‘ఈ మధ్య మనం కగార్ గురించి కాకుండా విద్రోహం గురించి మాట్లాడుతున్నాం కదా’ అని మొన్న ఒక మిత్రుడు మెసేజ్ చేశాడు.
దానికి ‘అణచివేత లాగే విద్రోహం కూడా కగార్‌లో భాగం’ అని సమాధానం ఇచ్చాను.
‘మరైతే, కగార్‌ను మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లేనా??’ అనే ప్రశ్న అతను సంధించాడు.
సమగ్రంగా చూశామో లేదోగాని, దాని గురించిన ఎరుక ఉందని తన మాటే చెబుతోంది.
ఇప్పుడున్న మన:స్థితిలో ఎవరైనా సరే, ‘కగార్ రిపబ్లిక్’ చదివితే మన సమాజపు విమర్శనాత్మక స్వరం మీద గురి పెరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రలోంచి పుట్టుకొచ్చిన ఈ విధ్వంసకర, హింసాత్మక, విద్రోహపూరిత పరిణామాలకు ఫెలోట్రావెలర్ ప్రత్యక్ష సాక్షి. తన కళ్ల ముందే విత్తుపడి, చిగురించి, దానికవసరమైన పర్యావరణం రూపొంది, ఆ మొలక మహా వృక్షంగా మారిన సజీవ ప్రజా విప్లవ చరిత్రలో ఆయన భాగం. తన రచనతో, ఆలోచనలతో, ఆచరణతో, భావోద్వేగపూరిత వ్యక్తీకరణలతో, నిశితమైన విమర్శనాత్మక విశ్లేషణలతో విడదీయలేని రక్తమాంస సంలీన సంబంధం ఆయనది. తనలోని తీవ్ర భావావేశం, ఆగ్రహం, ఆర్తి, పట్టింపు ఈ వ్యాసాల్లోని ప్రతి అక్షరంలో పదునుదేలి మనల్ని సానపడతాయి.
కగార్ గురించిన ఈ వ్యాసాల్లో ‘రిపబ్లిక్’ ప్రస్తావన నేరుగా ఒక్క చోట మాత్రమే ఉంది. అదీ న్యాయస్థానం చేసిన వ్యాఖ్య గురించి రాసిన చోట. విద్రోహం గురించి కూడా ఒక వ్యాసంలోనే ఉంది. లక్ష నక్షత్రాలు రాలనిదే సూర్యోదయం రాదనే ప్రకృతి గతితర్కాన్ని చాటిన కవి వాక్కు ఓ పక్క ఉండగా, ఈనాటి కఠోర సామాజిక, రాజకీయ వాస్తవమైన ‘ఉల్కా పతనం’ గురించి ఫెలోట్రావెలర్ రాయవలసి వచ్చింది. తద్వారా కగార్‌లోని విద్రోహం, రిపబ్లిక్‌లోని విద్రోహం కలుస్తున్న చోటు ఎక్కడ? అనే ప్రశ్న రేకెత్తించారు. అత్యంత సమకాలీన అణచివేత చరిత్రను చెప్పిన ఈ వ్యాసాల సందర్భంలోంచి ఇంకాస్త ముందుకెళ్లి కగార్ మరో పార్శ్వమైన విద్రోహం గురించీ మనం మాట్లాడుకోవచ్చు. అప్పుడే కగార్ రిపబ్లిక్‌ను ‘కగార్ విద్రోహ రిపబ్లిక’్‌గా పూర్తిగా అర్థం చేసుకున్నట్లు.
ఆ విషయాల్లోకి వెళ్లేముందు ఒక వెలితి గురించి మాట్లాడుకోవాలి. దాదాపు రెండేళ్ల కింద మొదలైన కగార్‌లోని హింసను మనం ఎంతో కొంత అర్థం చేసుకున్నాం. ప్రశ్నించాం. ప్రతిఘటించాం. దానితో పోల్చుకుంటే విద్రోహం బట్టబయలై కనీసం మూడు నెలలవుతున్నా దాని స్వభావాన్ని తెలుసుకున్నామా? తెలియచెప్పామా? అనేది సందేహమే. సైనిక కగార్ మీద ఉన్నంత కఠినంగా, కచ్చితంగా విద్రోహ కగార్ మీద ఉన్నామా? బహుశా అంతర్గత యుద్ధ స్వభావం తెలుసుకున్నంత సులభంగా అంతర్గత విద్రోహాన్ని పసిగట్టడానికి మన విశ్వాసాలు, ఆరాధనలు, వర్ణనలు అడ్డంపడ్డట్లుంది. యుద్ధంలోంచి విద్రోహం తలెత్తడానికి ఉన్న అవకాశాలను తెలుసుకోకుండా అణచివేతను యథాలాపంగా చూసే ధోరణి ప్రతిబంధకమైనట్లున్నది. ఇప్పటికైనా దీన్ని అధిగమించి కగార్‌ను అర్థం చేసుకోవడంలోని ఖాళీలను సమర్థవంతంగా పూరించవలసే ఉన్నది. ఫెలోట్రావెలర్ వ్యాసాలు విడుదలవుతున్న కీలక సందర్భాన్ని గ్రహించగలిగితే ఆ పని కొంతయినా చేసినట్లే.
