దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే బీజేపీ అంతిమ లక్ష్యం : రోమిల్లా థాపర్

రోమిల్లా థాపర్ భారతదేశ చరిత్రకారుల్లో అగ్రగణ్యురాలు. ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో 1970 నుండి 1991 వరకు హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసి, పదవీ విరమణ తర్వాత అదే విశ్వవిద్యాలయంలో ఎమరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు. థాపర్ తన 87 ఏండ్ల వయస్సులో సైతం ప్రజా మేధావిగా రచనలు చేయడమే కాకుండా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నారు. తన పరిశోధనలో మతవాద చరిత్రను తిరస్కరిస్తూ శాస్త్రీయ దృక్పథంతో సామాజిక, సాంస్కృతిక, పురావస్తు ఆధారాలతో ప్రాచీన భారతీయ చరిత్రకు సరికొత్త వ్యాఖ్యానం చేశారు. మార్క్సిస్ట్ చరిత్రకారిణిగా చరిత్ర పరిశోధనా పద్ధతుల మీద ఎంతో కృషి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అకడమిక్ పురస్కారాలు పొందారు. భారత ప్రభుత్వం రెండు సార్లు ప్రకటించిన పద్మభూషన్ అవార్డును తిరస్కరించారు. రాజ్యం ఇచ్చే ఏ అవార్డునూ తీసుకోనని ప్రకటించి తన నిబద్ధతను చాటుకున్నారు.

2019 ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 15 న రోమిల్లా థాపర్‌ను ఓ టి.వి చానెల్ కోసం కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూ.

కరణ్ థాపర్: మోదీ ప్రభుత్వం మీద మీ అంచనా, మీ అభిప్రాయం క్లుప్తంగా చెప్తారా?
రోమిల్లా థాపర్‌: గడిచిన ఇన్నేళ్లలోకీ – ఇవి అత్యంత ప్రధానమైన ఎన్నికలని చెప్పుకోవాలి. ప్రతీ ఎన్నికలప్పుడూ, ఇలా అనడం పరిపాటే గాని నా ఉద్దేశంలో ఒక మూడు అతి కీలకమైన ఎన్నికలున్నాయి. ఒకటి: వయోజన వోటింగు ద్వారా ప్రజాస్వామ్యాన్ని స్థాపించుకున్న మొట్టమొదటి ఎన్నికలు. రెండోది: భారత పౌరులు – నియంతృత్వాన్ని మొగ్గలోనే తుంచివేసిన 1977 ఎన్నికలు. ఇక మూడోది: అంతే ముఖ్యమైనవి – ఈ ఎన్నికలు. ఎందుకంటే – ఈ అయిదేళ్లూ మనని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఏ స్థలానికి చేర్చారో – అది – ఇప్పుడు మన కళ్ల ముందుంది. మన ఎంపిక హిందూ రాజ్యమా?లేక సెక్యులర్ ప్రజాస్వామ్యమా?అనేది తేల్చుకోవాలి. మనకున్నవి ఈ రెండే గత్యంతరాలని ఈ అయిదు సంవత్సరాలనీ పరిశీలిస్తే తెలుస్తుంది.

కరణ్: అయితే ఈ అయిదేళ్లలోనూ మీకేవేం కనిపిస్తున్నాయి?
రోమిల్లా: మూడు రకాల కార్యక్రమాలని నేను గమనించాను.

 1. ఈ అంశం ప్రజలందరికీ తెలిసినదే, చాలా విస్తృతంగా చర్చించబడింది కూడా. ఆర్ధికరంగ సంబంధమైన – ఈ అంశంలో – డీమానిటైజేషన్, వ్యవసాయరంగం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ, నిరుద్యోగం – ఇవన్నీ ఉన్నాయి.
  వాగ్దానం చేసిన వేవీ ప్రజలకి ఇవ్వలేదు – కళ్ల ముందు కనపడుతూ ఉందది. వారి వైఫల్యాలలో ఇది పెద్ద భాగం. ఆసక్తికరంగా తోచేదేమిటంటే – ఉపన్యాసాలలో ఈ ‘ఆర్ధిక అభివృద్ధి’ అనే ఊసే ఎత్తకపోవడం. కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ – ‘నువ్వంటే నువ్వ’ని నిందారోపణలే తప్ప ఆర్ధిక విధానాల చర్చ చేయడం – ఎక్కడా వినపడలేదు.
 2. హిందుత్వ కార్యక్రమాలు – ఘర్ వాపసీ, లవ్ జిహాద్ వంటివి – ఒక స్థాయి దాటేక పని చెయ్యలేదు. ఇక్కడ విషయమేమిటంటే… ఒకరి మతాన్ని మార్చి హిందువుని చెయ్యగలవు – కానీ కులం సంగతేచేస్తావు… దాని తోటే నువ్వు పుడతావు – అక్కడ క్రైసిస్ ఎదురయింది వీరికి.
  మనుషుల్లో భీతాహం కలిగించడంలో మాత్రం విజయం సాధించారు. గోరక్షక్ కార్యక్రమాలూ, బీఫ్ తినడం, కసాయి దుకాణాల మీద నిఘాలూ – వీటితో మైనారిటీలను దూరం చెయ్యగలిగేరు – ఆమేరకి వారు గెలిచారనే చెప్పాలి.
 3. పెద్దగా చర్చల్లోకి రాని అంశం, నావంటి వారికి ఆందోళన కలిగించే విషయం – భావ వ్యక్తీకరణ మీద అమలౌతున్న నిర్బంధం. సామాన్య పౌరుల అరెస్టులూ; విద్యావేత్తలు, లాయర్లు, కవులు, రచయితలు – వీరిని ఉద్యమకారులని నిందించడం; సరైన విచారణ, సాక్ష్యాలు లేకుండా జైళ్లలో పెట్టడం – ఇదంతా ఒక ఎత్తైతే, పుస్తకాల ముద్రణ, సినిమాల సెన్సారింగ్ లో చొరబడి – అక్కడ కూడా – నిర్బంధాన్ని పెంచుకుంటూ పోడం – మరొక ఎత్తు.
  అన్నిటి కంటే తీవ్రమైనది – విద్యారంగానికి సంబంధించిన సంస్థలని – నేలమట్టం చేసేందుకు సాగుతున్న ప్రయత్నం.

