పల్లవి:
రేపటి ఉదయం కలగంది
చీకటి రాజ్యం కూలునని
నీళ్ళకు బదులు ఆకుల నుండి
రాలిన నెత్తురే త్యాగమని
ఫాసిజమంటి పడగ నీడన
నీరస పడక నిరసన జెండగ
అను పల్లవి :
లే లే లేచిన కలమే కవి సందర్భం
రా రచయితలై దాటగా ఈ సంక్షోభం
కాశ్మీరాలకు మిజోరంలకు
ఆదివాసులకు అండదండగా…. ॥లే లేచిన॥ ॥రేపటి॥
1. నాగరికతనె కన్నది అడవి
అంగడి సరుకై పోతుందా
గర్భమునందే ఖనిజ సంపదా
దేవకి దేవై మిగిలిందా
కంసుని చేరలో కన్నయ్యెవరో
భవిష్యవాణి చెబుతుందా
ఈ వనమే బృందావనమౌనని
జన రాజ్యం దండోరేసిందా…. IIలే లేచిన॥ ॥రేపటి॥
2. ఆకలి పేగును చీల్చే తుపాకీ
అంతర్యుద్ధం అయ్యిందా
చరిత్ర పొడవున ఖడ్గ సృష్టికి
కలమే జవాబు చెప్పిందా
కళా జీవితం మనిషి జీవితం
విడివిడి కాదని చాటిందా
కవులారా మీరెటువైపంటూ
ప్రశ్నల కొడవలి మొలిచిందా…. ॥లే లేచిన॥ ॥రేపటి॥
3. కాషాయాలు కార్పోరేట్లు
కవల పిల్లలై వస్తుంటే
విశ్వవిద్యనే అగ్రహారమున
అపసోపాలు పడుతుంటే
ఆలోచనకు అర్బన్ నక్సల్
ముద్రలు ముదిరి పోతుంటే
మందిర్ మసీద్ గొడవద్దన్న
సుప్రీం కోర్టుకె చురకేస్తుంటే… ॥లే లేచిన॥ ॥రేపటి॥
4. యుద్ధమె ఆగని విధ్వంసాలకు
విశ్వమే చిరునామవుతుంటే
బహుళ జాతుల దోపిడి పైన
కలమే కత్తులు దూస్తుంటే
చెరసాలలు ఉరికొయ్యలన్ని
ధిక్కరించిన అమరత్వానికి
నర్మద, సాయి, స్టాన్ స్వామిల
మరణం కూడా సవాల్ విసరగా
లే లేచి నిలబడే కవి సందర్భం
రా రచయితగా దాటు ఈ సంక్షోభం
గిర గిరా తిరిగే కాల చక్రమును ఆపరు ఎవ్వరు ఆపరని
బిర బిర సాగే సమాజ గమనం విప్లవ మార్పు ఆగదని
॥ లే లేచి నిలబడే కవి సందర్భం ॥
॥ రా రచయితగా దాటు ఈ సంక్షోభం ॥
(విరసం 24వ సాహిత్య పాఠశాల 2025, ఫిబ్రవరి 8, 9 తేదీల్లో కర్నూలులో జరుగుతున్న సందర్భంగా….)
Excellent