1
కగార్ సైనిక కోణం కంటే దాని రాజకీయ కోణమే ఈ వ్యాసాల్లో రచయిత చెప్పారు. చాలా చోట్ల దాని సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాన్ని, హింసాత్మక స్వభావాన్ని చెప్పారు. విద్రోహ గుణాన్నీ చెప్పారు. మావోయిస్టు`ఆదివాసీ సందర్భం నుంచి ముస్లింల మీద, దేశ ప్రజలందరి మీద జరుగుతున్న బహుముఖ యుద్ధంగా విశ్లేషించారు ఇదీ ఆలోచనాపరులు చేయాల్సిన పని.
విప్లవ శిబిరానికి బైట ఉండే మేధావులు, పాత్రికేయులు, రచయితల్లో కొందరైనా కగార్‌ను మర్చిపోయి ‘విద్రోహ ఆరాధన’లో పడిపోయారు. ‘విరమణ పారవశ్యం’లో మునిగిపోయారు. అంతా అయిపోయిందనే కుంగుబాటుకు గురయ్యారు. అక్కడితో ఆగలేదు. విప్లవకారులు భారత రిపబ్లిక్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారు. విప్లవోద్యమం విఫలమైంది కాబట్టి రిపబ్లిక్‌లో చేరమని చెప్పడం వాళ్ల ఉద్దేశం. తద్వారా రిపబ్లిక్ సఫలమైందనే అంతరార్థం వాళ్ల మాటల్లో ఉంది.
విప్లవోద్యమం ముందున్న సవాళ్ల గురించి చర్చించాల్సిందేగాని, విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తానని అంటున్న భారత రిపబ్లిక్ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుకోవాలి. బైటి నుంచి రిపబ్లిక్ సవాళ్లను (ఒకానొక ముఖ్యమైన సవాలు మావోయిస్టు ఉద్యమమని పాలకవర్గ కథనం) ఎదుర్కొంటున్నదా? లేక రిపబ్లిక్‌లోనే సుదీర్ఘకాలంగా పరిష్కారం కాని అనేక సవాళ్లు ఉన్నాయా? మన రిపబ్లిక్‌కు ప్రజలు కేంద్రం కాకపోవడమే దాని లోపలి సవాళ్లన్నిటికీ మూలం. దాని నుంచే లోపలా బైటా అనేక సవాళ్లు పుట్టుకొచ్చాయి. ఈ రోజు బలాబలాల సంగతి పక్కనపెడితే ఇది ‘రిపబ్లిక్ వర్సెస్ విప్లవోద్యమం’ అని చర్చించవలసిన అత్యవసర దశలోకి రిపబ్లిక్ వచ్చింది.
భారత రిపబ్లిక్‌లోంచి కగార్ పుట్టింది. దాని కోసమే పని చేస్తున్నది. దానిలో భాగమైంది. సారాంశంలో రిపబ్లిక్ కోసమే అమిత్‌షా పదే పదే అంటున్న ఈ అంతిమ యుద్ధం. ఈ సంగతిని ‘కగార్ రిపబ్లిక్’లోని ప్రతి వ్యాసం వినిపిస్తుంది. ఈ మౌలిక భావన అర్థమైతే కగార్ మావోయిస్టు నిర్మూలనా సైనిక చర్యగా ఎవ్వరూ కుదించరు. కేవలం మావోయిస్టు ఉద్యమ నిర్మూలన కోసమే రాజ్యం కగార్‌ను తెచ్చిందని ఎవరైనా అనుకుంటే అదేమిటో అర్థం కానట్లే. అదొక సైనిక రూపం మాత్రమే అనుకుంటే రిపబ్లిక్ కూడా అర్థం కానట్లే. అనేక అసమానతల మీద, దోపిడీ పీడనల మీద, సామాజిక సాంస్కృతిక వివక్షల మీద ఆధారపడిన రిపబ్లిక్‌ను కాపాడటానికి, దాని లోపలి నుంచి పుట్టుకొచ్చిన విధ్వంస పథకం ఇది. కాబట్టి ఇది సమాజానికికంతటికీ ప్రమాదకరం అని చెప్పడానికి ఈ పుస్తకం ప్రయత్నించింది. దశాబ్దాలపాటు దాచుకుంటూ, దాటవేసుకుంటూ వచ్చిన లోలోపలి సవాలక్ష సంక్షోభాలన్నీ ఒక్కసారిగా బద్దలైపోయి కగార్ అనే యుద్ధం పుట్టుకొచ్చింది. ఈ యుద్ధం చేయకుంటే రిపబ్లిక్ మనుగడ కష్టమయ్యే దశకు ఆ వైరుధ్యాలు తీవ్రమయ్యాయి. రిపబ్లిక్‌ను బైటి నుంచి విచ్ఛిన్నకారులు, తిరుగుబాటుదారులు చుట్టుముట్టారా? బైటి సంక్షోభాల వల్ల రిపబ్లిక్ బలహీనపడి ఈ స్థితికి చేరుకున్నదా? రిపబ్లిక్ ఛిద్రమైపోతున్నట్లు బైటి నుంచి కనిపిస్తోందిగాని, దాని వాస్తవ చరిత్ర అది కాదు.
ఫాసిస్టు పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగవ్యవస్థలన్నిటినీ తన చేతిలోకి తీసుకున్నదనీ, తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నదనీ, వాటిని దెబ్బతీస్తున్నదనీ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఈ పని గతంలోనూ ఎంతో కొంత జరిగింది. ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకున్నది. ఈ మాట నలభై ఏళ్లకుపైగా అధికారంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా గట్టిగా చెబుతోంది. ఫాసిస్టుల దుష్ట చర్యలతో భారత రిపబ్లిక్ ‘బ్రోకెన్ రిపబ్లిక్’గా మారిందని ఉదారవాద ప్రజాస్వామిక విమర్శ బలంగా వినిపిస్తోంది. అందువల్ల కూడా రిపబ్లిక్ చర్చనీయాంశమైంది. ప్రజలు కేంద్రంగా, బహిరంగ రాజకీయ వ్యవస్థగా ఉండవలసిన రిపబ్లిక్ అనేక మార్పులకు లోనవుతూ చివరికి రహస్య రాజకీయ కూటమిగా మారిపోయింది. ఇవాళ మనం చూస్తున్న సకల వికృత పరిణామాలు, విధ్వంస క్రమాలు ఆ పతాక సన్నివేశంలోనివే. అందువల్ల సగటు మనుషులకు భయం కలుగుతోంది. సున్నితంగా ఆలోచించే బుద్ధిజీవులకు ఆందోళన కలుగుతోంది.
2
రిపబ్లిక్ విధ్వంసం ఎట్లా మొదలైంది? సరిగ్గా ఎప్పుడు ఈ ముగింపు దశకు చేరుకున్నది? ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మూల మలుపు భారత రిపబ్లిక్ కగార్ రిపబ్లిక్‌గా మారడం. ఇదేమీ హఠాత్ పరిణామం కాదు. కారణం ఏమంటే మన రిపబ్లిక్‌కు మౌలికంగానే ‘బహిరంగ’, ‘ప్రజా ప్రాతినిధ్య’ స్వభావం లేదు. ఈ రెండు పదాల్లోని పారదర్శకత, ప్రజాస్వామ్యం అనే భావనలను, పరిభాషను కూడా పూర్వ పక్షం చేస్తూ లోలోపలి నిరంకుశ రాజ్యం అవతరించింది. బహుశా ఒక సమాజానికి, అందులోని రాజ్యానికి ఉండే ప్రత్యేకతలనుబట్టి, ఆ సమాజపు రాజకీయార్థిక, పాలనారంగాల ప్రజాస్వామిక ప్రక్రియలను బట్టి లోపలి రాజ్యం(డీప్ స్టేట్) తలెత్తుతుంది. ఇది ఒక్కో దేశంలో ఒక్కో రూపం తీసుకుంటుంది. ఒకానొక తీవ్ర సందర్భంలో దాని విశ్వరూపం బట్టబయలవుతుంది. రాజకీయాధికారం లో ఉన్న వ్యక్తుల అండతోనైనా, లేని వ్యక్తుల నాయకత్వంలోనైనా ఇది పని చేయవచ్చు. ఆ వ్యక్తుల సొంత సామాజిక ఆర్థిక ప్రయోజనాల పరమావధే అత్యంత నిరంకుశంగా, హింసాత్మకంగా సమాజమ్మీద బుల్డోజర్‌లా సాగిపోతుంది. చట్టాలతో, రాజ్యాంగంతో, సాధారణ పాలనా విధానాలతో, వెరసి ఏ ఒక్క ప్రజాస్వామ్య ప్రక్రియతో నిమిత్తం లేకుండా ఒక గుంపు క్రూరంగా లోపలి రాజ్యంగా పని చేస్తుంది. దానికి అనుకూల వాతావరణం కల్పించడం, ముందుకు తీసుకపోవడమే బైటి రాజ్యం పని. ఇప్పుడు మన దేశంలో బైటికి కనిపిస్తున్న రాజ్యం లోపలి రాజ్య ప్రాతినిధ్య రూపం మాత్రమే. దీని వల్ల బైటికి కనిపించే రాజ్యం ప్రజల ప్రతినిధిగా ఇక ఎంత మాత్రం ఉండలేదు. ఉదాహరణకు మన దేశంలో కార్పొరేట్ల కోసం మోదీ ప్రభుత్వం నడుస్తోందనీ, నేరుగా వాళ్లే మోదీని నియమించుకున్నారనీ, చట్ట సభల నిర్ణయాలకంటే ఆదానీ అవసరాల ప్రకారం ఈ దేశం నడుస్తోందనే సంగతి ఇప్పుడు అందరి కామన్‌సెన్స్‌లో భాగమైంది. దీని వెనుక జరిగే మంతనాలు, కుట్రలు, దాడులు, విద్రోహాల వివరాలు పూర్తిగా తెలియకుండా పని చేసే ఒక రహస్య ముఠా నిరంకుశ అధికార రూపమే లోలోపలి రాజ్యం.
