రైతుల కల్లోల జీవితాలను చిత్రించిన నవల ‘నేల దిగిన వాన’

సమాజంలో రైతు స్థానాన్ని బట్టి ఆ దేశ భవిష్యత్తు, ఆ దేశ అభివృద్ధి గురించి స్పష్టమైన అవగాహన వస్తుందన్నది నిజం. రైతుకి గౌరవం లేని చోట, రైతుకి మనుగడ లేని చోట ఆ దేశ నాగరికతలో సుఖ శాంతులుండవు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉండే రైతులను చాలా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం. పై పై మెరుగుల జీవితాలకు, పై మెరుగుల ప్రదర్శనకు, మట్టిని వీడి గడుపుతున్నజీవితాలకు పెద్ద పీట వేస్తున్న సమాజంలో రైతు స్థితి చాలా దారుణంగా ఉంది. రైతుల ఆత్మహత్యలు మన దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయన్న అవగాహన లేకుండా జీవితాలను గడుపుతున్నాం మనం. మన సమాజంలో రైతుకు సరైన గౌరవం లేదు. చేత కాక వ్యవసాయం చేస్తున్నట్లు పరిస్థితులను సృష్టిస్తూ, తళుకు బెళుకుల జీవితాన్ని కోరుకుని సాగుతున్న ప్రజలు ఏ స్థితికి సమాజాన్ని తీసుకు వెళుతున్నారో కనీస ఆలోచన చేయరు. వారిని ఆ దిశగా ఆలొచించనివ్వని పరిస్థితులు పేరుకుపోతున్నాయి. పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల దృష్ట్యా చాలా మంది రైతు ఉనికికి గుర్తించమని, రైతుకు సహాయపడమని, వ్యవసాయాన్ని గౌరవించమని నినదిస్తున్నారు. రచయితలు కూడా రైతు పరిస్థితుల గురించి రాయడం తమ బాధ్యతగా స్వీకరించి సాహిత్య సృజన చేస్తున్నారు. కాని ఇంకా చాలా మందిలో మార్పు వస్తే తప్ప రైతుకి సరైన గౌరవం దక్కదు. 2019 లో 42,480 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్.సీ.ఆర్.బీ రిపోర్టు చెబుతుంది. ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నామో, ఎంత అమానవీయమైన సంస్కరణలు జరుగుతున్నాయో అర్ధం చేసుకునే తీరిక, ఓపిక లేని విద్యాధికుల నడుమ, రాజకీయ నాయకుల నడుమ రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఎన్నో వాగ్దానాలు చేసే మన నాయకులు రైతుల జీవితాల దిశగా పని చేయడానికి, ప్రణాళికలు నిర్మించడానికి ఉత్సాహం చూపరు. కంప్యూటర్లకు ఉన్న క్రేజ్ పని ముట్లకు లేకపోవడం, పంటను పండించే రైతు లేకపోతే మన తిండి ఎలా అన్న ప్రశ్న కూడా వేసుకోలేనంత మూర్ఖపు అభివృద్ధి దిశగా మన ప్రయాణం చాలా దారుణమైన పరిస్థితులకు మూలం అవుతాయన్న విచక్షణ మరచి జీవిస్తున్నాం.

సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్యా నివారణ దినోత్సవం. ఆత్మహత్యలలో మన దేశం అగ్రస్థానానికి దూసుకుపోతుంది. 1897 లో ఎమిలి డర్ఖిమ్ అనే ఒక ప్ర్రెంచి సోషియాలజిస్ట్ “Suicide – A study in Sociology” అనే పుస్తకాన్ని రాసారు. సమాజంలో జరిగుతున్న ఆత్మహత్యలపై వచ్చిన మొదటి విస్తారమైన పుస్తకం ఇది. ఆర్ధిక కారణాలు, అసమానతలు, సమాజంలో మారుతున్న విలువలు, మనిషి మానసిక అవసరాలు ఇవన్నీ మనిషి మనసును ఎలా ప్రభావితం చేస్తాయో చెబుతూ ఆత్మహత్యలకు సమాజ ఆర్ధిక స్థితుగతులకు ఉన్న సంబంధాన్ని, విస్తారంగా వివరించారు. మనిషి స్వభావానికి విరుద్దంగా జీవించే పద్దతులు, తమ అవసరాలకు, ఆదర్శాలకు మధ్య ఉన్న వైరుధ్యాలు, సమాజాన్ని గందరగోళానికి గురి చేస్తాయి. ఇదే మనిషి జీవితేచ్ఛను నియంత్రిస్తుంది. అందుకే ఆత్మహత్యలన్నవి కేవలం మానసిక సమస్యలతో ఉత్పన్నమయే ప్రమాదాలు కావు. దేశ కాల మాన ఆర్ధిక విధానాలు కూడా సమాజంలో ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మన దేశంలో 2010 తరువాత ఆత్మహత్యల సంఖ్య విపరీతంగా పెరిగింది.