కరణ్: రెండు విషయాల్లో మోదీ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేసానని నమ్ముతోంది. ఒకటి మచ్చలేని పరిపాలన – దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు రఫైల్ గురించి ప్రశ్నలు వినిపిస్తున్నాయనుకోండి కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి, నేరం జరిగిందని నిర్వివాదంగా నిరూపించగల రుజువులో, డబ్బు మార్పిడి జాడలో – ఏవీ కనపడ్డం లేదు. మోదీ పర్యవేక్షణలో – 2జీ, కోల్గేట్, ఆగస్టా వేస్ట్ లేండ్, కామన్వెల్త్ లాటి – ఏ స్కాం లూ – బయటికి రాలేదు. మరి ఇంతకు ముందు వాటి కంటే – ‘ఇది అవినీతిరహిత ప్రభుత్వం’ – అనొచ్చంటారా?
రోమిల్లా: చెప్పడం కష్టం. ఎంచేతంటే –ఇలాటి విషయాల్లో అకస్మాత్తుగా ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది, అంతవరకూ మనం సరిగా ఉన్నదనుకున్నది – ‘కాదు’ అని తేలుతూ ఉంటుంది. ఈరకమైన లోపాయికారీ లావాదేవీల లక్షణమే అది కదా. ప్రభుత్వం ఎంత నీతివంతమైనదో తర్వాత మాట్లాడదాం. డీమానిటైజేషన్ అవినీతిని అరికట్టివేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది కదా?

కరణ్: మరి అవినీతి అంతమవలేదా?
రోమిల్లా: లేదు. ఎంచేతనంటే అవినీతి ఎంతో కాలంగా పాతుకుపోయింది, ఉన్నత పదవులలో కూర్చున్న రాజకీయనాయకులూ, కార్పోరేట్లూ – వీటన్నిటిలోనూ ఉంది.

కరణ్: అవును, పెద్ద చిట్టాల కరప్షన్ అంటాం…
రోమిల్లా: కరెక్ట్. అది పోవాలని ఆశించడం ప్రస్తుత పరిస్థితుల్లో – గొంతెమ్మ కోరికే, దానిని పక్కన పెడదాం.

అయితే నేను మాట్లాడేది – నిత్య జీవితంలో ఎదురయ్యే అవినీతి గురించి. అది తగ్గకపోగా, ఇంకా ఎక్కువైందని తెలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి దైనందిన కార్యకలాపాల కోసం – టికెట్‌లో, కూపన్‌లో, ఐడెంటిటీ కార్డో – ఇలాటి పనులు వేటి కోసమైనా వెళ్లవలసి వచ్చిందనుకోండి – ప్రభుత్వోద్యోగుల కవనీ, పోలీసుల కవనీ – డబ్బు చెల్లించాల్సిందే. ఆరకంగా చెప్పాలంటే – అవినీతి మరింత పెరిగింది.

కరణ్: మోదీ గర్వంగా చెప్పుకునే రెండో అంశం – తను వాగ్దానము చేసినట్టే – దృఢమైన, నిర్ణయాత్మకమైన నాయకత్వాన్ని అందించానన్నది. మరి అయిదేళ్ల అనంతరం – ఆయన దృఢంగా, నిర్ణయాత్మకంగా ఉన్నారంటారా, లేదంటే – ఆ లక్షణాలు మరి కాస్త మోతాదు మించి – అధికార నిరూపణగానూ, ఒక్కొక్కసారి నిరంకుశంగానూ – వ్యవహరించారా?
రోమిల్లా: మంచి ప్రభుత్వం అనే దాని కుండాల్సిన మౌలిక లక్షణాలని మోదీ అసలు పట్టించుకోనే లేదని నా అభిప్రాయం. ఆయన దృష్టి కేవలం స్వంత గొప్పని చూపుకోడం మీదనే. వ్యక్తిగత ప్రచారకుడిగానే ఆయన కనిపిస్తున్నాడు. ఆమాట కొస్తే ఏ రాజకీయనాయకుడైనా అలాగే ఉంటాడు. అయితే ఆ ప్రచారం ఏ స్థాయికి తీసుకెళుతున్నారో – చూడాలి.

ఒక సాదాసీదా విషయం చెప్తాను చూడండి. మన దగ్గర ఒక స్పష్టమైనదీ, ఇదీ అని నిర్వచించి చెప్పగలిగిన విదేశాంగ విధానం అంటూ ఉందా? మన దగ్గరున్నదల్లా ఏమిటంటే – మోదీ గారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అక్కడి ప్రధానులనీ, ప్రెసిడెంట్‌లనీ ఆలింగనం చేసుకుంటున్న ఫోటోగ్రాఫ్‌లు మాత్రమే. మన చుట్టూ ఉన్న దేశాలలోని వివిధ అంశాలతో మన సంబంధాలెలా ఉన్నాయో, ఆ ఫోటోల నుంచి ఏమన్నా తెలుస్తుందా?

కరణ్: కేవలం తన వ్యక్తిగత అభివృద్ధే మోదీ విదేశాంగ విధానమని, కీలకమైన అంశాల పట్ల వ్యూహాత్మక అవగాహన లేదని మీ అభిప్రాయం – అవునా?
రోమిల్లా: అవును.

కరణ్: మోదీ ప్రభుత్వం భారతీయ విద్యారంగం మీద చూపిస్తున్న ప్రభావం గురించి చాలా మంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెఎన్‌యూ పట్లా, ICHR (Indian Council of Historical Research), ICSSR (Indian Council of Social Science Research) – ఇలాటి సంస్థల పట్లా – ప్రభుత్వ వ్యవహరణని దేశవ్యాప్తంగా వారంతా ఎత్తిచూపుతున్నారు. మీకూ ఉందా ఆ ఆందోళన?
రోమిల్లా: తప్పకుండా ఉంది. చెప్పాలంటే – ఒక సాధారణ విద్యావేత్తకుండే కంటే – మరింత ఎక్కువ స్థాయిలో ఉన్నాయి నా భయాలు. సంస్థల నిర్మాణమనే బృహత్కార్యాన్ని దగ్గర నుండీ చూసిన దానిని – తమ నిబద్ధతనీ, శక్తియుక్తులనీ, ప్రయత్నాన్ని – దానికి ధారపోసిన వారిని చూసినదానిని. ఇప్పుడా సంస్థలు డొల్లలవడం, క్రమంగా ముక్కలవడం చూస్తున్నాను. అయితే – ఎందుకు జరుగుతోంది ఇలా? దేని కోసం వీరు విద్యావిధానాల్లో జోక్యం చేసుకుంటున్నారు? అన్న ప్రశ్న వేసుకున్నాను.

కరణ్: ఏం జవాబు దొరికింది?
రోమిల్లా: ఇదంతా – దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న – ఆర్‌.ఎస్‌.ఎస్. బిజేపీల అంతిమ లక్ష్యసాధనలో భాగమే. ఈ దేశం – హిందూ రాజ్యం అయి తీరాలన్నది వారి ఆశయమని వారు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

కరణ్: తమ హిందూ రాజ్య భావజాలపు వ్యాప్తి కోసం విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తిని క్షీణింపచేస్తున్నారన్న మాట…?
రోమిల్లా: ఔను, అసలు ఈ హిందూ రాజ్యమనే భావజాలాన్ని కాస్త వివరించనీయండి – ఈ సిద్ధాంతం మొట్ట మొదటి సారిగా -1930లో రూపుదిద్దుకుంది. రెండు అంశాలపై ఇది ఆధారపడి ఉంది. ఒకటి వలసవాదపు భావజాలం – అది మీకు జేమ్స్ మిల్ 1818లో రాసిన పుస్తకం (The History of British India) లో కనిపిస్తుంది. దానిలో అతను భారతదేశ చరిత్రని – హిందూ, ముస్లిం, బ్రిటిష్ అనే మూడు దశలుగా విభజిస్తాడు. భారతదేశం -హిందూ, ముస్లిం అనే రెండు జాతులతో ఉన్నదనీ, అవెప్పుడూ ఒక దానితో ఒకటి కలహించుకుంటూనే ఉన్నవనీ – అతని వాదన. అదే రెండు జాతుల సిద్ధాంతం – ఈ హిందూ రాజ్యమనే ఆలోచనకి – ఖచ్చితంగా, సంపూర్ణంగా, నిస్సందేహంగా – అదే భూమిక.

కరణ్: మీ దృష్టిలో – బీజేపీ భావజాలానికి కూడా అదే భూమిక…
రోమిల్లా: ఔను. ఆర్‌.ఎస్‌.ఎస్. ని ప్రభావితం చేసే రెండో అంశం – అది అతి చేరువ సంపర్కంలో ఉంచుకునే యూరోపియన్ ఫాసిజం. వారి నాయకులు – ముస్సోలినీని, ఇటాలియన్ ఫాసిస్ట్ లనీ ఆరాధిస్తామని – చెప్పేరు, ఆర్‌.ఎస్‌.ఎస్. ని ఆ దిశగా పటిష్టం చేస్తామని పుస్తకాల్లో కూడా రాసేరు. (నవ్వుతూ) అందుకే ఆ సంస్థ అంత క్రమశిక్షణతో ఉండి ఉంటుంది.

కరణ్: ఆ నేపథ్యంలో – టెక్స్ట్ పుస్తకాలలో చేస్తున్న మార్పుల గురించి మీరేం చెప్తారు -ఎంచేతంటే – ఆ విషయాలని ప్రెస్ కూడా లేవనెత్తింది, కానీ – మీవంటి విద్యావేత్తలకి అది మరింత ఆందోళనకరంగా ఉండి ఉంటుంది, చెప్పండి – మీరెందుకు దానిని వ్యతిరేకిస్తున్నారు?
రోమిల్లా: ఎందుకంటే – అది ప్రాధమికం కనక. టెక్స్ట్ పుస్తకాలలో మార్పులు చెయ్యడమంటే – అందులోనూ చరిత్ర టెక్స్ట్ పుస్తకాలని – (నాకవి మరీ ముఖ్యం) మార్చగలిగామంటే – దేశాన్ని హిందురాజ్యంగా మార్చాలనే – భావజాలాన్ని సమర్ధించుకోగలమని అర్దం. పూర్తిగా – అది చరిత్ర మీద ఆధారపడి ఉన్న అంశం – అదెలాగో చెప్తాను వినండి మరి.