నిజానికి ‘డీప్ స్టేట్’ అనే భావన గత ముప్పై ఏళ్ల నుంచి సామాజిక, రాజకీయ శాస్త్రాల్లోకి కొత్తగా వచ్చిన విశ్లేషణా పరికరం. రాజ్యం, రాజ్యాంగ యంత్రం గురించిన ప్రామాణిక మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణను మరింత విస్తరించడానికి ఇది ఉపయోగపడుతుంది. రాజ్యమంటే బైటికి కనిపించే ప్రభుత్వం కాదు. అప్రకటితంగా ఉండే పాలకవర్గ ప్రయోజనాలు తీర్చే వ్యవస్థీకృత ఆధిపత్య రూపం. కాలక్రమంలో పాలకవర్గంలోని ముఠాలు, వాటి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పెరిగాయి. వాటిని తీర్చుకొనే అనేక కొత్త మార్గాలు ముందుకు వచ్చాయి. వీటిలో సాంకేతికత ఒకటి. వీటన్నిటినీ సమన్వయించే రహస్య వ్యవస్థగా లోపలి రాజ్యం పని చేస్తున్నది. గత కొద్ది దశాబ్దాలుగా ఈ లోపలి రాజ్యం లోతు పెరిగే కొద్దీ, దాని పని తీరు సమాజాన్ని తీవ్ర సంక్షోభంలోకి, హింసలోకి తోసివేస్తున్నది. దీని వల్ల సామాజిక, రాజకీయ రంగాల్లో లోపలి రాజ్యం అనే భావన ప్రాచుర్యం పొందింది.
భారత రాజ్యం ఏర్పడిన చారిత్రక, రాజకీయ పరిస్థితుల వల్ల అది పార్లమెంటరీ రూపాన్ని ఎంచుకున్నది. ఇది ఆధునిక యుగం కాబట్టి బర్బర, రాజరిక, వలస పాలనా రూపాలు తెర వెనక్కి వెళ్లిపోయి రిపబ్లిక్‌గా ఏర్పడిరది. ప్రజల కోసం, ప్రజల చేత .. పని చేస్తానని అది ప్రకటించుకుంది. తన స్వభావం ప్రజల సార్వభౌమత్వమని, గణతంత్రమని చెప్పుకుంది. కానీ వలసవాదం నుంచి అంటుతొక్కిన ఈ భావనలు, ప్రక్రియలు నిజం కాదనే విమర్శ మొదటి నుంచీ ఉంది. ప్రకటిత ఆదర్శాలకు భిన్నంగా, వ్యతిరేకంగా రిపబ్లిక్ పని చేయడం పెడ ధోరణి కాదు. అందులో ఒక తర్కం ఉంది. ఉత్పత్తి సాధనాల మీద ఒక వర్గం ఆధిపత్యం చెలాయిస్తున్న సమాజంలో పైన చెప్పిన తర్కం ప్రకారం బైటికి ప్రకటించిన ఆదర్శాలు కాకుండా వేరే కర్తవ్యాలను రాజ్యం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ప్రయోజనాలు పొందేందుకు అనుసరించే చట్టాతీత, నిరంకుశ ప్రయోజనాల్లోంచి లోపలి రాజ్యం ఏర్పడుతుంది.
3
ఆధునిక రాజ్యం అఖండ నిర్మాణం కాదు. అది అంతస్థుల వ్యవస్థగా మారింది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రాతినిధ్య రూపంగా, ప్రజలు కేంద్రంగా, ప్రజాస్వామ్య ప్రక్రియల సమాహారంగా పైకి ఒక రాజ్యం కనిపిస్తుంది. రాజ్యాంగ యంత్రం మీది దోపిడీ వర్గాధిపత్యం సజావుగా కొనసాగుతూ ఉండగానే లోపలి రాజ్యం కూడా అవతరిస్తుంది. ఎన్నికల ద్వారా అధికారం పొందిన రాజకీయ అధినేతలకు, చట్టానికి అతీతంగాగానీ, ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయంతో గాని రహస్య, అనధికార ఆధిపత్య శక్తుల కూటమి ఒకటి తయారవుతుంది. చాలాసార్లు చట్టం ప్రకారం నడుచుకోవలసిన వ్యక్తులే ఈ కూటమిలో భాగమవుతారు. నాయకులవుతారు. ఇలాంటి ముగ్గురో నలుగురో వ్యక్తుల నిరంకుశ అధికార వ్యవస్థగా లోపలి రాజ్యం సమాజం మీద పెత్తనం చేస్తుంది.
