( 2 )
దళితుల వృత్తులేమిటి? చెప్పులు కుట్టటం, శ్మశానాలకు కాపలా ఉండటం, చచ్చిన వాళ్ళ జాబితా తయారుచేయటం. చెప్పులు కుట్టటం అదొక గొప్ప కళగా ఎట్లా చేస్తారో ఒక సీసపద్యంలో చెప్పాడు.
“ పండు వెన్నెల నిగ్గు పసదనంబును మించు/ తెలిపారు తగరంపు తీగ నదికి
జిలుగు(జెంగావి రంగుల పసకెనయైన/ నజరైన వింత బనాతు(బొదిగి
నునుపు నిగ్గులు దేఱ పచ్చి బంగారు మించు/ గమకంపు క్రొత్త బేగడను దాపి
జాతిరత్నాలకు సాటియౌ వెల (జెప్పఁ / గులికించు మించు పచ్చల గూర్చి “
అంటూ నాలుగు దశలలో జరిగే నిర్మాణం గురించి చెప్పి కిఱ్ఱు చెప్పులు కుట్టటంలో తన సాటి పనివాడు లేడని గర్వించే దళితుడిని చూపిస్తాడు. శ్మశానాలలో తిరుగుతూ, బొచ్చెలో తింటూ జీవిస్తూ ముక్కంటి అయిన శివుడితో తమకు పోలిక చూసుకొనే దళితుల భావుకత గురించి చెప్తాడు. లోకంచేత హీనంగా చెప్పబడే, చూడబడే వృత్తులు ఎంత వొళ్ళువిరుచుకొనిచేస్తున్నా దళితులకు దక్కేది చివరకు కళ్లంలో కామందు దయాధర్మ భిక్షగా కొలిచే అడుగూబొడుగూ తాలు గింజలే అన్నవ్యథార్థ జీవన వాస్తవాన్ని “…… కడాపటికి కళ్ళమథోగతి మట్టిగింజలే / వానికి మేర( బెట్టుటకు స్వామికి జిక్కెడు మేలుపంట ….” అన్న పద్య పాదాలలో వాచ్యంగానే చెప్పాడు కవి. ఒక వైపు శ్రమ దోపిడీ మరొక వైపు కోపగించటం, అవమానపరచటం చేసే యాజమాన్యవర్గానికి వంగివంగి నమస్కారాలు, క్షమాపణలు చెప్పటమే దళితుల జీవిత ధర్మంగా చేయబడిన సంప్రదాయాన్ని, ఎన్ని కష్టాలు బెట్టినా లెక్కపెట్టక కాపులకు కష్టం కలిగితే తమకే ఆ కష్టం వచ్చినట్లు కంటనీరు పెట్టుకొనే దళితుల మానవీయతను ఒకే నాణానికి రెండు ముఖాలుగా చూపిస్తాడు జోసఫ్. ఈ విధమైన అవగాహన కలుగుతున్న రాయడు ఈ పరిస్థితిని మార్చే కార్య రంగంలోకి దిగాడు.
ఇది ఈ కావ్యం లో ప్రధానమైన మలుపు. బీదల దేహాలు అనే కర్రలతో భవనాలు నిర్మించుకొని, పాపపుణ్య చింతలేని భారత సోదరులు ‘ స్వజన సౌఖ్య శ్రేయమున్’ కొరక పోవటాన్ని నిరసించాడు. ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు’ వంటి జాషువా పద్యాలను గుర్తుకు తెచ్చే పద్యాలు ఇందులో కనిపిస్తాయి. చెమ్మట వెలార్చి సిరి (బ్రోగు(జేసి పెట్టి / పంటల వలంతికి బహుళ ప్రతిభ (దెచ్చి / ఆకట( దపించు నా గతి నరయకున్న/ భారతఖండానికే గతి పట్టగలదో” వంటి పద్యాలు ఆ కోవాలోవే. ఈ దేశంలో పశుపక్ష్యాదులకైనా ఉన్న భద్రత దళితులకు లేకపోవటం గురించి చింతించి భారతదేశపు గతి ఏమవుతుందా అని ఆందోళన పడ్డాడు రాయడు. పరిష్కారం చూపక తప్పదని కార్యాచరణకు దిగాడు. అతని కార్యక్రమం ఏమిటి?