హిందూ రాజ్యపు ప్రధాన లక్షణం ఇలా ఉంటుంది – దాని ప్రాధమిక పౌరులు – హిందువులు. మరి హిందువు ఎవరంటే – వారి నిర్వచనం ప్రకారం – ఆ వ్యక్తి పూర్వీకులు భారతదేశంలో పుట్టి ఉండాలి, అతని మతం కూడా భారతదేశంలో పుట్టినదై ఉండాలి. అంటే – ఆ నిర్వచనం – ముస్లింలనీ, క్రిస్టియన్లనీ, పార్సీ తదితరులందరినీ – బయట పడేస్తుంది.

కరణ్: అంటే టెక్స్ట్ పుస్తకాలలో చేస్తున్న సవరణలు, మార్పులు, చేర్పులు – వీటి ఉద్దేశం – వారి హిందూ రాజ్యపు భావజాలానికి సిద్ధాంత భూమికని తయారు చేయడం అన్న మాట…
రోమిల్లా: ఔనంతే. మీకు కొన్ని ఉదాహరణలిచ్చేదా

కరణ్: ఇవ్వండి
రోమిల్లా: కొంత కాలమై – ఇక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతోంది – ఆర్యుల గురించి. (ఇక్కడ ఆర్యులన్న పదానికి అర్ధం దగ్గర కూడా భేదం ఉంది గమనించాలి. చరిత్రకారులు ఆర్య పదాన్ని అనేది ఒక జాతినామంగా గుర్తించరు, ఆర్య భాష మాట్లాడే వారిని ఉద్దేశించి ఆ పదం వాడతారు)

సరే, అది పక్కన పెడితే, వారి వాదన- ఆర్యులు అందరూ భారతదేశంలోనే పుట్టారని. ఎందుకంటే – హైందవానికి మూలం వైదిక మతం, అది బయట నుంచి వచ్చే ఆస్కారమే లేదు, దేశం లోపలే పుట్టి ఉండాలి. మరి ఇదంతా – భాషాశాస్త్ర పరంగా, పురావస్తుశాస్త్ర పరంగా లభిస్తున్న సాక్ష్యాధారాలకి – విరుద్ధంగా ఉంది. ఈ మధ్యే జన్యుశాస్త్ర పరమైన అనేక ఆధారాలు కూడా అనేకం దొరికాయి – అవి కూడా వారి సిద్ధాంతానికి విరుద్ధంగానే ఉన్నాయి.

వాటన్నిటినీ వారు కొట్టి పడేస్తున్నారు. వారి వాదననే కొనసాగిస్తున్నారు…

కరణ్: ఇదంతా – ఆర్యులు ఇక్కడి వారేనని ప్రపంచానికీ, వారికీ కూడా రుజువు చేసేందుకన్న మాట. వాస్తవాల ననుసరించి సిద్ధాంతాన్ని నిర్మించుకునే దానికి బదులు – వారి సిద్ధాంతానికి అనువుగా ఉండే వాస్తవాలని మార్చాలన్న ప్రయత్నం చేస్తున్నారన్న మాట.
రోమిల్లా: ఔను, ఇప్పుడు మరొక ఉదాహరణ చూడండి. కుతుబ్ మినార్‌ని – సముద్రగుప్తుడు నిర్మించాడని చెప్తున్నారు. అంటే 700 -800సంవత్సరాల వెనక్కి తీసికెళుతున్నారు – కుతుబ్ నిర్మాణ కాలాన్ని. దానికి ఏ సాక్ష్యాధారాలూ లేవు. ఏ గుడి మీదనైతే కుతుబ్ పునర్నిర్మాణం జరిగిందని అంటున్నారో – ఆ గుడి సైతం – గుప్తుల కాలానికి చెందినది కాదు, స్పష్టంగా – మధ్య యుగాలకి చెందినదని తెలుస్తూ ఉంది.

కరణ్: అంటే ఆ వాదన మొత్తం – నిరర్ధక ప్రసంగమన్న మాట.
రోమిల్లా: ఔను, పూర్తిగా అంతే.

కరణ్: అయితే ఇక మరే ఉదాహరణలూ అక్కరలేదు, మీ పాయింట్‌ని పూర్తిగా నిరూపించేరు కనక, ఈ సమస్య కున్న మరో కోణం గురించి చర్చించాలనుకుంటున్నాను. ఈ ప్రభుత్వం – జవాహర్లాలాల్ నెహ్రూ యూనివర్సిటీ మీద ఉపయోగిస్తున్న విధానాల గురించి, దాని చిత్రీకరణ గురించి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకది బాగా తెలిసినది, కన్నయ్యా కుమార్, ఒమర్ ఖాలిద్ వంటి జెఎన్‌యూ విద్యార్థులనుద్దేశించి , అరుణ్ జైట్లీ, నరేంద్ర మోదీలు – టుక్‌డే టుక్‌డే (ముక్కల ముక్కల) గేంగ్ అని కొత్త పేరు కనిపెట్టి పిలుస్తున్నారు. మోది ప్రభుత్వం జెఎన్‌యూ ని అతివాద వామపక్ష భావాలకి స్థావరం అని నమ్ముతోంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 50 సంవత్సరాలక్కడ మీరక్కడ బోధన చేసారు. ఈప్రచారంతో మీరేకీభవిస్తారా?
రోమిల్లా: ఎంత మాత్రమూ లేదు, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం చేసే చిత్రీకరణ, నిరాధారమైన ఆరోపణ. జెఎన్‌యూ మీద జరుగుతున్న దాడి గురించి మాట్లాడేముందు, దాని నిర్మాణం, నేపథ్యం గురించి కొంత చెప్పాల్సి ఉంది.

