రాజ్యాన్ని కలవరపెట్టే సాహిత్యమే విప్లవాచరణ : వడ్డెబోయిన శ్రీనివాస్‌

1. మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.

నాది సాహిత్య కుటుంబం కాదు. భూమీ లేదు. మా నాన్న గ్యాంగ్‌మెన్‌. రాజకీయాల మీద ఆసక్తి వల్ల ఆయనకు పేపర్‌ చదవాలనే పట్టుదల ఉండేది. ఉద్యోగక్రమంలో తెలుగు అక్షరాలు నేర్చుకొని, కూడబలుక్కొని చదివేవాడు. అట్లా ఆ కాలంలో వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వే క్వార్టర్స్‌లో ఒక గ్యాంగ్‌మెన్‌ ఇంట్లో ఆంధ్రజ్యోతి పేపర్‌ పడేది. ఆ పేపరు నాకు చాలా మేలు చేసింది. వ్యాసాలు చదవడం, సాహిత్యాంశాలు చదవడం జరిగేది. అయినా సరిగా అర్థంకాకపోయేది. ప్రైమరీ స్కూలు నుండి ఆరో తరగతి కోసం నెక్కొండ ప్రభుత్వ పాఠశాలలో చేరడం వల్ల అనేకమంది కొత్త మిత్రులు కలిశారు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉండేది. తొమ్మిదో తరగతిలో అనుకుంటాను. మల్లెపాక సాంబయ్య అనే మిత్రుడు సినిమా పాటలకు పేరడీ గీతాలు రాసేవాడు, పాడేవాడు. నేను ఆర్సీ కవిత అనుకునే వాడిని . ఇంతలో పాఠశాల లైబ్రరీలో మహాప్రస్థానం దొరికింది, అర్థంకాకున్నా అనేకసార్లు చదివాను.  పరిశీలనగా చదివాను, విప్లవోద్యమ సంచలనం ఊర్లో ఎవరి నోట విన్నా జననాట్య మండలి పాటలు, చర్చలు పోస్టర్లు గోడమీద ఆకర్షణీయమైన నినాదాలతో కూడిన రాతలు ఈ సండర్భం నన్ను సాహిత్యం వైపు నెట్టేసింది, నా కవిత్వం పత్రికల్లో వేయడం ద్వారా కవిగా నిలబెట్టింది త్రిపురనేని శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, వి.చెంచయ్య.

2. మీరు రాసిన మొదటి కవిత ఏది?

నేను మొదట మతోన్మాదానికి వ్యతిరేకంగా మొదట ఐదారు లైన్‌ల కవిత రాశాను. ఆ కవిత గుర్తులేదు. ఎందుకు రాశానంటే, అప్పట్లో హైదరాబాదు నగరంలో జరుగుతున్న సంఘటనలు పత్రికల్లో చదివేవాణ్ని. అట్లా ఆ కవిత రాశాననుకుంటా.  

3. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాహిత్యమేది?

నన్ను బాగా ప్రభావితం చేసింది శ్రీశ్రీ. నేను కవిత్వం రాయడానికి శ్రీశ్రీ మహాప్రస్థానం పెద్దబాలశిక్ష వంటిది. గద్దర్‌ పాటలు, వంగపండు పాటలు, వరవరరావు కవిత్వం, శివసాగర్‌, శివారెడ్డి, సిధారెడ్డి, వేణుగోపాల్‌, త్రిపురనేని శ్రీనివాస్‌ వంటి రచయితలు, కవులు.

4. మీరు కవిగా ఎట్లా మొదలయ్యారు?

విప్లవోద్యమ పాటలు, విప్లవ కవిత్వం, సాహిత్యం చదవడం, ఆనాటి సమాజాన్ని పరిశీలించడం ద్వారా కవిత్వం రాయడం మొదలైంది. నేను మార్కిస్టు ఔట్‌లుక్‌లోంచి రాస్తున్నాను అని తెలియకుండానే రాశాను. ఆ తర్వాత విప్లవ సాహిత్య అధ్యయనం ఆ ఎరుకనిచ్చింది. 

5. విప్లవ సాహిత్యోద్యమ ప్రత్యేకతలేమిటి? 

విప్లవోద్యమానికైనా, విప్లవ సాహిత్యోద్యమానికైనా ఒక్కటే తాత్విక భూమిక ఉంటుంది. అదే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం. ఇది విరసం ప్రణాళికలో కూడా రాసుకోవడం జరిగింది. విప్లవ కవులకు, విప్లవ రచయితలకు తమదైన శిల్పం ఉంటుంది. కానీ, తాత్విక భూమిక మాత్రం ఒక్కటే. మానవ సమాజాన్ని ఉన్నతమైన జీవన విధానానికి చేరుకోగలిగేలా కార్యాచరణను ప్రేరేపించి లక్ష్యాన్ని సాధించుకోవడానికి తోడ్పడేదే విప్లవ సాహిత్యం. 

6. విప్లవ కవిత్వం 1990ల్లోనే ఆగిపోయిందనే విమర్శపై మీ స్పందన ఏమిటి?

విప్లవ కవిత్వం 1990ల్లో ఆగిపోయిందనేది అబద్ధం. ఎందుకంటే, సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం విప్లవోద్యమం ఉంటది. విప్లవ సాహిత్యం ఉంటది. మొదలైనపుడు ఏ ఉద్యమానికైనా ఒక రకమైన ఆవేశముంటది. ఆ ఉధృతి, ఆ తీవ్రత, ఆ ఆవేశం కవిత్వం పుంఖానుపుంఖాలుగా రావడానికి కారణం కావొచ్చు. ఆ ఆవేశం తగ్గినంత మాత్రాన రాశి తగ్గొచ్చేమో కానీ కవిత్వ విలువలు తగ్గలేదు. ఈ విమర్శకు సమాధానంగానే 80వ దశకం, 90వ దశకం మధ్య వచ్చిన కవిత్వాన్ని ‘కవిత్వంపై ఎర్రజెండా’గా వేయడం జరిగిందనుకుంటా. ఎందుకంటే, అప్పటికి నేను లేను. ఇవాళ తెలంగాణలో ఉద్యమం కావొచ్చు, కానీ దండకారణ్యంలోంచి బోల్డంత కవిత్వం, కథలు, నవలలు, వ్యాసాలు వస్తున్నై. విప్లవ సాహిత్యోద్యమం కూడా విస్తరిస్తుంది కదా! 90 తర్వాతైతే ఇక్కడ విప్లవ కవిత్వంలోకి పాణి, రివేరా, అరసవిల్లి, ఇక్బాల్‌, ఉదయమిత్ర, శ్రీనివాసమూర్తి, కేక్యూబ్‌ వర్మ, యుగంధర్‌రావు వంటి అనేకమందిని చూడవచ్చు. దోపిడీ రహిత సమాజాన్ని చేరకునేదాకా విప్లవ సాహిత్యోద్యమం ఉంటుంది. విప్లవ కవిత్వముంటుంది. కావాలని అనేవాళ్లను మనమేమంటాం. తెలియక అనేవాళ్లను మనమేమంటాం. దూరం జరిగింది వాళ్లే.

7. విప్లవ కవిత్వంలో ప్రత్యేకతలు ఏమిటి?

ఏ కవిత్వాన్నైనా లేదా ఏ సాహిత్యాన్నైనా దాని దృక్పథాన్ని బట్టి, లక్ష్యాన్ని బట్టి విభజిస్తాం. ఎందుకంటే అవి దాని ప్రత్యేకతలు. విప్లవ కవిత్వ ప్రత్యేకత సమాజంలో విప్లవ కోసం పాటుపడడమే. అభివృద్ధి నిరోధక భావాలను అభివృద్ధికర భావాలతో యుద్ధం చేయడం. భావజాల రంగంలో విప్లవ సాహిత్యం చేసేపని. అంతమాత్రాన పోవాల్సిన భావాలు పోవుగదా! అందుకే ఆచరణ ముఖ్యం.

ఆచరణ అంటే తుపాకి పట్టడమో, ఆయుధాలు పట్టడమో కాదు. ఇవాళ రాజ్యం విప్లవ కవుల మీద ఎలాంటి విచారణ లేకుండా ఏండ్ల తరబడి ఎందుకు నిర్బంధించింది? అనేకమంది కవులు, రచయితలను మన తెలంగాణలో క్రూరంగా హింసించి, కేసులు పెట్టి ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ ఎందుకు తిప్పుతోంది? వరవరరావు, సాయిబాబాలు ఆయుధాలు పట్టారా? కలమే కదా పట్టింది. ఏది రాజ్యాన్ని కలవరపెడుతుందో, ఏది ప్రజలు విప్లవ కవుల్ని ప్రేమించేలా చేస్తోందో అది ఆచరణ.

8. సామాజిక అస్తిత్వాలను విప్లవ కవులు పట్టించుకోలేదనే విమర్శపై మీ స్పందన?

విప్లవోద్యమ, విప్లవ సాహిత్యోద్యమ తాత్విక భూమికే అన్ని రకాల దోపిడీ, అసమానత, అణచివేతలను వ్యతిరేకిస్తుంది. బయటికి కనిపించేది ఆర్థిక అసమానత కాబట్టి దానిమీద ఎక్కువ కేంద్రీకరించినట్టు కనబడుతుంది.నిజానికి సాంస్కృతిక అణచివేత, అసమానతలో భాగంగా తెలంగాణా గ్రామాల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న స్త్రీ దొరతో మొదటి రాత్రి గడపాలనేది, దొర గడీలో స్త్రీలు నగ్నంగా బతుకమ్మ ఆడడం వంటి వాటిని ఆనాటి పోరాటం పరిష్కరించింది. భూస్వాముల లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా జననాట్యమండలి పాటలు, శివసాగర్‌ వంటి వారు రాసేఉన్నారు. విప్లవోద్యమం బతికి బట్టకట్టిందే మాల మాదిగల గూడాల్లో.

