గుండె తడిని ఆవిష్కరించడమే కవిత్వం: వింధ్యవాసినీ దేవి

(ఆమె… ‘ఉస్మానియా’ శిగన మెరిసిన తంగేడు పువ్వు. తన అక్షరాలకు గుండె తడినద్దే నదీ ప్రవాహం. అంతరంగంలో కురిసే చినుకులన్నీ తడిసి మెరిసే ‘నానీల సింగిడి’. ఆమె గొంతులో మత్తడై దుంకే తెలంగాణం. అప్పులు తీరక ఉరితాళ్లకు వేలాడే రైతన్నల బతుకుల్ని, కూలీల వెతల్నీ, మహిళల దుస్థితినీ చూసి తల్లడిల్లే సున్నిత హృదయి. మనుషుల మధ్య నిలువెల్లా మొలిచిన మార్కెట్ సర్ప బంధాలను చూసి కలతచెందే మానవి. పతనమైపోతున్న మానవ సంబంధాల్ని, మమతల్ని కాపాడుకోవాలని తపించే మనిషి. వర్ధమాన రచయిత్రి, కవయిత్రి వింధ్యవాసినీ దేవితో ‘కొలిమి’ సంభాషణ.)

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని తొర్రూరు నేను పుట్టి పెరిగిన గ్రామం. నాన్న వి.ఆర్. యాదవేంద్రారెడ్డి. తెలుగు ఉపాధ్యాయుడు. అమ్మ వి. రోహిణి, గృహిణి. అక్క ఇందిరాప్రియదర్శిని(అకాల మరణం). తమ్ముడు రామకృష్ణారెడ్డి. ఎనిదవ తరగతి వరకు మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. తొమ్మిదవ తరగతి మా నాన్న పనిచేసే ప్రభుత్వ పాఠశాల సరూర్ నగర్ లోనూ, పదవ తరగతి చంపాపేట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్మీడియేట్ ప్రయివేటుగా చదివాను. డిగ్రీ దూరవిద్యా విధానంలో పూర్తిచేశాను. ఎం.ఎ తెలుగు కోఠి మహిళా కళాశాలలో పూర్తి చేశాను. బాల వ్యాకరణంలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నందుకు ఆచార్య దివాకర్ల వెంకటావధాని మెమోరియల్ గోల్డ్ మెడల్ పొందాను. తెలుగు పండితశిక్షణ (టి.పి.టి) ఐ.ఎ.ఎస్.సి. మాసబ్ ట్యాంక్ లో చదివాను. ఎం.ఫిల్ తెలంగాణ సాయుధ పోరాటం-బందూక్ నవలానుశీలన అంశంపై ఆచార్య పాల్వాయి సుమతీ నరేంద్ర గారి పర్యవేక్షణలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాను. కందిమళ్ళ ప్రతాపరెడ్డి జీవితం – సాహిత్యం అంశంపై Ph.D పరిశోధన ముగింపు దశలో ఉంది. చదువు మీద ఆసక్తితో దూరవిద్యా విధానంలో జర్నలిజంలో పీజీ ఎం.సి.జె, అలాగే ఎం.ఎ సంస్కృతం చేశాను. జాతీయ అర్హత పరీక్ష(NET)లో ఉత్తీర్ణత పొందాను. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేసాను. పరిశోధన పట్ల ఆసక్తితో ‘’తెలంగాణా దేవాలయాలు – చరిత్ర సంస్కృతీ, సాహిత్యం‘’ అనే అంశంపై యూ.జి.సి మైనర్ రిసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను.

మీకు సాహిత్యం ఎట్లా పరిచయమైంది?

మా నాన్న ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు. పుస్తక ప్రేమికుడు కావడంతో ఇంటిని ఒక గ్రంథాలయంగా మార్చుకున్నారు. నాకు ఊహ తెలిసేనాటికి పుస్తకం నా నేస్తమయ్యింది. పుస్తకాలే ఆట బొమ్మలుగా పెరిగాను. నా చుట్టూ పరచుకున్న పుస్తకాలే నాకు ప్రపంచాన్ని పరిచయం చేసాయి. అనివార్యంగానే పుస్తకాలు నాపై ఎనలేని ప్రభావాన్ని చూపించాయి. మా నాన్న సాహిత్య ప్రేమికుడు కావడంవల్ల అనివార్యంగానే నాకు సాహిత్యం పట్ల ఇష్టం పెరిగింది. చిన్నపుడు మా నాన్న తెలుగు పద్యాలు చదువుతూ మా చేత కూడా పద్యాలు చదివించేవారు. మేము పద్యాలు చదువుతుంటే టేప్ రికార్డర్లో రికార్డు చేసేవారు. సాహిత్యమే అన్నింటికంటే విలువైనదన్న స్పృహ చిన్నప్పుడే కలిగింది. ఇంటికి వచ్చిన ప్రతి పుస్తకాన్ని అది అర్థం అయినా కాకపోయినా చదవడం అనేది ఒక తప్పనిసరి పని అన్నట్టు చదివేవాళ్ళం నేను మా అక్క. అలా నాతో పాటూ సాహిత్యాభిలాష కూడా పెరుగుతూ వచ్చింది .

ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో ఉన్నప్పుడే గొప్ప సాహితీవేత్తల సాహిత్యాన్ని చదివాను. ఆ వయస్సులో వాటి లోతుపాతులు అర్థం కాకున్నా చదివేదాన్ని. శ్రీ శ్రీ మహా ప్రస్థానం, విశ్వనాథ వేయిపడగలు, గోపీచంద్ నవలలు, మాలపల్లి, గోర్కి అమ్మ నవల వంటి ఉత్తమ సాహిత్యం చదవటం ఈనాటికీ ఒక మధురానుభూతి కలిగిస్తుంది. ఇవే కాకుండా ఆదివారం అనుబంధాలు, సోవియట్ లాండ్, ఇండియాటుడే, చతుర, విపుల, రచన సాహిత్య పత్రిక మొదలైన వాటిని విరివిగా చదివే అవకాశం లభించింది. అలా నా జీవితంలో పుస్తకాలు ఒక భాగమయ్యాయి. పుస్తక పఠనం నాకు సంస్కారాన్నిచ్చింది. శరీరానికి ప్రాణ వాయువు ఎంత అవసరమో మనసుకు సాహిత్యం అంత అవసరం. ప్రాణ వాయువు శరీరానికి చైతన్యం అందిస్తే, సాహిత్యం మనసును చైతన్యపరుస్తుంది. వ్యక్తి నిత్య చైతన్యశీలంగా ఉండేందుకు సాహిత్యం తోడ్పడుతుంది. సాహిత్యాన్ని ప్రేమించగలిగిన వ్యక్తి మనుషులను ప్రేమిస్తాడు. సాటి మనుషులను ప్రేమించగలిగిన వ్యక్తి మహనీయుడవుతాడు.

మీరు చదివిన మొదటి నవల – కథ – కవిత్వం?

గుర్తున్నంత వరకు నేను చదివిన మొదటి నవల కొడవటిగంటి కుటుంబ రావు గారి ‘చదువు’. ఎందుకోగాని నవల ముఖచిత్రం చిన్నప్పుడు బాగా ఆకర్షించేది. వారపత్రికలో వచ్చే ప్రతి కథ చదివేదాన్ని. ఏ కథ మొదట చదివానన్నది గుర్తు లేదు. కవిత్వం విషయానికొస్తే శ్రీ శ్రీ ‘కవితా ఓ కవితా’ నాకు చాలా ఇష్టమైనది. చిన్నప్పుడు నేను, మా అక్క ఆ కవిత ను కంఠతా పట్టాము కూడా.

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాహిత్యం ఏది? మీ రచనల నేపథ్యం ఏమిటి?

సాహిత్యానికి సరిహద్దులు లేవు. విస్తృతమైన కాన్వాస్ సాహిత్యానిది. మససును కదిలించే సాహిత్యం, మనిషిని ఉన్నతీకరించే సాహిత్యం రాసే ప్రతి కవిని, రచయితను అభిమానిస్తాను. లబ్ధ ప్రతిష్టులైన సాహితీవేత్తల నుండి కొత్తగా రాస్తున్న వర్థమాన రచయితల వరకు అందరి రచనలను చదువుతాను. వారి నుంచి ప్రేరణ పొందుతాను. సాహిత్య ప్రక్రియలన్నింటిలో నాకు బాగా ఇష్టమైనది కవిత్వం. కవిత్వం మనసు తడిగా ఉండేందుకు ఒక ఔషధం అని నా అభిప్రాయం. కవిత్వం రాయడమంటే గుండె తడిని ఆవిష్కరించడమేననుకుంటాను. జీవితంలోంచి పొంగుకొచ్చేది ఉత్తమ కవిత్వం. అటువంటి కవిత్వమే శాశ్వతత్వాన్ని పొందుతుంది.

