రైతులపై ప్రభుత్వ దాష్ఠీకం

ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకుంటుంది. రాజ్యాంగం ఆ మేరకు ప్రజలకు ఆ హామీ ఇచ్చింది. కానీ, పాలకులలో రానురాను అసహనం పెరిగిపోతుంది. మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి అనేక ప్రజావ్యతిరేక, కార్మిక-కర్షక వ్యతిరేక చట్టాలను చేసింది. వ్యవసాయ రంగాన్ని భ్రష్ఠు పట్టించే మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని నిర్విరామంగా పదకొండు మాసాలుగా ఢిల్లీ సరిహద్దులో లక్షలాది మంది రైతులు మొక్కవోని దీక్షతో రాజీలేని ఉద్యమం చేస్తోన్నారు. రైతులపై కేంద్రంలోనూ, హర్యాణాలోనూ యూపీలోని బిజెపి ప్రభుత్వాల నిరంకుశత్వం పరాకాష్ఠకు చేరింది. రైతుల పైకి పోలీసులను, బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్‍ కార్యకర్తలను ఉసిగొల్పడం, వారిపై దాడులు చేయించడం, ఆ తర్వాత బాధితులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం, నిందితులను కాపాడడం పరిపాటి అయ్యింది. రైతులను బెదిరించడం, బ్లాక్‍ మెయిల్‍, అరెస్టులు, అక్రమ కేసులు, ప్రాణభయం కలిగించడం వంటి తప్పుడు మార్గాల్లో వారి నోరు మూయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ ఉద్యమంలో 1000 మంది రైతులు మరణించారు. పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. తలలు పగిలాయి. వాటర్‍ క్యానన్స్ ప్రయోగించారు. చివరికి ఉత్తరప్రదేశ్‍లోని లఖింపూర్‍ ఖేరి జిల్లాలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతుల మీదికి అక్టోబర్‍ 3న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‍ మిశ్రా తనయుడు అశీశ్‍ మిశ్ర కార్లను నడిపించారు.

అక్టోబర్‍ 3న ఉత్తరప్రదేశ్‍లోని లఖింపూర్‍ ఖేరి జిల్లాలో యూపి ఉపముఖ్యమంత్రి కేశవ్‍ ప్రసాద్‍ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‍ మిశ్రా టెని ల బన్బీర్‍పూర్‍ పర్యటనను నిరసించాలని రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. బన్బీర్‍పూర్‍ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‍ మిశ్రా టెని స్వగ్రామం. టికునియా గ్రామంలోని ఒక పాఠశాలలో బహుమతి పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గోనవల్సి ఉంది. కేంద్ర మంత్రి అజయ్‍ మిశ్రా టెని సెప్టెంబర్‍ 25న తన పుట్టిన రోజు ఉత్సవంలో పాల్గోన్న సందర్భంలో తన స్వగ్రామం బన్బీర్‍పూర్‍లో రైతులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపడానికి నల్ల జెండాల ప్రదర్శన జరుపాలని రైతులు నిర్ణయించుకున్నారు. అందుకోసం వారు హెలీపాడ్‍ వద్ద ఆయన్ని ఘోరావ్‍ చేయడానికి సమాయత్తమవుతుండగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‍ మిశ్రా కుమారుడు అశిష్‍ మిశ్ర పలు వాహానాలతో అక్కడికి చేరుకున్నాడు.

ఆశీశ్‍ మిశ్రా రాకను పసిగట్టిన రైతులు అప్రమత్తమయ్యారు. రైతుల చేతుల్లో నల్లజెండాలను చూసిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయాడు. కోపంతో శివాలెత్తి ఊగిపోయాడు… కాల్పులకు తెగబడ్డాడు. వెనువెంటనే ఒక్కసారిగా కార్లు వేగం పుంజుకొని రైతులను తొక్కుకుంటూ పోయాయి. ఇది ఎంతటి అమానవీయమైన దృశ్యం… ఎంతటి ఘోరకలి. ఈ సంఘటనలో 4 గురు రైతులు, వార్త కవర్‍ చేయడానికి వెళ్లిన రతన్‍ కష్యప్‍ అనే జర్నలిస్టు మరణించారు. పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సంబంధిత వీడియో దృశ్యాలను చూసిన సామాన్య ప్రజలు అవాక్కయ్యారు. రైతు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం చేయగూడని పనులన్నీ చేస్తోంది. భారతదేశ చరిత్రలో ఇది రైతుల సుదీర్ఘ పోరాటం. బిజెపి నేతలు రైతులను తీవ్రవాదులని, విధ్వంసకారులని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు.

రైతుల మరణానికి నిరసనగా ఆ మరుసటి రోజు దేశవ్యాప్తంగా రైతుల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‍లో రైతుల నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతు నాయకుడు రాకేశ్‍ తికాయత్‍- రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి మధ్య చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో మరణించిన రైతులకు రూ.45 లక్షలు పరిహారం ముఖ్యమంత్రి ప్రకటించినా జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. అధికార పీఠంపై ఉన్నాం కాబట్టి మేము రాజులం. మాది రాచరికం, ఎవరినైనా తొక్కేస్తాం, తొక్కించేస్తాం అంటున్నారు. ఈ సంఘటన తర్వాత యూపి న్యాయశాఖ మంత్రి బ్రజేశ్‍ పాఠక్‍ బిజెపి కార్యకర్తల కుటుంబాలను కలిశారు, కాని ఈ ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలతో మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు అశీశ్‍ మిశ్రాను అరెస్టు చేసి హత్యానేరం కేసు పెట్టాలని డిమాండ్‍ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో అక్టోబర్‍ 9న అశిశ్‍ మిశ్రాను అరెస్టు చేశారు. కాని రిమాండ్‍కు పంపలేదు. సాక్షుల వాంగ్మూలము రికార్డ్ చేయలేదు.

సంవత్సర కాలంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‍ మిశ్రా, హర్యాణా ముఖ్యమంత్రి ఖట్టర్‍ గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ అపరిపక్వతను, అసహనాన్ని, ఆహాంకారాన్ని చాటుతున్నాయి. తలచుకుంటే క్షణాల్లో రైతు ఉద్యమాన్ని అణచివేయగలనని మిశ్రా వ్యాఖ్యానించగా… ఆందోళనకారుల తలలు పగులకొట్టాలని ఖట్టర్‍ బిజెపి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఈ రెండు వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగానే భావించాలి. మరోసారి రైతులకు దెబ్బకు దెబ్బ కొట్టి ట్రీట్‍మెంట్‍ ఇవ్వాలి. 500-1000 మంది కలిసి స్వచ్చంధ సేవకుల బృందంగా ఏర్పడి రైతులను లాఠీలతో కొట్టండి. ఇలా చేసి జైలుకు వెళ్తే బెయిల్‍ కోసం ఆలోచించకండి. అన్నీ మేం చూసుకుంటాం. జైలుకు వెళ్లాల్సి వస్తే కంగారు పడకండి. జైలులో ఉంటే మీరు పెద్ద నాయకులయిపోతారు. చరిత్రలో మీ పేరు రాస్తారు అని హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్‍లాల్‍ ఖట్టర్‍ ఖాజపా శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంత బహిరంగంగా, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలకు గూండా నాయకుడిలా పిలుపునిచ్చారంటే… అంతర్గతంగా ఆ పార్టీ శ్రేణులకు, వారి అనుబంధ సంఘాలకు ఇంకెలాంటి ఘోర పిలుపు ఇవ్వకపోతే ఇంతటి దారుణ ఘటన చోటుచేసుకునేది కాదనిపిస్తుంది. వీరిద్దరి వ్యాఖ్యలను గమనిస్తే… ఆందోళకారులపై దాడి కాకతాళీయం కాదేమోనన్న అనుమానాలు బలబడుతున్నాయి.

లఖింపూర్‍ భేరీలోని టికొనియా ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్‍ మిశ్రాను మంత్రిమండలి నుంచి తొలగించాలని, అతని కుమారుడు అశిష్‍ మిశ్రాను అరెస్టు చేయాలన్న ఒత్తిడి, ఆందోళన పెరిగింది. అక్టోబర్‍ 8న సుప్రీం కోర్టు గట్టిగా యూపీ ప్రభుత్వాన్ని నిలదీయడంతో అశిష్‍ మిశ్రాను అరెస్టు చేశారు. ఇటువంటి హింసాత్మక సంఘటన జరిగేలా రెచ్చగొట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇందుకు బాధ్యులు. పైగా ఇందులో స్వయంగా ఆయన కుమారుడి ప్రమేయం ఉంది. వెంటనే ఆయన్ని పదవి నుండి తొలగించడం ప్రధాని ప్రాథమిక బాధ్యత కానీ ఇదేమీ జరగలేదు. రైతుల హత్యలను ఖండిస్తూ ప్రధాని గానీ కేంద్ర హోం మంత్రి గానీ ఒక్క ప్రకటన చేయలేదు. రెండు రోజుల తర్వాత ప్రధాని లక్నోలో పర్యటించినప్పుడు కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించలేదు. లఖింపూర్‍ ఖేరి వద్ద రైతుల ఆందోళనపై జరిగిన హింస అనేది పాలక పార్టీ నిరాశా నిస్పృహలతో పాల్పడిన చర్యలో భాగమే. ఇలాంటి హింస రైతాంగ పోరాటాన్ని ఏమాత్రమూ తగ్గించలేదు.

రైతులపై కారును వేగంగా తోలించి నలుగురు రైతులు దుర్మరణం పాలవడానికి అజయ్‍ మిశ్రా కుమారుడే కారణమని స్పష్టపడుతుండడంతో రైతులు ఆయన మీద దృష్టి కేంద్రీకరించారు. అతడు మంత్రి పదవిలో ఉండగా కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగదనే రైతుల భయాన్ని కొట్టిపారేయలేము. ఘటనకు ప్రధాన కారకుడని రైతులు నమ్ముతున్న వ్యక్తి కీలక అధికార పీఠంలో కొనసాగితే ఆ కేసులో నిజమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎలా కలుగుతుంది? మామూలు పరిస్థితుల్లోనైతే రైతుల డిమాండ్లను ఇప్పుడున్న పాలకులు పట్టించుకునే అవకాశాలు తక్కువ. ఐదు మాసాల్లో యుపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అవి అత్యంత కీలకమైనవి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. అందుచేత లిఖింపూర్‍ ఖేరీ దారుణ ఘటన ప్రభావం విస్తరించకుండా చూసుకోవాలన్న జ్ఞానోదయం దానిలో కలగలేదని అనుకోలేము. రైతు ఉద్యమకారులు అంతిమంగా తమ డిమాండైన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు వారు చేస్తున్న కేంద్ర మంత్రి అరెస్టు డిమాండ్‍ కూడా అందులో భాగమే. మంత్రిని తొలగించకుండా కేంద్రం తాత్సారం చేసేకొద్దీ రైతు ఉద్యమం మరింతగా బలపడడం ఖాయం. అందుచేత అజయ్‍ మిశ్రాను కేంద్ర కేబినెట్‍ నుంచి తొలగించక తప్పకపోవచ్చు.

నిజానికి గడిచిన పదకొండు నెలలుగా రైతాంగ ఉద్యమాన్ని చీల్చడానికి కేంద్ర సర్కారు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పోరాటంపై తప్పుడు ప్రచారం చేసే నీచపు ఎత్తుగడలన్నింటిని అమలు చేసింది. రిపబ్లిక్‍ డే రోజు జరిగిన ప్రహసనం వీటికి పరాకాష్ట. అయినా, రైతాంగంలో ఐక్యత ఏమాత్రం చెక్కుచెదర లేదు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ పెరుగుతున్న కర్షకవీరుల సంఖ్యే దీనికి నిదర్శనం. లఖింపూర్‍ ఘటన ఏదో హఠాత్‍ పరిణామం కాదు. రైతుల నిరసనలను, ఆందోళనలను బిజెపి నాయకులు, పాలకులు ఏ విధంగా చూస్తున్నారో ఇది తెటతెల్లం చేసింది. ఈ ఘటనకు వారం ముందు ప్రధాని మోడీ ఒక వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ వ్యవసాయ చట్టాలను సమర్థించుకున్నాడు. ఆ తర్వాత కేంద్రమంంత్రి అజయ్‍ మిశ్రా ఉద్యమిస్తున్న రైతులు తమ వైఖరి మార్చుకోకపోతే, కేవలం రెండు నిముషాల్లో వారిని ఎలా దారికి తేవాలో తనకు తెలుసంటూ చేసిన ప్రసంగ వీడియోల్లో రైతులను తన్నడం, తరిమికొట్టడం వంటి భాష విరివిగా ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‍ మనసెరిగినందునే, కర్ణాల్‍ సబ్‍డివిజనల్‍ మేజిస్ట్రేట్‍ ఆయుష్‍ సిన్హా ఇటీవల ఉద్యమిస్తున్న రైతుల తలలు బద్దలు కొట్టమని పోలీసులను ఆదేశించారు. రెచ్చిపోయిన పోలీసులు పాతికమంది రైతులను చావగొట్టారు, ఒకరిని చంపేశారు. ఈ క్రమంలోనే యూపీ ఘటన పథకం ప్రకారమే చేశారని స్పష్టం అవుతున్నది.