ఆది మాంధ్రులను సమీకరించి సమావేశ పరిచి స్వజాతి కష్టాల గురించి వాళ్లకు వివరించి చెప్పి ప్రతిఘటించి నిలిచేట్లు ప్రేరణ ఇచ్చాడు. భీతిదాయకమైన సేవా వృత్తివల్ల సంపాదించి పాయసం తాగటం కంటే స్వతంత్ర జీవన వృత్తులతో గంజి తాగటం మేలని ఆత్మగౌరవచేతన ను ప్రబోధించాడు. ఫలితంగా రైతుల ఇళ్లకు వెళ్లరాదని, వాళ్ళ ఇళ్లల్లో పనులు చేయరాదని దళితులు సమ్మె కట్టారు.
“ రాయని శాసనంబులకు ఱాళ్లు చలించె, పురంబునంతటన్
రాయిడి సంభవించెను, నరాజక దేవత పొంగి యగ్ర జా
తీయుల కార్య దుర్గముల దివ్వియకంబపు బాకులెత్తి కో
పాయతచిత్తతన్ గ సరివ్యాపన( జేసెను దుండగంబులన్”… అనే పద్యం ఆ సమ్మె
తీవ్రతను తెలియచేస్తుంది. దీని పరిణామం రాయడు వూళ్ళో ఉండకుండా చేయాలని కాపులందరూ కలిసి పన్నాగం పన్నటం. రాయడి జీవనాధారాలను , ఆస్తిని పరాధీనం చేయబడటం, రాయడి కుటుంబం తిండికి అలమటించే పరిస్థితి తేవటం, చివరికి అతను వూరు వదిలి వలసపోవటం.
అడవి దారిగుండా సాగిన ఆ కుటుంబపు ఆకలి యాత్రా కథనంతో ఈ కావ్యంలో ద్వితీయాశ్వాసం మొదలవుతుంది. ఆకలితో, దాహంతో దూరాలు నడవలేని పిల్లల యాతన, ఎత్తుకుందామంటే కడుపులోకి ఆహరం లేక నీరసించిన తల్లిదండ్రుల నిస్సహాయత, బిడ్డల మొహం చూసి కడుపు తరుక్కుపోతున్నవాళ్ళ వేదన వర్ణించబడిన పద్యాలు చదువుతుంటే మనం కళ్ళతో చూసిన వలస కార్మికుల సుదీర్ఘ యాతనా యానాలే కళ్ళముందు దృశ్యాలుగా కదలాడతాయి. జీవిక కోసం సాగే బడుగుల యాత్రలు కాలం ఏదైనా ఒకటిగానే ఉంటాయన్న మాట.
ఆ ప్రయాణంలో కూడా వర్ణ వివక్ష వెంటాడిన తీరు వర్ణించబడిన పద్యం ఒకటి ప్రత్యేకం పరిశీలించవలసినది.
“ వన్య సత్వంబులెవ్వేని వాని దరికి (
జేరకుండె, మునులయిండ్ల( జెప్పరాని
వారినంట దోషంబను పలుకులెపుడు
నాలకించిన కతన( గాఁ బోలు నిజము”
అడవి జంతువులు వాళ్ళ దరికి రాకపోవటానికి తరతరాలుగా మునులు చెప్పుకొంటున్న అంటరాని తనాన్ని గురించిన ముచ్చట్లు వింటూ ఉండటం కారణంగా ఊహించటం లో అంటరానితనం అనే భావన, దానిగురించిన ప్రచారం సమాజాన్నేకాదు, ప్రకృతి పర్యావరణాలను కూడా పాడు చేసే హీన సంస్కృతి పరివ్యాప్తి పట్ల హేళన కనబడుతుంది.