ఐతే, ప్రత్యేకంగా స్త్రీల సమస్యల మీద దళిత సమస్యల మీద ఉద్యమం నిర్మించకున్న ముందొచ్చిన సమస్యలు పరిష్కరించుకుంటూ పోయింది. అట్లా ఒక ఖాళీ అన్పించి ఉండటం, విదేశాల్లోంచి కొత్త భావాలు వీస్తుండటం స్త్రీవాద ఉద్యమం, స్త్రీవాద సాహిత్యం కొత్త వెలుగులు ప్రసరించింది. 1985 సెప్టెంబరు కారంచేడు ఘటన తర్వాత దళిత సంఘాలు, దళితవాద సాహిత్యం ముస్లింల జీవితాల్లోని అసమానతలు, అణచివేతలు, దోపిడీ చిత్రీకరణ మొత్తంగా సామాజిక అస్తిత్వవాద కవిత్వం విప్లవ కవిత్వాన్ని సుసంపన్నం చేశాయని చెప్పవచ్చు.

9. 1990ల తర్వాత విప్లవ కవిత్వంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

జీవితాల మీద ఉద్యమాల ప్రభావం ఎలా ఉంది? ఒక కుటుంబం నుంచి విప్లవకారుడు ఎలా తయారవుతాడన్న జీవిత వైవిధ్య చిత్రణ జరుగుతుందనుకుంటా. శిల్ప పరంగా, వస్తు పరంగా చాలా వైవిధ్యభరితంగా కన్పిస్తోంది. విప్లవ కవిత్వంలో దళిత, స్త్రీ అస్తిత్వవాద వ్యక్తీకరణలు కూడా ఉధృతమైనాయి. అభివ్యక్తిలో చాలా మార్పు వచ్చింది.

10. విప్లవ కవితా సౌందర్యాత్మకత మీద మీ అభిప్రాయం ఏమిటి?

కవితా శైలీ శిల్పమే సౌందర్యాత్మకత. శైలీ శిల్పం ఎంత గొప్పగా ఉంటే సౌందర్యాత్మకత అంత గొప్పగా ఉంటుంది. విప్లవ కవులు సౌందర్యాత్మకతకు వ్యతిరేకం కాదు. అయితే వస్తువును మింగేసే శిల్ప, సౌందర్యాలకు వ్యతిరేకం.

11. విప్లవ కవిత్వంలో వస్తువు తప్ప శిల్పం లేదనే విమర్శపై మీ స్పందన ఏమిటి? 

ఏ కవి కవిత్వంలోనైనా శిల్పమున్నది. ఉంటుంది. శిల్పం లేనిది ఉంటుంది. అది భావ కవిత్వమే కాని, నన్నయ వంటివాళ్లు రాసినదే కాని అద్భుత శిల్పంతో భాసిల్లే కవిత్వముంటుంది. కేవలం విషయాన్ని చెప్పే కవిత్వముంటుంది. రాసిందంతా గొప్పగా ఉండాలంటే ఎట్లా? కొన్ని శైలీ, శిల్పంలో గొప్పగా ఉండొచ్చు. కొన్ని ఉండకపోనూవచ్చు. ఇది అన్ని రకాల కవులు ఎదుర్కొనేదే. అందువల్ల ఒక్క విప్లవ కవిత్వంలోనే వస్తువు తప్ప శిల్పమే లేదనేది ఒక పడికట్టు విమర్శే తప్ప నిజం కాదు. 

12. విప్లవ కవిత్వంలో విప్లవ కాల్పనికతను ప్రవేశపెట్టిన కవులెవరు?

తొలి దశలో విప్లవ కాల్పనికతను కవిత్వంలో ప్రవేశపెట్టింది శివసాగర్‌ అని చెప్పవచ్చు. ఆ తర్వాత చాలామంది కవులున్నారు.

13. విప్లవ సాహిత్యోద్యమంలో నిబద్ధత, నిమగ్నత మీద మీ అభిప్రాయం ఏమిటి?

నిబద్ధత అంటే సైద్ధాంతిక నిబద్ధత. ప్రతీ కవికీ, ప్రతీ రచయితకూ విప్లవ సాహిత్యం సృజించాలంటే నిబద్ధత ఉండాల్సిందే. ఆ వెలుగులోనే రాయాలి. లేకుంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో ఉన్న కవులు, రచయితలు ఏదో ఒక పద్ధతిలో సహకరించాలి అనుకుంటే సైద్ధాంతిక నిబద్ధత ఖచ్చితంగా అవసరం. ఉద్యమంలో భాగమై రాసేవాళ్లది నిమగ్నత. సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, శివసాగర్‌, సముద్రుడు, కౌముది వంటి అనేకమంది కవులు, రచయితలు దండకారణ్య సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు. అందరూ నిమగ్నమైనోళ్లే రాయాలనే సిద్ధాంతం ఎవరు చేసినా అది సరైనది కాదు. మైదాన ప్రాంత ప్రజల్లోంచి వచ్చే సాహిత్యం ఉంటుంది. దండకారణ్య ప్రాంత ప్రజల్లోంచి అంటే పోరాట ప్రజల్లోంచే వచ్చే సాహిత్యం ఉంటుంది. ఈ రెండూ ఉంటాయి. 

14. విప్లవ సాహిత్యంలో వచన కవిత, పాటల్లో దేని పాత్ర ఎంత?

