విజి తుకుల్ – మాయమైన మనిషి, మాసిపోని కవిత్వం

ఆగస్టు 1996, ఒక మధ్యాహ్న సమయం. ఇండోనీసియాలో సుహార్తో సైనిక నియంతృత్వ పాలన ప్రజల నిరసనపై విరుచుకు పడుతున్న రోజులవి. సోలో నగరంలో ఒక అద్దె ఇంట్లో నివసించే ఒక బక్కపలచటి మనిషి భార్యకి హడావుడిగా వీడ్కోలు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తల శుభ్రంగా దువ్వుకోడు, బట్టలు మాసిపోయి ఉంటాయి, సరిగా కనిపించదు, వినిపించదు. మాట్లాడితే ‘ర’ అక్షరాన్ని సరిగ్గా పలకలేడు కూడా. అయినా అతని కంఠమొక అగ్ని తరంగం. తన కవిత్వమొక స్వేచ్ఛా విహంగం. ఒకే ఒక్క మాట, ‘లావాన్ (తిరగబడు)’ అన్న ‘హెచ్చరిక’ కవిత సుహార్తో పాలనపై ఎక్కుపెట్టిన యుద్ధ ఫిరంగిలా మారుమోగుతున్నది. ఇండోనేసియా విద్యార్థి, యువజనుల ఆందోళనలో, కార్మిక పోరాటాల తిరుగుబాటులో ప్రతిధ్వనిస్తున్నది. తన కవిత్వం, కరపత్రాలు, ప్రదర్శనలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలని రెచ్చగొడుతున్నాడని అధికారులు కక్షగట్టారు. నిరసనకారులని ఎత్తుకుపోయి, చిత్ర హింసలు పెట్టి చంపివేస్తున్న రోజులవి, అతడంటే నియంతృత్వ పాలకులకి భయం, పట్టరాని కోపం.

ఎవరో తరుముతున్నట్టు ఆనాటి అపరాహ్ణ వేళ, హడావుడిగా ఇంటినీ, కుటుంబాన్నీ వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మనిషి ఇక తిరిగి ఇంటికి రాలేదు. మే 1998 జకార్తాలో అల్లర్లు, విద్యార్థుల తిరుగుబాలు, నియంత సుహార్తో పతనం పరిణామాల తర్వాత పూర్తిగా కనిపించకుండా పోయాడు. ఏమయిపోయాడో ఎవరికీ ఇప్పటికీ ఇదమిద్ధంగా తెలియదు. చీకటిలో చెదిరిపోయిన నీడలా, వర్షపు జల్లులలో కరిగిపోయిన కన్నీటి ధారలా, జాడ తెలియని జ్ఞాపకంలా, విస్మృత చరిత్రపుటలలో చెరిగిపోయిన అక్షరంలా, ఒక అసంపూర్తి కవితలా మిగిలిపోయాడు… విజి తుకుల్ అతని పేరు.

1963 ఆగస్టు 26 న విజి తుకుల్ మధ్య జావా ప్రాంతంలోని సోలో నగరంలో ఒక సాధారణ కార్మిక కుటుంబంలో జన్మించాడు. అసలు పేరు విజి విడొడొ. తండ్రి ఒక రిక్షా కార్మికుడు. తల్లి రోడ్డు పక్క తినుబండారాలు అమ్మేది. పదకొండవ ఏటనే చదువు మానేయాల్సి వచ్చింది. వడ్రంగం, పత్రికల అమ్మకం, రిక్షా తొక్కడం లాంటిసి రకరకాల పనులు చేశాడు. విపరీతమైన ఆసక్తితో ఏ పుస్తకం దొరికితే ఆ పుస్తకం చదివేవాడు, తనని అందరూ ‘పుస్తకాల పురుగు’ అని పిలిచేవాళ్ళు. కవిత్వం రాసే వాడు. పేద ప్రజల జీవితం గురించీ, పోలీసు దౌర్జన్యాల గురించీ రాసే వాడు. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకి పంపే రోజులలో, దేశాధ్యక్షుడికి పీడకలగా మారదాం అని రాశాడు. ప్రజా కళా వేదికని స్థాపించాడు. 1995 లో విజి తుకుల్ పదిహేను వేలమంది శ్రీ టెక్స్ టెక్స్ టైల్ కార్మికుల సమ్మె పోరాటానికి నాయకత్వం వహించాడు. పోలీసులు దాడి చేసి విపరీతంగా కొట్టడంతో కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది, వినికిడి శక్తి కూడా బాగా దెబ్బతింది. మాటలు సరిగ్గా ఉచ్ఛరించలేకపోయినా తన కవిత్వం జనాలని ఉత్తేజపరిచేది. 1996లో నియంత సుహార్తో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీలో చేరాడు. దీంతో మిలిటరీ, పోలీసుల వత్తిడి పెరిగింది. 1996 ఆగస్టులో తనకోసం పోలీసులు వస్తున్నారని తెలియగానే, హడావుడిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.

అజ్ఞాతంలోకి వెళ్ళాక విజి తుకుల్ నిరంతరం ఒక చోటు నుంచి మరొక చోటుకి మారేవాడు. మిలిటరీ వేట తీవ్రంగా కొనసాగింది. తన జాడ కోసం ఎంతోమందిని చిత్రహింసలకు గురిచేశారు. సోలో, జోగ్జకార్తా, మగెలాంగ్, జకార్తా, పొంటియినాక్, టాంగేరాంగ్, బాండుంగ్, కలిమంటాన్ నగరాలలో పలువురు మిత్రుల ఆశ్రయం పొందాడు . తన జాడ తెలియకుండా ఉండడానికి, గదిలో దీపం కూడా వెలిగించేవాడు కాదు. గుర్తు పట్టకుండా వేషాలు మార్చేవాడు. అలాంటి వత్తిడిలో కూడా కవిత్వం కథలు రాసే వాడు. కరపత్రాలు ప్రచురించేవాడు. 1998 మే నెల తర్వాత తన జాడ తెలియలేదు. కుటుంబ సభ్యులూ, స్నేహితులూ పార్టీ రక్షణలో వున్నదని అనుకుంటే, పార్టీ సహచరులు బంధువుల ఆశ్రయంలో వున్నాడని భావించారు. తనని ప్రభుత్వ యంత్రాంగమే హత్య చేసిందని ఇప్పుడు భావిస్తున్నారు.

విజి తుకుల్ కవిత్వమూ, కథలూ మూడు సంపుటాలుగా అచ్చు అయ్యాయి. విజి తుకుల్ అజ్ఞాత జీవితం గురించి ‘సోలో సాలిట్యూడ్/ ఇస్త్రి హత్లా కటా – కటా’ అన్న సినిమా 2016లో వచ్చింది. ఒంటరి తనం, అభద్రతలని అది అద్భుతంగా చిత్రించింది. యు ట్యూబ్ లో ఆ సినిమా దొరుకుతుంది కానీ అది ఇండొనీసియన్ భాషలో మాత్రమే వుంది. అజ్ఞాత సమయంలో తనకి కలిసిన, ఆశ్రయమిచ్చిన మిత్రువుల్నీ, కుటుంబ సభ్యులనీ కలిసి సేకరించిన వివరాలతో, టెంపో ప్రచురణ సంస్థ 2014లో విజి తుకుల్ – ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించింది.

విజి తుకుల్ జ్ఞాపకాలు ఇప్పటికీ పాలకులని భయపెడుతూనే వున్నాయి. 2017 లో విజి తుకుల్ రచనలపై ఆధారపడి ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శనని పారా మిలిటరీ బలగాలూ, ఇస్లామిక్ మత ఛాందస బృందాలూ అడ్డుకున్నాయి.

నోరుమూసుకుని మౌనంగా కూర్చునేదానికి చదవడం ఎందుకు, వట్టి దండగ కాదా అని విజి తుకుల్ కవిత ఒకటి చెబుతుంది. (తన గొంతులో ఈ కవితని ఇక్కడ వినవచ్చు.)

విజి తుకుల్ కి భార్య, ఇద్దరు పిల్లలు – కొడుకు, కూతురు వున్నారు. తండ్రి అదృశ్యమయ్యే నాటికి కూతురు ఫిత్రీ కి ఎనిమిదేళ్లు, కొడుకు ఫజర్ మీరా కి ఐదేళ్లు. ఫిత్రీ ఇప్పుడు కవిత్వం రాస్తున్నది. ఫజర్ ఇప్పుడు ఒక గాయకుడు, సంగీత కారుడు.

“విజి తుకుల్ ఇండోనేసియా దేశపు అత్యద్భుతమైన కవి కాకపోవచ్చు. అనుమానాస్పదమైన పరిస్థితులలో మాయమైన వ్యక్తులలో అతను ఒక్కడు మాత్రమే కాకపోవచ్చు, సుహార్తో ‘నూతన వ్యవస్థ’ ప్రభుత్వ పరిపాలన చరిత్రలో తుకుల్ జీవితం ఒక ముఖ్యమైన భాగం. దానిని మనం విస్మరించలేము. అతను ఒక అత్యంత శక్తివంతమైన రాజ్యాన్ని భయపెట్టిన కవి. అతని మరణం ఇప్పటికీ ఛేదించకుండా మిగిలిపోయిన రహస్యం.” – విజి తుకుల్ – ఎ కాన్స్పిరసీ ఆఫ్ సైలెన్స్.

జావనీస్ భాషలో విజి తుకుల్ అంటే మొలకెత్తే విత్తనమని అర్ధం. బలవంతాన గొంతు మూసేసినా, విజి తుకుల్ కవిత్వమై, ధిక్కార స్వరమై మొలకెత్తుతూనే ఉంటాడు.

విజి తుకుల్ కవిత్వం:

హెచ్చరిక

పాలకులు ఉపన్యాసాలిస్తున్నా
జనం లేచి వెళ్ళిపోతున్నారంటే
జాగ్రత్తగా ఉండాలి
బహుశా వాళ్ళు నమ్మకం కోల్పోయారు

జనాలు రహస్యంగా,
గుసగుసలుగా
సమస్యలగురించి మాట్లాడుకుంటున్నారంటే
పాలించేవాళ్ళు జాగ్రత్తపడాలి, వినడం నేర్చుకోవాలి

జనం ఫిర్యాదుచేయాలన్నా భయపడుతుంటే
పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు
అధికారంలోవున్నవాళ్ళు
సొల్లు మాట్లాడుతున్నా తిరస్కరించడంలేదంటే
సత్యం ఆపదలో ఉన్నట్టు

ఏది అడిగినా కాదంటున్నారంటే
విమర్శ దేశద్రోహమనీ, శాంతిభద్రతలకు ప్రమాదమనీ నిందిస్తున్నారంటే
గొంతులు నొక్కేస్తూ, ఆలోచనల్ని నిషేధిస్తున్నారంటే
మన జవాబు ఒకే ఒక్క మాట – తిరగబడు!

ఇంగ్లీషు, ఇండోనేషియన్ భాషలలో ఈ కవిత వీడియో:

చీకటి రాత్రి

ఈ రాత్రి వర్షం కురుస్తోంది
నన్ను రక్షించడానికి

ఆ జీతం చాలని నిఘా ఉద్యోగులు
పై అధికారులని తిట్టుకుంటూ ఉండాలి

ఈ రాత్రి వర్షం కురుస్తోంది
నన్ను రక్షించడానికి

సుదీర్ఘమైన అలసటనుంచి
విశ్రాంతి తీసుకుని
ఓపిక తెచ్చుకుని
గెలుపుకోసం
మళ్ళీ సిద్ధమయేలా

ఈ రాత్రి వర్షం కురుస్తోంది
నన్ను రక్షించడానికి

కప్పల లాడుతున్నాయి, ఈదురుగాలి ఈల వేస్తున్నది
నా కనురెప్పలు మూతపడుతున్నాయి

అలిసిపోయాను నేను, నిద్రపోవాలి

రాజధాని నగరంలో సిపాయిలు
ఎం 16 తుపాకులతో పహారా కాస్తారు
వాళ్ళ యజమానులు
భయంతో వణికిపోతారు

పేలడానికి సిద్ధంగా వున్న
కాలాన్ని వాళ్ళు అంతటా దట్టించారు

శత్రువుల్ని సృష్టించి
ఆ తర్వాత కాల్చివేస్తారు

గొడవలు సృష్టించి
జనాల్ని విడదీస్తారు

ఈ రాత్రి వర్షం కురుస్తోంది
నన్ను రక్షించడానికి

ఈ చీకటి రాత్రి నా కోసం
ఈ చీకటి రాత్రి నాకోసం పరిచిన ఒక దుప్పటి

ఓ నా దేశమా హాయిగా నిద్రపో
భార్యా, పిల్లల్లారా హాయిగా నిద్రపోండి
అందరికీ స్వేచ్ఛ దొరికే
కాలం వస్తుంది
ఖచ్చితంగా వచ్చి తీరుతుంది

(ఆగస్టు 1996, అజ్ఞాతంలో వున్న సమయంలో రాసిన కవిత)

రాస్తూ వుంటాను

మళ్ళీ
నన్ను అరెస్టు చేసావు
నేను దాని గురించే రాశాను

మళ్ళీ
నా చేతులు మెలిపెట్టావు
నేను దాని గురించే రాశాను

మళ్ళీ
నా తలని చితకగొట్టావు
నేను దాని గురించే రాశాను

కొట్టండి
నేను నెత్తురు కక్కేదాకా కొట్టండి
సాక్ష్యంగా నిలబడనివ్వు

గుంపుగా గుమికూడిన జనం ముందు
కొట్టండి
చూపించు
నీ తుపాకులనీ, లాఠీలనీ
వాళ్ళని చూడనీ

మళ్ళీ
నన్ను బూతులు తిడుతున్నావు
నేను దాని గురించే రాశాను

నా దేహమే ఒక సాక్ష్యం
నన్ను మళ్ళీ, మళ్ళీ కొట్టండి

జనం అందరూ కళ్లారా చూశారు
నేను దానికగురించే రాశాను
రాస్తూ వుంటాను

విషాద గీతం

ఒక నల్లపిల్లి రహస్యంగా
పై కప్పు మీదినుంచి దూకింది
చీకటిలో ముగ్గురు మనుషులు
ఇనుప చువ్వలతో నక్కి వున్నారు

ఒక నల్లపిల్లి మెల్లగా చప్పుడు లేకుండా నడుస్తూ వుంది
నీడలు దాని వెనకే నడుస్తున్నాయి
వీధి మలుపు చివర
ముగ్గురు మనుషులు దాడిచేశారు

పిల్లి మాంసం
మనుషుల కడుపు నింపిన
పేదరికపు పండగని
మేఘాల చాటునుంచి చూసింది చందమామ

మాటలు మాయం కావు

నేను పతాక శీర్షికలలో ప్రముఖ వ్యక్తిని కాను
అందలమెక్కిన అధిపతులకి
నేనొక దుర్వార్తని

నా కవితలు కవిత్వం కావు
అవి చీకటి పదాలు
అవి చెమటలు కక్కుతూ, ఒకదానినొకటి తోసుకుంటూ బయటపడతాయి
నా కనుగుడ్లని చిదిమివేసినా, నా మాటల్ని చంపలేవు
నన్ను ఇంటినుంచి తరిమి వేసినా, నా మాటల్ని చంపలేవు
నన్ను ఒంటరితనపు కత్తితో గాయపరిచినా, నా మాటల్ని చంపలేవు
నా కాలాన్ని, బలాన్ని, గాయాలని
వెచ్చించి అల్లిన మాటలవి

మాటలు బాకీ తీర్చమంటాయి
నేను సజీవంగానే వున్నానని నా మాటలు నాకు గుర్తు చేస్తాయి

అవును, నేనింకా నేనుగా, సంపూర్ణంగానే వున్నాను
నా మాటలింకా చచ్చిపోలేదు

పరారీలో వున్న మనిషి

గుర్తుపట్టకుండా
మార్చుకున్న చొక్కా
మార్చుకున్న ప్యాంటు
మార్చుకున్న తలకట్టు
మార్చుకున్న చదివే పుస్తకం
బాతాఖానీ కబుర్ల కోసం కోసం మార్చుకున్నమాట
మారిన పేరు
మార్చుకున్న గుర్తింపు
మార్చుకున్న ముఖ కవళికలు
ఈ దేశంలో
నువ్వు నువ్వుగా
మారకుండా ఉండడం
నేరమైపోయింది
పోలీసుల నుంచీ
సైన్యం నుంచీ
చట్టం నుంచీ
జాగ్రత్తగా ఉండాలి
మారువేషాల్ని నిరాకరించే
మనుషులకోసం
జైళ్లు నోళ్లు తెరుచుకుని ఎదురుచూస్తుంటాయి