బూర్జువా విప్లవాలు జరిగిన దేశాలకంటే కేవలం రూప సంబంధమైన ప్రజా పాలన ఉన్న దేశాల్లో లోపలి రాజ్యం ఏర్పడ్డం, దేశాన్నంతా చేతిలోకి తీసుకోవడం చాలా తేలిక. పైకి రిపబ్లిక్ రాజ్య రూపం ఉండటం, లోపల అసలు రాజ్యం ఉండటం అనే బహిరంగ, అంతర్గత అంతస్థులు ఏర్పడతాయి. పైకి కనిపించే రాజ్య సాంద్ర రూపంగా లోపలి రాజ్యం పని చేస్తుంది. అనేక వైరుధ్యాల పుట్ట అయిన రిపబ్లిక్‌లోంచి ఫాసిజం పుట్టి నామ మాత్ర రిపబ్లిక్‌ను ధ్వంసం చేయడం, ఇంకో పక్క లోపలి రాజ్యాన్ని సర్వశక్తివంతం చేయడం అనే అత్యంత ప్రమాదకర దశకు భారతదేశం చేరుకుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా భారత రాజ్యం నోటి మాటగా అనేక ప్రగతిశీల వాగ్దానాలు ప్రకటించినప్పటికీ సారంలో దోపిడీ వర్గాల సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా మారింది. ప్రజల పేరుతో ప్రజలకు ద్రోహం చేసి, రూపంలోనే మిగిలిపోయిన రిపబ్లిక్ ఫాసిస్టుల చేతిలో మరింతగా బదాబదలైపోయే క్రమంలో లోపలి రాజ్యం బలోపేతమైంది. ముమ్మరంగా పని చేస్తోంది. రిపబ్లిక్‌కు ఉండే ఉదారవాద ప్రక్రియలు లోపలి రాజ్యానికి అవసరం లేదు. గత ముప్పై నలభై ఏళ్లలో భారత రాజ్యం ఈ పరిణామానికి లోనైంది. రాజ్యంలోని ఈ రెండు అంతస్థులను, వాటి పని పద్ధతులను, మొత్తంగా దాని స్వభావాన్ని, లక్ష్యాన్ని కలిపి చూడాలి. అప్పుడే రాజ్యం సమగ్రంగా అర్థమవుతుంది.
దీన్ని గ్రహించలేని సామాజిక, రాజకీయ వ్యాఖ్యాతలు భారత రాజ్యం ప్రజాస్వామికీరింపబడుతోందని సూత్రీకరిస్తున్నారు. అది ప్రజలకు చేరువ అవుతోందని, నిజమైన రిపబ్లిక్‌గా మారుతోందని అంటున్నారు. లోపలి రాజ్యం బలపడేకొద్దీ రిపబ్లిక్‌లో నామ మాత్రంగా కూడా ప్రజలు లేకుండాపోయారు. రాజ్యాంగంలోని ఐదు, ఆరు షెడ్యూళ్లు, వన్ ఆఫ్ సెవెంటీ, పెసా చట్టం మొదలైన రక్షణ చట్టాలు తయారైన రోజుల్లో రిపబ్లిక్‌కు వాటి గురించి ఉన్న పట్టింపు కూడా ఇప్పుడు లేదు. వాటి ద్వారా రక్షణ పొందాల్సిన ఆదివాసులంటే ప్రజలనే కనీసం స్పృహ కూడా లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేదీ, ప్రభుత్వ విధానాలను నిర్ణయించేదీ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కాదు. హింసాత్మక స్వభావంతో స్వలాభాల కోసం ఎలాంటి చట్టాతీత చర్యలకైనా పాల్పడే మాఫియాలాంటి కార్పొరేట్లు ఆ పని చేస్తున్నారు. బహిరంగ రాజకీయ చిత్రపటంలో రాజకీయ ప్రక్రియలు పక్కకుపోయి కార్పొరేట్ల వ్యాపార లావాదేవీలు ప్రధానం అయ్యాయి. లేదా అవే రాజకీయ విధానాలయ్యాయి. పైకి కనిపిస్తున్న ఈ దృశ్యం వ్యవస్థీకృత సారం, పని విధానమే లోపలి రాజ్యం. నిరంకుశ అధికారాలను చెలాయించే పోలీసు, సైనికాధికారులు ఇందులో భాగం.