ఈ ప్రయాణం మార్గంలోనే భార్య చనిపోతుంది. పిల్లలతో రాయడు నగరానికి చేరాడు. అక్కడ అతనికి ఎదురైన మీదేవూరు? మీరెవరు? అన్న ప్రశ్నలు అతనిని వేధిస్తాయి. సమాధానాలు విని ‘మోములు తెల్లబోవ’ పక్కకు తొలగిపోయిన అ’నాగరికత’ను ప్రస్తావించటం ద్వారా మనలను ఆలోచించమంటాడు. మానవేతర మగు సంస్కృతి అంటరానితనం అని కవి స్పష్టంగానే చెప్పాడు. ఆ నగరంలో తలదాచుకునే చోటులేక పెద్ద వర్షంలో ఒక గోడవార నిలబడి అది నాని కూలిపోగా రాయడు, పెద్ద కూతురు దుగ్గి తప్ప చిన్న పిల్లలందరూ చనిపోయారు. వాళ్ళను బొందల కాష్టానికి అప్పచెప్పటంతో ద్వితీయాశ్వాసం ముగుస్తుంది.బొందలగడ్డలో రాయడి మనస్సులో ‘చెమ్మగిల్లిన కొన్ని భావాల వ్యక్తీకరణగా ఉన్న పన్నెండు పద్యాలు 1937 నాటి జాషువా శ్మశానవాటి పద్యాలను గుర్తుకు తెస్తాయి. “ ఇచ్చోటనే గదా యే మానవుండైన స్థిర సౌఖ్యములతోడ (జిందులాడు / ఇచ్చోటనే గదా యే విభేదము లేక సమధర్మ దేవత సంచరించు” అంటూ సాగే సీస పద్యం “ఇచ్చోటనేసత్కవీంద్రుని కమ్మనికలము, నిప్పులలోన గఱ(గి పోయే” అని మొదలయ్యే జాషువా పద్యపు నమూనాలోనే నడిచింది. ‘ ఇచ్చోటనే గదా యే యంటు దోషంబు దీండ్రింప లేమికి దిగులు సేందు’ అనే పాదం చటుక్కున ‘ఇట నస్పృశ్యత సంచరించుటకు( దావే లేదు’ అన్న జాషువా పద్య పద్య పాద భాగాలను గుర్తుకు తెస్తాయి.
తృతీయాశ్వాసం తండ్రీకూతుళ్ళ ప్రయాణం. కట్టెలు కొడుతూ గొడ్డలి పడి కాలికి గాయమైన రాయడు తనకిక మరణం అనివార్యమని గ్రహించి కూతురికి చివరిమాటలుచెప్పటంగా ఈ ఆశ్వాసం సాగుతుంది. కూతురు ఒంటరిదై జీవితం గడపవలసిన ముందురోజుల గురించి దుఃఖపడుతూ చెప్పిన ఆ మాటలను బట్టే ఈ కావ్యం ‘కన్నీటి కబురు’ అయింది. నా కొరకు సంతాపం చెందకు, మనకే ఇటువంటివి వచ్చేనని వేదన పడకు అని హెచ్చరిస్తూనే “ మన హీనపు జాతుల నెందఱిట్టు లే / తావులులేక చింతిలి వితకును జెందుచు నుండిరెల్లెడన్” అంటూ తన కూతురి గురించిన దిగులును జాతి గురించిన దిగులుగా వ్యక్తం చేసాడు రాయడు. అది ఉద్యమ నాయకుడి లక్షణం. భారతదేశ చారిత్రిక ఔన్నత్యాన్ని,రాజుల ఘనకీర్తిని, సామ్రాజ్యాల వైభవాన్ని, నదీ వనరుల విస్తారాన్ని అభిమానంతో వర్ణించి కుల వ్యవస్థ గురించి మాట్లాడాడు. “నాల్గు జాతులని కదా వ్రాసారు? “ మఱి నీచ జాతిగా గాసిలుచున్న యైదవ తెగన్ సమకూర్చిన పెద్దలెవ్వరో” అని మరణం అంచున నిలబడి కూడా ప్రశ్నలు సంధించే పదును ను ప్రదర్శించగలగటం విశేషం. “…. నిజానికీ మనుజ వర్గంబందు రెండేగదా కనగా జాతుల్ పోతు పెంటియని” ఆడామగా అన్న సహజ భేదం తప్ప మనుషుల మధ్య మారె భేదమైనా అసహజం, అన్యాయం అన్న స్పృహతో లెక్కలేనన్ని జాతులు ఎవరి సంకల్ప ఫలితం అని ప్రశ్నిస్తాడు.
