గుఱ్ఱం జాషువాకు సమకాలికులు, జాషువా మార్గంలో కవిత్వం వ్రాసిన గద్దల జోసఫ్, బీర్నీడి మోషే ఇద్దరూ వినుకొండ వాళ్లే కావటం విశేషం.
గద్దల జోసఫ్ 1908 ( 1910 అని పెనుగొండ లక్ష్మీనారాయణ, గుంటూరు సీమ సాహిత్య చరిత్ర 2020, పు; 248) లో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకాలోని గోకనకొండ గ్రామంలో జన్మించాడు. తల్లి సంతోషం, తండ్రి జాన్. సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. రాజకీయాలలోకి ప్రవేశించాడు. కవితా కృషికి గాను కవిశేఖర, కవి మార్తాండ , కవిరాజు బిరుదులు అందుకొన్న గద్దల జోసఫ్ 1970 లోమరణించాడు.( డా. పిల్లిశాంసన్, దళితసాహిత్య చరిత్ర పు; 99)
జోసఫ్ కు పేరుతెచ్చి పెట్టిన కావ్యం ‘కన్నీటి కబురు’ 1943 లో ప్రచురించబడింది. అప్పటికి పదేళ్ల ముందే ఆయన ‘చంద్రహాసము’ అనే గద్యకావ్య రచనతో సాహిత్య రంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటికి జోసఫ్ పాతికేళ్ల వాడు. ఒకనాడు తాను కంభంపాటి రంగారావు పంతులు, తాటిపర్తి యల్లమంద, గాలి చిన పిచ్చయ్య కూర్చుని మాట్లాడుకొంటున్నసందర్భంలో చంద్రహాస చరిత్ర ప్రస్తావన వచ్చిందని అది ప్రశంసనీయమైనదని, దానిని గద్యరూపంలో వ్రాయమని మిత్రులు తనను ప్రేరేపించారని భాషా విహీనతచే బాధపడే తనకు అంతటి గ్రంథాన్ని వ్రాసే సామర్ధ్యం ఎక్కడిదని సంకోచించానని చెప్పుకొన్నాడు. అయినప్పటికీ “రాయప్రోలు చిదంబరము శాస్త్రి గారి యనుగ్రహంబున ఆర్జించిన అల్ప భాషాజ్ఞానంబున శబ్దశాస్త్ర సిద్దాంతములు గాని భాషా పరిచయము గాని యెఱుంగకయ యిద్దానిని వ్రాయ సమకట్టితి” అని ఉపోద్ఘాతంలో పేర్కొన్నాడు.
ఇందులో రెండంశాలు ఉన్నాయి. ఒకటి గ్రంథరచనకు పూనుకొనేముందు తన భాషా సాహిత్య జ్ఞానాలగురించిన న్యూనతా ప్రకటన ఒకటి. సాధారణంగా మొల్ల మొదలైన కవయిత్రులలో కనబడే ఈ సంకోచం పురుషుడిలో కనబడటం. స్త్రీలవలనే ఉపాంతీకరించబడిన వర్ణాలకు చెందినవాళ్లు కావటం వల్లనే అయి ఉంటుంది. రెండవది జోసఫ్ కు సాహిత్య గురువు రాయప్రోలు చిదంబరము శాస్త్రి అని తెలియటం. వత్సా అని వాత్సల్యంతో సంబోధిస్తూ చంద్రహాసము రచనపై ఆయన వ్రాసిన అభిప్రాయం ‘పండితా భిప్రాయములు’ అన్నశీర్షిక కింద మొదటే ఉంది. రాయప్రోలు చిదంబరము శాస్త్రి బాపట్లలో మాండలిక సంఘోన్నత పాఠశాలలో సహోధ్యాపకుడు. ఈయనతో పాటు దీవి రంగాచార్యులు, (గుంటూరు విద్వాన్ గ.సోమన్న పంతులు, (పిఠాపురం), వెల్లంకి వెంకట సుబ్బయ్య శాస్త్రి( నాగులవరం), పమిడి శేషశాస్త్రి, ( వినుకొండ) బు.