మేము జెఎన్‌యూని మొదలుపెట్టినపుడు – నేను దాని 6గురు వ్యవస్థాపక ప్రొఫెసర్‌లలో ఒకరిని – మేము 3 లక్ష్యాలని ప్రధానంగా మాముందుంచుకున్నాం.

 1. అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన సంస్థగా అది ఉండాలి – దాని కోసం, విద్యా విషయకంగా అది అత్యున్నత స్థాయిలో ఉండడం తప్పనిసరి. మేమాశించినట్టే, అది అత్యున్నత స్థాయిని చేరింది.
 2. అక్కడ – ప్రతీ ఒక్క అంశమూ, అది ఎటువంటిదైనా సరే – చర్చించగలిగే సౌలభ్యం ఉండాలి. అది క్లాస్ రూం లోపల కానివ్వండి, బయట కానివ్వండి, ఢాబా కానివ్వండి – ఏదైనా సరే – నిర్భయంగా చర్చించుకునే వేదిక అవ్వాలి.
 3. విద్యార్ధులని చేర్చుకునే విధానంలో కూడా మాకొక స్పష్టమైన ప్రణాళిక ఉంది. సాంఘికంగా – పైనుంచి, కింద దాకా – అన్ని స్థాయిలకు చెందినవారిలోంచి – ఎంపిక చెయ్యాలన్నది మా విధానం. ఎంత వైవిధ్యభరితమైన ఆవరణాల నుంచి, జీవిత నేపథ్యాల నుంచి – విద్యార్ధులను ఎంపిక చేసుకుంటే – అంత మేధావులు లభించే సంభావ్యత ఉందని – నూతన విద్యా శాస్త్ర సిద్ధాంతం సూచిస్తుంది.
  ఒకసారి ఎన్‌డియే -1, మేం రాసిన టెక్స్ట్ పుస్తకాలని నిందించింది, మేము ఏంటీ ఇండియన్లమనీ, ఏంటీ హిందులమనీ – దాడి చేసింది. నన్ను విద్యారంగపు ఉగ్రవాది నంది, (నవ్వుతూ) నాకు చాలా వినోదం కలిగించిందనుకోండి, ఆ బిరుదు.
  అయితే ఎన్‌డియే -2 దాడి మరింత పకడ్బందీగా ఉంది. అది కేవలం జెఎన్‌యూనొక్కదానినే కాదు – సాంఘిక శాస్త్రాల బోధన పటిష్టంగా ఉన్న అన్ని సంస్థల మీదా దాడి చేయడం మొదలుపెట్టింది. ఎందుకు
  సాంఘిక శాస్త్రాలు ఏం చేస్తాయి సంఘాన్ని ప్రశ్నించడం నేర్పుతాయి, సమకాలీన సంఘటనలని విశ్లేషించడం నేర్పుతాయి, సమాధానాలని అన్వేషించడం నేర్పుతాయి.

కరణ్: అవన్నీ – ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయా?
రోమిల్లా: అవన్నీ – ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అదీ, నిరంకుశ పాలన సాగించాలనుకునే, దేశాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ఉన్న ఏ ప్రభుత్వాన్నైనా – అవి – ఇబ్బంది పెడతాయి.

కరణ్: అవి ప్రత్యేకించి ఈ ప్రభుత్వానికి మౌలికమైన ఆటంకాలు కలిగిస్తున్నాయా, దాని హిందూ రాజ్యపు ఆశయానికి ఇవి ప్రశ్నిస్తున్నాయా?
రోమిల్లా: నిస్సందేహంగా. మేము హిందూ రాజ్యమన్న భావజాలానికి ఎప్పుడూ వ్యతిరేకమే.

కరణ్: ఈ ఆరోపణకి – మోదీ ప్రభుత్వపు ప్రతిస్పందన ఎలా ఉంటుందో నేనూహించి చెప్తాను – వాళ్లు జెఎన్‌యూలో గానీ, ఐసిహెచ్ఆర్ లోగానీ – చేసినది, ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా చేసిన కార్యక్రమమే, వారి భావజాలాన్ని పంచుకునే వారికీ, సమర్ధకులికీ – వెసులుబాటు కల్పించడం ప్రతీ ప్రభుత్వానికీ పరిపాటే.
కానీ, ఇప్పుడు తేడా ఏమిటంటే, ఇప్పుడు అందులో చేరుతున్నవారి సిద్ధాంతాలు, మీ సిద్ధాంతాలూ – ఉత్తర దక్షిణ ధృవాలు. ఆ కారణంగా మీవంటి వారంతా, నిర్లక్ష్యం చెయ్యబడ్డామని భావించి, చిరమరలాడుతున్నారని – అందుకే విమర్శిస్తున్నారని వారంటారు…

రోమిల్లా: లేదు లేదు, నేనూ, నాతోటి వారెవరూ – ఈ ప్రభుత్వ కమిటీలూ – ఇలాటి గురించి పట్టించేకోము. మా జీవితమంతా ఒకే విశ్వాసంతో ఉన్నాం – శాస్త్రానికి ఔన్నత్యం సమకూరేది – స్వయంప్రతిపత్తి కల వ్యక్తుల పర్యవేక్షణలోనే అని ఎప్పుడూ చెప్తున్నాం.

