వినుకొండ కవులు- 3

గద్దల జోసఫ్ వ్రాసిన మరొక కావ్యం వసంతకుమారి. ఇది 1946లో వచ్చింది. దుర్భాక రాజశేఖర శతావధాని ముందుమాట వ్రాసాడు. ఈ ముందుమాటను బట్టి జోసఫ్ చంద్రహాసము, కన్నీటి కబురు కాక అప్పటికి భక్తవిజయము భారవి, హైదరాబాద్ సుల్తాన్ అనే మరోమూడు కావ్యాలను వ్రాసినట్లు తెలుస్తున్నది. రాయలసీమ కళా పరిషత్తు వారు 1945 డిసెంబర్ లో ఆయనను సన్మానించి కవిశేఖర బిరుదును ఇచ్చినట్లు కూడా ఈ ముందుమాట వల్ల తెలుస్తున్నది. ఇది కాక సుకవిరాజ, కవి మార్తాండ మొదలైన బిరుదులు కవికి ఉన్నట్లు లోపలి కవరు పేజీ సాక్ష్యం ఇస్తుంది. వసంతకుమారి కావ్యాన్ని కవి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుకు అంకితం ఇచ్చాడు. అంకిత పద్యాలు పదమూడు. తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులు శౌర్యాన్నివర్ణిస్తూనే ‘ఘోరత మిశ్రపుంజముల గూలి యుగంబుల బండిగాను’ సమస్యలను ఎదుర్కొంటూ ‘కన్నీరు వెలార్చు పంచముల నిక్కంపుటంటుతనంపు నీచ దుర్భర పరంపరల్’ పోగొడతాడని అతని పట్ల తాను పెట్టుకొన్న నమ్మకాన్నిప్రకటించాడు.

వసంతకుమారి నాలుగు ఆశ్వాసాల కావ్యం. జాంబ వంశంలో పుట్టిన శంభుడు అనే అతని కథ ఇది. అతనికి బ్రహ్మ వ్రాసిన నుదుటి వ్రాత దరిద్రం. లెక్కలేనన్నికష్టాల పరంపరలో జీవనమే అయినా రవంత చింతించక అంతశ్శక్తులను విప్పార్చుకుని గురువుల దృష్టిని ఆకర్షించి బాగా చదువుకున్నాడు. సాటిమనుషుల కష్టాలకు కన్నీరు కార్చటం, వారిపట్ల దయగా ప్రవర్తించటం అతని నైజం. యవ్వనుడైనాడు. జ్ఞానశక్తులు వికసించాయి. హృదయంలో శాంతి సత్యదేవత ఆవాసం ఏర్పరచుకొన్నది. కూలీ చేసి భార్యా బిడ్డలను పోషించుకొంటూ ఉన్నాడే గానీ తన జాతి జనుల సౌఖ్యం గురించి ఆలోచన అతనిని వదలలేదు.

నెలవుల్ జిక్కక కూటికై క్షుభితులై నీచాతినీచంపు లో
యల గన్నీ రువెలార్చు పంచముల బాలై యున్న అస్పృశ్యతా
నలమార్పించి స్వతంత్రులై బ్రతుక నండల్ లేని తద్దేశ దుః
ఖలతౌఘంబుల ద్రుంచి ప్రాపు గఱపంగా బూనే ధీరాత్ముడై
అవమానకరమైన అంటూదోషాన్ని తనమీదపెట్టి, వెలి పెట్టి తనదుఃఖానికి కారణమైనవాళ్ళే సమభాగమిచ్చి తమను కాపాడవలసిన వాళ్ళు అని అతని నమ్మకం. అగ్రజన్ముల త్యాగబుద్ధి, హరిజనాభ్యుదయము పరస్పర సంబంధమున్న అంశాలని అతనిభావన. దేశ సంపదలను, సంస్కృతిని అభివృద్ధిచేయటంలో ఆదిమాంధ్రుల పాత్ర గురించిన సంపూర్ణ చైతన్యంతో “చేరడు నెత్తురున్సగము చేసి ముదంబున నన్నుఁ గన్నయీ / భారతమాతకేల బహుభంగుల నాపయి గోపతాపముల్” అని ఆవేదన చెందాడు దళిత ప్రతినిధిగా. ఏ వేదాంతం, ఏమతం అస్పృశ్యతా జాడ్యానికి మందు చెప్పలేకపోయాయి అని బాధపడ్డాడు. అటువంటి సమయంలో భారతభూమిలో గాంధీ రాజర్షి అయి పుట్టాడని సంబరపడ్డాడు. గాంధీ ప్రాభవాన్నివర్ణించి, వర్ణించి అతని పట్ల విశ్వాసాన్ని ప్రకటించాడు.