వృత్తిభేదాలతో క్రమంగా కులాలు ఏర్పడ్డాయి కానీ అవి ఆది నుండీ లేవని అన్నాడు. గొప్ప గొప్ప వృత్తులను దొమ్మీ జేసి ఆధిక్యతను కల్పించుకొని నీచపు వృత్తులు కొందరికి కేటాయించి వారిని నీచజాతులని చెప్పటంలోని ధర్మ మర్మం తెలుసుకోవలసిందే అన్న సూచన కూతురికి ఇచ్చాడు. తక్కిన జాతులన్నీ ఒకదగ్గర నివసిస్తూ మాలమాదిగలను చీకటి గోతిలోకి తోసివేసినట్లు అంటు దోషం పేరు మీద వూరిబయళ్ళకు తరిమివేసిన చరిత్ర హీనత గురించి బాధపడ్డాడు. మా గతి ఏమిటి అని దళితులు వేసే ప్రశ్నకు గత జన్మంతార కర్మయోగం కారణమని వక్కాణించే కుటిల నీతి గురించి, పనులను బట్టి నీచ గౌరవాలు అనే హక్కులు కలగటం, నీచవృత్తులను వదిలేసినా వంశాన్ని బట్టి అవి కొనసాగుతూనే ఉండటంలోని వైరుధ్యాన్ని గురించి తన ఆలోచనలు కూతురితో పంచుకున్నాడు. భూములు లేకపోవటం, ఉన్నా పండకపోవటం, సంపద అన్నదే లేకపోవటం దళితులకే ఎందుకు ప్రాప్తించింది అని కూడా తర్కిస్తాడు కవి రాయడి ముఖంగా. ఏడుకోట్లవరకూ ఉన్న మాల మాదిగ జనంలో అదృష్టరేఖ కలిగినవాడు ఒక్కడు కూడా భూమండలంలో లేకపోవటాన్ని ప్రస్తావించటం ద్వారా అణచివేయబడ్డ కులాలే ఆర్ధికంగా లేనివాళ్లు కావటంలోని పరస్పర సంబంధాన్ని గురించి ఆలోచించమని సూచించాడు కవి.