జెఎన్‌యూ స్థాపించబడినప్పటి నాటి నుండీ – లిబరలిజం, మార్క్సిజం -వీటి గురించి బహిరంగంగా చర్చలు సాగించగల ఏకైక విశ్వవిద్యాలయంగా పేరు పొందింది.

కరణ్: భిన్నాభిప్రాయాల మీదా, విరోధ భావజాలం మీదా, ఇప్పటి ప్రభుత్వం – దేశద్రోహంగా భావించే అంశాల మీదా కూడా… ఔనా?
రోమిల్లా: ఔను, ఏమిటా అంశాలు ఎకనామిక్స్, సోషియాలజీ, ఏంత్రోపాలజీ – ఇవేగా

కరణ్: అవేనా మోదీ ప్రభుత్వానికి చిర్రెత్తించేవి?
రోమిల్లా: అవును, వారికెందుకంత చిరాకంటే – అవి వారికసలు కొరుకుడు పడని శాస్త్రాలు. వాటిలో – ఉన్నత స్థాయి విద్యావేత్తలు లేరు వారికి.

కరణ్: అందుకని వారికి బెదురు కలుగుతుందా?
రోమిల్లా: అంతే అనుకోవాలి, ఎందుకంటే ఒక్క జెఎన్‌యూతోనే కాదు, జాదవ్ పూర్‌లోనూ, హైదరాబాద్ లోనూ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోనూ – దేశమంతటా… ఇదే పరిస్థితి.

కరణ్: అయితే ఒక మాట చెప్పండి – ఈ అయిదేళ్ల పాలన – భారతీయ విద్యారంగం మీద ఎలాటి ప్రభావం చూపించింది?
రోమిల్లా: వారికి సర్వసాధారణమైన ఒక ప్రక్రియ నుపయోగించి – విజయవంతంగా విద్యారంగాన్ని ఛిన్నాభిన్నం చేయగలిగారు. అదేమిటంటే – చొరబాటు చర్య. ఎక్కడైనా ఒక పదవి లేదా ఉద్యోగం ఖాళీ అయితే దానిలో వారి మనుషులని నింపడం. విషాదకరమైన విషయమేమిటంటే – అందులో చాలా భాగం – శాస్త్రపరంగా హీన ప్రమాణాలు కలవారే. కారణమేమిటంటే – వారు మేధోపరమైన సవాళ్లను ఎదుర్కుని నిలబడిన వారు కాకపోవడమే…

కరణ్: మేధో పరంగా తక్కువ తరగతి వారిని, కేవలం తమ సమర్ధకులన్న కారణంగా తక్కువ యోగ్యత కలవారిని తీసుకొస్తున్నారా?
రోమిల్లా: ఔను, ఆ కారణంగా సంస్థల ప్రమాణాలు క్రమేణా పడిపోతున్నాయి.

కరణ్: అంటే మేధోపరమైన నష్టానికి గురౌతున్నాయన్న మాట.
రోమిల్లా: ఔను. జెఎన్‌యూ వంటి సంస్థలో – విద్యార్థులూ, అధ్యాపకులూ – అనే అంగాలు కలిసి నిలబడి పోరాడకపోతే జరిగే పరిణామాలను – ఊహించుకోడానికే భయం వేస్తుంది. జెఎన్‌యూ తన మేధోపరమైన హక్కులను పరిరక్షించుకునే ప్రయత్నం చెయ్యకపోతే – ఒక హీన ప్రమాణాలు కల సంస్థగా మారిపోతుంది.

కరణ్: జెఎన్‌యూ అస్థిత్వాని కున్న అతి ముఖ్య ప్రయోజనం (French: raison d’être) మీదనే ముట్టడి జరగబోతోందన్న మాట.
రోమిల్లా: జరగబోడం కాదు – ముట్టడి జరుగుతోంది.

కరణ్: అయితే మరో ప్రశ్న, ఈ ఎన్నిల ప్రచారాల పరిణామం, అసలు ఎన్నికల ఫలితాలూ – ఎలా ఉండబోతున్నాయో తెలియదు కానీ, మరో సారి మోదీ ప్రభుత్వం వస్తే, భారతీయ విద్యారంగం పరిస్థితి ఎలా ఉంటుందని మీ అంచనా?
రోమిల్లా: విద్యారంగానికి తెర పడిపోయినట్టే. ఎందుకలా అంటున్నానంటే –కోర్సులలోనూ, రీడింగ్ లిస్ట్‌ల్లోనూ జోక్యం చేసుకోడం – ఇప్పటికే- ఎక్కువైంది. ఏ కాన్ఫరెన్స్‌కి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలి. అంతేకాదు – బయట నుంచి ఎవరిని ఆహ్వానించాలన్నా కూడా అనుమతి తీసుకోవాలి. సాధారణంగా అనుమతి దొరకదు.
అంతెందుకు జెఎన్‌యూలోనే, కృష్ణా భరద్వాజ్, సుప్రసిద్ధ ఆర్ధిక శాస్త్ర పండితురాలు, జెఎన్‌యూ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు – ఆమె ఉపన్యాసాల పరంపర ప్రతీ ఏడూ ఉంటుంది. ఆమె లెక్చర్లు పెట్టుకోడానికి కూడా – అనుమతి కోరాలి.

కరణ్: (ఆశ్చర్యంగా) ఎవరినుంచి?
రోమిల్లా: అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి. వాటికి నిరుడు లెక్చర్ హాల్‌లో పెట్టుకోడానికి అనుమతి దొరక్క – కేంపస్ గ్రౌండ్స్‌లో పెట్టుకున్నాం – విద్యార్ధులందరూ పూర్తిగా హాజరు.

కరణ్: మీరనేది – అడ్మినిస్ట్రేషన్ – వైస్ ఛాన్సలర్ అని నేననుకుంటున్నాను, ఆయన ప్రభుత్వం లోని ఎవరి ఆదేశాల మేరకో పని చేస్తూ – మీకు అనుమతిని నిరాకరిస్తున్నారంటారా?
రోమిల్లా: నాకు తెలీదు, ఎక్కడ నుంచి ఎవరి ఆదేశాలో. నా ఉద్దేశంలో – యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యత దాని కిందే ఉండాలి.

కరణ్: ఇలా ఇంతకు ముందెప్పుడైనా, పూర్వపు ప్రభుత్వాల హయాంలో జరిగిందా?
రోమిల్లా: ఎప్పుడూ జరగలేదు. అలాటిది జరగడానికి ఆస్కారమే లేదు, మేము మా స్వయం ప్రతిపత్తిని – రక్షించుకోడంలో ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు.

కరణ్: మునుపు రక్షించుకునే వారిమంటున్నారు – ప్రభుత్వాన్ని ఎదురెళ్లి నిలిచే శక్తి – మీవంటి అధ్యాపకులలోనూ, విద్యార్ధి నాయకులలోనూ – క్రమేపీ తగ్గుతోందనిపిస్తోందా?
రోమిల్లా: తగ్గడం అనను ఇప్పటికీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకునే అధ్యాపకులనేకులున్నారు. కానీ – వృత్తి నిర్వహణలో, బాధ్యతల మధ్య – వ్యక్తులు అలిసిపోతారు. సరే కానిమ్మని – వదిలేసే సందర్బాలుంటాయి.

కరణ్: నిజమే, ఆఖరుగా – మన చుట్టూతా ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా ఉంది కదా, దాని గురించి నా ప్రశ్న. తన పని తీరుని చూపించో, సాధించిన విజయాల బలం మీదనో కాక, పాకిస్థాన్ గురించిన భయమూ, కాకుంటే ఆందోళనా కలిగించడం, తద్వారా తానే రక్షకుడినన్న నమ్మకం కలిగించడం – ఇది మోదీ శైలి అని – చాలా మంది విశ్వసిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు?
రోమిల్లా: అలాగే కనిపిస్తోంది – జరుగుతున్న అసంగతాలని చూస్తుంటే… అమిత్ షా – సిటిజన్ బిల్ చదవడం, అందులో పౌరులంటే – హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు -అని చదవడం, అప్పుడెవరో – గుర్తు చెయ్యడం -ఇంకా వేరే వారు కూడా ఉన్నారని.

ఇవన్నీ వలసవాద భావజాలంలో పాతుకుపోయిన ఆలోచనలు – హిందువులంటే వీరని బ్రిటిష్ వాళ్లు నిర్వచించారు,– దానినే పట్టుకు వేలాడుతున్నారు వీళ్లు… వెనక్కి పోడం కదా ఇది…

కరణ్: మీ అభిప్రాయం ప్రకారం భారతదేశానికి ఏది తగినది? మోదీ నాయకత్వంలోని మెజారిటీ ప్రభుత్వమా లేక… ప్రధానమంత్రి ఎవరో ఇంకా తేల్చి చెప్పలేమనుకోండి అప్పుడే… సంకీర్ణ ప్రభుత్వమా… దేనిని కోరుకుంటారు?
రోమిల్లా: రెండోదాన్నే ఎంచుకుంటాను… ఏనాడైనా సరే. ఉపఖండానికి ప్రాతినిధ్యం వహించగలిగే – ఆదిశగా ఆలోచించే, పనిచేసే – సంకీర్ణ ప్రభుత్వం కావాలి.
కేంద్రం – పరిధి… ఈరెండు భౌగోళిక పదాలకి ఇప్పటి రాజకీయాల్లో చాలా ప్రాసంగికత వచ్చింది. వాటి గురించి కాస్త వివరించాలనుకుంటున్నాను.

జరుగుతున్నదేమిటంటే – కేంద్రపు నిర్ణాయక శక్తి – నానాటికీ – కొద్దిపాటి మంది ఉన్న గుంపు – చేతిలోకి పోతోంది. వారు – గంగాతీరపు లోయ మధ్య ప్రాంతానికే దాని అస్తిత్వాన్ని పరిమితం చేస్తున్నారు – అంటే హిందీ మాట్లాడే, హిందూ దేవతలని ఆరాధించే ప్రజల వరకే.

సరే, వారే – అనుకుందాం, నష్టం లేదు, కాని ఆ అస్తిత్వాన్ని – పరిధి మీద ఉన్న అనేక అస్తిత్వాలతో సమానంగా, వాటిలో ఒకటిగా మాత్రమే ఉంచండి. దానినే కేంద్రంగా, అతి ప్రధానమైనదానిగా మార్చకండి.

లేదంటే, పెద్ద దేశాలన్నిటికీ వచ్చే శాశ్వత సమస్యలే మనకీ వస్తాయి. పరిధికి – దాని సాంస్కృతిక అస్తిత్వం కోసం పెనుగులాట తప్పనిసరి ఔతుంది. కేంద్రప్రాంతానికీ, పరిధి మీద ఉన్న ప్రాంతాలకీ – సంఘర్షణ ఏర్పడుతుంది.

అందుకే పరిధి ప్రాంతాల పట్ల మరింత శ్రద్ధ చూపించాల్సి ఉంది.

కరణ్: కేంద్రంలో – 272 సీట్ల మెజారిటీ కల బలమైన నిర్ణయాత్మకమైన ప్రభుత్వం కన్నా బలహీనమైన ప్రభుత్వమే – భారతదేశానికి శ్రేష్టమని మీరు నమ్ముతున్నారా అదేనా మీరనేది?
రోమిల్లా: దానిని బలహీన ప్రభుత్వం అనను… సమాఖ్యలా ఆలోచించే (federally minded) ప్రభుత్వం అంటాను. అది కేంద్రాన్ని మాత్రమే కాక దేశపు సమస్తాన్ని – దృష్టిలో ఉంచుకోవాలి. కేంద్రమే బలోపేతమై, నియంత్రిస్తున్న- ఇప్పటి పరిస్థితికి భిన్నంగా ఉండాలి – ఆ ప్రభుత్వం.

కరణ్: సరే, భిన్నంగా ఉండాలంటున్నారు – ప్రతిపక్షపు ఉమ్మడి పనితీరు మీకు సంతృప్తినిచ్చిందా?
రోమిల్లా: లేదు, వాళ్లు కలిసి రావడంలోనూ, ఒప్పందం కుదుర్చుకోడం లోనూ, ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోడం లోనూ – ఇంకా చాలా చేసి ఉండాల్సింది. సరే, ఇపుడు మేనిఫెస్టో తెచ్చారు, ఎలాగైతేనేం – దానిలో ఒక కార్యక్రమమూ ఉంది – కానీ ఇంకా చాలా ముందే తీసుకురావలసింది, ఇంకా వివరంగా తయారుచెయ్యవలసింది.
దేశంలో ఈనాడు నాకు కనిపించే అతి పెద్ద సమస్య – ఆశయ లోపం, అవగాహన లోపం (lack of vision)

కరణ్: ప్రభుత్వానికీ, ప్రతిపక్షాలకీ – ఇరు పక్షాల వారికీనా?
రోమిల్లా: అబ్బే – లేదు, ప్రభుత్వానికి ఉంది – నిశ్చయమైన ఆశయం. హిందు రాజ్యం – మెజారిటీ వాద బీజేపీ నాయకత్వం – ఆ దిశగా పని చేస్తుంది. లేని దల్లా – ప్రతిపక్షాలకే.

నాకు మాటిమాటికీ నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి – 1950ల్లో – అప్పుడే నేను భారత పౌరురాలి నయిన కొత్తల్లో – మాకెంతో అక్కర ఉండేది – ఎలాటి సమాజం లో జీవించాలి, దానిని ఎలా నిర్మించుకోవాలి, వర్తమాన సమాజం – ఏ దిశగా రూపుదిద్దుకుంటోంది – అనే దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్లం. అలాటి అవగాహన, ఆశయం -ఈనాడు కనపడడం లేదు.

ఈ ఎన్నికల కారణంగానైనా – ఏదో ఒక ఆశయం – మన ముందు కొస్తుంది అని ఒక చిన్న ఆశ.

కరణ్: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేందుకు అర్హుడేనా? మీ అభిప్రాయం ఏమిటి?
రోమిల్లా: అతను ఏం చేసాడని అతని గురించి చెప్పగలం

కరణ్: పోనీ, అతని గురించి విన్నదాని, చూసినదాని ప్రకారం…
రోమిల్లా: అతని సలహాదారులెవరు? అతనే విధానాలను అనుసరిస్తాడు? అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అతనే కాదు.. ప్రతిపక్షాలకి చెందిన వారెవరైనా ప్రధానమంత్రి అవచ్చు. మమతా బెనర్జీ , లేదా మాయావతి – ఎవరైనా సరే. వారి కొక స్పష్టమైన విజన్ ఉండాలి. సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలి? అనేదాని గురించి అక్కడికి తీసుకెళ్లేందుకు వారికి సరైన సలహాదారులుండాలి.

పుట్టింది విశాఖపట్నం. చదువు ఎం. ఏ. ఇంగ్లిష్. విశ్లేషణాత్మక వ్యాసాలు, కథ, నవల, సినిమాలపై సమీక్షలు రాస్తున్నారు.

4 thoughts on “దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడమే బీజేపీ అంతిమ లక్ష్యం : రోమిల్లా థాపర్

 1. మంచి ఇంటర్వ్యూ అందించారు.!
  కరణ్ మంచి ప్రశ్నలు వేసి, ఆలొచనాత్మక జవాబులు రాబట్టారు!
  హ్యాట్సాఫ్ to రోమిల్లా. పెద్ద వయస్సులో కూడా,ఏమాత్రం ఫైర్ తగ్గకుండా అలానే వున్నారు. సరిగ్గా ఈ లక్షణమే యువతరంలో లోపించింది.

  1. థేంక్యూ సాంబశివరావుగారూ … ఆమె మాట్లాడిన విషయాలు చాలా రిలవెంట్ అనిపించాయి, చాలా మందికి తెలీనివి కూడా.

 2. Romilla thapar gaari interview baavundi
  Aryula kutralo desham naashanam
  Vidyasamsthallo raajakeeyajokyam
  Rohith chaavuki hethuvu
  Pustakaalu maarchinantha maatraana charitra maaradu
  Thank you madam

 3. స్వతంత్ర ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయంలో సమావేశాల నిర్వహణను VC లు నిరాకరిస్తే స్వయంప్రతిపత్తికి అర్థమేంట??? VCs r appointed by ruling government that’s y they r puppets.

Leave a Reply