“నాకుల రక్షణార్ధపు ( బ్రాణాళికలే వగనెత్తి అంటు క్రొం
జీకటి బాపి మేడ ( బువుసెజ్జల కూర్కెడు నగ్రజాతులన్
మేకొని మేలుకొల్పి యొక మేల్మి యుగంబును బాదుకొల్పిన
యీ కడగండ్లదాస్యము జయింప శ్రమించిన పూజ్యుడాతఁడె“ అని అభిప్రాయపడ్డాడు. పంచముల పాట్లు కన్నారా చూసి అంటు దోషం పోగొట్టటానికి నడుము కట్టినవాడని శంభుడు గాంధీకి నమస్కరించాడు. అంత్యజుల బాధలు తీర్చి సౌఖ్యం పెంచటం ముఖ్యమని భావించి తన జీవితాన్నిఅందుకు వెచ్చించాలన్ననిర్ణయానికి వచ్చాడు. ఉన్నవూరును, కట్టుకున్నభార్యను, కన్నబిడ్డలను వదిలిపోలేక కొంత గుంజాటన పడి చివరకు సారహీనమైన సంసార తుచ్చ సుఖములకన్నా కులాభ్యుదయోన్నతి కోరి ప్రాణాలు త్యజించటమే మిన్న అన్న నిర్ణయానికి వచ్చి పిల్లలను జాగ్రత్తగా పెంచమని అంపకాలు పెడుతూ ఉత్తరం వ్రాసి భార్యకొంగుకు కట్టి ఆ రాత్రి ఇల్లు విడిచి ఏటో వెళ్ళిపోయాడు శంభుడు.

రెండవ ఆశ్వాసం శంభుడి భార్య భర్తను వెతుక్కొంటూ పిల్లల తో వూరు వదిలి చేసిన ప్రయాణపు కథ. అడవిమార్గాన పోతుండగా పెద్ద గాలివాన.. పెద్దకూతురు వసంతకుమారి తమ్ముడు కొండ డు ఒక దారి అయితే తల్లి చిన్నపిల్లలు వేరొకదారి అయినారు. విపరీతమైన దాహంతో అక్కాతమ్ముళ్లు ఒకదగ్గర ఆగారు. అక్క నీళ్లుతేవటానికిపోయి ఒక అందమైన కొనలో చిత్ర శిల్పకళావిన్యాసాలకు అబ్బురపడుతూ ముందుకు వెళ్లి ఒకమౌనిని చూసింది. ఆమె విషయం తెలుసుకొని అతను “ అతిదయవంతమై యేడ్చునట్టి నీదుకులముకొరకు ప్రతిక్రియ” చేయవలసిందని ప్రబోధించి పంపాడు. ఆమెవచ్చేసరికి తమ్ముడు అక్కడ లేడు. ఒంటరిగా ఆమె జీవితం ప్రారంభం అయింది.

కొడుకును, కూతురిని కోల్పోయి చిన్నపిల్లలతో బిచ్చమెత్తుకొంటూ తిరుగుతున్న శంభుడి భార్య నిమ్మికి ఒక రైతు ఆశ్రయమిచ్చి పశువులు కాసుకువచ్చే పని అప్పచెప్పాడు.అతని భార్య గయ్యాళి అయి ఎంతవేధిస్తున్నా ఆమె తనపని తాను చేసుకుపోతూఉన్నది. ఒకనాడు పశువులు కాస్తూ ఉండగా వచ్చిన వానకు ఏర్లు పొంగి పిల్లలు, పశువులు కూడా కొట్టుకుపోయి మూడురోజులకు ఇల్లు చేరిన ఆమె రైతుభార్య ముందు నేరస్థురాలిగా నిలబడింది.


