రావిశాస్త్రి గారు విస్తారంగా రాసేరు. ఎవరోగాని ఆయనని రాచకొండ విశ్వనాథ శాస్త్రి కాదు రచనకొండ విశ్వనాథ శాస్త్రి అని అన్నారు. నిజమే. కథలు, నవలలు ఎన్నో రాసేరు. ఓ నాలుగు దశాబ్దాలు ఆయన రచనలు తెలుగు పాఠకుల్ని ఊపేశాయి. ప్రభుత్వం మీద, పోలీసుల మీద, న్యాయవ్యవస్థ మీద, రాజ్యం మీద, మనుషుల జుగుప్సాకరమైన ప్రవర్తన మీద, స్త్రీలమీద జరుగుతున్న వ్యవస్థీకృతమైన హింస మీద ఆయన రాసిన కథలు, నవలలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచింపచేస్తాయి. ఆయన అసాధారణమైన వ్యంగ్యం కట్టిపడేస్తుంది.
రావిశాస్త్రిగారితో పరిచయం ఉన్నవాళ్లకు తెలుసు — సునిశిత హాస్యం, వ్యంగ్యం, పేదవాళ్ల పట్ల కరుణ ఆయనలో సహజంగానే ఉన్నాయని. ఆయన మాట్లాడిందే రాసేరు. రాసిందే మాట్లాడేరు. ఇదంతా ఆయన రాసిన కథల్లో, నవలల్లో విస్తారంగా కనిపిస్తాయి. ఆ రచనాశైలిలో ఎవరైనా కొట్టుకుపోవాల్సిందే. మధ్యలో కొరడాలతో చెళ్ళున కొట్టినట్టు, బాగా కాల్చి వాతలు పెట్టినట్టు, బాధతో పేగుల్ని మెలిపెట్టినట్టు, కళ్ళు చెమర్చినట్టు — ఆ శైలీ విన్యాసం అనితర సాధ్యం.
అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, రావిశాస్త్రిగారి ఫిక్షన్లో ఎంత పదును, వెటకారం, లోతు ఉంటుందో — ఆయన రాసిన non-fictionలో అంతే పదును, వెటకారం ఉంటుంది. ఆయన రాసిన non-fictionని ‘రావిశాస్త్రీయం’గా ప్రచురించారు. ఇది మూడు-నాలుగు ప్రచురణలు పొందింది కూడ. ఈ పుస్తకం నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఎప్పుడూ చదివే పుస్తకాలు — అంటే చేతికి దొరికేటట్టుపెట్టుకునే పుస్తకాలలో ఇది ఒకటి.
ఆయన ఇచ్చిన ప్రకటనలు, ముందుమాటలు, ఉత్తరాలు, నివాళులు, డైరీల్లోని పేజీలు, ఇంటర్వ్యూలు, ప్రశ్న-జవాబులు — ఇలా ఆయన రాసిన non-fiction అంతా ‘రావిశాస్త్రీయం’లో వున్నాయి. ఇప్పుడు అందుబాటులో వుందో లేదో తెలీదు గాని, మనసు ఫౌండేషన్ వాళ్ళు వేసిన రావిశాస్త్రి సంపూర్ణ రచనలల్లో ఈ నాన్ ఫిక్షన్ రాతలు కనిపిస్తాయి. ‘వీరుడూ, విప్లవకవీ సచ్చరితుడూ అయిన చెరబండరాజు’కి అంకితమిచ్చిన ఈ పుస్తకంలో రావిశాస్త్రిగారి soul కనిపిస్తుంది.
తానెందుకు రాసేరో, అలా రాయడానికి ఎవరెవరు ఎలా సహాయం చేసేరో, ఏయే పుస్తకాలు, సహచరులు ఎలా దీప స్థంభాల్లా నిలుచుని తోవ చూపించారో రాసేరు. రచయితల మీద, రచనల మీద జరిగిన అణచివేత గురించీ, సాహిత్య ప్రయోజనం గురించీ, విప్లవోద్యమం గురించి, విప్లవం అనివార్యత గురించి, విప్లవకారుల త్యాగం గురించి, తన చిన్ననాటి స్నేహితుల గురించి, చదువుకున్న కాలేజీల గురించి, తన రచనా ప్రయాణం గురించి, సాహిత్య వస్తువుల గురించి, సహ రచయితల గురించి, సాహిత్య దృక్పథం గురించి, తనకు ఆరాధ్యులైన రచయితల గురించి, ఎమర్జెన్సీ గురించి, తను అమితంగా ప్రేమించిన విశాఖపట్నం గురించి, అక్కడి డాల్ఫిన్స్ నోస్ అలియాస్ యారాడ గురించి, విశాఖపై పడి బతకడానికి వచ్చి అక్కడి వాళ్ళని ఈసడించుకున్న ఎగువ జిల్లాల వారి టెంపరితనం గురించి — రావిశాస్త్రి గారు రాసేరు.
ప్రపంచంలోని ఏ రచయితకైనా దిక్సూచిలా పనిచేసే మాట చెప్పేరు ‘ఎందుకు రాసేను’ అన్న వ్యాసంలో. “రచయిత ఎవరైనా తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను. మంచికి హాని చెడ్డకి సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను,” అని అంటారు. రచయితల చుట్టూ ఎన్నో వ్యామోహాలు, ఆకర్షణలు, ప్రలోభాలు వున్న రోజుల్లో ఏ తోవ పట్టాలన్న ప్రశ్న వచ్చినపుడు రచయితలు తమకు తాము ఈ ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది.
‘నాకు రాయాలని!’ అన్న వ్యాసంలో — “నాకు రాయాలని లేదు; ఎందుచేతనంటే — నీతులు గోతుల్లోకి పోతున్నాయి. పాపాలు కొండలెక్కి కోటలు కట్టుకుంటున్నాయి. వారి బందూకులు బ్రహ్మచెముడు డొంకల్లా పెరుగుతున్నాయి. జనాన్ని వేటాడుతున్నాయి. పాలకుల తుపాకీలకి అక్షరాలు పూల తోరణాలు కడుతున్నాయి. ఎక్కడ చూసినా మబ్బుగానూ, గబ్బుగానూ వుంది. కానీ నాకు రాయాలని వుంది. నాకు ఈ ప్రభువుల్ని ఈడ్చి ఎండబెట్టాలని వుంది; కూలి కులాలన్నీ ఏకం కావాలని వుంది. కొండల మీద కోతల్ని కూల్చవలసి వుంది. బ్రహ్మచెముడు డొంకల్ని దుంప నాశనం చెయ్యాలని వుంది.” — ఇది రావిశాస్త్రి గారి రచనలకు ఒక preamble. ఆయన రాసిన ఏ వాక్యమూ ఈ లక్ష్యాలకు భిన్నంగా కనబడదు.
ఒకసారి రచన చేసేశాక రచయతలు ఆ రచనల్ని పట్టుకు వేళ్లాడకూడదని, దానిమానన దాన్ని వదిలేయాలని అంటారు. “కథ రాసేక, దాన్ని మరింక విడిచిపెట్టక, దాని మానాన దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు దాన్ని సాకుతో సంరక్షించుకుంటూ సమర్ధించుకుంటూ నెత్తిని పెట్టుకుని తిరగడం నాకు ఇష్టం లేదు. నిజానికి దగ్గరగా ఉంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది లేకపోతే పోతుంది,” అని ‘రత్తాలు – రాంబాబు’ గురించి వచ్చిన విమర్శలపై రాసిన జవాబులో రాసేరు.
రెండు మూడు పేరాలు రాసిన ప్రకటనల్లో, పరిచయ వాక్యాల్లో కూడా ఆయనకే సొంతమైన చెణుకులుంటాయి. అవన్నీ quotable quotes.
“ఎండకి ఎండిన పుల్లలు ఎక్కువ వేగంగా అంటుకున్నట్టే కూలిపోయిన మనుషులు తొందరగా తిరగబడతారని భూషణంగారి లాగానే నేను కూడా ఆశిస్తాను,” అంటారు, భూషణం మాస్టారి ‘అడివంటుకుంది’ గురించి రాస్తూ.
“రాజకీయాధికారం తుపాకీ గొట్టాల్లోంచి ప్రజ్వరిల్లేముందు బాణా కర్రల్లోంచి బయల్దేరవచ్చు.”
ఇలా ఈ పుస్తకంలోని ప్రతీ వాక్యమూ ఆలోచింపచేసేదే. కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదిది. సాహిత్య ప్రేమికులందరి దగ్గరా తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకం.
రావిశాస్త్రిగారి రచనావిన్యాసం కోసం మాత్రమే కాకుండా, ఇది అప్పటి తెలుగు సమాజ, సాహిత్య చరిత్రని అర్ధం చేసుకోడానికి ఉపయోగపడుతుంది కూడా.
(రావిశాస్త్రి గారి వర్ధంతి: నవంబర్ 10)