వాళ్ళు ఎగరడం నేర్చుకుంటారు

రోజూ చూస్తుంటే గమనించవు గాని
పిల్లలు పెరుగుతుంటారు రోజూ
కొంచెం, కొంచెంగా ఎదుగుతువుంటారు

గాలికి సొగసుగా ఊగే ఆకుల్లాగా, పువ్వుల్లాగా
కొంచెం కొంచెం పెరుగుతువుంటారు
నువ్వు గమనించవు గాని వాళ్ళు
నీ చిటికెన వేలుని కొంచెం కొంచెంగా
వదులుతూ, వదుల్చుకుంటూ వాళ్ళు
నీకు కొంచెం ఎడంగా జరుగుతూవుంటారు

వాళ్ళ చూపులకు చిక్కుకున్న
వాళ్ళ ఊహలను పట్టుకున్న
కొత్తకొత్త దృశ్యాలను వేటినో వెతుక్కుంటుంటారు
నెమ్మది నెమ్మదిగా నీ దృశ్యంలోంచి, ఉహల్లోంచి
వాళ్ళు వింత కలల్లోకి, ప్రపంచాల్లోకి
ఒడుపుగా ప్రవహించడం మొదలుపెడతారు
రంగురంగుఈకల రెక్కలతో
పట్టరాని సంతోషంతో వింత విన్యాసాలు
చేసుకుంటూ ఎగురుతుంటారు

నీ మాటలు వినడం లేదని అనుకుంటావు గాని
వాళ్ళు గొంతెత్తి పాడుతున్న కొత్త పాటల
జలపాతాల హోరు వినిపించదు నీకు
నీ దృశ్యాల్లోని, ఊహల్లోని మెరిసే రంగులు కొన్ని
కొంత రంగుని కోల్పోతువుంటాయి
బహుశా అవి కొన్ని కొత్తలోకాలకు
విభ్రమకొల్పే వింత రంగులను అద్దుతువుంటాయి

వాళ్లే నీ లోకమని వాళ్ళని బంధింపచూస్తావు
వాళ్ళ ఊహల్లో విచ్చుకుంటున్న
కొత్త లోకాలను చూడనిరాకరిస్తావు

నువ్వెప్పుడో మేల్కొంటావు కాని
వాళ్ళప్పటికే లంగరు తెంచుకుని
సముద్రంలో ప్రయాణం మొదలుపెడతారు
చుక్కల ఆనవాళ్లు పట్టుకుని
పురాతన నావికుడిలా తోవను కనుక్కుంటుంటారు

నువ్వింకొంచెం తెలివి తెచ్చుకుని చూసేలోగా
వాళ్ళు దిగంతానికి చేరువలో
పడవ నడుపుకుంటూ కనిపిస్తారు
నీ దృశ్యంలోంచి వాళ్ళు మాయమయ్యేలోపు
గుండెనిండా గాలి పీల్చుకుని, ఏడంచెయ్యి పైకెత్తి
చిరునవ్వు నవ్వి పక్కకి తప్పుకోవాలిక

రచయిత, జర్నలిస్టు.

8 thoughts on “వాళ్ళు ఎగరడం నేర్చుకుంటారు

  1. చాలా బాగుందండి 👌👌🙏🙏

  2. బాగుంది.మంచి పోయం. అభినందనలు

  3. చాలా బాగుంది ూర్మ నాధ్

Leave a Reply