వసంతకుమారి దేశమంతటా పంచముల సంస్కరణలను ప్రబోధిస్తూ తిరుగుతుంటే కొందరు ఆమెమీద నేరారోపణలు చేశారు. పశువులను ఏటిపాలుచేసిన నేరం మీద తల్లి, సంఘంలో నూత్నభావాలు ప్రచారంచేస్తున్ననేరం మీద కూతురు న్యాయస్థానానికి తీసుకురాబడ్డారు. అక్కడ న్యాయాధిపతి తప్పిపోయిన తమ్ముడు కొండడే. తల్లిని, అక్కను అతను గుర్తించటం, అతను తనపదవిని వదిలేసి తల్లితో అక్కతో కలిసి కులసేవకు బయలుదేరటంతో ఈకావ్యం ముగుస్తుంది.

ఈ కావ్యంపేరు వసంతకుమారి.శంభుడు నిమ్మి కన్న కూతురు. శంభుడు స్వజాతిఉద్ధరణ కార్యక్రమంలో పాలు పంచుకొనాలని ఇల్లు వదిలి పోతూ వ్రాసిన ఉత్తరంలో వసంతకుమారి గురించి ప్రత్యేకంగా చెప్పాడు.

“చదువుల నారితేరి వికసన్నవశక్తి బయల్పడంగ (గా
నెదుగుచు నిబ్బరంబు గురియించు వసంతకుమారి కూఁతు నీ
యదుపున బెంచుచున్ మన కులాభ్యుదయోన్నతికై శ్రమింపగా
సదమల వీరవాక్కుల రసంబుల నుగ్గులు నూరి పోయుమా” చదువులలో ఆరితేరిన వసంతకుమారి కన్నీటి కబురులోని దుగ్గికి పరిణత రూపంగా కనిపిస్తుంది. అక్కడ దుగ్గి ఇక్కడ వసంతకుమారి ఇద్దరూ తల్లిదండ్రులకు తొలిసారి కూతుళ్లు. అక్కడాఇక్కడా కూడా తండ్రులు వాళ్లకు చదువులు చెప్పించారు. అక్కడ దుగ్గికి తండ్రి స్వజాతి అగచాట్ల గురించి చెప్పాడు. ఇక్కడ వసంతకుమారి కులాభ్యుదయోన్నతికి కృషిచేయాలని తండ్రి ఆకాంక్షించాడు.ఆ ఆకాంక్షను ఆమెఆచరణ కార్యక్రమంగా చేసుకొనటం కూడా చిత్రించాడు.


1
ఈకావ్యంలో తండ్రి ఆకాంక్షకు బలమైన వ్యక్తీకరణ కోనలలో కనబడిన మౌని వాక్కు. “తీవ్ర పరితాప దైన్య గీతికల రవము/ లెక్కడెక్కడ వినెదవో యక్కజముగ /అక్కడకునెల్ల జని నిర్భయతను జాటి /యాప్తులను బ్రోవవమ్మ ముందంజ వైచి” అన్నది ఆయన ప్రబోధం. జన్మనిచ్చి, పోషించి, జ్ఞానమిచ్చిన కులానికి ఆ కులంలో విశేషదుఃఖం అనుభవిస్తున్నఆర్తులకు సేవ చేయకపోతే, రక్షణ ఇయ్యలేకపోతే జన్మ వ్యర్ధమన్న భావం ఆయన వెలిబుచ్చాడు.