సమాజంలో పైకి కనిపించే రిపబ్లిక్ పాలన నుంచి అన్నిటినీ నిర్ణయించే లోపలి రాజ్య పాలనలోకి మనమొచ్చాం. దానితో సంప్రదింపులకు, చర్చలకు అవకాశం ఉండదు. ప్రజా ఆకాంక్షలను, నిరసనలను అది అస్సలు పట్టించుకోదు. కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే ప్రజా ఆకాంక్షపట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దీనికి తాజా ఉదాహరణ. లోపలి రాజ్యానికి ప్రజలతో చర్చించే స్వభావం ఉండదు. మావోయిస్టుల విషయంలో అదొక దృఢమైన వైఖరి తీసుకుంది. అలాంటి లోపలి రాజ్యం ఛాయలకు ఎవ్వరైనా వెళ్లి, ఆ వైఖరిని ప్రభావితం చేసే పరిస్థితే దేశంలో లేదు. అసలు లోపలి రాజ్యం ఈ దేశంలో ప్రజలనే వాళ్లు ఉన్నారనే అనుకోదు. ఆదివాసులు సహా ఈ దేశ ప్రజలు భారత రిపబ్లిక్‌లో భాగం కాదని చెప్పడానికి ఈ వ్యాసాల్లో ఫెలోట్రావెలర్ అనేక ఉదంతాలను వివరించారు. ఉదాహరణలు ఇచ్చారు. సుప్రీంకోర్టు భారత రిపబ్లిక్ తన బిడ్డలను తాను చంపుకుంటుందా? అనే అరుదైన ప్రశ్న వేసిందిగానీ, ఆ మాటకు రిపబ్లిక్ ఏమీ స్పందించ లేదు. పైగా అందరినీ చంపేస్తామని అంటోంది. అది లోపలి రాజ్యానికి అవసరం. దశాబ్దాల చర్చల్లో, వివాదాల్లో, పోరాటాల్లో నలిగిన కశ్మీరీ ప్రజా ఆకాంక్షను తుడిచేయాలని ఒక చిన్న బృందం అనుకోగానే 370 రద్దయిపోయింది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్ కాబట్టి పార్లమెంట్‌లో ప్రహసనం నడిచింది. ఆర్టికల్ 370 రద్దు వెనుక పని చేసింది లోపలి రాజ్యమే.
4
ఆదివాసుల, మావోయిస్టుల విషయానికి వస్తే భారత అంతర్గత రాజ్యం అమిత్‌షా, అజిత్ దోవల్, అదానిలతో నడుస్తోంది. ఈ ముగ్గురి నేపథ్యాలతో, ప్రయోజనాలతో ఈ కలయికకు అత్యంత ప్రమాదకరమైన స్వభావం వచ్చింది. చట్టాలకు, రాజ్యాంగానికి, రాజకీయాలకు సంబంధం లేని కీలక నిర్ణాయక శక్తిగా ఈ ముఠా పని చేస్తున్నది. అదే సమయంలో తన ప్రయోజనాలకు తగిన చట్టపరమైన సేవలను బైటి రాజ్యం ద్వారా పొందుతున్నది. తన దోపిడీకి అడ్డంగా ఉన్న చట్టాలను రద్దు చేయిస్తుంది. అవసరమైన చట్టాలను తయారు చేయించుకుంటున్నది. సారాంశంలో ప్రజాస్వామ్యానికి ఉండవలసిన సూత్రబద్ధ చట్టబద్ధ పాలనకు, పాదర్శకతకు లోపలి రాజ్యం బద్ధ వ్యతిరేకి.
ఆదివాసులను అడవి నుంచి తీసేయాలనీ, విప్లవకారులందరినీ చంపేయాలనీ లోపలి రాజ్యం అనుకుంది. ఈ నిర్ణయంతో పైకి కనిపించే రిపబ్లిక్‌కు అభ్యంతరమేమీ ఉండదు. పైగా దానికి తగిన పని పద్ధతులను సమకూర్చుతుంది. ఈ పని ఎంత హింసాత్మకంగా, చట్టాతీతంగా, అమానవీయంగా ఉంటుందో, లోపలి రాజ్యంలోని వ్యక్తులకు ఇది ఎందుకు అవసరమైందో ఈ పుస్తకంలోని ప్రతి వ్యాసమూ వివరిస్తుంది.
సాధారణ రాజ్య అణచివేతకూ, లోపలి రాజ్య అణచివేతకూ పోలికలు ఉండవచ్చుగాని, స్పష్టమైన తేడా ఉంటుంది. ఈ అంతిమ యుద్ధం ప్రత్యేకత ఇదే. మావోయిస్టు రహిత భారత్ అనే లక్ష్యం రిపబ్లిక్‌లోని ఏ చట్టానికీ లోబడినది కాదు. ఒక రాజకీయ పార్టీని నిర్మూలించాలని, ఒక భావజాలంతో ఉన్న సమూహంలో చివరి వ్యక్తిని కూడా చంపేస్తానని ప్రజా ప్రాతినిధ్యంతో ఎన్నికై, చట్టబద్ధంగా పని చేసే ఏ ప్రభుత్వమూ అనడానికి వీల్లేదు. లోపలి రాజ్యం అవసరాల కోసం ప్రభుత్వం ఏమైనా అనగలదని, చేయగలదని రుజువైంది. ఫాసిస్టులు రాజ్యాంగ ప్రక్రియలను, సంస్థలను దెబ్బతీస్తున్నట్లు కనిపిస్తున్నదికానీ, పైన ఈ విధ్వంసం జరిగే కొద్దీ లోపలి రాజ్యం లోలోపలికి వేళ్లూనుకుంటోంది.
ఈ రాజకీయ సందర్భానికి తగినట్లు ఫెలోట్రావెలర్ ‘కగార్ రిపబ్లిక్’ అనే పదబంధాన్ని సృష్టించారు. నిజానికి మావోయిస్టు రహిత భారత్‌ను లక్ష్యంగా పెట్టుకున్న రిపబ్లిక్ మాత్రమే కాదు. ఇది అసలు కగార్ మావోయిస్టు నిర్మూలనా సైనిక యుద్ధతంత్రమే కాదు. మరీ వెనక్కి పోకుండా 1991 నూతన ఆర్థిక విధానాల దగ్గరి నుంచి, 2004 తొలి యుపిఏ పాలన నుంచి, ఇంకా నిర్దిష్టంగా 2014 సంఫ్‌ు పాలన నుంచి చూసినా 2024లో మొదలైన కగార్‌కు మావోయిస్టు రహిత భారత్ అనే లక్ష్యం మాత్రమే లేదని సులభంగా గ్రహించవచ్చు. లోపలి రాజ్యం వత్తాసుతో, మార్గదర్శకత్వంతో భారత రిపబ్లిక్ దేశ ప్రజలందరి మీద చేస్తున్న యుద్ధం ఇది.
కగార్ రిపబ్లిక్ అంటే ఏమిటో తెలుసుకోడానికీ, తన వ్యాసాల మధ్య ఉన్న అంతస్సూత్రం గ్రహించడానికీ.. నలుదిశలా గాఢమైన వెలుగులు ప్రసరించే దీపంలాంటి శీర్షికను రచయిత ఈ పుస్తకానికి పెట్టారు. దాదాపుగా వ్యాసాలన్నీ కగార్ గురించి, కగార్ సందర్భంలో రాసినవే. వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలన్నిటినీ కూర్చి కగార్ సారాన్ని తెలిపే రిపబ్లిక్ వైపు మన చూపు మళ్లించారు.
అమిత్‌షా తాను ఆరంభించిన కగార్ మీది నుంచి దృష్టి మళ్లించడానికి విప్లవోద్యమం అభివృద్ధికి ఆటంకమనీ, దేశద్రోహమనీ మాట్లాడుతోంటే, ఆయనకు ఆ అధికారం ఇచ్చిన రిపబ్లిక్ మీదికి ఫెలోట్రావెలర్ ఈ శీర్షికతో మన ఆలోచనల్ని పురికొల్పారు.
ప్రజాస్వామిక భావనలను, విప్లవాత్మక ఆచరణను దేశద్రోహమనే పేరుతో ఎదుర్కోడానికీ, తన ప్రత్యర్థులను అణచివేయడానికీ లోపలి రాజ్యం సైనిక చర్యలతోపాటు విద్రోహానికీ కూడా పాల్పడుతుంది. అది చేసే విధ్వంసం సాంతం బైటికి తెలియనట్లే, దాని విద్రోహం కూడా ప్రచారంలోకి రాదు. తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు తీర్చుకోవడంతోపాటు, వాటికి అడ్డంగా ఉండే ప్రజాస్వామిక వ్యవస్థలను, భావజాలాలను, పోరాటాలను, నిర్మాణాలను కూడా ధ్వంసం చేయడానికి కుట్రలు, చొరబాటులు, విద్రోహాలనే రహస్య పని విధానాన్ని లోపలి రాజ్యం కొనసాగిస్తుంది. మూకుమ్మడి అణచివేతకు కుట్రలు పన్నినట్లే, విప్లవ నిర్మాణాలను దెబ్బతీయడానికి, విప్లవ భావజాలాన్ని తుడిచిపెట్టేయడానికి విద్రోహానికి పాల్పడుతుంది. ఇది ఎంత పైస్థాయిలో జరగడానికి అవకాశం ఉన్నదో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు లొంగుబాటులో చూడవచ్చు.
కార్పొరేట్లు, మతతత్వ శక్తులు, చట్టాతీతంగా పని చేయడమే దేశ సేవగా భావించే భద్రతా అధికారుల రహస్య గణం విప్లవోద్యమంలో బలహీనమైన వ్యక్తులను, వ్యక్తిత్వాలను చొరబాటుకు మార్గంగా మార్చుకుంది. ఈ ఇద్దరి నాయకులు లొంగుబాటు మేళాకు కార్పొరేట్ ప్రతినిధులు హాజరు కావడం దగ్గరి నుంచి ఆ శక్తుల వైపు నుంచి ఈ వ్యవహారంపై వచ్చిన ప్రతిస్పందనను గమనిస్తే లోపలి రాజ్యాన్ని ఎవరు నడుపుతున్నదీ స్పష్టమవుతుంది.
హిందుత్వ శక్తులకు సుదూర లక్ష్యం ఉన్నట్లే, అడవులు, భూములు, గనుల కార్పొరేట్ సంచయంలో కూడా దీర్ఘకాలిక వ్యూహం ఉన్నది. వీటితోపాటు కార్పొరేట్లకు తక్షణ అవసరం అంతకంటే ఎక్కువ ఉన్నది. దీని కోసం అభివృద్ధికి మావోయిస్టులు ఆటంకమనే ప్రచారం లేవదీశారు. ఇది రాజకీయ కగార్. అడవులను చేజిక్కించుకోవాలంటే మొదటి విడతగా మావోయిస్టులను ఖాళీ చేయించాలి. ఆ తర్వాత ఆదివాసులను అక్కడి నుంచి పంపించేయాలి. ఈ పనులు హింసాత్మకంగా చేయాల్సిందే. దాని కోసం లక్షల బలగాలను మోహరించారు. ఇది సైనిక కగార్. మావోయిస్టు ఉద్యమ ప్రజా మూలాలు, సిద్ధాంత, భావజాల ప్రభావాలు తెలుసు కాబట్టి మనుషుల్ని చంపి దేశాన్ని మావోయిస్టు రహితం చేయడం సాధ్యంకాదనే నిర్ధారణకు రాజ్యం వచ్చింది. స్వచ్ఛందంగా మావోయిస్టులతోనే ఉద్యమ, ప్రజా క్షేత్రాన్ని ఖాళీ చేయించాలి. ఇంకో మార్గం లేదు. విప్లవోద్యమం ఆ పనిని ఎన్నటికీ చేయదు. కాబట్టి లోపలి నుంచి లొంగుబాటువాదం లేవదీసింది. ఇది విద్రోహ కగార్. మొదటి రెంటినీ బహిరంగ రాజ్యం ప్రకటించి మరీ చేసింది. మూడో దాన్ని లోపలి రాజ్యం లోలోపలి నుంచి రహస్యంగా చేసింది. దీని కోసం ఒక పథకాన్ని, ఒక భావజాలాన్ని, ఒక మానసికతను సిద్ధం చేసింది. విప్లవోద్యమంలో విద్రోహం కొత్తదేమీ కాదు. అన్ని విప్లవ నిర్మాణాలకు ఎంతో కొంత ఈ అనుభవం ఉంది. అయితే మావోయిస్టు పార్టీకి ఎదురైన అనుభవం గత అనుభవాల్లాంటిది కాదు. వాటికి కొనసాగింపు కాదు. ఇది ‘కగార్ రిపబ్లిక్’ కాలానిది. స్థూలంగా ఇప్పుడు కగార్‌ను ఇట్లా అర్థం చేసుకోవచ్చు. కగార్‌లోని అణచివేత బహిరంగ రాజ్యానిది, విద్రోహం లోపలి రాజ్యానిది. ఇదంతా మన దేశాన్ని కార్పొరేట్ హిందుత్వ రాష్ట్రగా మార్చాలనే ఫాసిస్టు వ్యూహంలో భాగం.
10 డిసెంబర్ 2025
(ఫెలో ట్రావెలర్ పుస్తకం ‘కగార్ రిపబ్లిక్’ కు రాసిన ముందుమాట)
పడికట్టుపదాలతో అయోమయం భావాలతో ఇలా ఎంత వ్రాసినా నిరుపయోగమే. ఏవ్యవస్థా లేని ఆటవికసమాజాన్ని స్థాపించాలని కోరే మీ మానసికరోగం నయం అయేది కాదు. తుపాకులతో మీరు జనాన్ని చంపుతూ పోవటం న్యాయమూ మిమ్మల్ని మరొకరి చేతి తుపాకీ దొరకబుచ్చుకోవటం అన్యాయమూ అనటం మూర్ఖత్వం. సమాజానికి హానిచేసే మిమ్మల్ని తొలగించటం న్యాయమే.
ఈ మాటను మీరు తప్పక తొలగించగలరు ఎప్పటిలాగానే. కాని మిమ్మల్నితొలగించే విధిని మాత్రం మీరు తొలగించలేరు. గ్రహించండి.