ప్రజల కోసం ప్రాణమిచ్చిన పాట… విక్టర్ హారా

సెప్టెంబర్ 11, 1973, శాంటియాగో

విక్టర్ హారా (Victor Jara) పొద్దున లేచి రేడియో పెట్టుకున్నప్పుడు ఆ రోజు చిలే (Chile) దేశ చరిత్రలో చీకటి రోజుగా నిలిచిపోతుందని ఊహించలేదు. రేడియోలో వస్తున్న వార్త వింటుంటే విక్టర్ కూ, అతని భార్య జోన్ (Joan) కూ, గుండె వేగం పెరిగింది. ఆరోజు టెక్నికల్ యూనివర్సిటీలో హారా ఫాసిజంకు వ్యతిరేకంగా ప్రదర్శన ఇవ్వవలిసి ఉంది. తన సంగీతం, మాటా, పాటలతో ప్రజలు సోషలిస్ట్ ప్రభుత్వం సాధించుకోవడంలో ఎనలేని కృషి చేసిన విక్టర్ ఇప్పుడు దేశాన్ని ఫాసిస్టుల చేతులనుండి కాపాడడానికి ప్రదర్శనలిస్తున్నాడు. అమెరికా అండతో చిలే సైనికాధికారులు ఏ క్షణానైనా మెరుపుదాడి చేసి, దేశంలో నియంతృత్వ పాలన తెచ్చే అవకాశాలున్నాయని అప్పటికే ప్రజలు భయపడుతున్నారు. చిలే రాగి గనులను (copper mines) దశాబ్దాలుగా కొల్లగొట్టి అధిక లాభాలకు మరిగిన అమెరికా, చిలే అధ్యక్షుడు సాల్వడార్ అయెండీ (Salvador Allende) గనులను జాతీయం చేయడం జీర్ణించుకోలేక పోయింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన సోషలిస్ట్ అధ్యక్షుడు అయెండీ నుండి అధికారం చేజిక్కించుకోవడానికి అమెరికాకు అనుకూలమైన ప్రతిపక్షాలతో, సైనికాధికారులతో కుట్ర పన్నింది. చిలే రాజధాని శాంటియాగోలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

ఇంతలో రేడియోలో అయెండీ ప్రసంగం వినిపించింది “నేను మీతో మాట్లాడగలిగేది ఇదే చివరి సారి. నేను రాజీనామా చేయను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి నేను నా ప్రాణంతో రుణం తీర్చుకుంటాను… నేను మీకు చెప్పేది ఇదే: వేలాదిమంది చిలే వాసుల మనసుల్లో మనం నాటిన విత్తనాలను వాళ్ళు నాశనం చేయలేరు… నేరంతో, బలప్రయోగంతో సామాజికమార్పును ఆపలేరు. చరిత్ర మనదే, ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే…” ఆయన చివరి మాటలను విక్టర్ వింటుండగానే ఆ మాటలు ఆగిపోయి రేడియోలో మిలిటరీ సంగీతం మొదలయింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే సైనికాధికారి పినోషె (Pinochet) నేతృత్వంలో సైనిక బలగాలు అయెండీ కార్యాలయం ఉన్న La Moneda Palace మీద మిషిన్ గన్నులు, బాంబులతో దాడిచేసాయి. శత్రువుకు తలవంచని అయెండీ రైఫిల్ తో కాల్చుకొని తన ప్రాణాలర్పించాడు.

తమ ప్రియతమ నాయకుడు అయెండీ చివరి మాటలు విక్టర్ చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆలోచిస్తూ కూర్చునే సమయం లేదు. ఇలాంటిదేమయినా జరిగితే తన కర్తవ్యం ప్రజలతో ఉండడమే అని విక్టర్ కు తెలుసు. భార్యకు హడావిడిగా వీడ్కోలు పలికి టెక్నికల్ యూనివర్సిటీకి బయలుదేరాడు. అక్కడికి చేరుకునేసరికి ఆరు వందల మంది విద్యార్థులు జరగబోయే కార్యక్రమం కోసం వచ్చి ఉన్నారు. అక్కడినుండే వాళ్ళు అయెండీ నివాసంపై జరిగే దాడిని భయాందోళనలతో చూశారు. మిలిటరీ బయట కర్ఫ్యూ విధించింది. విద్యార్థులు, సిబ్బంది అంతా యూనివర్సిటీ భవనంలో చిక్కుకుపోయారు. బిక్కు బిక్కుమంటున్న వాళ్లకు ధైర్యం ఇవ్వడానికి విక్టర్ తన గళం విప్పాడు. బయట బాంబుల పేలుళ్లు, మిషిన్ గన్నుల మోతలు. లోపల విక్టర్ పాటలకు వంత పాడుతూ విద్యార్థులు. ఆ రాత్రంతా ఆయన ఉత్తేజభరితమైన పాటలతో యూనివర్సిటీ మారుమోగింది.

సెప్టెంబర్ 12, 1973, టెక్నికల్ యూనివర్సిటీ, శాంటియాగో

తెల్లవారుతూనే సైనిక బలగాలు టాంకర్లతో యూనివర్సిటీ గోడలు బద్దలు కొట్టాయి. యూనివర్సిటీలో ఉన్న వాళ్లందరినీ పక్కనే ఉన్న చిలే స్టేడియంలోకి కొడుతూ, తంతూ తీసుకువెళ్తున్నారు. సైనికాధికారి ఒకడు విక్టర్ ను గుర్తుపట్టాడు. ‘నువ్వు ఆ పాటలు పాడే లం..కొడుకువే కదరా,’ అంటూ విక్టర్ ని తుపాకి మడిమతో తల మీద బలంగా దెబ్బ వేశాడు. విక్టర్ నేల మీద కుప్పకూలాడు. అధికారి కసిగా కడుపులో, ఛాతిలో తన్నాడు. ప్రజల కోసం ప్రశ్నలు సంధించిన విక్టర్ నోటినుండి ధారలై పారుతున్న రక్తం. అతన్ని ఈడ్చుకుపోయి ‘ముఖ్యమైన ఖైదీలు’ ఉన్నదగ్గరికి తీసుకెళ్లి పడేసారు.

సెప్టెంబర్ 13, 1973, చిలే స్టేడియం, శాంటియాగో

విక్టర్ ను చిత్రహింసలు పెట్టి, సాయంత్రం వరకు మిగిలిన ఖైదీలున్న స్టేడియం ముఖ్య ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. తలపై లోతైన గాయం, రక్తమోడుతున్న ముఖం. అయినా స్నేహితుల్ని చూసిన హారా ముఖంపై అదే దరహాసం. పక్కటెముకలు విరిగినా, కడుపు మీద గాయాలైనా మొక్కవోని విశ్వాసం. స్నేహితులు అతని గాయాలను తుడిచి, తమ దగ్గర ఉన్న రెండు బిస్కెట్ లను అందరూ పంచుకోని తిన్నారు. తన చుట్టూ రోజుల తరబడి తిండీ, నీళ్లూ, నిద్రా లేక వేలమంది ఖైదీలు. పగలూ, రాత్రీ తేడా తెలియకుండా పెట్టిన పెద్ద ఫ్లడ్ లైట్లు. స్టేడియం చుట్టూ అమర్చిన మిషిన్ గన్నులు. విచక్షణ లేకుండా కాల్చివేయబడుతున్న తోటి ఖైదీలు. సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అంతవరకూ ప్రజలు సాధించిన విజయాలు అతని కండ్ల ముందు కదిలాయి. ప్రజాసైన్యం లేని తమ పక్షం మీద సైనికాధికారులు కుట్రపన్ని దాడి చేస్తే ఎట్లా ఎదురుకుంటుందని వాళ్ళు వేసుకున్న ప్రశ్నలు, భయాలు నిజమైనాయి. ఫాసిస్టుల హింసాకాండ పడగలు విప్పింది.

సెప్టెంబర్ 14, 1973, చిలే స్టేడియం, శాంటియాగో

స్నేహితుల సహాయంతో కొంత కోలుకున్న విక్టర్, ఒక పెన్సిల్, కాగితం సంపాదించాడు. ఫాసిజం సృష్టించే మారణహోమాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన చివరి కవిత రాయడం మొదలుపెట్టాడు. అప్పటికీ అతనిలో భవిష్యత్తుపై ఆశ బతికే ఉంది. బాంబులు, మిషిన్ గన్నుల కన్నా ప్రజల శక్తి గొప్పదన్న నమ్మకం సడలలేదు.

అయిదు వేల మందిమి మేమిక్కడ
నగరంలోని ఈ చిన్న ప్రదేశంలో.
మేమిక్కడే అయిదు వేల మందిమి.
దేశమంతటా మేమెందరమో?

ఇక్కడ విత్తనాలు నాటే, ఫాక్టరీలు నడిపే
పది వేల చేతులున్నాయి.
ఇక్కడే ఆకలి, చలి, నొప్పి, భయం, పీడన, ఉన్మాదానికి
విలవిలలాడుతున్న మనుషులు ఎందరో?

మాలో ఆరుగురు అనంతాకాశంలోకి అదృశ్యమయ్యారు
ఒకరి ప్రాణం తీసారు, ఇంకొకరిని గొడ్డును బాదినట్టు బాదారు.
మిగిలిన నలుగురూ హింస నుండి విముక్తి కోసం చావుకూ సిద్ధపడ్డారు
ఒకరు శూన్యంలోకి దూకితే,
గోడకు తల బాదుకుంటూ మరొకరు,
అందరి కళ్లలో అదే గడ్డకట్టిన చావుకళ.