ఆయన బోధను ఆమె ఆచరణగా ఎలా పరివర్తింపచేసుకొన్నది? సభలుచేయించి మాట్లాడేది. ఏమిమాట్లాడేది? తన జాతి లోని లోపాలను విప్పిచెప్పి సవరించుకోమని చెప్పేది. తమ ఈదుఃస్థితికి కారణాలను విడమరచి చెప్పేది. పూర్వం నాలుగు జాతులు ఉండగా స్వార్ధపూరితులైన పండితులు చేరి పంచమకులాన్నిసృష్టించి అదిహీనజాతి అని భాష్యాలు వ్రాసారని విమర్శించింది. ఆవుల రంగులు ఎన్నైనా అవి ఇచ్చే పాలు అన్నీ తెలుపే కదా! అనిచెప్పి ఈ సహజ సత్యాన్నిమాటుపరిచి పంచములకు అంటు దోషం అంటగట్టి ఊరివెలుపలికి నెట్టిన కుటిల నీతిని నిరసించింది.జ్ఞానం, వివేకం, ఐక్యత అనే విలువలను ఇచ్చేవిద్యను నేర్వాలని, నీచ వృత్తులను, సారాయి, గంజి మొద్దలైన దురలవాట్లను మానాలని హితవు చెప్పింది. పరతంత్రపు వృత్తులు మాని స్వతంత్ర జీవనానికి సిద్ధంకావాలని పిలుపు ఇచ్చింది. శుచి శుభ్రతల గురించి హెచ్చరించింది.మన విషాద ప్రమాద గాధను సమగ్రంగా, నిష్పక్షపాతంగా వ్రాయగలిగిన కవి ఒక్కడు కూడా లేడే అని వాపోవటం ద్వారా దళితజీవితం సమగ్ర కావ్య వస్తువు కావాలని సూచించినట్లయింది. అప్పటివరకు వచ్చిన కావ్యాల పట్ల జోసఫ్ కవిలో వున్న అసంతృప్తి ఏదో అది కన్నీటికబురులో వలె ఇందులోనూ ప్రతిఫలించింది. వాగ్రూపక వ్రణముల గురించి, ఊరందరికీ ఉపయోగంలో ఉండే ఒక బావిలో తమకు భాగం లేకపోవటం గురించి కూడా ఆమెమాట్లాడింది. దోసిలొగ్గి పెట్టె దండాలతో బానిస చాకిరీకానీ, అంటరాని దోషంకానీ తొలగనప్పుడు సమరమే శరణ్యం అని ఉద్బోధించింది.

కన్నీటి కబురు లో రాయడు, వసంతకుమారిలో శంభుడు ఒక్కడేనా అనిపించేంత పోలికలు ఉన్నాయి ఆ రెండు పాత్రల ప్రవృత్తులలో. రాయడైనా , శంభుడైనా స్వజాతి దైన్యానికి, అంటరాని తనానికి బాధపడినవాళ్ళే. ఆదిమాంధ్రులమన్న ధిషణాహంకారం చూపినవాళ్ళే.స్వజాతికి బానిసత్వం నుండి విముక్తిని, స్వతంత్ర జీవన ఏర్పాటును అభిలషించినవారే. అభిలాషను ఆచరణవాస్తవం చేయటానికి కార్యాచరణకు దిగినవాళ్ళే. రాయడు తనపల్లెలో,చుట్టుపక్కల పల్లెలలో పంచములను కూడగట్టి తిరుగుబాటుకు ప్రేరేపిస్తే శంభుడు దానిని గాంధీ హరిజనోద్యమంతో, సత్యాగ్రహఉద్యమంతో అనుసంధించి సాగించటానికి జాతీయ స్థాయి కార్యక్షేత్రాన్నిఎంచుకొన్నవాడు. ఈ ఇద్దరి మూలాలు స్వయంగా కవి జోసఫ్ లోనే ఉన్నాయి.


గద్దల జోసఫ్ కవి వినుకొండవాడు కదా! మా అమ్మ అమ్మమ్మ గారి వూరు వినుకొండ. మా నాన్న హైస్కూల్ చదువు అక్కడే. జోసఫ్ కవి గురించి వాళ్లకు తెలిసి ఉండే వీలుంది. అయితే చెప్పటానికి వాళ్లిద్దరూ లేరిప్పుడు. మామేనమామలను అడగాలి. జోసఫ్ కవి వ్రాసిన చంద్రహాసము గద్యకావ్యానికి అభిప్రాయాలు వ్రాసినవాళ్లలో నాగులవరానికి చెందిన వెల్లంకి వెంకట సుబ్బయ్య శాస్త్రి ఉన్నాడు.మామేనమామలు వెల్లంకి వాళ్లే. నాగులవరంతో వాళ్లకు బాగా సంబంధాలు ఉన్నాయి. మారెండవ మేనమామ వెంకట నర్సయ్య గారికి ఫోను చేసి జోసఫ్ గురించి, నాగులవరం వెల్లంకి వాళ్ళ గురించి అడిగాను. అడగగానే ఆయన బాల్యజ్ఞాపకాలలోకి వెళ్లి జోసఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