బిజెపి పెద్దలు రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వారి నిరసనను తీవ్రవాదుల ఉద్యమంగా అభివర్ణిస్తూ తమ కిందివారిని దాడులకు ఉసిగొలుపుతూంటే లఖింపూర్‍ ఘటనల వంటివి చోటుచేసుకోకుండా ఎలా ఉంటాయి? ఎన్ని మాసాలైనా అదే పట్టుదలతో రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం పాలకులకు మింగుడుపడటం లేదు. మరోపక్క కొత్త సాగు చట్టాల అమలుపై జనవరిలోనే స్టే విధించాం కనుక, రైతులు ఇప్పటికీ నిరసన చేయడం ఏమిటన్నది అత్యున్నత న్యాయస్థానం ప్రశ్న. నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే కోర్టుకెక్కాక వీధికెక్కడమేమిటనీ కోర్టు అంటోంది. నిరసనలు మొక్కుబడి చర్య కాదు. అది వారి జీవన్మరణ సమస్య. సమస్యను పరిష్కరించుకునే వరకు నిరసనలు, ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో పరిపాటేనని పరమోన్నత న్యాయస్థానం గుర్తించకపోవడం శోచనీయం. రహదారులు దిగ్బంధం చేస్తున్నారని 43 రైతు సంఘాల నేతలకు నోటీసులిచ్చింది. కానీ, అనేక అంశాలపై జోక్యం చేసుకొని, ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్న న్యాయవ్యవస్థ ఎందుకనో ఏడాదిగా సాగుతున్న రైతు ఉద్యమంపై మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రైతులు కోరుతున్నట్టు మూడు చట్టాలను రద్దుచేయమని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చెప్పలేకపోతుంది.

ప్రభుత్వాలు ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేనప్పుడు… నిరసనలు, ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ప్రజా ఉద్యమం అంటే ప్రజలు తమ జీవితాలను, స్థితిగతులను, భౌతిక పరిస్థితులను మెరుగుపరుచుకోడానికి ఐక్యంగా చేసే పోరాటం. నిరసనలైనా, ఉద్యమాలైనా సమాజంలో వచ్చిన అసంతృప్తిని విభిన్నరూపాల్లో వ్యక్తీకరించడమే. ఈ నిరసనలను పట్టించుకోని ప్రభుత్వాలు… వాటి మూలాలను విస్మరించి, నిరసనలను అణచివేయ చూస్తున్నాయి. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజల ఉద్యమాలను ఎంత కఠినంగా అణచివేయాలని చూస్తే… అంతే తీవ్రతతో ఉవ్వెత్తున ఉద్యమాలు వెల్లువెత్తుతాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలపడం పౌరుల హక్కు. ఆ హక్కులను అణచివేయాలని చూస్తే… అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పౌరహక్కుల హసనంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పదకొండు నెలలకు పైగా నిరసన తెలుపుతున్న రైతులను అనేక రూపాల్లో అణచివేతకు గురిచేస్తోంది.