“మన హస్తకమలమందణ( గి యున్నది తెలుంగుల జాతకము వ్రాయు గోనబు కలము
మన నెత్తుటూట యందినికి యున్నది రాజులకు జయంబిచ్చు వాలముల సమితి
మన ధర్మబుద్ధిలో( దనరి యున్నది వదాన్యుల సాహసోద్రేక యోగ పటిమ
మన త్యాగ మహిమయం దణిగి యున్నది దేశభక్తులు వెలిబుచ్చు పరమ శాంతి
మన ప్రశస్త వితత ఘర్మకణంబులందు
ప్రతిఫలించెడి దోశ్శక్తి భాసురంబు
భావి భాగ్యోదయంబునై భరతభూమి
సిరుల సెకూర్చి మిన్నయై చెలగుచుండె “
ఈ పద్యం జోసఫ్ కవి దృక్పథం ఏమిటో స్పష్టం చేస్తుంది.తెలుగువాళ్ల జాతకం తమచేతులో ఉందని దళితుల ప్రతినిధిగా ప్రకటించ గలిగాడు అంటే వాళ్ళ శ్రమ లేక సంపద, శౌర్యం లేక రాజ్యం లేవన్న సంపూర్ణమైన చారిత్రక అవగాహన వల్లనే. అన్నిటికీసృష్టికర్తలై, సృష్టించిన సమస్తానికి పరాయి వాళ్ళయి నిలబడటంలో ధర్మబుద్ధిని, త్యాగ గుణాన్ని పైకెత్తి చూపటం వాటిని కొనసాగించమని చెప్పటానికి కాదు. సవర్ణ సమాజం పునాదులు ఎక్కడున్నాయో చూసుకోమని చెప్పటం. పునాదిలో కదలిక, తిరుగుబాటు వస్తే అది అని కూలిపోతుందని హెచ్చరించటం. అలాంటి తిరుగుబాట్లు శాంతికి భంగకరమని హింసతో, కుటిలనీతితో అణచివేసే ప్రయత్నాలు రకరకాలరూపాలలో కొనసాగుతున్నచరిత్రకు కారణాన్నిసూచించాడు కవి ఈపద్యంలో.
తానుచెప్తున్నది వింటూ కన్నీరుపెట్టుకొంటున్నకూతురితో రాయడు బ్రిటిష్ వాళ్ళపాలనలోకూడా దళిత జాతి ఉద్ధరణకు ఎవరూపూనుకోలేదంటూ విద్యలుచెప్పించారా కొల్వులిచ్చారా ? ఇకరాజకీయాల సంగతి చెప్పేదేముంది అని విచారం వ్యక్తంచేస్తూ సంభాషణ కొన సాగించాడు. ‘మనల రక్షించిముదమార మానపునట్టిదాతలెవ్వరు’ లేరా అని బేలగా కూతురువేసిన ప్రశ్నకుసమాధానంగా గాంధీని, ఆయన మార్గాన నడుస్తున్నకాశీనాధుని నాగేశ్వరరావును పేర్కొని కూతురిని వినుకొండకు వెళ్ళమని చెప్పాడు. అక్కడ బీర్నీడి మోషే, కంచర్ల హనుమంతు, గౌరా వఝల రామకృష్ణకవిని దర్శించి అక్కడి నుండి గద్వాలకువెళ్లి మహారాణిని చూడమన్నాడు. హంపీని చూసి దుర్భాక రాజశేఖర శతావధానిని, నెల్లూరులో తిక్కవరపురామిరెడ్డిని, సుబ్రహ్మణ్య రంగ కవులను, గుఱ్ఱము సుబ్బరాట్కవిని, సర్వేపల్లి రాధాకృష్ణను, కృష్ణధర పాలుని, తూములూరి శివరామయ్యను, మార్కండేయ గురువును, భట్టిప్రోలు సూర్యప్రకాశ ప్రభువును, విశ్వనాథ సత్య నారాయణను, తెలికిచర్ల ప్రకాశమును, అయ్యంకి వెంకటరమణయ్యను, గూడూరి రామచంద్రరావు ను, తాపీ ధర్మారావును, బందా సూర్యనారాయణను, పిఠాపురం సూర్యరాయ భూపాలుడిని, దేవులపల్లి కృష్ణశాస్త్రిని, విక్రమదేవ వర్మను, కురుగంటి సీతారామయ్యను, క్రొత్తపల్లి వేంకట రామలక్ష్మి నారాయణ శర్మను, కొండపల్లి గోపాలుని, నెల్లుట్ల రామకృష్ణకవిని, తాళ్లూరి ఉమామహేశుని, ఆయన అన్నగారైన రామకృష్ణ భూవిభుని, హరిరామలింగ శాస్త్రిని, కోటగిరి వేంకట కృష్ణ భూవిభుని, కట్టమంచి రామలింగారెడ్డిని, తల్లావఝల శివశంకరశాస్త్రిని, సూరిభగవంతుణ్ణి, కొప్పరపుకవులను, బుచ్చిరామ కవీంద్రుని, పొణకా గోవిందరెడ్డిని, దాసరి మోజేను, నూతక్కి రామశేషయ్య, రాయప్రోలు సుబ్బారావు, ఊటుకూరి జోసెఫ్ ను చూసి మాట్లడి వెళ్ళమన్నాడు.