శ్రీశ్రీ, తిలక్, జాషువా, సి.నా.రే, గోపి సర్ కవిత్వమంటే చాలా ఇష్టం. కవిత్వరచనలో ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను. అనేక రూపాల్లో వ్యక్తమయ్యే కవిత్వంలో నాకు చాలా ఇష్టమైనది నానీలు. నానీల్లో ఉండేది నాలుగు పాదాలే. కానీ జీవిత సారాన్నంతా ఇమిడ్చవచ్చు. దీర్ఘ కవితలు చదివే తీరికలేని ఆధునిక తరానికి లఘు కవితల ద్వారా కవిత్వాన్ని అందించవచ్చు అన్నది నా అభిప్రాయం. నేను నా అనుభవంలోని విషయాలనే కవిత్వంగా మలుస్తుంటాను. నన్ను కదిలించిన సంఘటనలు, కన్నీళ్లు తెప్పించిన విషయాలనే ఎక్కువగా కవిత్వంగా రాస్తుంటాను. అప్పటికప్పుడు ఆశువుగా కవిత్వం రాయలేను. ఒక విషయం మనసును కలిచివేసినప్పుడు, ఇక ఆ విషయం మనసులో నిలబడనప్పుడు మాత్రమే కవిత్వం రాస్తాను. అందుకే నేను రాసిన కవిత్వం చాలా తక్కువ. కానీ గాఢతతో నిండిన కవిత్వం రాస్తానని మిత్రులంటారు.

మీరిప్పటిదాకా చదివిన సాహిత్యంలో మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన పాత్రలు?

చాలా ఉన్నాయి. ప్రతి పాత్ర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాను. సాహిత్యంలో పాత్రలు నిజ జీవితంలో వ్యక్తులు గానే కనిపిస్తారు నాకు. గురజాడ – కమలినీ, కేశవరెడ్డి – మునెమ్మ, ఓల్గా – అరుణ

ఎప్పటి నుంచి రాస్తున్నారు?

చిన్నప్పటి నుంచి సాహిత్యమే నా ప్రపంచం. చదవటం తప్ప వేరే వ్యాపకాలేమీ లేవు. కొత్త పుస్తకాలు చదివినప్పుడల్లా రాయాలన్న ఉబలాటం కలిగేది. చతుర వంటి నవలలు చదవటంవల్ల నవల రాయాలని ఇంటర్ లో ఉన్నప్పుడు ప్రయత్నం చేసా. తర్వాత అది నాకే బాగనిపించక ఆ ప్రయత్నం మానుకున్న. చిన్న కథలు, కవితలు రాసుకునేదాన్ని. ఎవరికీ చూపించక నేను మాత్రమే చదువుకునేదాన్ని. రాయడానికి నేను చేసిన తొలి ప్రయత్నాలవి. అప్పుడు నా ప్రపంచం చాలా చిన్నది. ఇల్లు తప్ప ఇతర విషయాలు తెలియదు. సామాజిక అవగాహన లేదప్పుడు. ఎమ్మేలో చేరిన తర్వాత మొదటిసారి నా రచనలను ఆచార్యులకు చూపించడం, వారు మెచ్చుకోవడంతో నేను కూడా రాయగలనన్ననమ్మకం కలిగింది. కాలేజ్ లో జరిగే కార్యక్రమాలలో కవితలు రాసి చదవడం మొదలుపెట్టాను.

మీ తొలి రచన ఏది? దానికి నేపథ్యం? మీ వృత్తికి, రచనకు ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు?