మధ్యతరగతి పాఠకులు కవితకుంటారు. సాధారణ పాఠకులు పాటకు శ్రోతలుగ ఉంటారు. ఐతే పాట సాధారణ ప్రజలతో పాటు మధ్య తరగతి పాఠకులూ  శ్రోతలుగా ఉంటారు. కానీ, చదవడంలోనే వారు సంతృప్తి పడతారు. కాబట్టి విప్లవ సాహిత్యోద్యమానికి రెండింటి అవసరం ఉంది. జననాట్య మండలి కళాకారుల పాట లక్షలాది మందిని కదిలించినది మనమెరిగినదే కదా! వచన కవిత అవసరమైన కాడికి వచన కవిత వెళ్తుంది. పాట అవసరమైన కాడికి పాట వెళ్తుంది. రెండింటికి పోటీ లేదు. అవసరమే.

15. యాభై ఐదేళ్ల విప్లవ సాహిత్యోద్యమంలో మూడు తరాల్ని ప్రభావితం చేసిన కవులెవరు?

యాభై ఏళ్ల విప్లవ కవిత్వంలో మూడు తరాల్ని ప్రభావితం చేసిన కవులు నా పరిజ్ఞానం మేరకు శ్రీశ్రీ, చెరబండరాజు, వరవరరావు, శివసాగర్‌, గద్దర్‌, వంగపండు వంటి కవులు. 

16. విప్లవ కవులు సాయుధ విప్లవ సందేశం ద్వారా సమాజాన్ని ఎట్లా ప్రభావితం చేస్తారు?

కేవలం సాయుధ విప్లవ సందేశమిస్తే అది ప్రభావం చూపకపోవచ్చు. పైగా ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. ఆచరణలో ఉద్యమం లేకుండా అది ఫలవంతం కాదు. ఐతే ఆచరణలో ఉన్న సాయుధ విప్లవాన్ని ప్రతిబింబించే సాహిత్య సందేశం సమాజం మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు 1990ల్లో వరంగల్‌లో జరిగిన రైతుకూలీ సంఘం మహాసభలే. లక్షలాది జనం. పత్రికలే పదిలక్షలు, ఇరవై లక్షలని అంచనా వేశాయి. ఐతే అంతమందికి తిండి, నీళ్లు ఎట్లా అని చాలామంది భయపడ్డారు. కానీ వరంగల్‌, హన్మకొండ ప్రజలేం చేశారు? తమ ఇంట్లో ఉన్న తిరే పదార్థాల్ని, తాగే పదార్థాల్ని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందించారు. అది నేను నా కళ్లతో స్వయంగా చూశాను.

17. మీ కవిత్వంలో ప్రత్యేకతలేమిటి? వస్తురూప వైవిధ్యాన్ని ఎట్లా సాధించారు?

అమరత్వానికి విప్లవ కవిత్వంలో అత్యున్నతస్థాయి పోలిక ‘హిమాలయాలు’. కానీ, ఆ పోలికను అధిగమించి అమరత్వాన్ని ఒక గొప్పస్థానంలో నిలబెట్టాను. ‘హిమాలయాలే వడ్లతాలైన అమరత్వం’ వేరువేరు అంశాల మీద ఇలాంటివి నా కవిత్వంలో మీకు కన్పిస్తాయి.

నా కవిత్వంలో అనేక కొత్త పదబంధాలు కూడా చూడవచ్చు.

ఉదా : ‘హఠోద్ఘాతం’, ‘అగర్భజుడు’

కొత్త పదచిత్రాలు, భావచిత్రాలు కన్పిస్తాయి. 

‘‘రాముణ్ని నాల్కెకు గుచ్చి’’

ఏంటో నిర్వాహనమైన 

ఈ రోడ్డంతా 

నడుస్తున్న ఆకలి సంతకాల

నల్ల బ్యానరైంది’’

‘‘థూ త్తెరి

ఈ దేశభక్తికి 

చెమటచుక్కంత

మానవత్వం లేదు’’ ఇలాంటి ఇంకా అనేకం కన్పిస్తాయి.

కవిత్వంలో ఇమడని చాలా పదాలూ నా కవిత్వంలో ఇమిడిపోయాయి.

చిన్నవి పెద్దవి కలిపి దాదాపు ఇరవై తొమ్మిది, ముప్ఫైదాకా దీర్ఘ కవితలు విప్లవ కవిత్వంలోకి తీసుకువచ్చాను. ఇంకేమున్నాయో మీ పరిశోధకులు కదా చెప్పాల్సింది.

17. మీ కవిత్వంలో వస్తురూప వైవిధ్యం ఎట్లా సాధించారు?

వస్తురూప వైవిధ్యాన్ని సాధించాలంటే ఏ కవైనా విద్యార్థి కావాలి. జీవితాన్ని, సమాజాన్ని, జరుగుతున్న ఉద్యమాల్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. జీవితాన్ని, సమాజాన్ని, ఉద్యమాల్ని ఎంత లోతుగా పరిశీలిస్తే, ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత వస్తు వైవిధ్యాన్ని సాధించవచ్చు. మొదట నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సంసిద్ధత లేకుంటే కష్టం. ఇక రూప వైవిధ్యాన్ని సాధించడానికి పాత కవుల్ని, పాత కావ్యాల్ని ఎంత విస్తృతంగా అధ్యయనం చేస్తే అంత మంచిది. ఎంత పరిశీలిస్తే అంత మంచింది. అధ్యయనం, పరిశీలన, ఈ అభ్యాసమే వస్తురూప వైవిధ్యాన్ని సాధించడానికి కారణమైతది.

