లాక్ డౌన్

– ఫాదర్ రిచర్డ్ హెండ్రిక్
(ఐర్లాండ్ లో మతబోధకునిగా పనిచేస్తున్న రిచర్డ్ హెండ్రిక్ , లాక్ డౌన్ పై మార్చి 13న ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఈ కవిత విస్తృత ప్రాచుర్యం పొందింది)

అవును, భయం వున్న మాట నిజమే
ఒంటరిగా ఉంటున్న మాటా నిజమే
గాభరాతో సరుకులు కొంటున్న మాట నిజమే
జబ్బు మాట నిజమే
అవును, చావు కూడా ఉన్న మాట నిజమే

కానీ,

ఊహాన్ లో అనేక సంవత్సరాల రణగొణ ధ్వనుల తర్వాత
మళ్ళీ పక్షుల కువకువలు వినిపిస్తున్నాయట

కేవలం కొన్ని వారాల ప్రశాంత వాతావరణం తర్వాత
ఆకాశం పొగచూరి కనిపించడంలేదట
స్వచ్ఛమైన నీలాకాశం కనిపిస్తుందట

అసీసి పట్టణవీధులలో
నిర్మానుష్యమైన కూడళ్లలో
కిటికీలు తెరిచి జనం పాటలు పాడుతున్నారట
ఒంటరిగా వున్నవాళ్ళకి
తమ చుట్టూ వున్న కుటుంబాల మాటలు వినిపించాలని

పశ్చిమ ఐర్లాండ్ లో ఒక హోటల్
ఉచిత భోజనం అందిస్తున్నారట, ఇళ్లకి కూడా పంపుతున్నారట

నాకు తెలిసిన ఒక పడుచు అమ్మాయి
తన ఫోన్ నెంబరుతో గాలిపటాలు ఎగరవేస్తూ వుంది
చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా
ముసలి వాళ్లకి మాట్లాడాలనిపిస్తే సాంత్వన పలకడానికి

ఈ రోజు చర్చిలు, సినాగాగ్ లు, మసీదులు, మందిరాలు
తలదాచుకునే గూడు లేని మనుషుల కోసం, జబ్బు పడిన వాళ్ళ కోసం, అలసిన మనుషుల కోసం
తలుపులు తెరిచి స్వాగతం పలకడానికి సమాయత్తమౌతున్నాయి

ప్రపంచమంతా మనుషులు పరుగులు మాని నెమ్మదిగా ఆలోచిస్తున్నారు
ప్రపంచమంతా మనుషులు తమ పొరుగు వాళ్ళని కొత్తగా చూస్తున్నారు

ప్రపంచమంతా మనుషులు ఒక కొత్త నిజాన్ని గుర్తిస్తున్నారు
మనమెంత అల్పులమో
మనమెంత అశక్తులమో తెలుసుకుంటున్నారు

ఏది అవసరమో తెలుసుకుంటున్నారు
అది మనుషుల్ని ప్రేమించడం

ప్రార్ధించుదాం, గుర్తుపెట్టుకుందాం
భయం ఉన్న మాట నిజమే
కానీ ద్వేషం ఉండాల్సిన అవసరంలేదు

ఒక్కొక్కరుగా విడివిడిగా ఉన్నమాట నిజమే
కానీ ఒంటరితనం ఉండాల్సిన అవసరం లేదు

గాభరాతో సరుకులు కొంటున్న మాట నిజమే
కానీ ఎదుటివాళ్ళతో పంచుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు

జబ్బు ఉన్న మాట నిజమే
కానీ మనసులు జబ్బుపడాల్సిన అవసరం లేదు

మృత్యువు ఉన్న మాట నిజమే
కానీ ప్రేమకి పునర్జన్మ ఎల్లప్పుడూ ఉండవచ్చు

ఇప్పుడు జీవించడం ఎలాగో ఎంచుకుందాం

ఈరోజు ఊపిరి పీల్చుకుందాం

ఫ్యాక్టరీల గోల, మన ఆందోళనల మధ్య

మళ్ళీ పక్షులు పాటలు పాడుతున్నాయి
ఆకాశం తేట పడుతోంది
వసంతం మళ్ళీ వస్తున్నది
మన చుట్టూ ప్రేమ పరుచుకుంటున్నది

మనసు కిటికీలు తెరవండి
నిర్మానుష్యపు కూడళ్లలో
మనం మనుషులని తాకలేక పోవచ్చు

పాటలు పాడుకుందాం.

(అనువాదం: సుధా కిరణ్)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

2 thoughts on “లాక్ డౌన్

  1. అనువాదం బాగుంది సరళమైన గాఢత తో!… మూలానికీ, అనువాదానికీ అభినందనలు!

Leave a Reply