కనీసం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నయినా ఈ విషయం పై చర్చించుకోవలసిన అవసరం మనందరిదీ. ఆత్మహత్యలపై సమగ్ర చర్చ జరగాలంటే రైతు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యల గురించి వాటి వెనుక ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ కారణాల గురించి చర్చలు బాహాటంగా జరగాలి. సాహితీ పరంగా ఈ చర్చ కోసం నేను ఎన్నుకున్న పుస్తకం డా. వేంపల్లె గంగాధర్ గారు రచించిన “నేల దిగిన వాన”. ఇది చాలా చిన్న నవల. ఇది చాలా గొప్ప నవల అనో రైతు జీవితం పై గంభీరమైన చర్చ ఇందులో సాగిందనో దీన్ని నేడు పరిచయం చేయట్లేదు. చాలా మంది రచయితలు ఇదే సమస్య పై ఇంకా మంచి రచనలు, విస్తారమైన చర్చ చేసారు. కాని గంభీరమైన సాహిత్యాన్ని చదివే ఓపిక లేని సామాన్య పాఠకులు కూడా ఈ సమస్య ను కొంతైనా అర్దం చేసుకోవడానికి పూనుకోవాలనే ఉద్దేశంతో వారికి పరిచయం చేయవలసిన పుస్తకం చిన్నగా చదివించేదిగా, ఉండాలన్న ఉద్దేశంతో నేను ఎన్నుకున్న పుస్తకం “నేల దిగిన వాన”.

“నేల దిగిన వాన” రాయలసీమ లోని ఒక గ్రామంలోని రైతు జీవితాన్ని పరిచయం చేస్తుంది. ఉత్తమ పురుషలో సాగే ఈ కథలో పాత్ర పేరు ప్రస్తావించరు రచయిత. అతనో రైతు. భూమిని నమ్ముకున్న కర్షకుడు. అతని తండ్రి ఒకప్పుడు ఆ ఊరిలోపెద్ద రైతు. కానీ పరిస్థితులు వికటించి, భరింపశక్యం కాని ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. అతని మరణం తరువాత కొడుకు, కూతురు, తల్లి, వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తుంటారు. వారికి మరో ప్రత్యామ్నాయం లేదు మరి. మనకు కథ చెప్తున్న రైతుకు ఒక చిన్నాన్న ఉంటాడు. అతనూ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతుంటాడు.

రాయలసీమలో రైతు వర్షం పై ఆధారపడి వ్యవసాయం చేస్తాడు. వర్షం రాక పొలాలు బీడుపడి, పండిన పంట చేతికి రాక ప్రకృతి తో నిత్యం యుద్దం చేస్తూ ఉండే రైతు జీవితాన్నికళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ నవల. గ్రామీణ ప్రాంతాలలో ఎడ్ల పందాలు, రాయలసీమలో ఎడ్లతో బండలు లాగించే పందాలు, వారి మూఢ నమ్మకాలు అన్ని కూడా ఆ ప్రాంతపు జీవితాన్ని ప్రతిఫలిస్తాయి. రాళ్ళ రాజ్యమయిన రాయలసీమలో ఎడ్లతో రాళ్ళను లాగించే పందాలను చూస్తాం, నీటి ఎద్దడి విపరీతంగా ఉండే ఆ ప్రాంతంలో నీళ్ళ కోసం చేసే పూజలలో ఆ ప్రాంతపు అమాయకత్వం, మూఢనమ్మకాలు కనిపిస్తాయి. ఈ మూఢనమ్మకాలు కూడా నీళ్ళ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మేఘాలను మోడాల్ను అని పిలిచే ఈ ప్రాంతలలోని జానపద గీతాలన్నీ కూడా నీటి చుట్టూ అల్లబడి ఉంటాయి. కప్పల పెళ్ళిళ్ళు ఊరంతా కలిసి చేయడం, దేవరెద్దుల్ని నిలబెట్టి బసవన్న ప్రదర్శనలు చేయించడం, ఆవు సాంగం లో ఆవుల్ను ఇంటింటికి పోయి తిప్పుకురావడం, ఆ ఆవు ఉచ్చ పోస్తే వానలు పడ్తాయని నమ్మడం, పోయకపోతే ఆ సంవత్సరం కూడా వర్షాలు ఉండవని బాధపడడం, కడవ సాంగెం అనే మరో పూజలో గంగమ్మ తల్లికి మొక్కి గంగమ్మ ఎదురుగా నీళ్ళ కుండ పెట్టి కుండ తిరుగుతున్నప్పుడు ఆ కుదుపులకు నీళ్లు పడితే, ఎన్ని నీళ్లు పడితే దాని బట్టి ఎంత వర్షం కురుస్తుందో అంచనా వేయడం, అలా జరగకపోతే మేకపిల్ల మెడ నోటితో కొరికి బలి ఇవ్వడం, అప్పటికీ నీళ్ళూ పడకపోతే దున్నపోతును నరికించడం ఇలాంటివన్నీ ఈ నవలలో చూపిస్తారు గంగాధర్. రోకలి సాంగం అనే మరో పూజ తో ఎంత కాలంలో వానలు కురుస్తాయో, అసలు కురిసే ఉద్దేశం ఉందో లేదో తెలుసుకోవాలనే ఆ ప్రాంతపు ప్రజల నమ్మకం కనిపిస్తుంది.