ఈ క్రూరమైన ఫాసిజం ఎంతటి భయోత్పాతాన్ని సృష్టిస్తుంది!
వాళ్ళు తమ కుతంత్రాలను పదునైన కత్తి అంచులా అమలుచేస్తారు.
వాళ్లు దేన్నీ లెక్క చేయరు.
రక్తం అంటే పతకాలు వాళ్లకు,
ఊచకోతే వాళ్లకు శూరత్వం.
దేవుడా, ఇదేనా నువ్వు సృష్టించిన ప్రపంచం,
ఇందుకేనా నీ ఏడు రోజుల అద్భుత సృష్టి?
ఈ నాలుగు గోడల మధ్య ఉన్నది,
అంతకంతకూ చావును కోరుకునే
పురోగతి లేని ఒక సంఖ్య మాత్రమే.

కానీ ఒక్కసారిగా నా అంతరాత్మ మేలుకుంటుంది
మిషిన్ గన్నుల మోతలూ,
మిలిటరీ చూపే మంత్రసాని ముఖాలూ తప్ప
గుండెచప్పుడే లేని ఈ కెరటాన్ని చూస్తున్నాను.
మెక్సికో, క్యూబా, ప్రపంచ ప్రజలారా!
ఈ దురాగతాలకు వ్యతిరేకంగా గొంతెత్తండి!
ఏమీ ఉత్పత్తి చేయలేని
పది వేల చేతులిక్కడ.
దేశమంతటా మాలాగా ఇంకెందరో?

మా దేశాధ్యక్షుడు, మా కామ్రేడ్ నెత్తురు
బాంబులూ మిషిన్ గన్నుల కన్నా బలంగా ప్రతిఘటిస్తుంది!
మా పిడికిళ్లు మళ్లీ దెబ్బకు దెబ్బ తీస్తాయి!

ఈ దారుణాన్ని పాడడం ఎంత కష్టం.
నేను బతుకుతున్న ఈ దారుణం,
నేను మరణిస్తున్న ఈ దారుణం.
నా పాట నిశ్శబ్దమై, కేకలై ముగిసే
ఈ అనంతమైన క్షణాలలో నన్ను నేను చూసుకోవడం ఎంత కష్టం.
నేనిప్పుడు చూస్తున్నది, మునుపెన్నడూ కనలేదు
నా అనుభవాలూ, అనుభూతులన్నీ
నిజమైన ఆ క్షణానికి జన్మనిస్తాయి…

కాపలా కాస్తున్న సైనికులు తనను తీసుకెళ్లడానికి వస్తుంటే ఆ కాగితాన్ని పక్కనే ఉన్న ఖైదీకి అందించగా అతను తన సాక్సులో దాచిపెట్టుకున్నాడు. ఆ పాటను కాపాడడానికి అక్కడున్న స్నేహితులందరూ తలా ఒక చరణాన్ని కంఠస్తం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో విక్టర్ ను ఒక సైనికాధికారి అందరికీ కనబడేట్టు చితకబాదడం మొదలుపెట్టాడు. రైఫిల్ తో కసిగా బాది అతని చేతులను, మణికట్లను విరగ్గొట్టాడు. గిటార్ సంగీతంతో ప్రజల మనసుల్ని మీటిన అతని వేళ్ళు విరిగి వేళ్లాడుతున్నాయి. స్టేడియంలో ఉన్న వేలమంది జనం ఒక్కసారిగా హాహాకారాలు. ‘ఇప్పుడు పాడురా, ఎట్లా పాడుతావో చూస్తా” అని సైనికాధికారి అరిచాడు. తన రక్తంలో ప్రవహించే ధిక్కారంతో విక్టర్ గొంతెత్తాడు. ‘Venceremos, Venceremos’ (జయం మనదే, జయం మనదే) అని పాట పాడుతుండగా తలపై మరో రైఫిల్ దెబ్బ పడింది. జనసంద్రాన్ని హోరెత్తించిన అతని గొంతు అర్థాంతరంగా ఆగిపోయింది.

మరుసటి రోజు పొద్దున, రోడ్డుపై బుల్లెట్ గాయాలతో ఛిద్రమయిపోయిన హారా శవం. కష్టజీవుల ముఖాలపై చిరునవ్వుల కలలు కన్న అతని శరీరం నిర్జీవంగా పడి ఉంది. స్థానిక ప్రజలు అతన్ని గుర్తించి ఏమి చేద్దామని ఆలోచించుకునేలోపు సైనిక బలగాలు అక్కడున్న శవాలను మార్చురీకి తరలించాయి. అనామకంగా అదృశ్యం అయిపోవలసిన హారాను మళ్ళీ మార్చురీలో ఒకతను గుర్తు పట్టి అతని భార్యకు తెలియజేశాడు. ఆమె మార్చురీలోని వందల శవాల్లో నుండి విక్టర్ శవాన్ని తీసుకొని పక్కనే ఉన్న శ్మశానంలో రహస్యంగా పూడ్చిపెట్టి దేశం వదిలి పారిపోయింది.