సందేశం 97

ఈ రాత్రి వర్షం కుండపోతగా కురుస్తూ వుంది
పాదాల నుండి చలి నిలువెల్లా ముంచెత్తుతూ వుంది
నిశ్శబ్దంలో నా హృదయం ముక్కలు ముక్కలౌతున్నది
నీకు వీడ్కోలు పలికిన క్షణం
గుర్తుకొస్తుంది
నిన్ను హత్తుకుని
చెక్కిలిపై ముద్దు పెట్టాను
పిల్లలని ముద్దాడే సమయం కూడా లేదు
ప్రశాంతంగా నిద్రపోతున్న వాళ్ళు
నిద్రలోనుంచిలేస్తారేమో అని భయం
ఒక వారం తర్వాత, నెల తర్వాత
నేనేమయిపోయానని అడుగుతారేమో
ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే
హృదయం బాధతో ఘార్ణిల్లుతున్నది
ఆ క్షణాన
నేనేవో మాటలు గుసగుస లాడాను
తలుపుదగ్గర
నువ్వు నన్ను వెళ్ళిపోనిచ్చావు
కానీ నీ కళ్ళు మాత్రం వదలలేనట్లు
ఆట్టే సమయం లేదప్పుడు
నేను ఎగిరి వచ్చేశాను
ఇప్పటికి ఆరు నెలలు గడిచిపోయాయి
ఇప్పటికీ నాకు గుర్తు
నా గుండె ఎలా కొట్టుకున్నదో
నా కాళ్ళు ఎలా పరుగులు తీశాయో
వాళ్ళు ఫాసిస్టులు
దురాశాపరులైన నియంతలు కదా
ఇంటికి వస్తాను నేను
బహుశా ఒక అర్ధ రాత్రి
బహుశా ఏదో ఒక వేకువ జామున
ఇంటికి వస్తాను
కానీ
నాకోసం ఎదురు చూడకు
ఇంటికి వచ్చి, మళ్ళీ వెళ్ళిపోతాను
మన హక్కులని వాళ్ళు
కాలరాశారు
విశ్వవిద్యాలయాలలో
కర్మాగారాలలో
న్యాయస్థానాలలో
ఇళ్లలో
బలవంతాన చొరబడి
మనల్ని అణగదొక్కారు
నేను ఇంటికి ఎందుకురానని
పిల్లలు ఎప్పుడైనా అడుగుతారేమో
నాన్న ఎప్పుడూ వీరత్వాన్ని కోరుకోలేదని చెప్పు
గద్దెనెక్కినవాళ్లు
క్రూరమైన నియంతలు
నాన్నని ఒక నేరస్తుణ్ణి చేశారని చెప్పు
నాన్న దేనికోసం వెదుకుతూ వెళ్లిపోయాడని అడుగుతారేమో
హరించిన మన హక్కులని
తిరిగి తీసుకురావాలని వెళ్లిపోయాడని వాళ్లకి చెప్పు

పూలు, గోడలు

మేం పూలమైతే
మీరు వికసించకూడదనుకున్న పూవులం
మా భూముల్ని కొల్లగొట్టి అక్కడ భవంతులు కడతారు మీరు

మేం పూలమే అయితే
మీరు చూడకూడదనుకునే పూవులం
మా భూముల్ని చదును చేసి రోడ్లు వేసి ముళ్లకంచెలు నాటుతారు మీరు

మేం పూలమైతే
మమ్మల్ని మా భూమి నుంచి మీరు వేరుచేసిన పూలం

మేం పూలమే అయితే
మీరు గోడల్లాంటి వాళ్ళు
మేం ఆ గోడలపైనా విత్తనాలని నాటాము
దృఢ విశ్వాసంతో ఐక్యంగా మేం ఏదో ఒకరోజు మొలకెత్తుతాం

ఇప్పుడు మేం మొలకెత్తాం సమైక్యంగా
ఎక్కడైనా, ఏచోటనైనా
నిరంకుశత్వం కూలి పోవలసిందే

(అనువాదం: సుధా కిరణ్)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

2 thoughts on “విజి తుకుల్ – మాయమైన మనిషి, మాసిపోని కవిత్వం

  1. అద్భుతమైన కవితలు.పవర్‌ఫుల్ పోయిట్.అనువాదం ఇవి తెలుగు కవితలే అనిపించింది.

Leave a Reply