విముక్తి పోరాట కథలు

కొన్ని కథలు మనల్ని నిద్రపోనీయవు. వెంటాడతై. నిద్రలోనూ. మెలకువలోనూ. లోలోపల కల్లోలం రేపుతై. మనసంతా దిగులు నింపుతై. కన్నీళ్లు నింపుతై. జీవితాంతం గుర్తొస్తయి. అట్లాంటి కథకులు కొందరే ఉం{రు. తమ చుట్టూ ఉన్న జీవితాలను నిశితంగా పరిశీలించి రాస్తరు. లోలోపల దగ్దమవుతూ వెన్నెల కురిపించే వాక్యాలు రాస్తరు. తెలంగాణ నేలన ఉవ్వెత్తున ఎగసిన ప్రజాపోరాటాలను కథలుగా రాసిన అల్లం రాజయ్యదీ అదే దారి. ఆ దారి ప్రజా గర్జనై ఉరిమిన ఉత్తర తెలంగాణ భూపోరాటాల దారి. నాగేటి సాళ్లల్ల రగిలిన రైతుకూలీల జైత్రయాత్ర దారి. ఈ నేల విముక్తి కోసం నెత్తురు చిందిన వీరులు నడిచిన దారి.

అల్లం రాజయ్య మనకాలపు ఉజ్వల పోరాటాల సృజనకారుడు. కరీంనగర్ జిల్లా మంథని తాలూకా గాజులపల్లిలో పుట్టిన రచయిత. ఆదిలాబాద్ అడివంచు పల్లెల్లో బతికిన మనిషి. అమ్మా అయ్యంటే ప్రేమ. పుట్టిన ఊరంటే పావురం. పల్లెలంటే ఇష్టం. పల్లె జనం ఇష్టం. వాళ్ల మాటలు ఇష్టం. పాటలు ఇష్టం. వాళ్ల పోరాటం అంటే ప్రేమ. ఈ ప్రేమే అతన్ని సజనశీలిగా మార్చింది.

అది- నక్సల్బరీ సాయుధ పోరాట నిప్పురవ్వలు దేశమంతా అంటుకున్న కాలం. శ్రీకాకుళం కొండల్లో వసంత మేఘ గర్జనై ఉత్తర తెలంగాణ ఉరిమిన కాలం. దోపిడీ, పీడన, అణచివేతపై జనసంద్రమైన కాలం. అట్లాంటి కాలం అల్లం రాజయ్యను వెలిగించింది. ఆ పోరాటం ఆలోచింపజేసింది. అలజడి రేపింది. అతలాకుతలం చేసింది. లోలోపల ఎన్నెన్నో తుపాన్‌లు చెలరేగినై. గుండె రవరవలాడింది. నెత్తురు పోటెత్తింది. ఎక్కడా నిలవనీయలేదు. అందుకే కలాన్ని సాయుధం చేసిండు. అతని స్థలకాలాల్లో వెల్లువెత్తిన మహత్తర పోరాటాలను, ప్రజల వీరోచిత త్యాగాలను కథలల్లిండు. వీరగాథలను పోరాట సాహిత్యంగా మలిచిండు. రాజయ్య సమాజాన్ని చదివిండు. చరిత్ర నిర్మించే ప్రజలతో కలిసి నడిచిండు. వాళ్ల రెక్కల్లో పక్కల్లో మెసిలిండు. వాళ్ల భాష, పలుకుబడి, నుడికారం తీసుకున్నడు. తన స్థలకాలాల్లో చెలరేగిన కల్లోలాన్ని, ప్రజల పోరాటాన్ని, త్యాగాలను కథనం చేసిండు.

ఇవి- ‘తొలకరి’ వానల్లో ఏరువాకై సాగిన కథలు. ఈ నేల విముక్తి కోసం నెత్తురు చిందిన జనం కథలు. తెలంగాణ పల్లెలన్నీ పిడికిళ్లెత్తి నినదించిన జైత్రయాత్రల జాడలు. ఇవి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలో సాగిన పోరాట కథలు. విముక్తి కథలు. ఇవి అల్లం రాజయ్య కథలు. ఆ కథల వెనక కతలు. రాజయ్య ఈ కథల ద్వారా విప్లవోద్యమమే పీడిత ప్రజల విముక్తి మార్గమని దండోరేసిండు.

రాజయ్య కథలు చదువుతున్నపుడు వీటి వెనక కత ఏందో, ఒక తిరుగుబాటు కథగా ఎట్ల రూపొందిందిందో తెలుసుకోవాలనిపించింది. ఇది మాకే కాదు, అనేకమందికి అవసరం కూడా. అందుకే ‘కొలిమి’ వెబ్‌పత్రిక మొదలుపెట్టినపుడు (1 మే, 2019) రాజయ్యతో మాట్లాడినం. ఆయన కథల వెనక కత రాయమని అడిగినం. కొత్తగా కథలు రాస్తున్న మా తరానికి ఎట్లా దారి చూపుతయో చెప్పినం. ఈ కథల నేపథ్యం చదవడం వల్ల కొత్త ప్రశ్నలు ఉదయిస్తయి. కొత్త ఆలోచనలు వికసిస్తయి. కొత్త చర్చలకు తొవ్వ కన్పిస్తది.

ఇందులో పది కథలున్నయి. రచనా కాలం అక్టోబర్ 1979 నుంచి ఫిబ్రవరి 1983 దాక. ‘సృష్టికర్తలు’ నుంచీ ‘పశువులు’ కథ దాకా. ఆదిలాబాద్, కరీంనగర్ పోరాటాలను చిత్రించిన కథలివి. ఈ జైత్రయాత్రల వెనక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సల్బరీ, శ్రీకాకుళం, ఆదిలాబాద్, కరీంనగర్ భూపోరాటాల నేపథ్యం ఉన్నది. ఇవి సామాన్య జనాన్ని అసామాన్యులుగా మార్చిన పోరాటాలు. ఇవి తెలంగాణను నిప్పుల కొలిమిలా రాజేసిన పోరాటాలను చిత్రించిన కథలు. కళ్లముందు జరుగుతున్న ఆధిపత్య దోపిడీని, తిరగబడ్డ ప్రజల వీరత్వాన్ని చిత్రించిన కథలు. వీటిని రాసింది అల్లం రాజయ్యే ఐనా ఈ కథల్లో ‘ప్రతీ ఘట్టం, మాట, తిరుగుబాటు, రైతాంగం, రైతుకూలీలది. వాళ్లను నడిపించిన విప్లవోద్యమానిది. కార్యకర్తలది’. ఈ మాటను రాజన్న అనేక సందర్భాల్లో అనేక వేదికలపై ప్రకటించిండు.

ఇప్పుడు ఎందుకీ పుస్తకం?
ప్రస్తుతం తెలుగు నేలన పత్రికలూ, మీడియా సంస్థలూ భూస్వామ్య, పెట్టుబడి కట్టుకథలతో నిండినై. సరైన తొవ్వల్లోంచి యువతరాన్ని దారితప్పించే దృక్పథ రాహిత్య సాహిత్యాన్ని ప్రచురిస్తున్నరు. ప్రచారం చేస్తున్నరు. సాహిత్యానికీ, సమాజానికీ ఎలాంటి సంబంధం ఉండాల్సిన అవసరం లేదనే వాదన జోరందుకున్నది. కాలక్షేప సాహిత్యం, ఊహాలోకాల్లో విహరింపజేస్తూ వాస్తవికత నుంచి తరిమేసే భావవాద సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నరు. దీనికి అన్ని మీడియా సంస్థలూ వత్తాసు పలుకుతున్నయి. వాళ్ల వ్యూహం, యువతరాన్ని దృక్పథ రాహిత్యంగా మార్చడం. టెక్నాలజీ లోయల్లో కాటగలపడం. మనుషుల్లో గుండె తడిని రూపుమాపడం. మానవీయతను చెరిపేయడం. సున్నితమైన భావోద్వేగాలు లేకుండా చేయడం. మొత్తంగా మెదడు ఆలోచించని యాంత్రిక తరం ఒకటి వచ్చే పెనుప్రమాదం పొంచివున్నది. దేశ యువతరమంతా టెక్నాలజీ మాయలోపడి కొట్టుకుపోతున్నది. సామ్రాజ్యవాద కార్పొరేట్ పెట్టుబడి దేశానికి నిప్పంటించింది. ఆదివాసీలపై మారణకాండ కొనసాగిస్తూ అడవుల్ని రక్తసిక్తం చేస్తున్నది. సహజవనరుల్ని కొల్లగొడుతున్నది. ఒకే దేశం, ఒకే మతం అంటూ యువతరం మెదళ్లలో ఫాసిజం నింపుతున్నది. ఐనా స్పందించాల్సిన నెత్తురు మండే యువతరం నిస్తేజంగా ఉంటున్నది. అందుకే ఇట్లాంటి కథలున్నయని తెలుసుకోవడం వల్ల యువతరంలో కొంతయినా మార్పు వస్తుందని ‘కొలిమి’ భావించింది. ఈ ఆలోచనలోంచి వచ్చిందే ఈ పుస్తకం. రండి. తొలకరి వానల్లోకి.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. అధ్యాపకుడు. 'కొలిమి' వెబ్ మేగజీన్ సంపాదకవర్గ సభ్యుడు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార (సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ), 2. ఏరువాక (సాహిత్య విమర్శ); 3. ములాఖాత్ (విప్లవ రచయితలతో ఇంటర్వ్యూలు), సంపాదకత్వం : ఎరుక (ఆదిమ అర్ధసంచార తెగ ఎరుకల కథలు), తొలకరి (అల్లం రాజయ్య కథల వెనుక కథ), మట్టి మనుషులు (వడ్డెరల జీవన గాథలు), ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

Leave a Reply