వీళ్ళందరూ ఎవరు? కవులు, కవిపోషకులు, దళితజాతి అభ్యుదయాన్నికాంక్షించి తోడ్పడుతున్నవాళ్ళు. వాళ్ళను పేర్కొంటూ వాళ్ళ కవిత్వసంపదను, దాన దయా గుణ సంపదను ప్రస్తావిస్తూ వాళ్ళు నివసిస్తున్నఊళ్లను సంస్థానాలను, అక్కడి సంస్కృతీ చిహ్నాలను ప్రశంసిస్తూ కూతురి ప్రయాణమార్గాన్ని నిర్దేశించి రాయడు చేసిన ఈసంభాషణ, ‘కన్నీటి కబురు’ అచ్చం జాషువా గబ్బిలంతో చేసిన సంభాషణ రీతిలోనే సాగింది. జాషువా ప్రభావం అంతటిది అనుకోవాలి. ఇంతగా జాషువా కావ్యనిర్మాణ పద్ధతులను అనుసరించిన జోసెఫ్ రాయడు ముఖంగా అంతమంది కవుల గురించి చెప్పించాడు కానీ వాళ్లలో జాషువా లేకపోవటం ఎందువల్ల? కావ్య రంగంలో స్పర్ధ కారణమా? దృక్పథ వైరుధ్యం కారణమా?
రాయడు కూతురికి వీళ్లందరినీ కలవమని ఎందుకు చెప్పాడు? తన మరణం తథ్యం అని తెలుస్తున్నప్పుడు ఒంటరి ఆడపిల్ల గా కూతురి భవిష్యత్ జీవితం గురించిన చింతన ఆయనది. ఉదారులు, దాతలు, హరిజనోద్ధరణ కార్యక్రమ మగ్నులు అయిన పెద్దలెవరైనా బిడ్డకు ఆశ్రయం ఇయ్యక పోతారా అన్న ఆశ కారణంకావచ్చు. కూతురికి కొంత చదువు చెప్పించాడు కనుక కవిత్వశక్తి కొంత పెంచుకోగలిగే అవకాశాలను చూపించటం కోసం కావచ్చు. వినుకొండ నుండి తెలంగాణా మీదుగా రాయలసీమ, నెల్లూరు, విజయనగర సీమలను దాటుకొంటూ ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని చేతిలో చిల్లిగవ్వ లేని ఒంటరి ఆడపిల్ల చెయ్యగలిగిందేనా? ఆమేరకు ఇది వాస్తవ దూరమే.
తండ్రి చెప్పిన ఈసలహాలన్నీవిని మరింత దుఃఖపడిన దుగ్గి “ మనజాతి మఱి యెట్లుదుగదముడిగి / వన్నెవాసిని గడియించి పదుగురివలె/ బ్రదుకుదురు..” అనితండ్రిని అడిగింది. “ గాంధి వలె( బోరులాడెడుఘనులనేకు
లుద్భవించి దేశముల మహోగ్రులగుచు(
బోరి స్వాతంత్య్ర భాగ్యంబు ముదము( గూర్చు
వఱకు మనజాతి యాగచాట్లు బాయవమ్మ” అని చెప్తూనే రాయడు ప్రాణాలు
వదలటంతో ఈ కావ్యం ముగుస్తుంది.
( ఇంకా ఉంది)