***

ప్రజల పాటలు గొంతెత్తి పాడి, వాళ్లకోసం ప్రాణాలర్పించిన ప్రజాగాయకుడు విక్టర్ హారా పూర్తి పేరు విక్టర్ లిడియో హారా మార్టినేజ్. చిలే లోని లాంక్వెన్ (Lonquen) అనే చిన్న పట్టణంలో, 1932, సెప్టెంబర్ 23 న పుట్టాడు. అతని తల్లిదండ్రులిద్దరూ రైతు కూలీలు. హారా ఆరేండ్ల వయసు నుండే పొలంలో కూలి పని, కట్టలు కొట్టే పని చేయవలసి వచ్చింది. దుర్భరమైన బీదరికం, తండ్రి మనువెల్ (Manuel) తాగుడు ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేశాయి. తల్లి అమాండా (Amanda) గిటారు పట్టుకొని జానపదాలు పాడడం తప్ప విక్టర్ కు బాల్యంలో మంచి జ్ఞాపకాలేమీ లేవు. హారా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. తల్లే పిల్లలను పెంచింది. కుటుంబం ఎన్ని కష్టాలు ఎదురుకున్నా తల్లి పట్టుబట్టి పిల్లలను చదివించింది. ఊరిలో బతకలేక తల్లి పిల్లలను తీసుకొని చిలే రాజధాని అయిన శాంటియాగోకు వలస వెళ్లింది. కడు బీదరికం అనుభవించిన విక్టర్ ప్రపంచంలో ఉన్న పేదరికం, దోపిడీని తన పాటల్లో వ్యక్తపరచడానికి తహతహలాడాడు. తన జీవితం నుండే కాక, తరచూ పల్లెటూర్లు, మురికివాడలు తిరిగి ప్రజల బాధలను, హీనస్థితులను తెలుసుకొని వాటి గురించి రాశాడు. ఈ పాటలో తన తల్లిదండ్రుల గురించి చెప్తూనే పల్లె జీవితాలను ఆవిష్కరించాడు.

“మా నాన్న మొహమంటే నాకు గుర్తొచ్చేదొక గోడ మీది కంత,
బురద మరకల దుప్పట్లు
దుఃఖంతో వేదనతో అరుపులతో
ఆరుగాలం పనిచేస్తుండే మా అమ్మా” (అనువాదం: ఎన్. వేణుగోపాల్)

ఇంకో పాటలో ఇట్లా అంటాడు…

“నాగలి గట్టిగా చేత పట్టి
భూమిని పెకిలిస్తాను నేను
ఏండ్లకేండ్లు శ్రమపడ్డా
అలుపెందుకు లేదు నాకు?
సీతాకోకచిలుకలు ఎగురుతాయి, కీచురాళ్లు పాడుతాయి,
ఎండలో కమిలి కమిలి నా చర్మం నల్లబడుతుంది
అంతులేకుండా భూమిని దున్నుతుంటే
నా చర్మం మీంచి జారి చెమట చుక్కలు చాళ్లలో ఇంకుతాయి”

రోజూ రెండు మూడు ఉద్యోగాలు చేసే వాళ్ల అమ్మ, విక్టర్ కు ఎక్కువ కనిపించేది కూడా కాదు. పిల్లలకోసమే జీవితమంతా పగలనక రేయనక కష్టపడిన తల్లి అమాండా, విక్టర్ 15 ఏండ్ల వయసులోనే చనిపోయింది. తల్లి మరణంతో తీవ్రంగా కలత చెందిన హారా చర్చ్ ఫాదర్ ను ఆశ్రయించాడు. అతను హారాను ప్రీస్టుగా శిక్షణ కొరకు క్రిస్టియన్ సెమినరీ లో చేరమని ప్రోత్సహించాడు. హారా సెమినరీలో కొంత కాలముండి అక్కడ ఇమడలేక సెమినరీ వదిలి వెళ్లిపోయాడు. సెమినరీ వదిలిన పది రోజుల్లోనే సైన్యంలోకి అతన్ని భర్తీ చేసుకున్నారు. సైన్యంలో కొంత కాలం పని చేసి సార్జెంట్ స్థాయికి ఎదిగాడు. సైన్యంలో తన విధులు పూర్తయ్యాక శాంటియాగో తిరిగి వచ్చాడు.

సెమినరీలో విభిన్నమైన, లోతైన ప్రేమ దొరుకుతుందని ఆశపడి భంగపడ్డ హారా, తర్వాత కాలంలో ఒక పాటలో ఇట్లా రాశాడు.

“దేవదూతల ప్రతిమలు పట్టుకుని
తమ బాధలు దిగమింగేలా
పేదరికాన్ని మరిచిపోయేలా
వాళ్లు పేదవాళ్లను భయపెడతారు.” (అనువాదం: ఎన్. వేణుగోపాల్)

చిలే యూనివర్సిటీలో ఒక గాయక బృందానికి ఆడిషన్ చేయడంతో విక్టర్ కళాజీవితం మొదలయింది. ఆ బృందంతో కలిసి హారా చిలే ఉత్తర భాగమంతా పర్యటించి ఆ ప్రాంతంలోని జానపదాల గురించి తెలుసుకున్నాడు. తర్వాత చిలే యూనివర్సిటీ డ్రామా కోర్సులో చేరి ఎన్నో డ్రామాల్లో నటించాడు. సహజంగానే సామాజిక నేపథ్యం ఉన్న నాటకాలు అతనికి ఆసక్తిని కలిగించాయి. నిరుపేద వర్గాల దుర్భర జీవితాలకు అద్దం పట్టే మాక్సిం గోర్కీ రచించిన ‘ది లోవర్ డెప్త్స్’ అనే నాటకంలో నటించాడు.

హారా 1950 లలో కలిసిన ఇద్దరు స్త్రీలు అతని జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారు. ఒకరు ఇంగ్లండ్ కు చెందిన నర్తకి జోన్ టర్నర్ బన్‌స్టర్ (Joan Turner Bunster). హారా ఆమెతో ప్రేమలో పడి 1965 లో పెళ్లి చేసుకున్నాడు. జోన్ కు అది రెండో పెళ్లి. మొదటి భర్తతో ఆమెకున్న బిడ్డ మనువెలా, వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ అమాండాను విక్టర్ ఎంతో గారాబంగా చూసుకున్నాడు. జోన్ విక్టర్ తో పాటు సోషలిస్ట్ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. అతను బతికున్నంత కాలం అతనికి జీవిత సహచరిగానే కాక ఉద్యమ సహచరిగా ఉన్నది. అతను మరణించిన తరువాత ఫాసిస్ట్ ప్రభుత్వం నుండి అతని పాటల రికార్డులను కాపాడడం దగ్గర నుండి అతన్ని చంపిన సైనికాధికారులకు శిక్ష పడాలని అలుపెరుగని పోరాటం చేసింది.

రెండో వ్యక్తి 1957 లో కలిసిన జానపద గాయకురాలు వయొలెటా పార్రా (Violeta Parra). జానపదాలను ఆధునిక చిలేవాసుల జీవితాల్లోకి తీసుకువచ్చిన ఆమె కొత్త ప్రయత్నం హారాను చాలా ప్రభావితం చేసింది. ఆమె స్థాపించిన మ్యూజికల్ కమ్యూనిటీ సెంటర్ లలో హారా చురుకుగా పాల్గొన్నాడు. జానపద సంగీతాన్ని అధ్యయనం చేస్తూనే ఆయన నాటక దర్శకునిగా పనిచేశాడు. పదునైన రాజకీయ విషయాలతో కూడిన నాటకాలకు దర్శకత్వం వహించాడు. కాలక్రమేణా అతను పాటపై ఎక్కువ దృష్టి సారించాడు. వయొలెటా పార్రా ప్రేరణతో పాటలు రాయడం మొదలుపెట్టాడు. ప్రజల జీవితాలను జానపద సంగీతంతో మేళవించాడు. అదే కాలంలో అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో తెర మీదకు వచ్చిన ‘Nueva Concion’ (కొత్త పాట) ను ప్రజల్లోకి తీసుకువెళ్లాడు.

1960 ల చివర్లో, విక్టర్ పాటలు పదునెక్కి, అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించాయి. ఆ కాలంలో విక్టర్ ఇట్లా రాశాడు. ‘అమెరికా సామ్రాజ్యవాదానికి సంగీతం అనే మాధ్యమంలో ఉన్న మాయాజాలం గురించి తెలుసు. అందుకే అది మన యువతను అర్థం లేని వ్యాపార సంగీతంలో ముంచెత్తుతుంది. ‘నిరసన సంగీతం’ అనేదాన్ని వ్యాపారీకరించి, నిరసన సంగీతకారులలో ‘ఆరాధ్య కళాకారులను’ అదే తయారుచేస్తుంది. వాళ్లు మిగిలిన కళాకారులకు భిన్నంగా ఏమీ ఉండరు. కొంత కాలం ప్రతిఘటించి వాళ్ళు మాయమవుతారు. ఆ మధ్యకాలంలో, యువతలో సహజంగా ఉండే తిరుగుబాటు తత్వాన్ని నీరుగారుస్తారు. అందుకే ‘నిరసన గీతం’ (protest song) అనే పదం నాకు ఆమోదయోగ్యంగా లేదు. నా వరకు నేను ‘విప్లవ గీతం’ (revolutionary song) అనే పదాన్ని వాడడం ఇష్టపడుతాను.’

“I remember you, Amanda” అనే ఈ పాటలో విక్టర్ ఒక ఫ్యాక్టరీ కార్మికుని జీవితంలోని ప్రేమని, పోరాటాన్ని ఎంతో సున్నితంగా కళ్ళకు కడతాడు.