రామచంద్రరావు(గుంటూరు), డి. సత్యనారాయణమూర్తి (ఒంగోలు) దీపాల పిచ్చయ్యశాస్త్రి, ( నెల్లూరు ), కాశీ కృష్ణాచార్యులు( గుంటూరు), ఓగిరాల వెంకటేశ్వర శాస్త్రి( బాపట్ల) అభిప్రాయలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రథమ ప్రయత్నాన్ని అభినందిస్తూనే దాని గుణాలను మెచ్చుకొంటూనే మరింత జాగరూకతతో మునుముందు చేయవలసిన సాహితీ వ్యవసాయం గురించి జోసఫ్ కు హెచ్చరికగా ఉండేట్లు వ్రాసిన అభిప్రాయాలు అవి. మొత్తానికి పాతికేళ్ల వయసు కే జోసఫ్ వినుకొండ నుండి గుంటూరు, బాపట్ల ఒంగోలు, నెల్లూరు వరకు సాహిత్య స్నేహ సంబంధాలను అభివృద్ధి చేసుకొన్నాడన్నది స్పష్టం. ఒంగోలుకు చెందిన సంస్కృతాంధ్ర పండితుడు ముక్తి నూతలపాటి గోపాలకృష్ణ శాస్త్రి ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసాడు.’ పద్యకావ్యము ప్రౌఢమై సాహిత్య విజ్ఞాన సంపన్నులకు మాత్రము గ్రాహ్యమై యుండు గానీ గద్య కావ్యమన్నచో సామాన్యజనులకు సుగమమై’ కష్టంలేకుండా చదువుకొనటానికి అనువుగా ఉంటిందని ఆయన ఏముందుమాటలో అభిప్రాయపడ్డాడు.
ఆంధ్ర పత్రికా ముద్రాలయములో ప్రచురించబడిన ఈ పుస్తకం ఆపత్రిక అధిపతి అయిన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుకు అంకితం చేయబడింది. కృతిపతి ప్రశంస శీర్షికన అంకిత పద్యాలు ఆరు ఉన్నాయి. కాశీనాధుని దాతృత్వ గుణం ఈ పద్యాలలో వర్ణించబడింది. ఆరు అధ్యాయాల ఈ గద్యకావ్యంలో అధ్యాయం ‘మంజరి’ అనేపేరుతో చెప్పబడింది. ప్రథమ మంజరి ద్వితీయ మంజరి… ఇలా.. గద్యకావ్యంలో అక్కడక్కడా పద్యాలు ఉండటం మరొక విశేషం.
కేరళం అనే రాష్ట్ర వర్ణనతో మొదలైన ఈ కావ్య నాయకుడు చంద్రహాసుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు లేకలేక పుట్టిన సంతానం. చంద్రహాసుడు బాల్యంలోనే తండ్రి శత్రురాజుల తోటి యుద్ధంలో రాజ్యాన్ని, ప్రాణాలను కూడా కోల్పోవటంతో తల్లి సహగమనం చేయటంతో అనాథ అయినాడు. దాదులు అతనిని కుంతలాదేశానికి తీసుకువెళ్లి సామాన్యబాలుడిగా పెంచటం, వాళ్ళు కూడామరణించటంతో బిచ్చమెత్తవలసిన దుస్థితికి నెట్టబడిన చంద్రహాసుడిని ఆఊరి స్త్రీలే తల్లులై పోషించి విద్యాబుద్ధులు నేర్పారు. జ్యోతిష్యులు ఆ బాలుడిలో రాజయ్యే లక్షణాలు ఉన్నాయని చెప్పటంతో దుష్టబుద్ధి అయిన ఆ దేశపు మంత్రి అతనిని చంపింప ఆజ్ఞ ఇచ్చాడు. నిండు ప్రాణం తీయ మనసు రాక ఎడమచేతి వేలు ఖండించి చంద్రహాసుడిని అక్కడే వదిలేసి పోయారు సేవకులు. అడవిలో బాధపడుతూ తిరుగుతున్న అతడిని వేటకు వచ్చిన పుళిందుడు అనే పాలె గాడు తీసుకువెళ్లి పెంచుకొన్నాడు. అస్త్రశస్త్ర విద్యలలో ప్రావీణ్యం పొందాడు. తండ్రి రాజ్యాన్ని ప్రజానురంజకంగా పాలించాడు. ఈ మొత్తం అభివృద్ధిలోను, ఆ తరువాత అతను దుష్టమంత్రి కల్పించిన అవరోధాలు అన్నీదాటి కుంతల రాకుమారిని పెళ్ళాడి, వాళ్ళ యోగక్షేమాలకు కర్త అయి మెప్పుపొందటానికి భగవద్భక్తి, నీతి వర్తన కారణమని నిరూపిస్తూ సంప్రదాయ పద్ధతిలో సాగిన కావ్యం ఇది. ఫిరదౌసి కావ్యంతో ఇలాంటి సంప్రదాయ నమూనా నుండి జాషువా బయటపడుతున్న తరుణంలో వచ్చింది.