వినుకొండతాలూకా గోకనకొండ జోసఫ్ పుట్టి పెరిగిన వూరు. నాగులవరానికి రెండు మూడుకిలోమీటర్ల దూరం. గోకనకొండను ఆనుకొని గుండ్లకమ్మ నది ప్రవహిస్తుంటుంది. పువ్వాడ దాని ఒడ్డునే ఉండే మరొక చిన్నవూరు. దాన్ని ఇదివరకు పువ్వులవాడ అనేవాళ్ళు. గోకనకొండలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. జోసఫ్ గోకనకొండ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతూ మాలమాదిగ పల్లెలలో అంటరానితనానికి వ్యతిరేకంగా బోధలు చేస్తుండేవాడు. బ్రాహ్మలు భోజనాలు చేస్తుంటే చూడటం మాలమాదిగలకు నిషిద్ధం. కాగా దానిని ధిక్కరిస్తూ ఇతను హఠాత్తుగా బ్రాహ్మలు భోజనంచేస్తున్న చోటికి వచ్చి నిలుచునేవాడు. బ్రాహ్మలు కోపంతో కర్రలతో వెంటతరిమే వాళ్ళు. అలాంటి పనులు చేయటం, వూళ్ళో సంచలనంకలిగించటం జోసఫ్ అలవాటు అని ఆయన చెప్పుకొచ్చాడు. నాగులవరంలో వెల్లంకి వాళ్ళవి రెండు కుటుంబాలు. ఒక కుటుంబంతో జోసఫ్ ఎప్పుడూ ఇలాంటి గొడవలు పడుతుంటాడు. రెండవ కుటుంబం చంద్రహాసము పుస్తకానికి అభిప్రాయం వ్రాసిన వెల్లంకి వెంకటసుబ్బయ్య శాస్త్రితో జోసఫ్ కు స్నేహం ఉండేది. వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చొని సాహిత్య చర్చలు చేస్తుండేవాడట. దీనిని బట్టి అగ్రవర్ణుల అధికారానికి, అహంకారానికి, పంచముల న్యూనతకు పరిహారం కోరి, సామాజిక అన్యాయాలపై గళమెత్తి మాట్లాడుతూ, జనసమీకరణకు, చైతన్య ప్రసారానికి ప్రయత్నిస్తూ తనదైన పద్ధతిలో ఒక ప్రతిఘటన ఉద్యమం నడిపాడన్నమాట. దీనినే కావ్యవస్తువుగా చేసుకున్నాడని కన్నీటికబురు, వసంతకుమారి కావ్యాలు చూస్తే అర్ధమవుతుంది. ఇవి ఆత్మచారిత్రాత్మక కావ్యాలు అనటానికి కన్నీటి కబురు లోని మొదటి పద్యం ఒకసాక్ష్యం. ఈ పద్యంలో అహోబల కవికుల శ్రేష్ఠుని ప్రస్తావనతో అహోబల నరసింహస్వామి అంశతో గోకనకొండలో వెలసిన నరసింహస్వామిని చెప్పటం, గుండికా స్రవంతి అనే పేరుతో వ్యవహరించబడే గుండ్లకమ్మను పేర్కొని దానిఒడ్డున ఉన్న పువ్వుల వాడను- ఇప్పటి పువ్వాడను కావ్య కథాస్థలంగా స్థాపించటం గమనించదగినది. తానుపుట్టిపెరిగి అంటరానితనానికి వ్యతిరేకంగా గొంతెత్తిన కాలాన్ని, ప్రాంతాన్ని, స్వీయ అనుభవాన్ని కావ్యవస్తువుగా మలుచుకొనటంలో జోసఫ్ ప్రత్యేకత ఉంది.