18. ‘‘ఆమే… తలాకంది’’ కథ నేపథ్యం గురించి చెప్పండి. అది ఎందుకు రాయాల్సి వచ్చింది? 

‘‘ఆమే… తలాకంది’’. ఈ పేరులోనే పురుష ధిక్కార స్వభావం కనబడుతుంది. ఆ పేరును కాస్త ‘ఆమె తలాకంది’గా మార్చేసి, అబ్బే… ఆమె తలాకంటుందా? మగవాడు కదా! అనేది. ఇది కూడా తెలియదు రచయితకు అనేకాడికి తీసుకుపోయారు కొద్దిమంది. నిజానికి మతపరమైన ‘టెక్నికల్‌’ ఉంటే ఉండొచ్చేమో. కానీ, ఆ కథలో జీవితముంది. కదిలించే గుణముంది. ఆ జీవతం, ఘర్షణ, రెండు మతాల మధ్య నలిగిన బతుకును గురించి సాంప్రదాయ ఇస్లాం కవులు పట్టించుకోలే. అది సహజమే. వాళ్లకు మతం కావాలి. సాహిత్య విమర్శకులని పేరుబడ్డ ఒకరిద్దరు కూడా వాళ్ల దారిలోనే వెళ్లారు. చిత్రంగా ముస్లిం, హిందూ రచయిత్రుల నుంచి ఒక్క విమర్శా రాలేదు. ఐతే ఫత్వా లాంటి హెచ్చరికలు చవిచూడాల్సి వచ్చింది. 

ఐతే ప్రగతిశీల ముస్లిం కవులు, ప్రగతిశీలురైనవారు దాన్ని ఆహ్వానించారు. దాదాపు సంవత్సర కాలం అరుణతార పత్రికలో ఆ కథ మీద చర్చ సాగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత కూడా ఈ మధ్య ఒక రచయిత పుస్తకానికి ముందుమాట పై మూస పద్ధతిలోనే ప్రస్థావన జరిగినట్టుగా చదివాను, ఏదో పత్రికలో. ఆ కథను, ఆనాటి అరుణతారలోని వ్యాసాలను ఒక పుస్తకంగా వేయాల్సి వుంది. 

ఈ కథ ఎందుకు రాయాల్సొచ్చింది అంటే నా జీవితంతో సంబంధంలోకి వచ్చింది కాబట్టి. మా లతకు కరిగిపోయే గుణం ఎక్కువే. కలుపుగోలు మనిషి ఆ కథలో కన్పించే అమ్మాయితో సహజంగానే దగ్గరైంది. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తూ పోతూ లత దగ్గర బాధలు చెప్పుకునేది. ఈమె ఓదార్చేది. వాళ్లున్న కిరాయింటోళ్లు వెళ్లగొడ్తాండ్రంటే, లత తన పెద్దమ్మ వాళ్లింట్లో ఖాళీగా ఉన్న ఇల్లు అద్దెకిప్పించింది. ప్రతీ బాధ ఆమెతో చెప్పుకొనేది. ఆమె అమ్మాయి బాధలన్నీ ఏదో సెలవు రోజు నా చెవిలో వేసేది. ఒక రోజు ఒక ఐదువేలు అప్పిప్పించమని కాళ్లావేళ్లా పడిరదట. ఈ పని ఆమె స్వతంత్రంగా చేయలేదు. నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. నాకు జీతం మూడు వేల చిల్లర వస్తుంది. అప్పటికే ఇద్దరు మాకిద్దరు పిల్లలు. కేవలం జీతం మీదే బతుకు. నగర జీవితం. ఇద్దరం తర్జనభర్జన పడినాక ఒక నిర్ణయానికొచ్చాం. లతవాళ్ల దూరపు చుట్టాలు ఒకామె అప్పులిస్తుంది. లత అడగ్గానే ఆమె ఇవ్వడానికి సిద్ధపడిరది. లత మధ్యవర్తి సంతకం చేసి మొత్తానికి ఆ అమ్మాయికి అప్పు ఇప్పించింది. కానీ అమ్మాయి నాన్నవాళ్ల వైపు నుంచి, అత్తవాళ్ల వైపు నుంచి వస్తున్న బాధలు తట్టుకోలేక ఒక రాత్రి చెప్పాపెట్టకుండా భర్తతో కలిసి తల్లిని తీసుకొని బతుకును వెతుక్కుంటూ వెళ్లిపోయారు. ఆ అప్పు కాగితం మా వెంటపడిరది. అప్పు తీర్చడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఐనా రెండు మతాల క్రూరత్వం కారణంగా ఆ అమ్మాయి తనున్న సమాజాన్ని బహిష్కరించి వెళ్లింది. ఇది నన్ను వెంటాడింది. 