ఆ తరువాత పదేళ్లకు వచ్చిన కావ్యం కన్నీటి కబురు. 1933 నుండి 1943 వరకు జోసఫ్ కవి ఏవో కావ్యాలు వ్రాస్తూనే ఉన్నాడు. కన్నీటి కబురుకు కట్టమంచి రామలింగారెడ్డి వ్రాసిన పీఠికలో ‘ఈయన గ్రంధముల యందు భాషా ప్రభుత్వము, రచనా శిల్పము, సుకుమారమైన భావనా శక్తులును వెల్లివిరియుచున్నవి’ అని చెప్పిన దానిని బట్టి, ఇంతకు ముందు ఒక సందర్భంలో తాను జోసఫ్ గురించి ‘నిమ్నజాతులలోని ఒకరు ఇంతపాండిత్యము, ఇంత భాషాశక్తి సంపాదించటం ఆ జాతులలో ఉన్నఅద్భుతమైన శక్తిసామర్ధ్యాలకు తార్కాణం’అని వ్రాసిన మాటలను ప్రస్తావిం చటాన్ని బట్టి అలా అనుకోవటానికి వీలవుతున్నది.
జోసఫ్ ఈ కావ్యాన్నివిద్వత్కవిశేఖరులు, రసజ్ఞ చూడామణులు, సుప్రశస్త వదాన్యులు, ఆంధ్ర మహాపురుషులు, బయ్యన్నగూడెము సంస్థానాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ కొండపల్లి రామచంద్రరావు మహాశయులకు అంకితం ఇచ్చాడు. సంప్రదాయ కావ్య పద్ధతిలో కృతిపతి వంశవర్ణన సుదీర్ఘంగా (25 పద్యాలు) చేసాడు. మరి పదకొండు పద్యాలలో కృతిపతి వర్ణన చేసాడు. ‘భూమిక అనే శీర్షిక క్రింద కావ్యరచనోద్దేశాన్ని తెలియపరిచాడు. శతాబ్దాల నుండి సాగుతున్న సాంఘికాచార ధర్మాల వలన వెనుకబడి, రాజకీయ మత నాగరిక న్యాయ ప్రబోధంబు లెరుంగక పశుప్రాయులై, పేదరికంలో, విద్యకు అనర్హులై పుర బాహ్యప్రదేశ వాసులై దుఃఖపడుతున్న పంచముల కష్టసుఖాల గురించి వ్రాయటం మొదలుపెట్టి కూడా ఆంధ్రలోకంలో జరుగు సన్మానాలకు లోటు వాటిల్లుతుందేమోనని నిజ కులోద్ధరణ ప్రాముఖ్యత గణింపక తమ సంపూర్ణోద్దేశములు కవులు బయటపెట్టటంలేదని చెప్పి ఆ కొరతను పూరించటానికి తాను ఈ కావ్యం వ్రాస్తున్నానని చెప్పుకొన్నాడు.
ఈ మాటలలో తన సమకాలపు స్వజాతి రచయితల రచనల పట్ల ఆయనకున్న అసంతృప్తి కనబడుతుంది. ఈ అసంతృప్తి ఎవరి గురించి? ఈయన ఈ అసంతృప్తి వాక్యాలు చెప్పే నాటికి రెండేళ్లు ముందు( 1941) గుఱ్ఱం జాషువా గబ్బిలము మొదటి భాగం వచ్చింది. అందులో అస్పృశ్యుడు గబ్బిలంతో ఈశ్వరుడి దగ్గరకు పంపిన సందేశం తీరు, సారం జోసఫ్ కు నచ్చలేదా?. దానిని దృష్టిలో పెట్టుకొని అందులో ఏ ఖాళీలు ఉన్నాయని తననుకున్నాడో వాటికి పూరకంగా తానీ కావ్య నిర్మాణం చేపట్టాడు అనుకోవాలా? ఈ అనుమానం ఎందుకు కలిగింది అంటే జాషువాను ఒక ఆదర్శనీయ కవి నమూనాగా ప్రస్తావించటానికైనా సుముఖంగా లేని జోసఫ్ వ్యక్తిత్వం ఈ కావ్యంలో కనబడుతుంది కనుక. ఇందులో మరణ దశలో ఉన్న రాయడు తన కూతురు దుగ్గికి చెప్పే చివరి మాటలలో ప్రస్తుతించిన కవులు సవర్ణులు అనేకులు ఉండగా నిమ్నజాతుల కవి జాషువా లేకపోవటం ఏమిటి? ఇది ఆశ్చర్యాన్నే కాదు, అనుమానాన్నీ కలిగిస్తుంది.
‘కన్నీటి కబురు’ మూడు ఆశ్వాసాల కావ్యం. మూడుతరాల కథ. దిబ్బడు, అతని కొడుకు రాయడు, రాయడి కూతురు దుగ్గి. జోసఫ్ పుట్టి పెరిగి జీవించిన గోకనకొండ ప్రాంతాలలోనే కథ ప్రారంభం అవుతుంది.
“ శ్రీ యహోబిల కవికులశ్రేష్ఠ దివ్య
వాక్సుధా ధారలోయన వలను గులికి
దీప్తమౌ గుండికా స్రవంతీ తటాన
వెలయు బూలవాడను నొకపేద పురము” పూలవాడలో కథపుట్టింది. గోకనకొండకు పంతొమ్మిది కిలో మీటర్ల దూరంలో ఉన్ననేటి పువ్వాడ పూర్వనామం పువ్వులవాడ. అవన్నీకవి తిరు గాడిన ప్రాంతాలే. లక్ష్మీనృసింహుడు అక్కడి దేవుడు. ఆయన దివ్య వాక్కులనే అమృత ప్రవాహమా అన్నట్లు గుండ్లకమ్మ – దానికే గుండికా అనేమరొకపేరు- ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గుండ్ల కమ్మ నది ఒడ్డు గ్రామం పువ్వులవాడ. ‘ఊరు అనేది ఉన్నతరువాత మాదిగపల్లె ఉండకుండా ఉండదు’ అన్నలోకోక్తిని పేర్కొంటూ పువ్వులవాడ పక్కన మాదిగపల్లె ఉన్నదని దానిని పరి చయం చేస్తాడు. కావ్యాలలో నగరవర్ణన మాదిరిగా ఇందులో కవి 17 పద్యాలలో మాదిగపల్లె వర్ణన చేస్తాడు. ఇనుప గజ్జెలు కట్టి దరిద్ర దేవత ఆ పల్లెలో తిరుగుతున్న దృశ్యాన్ని చిత్రించి, మానాభిమానాలను, ధైర్యాన్ని నశింపజేసి దుర్మార్గ మార్గాలకు నడిపే దరిద్రాన్ని వర్ణించాడు. ఈగలకు, దోమలకు నెల వైన మురికి వాడలలోకి నల్లులకు చీమలకు నెలవైన ఇళ్లలోకి, గుడ్లగూబలు తిరిగే సందు గొందు లలోకి, ఎలుకలు, పంది కొక్కులు, కుక్కలు తిరుగాడే ప్రాంగణాలలోకి కవి మనలను తీసుకువెళ్లి తిప్పుతున్నట్లే ఉంటుంది వర్ణన. ఆకలికి, అలసటకు, రోగాలకు కేంద్రాలు అయిన మాదిగపల్లెను అస్పృశ్యత అనే మరొక పెద్ద మహమ్మారి పీడిస్తున్న విషయాన్ని కూడా చెప్తాడు కవి. ‘అంటరాని వాళ్ళు పురాంతరమున నుండఁ జెల్లనివారు’ అని తమను వేరుచేసిన అగ్రకులము ‘గొప్పతనం’ గురించి ప్రస్తావిస్తాడు. ‘అంటరాని కులమందలి వారలు’ చేసే పనులు మిక్కిలి రోత, నీచము అని ఈసడించుకొనే కార్యాలు సొమ్ము గడించి పెడతాయని తెలిసి వృత్తులుగా మలచుకొంటున్న ఒక కొత్త సామాజిక మార్పును గుర్తించి ఇప్పుడా ఎక్కువ తక్కువలు ఏమవుతాయని ప్రశ్నించటం కవి చేతనా స్థాయిని సూచిస్తుంది.
అటువంటి పల్లెలో దిబ్బడు అనే పెద్దమాదిగ ను పరిచయం చేయటంతో అసలు కథ మొదలవుతుంది. దొరలకు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడని మాదిగల మంచీ చెడులకు బాధ్యత వహించి వాళ్లకు నోట్లో నాలుక అయినవాడు దిబ్బడు అతని కొడుకు రాయడు సుగుణాల ఖని. వాడి తెలివితేటలకు చదువు చెప్పిస్తే వన్నె పెట్టినట్లు అవుతుందని అనుకున్నాడు తండ్రి. ఒకనాడు పొలం పోతున్న బ్రాహ్మడి ముందుకు వణుకుతూ పోయి కాళ్ళకు దణ్ణం పెట్టి కొడుకు కు చదువుచెప్పమని, తనకు కలిగినదానిలో మంచి కానుక తోపాటు చర్మం కోసి చెప్పులు కుట్టి ఇస్తానని కోరాడు. ఆ మాటవినగానే ఆ బ్రాహ్మడి మొహం వెలతెలా పోయిందట. వినకూడని మాట విన్నట్లు రామరామ అంటూ చెవులు మూసుకొన్నాడట. కళ్ళు మూసుకొన్నాడట. కాసేపటికి తెప్పరిల్లి , కోపం అణుచుకోని మాల మాదిగల ధర్మం ఏమిటో చెప్పి రాయడికి చదువు చెప్ప నిరాకరించి ఆ బ్రాహ్మడు వెళ్ళిపోయినాడట.
బ్రాహ్మడు చెప్పిన ధర్మం ఏమిటి? ‘చెప్పగరాని వాళ్ళ’మన్న గ్రహింపుతో మెలగటం, ‘ఊరి వెలుపల నివాసం’ అన్ననిర్దేశానికి తలవొగ్గి ఉండటం, చచ్చిన వాళ్ళ వస్త్రాలే గానీ కొత్తవి కట్టకపోవటం, వేదం వినకపోవడం, చేతిలోని అన్నం ముద్దను అక్కడాఇక్కడా పడేయకుండా భూమిలో గుంటతీసి పెట్టటం, రాత్రిపూట వూళ్ళోతిరగకుండా ఉండటం వంటివి మాల మాదిగల ధర్మంగా రాజు నిర్ణయించాడు. ఆ ధర్మాన్ని భుజాన మొయ్యవలసినవాళ్లు మాల మాదిగలు. వాళ్ళు ‘చెప్పగరాని వాళ్ళు’ అని వేరుపరచినవాళ్ళను ‘శ్రేష్ఠులు’ అని ప్రస్తావిస్తాడు బ్రాహ్మడు. ఈ శ్రేష్ఠులు బ్రాహ్మణులు గాక మరొకరు కాదు. శ్రేష్ఠులు, చెప్పగరాని వాళ్ళు అని రెండుగా చీలి పోయిన కులసమాజం శ్రేష్ఠుల సూత్రీకరణ, రాజ్యం నియంత్రణ కలిసి తదితరులను సంపదకు, జ్ఞానానికి పరాయీకరించటం అన్నవిషాదాన్నిఎదుర్కొంటున్నమాల మాదిగలలో తొలి ప్రకంపనల నుండి చలన చైతన్యాల దిశగా సాగిన ప్రస్థానం ఈకావ్యంలో చూస్తాం.
“నీచులకు విద్యాబుద్ధులంనేర్ప( జెల్లదు” నేర్పించినవాళ్లను బంధించమని రాజు శాశించాడు అని చెప్పి బ్రాహ్మడు తన కొడుకుకు చదువు చెప్ప నిరాకరించి వెళ్ళిపోతే ‘ప్రాణంబు లింతవఱకు దక్కినవి’ అని కారాగార విముక్తుడైనట్లు దిబ్బడు ఇల్లు చేరాడని చెప్పటంలో కవి ఒక మనిషి మరొక మనిషి ముందు కులం కారణంగా నిలబడి మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితిలోని విషాదాన్ని సూచిస్తున్నాడు. ఆ పరిస్థితిలో దిబ్బడి ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. చదువుకోకుండానే రాయడు పెద్దవాడయ్యాడు. పెళ్లిచేసుకొన్నాడు. తల్లిదండ్రులు చనిపోయారు. తాను ఏడుగురు పిల్లల తండ్రి అయినాడు. పెద్దబిడ్డ దుగ్గికి మాత్రం కొంత చదువు చెప్పించాడు. తాను పొందలేనిది తనతరువాతి తరానికైనా అందియ్యాలన్న రాయడి ఆంతర్యమే అందుకు మూలం అయివుంటుంది. ఆంతర్యంలోని ఆ కదలికే అతనికి ‘వితర్కబుద్ధి’ని ఇచ్చింది. అది అతనిని కూచుండనీయలేదు. నిలబడనీయలేదు. దళితుల దుస్థితి గురించిన చింతతో వేదన పడ్డాడు. బ్రాహ్మణాది జనులు తన జాతి జనులను చూసినంతనే కోపంతో కసరటం అతనిలో వాళ్ళ ఘనత ఏమిటన్న ప్రశ్నను కలిగించింది. దళితులు ఎన్నిరకాలుగా తమను తాము కోల్పోతూ ఈ సమాజానికి సేవలు అందిస్తున్నారో అతని బుద్ధికి రూపు కట్టించింది.
“ భగ్గున మండుటెండలకు ప్రాయపు భాగ్యము గుత్తకిచ్చి తా
బుగ్గ ( బొగాకు తమ్మ( గోని బువ్వ రవంతయు లేకపోయినన్
మొగ్గగు భక్తితోఁ గలుఁగు మొత్తము చాకిరి కా(పుటిండ్లలో
సిగ్గు దొఱంగి చేసెడిని చెమ్మట బిందులు జాలువాఱఁగన్” భూమిగలిగిన వర్గం కాపులు. వారికి చెమటోడ్చి చాకిరీ చేయవలసిన వర్గం దళితులు. ఆకలి, అభిమానం అన్నీ పక్కకు పెట్టి, ప్రతిఫలం లేకుండా చేసే చాకిరీ వెట్టిచాకిరి. దళితులు ప్రతిఫలం లేని చాకిరీ చేస్తున్నారని ఎందుకు అనుకోవాలి ? ‘బువ్వ రవంతయు లేకపోయినన్’ అన్న మాట అది ఆకలి తీర్చని చాకిరీ అని సూచిస్తున్నది. ఆకలి బాధ తెలియకుండా ఉండాటానికే వాళ్ళు బుగ్గన పొగాకు పెట్టుకొని వచ్చేది. ప్రాయపుభాగ్యం – యవ్వన సంపద అంతా కాపుల పొలాలలో పనికే కుదవపెట్టవలసిన పరిస్థితులలో ఉన్న దళితులు సంపదల ఉత్పత్తికి పనిముట్లు అవుతున్నారు తప్ప మానవులుగా అందులో న్యాయమైన వాటా పొందలేక పోతున్నారు అన్నదే రాయడి బాధ.” నీటికి మాఱు రక్తమును నింపి, పొలంబుల మెత్త(జేసి, ముప్పూటలు సాగు(జేయుచును” అని మొదలయ్యే తరువాతి పద్యం నెత్తురు ధారపోసి పొలాలు సాగుచేసే దళిత వ్యవసాయకూలీ యవ్వనం, జీవితం అందులోనే ఖర్చయి పోతున్నదని, ఏటేటా ఫలింపజేసి యజమానికి ‘భాగ్య సంపదలు’ ఇచ్చే క్రమంలో దళితులు దానికి పరాయీకరింపబడుతున్నారని రాయడు గ్రహించటాన్ని సూచిస్తుంది. నెత్తిన పాగా, ఎర్రటి కన్నులు, చేతిలో కొలుపు కత్తి ఉన్న దళితులు కాపు కుర్రలకు భయపడటంలో మర్మం ఏమిటా అని ఆలోచన కూడా చేసాడు అతను. పనులన్నిటికీ నేనే అని తిరిగే దళితులకు ఎంగిలి మెతుకులు తప్ప దొరకని విషాదానికి వేదనపడ్డాడు.
( ఇంకా ఉంది)