అంతే కాదు, రెండు కావ్యాలలోనూ స్త్రీల ఆదర్శంగా, ఆచరణగా పంచమోద్యమం కొనసాగింపును చిత్రించటంలో కూడా జోసఫ్ విలక్షణత కనబడుతుంది. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అన్న భావనను దళిత మహిళల చైతన్య కార్యాచరణలతో సమగ్రం చేయాలని అనుకొని ఉంటాడా?

2

గద్దల జోసఫ్ వ్రాసిన మరి రెండు కావ్యాలు కట్టమంచి, ప్రతిజ్ఞాభేరి. కట్టమంచి రామలింగారెడ్డి జీవితం కేంద్రంగా వ్రాయబడిన కావ్యం కట్టమంచి. ఆధునిక కాలంలో జీవితచరిత్ర రచన ఒక వచన ప్రక్రియగా అభివృద్ధి చెందింది.కానీ జోసఫ్ జీవితచరిత్రను పద్యకావ్యంగా వ్రాయటం విశేషం. ఈ కావ్యం ముఖచిత్రం పై ఇది 1963 లోప్రచురించబడినట్లుగా ఉంది. కానీ విశ్వనాథ వ్రాసిన పీఠిక కింద 6- 12- 1947 అని తేదీ ఉంది. కనుక దీని మొదటి ముద్రణ 1947 లోనే వచ్చినట్లు.1960 నాటిది మలిముద్రణ కావచ్చు. రాజశేఖర శతావధాని ఇంగ్లీషు లో వ్రాసిన ముందుమాటలో ‘కవి చక్రవర్తి అన్న కావ్యప్రస్తావన వుంది. హైదరాబాద్ పాలకుడైన నవాబ్ మీరు ఉస్మాన్ ఆలీఖాన్ బహదూర్ వారి చరిత్ర అని ఇచ్చిన వివరణ బట్టి వసంతకుమారి కావ్యపీఠికలో ఆయనే ప్రస్తావించిన హైదరాబాద్ సుల్తాన్ అనే కావ్యం ఇదే అయిఉంటుంది అనుకోవచ్చు. రాజపోషకులు రాజశ్రీ ఏకా ఆంజనేయులు పంతులును ప్రశంసించే పద్యాలు పది ఉన్నాయి. రామకృష్ణ ప్రభువు కు కావ్యం అంకితం చేసాడు. దేశవిదేశాలలో కట్టమంచికి సన్నిహితులైన వాళ్ళతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపి సమాచారం సేకరించి సాధికారంగా వ్రాసిన ఈ పుస్తకంలో పూర్వభాగం, ఉత్తరభాగం ఉన్నాయి. పూర్వభాగంలో వంశవర్ణన, జననం, బాల్యం, విద్యాభ్యాసం మొదలైనవి ఉన్నాయి. విదేశాలకు విద్యకోసం వెళుతున్నకొడుకుకు తల్లి బుద్దులు చెప్తున్నట్లుగా పంచమజాతుల కష్టాలు, కన్నీళ్లు తెలిసి ప్రవర్తించాలన్నసందేశం ఇప్పించనే ఇప్పించాడు జోసఫ్.

“పంచములు పరులంచునుభ్రాంతి వలద;
నీవు దిరుగాడు భువిని జన్మించి నీదు
బాసమాటాడి, నీ దేశవాసులగుచు
నిన్ను వెంటాడి ప్రేమించు నిసువులయ్య “ – అని ఆ తల్లి ప్రబోధం. ఉత్తరభాగంలో కట్టమంచి సాహిత్య వ్యాసంగాన్ని, పొందినపదవులను, గౌరవాలను వర్ణించాడు కవి. ‘మాలమాదిగలతోడ అంటుతానమెన్నని’ కట్టమంచి వ్యక్తిత్వాన్నిసూచించాడు. కట్టమంచి షష్టిపూర్తి ఉత్సవ వర్ణన ఈ ఉత్తర భాగంలో చివరిఘట్టం. అంటే అది 1940.ఆ తరువాత పదకొండు సంవత్సరాలకు 1951 లో ఆయన మరణించాడు. అందువల్లనే 1960 ముద్రణలో ఆవేదన అనే శీర్షికతో దుఃఖగీతులుగా పదిహేను పద్యాలు వ్రాసి చేర్చాడు జోసఫ్ కవి.

