఏ నూకాలమ్మో, నూగులమ్మో పూనినట్టు ఎక్కడ నుంచి వచ్చిందో అంత ధైర్యం విమేద్రికి. మునిస్వామి మాష్టారు వైపు ఒకడుగు వేసి ‘మునియ్యన్నా.. నా చుట్టానివే కదా? పిల్లాడు బాధపడుతున్నట్టు నీకు తెల్సినప్పుడు నాకు కదా చెప్పాలి? యింత రచ్చచేయడం అవసరమా? అన్నీ తెలిసినోడివి నాకు ఒక్క మాట చెబితే నేనే పిల్లోడికి నచ్చజెప్పుకునేదాన్ని కదా? ఈ అబ్బికి చెప్పి సంబంధాన్ని మానుకునే దాన్ని. అయినా పిల్లోడి బాధగురించి యింత ఆలోచించి, యింత రచ్చ జేసినోడివి, పెళ్ళికి ముందు రెండు కడుపులు తీయించి, ఆ యింటోళ్ళ నేడిపించి, పెద్దలు మీటింగ్ పెట్టి, తన్నబోతే పెళ్ళి చేసుకున్నానని నీ సంగతే చెప్పకపోయావా? పిల్లాడు అర్ధం చేసుకునేవాడు కదా? విమేద్రి పూనకం వచ్చిన పోలేరులా విరుచుకుపడింది.

“పిల్లాడు బాధపడుతుంటే, అది నాకూ, పిల్లాడికి సంబంధించిన సంగతయినప్పుడు ఈ యబ్బిని ఈ మాదిరిగా ఎందుకు కట్టేయాలి? పిల్లాడు నా పిల్లోడు, ఈ యబ్బి పిల్లోడు కాదు కదా? పోనీ పిల్లోడు బాధపడుతున్నాడు, యిక ఈ ఊరు రావద్దని ఈ యబ్బికైనా నచ్చజెప్పారా? ఏ విషయం చెప్పకుండా ఏకా ఏకిన చెట్టుకు ఎందుకు కట్టేశారు?. మనూరు వచ్చాడనా? రాకపోతే ఏం చేసుండేవాళ్ళు. నన్ను కట్టేసి ఉండేవాళ్ళా? ఇది మనసులో పెట్టుకొని ఆ ఊర్లో మనూరోళ్ళని చెట్టుకు కట్టేయరా? యిలా పగలు పెంచుకొని, కొట్టుకుంటే నా కొడుకు బాధతగ్గిపోదా? మతుండే ఈ పనిచేశారా? విమేద్రిలో ఏడుపు, కోపం కలిసిగట్టుకొని నోటినుంచి ప్రవాహంలా ప్రశ్నలు దూకుతున్నాయి. గడిచి, మరచిపోయిన తన విషయాలను లేపితే పరువు పోతుందని మునిస్వామి మౌనంగా ఉండిపోయాడు.

“అది అట్టా ఆడదై ఉండి, భయం భక్తి లేకుండా తెగ మాట్లాడుతోంది. ఊరి పరువుపోతోంది. నాలుగు పీకి నోరు మూయించండిరా? అప్పుడే అక్కడికొచ్చి విమేద్రి మాటలు వింటున్న వసంతయ్య గద్దించాడు. వసంతయ్య పెద్ద మనిషిలా దొమ్మ విరుచుకు తిరుగుతుంటాడు. కాని ఎప్పుడూ నోరు కుదరదు.

“ఏందయ్యా, వసంతయ్యా! నాలుగు పీకాలా రా.. మగాడివైతే వచ్చి పీకు. అవున్లే నువ్వెంత తెగించినోడివో జనాలకు తెలియదా? మరదలిని చంపి ఊరబాయిలో వేసి, చెంబు, చెప్పులు బాయిగట్టున పెట్టి, వేకువజామున దొడ్డికి బోయి, బాయిలో దూకి చచ్చిందని జెప్పినోడివి. అయినా చచ్చినోళ్లు వస్తారంటే బతికున్నోళ్ళతో పగెందుకని, మన ఊళ్ళో అన్ని సంగతుల్లాగే పోలిసులొచ్చినా, అందరికి అన్నీ తెలిసినా సాచ్చమియ్య నోళ్ళు మనూరోళ్ళు, తగదునంటూ తన్నాడనికొచ్చాడు పెద్ద మనిషి” దులిపి అవతలేసింది.

విమేద్రి నోటి నుంచి మాటలు ఉరుములు, మెరుపుల్లా దూకుతుండటంతో అందరూ విమేద్రి చెప్పేది నిజమే కదా? ఇలా నిలదీసే వాళ్ళులేక చాలా మంది ఆటలు సాగుతున్నాయి. అనే ఆలోచనలు జనంలో మొదలయ్యాయి.

‘అది కాదమ్మా! మరీ ఊళ్ళోకి రావడం ఏంది? పడే తిప్పలేవో బయట ఎక్కడన్నా పడక” శీనయ్య ఓ కూత కూశాడు. విమేద్రి భర్తపోయిన కాడినుంచి వెంట పడి వేదించుకుతిన్నోడు శీనయ్యా, అతని మాటలో ఆ కసి కనిపించింది.

“అవునే శీనయ్యా.. అట్లా తిరుగుదామని ఏడాదిపాటు పోరినోడివి. మధ్యవర్తిని పంపినోడివి. డబ్బాశ చూపినోడివి. నీకు దక్కలేదన్న కసికొద్ది మాట్లాడకు గురిగింజలాగ. శీనయ్య మాట అయ్యి అవ్వకముందే తుపాకీ తూటాల్లా విమేద్రి నోటినుండి మాటలు దూసుకొచ్చాయి.

“ఈ చిత్తకార్తె కుక్క ఒంటరిగా ఉన్న ఎవ్వరినీ వదలడు, విమేద్రిని కదల్చలేదేందోననుకున్నా. అయితే ఓ రాయి వేసి చూశాడన్న మాట కసిగా అంది మాలక్ష్మీ.

“ఈ నా బట్టా వదిలేది? చెప్పేది సారంగనీతులు, దూరేది పందుల గుడిసెల్లో” ఖని కన్పించింది విజయ మాటల్లో….

“బంగారు తల్లి కాబట్టి ఆ సునీతమ్మ ఆడితో కాపురం జేస్తుంది. ఇంకోళ్ళయితే ఈర్నోదిలేసిపోయేది” అతడు తనకేసిన వల గుర్తొచ్చిన మాలతి మండిపడింది.

“వదిలేసి పోతే చదువుకునే ముగ్గురాడపిల్లల జీవితం నాశనమయిద్దని ఆ సునీతమ్మ ఈ కుక్కని భరిస్తుంది”. పెద్దరికంగా అంది రాజమ్మత్త. మాటాడేది వినకుండా ఈ ఆడోళ్ళ గోల ఎక్కువైపోయిందిరా! ఇక్కడ ఏం ముంచుకుపోయిందని పనిపాటా మానేసి ఊరంతా పరిగెత్తుకొచ్చారమ్మా? అని పెద్ద సుబ్బన్న ఒక గదుం గదిమే సరికి ఆయన మీద ఉన్న గౌరవం కొద్ది అందరు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.

“ఇంటికొస్తే తప్పు. ఊళ్ళోకి వస్తే తప్పు. అదే చెట్లమ్మట, గట్లమ్మట తిరిగితే ఒప్పయిపోతుందా? అవినీతి అంతా నీతైపోయిద్దా శీనయ్యా? నిలదీసింది విమేద్రి. విమేద్రి మాట్లాడుతున్నట్లు లేదు. చెరువు కట్టమీదున్న గంగమ్మే వచ్చి మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఒక్కక్కొరు తలలు వంచుకుంటున్నారు. మెల్లగా జారుకునే వాళ్ళు జారుకుంటున్నారు. ఆడోళ్ళు మాత్రం ఈ యమ్మీకి ఇన్ని మాటలెక్కడనుంచి వచ్చాయని ఆశ్చర్యంగాను, ఒక్కొక్కరిని కడిగిపడేస్తున్నందుకు సంతోషంగాను మట్టి బొమ్మల్లా నిలబడిపోయారు.

“చూడు మునియ్యన్నా చెరువుకు గట్టు, ఊరికి కట్టు ఉండాల్సిందే ఎక్కడైనా, అందరూ కలిసి ఆ కట్లు, గట్లు ఏంటో నిశ్చయం చేయండి, నేను అప్పుడు ఆకట్టుబాటు తప్పితే ఈ చెట్టుకు కట్టేయడం కాదు. నన్ను ఉరేయండి, కట్టుబడి వుంట, ఇప్పుడిది నా కుటుంబ విషయం అదేదో నేను తేల్చుకుంటాను”. అని యింకా రాయి మీద తలవొంచుకుని కూర్చున్న రమణయ్య వైపు తిరిగి….

“నువ్వేమి తప్పు చేశావని తలవంచుకున్నావయ్యా, తలెత్తుకొని మాట్లాడు. ఈ తప్పు నీ ఒక్కడిదే కాదు, నాకూ బాగముందిందులో, తలెత్తుకో, ఇక్కడున్న చాలా మంది తప్పులు చేస్తున్నోళ్ళే. రోటీలో తలపెట్టి రోకటి పోటుకి ఎరవటం ఎందుకు? నిన్ను ఇంటికి తీసుకెళ్తాను. ఆ కట్టేసిన పెద్ద మనషులెవరో ఇంటికొచ్చి కట్టేయండి అంటూ కొంగునడుముకు చుట్టుకొని రమణయ్య చెయ్యి పట్టుకొని లాగింది విమేద్రి. అక్కడున్న మగాళ్ళకు నోటి మాట రాలేదు. చెట్ల మీద చేరిన రకరకాల పక్షులు రొదచేయడం మొదలుపెట్టాయి. చెరువులో కప్పలు బెకబెకలాటడటం మొదలయ్యాయి.

“రావయ్యా, ఇంటికెళ్లాం. పిల్లాడితో మాట్లాడి, అర్ధం చేయిద్దాం. పిల్లోడు వద్దంటే అప్పుడు చూసుకుందాం” అని అతని చేయి పట్టుకొని ముందుకు కదిలింది. గుంపు దారిచ్చింది. గుంపుకు కొద్దిగా ఆవలిగా నిల్చోన్న పిల్లల్లో తన కొడుకు ఉండటం చూసి “రా అయ్యా? అని మరో చేత్తో పిల్లోడి చేయి పట్టుకొని తన ఇంటివైపు కదిలింది విమేద్రి. అప్పటి దాకా బొమ్మలా నిలబడ్డ ఆడోళ్ళందరూ విమేద్రితో పాటు కదిలారు. అప్పటి దాకా అక్కడ ముసురుకున్న చీకట్లని చెదరగొడుతూ పంచాయితీ వీధిదీపాలు వెలిగాయి. ఆ వెలుగులో ఎప్పుడూ చూడని కాంతి జిగేల్మంది!

(అనేక సలహాలు, సూచనలు ఇచ్చి, నాకున్న అనుమానాలను తీర్చి, ప్రోత్సహించిన డాక్టర్ భారతి గీతాంజలి అక్కకు కృతజ్ఞతలతో)

రాయటం కన్నా చదవటం ఇష్టం. రాయాలన్న తపన ఉంది. ఇంట్లో కాని, వీధిలో కాని తగిన ప్రోత్సాహం లేక రాసినవి కూడా దాసుకున్న.

వృత్తి, ప్రవృత్తి పిల్లల కు పాఠాలు చెప్పటం, వాళ్ళు చెప్పే కబుర్లు, జోక్స్, పాటలు ఎంజాయ్ చేయటం.
ప్రకాశం జిల్లా పౌరహక్కుల, ఉపాధ్యాయ, గుళ్ళకమ్మ రచయితల, చైతన్య మహిళ సంఘం జిల్లా బాధ్యురాలిగా కొంత కాలం.

రచనలు:- అరుణతార లో వాడగోడు (యదానిక), దేవరగద్దె, నెత్తుటి నీరెండకు చేయడ్డు పెట్టుకొని కథలు, అర్ధరాత్రి ప్రయాణికుడు, పృథ్వి అమ్మల కోసం వచ్చేయి కవితలు, శ్రీపాద, కన్నగి మొదలగు పుస్తకాల పరిచయం.
మాతృక లో, కలల్ని ఇంకిపోనియ్యకు కథ, వృత్తి కి సంబంధించిన కొన్ని స్కిట్లు, పాటలు.
మహిళా మార్గం లో ఓ గల్పిక, ఓ కవిత, ఓ కథ.
'ఆమె చూపు ఎర్రజెండా వైపే', వేటపాలెం వెంకాయమ్మ జీవితం పుస్తకం. రెడీగా ఉన్న మరో మూడు కథలు.

Leave a Reply