‘సబ్‍ కా సాత్‍’ అనే నిస్సారమైన నినాదం వెనక దాగి ఉన్న యదార్థం భారత వ్యవసాయంలో అదానీ-అంబానీ రాజ్‍కు భూమిక సిద్ధం చేయాలని తలపెట్టింది. బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్‍ తామే దేశభక్తులమంటూనే వ్యవసాయ రంగంలోకి మోన్‍సాంటో, కార్గిల్‍లకు ఎర్రతివాచీ పరిచేందుకు ఆతృత పడుతున్నారు. దీన్ని నివారించే నిమిత్తం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. కాంక్రీటు బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు, శక్తివంతమైన నీటిజెట్టీలు, రైతుల ట్రాక్టర్‍ ట్రాలీలు జాతీయ రాజధాని సమీపానికి చేరుకోకుండా నిరోధించలేకపోయాయి. శీతాకాలపు చలిగాలులు వారి వజ్ర సంకల్పం ముందు ఓడిపోయాయి. సింఘు, టిక్రి, ఘాజీపూర్‍, నోయిడా, షాజహాన్‍పూర్‍ వద్దకు చేరిన వేలాదిమంది అక్కడ కొత్త జీవనరీతిని ఏర్పాటు చేసుకున్నారు. రైతుల వెల్లువ ఒకరకంగా అమెరికాలో వాల్‍స్ట్రీట్‍ ఆక్రమణ ఉద్యమాన్ని పోలి ఉన్నది. రైతులు కొద్ది రోజుల తర్వాత లేదా ఒక వారం రోజుల తర్వాత తమ గ్రామాలకు తిరిగి వెళతారని ప్రభుత్వం భావించి ఉంటుంది. రైతుల మనోస్థితి అలా లేనేలేదు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు.

రైతులను నిరంతరం ఆందోళనల్లో ఉంచి అసంతృప్తిలో ముంచి కేంద్ర పాలకులు ఏమి సాధించదలచుకున్నారో రైతులకు బాగానే అర్థమయింది. ప్రధాని మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం వికాసం నెపంతో తీసుకువచ్చిన చట్టాలు గాని, విద్యుత్‍ సంస్కరణ బిల్లు గాని వాస్తవానికి ఆ రంగాన్ని మరింత బాగుపరిచి ప్రజలకు చవకగా సునాయాసంగా ఆహారాన్ని అందుబాటులో ఉంచడానికి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ఏ మాత్రం కాదని రూఢి అయిపోయింది. సాగును కార్పొరేట్‍ శక్తుల చేతుల్లో పెట్టి వారికి విశేష లాభాలు సంక్రమించేలా చేయడమే మూడు కొత్త వ్యవసాయ చట్టాల ఉద్దేశమని, విద్యుత్‍ బిల్లు కూడా తమకు ఉరితాడు వంటిదేనని సకాలంలో గమనించిన రైతులు వాటి పూర్తి ఉపసంహరణను డిమాండ్‍ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత నవంబర్‍ 26 నుంచి విసుగు, విరామం లేకుండా పదకొండు మాసాలుగా ఆందోళన సాగిస్తున్నారు. అయినా మోడీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా మొండికేస్తున్నది.

2020 సెప్టెంబర్‍లో కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు తమకున్న కనీస మద్ధతు ధర కవచాన్ని తొలగిస్తాయని, భవిష్యత్తులో కార్పొరేట్‍ సంస్థలు దేశంలో సాగును నిర్దేశిస్తాయని, వారు చెప్పిన పంటలు వేసి వారు దయతో విదిలించేదానితో బతకవలసిన దుస్థితి తమకు దాపురిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అలాగే ప్రస్తుతమున్న మండీల వ్యవస్థ ధ్వంసమైపోయి తమను కష్టాల్లో తరచూ ఆదుకుంటున్న ఆరియాల (కమీషన్‍ ఏజెంట్లు) ఏర్పాటు కూడా అంతమైపోతుందని వారు భయపడుతున్నారు. అందుచేత ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు. దేశంలోని వ్యవసాయ రంగాన్ని మొత్తంగా కార్పొరేట్‍ శక్తులకు అప్పగించి రైతులను, రైతు కూలీలను ఆ రంగం నుంచి బలవంతంగా బయటకు తరిమివేసే కుట్ర అమలు కోసమే కొత్త చట్టాలొచ్చాయన్న అభిప్రాయం వ్యవసాయదారుల్లో, పరిశీలకుల్లో నాటుకున్నది. అందుచేత వాటిని రద్దు చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదు.