నేను డిగ్రీ, పీజీ చదివేటప్పుడు కథలు, కవితలు రాసే ప్రయత్నం చేసాను. కానీ వాటిని ఎప్పుడూ పత్రికలకు పంపలేదు. అప్పట్లో నాకు అవగాహన లేకపోవడమే కారణం. బాల కార్మికుల జీవితలను నేపథ్యంగా తీసుకొని ఎం.ఎ చదివేటప్పుడు తొలి కథ(అముద్రితం)రాసాను. కుటుంబ పరిస్థితుల వల్ల చదువుకు దూరమై పనులు చేసుకుంటూ జీవితాలను భారంగా గడిపే పిల్లలను చదివిస్తే కలిగే ప్రయోజనాలను చర్చిస్తూ ఈ కథ రాసాను. ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడిన నా తొలి వచన కవిత మాత్రం ‘’ రైతన్నను ఆడుకుందాం’’. ప్రపంచానికి అన్నం పెట్టె రైతున్న తాను తినడానికి నాలుగు మెతుకులు లేక ఆత్మహత్య చేసుకోవడం గురించి పేపర్లో చదివినప్పుడు ఆ విషయం ఎంతో కలచివేసింది. వారం రోజులపాటు తీవ్ర మైన దుఃఖం వెంటాడింది. ఏదో తప్పుచేస్తున్నామన్న సంఘర్షణ అలుముకుంది. ఎంత దారుణమైన సమాజంలో మనమున్నామనిపించింది. రైతును బతికించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఆలోచనే ఈ కవితకు నేపథ్యం.

వృత్తికి, ప్రవృత్తికి సమన్వయం చేసుకోవడంలో నేనెప్పుడూ ఓడిపోతుంటాను. రెండింటికీ సమన్వయం కుదరకనే రచనలు చేయడంలో వెనుకబడ్డాను.

రాయడంలో ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా?

ఇబ్బందులు ఎదురవుతాయోమోనన్న ఆలోచనతో రాయకుండా ఉన్న విషయాలు చాలా ఉన్నాయి.

మీకు బాగా గుర్తింపు తీసుకువచ్చిన రచన ఏది? అది ఏ సందర్భంలో రాసారు?

ఈ మధ్య కాలంలోనే ప్రచురించిన తొలి పుస్తకం ‘నానీల సింగిడి’. మంచి గుర్తింపునిచ్చింది. ఎంతో సంతృప్తినిచ్చిన రచన అది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఇప్పటి వరకు నాలుగైదు సమీక్షా వ్యాసాలు వచ్చాయి. విభిన్న భావాల వ్యక్తీకరణ ఇది. ప్రత్యేక సందర్భం అంటూ ఏమీలేదు.

మీ సాహిత్య దృక్పథాన్ని ఎవరు ప్రభావితం చేసారు? .

ఏది రాసినా అభ్యుదయ, మానవీయ దృక్పథంతో రాస్తాను. ఏ విషయమైనా, సంఘటనలైనా మానవీయ కోణంలోనే స్పందిస్తాను. ఆలోచిస్తాను. సమస్త కళలకు మానవుడే లక్ష్యం. నా చుట్టూ పరుచుకున్న మానవ జీవితమే నా ఆలోచనలకు, ఊహలకు ప్రేరణ. మానవ ప్రగతికి, చైతన్యానికి సాహిత్యం చేయూతనివ్వాలి అని నా భావన. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పౌరశాస్త్రంలో భాగంగా చదివిన ఫ్రెంచ్ విప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం , సౌభ్రాతృత్వం నన్ను అమితంగా ప్రభావితం చేశాయి. వ్యక్తిగా నాకొక దృక్పథం ఏర్పడింది ఇక్కడే.

మీ రచనలకు ప్రేరణ?

నా చుట్టూ ఉన్న పరిస్థితులే ఏదైనా రాయడానికి ప్రేరణ.

మీరెందుకు రాస్తున్నారు? రచయితగా మీ లక్ష్యం ఏమిటి?

నా భావాలను, ఆలోచనలను నలుగురితో పంచుకుందామని రాస్తున్న. నాకు తెలిసింది ఇతరులకు చెప్పాలన్న ప్రయత్నమే తప్ప పెద్ద రచయిత్రినేమీ కాదు. నా జ్ఞానం చాలా పరిమితం. నా అనుభవ వైశాల్యపరిధి చాలా తక్కువ. నేను నేర్చుకోవలసింది ఎంతో ఉంది. నన్ను నేను ఖాళీ చేసుకునేందుకు రాస్తున్నాను అనుకుంటున్నాను.

మీ జీవితానుభవాలు మీ రచనల్లో ఎట్లా ప్రతిబింబిస్తాయి?

నా చుట్టూ పరచుకున్న సమాజ జీవితమే నా రచనలకు ప్రేరణ. ఎక్కువగా స్పందించేతత్త్వం కారణంగా ఒక్కోసారి వ్యక్తిగత అనుభవాలను కవిత్వంగా మలుస్తుంటాను. నాలో అలజడి రేపిన ప్రతి సందర్భాన్ని అక్షరీకరించే ప్రయత్నం చేస్తాను.

మీ రచనా వస్తువులేమిటి? అవి ఎట్లా ఎంచుకుంటారు? మీ రచనలు తొలి నాటి నుండి ఇప్పటికి ఎట్లా పరిణామం చెందాయి?

సామాజిక సమస్యలు, స్త్రీల సమస్యలు, ముడుచుకుంటున్న మానవ సంబంధాలు… ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇది అది అని ప్రత్యేకంగా చెప్పలేను, కానీ ఏదైనా నన్ను బాగా స్పందింపజేసిన విషయాలే రాస్తుంటాను. ప్రత్యేకంగా వస్తువును ఎంపిక చేసుకొని రాసేంత సీరియస్ రచయిత్రినేమీ కాదు. ఆయా సందర్భాల్లో నా స్పందన వ్యక్తీకరించేందుకే రాస్తాను.

నేను రాసింది చాల తక్కువే. పరిణామాన్ని చర్చించేందుకు పరిధి తక్కువ.

మీ ‘నానీల సింగిడి’ నేపథ్యం?

ఎమ్మే చదివేటప్పుడు నానీలు పరిచయమయ్యాయి. నానీలు రాయడానికి ప్రయత్నించడం, నానీల దశమ వార్షికోత్సవంలో పాల్గొనడం, అక్కడ వక్తల ప్రసంగాలు, నానీల పుస్తకావిష్కరణలు ఎంతో ప్రేరణ కలిగించాయి. దశమ వార్షికోత్సవంలో పాల్గొని ఇంటికి తిరిగొచ్చేటప్పడు బస్సులోనే కొన్ని నానీలు రాసాము… నేను మా అక్క. ఇద్దరం పోటీపడి రాసేవాళ్ళం. తర్వాత మరికొన్ని నానీలు రాసి గోపి సర్ కు చూపించాము. సర్ చాలా మెచ్చుకొని నానీల శిల్పం పట్టుపడిందని, చాలా బాగున్నాయని ఇంకా రాయమని ప్రోత్సాహించారు. అలా నానీలు రాయడం మొదలుపెట్టాను. ఆయా సందర్భాలలో నా భావాలు నానీలుగా రూపొందాయి. అలా అప్పుడప్పుడు రాసిన నానీలను గోపి సర్ ప్రేరణ, ప్రోత్సాహంతో ఈ మధ్యనే ‘నానీల సింగిడి’ ని ప్రచురించాను.

నానీల సింగిడి’కి స్పందన ఎట్లా వుంది?

నానీల సింగిడికి ముందుమాట రాయమని మా కాలేజ్ ప్రిన్సిపాల్ మేడంకు జిరాక్స్ కాపీ ఇచ్చినప్పుడు ఆమె చదివి ‘నన్ను ప్రభావితం చేసిన పుస్తకమిది /నానీలివి’ చాలా గొప్పగా ఉన్నాయి నీ భావాలు అని అభినందించడం ఎప్పటికీ మరిచిపోలేను. నానీలసింగిడిలో గట్టి గింజలున్నాయి అని గోపి సర్ మెచ్చుకున్నారు. పుస్తకావిష్కరణ జరిగిన మరుసటి రోజే చక్కటి సమీక్ష రాసి పంపించారు డా.విజయ్ కుమార్ గారు. కళారత్న డా. బిక్కి కృష్ణ గారు పుస్తకంగా రాకముందే ఫేస్బుక్ లో నానీలు చదివి అద్బుతంగా ఉన్నాయి మీ నానీలు. తొందరగా పుస్తకం వేయమని ప్రోత్సాహించారు. నానీల సింగిడిపై హృద్యమైన సమీక్ష రాసి ప్రోత్సాహించారు వారు.

సాహిత్య ప్రస్థానం లో జంధ్యాల రఘుబాబు గారు మంచి సమీక్ష చేసారు. రాయపాటి శివ గారు ఈ మధ్యనే సమీక్ష రాసి పత్రికకు పంపించారు. ఇలా ఇంతమంది స్పందించడం చాలా సంతోషమనిపించింది. ఒక చిన్న పుస్తకం ఇంతమంది అభిమానానికి కారణమైంది. ఇంకా రాయాలన్న ప్రేరణనిచ్చాయి ఇవన్నీ.

మీ సోదరి ఇందిరా ప్రియదర్శిని సాహిత్యం, వ్యక్తిత్వం గురించి చెప్పండి.

అమ్మానాన్నల తర్వాత నా తొలిగురువు అక్క. మేమిద్దరం కూడా దూరవిద్యా విధానంలో చదువుకోవడం వల్ల మాకు మేమే స్నేహితులం. ఇతరులతో ఉన్న స్నేహం కంటే మేమిద్దరమే ఎక్కువ స్నేహంగా ఉండేవాళ్ళం. ఏదైనా కలిసి చేసేవాళ్ళం. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కటే. ఆచార్యులందరూ జంట కవులుగా పిలిచేవారు మమ్మల్ని.

అన్నింట్లో తొలి ప్రేరణ మా అక్కనే. అక్క డిగ్రీ చదివేటప్పుడే కవిసమ్మేళనాలలో పాల్గొనేది. నన్ను రాయమని ప్రోత్సాహించేది.నేనేది రాసినా సద్విమర్శ చేస్తూ తప్పొప్పులు విడమర్చిచెప్పేది.పరిశోధనలో మెలకువలు చెప్పేది. పోటీ పరీక్షలకు కూడా కంబైండ్ స్టడీ చేసేవాళ్ళం. అన్నింట్లో ఒక్కటిగా ఉండే మమ్మల్ని ఆమె మరణం దూరం చేసింది. అక్క ఆశయాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నేను మా అక్క కలిస్తేనే నేను. నా వ్యక్తిత్వమంతా అక్క అడుగుజాడల్లోనే రూపుదిద్దుకుంది. అక్క రాసిన కవితలనీ, నానీలను, పద్యాలను పుస్తకం తీసుకొద్దామనుకుంటున్నాము.

వర్ధమాన రచయితగా సామాజిక మాధ్యమాలను ఎట్లా వినియోగించుకుంటున్నారు?

ఇవాళ సామాజిక మాధ్యమాలు వేదికగా సాహిత్యం వెలువడటం మంచి పరిణామం. రాసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది ఒకందుకు మంచిదే. వ్యక్తులు సాహిత్యం దిశగా అడుగులేయడం అంటే మనుష్యత్వాన్ని నిలుపుకోవడమే. ప్రదర్శన కోసం కాకుండా నా రచనని ఇతరులతో పంచుకుందామన్న ఆలోచనతో సామాజిక మాధ్యమాలలో నేను రాసినవేవైనా పోస్ట్ చేస్తుంటాను. మిత్రులందించే ప్రోత్సాహం కొత్త ఎనర్జీ నిస్తుంది. సాహిత్యానికి సంబంధించిన చాలా సమూహాలలో పాలుపంచుకోవడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.

వర్తమాన సామాజిక సందర్భంలో రచయితగా మీ స్పందన ఏమిటి?

రచయిత అని కాకుండా వ్యక్తిగా నా అభిప్రాయం చెబుతాను. గత దశాబ్ద కాలంగా నా చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తున్న. ఇంతకుముందు మనుషులు జీవించడం కోసం జీవితం అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రదర్శనే జీవితం అనే భ్రమలో బతికే కొత్త తరం కనిపిస్తుంది. ఈ పరిస్థితి నివారణకు రచయితలు స్పందించాల్సిన అనివార్యత ఉందని నా అభిప్రాయం. మానవ సంబంధాలు పతనమై ఆర్థిక సంబంధాలు బలపడిన సందర్భం నేడు మనముందుంది. కొంతవరకైనా మనిషిని కాపాడుకోవాలి. మానవీయ విలువలను సాహిత్యమే సమకూరుస్తుందని నా నమ్మకం.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

6 thoughts on “గుండె తడిని ఆవిష్కరించడమే కవిత్వం: వింధ్యవాసినీ దేవి

  1. ఇంటర్వ్యూ చాలా బాగుంది..మంచి ప్రశ్నలు…మంచి సమాధానాలు..రచయిత్రికి, ఇంటర్వ్యూ చేసిన సాహితీ మిత్రునికి శుభాకాంక్షలు
    -కళారత్న బిక్కి కృష్ణ.

Leave a Reply