ఇక రెండవ కావ్యం ప్రతిజ్ఞాభేరీ 1963 నాటిది.1962 లో హిమాలయ పర్వత సరిహద్దుల గురించి భారతదేశానికి, చైనాకు జరిగిన యుద్ధ సందర్భం నుండి వ్రాయబడిన కావ్యం ఇది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కు అంకితం ఇస్తూ అతని గుణగణ కీర్తనగా వ్రాసిన పద్యాలు రాధాకృష్ణన్ ప్రతిభాపాటవాలకు అద్దం పడతాయి. పతాకము,ప్రతిజ్ఞాభేరి, దేశభక్తి, దురాక్రమణ, ప్రబోధము, హాలికా అనే శీర్షికల కింద విభక్తమైన ఈ కావ్యానికి విశ్వనాధ అభిప్రాయం అనే శీర్షికతో వ్రాసిన పీఠిక కూడా వున్నది.

జోసఫ్ వ్రాసిన మరొక కావ్యం భారతీయుడు 1956 నాటిది. అంబేడ్కర్ మార్గంలో దళితులు రాజ్యాధికారం కోసం చేయవలసిన పోరాటం గురించి సూచించింది.( డాక్టర్.పిల్లి శాంసన్, దళిత సాహిత్య చరిత్ర, 2000)

మొత్తం మీద గద్దల జోసఫ్ పద్య నిర్మాణం, భాషా ప్రయోగ దక్షత, ఎంత సంప్రదాయ మైనవో, స్వజాతి విముక్తి కోసం ఆయన తపన అంత ఆధునికమైంది. వినుకొండ కవులలో జాషువా తరువాత చెప్పు కోవలసినవాడు.

3

వినుకొండ కవిత్రయంలో మూడవవాడు బీర్నీడి మోషే. జాషువాకు సమకాలికుడు. సంగీత జ్ఞానం కల ఆయన హరికథలు చెప్పేవాడు. వాటికి అవసరమైన కథలు హిందూ క్రైస్తవ మత విషయాలకు, చరిత్రకు సంబంధించినవి తానే వ్రాసుకొనేవాడు (డాక్టర్. పిల్లి శాంసన్, దళితసాహిత్యచరిత్ర ) ఆంధ్ర విశారద ఆయనబిరుదు. కానీ ఆయన రచనలు ఏవీ ఆయన జీవించి ఉండగా అచ్చుకాలేదు. కొడుకులు ప్రసన్న, విజయదత్తు ఆ తరువాత తండ్రిగారి రచనలు రెండు ప్రచురించారు. ఒకటి ‘శ్రీకృష్ణదేవరాయలు’ అది ప్రబంధరాజము. అచ్చునకు సిద్ధంగా ఉన్నదని బీర్నీడి ప్రసన్నగారి పృద్వీగీతము కవర్ పేజీ వెనుక ప్రకటించబడింది. ఆ కావ్యం 1967 జనవరిలో వచ్చింది కనుక శ్రీకృష్ణదేవరాయలు ప్రబంధం కూడా 1967లో వచ్చి ఉంటుంది. హరిజనాభ్యు దయము 1969లో ప్రచురించబడింది. నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడింది అని ముందు మాటలో రాఘవయ్య చెప్పినదానిని బట్టి అది 1929 నాటి రచన అనుకోవచ్చు.దళితులు మూల వాసులు అని నిర్ధారించటం, సవర్ణులతో సమానంగా దళితులను చూడలేని సృష్టికర్త బ్రహ్మ పాక్షిక దృష్టిని నిరసించడం, దేవాలయ ప్రవేశానికి నిరాకరించబడే దళితుల దురవస్థను చిత్రించటం, దళితవిముక్తికి గాంధీని హామీగా చూపించటం ఈ కావ్యంలోని ప్రత్యేకతలు.

జాషువా, జోసఫ్, మోషే వినుకొండ తొలితరం కవులు. తరువాతి తరపు వినుకొండ దళితకవుల గురించి ఇంకొకసారి.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply