రూపీ కౌర్ – ప్రవాస ఇంగ్లిష్ కవిత్వ తాజా సంచలనం

రూపీ కౌర్ – చిన్న వయసులోనే రాకెట్ వేగంతో ఇంగ్లిష్ కవిత్వ లోకంలోకి దూసుకొచ్చిన సంచలనం. 1992 లో ఇండియా లో జన్మించిన రూపీ కౌర్, ఆ తరువాత నాలుగేళ్లకు కుటుంబంతో పాటు కెనడాకు వెళ్లి అక్కడే స్థిరపడింది. కవిత్వం మాత్రమే కాదు, రూపీ చక్కటి బొమ్మలు కూడా వేస్తుంది. మొదట తన ఇంస్టాగ్రామ్ లో బొమ్మలతో పాటు పోస్ట్ చేసిన చిన్న కవితలతో తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ ఇంస్టాగ్రామ్ కవితలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. అట్లా వొచ్చిన గుర్తింపుతోనే, 21 ఏళ్ళ వయసులో యూనివర్సిటీ విద్యార్థిగా 2014 లో వెలువరించిన మొదటి కవితా సంకలనం ‘మిల్క్ అండ్ హనీ’ అమెరికాలో కవిగా గొప్ప పేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత 2017 లో ‘ద సన్ అండ్ హర్ ఫ్లవర్స్’ వెలువడింది. ఈ రెండు పుస్తకాలూ కలిపి 8 మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, 42 ప్రపంచ భాషల లోకి అనువాదమయ్యాయి అంటే రూపీ కౌర్ కవిత్వాన్ని ఇష్టపడే వాళ్ళ సంఖ్య ఎంతపెద్దదో అర్థం చేసుకోవొచ్చు. అంతే కాదు – 2020 లో వెలువడిన ‘హోమ్ బాడీ’ ప్రపంచ వ్యాప్తంగా అనేక రోజులపాటు నంబర్ 1 బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.

కెనడా లోని ఒంటారియో లో స్థిరపడిన రూపీ కౌర్ కవిత్వంలో ప్రేమ, వియోగం, బాధ, స్త్రీవాదం, ఓదార్పు, వలస వంటి వస్తువులు తారసపడతాయి.

రూపీ కౌర్ కవితలు కొన్ని ఇక్కడ-

1

నా లోని ఖాళీలను పూరించడం కోసం
నేను నిన్ను పొందాలనుకోవడం లేదు
నా సొంతంగానే నేను సంపూర్ణం కావాలి
ఎంతగా అంటే
ఆ వెలుగులో నేను ఈ నగరాన్ని వెలిగించాలి
అప్పుడు మాత్రమే
నేను నిన్ను పొందాలనుకుంటున్నాను
అప్పుడు మాత్రమే
ఇద్దరం కలిసి
ఈ నగరానికి అగ్గి పెట్టగలమ్

2

నిజమే
నా రుతుస్రావం గురించి
అట్లా అందరిలో చెప్పడం
నిజంగానే ఒక అనాలోచిత చర్య
మరి నా శరీర నిర్మాణం
ఇంకా పెద్ద నిజం కదా
స్త్రీ రెండు కాళ్ళ నడుమ వున్నది
అమ్మకం సరుకు కావడం సమ్మతం గానీ
ఆ శరీర భాగం పనిచేసే పధ్ధతి గురించి
మాట్లాడడం మాత్రం నిషేధం
నీకు వినోదం పంచె సమయంలో
అందంగా కనిపించే ఈ శరీరం
దాని సహజ పనితీరు ప్రస్తావన వొచ్చేసరికి
అసహ్యంగా మారిపోతుంది

3

మా వెన్నులు
అనేక కథలు చెబుతాయి మీకు
వాటిని భరించే శక్తి వున్న వెన్నెముకలు
ఏ పుస్తకాలకూ లేవు

4

లేదు
అది తొలిచూపు ప్రేమ కాదు
అది తొలిసారి నిన్ను చూసిన జ్ఞాపకం
అది మా అమ్మ కళ్ళతో నిన్ను చూసిన జ్ఞాపకం
నేను నా కొడుకును ఎట్లా పెంచాలనుకుంటానో
అటువంటి మగవాడిని మాత్రమే పెళ్లి చేసుకొమ్మని
మా అమ్మ చెప్పిన జ్ఞాపకం

5

అందరం
అందంగానే జన్మించాము
భయంకర విషాదం ఏమిటంటే
మనం అందంగా లేమని
క్రమంగా నమ్మించబడతాము

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply