విత్తులు

మీలో వొక సూర్యుడు
మీలో వొక చంద్రుడు
మీలో వొక సముద్రం
మీలో వొక తుఫాను
మీలో వొక సుడిగాలి

పుస్తకాలు పూసిన చేతుల్తో
అక్షరాలు కాసిన చూపుల్తో

సకులం ముకులం వేసుకున్న
వొక దేశంలా
నాముందు కూర్చుంటారు

భూమి ఆకలి తీర్చే తపస్సు మునిగిన
విత్తుల్లా
నా ముందు కూర్చుంటారు

మీ ముఖంలో
ముకుళిత తోటల నవ్వులు !
మీ మాటల్లో
మనస్సున్న పరిమళాలు
మౌనంగా వ్యాపిస్తుంటాయి
మీ కళ్ళల్లో
నక్షత్రాలు తుళ్ళుతుంటాయి

మాసిన వజ్రాల్లారా!
మీ అడుగులు
ఆధునిక దీర్ఘకావ్యాలై
నలిగిన కాలం చెట్టును
నగిషీలు పడ్తుంటాయి

చిటపట చిందుల చినుకుల్లా
మీరే వానలైనట్టుంటారు
గలగల ఊగే మొక్కల్లా
మీరే పంటలైనట్టుంటారు

ఈ తండాల మీంచి
ఈ పల్లెల మీంచి
ఈ ఎండిన బతుకుల మీంచి

చెమట బిందువుల్తో విరిసిన
చెరగని సింగిడీలై ప్రవహించి

ఈ మట్టి
ఈ మనిషి
గాయాల్ని మాన్పే
మహా వైద్యుల్లా కన్పిస్తుంటారు.

జ‌న‌నం: వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి.పెరిగింది నెక్కొండ. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. విర‌సం స‌భ్యుడు. తెలుగు సాహిత్యంలో తనదైన తెలంగాణ భాష ముద్రతో కవిత్వం, కథలు రాస్తున్న కవి. 'ముఖచిత్రం', 'పడావు', 'జంగ్-ఏ-కాశ్మీర్', 'హిమాలయాలే వడ్ల తాలయిన అమరత్వం', 'వీరవనం', 'హైదరాబాద్ నా అబ్బ సొమ్మె', 'ర్యామాండం' తదితర దీర్ఘ కవితలు, 'పోస్ట్ మార్టం రిపోర్ట్', 'దుఃఖభాష', 'చెమట చుక్కల కళ్లు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'పబేటు వల', 'ఆమె తలాఖంది' తదితర 20 కథలు రాశారు.

Leave a Reply