అమ్మవారిని అలంకరించి, రోకళ్ళకు పూజ చేసి, ఆ రొకలి తోసుకుంటూ గుడి చూట్టూ మూడు సార్లు తిరిగి ఆ రోకలి పై భాగాన ఇత్తడి చెంబుతో నీళ్ళు ముంచి పెడతారు. చెంబు తురుగుతూ నీళ్ళూ కింద పడే దాక జంతువుల బలి ఇస్తారు. చెంబు లో నీళ్ళూ సగం అన్నా క్రిండ పడితే ఆ సంవత్సరం వర్షాలు పడతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఇలాంటి ఉత్సవాలన్నీకేవలం నీటి కోసం, వర్షం కోసం అ ప్రాంత రైతులు చేస్తారంటే వారి పరిస్థితి అర్ధం కాదా? హేతువాదులు కూడా ఈ మూఢత్వాని వెనుక ఉన్న కారణాలని పరిశీలిస్తే ఎంత అమానవీయ రాజకీయ, ఆర్ధిక విధానాల మధ్య రైతులు బ్రతుకుతున్నారో అర్ధం చేసుకుంటారు. తమకు లేని దాని పట్ల ప్రేమ, అవసరాలు తీరని అసహాయత్వమే ప్రతి మూఢత్వానికి కారణం. తోలు బొమ్మలాడిస్తే వానలు కురుస్తాయని నమ్ముతారు ఆ ప్రాంతాలలో. ఈ నమ్మకాల వెనుక అమాయకత్వం తో పాటు ఎంత అసహాయత వారిలో ఉందో అర్ధం చేసుకుంటే హేతువాదానికి, అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధం అర్ధం అవుతుంది.

వలస పక్షుల రాక కూడా వానలపైనే ఆధారం. కబోది పక్షులు ఉండే గ్రామం కరువు బారిన పడదనే విశ్వాసం వెనుక ఉన్న సైన్సు కన్నా కూడా అ ప్రాంతాలలోని నీటి ఎద్దడిని అర్దం చేసుకోవచ్చు. నూట పదహారు పల్లెలకు ఒకే తాగునీటి బావి ఉన్నప్పుడు ఆ ఊరి ప్రజల జీవితాలు, వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. భూములు ఎన్ని ఎకరాలు ఉన్నా పండించడానికి నీరు లేదు. పోనీ భూమి అమ్ముదామన్నా కొనే వారు లేరు. అప్పులు ఎక్కువయ్యి పురుగుల మందు తాగి జీవితాలను చాలించే రైతుల సంఖ్య ఆ గ్రామంలో పెరుగుతూ ఉంది. నాయుడు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాక అతని భార్య తన పెద్ద కూతురుని వ్యభిచారంలోకి దింపి పూనా పంపిస్తుంది. బతకడానికి పనులు లేక అక్కడి రైతులు అడవిలో ఎర్ర చందనం చెట్లు నరకడానికి వెళ్ళి జైలు పాలవుతున్నారు. ఆంజనేయలు అనే రైతు అదే విధంగా పోలీసులకు చిక్కుతాడు. మరి కొందరు దుబాయ్ లాంటి ప్రాంతాలకు కూలీలుగా వలస వెళ్ళిపోతున్నారు.

నది ఎండిపోయి ఇసుక వ్యాపారం మొదలవుతుంది. నదిలో ఇసుక ఎంత వుంటే అంతగా భూగర్భ జలాలను నిల్వ ఉంచుకునే సామర్ధ్యం దానికుంటుంది. కానీ నదిలో ఇసుక అమ్ముకునే వ్యాపారస్తులు పెరిగి ఇసుక పోయి ఇక నీరు ఆ నదులలో వచ్చి చేరే అవకాశమే లేకుండా పోయే ప్రమాద కర స్థితిలో ఎన్నో నదులు ఇప్పుడున్నాయి. వీటి మధ్య మట్కా ఆట తో డబ్బు సంపాదించాలనే ఆశతో ఇల్లు గుల్ల చేసుకుంటున్న రైతు కుమారులు ఊరి నిండా పెరుగుతున్నారు. అలాగే సున్నం బట్టీలు పెట్టి ఆ వ్యాపారం చేస్తూ ఊరంతా పొగతో ముంచే వ్యాపారులు పుట్టుకువస్తున్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడి పశువులను అమ్ముకుంటున్నారు రైతులు, కబేళాలకు తాము పెంచుకున్న పశువులను పంపించడం ఏ రైతు ఇష్టపడని పని. మనకు కథ చెప్పే రైతు కూడా సంక్రాంతి పండుగలలో ఎడ్ల పోటీల్లో తనకు బహుమతి సంపాదించి పెట్టి అప్పు తీర్ఛడానికి సహాయపడిన ఎద్దులను తన చెల్లెలి పెళ్ళి కోసం అమ్ముకుంటాడు. ఎర్రచందనం చెట్లు కొడతాడు. కొద్దిలో పోలీసులు పట్టుకోకుండా తప్పించుకుంటాడు. చివరకు మబ్బులు కమ్మి వర్షం వచ్చే సూచనలు కనిపించే దాకా ఆ కుటుంబం, ఆ ఊరిలోప్రజలందరు దీనంగా బతకడం ఈ నవలలో చూస్తాం.

సరళమైన భాషలో రాయలసీమ రైతుల కష్టాలను పాఠకులకు తెలిపే ప్రయత్నం చేశారు గంగాధర్ గారు. ఈ పుస్తకం 2013 లో మొదటి ప్రచురణ తో మనముందుకు వచ్చింది. రైతు ఆత్మహత్యలు విపరీతంగా జరిగిన సమయం అది. మనకు అన్నం పెట్టే రైతు ఎంతటి దయనీయమైన పరిస్థితిలో జీవిస్తున్నాడో చెబుతూ అభివృద్ధి అంటూ మాట్లాడుతున్న ఈ రోజుల్లో కూడా తాగు నీటి కోసం వెంపర్లాడే రాయలసీమ గ్రామాల దుస్థితి మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు రచయిత. “నేల దిగిన వాన” లో రచయిత శైలిలో కొన్ని లోపాలు కనిపిస్తాయి. ఉత్తమ పురుషలో రచన చేసినా రచయిత కొన్ని సార్లు తానుగా మాట్లాడుతూ మరో సారి నవల లో ప్రధాన పాత్ర ద్వారా మాట్లాడిస్తారు. ఇక్కడ యాస మారుతుంది. రచయిత ప్రధాన పాత్రల మధ్య యాస మార్చే క్రమంలో కొంత శైలి దిబ్బతినింది. కొన్ని వాక్యాలు రిపీట్ అయ్యాయి. పేజీ 119 లో పంచాయితీ ప్రస్థావన మధ్యలో ఆగి, కాంచన తన భర్తను చంపిన అంశం మొదలవుతుంది. అక్కడ కొంత భాగం మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఇలాంటి కొన్ని ప్రూఫ్ లోపాలు సరి చూసుకుంటే బావుంటుంది. విషయాన్ని సరళంగా, పెద్ద హంగులు లేకుండా పాఠకులకు చేరవేయడంలో రచయిత ప్రయత్నం ఫలించింది. రైతు ఆత్మహత్యల పై ఆలోచించవలసిన నేపథ్యంలో ఈ నవల చాలా విషయాల పై అవగాహన కలిగిస్తుంది. ఆ ప్రయత్నంలో రచయిత సఫలం అయ్యారని చెప్పవచ్చు.

(సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా…. )

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

2 thoughts on “రైతుల కల్లోల జీవితాలను చిత్రించిన నవల ‘నేల దిగిన వాన’

  1. చాలా మంచి పుస్తకం పరిచయం చేశారు మేడం

Leave a Reply