నాకు తెల్సిన ఆ అమ్మాయి, ఆమె అమ్మ జీవితం ఆ కథ. అది రాయకుండా ఉండలేకపోయాను. ఆనాడు ఆ కథ రాసినంతసేపూ మతాలు నా దృష్టిలో లేవు. వాళ్ల జీవితం మాత్రమే నా ఆలోచనల్లో ఉంది. అందుకే అది కదిలిస్తుంది. నా కథలన్నీ కూడా నా పరిసరాల్లోంచి పుట్టినవే.

19. మీ మొదటి కవితా సంకలనం ‘పోస్టుమార్టం రిపోర్ట్‌’ను కేవీఆర్‌, ఇమామ్‌, శంకర్‌లకు అంకితమిచ్చారు కదా! వాళ్ల ముగ్గురి గురించీ క్లుప్తంగా చెప్తారా?

నిజమే. నా మొదటి కవితా సంపుటి ‘పోస్టుమార్టం రిపోర్ట్‌’. దాన్ని కేవీఆర్‌, ఇమామ్‌, శంకర్‌లకు అంకితమిచ్చాను. కేవీఆర్‌ విరసం కార్యదర్శిగా, సాహిత్య విమర్శకుడిగా ప్రఖ్యాతమైనవాడు. సాహిత్య ప్రపంచానికి మరుపురాని వ్యక్తి. ఈ సంకలనం రావడానికి కొద్దిరోజుల ముందు చనిపోయాడు. 

ఇంక రెండో వ్యక్తి ఇమామ్‌. వరంగల్‌ జిల్లా నర్సంపేట ప్రాంతం. నా అభిమాన నాయకుల్లో ఒకడు. మహబూబాబాదు ఏరియా సీఓ. అద్భుతమైనవాడు. లావుగా ఉండేవాడు. ఆయన కాలంలోనే మహబూబాబాద్‌లో ఆర్‌ఎస్‌యూ సమావేశం జరిగింది. ఆ సమావేశం మీద పోలీసుల కాల్పులు జరిగాయి. 

ఇమామ్‌ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. నర్సంపేట, మహబూబాబాదు, కేసముద్రం, నెక్కొండ ఏరియాలను నిద్రలేపిన వాడు. ఎనభైల ద్వితీయార్థంలో స్పెషల్‌ పార్టీ పోలీసులకు దొరికించబడ్డాడు. ఆయనను రంపెనతో కుడిచెయ్యి సంక, ఎడమ కాలు తుంటి వరకు కోసి, వేరుచేసి తీసుకొచ్చి నెక్కొండ రైల్వే స్టేషన్‌లో కేసముద్రం వైపు ఉండే క్యాబిన్‌ దగ్గర గుర్తుతెలియని రైలు కింద పట్టాల మధ్య వేశారు. 

ఇక మద్దెర్ల శంకర్‌ నా అభిమాన నాయకుల్లో ఒకడు. గొప్ప ఆర్టిస్టు. హైదరాబాద్‌`సికింద్రాబాద్‌ జంట నగరాల్లో , ఉస్మానియా యూనివర్సిటీలో, ఇంకా చాలా విద్యాలయాల్లో, కూలడానికి సిద్ధంగా ఉన్న గోడల మీదో, వాడకుండ వదిలేసిన భవనాల గోడల మీదో అందంగా కన్పించే ఉద్యమ నినాద రాతలు ఆయనవే. ఉద్యమానికి సంబంధించి, సమావేశాలకు సంబంధించి ఆయన రాతలో ఉన్న బ్యానర్లే ప్రకాశించేవి. ఆయన అరెస్టయిన తర్వాత జైలు నుంచి వచ్చాక కేసముద్రంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక రిపోర్టరుగా ఉన్నాడు. ఆనాటి సత్యన్న దళం వార్తలు బాగా రాసేవాడు. ఇవాళ కేసముద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆయన కృషి ఫలితమే. ఆయనే ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. కార్పస్‌ ఫండ్‌ వసూలు చేసి, కళాశాలను స్థాపింపజేశాడు. ఆయన లేకపోతే కేసముద్రంలో ఇవాళ ఉన్న కళాశాల ఉండేది కాదు. ఆయన నా పోస్టుమార్టం రిపోర్టు పుస్తకానికి ముఖచిత్రం వేస్తానని మాటిచ్చాడు. నేను పుస్తకం వేసేలోపే తనమీద నిర్బంధం పెరగడంతో తిరిగి అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రాంత దళంలో పనిచేసే క్రమంలో దొంగ ఎదురు కాల్పుల్లో కనుమూశాడు. నాకు బంధువు కూడా.

20. మిమ్మల్ని కవిగా మలిచిన సంఘటనలు, సందర్భాలు చెప్పండి.

చుట్టూర రైతాంగ ఉద్యమాలు. పాఠశాలలో రాడికల్‌ విద్యార్థి ఉద్యమాలు. సమాజంలో దోపిడీకి వ్యతిరేకంగా ఒక ప్రవాహంలా యువత కదిలిన సమయం. హైదరాబాద్‌, వరంగల్‌ లాంటి పట్టణాల్లో రాడికల్‌ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్నవాళ్లు సొంతూరు నెక్కొండకు వచ్చినపుడు వాళ్లు చెప్పే విషయాలు. రాత్రుల్లో గోడ రాతల్లో మాకూ భాగస్వామ్యం ఇవ్వడం. ఇదంతా ఒక ఎత్తైతే గద్దర్‌ పాటలు ఊళ్లను ముంచెత్తేవి. 

ఆ కాలం మా ఇంటికి పత్రిక రావడం, కవిత్వం, కథలు, వ్యాసాలు, శ్రీశ్రీ ఈ మొత్తం నా మీద ప్రభావం చూపుతున్న కాలంలో మా పాఠశాల గ్రంథాలయంలో శ్రీశ్రీ మహాప్రస్థానం దొరకడం. చదవడం. అది నా కవిత్వ గైడ్‌. అదే సమయంలో ఓ పేరడీ గీతాల మిత్రుని ప్రేరణ. నిజానికి నేను కథలతో మొదలయ్యాను. తర్వాతే కవిత్వంలోకి వచ్చాను. అప్పట్లో హైదరాబాద్‌లో జరుగుతున్న సంఘటనల క్రమంలో మొదట మత వ్యతిరే కవిత రాశాను. ఆ కాలంలో వివిధ సందర్భాలను విప్లవోద్యమ అవగాహనలతో అర్థంచేసుకొని రాసిన కవితల్ని పల్లె గొంతుకు పేరుతో ఒక నోట్‌బుక్‌ రాశాను. ఆ కవితలు, ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన కవిత్వం, కథలు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు నా రూమ్‌ మీద దాడిచేసి, నా సూట్‌కేస్‌ పగలగొట్టి, నా బట్టలు చించివేసి కవితలు, కథలు ఎత్తుకుపోయారు. వాటిలో కొన్ని కథలు సేకరించుకున్నాను. కవిత్వం, వ్యాసాలు, మరికొన్ని వ్యాసాలు దొరకలేదు. 

1989 – 1990ల మధ్య నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్‌ఎస్‌యూ కార్యదర్శిగా ఉన్నాను. 

21. ముప్ఫై ఏళ్ల క్రితం(1994) ఓ కవితలో ‘‘రాముని పాదం మోసీ మోసీ పద్యం రాముని వాసన గొడ్తోంది’’ అని రాశారు కదా! ఇంత రాడికల్‌గా రాయడానికి ప్రేరణ ఇచ్చిన సందర్భం ఏమిటి?

‘‘డార్విన్‌ నవ్వుతాడు సుమా!’’ అనే కవితలోనిది ఆ పాదం. అప్పట్లో పద్యం మీద బోల్డంత చర్చ జరుపుతుండేవాళ్లు. బేతవోలు రామబ్రహ్మం వంటి వాళ్ల వ్యాసాలు వచ్చేవి. తిరిగి పద్య ప్రక్రియను ప్రధాన స్రవంతిలోకి తెస్తామని ఆత్మవిశ్వాసం ఆ వ్యాసాల్లో నాకు కన్పించేది. పైగా అప్పటికే మతవాద పార్టీ కార్యకలాపాలు, రాముడు, అయోధ్య పదాలు నలుగుతుండేవి. ముమ్మరంగానే ఉండేవి. అంతేకాదు, మన ప్రగతిశీల కవులు వచన కవితను ‘పద్యం’ అంటూ సనాతనవాద కవులకు ఆనందం కలిగించేవాళ్లు. ఇప్పటికీ ఆ సంబరం కొనసాగుతుందనుకోండి. నాకు తెల్సిన ఇద్దరు ముగ్గురు పద్యకవులు ప్రగతిశీల ప్రముఖుల పేర్లుచెప్పి ‘‘ఆ పదానికి ప్రత్యామ్నాయం లేదు’’ అని నవ్వుకునేవారు. ఆ సమయంలో ఆ కవిత రాశాను. బేతవోలు రామబ్రహ్మానికి పద్యం మీద సమాధానమిచ్చే సందర్భంలో ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు వి.చెంచయ్య గారు ఈ కవితను కోట్‌ చేశాడు. 

22. ‘బెత్తోడు అనబడే మీ తాత’ జ్ఞాపకం, అతనితో మీ అనుబంధం గురించి చెప్పండి.

నా బాల్య జీవితంలో నాకు ఇద్దరు అద్భుతమైన మనుషుల జీవన సహచర్యం లభించింది. ఒకరు మా అమ్మవాళ్ల నాన్న పెద్దపెల్లి మంకయ్య. ఇంకొకరు మా నాన్నవాళ్ల అమ్మ వడ్డెబోయిన వీరమ్మ. నా పదో తరగతి లోపే వాళ్లిద్దరూ అకస్మికంగా మరణించారు. వాళ్లిద్దరు అన్నాచెల్లెళ్లు. తాత నానమ్మల ప్రభావం నామీద చాలా ఎక్కువ. ఇంకా తాత ప్రభావం ఇంకొంచెం ఎక్కువ. ‘‘ఆకలి రోగం’’, ‘‘పబేటు ఒల’’ కథల్లో మా తాత ప్రభావం ఎక్కువ. నా ఎనిమిదో తరగతి లోపే మంకయ్య తాత మరణించిన ఆయన నామీద వేసిన ప్రభావం చాలా గాఢమైంది. ఆయనతో గడిపిన జీవితం ఆ కథల్లో కనబడుతుంది. ఆ ఇద్దరు మనుషులతో ఉండే తీరు చాలా గొప్పగా అనిపించేది. నాయనమ్మ ప్రభావం ‘‘పాడెకట్టె’’ కథలో కన్పిస్తుంది. తాత తనకున్న ఎకరం పొలం, ఎకరాన్నర చెలకలో వ్యవసాయం చేసుకుంటూ, చేపలు పడుతూ జీవితాన్ని సబ్బండ వర్ణాలకు దగ్గరగా చేసుకుంటే, నాయనమ్మ సమ్మక్క సారక్కల భక్తురాలు. ఆమె దేవుడు చెప్పేది. అదొక మానసిక రోగమని మనం భావిస్తున్నా సబ్బండ కులాలు ఆమెకోసం ఎప్పుడు తలుపులు తట్టినా మానసికి స్థైర్యాన్నిచ్చేది. కేసముద్రం, దానిచుట్టూర గిరిజన తండాలు తమకొచ్చిన బాధలకు ఆమె ఏం చెప్తారా అని ఎదురుచూసేవి. అయితే వాళ్లదగ్గర నుండి నయాపైసా తీసుకొనేది కాదు. కానీ గిరిజనులు తమకు పండిన పంటలకు సంబంధించి తృణమో పణమో ఇస్తే మాత్రం తీసుకొనేది. 

23. ‘‘పెనుతుపాన్‌లాంటి వరంగల్‌’’ మిమ్మల్ని ఎట్లా నిలబెట్టింది? సాహితీ సృజనలోనూ, జీవితంలోనూ.

పెను తుపాను నష్టమే కలగజేస్తుంది. నా ఇంటిమీద జరిగిన దాడులు కుటుంబపరమైన నష్టాన్ని కలుగజేశాయి. శారీరకంగా క్రూరమైన పోలీసు హింసలను అనుభవించాను. నన్ను పలకరించడానికి బుర్ర రాములు నేను జైలు నుండి విడుదలైన రెండో రోజే మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. కమిలిపోయి ఉన్న నా శరీరాన్ని చూసి కళ్లకు నీళ్లు తెచ్చుకున్నాడు. ‘‘నీ కథ రాస్తాన్నేను’’ అన్నాడు. కానీ, రాశాడో లేదో తెలియదు. ఇప్పటికీ ఆ హింస ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాను. 

ఐతే విద్యార్థి ఉద్యమాలు పాఠశాల స్థాయి, ఇంటర్మీడియట్‌ స్థాయి, డిగ్రీ స్థాయి, పీజీ స్థాయిలో కూడా పూర్తి నిమగ్నమవ్వడం వలన ఏ స్థాయిలో కూడా కుంగిపోయిన స్థితి లేదు. అట్లాంటి పునాది ఉన్నవాళ్లు ఎవరు కూడా ఏదో ధైర్యం తమ వెన్నంటి ఉన్నట్టే ఫీలవుతారు. అది వరంగల్‌ వాతావరణం. నిరంతర ఉత్తేజకరంగా ఉండేది. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆనాడు అనేకమంది రోల్‌ మోడల్స్‌ నా కళ్లముందుండేవారు. ఏ దుఃఖాన్నయినా అధిగమించడం వాళ్లను చూడటం ద్వారానే నేర్చుకున్నాను. 

పాఠశాల జీవితం నుండి ప్రారంభమైన సాహిత్య సృజన ఉద్యమాల ఆలంబనగానే నాలో ఎదిగింది. ఒదిగింది. నిలబడిందని భావిస్తున్నాను. 

24. ‘‘ఉత్తర తెలంగాణ అనబడే లాటిన్‌ అమెరికా’’ మీలో ఏయే ఆలోచనల్ని, సంఘర్షణల్ని రేకెత్తించింది? మీ కవిత్వంలో అదెట్లా ప్రతిబింబించింది?

‘‘ఉత్తర తెలంగాణ అనబడే లాటిన్‌ అమెరికా’’ అనే కవిత డా.ఆమెడ నారాయణను మాటుగాసి చంపినపుడు రాసినది. ఆయన ప్రజావైద్యుడు. మొగిలిచర్లకు పోతుంటే చంపేశారు. ఆ సమయంలో కిడ్నాపులు చేయడం, మాయంచేయడం, ముఖాలు చెక్కివేయబడిన శవాలవడం, తలలు లేకపోవడం, మరణం ఏ వైపు నుండి ఎట్లా ఏ ఉద్యమకారుని, సానుబూతిపరుని వెంటపడుతుందో తెలియని స్థితి. లాటిన్‌ అమెరికా ప్రాంతంలోని ఒక భీభత్స భయానక స్థితి ఉత్తర తెలంగాణను ఆవరించిన సందర్భం ఆ కవిత రాయడానికి కారణమైంది. 

(ఇంకా వుంది…)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

Leave a Reply