రెక్కలు

చిన్నప్పుడు నాకు రెక్కలుండేవి
వాటిని చూసుకుంటూ మురిసిపోయేదాన్ని
అవి ఎప్పుడు ఎదుగుతాయా…
నేనెప్పుడు ఎగురుతానా అని!

ఆకాశంలో చక్కర్లు కొట్టి
పక్షి రాజుపైనే నా దృష్టంతానూ,
ఆ ఖగవిన్యాసాలు నన్ను
మిక్కిలి అబ్బురపరిచేవి!

సూర్యోదయ – సూర్యాస్తమయాలు
కనువిందులు చేసేవి
చుక్కల్ని చంద్రుడ్ని చూస్తుంటే
బహుముచ్చటేసేది!

తరులతలు – గుల్మాదులూ
ఏనుగు, గుర్రం ఎలుక పిల్లా
ఆకాశంలోనూ కనిపించేవి…
నల్లని తెల్లని మబ్బుల్లో!

నింగి నుండి నేలకి
ఏకధాటిగా వర్షాన్ని కురిపిస్తున్న
మనిషెవ్వడో తెలిసేది కాదు
అమ్మనడిగితే… మనిషి కాదు దేవుడంది
నాన్ననడిగితే… పెద్దయ్యాక తెలుస్తుందన్నాడు!

ఎలా ఎలా నేను ఎదుగుతుంటే…
నా రెక్కలు నాలోకి అలా కుంచించుకుపోసాగాయి
బాల్యంతో పాటే నా రెక్కలూ మాయమయ్యాయి…
అసలు ఆనవాళ్లే లేకుండా
నాలో నిసత్తువ – దిగులు – నిశ్శబ్దం !

ఆకాశాన్ని అందుకోలేనని అర్థమైపోయింది
అటువైపు చూడటం మానేసాను
నా చుట్టూ చూసుకోటం మొదలెట్టాను
చుట్టుపక్కల చూసుకుంటున్నాను
బాగా నడవడం నేర్చుకున్నాను –
అవసరార్థం పరుగెత్తడం కూడా!

ఇప్పుడు నాకు రెక్కలు లేవన్న బాధ లేదు
ఎగరాలని అసలే లేదు !
ఒకరి ఆసరా లేకుండా… తుది శ్వాస వరకు….
ఇలా నా కాళ్ళమీద నేను నడవగలిగితే చాలు

రచయిత్రి

Leave a Reply