నువ్వు గుర్తున్నావు, అమాండా,
ఆ తడి వీధి, మనువెల్ పనిచేసే ఫాక్టరీకి పరుగెడుతూ నువ్వు.
నీ అందమైన నవ్వు, నీ శిరోజాలపై రాలుతున్న వాన చినుకులు,
అతన్ని ఎలాగైనా కలిసి తీరాలని నువ్వు
అతను, ఆ అయిదు నిమిషాలు,
ఆ అయిదు నిమిషాల్లో శాశ్వతమైన జీవితం
పనికి తిరిగి రమ్మని మోగుతోన్న సైరన్
నువ్వేమో అడుగడుగునా వెలుగులని వెదజల్లుతావు
ఆ ఐదు నిమిషాల్లో నువ్వు వికసిస్తావు.

నువ్వు గుర్తున్నావు, అమాండా,
ఆ తడి వీధి, మనువెల్ పనిచేసే ఫాక్టరీకి పరుగెడుతూ నువ్వు.
నీ అందమైన నవ్వు, నీ శిరోజాలపై రాలుతున్న వాన చినుకులు,
అతన్ని ఎలాగైనా కలిసి తీరాలని నువ్వు
అతను, చీమకు కూడా హాని చేయని అతను
కొండల్లోకి వెళ్లిపోయిన అతను
అయిదు నిమిషాల్లో అతను ధ్వంసమైపోయాడు
పనికి తిరిగి రమ్మని మోగుతోన్న సైరన్
చాలా మంది తిరిగి రాలేదు, మనువెల్ కూడా రాలేదు.

చిలేలో 1968లో కార్మికులు, రైతుల పిల్లలకు యూనివర్సిటీ చదువులు అందాలని విద్యార్థులు ఉద్యమం చేశారు. అప్పుడు జరిగిన అనేక ధర్నాల్లో Nueva Canción Cilena (చిలే కొత్త పాట) కు విద్యార్థులనుండి విశేష ఆదరణ లభించింది. ఆ తర్వాత విద్యార్థి ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలతో మమేకమైనప్పుడు, Nueva Canción Cilena కార్మికులను చేరింది.

చిలే సమాజంలో అనాదిగా సామ్రాజ్యవాదంతో పాటు, భూమి సమస్యనే ప్రధానమైన సమస్య. స్పెయిన్ 16 వ శతాబ్దంలో చిలే దేశంపై దండెత్తి దాన్ని వలసరాజ్యంగా మార్చుకుంది. ఆదివాసీలను ఊచకోత కోస్తూ వాళ్ళ భూములను ఆక్రమించుకున్న స్పెయిన్ జాతీయులు అక్కడి భూస్వాములయ్యారు. స్థానిక ఆదివాసీలను నిమ్నజాతిగా చూసే జాత్యహంకారం వాళ్ళకు అనాదిగా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. చిలేలో వందల ఏళ్లుగా సాగుభూమి, భారీ ప్రైవేట్ ఎస్టేట్లుగా విభజించబడి వాళ్ళ చేతుల్లో ఉంది. 1925 జనాభా లెక్కల ప్రకారం, 90% భూమి ఇట్లాంటి ఎస్టేటుల్లోనే ఉంది. ఆకంకాగ్వా (Aconcagua) అనే నదీలోయ ప్రాతంలో 98% భూమి, 3% భూస్వాముల చేతుల్లో ఉన్నది. ఇక 1900-1930లలో అమెరికా కంపనీలు చిలే రాగి, ఉక్కు గనులను కైవసం చేస్కున్నాయి. చిలే ఖనిజ సంపదలను కొల్లగొట్టి, కార్మికవర్గాన్ని దోపిడీ చేసి అపారమైన ధనాన్ని పోగుచేసుకున్నాయి.

పుయెర్తో మాంత్ (Puerto Montt) అనే నగరంలో, 1969 లో నాలుగు వందల మంది భూమిలేని నిరుపేదలు, ఒక భూస్వామికి చెందిన కొంత బురద బీడు భూమిని ఆక్రమించుకున్నారు. దానికి బదులుగా హోమ్ మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు వాళ్ళపై కాల్పులు జరపగా పది మంది చనిపోయారు. అరవైమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడు నెలల చంటిబిడ్డ బాష్పవాయువుతో ఊపిరాడక చనిపోయింది. ప్రజలు కోపోద్రిక్తులై నిరసన ప్రదర్శనలు చేశారు. అలాంటి ఒక పెద్ద నిరసన ప్రదర్శనలో ‘Questions About Puerto Montt’ (పుయెర్తో మాంత్ గురించి ప్రశ్నలు) అనే పాటతో ఉద్యమకారులపై కాల్పులు జరిపించిన మంత్రిపై విక్టర్ ప్రశ్నలు సంధించాడు. ఆ మంత్రి చంపబడడంతో చిలే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

“అడుగుతాను నేనొక మాట
నీ కోసం, నీ కోసం
ఏకాకిగా మిగిలిన ప్రతి ఒక్కరి కోసం
ఎందుకు చనిపోయాడో తెలియని మృతుని కోసం
తాను చనిపోయానని కూడ తెలియని వ్యక్తి కోసం
బతకడానికి ఒక నేల చెక్క కావాలని పోరాడితే
తన చాతీలో వాళ్లు తుపాకి గుళ్లు ఎందుకు దించారో
తెలియని వ్యక్తి కోసం.” (అనువాదం: ఎన్. వేణుగోపాల్)

ప్రజల పాటలు రాయడమే కాకుండా ఉర్రూతలూగించే గానంతో ప్రజలకు దగ్గరయిన హారా, నియంతృత్వ శక్తులకు శత్రువుగా పరిణమించాడు. విక్టర్ అంతకంతకూ సాల్వడార్ అయెండీ నేతృత్వంలోని వామపక్ష ఉద్యమాలతో మమేకం అవ్వడం చిలే సాంప్రదాయవాదులకు మింగుడుపడలేదు. అప్పటికే క్యూబా, సోవియెట్ యూనియన్ పర్యటించి వచ్చిన విక్టర్ చిలే కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. కార్మికుల ఉద్యమాలతో మమేకమవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఫ్యాక్టరీల్లో ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టాడు. పాట విప్లవానికి ఆయుధం అయింది; ఆ ఆయుధం ప్రజలు సొంతం చేసుకున్నారు.

విక్టర్ 1970 లో సాల్వడార్ అయెండీ ‘పాపులర్ యూనిటీ’ పార్టీకి మద్దతుగా ఎన్నో ప్రదర్శనలిచ్చాడు. అయెండీ సోషలిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. భూసంస్కరణలతో పాటు రాగి గనుల వంటి కీలక పరిశ్రమలను జాతీయం చేసింది. సాంస్కృతిక రంగంలో సృజనాత్మకత, ప్రజల జీవితాలకు అద్దం పడుతూ వెల్లివిరిసింది. చరిత్రలో మొదటి సారి బూర్జువా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ద్వారా విప్లవం మొదలయింది. సోషలిజాన్ని శాంతియుతంగా సాధించడం సాధ్యమేననిపించింది చాలా మందికి. బూర్జువావర్గం ‘చట్టబద్దంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి’ తన అధికారాన్ని వదులుకుంటుందని భ్రమపడ్డారు. రాజ్యాధికారం అయెండీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ, నిజమైన అధికారం బూర్జువావర్గం తన చేతుల్లో ఉంచుకుంది. ప్రచారసాధనాలను, రాజ్యాధికారానికి కీలకమైన విభాగాలపై పెత్తనాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకుంది. ఎంత విషప్రచారం చేసినా మధ్యంతర ఎన్నికల్లో అయెండీ పార్టీ గెలవడం సాంప్రదాయవాదులైన ప్రతిపక్షానికి గుండెల్లో దడ పుట్టింది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సోషలిస్ట్ ప్రభుత్వం వస్తుందని నిర్ధారణ కావడంతో అమెరికా సి.ఐ.ఎ (Central Intelligence Agency) సహాయంతో సైనిక దాడికి పథకం రచించింది. యూనియన్ పిలుపు మేరకు కార్యాలయాలు, కర్మాగారాలకు చేరుకున్న ప్రజలను సైన్యం విచక్షణ లేకుండా అరెస్ట్ లు, హత్యలు చేసింది. సైనిక దాడి మొదటి కొన్ని రోజుల్లోనే మొత్తం దేశంలో ఇరవై ముప్పై వేల మందిని చంపారు.

విక్టర్ హారా సోషలిస్ట్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎంత చురుకుగా సాంస్కృతికోద్యమంలో పాల్గొన్నాడో అధికారం లోకి వచ్చాక అంతకన్నా ఎక్కువ కృషి చేశాడు. మారుమూల గ్రామాలు పర్యటించి వాళ్ళ కథలను విని, పాటలుగా మార్చాడు. వర్క్‌షాప్ లతో ప్రజల సృజనాత్మకతను ప్రోత్సహించాడు. ప్రజల సాంస్కృతిక మూలాలను వాళ్ళకు తిరిగి ఇవ్వాలని నమ్మాడు. ‘నమ్మింది పాడుతూ ప్రాణాలర్పించే మనిషి రక్తనాళాల్లో పోటెత్తే పాటే సార్థకమైనది’ అన్న విక్టర్ హారా తను నమ్మిన ఆశయాల కోసం ప్రాణాలర్పించి తన పాటను సార్థకం చేసుకున్నాడు.

చిలే 1973 నుండి 1990 వరకు పినోషె (Pinochet) సైనిక నియంతృత్వ పాలనలో ఉంది. మళ్ళీ 2006 లో సోషలిస్ట్ పార్టీకి చెందిన మిషెల్ బాషెలే (Michelle Bachelet), చిలే మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయింది. విక్టర్ హత్య జరిగిన 39 ఏండ్ల తర్వాత ఆయన హత్య కేసులో ఎనిమిది మంది సైనికాధికారులపై విచారణ ప్రారంభించారు.

***

Dec 3, 2009, శాంటియాగో

శాంటియాగో వీధుల్లో రెపరెపలాడుతున్న వేలాది ఎర్ర జెండాలు. విక్టర్ హారా శవపేటికను సందర్శించడానికి బారులు తీరిన వేలమంది ప్రజలు. హంతకులను శిక్షించడానికి పాతిపెట్టిన ఆయన శవాన్ని పోస్ట్ మార్టం కోసం వెలికితీసినపుడు ఆయనకు గౌరవప్రదమైన వీడ్కోలు పలకడానికి వచ్చిన తల్లులు, పిల్లలు, యువకులు, వృద్ధులు. ఆయన శవం విసిరేయబడిన వీధుల్లో గోడల మీద విక్టర్ నిలువెత్తు చిత్రాలు. ఆయన నిషేధించబడిన నగరంలో అందరి చేతుల్లో విక్టర్ ఫోటోలున్న పోస్టర్లు. ఆయన జీవితాన్ని వేడుకగా జరుపుకుంటూ నృత్యాలు. ఆయన ఆచరణనూ, ప్రాణత్యాగాన్నీ స్మరించుకుంటూ అశ్రునయనాలు. ఛిద్రం చేయబడిన విక్టర్ చేతుల నుండి సంగీతాన్ని అందిపుచ్చుకున్న గిటార్ వాయిద్యాలు. నొక్కివేయబడిన విక్టర్ గొంతు నుండి ప్రాణం పోసుకున్న ధిక్కార గీతాలు. ఆపివేయబడిన ఆయన శ్వాస నుండి ఊపిరిపోసుకున్న స్వేచ్ఛా వాయువులు. ప్రజల కోసం గొంతెత్తిన మనిషినెప్పుడూ ప్రజలు మరిచిపోరని ఆ ఊరేగింపు మళ్లీ నిరూపించింది. విక్టర్ వేళ్ళ చివర్లలోని రక్తచలన సంగీతాలకు అంతం లేదు. అతని నరాల్లో పోటెత్తిన సంగీత ఝరులకు ముగింపు లేదు. విక్టర్ హారాకు మరణం లేదు.

(‘చిలే స్టేడియం’, ‘నువ్వు నాకు గుర్తున్నావు, అమాండా’ కవితలు అనువాదం – చైతన్య చెక్కిళ్ల, శివరాత్రి సుధాకర్)

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

20 thoughts on “ప్రజల కోసం ప్రాణమిచ్చిన పాట… విక్టర్ హారా

  1. Excellent introduction to a great poet warrior Victor Jara. Great translations… ! Very relevant!!

  2. Great write-up.

    జనం తెలుసుకోవలసిన మనిషి.

  3. చాలా గొప్పగా రాసావు చైతన్యా! చాలా వివరంగా చిలే చరిత్ర, విక్టర్ హారా జీవితాన్ని రోమాంచిత కథనంతో చెప్పినందుకు ధన్యవాదాలు. ఎన్నికల ప్రజాస్వామ్యమెంత నిష్ప్రయోజనమో, బూటకమో మనకి అంతర్జాతీయంగా చిలే, మన దేశంలో కేరళ, బెంగాల్ నిరూపించాయి. వ్యాసానికి అనుగుణంగా ఫోటోలు, వీడియో పెట్టడం చాలా బాగుంది.

    1. Thank you, bheemsingh! Idi mottam okka article anuvadam kadu. Chala chotla nundi samacharam sekarinchi rasanu.

  4. Beautifully written
    Keep up the Good Work

    ఒకరు శూన్యంలోకి దూకితే,
    గోడకు తల బాదుకుంటూ మరొకరు,
    అందరి కళ్లలో అదే గడ్డకట్టిన చావుకళ.

    Too bad history doesn’t stop repeating.

  5. చాలా ఉపయోగకరమైనది.

  6. అద్భుతం. 03’Dec 2009న శాంటియాగోలో జరిగిన ప్రదర్శన క్లిపంగ్ దొరికితే ( if it is available u would have added) జతచేస వుంటె ఇంకా రోమాంచితంగ వుండేది. Marvel… heart touching.

  7. How inspiring and relevant to current situation back home. Thanks akka and Kolimi for this platform and introducing this great revolutionary personality. Victor Jara is an inspiration and will always be alive.
    Very well written, I was with him in Chile the whole time.

  8. అద్భుతమైన పోరాట గాథని గొప్పగా అందించారు.అతని పాటలు వింటూ ఉంటే ఎంత ఉత్తేజం గా ఉందో…

Leave a Reply