రైతుల ఊసే సహించలేని కేంద్రం రైతు సమస్యల పరిష్కారంలో మధ్యేమార్గంపై శ్రద్ధ పెడుతుందనుకోవడం అత్యాశే. నిజానికి, తాజా ఘటనపై సర్కారు వారి న్యాయవిచారణలో సంచలన విషయాలు బయటపడతాయన్న భ్రమలేవి లేవు. మరింత రక్తసిక్త శవరాజకీయాలకు పాలకులు పాల్పడతారన్నది నిజం. కానీ, అత్యున్నత న్యాయస్థానమే అడిగినట్లు లఖింపూర్‍ లాంటి ఘోరాలకు ఎవరిది బాధ్యత? ఆవిరైపోయిన అమాయక ప్రాణాలకు ఎవరు జవాబుదారీ? ప్రాణాలకు ఖరీదు కట్టే నాయకుల దుష్టత్వం ఇంకెంత కాలం? పాలకులు రైతులను శత్రువుగా చూసినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దక్కదు. ప్రజాస్వామ్యం పట్ల ప్రధానికి ఏమాత్రం గౌరవం ఉన్నా లఖింపూర్‍లో జరిగిన అమానుష దాడికి ప్రత్యక్షంగా బాధ్యుడైన అజయ్‍ మిశ్రాను మంత్రిమండలి నుంచి తొలగించాలి. లఖింపూర్‍లో నల్లురు రైతులతో సహా ఎనిమిది మంది మృతికి కారణమైన కేంద్ర మంత్రి తనయుడిపై ఐసిపి సెక్షన్‍ 302 కింద మర్డర్‍ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి. అలాగే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‍ లను ఆ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి.

ప్రజల చేత ఎన్నికైనా ప్రభుత్వ నేతలు వారి రాజకీయ విశ్వాసాల పైన ఆధారపడి కాకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి. కానీ బిజెపి నేతలు అటువంటి నైతికతను విస్మరించి నిందితులకు అండగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రజల అసమ్మతిని గౌరవించడం లేదు. ప్రతి ఆందోళనను, అసమ్మతిని, భిన్నాభిప్రాయన్ని క్రూరంగా అణచివేస్తోంది. ఉంభా (సోన్‍ భద్ర), ఉన్నావో, షాజహాన్‍పూర్‍, ఎన్‍ఆర్‍సి, సిఎఎ, హత్రాస్‍, లఖింపూరి ఖేరీ సంఘటనలు బిజెపి ప్రభుత్వ ఫాసిస్టు ధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తికి గల జీవించే హక్కును గానీ, వ్యక్తి స్వేచ్ఛను గానీ హరించరాదు. యూపిలో చట్టబద్ధ పాలనకు కాలం చెల్లిపోయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‍ ఆదేశాలే చట్టం- పోలీసులు దాన్నే పాటిస్తారు. నేరపూరితమైన రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాయి. మంచి పాలన అంటే పౌరహక్కుల పట్ల గౌరవం, చట్టబద్ధమైన ప్రాథమిక హక్కులను, వ్యక్తుల విశ్వాసాలను, అసమ్మతిని గౌరవించేదిగా ఉండాలి. ప్రజలకు పాలకులు జవాబుదారీగా ఉండాలి. కాని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, ఆదర్శాలను తుంగలో తొక్కివేసి ఫాసిస్టు పాలన సాగిస్తోందని పలు సంఘటనలు రుజువు చేస్తోన్నాయి. అందువల్లనే బిజెపి పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు, చట్ట ఉల్లంఘనలు సాధారణమైన విషయంగా మారాయి.

కేంద్రంలోని బిజెపి పాలకులు… సామ్రాజ్యవాదులకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు. వారి ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా భావిస్తున్నారు. ప్రజారక్షణ, ప్రజల హక్కులను కాపాడడం పాలకుల నైతిక బాధ్యత. అందువల్లనే ‘దేశమంటే మట్టి కాదోయ్‍, దేశమంటే మనుషులోయ్‍’ అన్నాడు మహాకవి గురజాడ. ఆ మనుషుల్లో చైతన్యం రగిలితే ప్రజలు చోద్యం చూస్తూ కూర్చోరని, ప్రజాకంటక ప్రభుత్వాలను కూల్చివేస్తారని చరిత్ర చెబుతోన్న అనుభవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ప్రజా కంటక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడం, ఉద్యమించడం ప్రజల హక్కు. ఆ హక్కులకు భంగం కలిగితే… ఎటువంటి అసుర పాలననైనా, పాలకుడ్ని అయినా తగు సమయంలో ప్రజలు సాగనంపుతారు. ‘ఎఱుకలేని దొరల నెన్నాల్లు కొలిచిన/బ్రతుకు లేదు వట్టి భ్రాంతిగాని’ అన్న వివేకం ప్రజలకు అర్థమైతే… ఈ పాశవిక ప్రభుత్వాలకు చెల్లుచీటి రాసేస్తారు.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply