రామరాజ్యంలో ప్రొ.సాయిబాబలు ఎందరో!

అణగారిన ప్రజల హక్కుల గొంతుకైనందుకు ప్రొ. జి ఎన్. సాయిబాబను, మరో ఐదుగురిని రాజ్యం ఓ తప్పుడు కేసులో ఇరికించింది. పదేళ్ల జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. అందులో పాండు నరోటి అనే ఆదివాసీకి వచ్చిన అనారోగ్య సమస్యకు సకాలంలో వైద్యం అందించక, రాజ్యమే అతని చావుకు కారణమైంది. చివరికి 5 మార్చ్, 2024న ముంబై హైకోర్ట్ సాయిబాబ సహా మిగతా వారందరూ ఎలాంటి నేరం చేయలేదని కేసును కొట్టివేసింది. అయితే, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషిద్దామా? లేక పోరాడే ప్రజల మీద కక్ష సాధింపుతో “చట్టబద్ధ హింస” కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ రాజ్య నేర స్వభావాన్ని ఎండగడదామా?   

అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చాక ఆరోగ్యం సహకరించకపోయినా మార్చ్ 8న ఢిల్లీ ప్రెస్ మీట్ లో సాయిబాబ దాదాపు ముప్పై నిమిషాలు మాట్లాడాడు. ఆ ప్రెస్ మీట్ లో తన కేసు గురించి, జైలులో తన దుర్భర పరిస్థితి గురించి, తన సహముద్దాయి అమరుడు పాండు నరోటి గురించి, చివరి చూపు కూడా దక్కని తన తల్లి గురించి, తన కేసు వాదించడం మూలంగానే మరో దొంగ కేసులో ఇరికించబడిన ప్రజా న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ గురించీ ఎంతో భావోద్వేగానికి గురవుతూ మాట్లాడాడు. పదేళ్లుగా తనకు అండగా నిలిచిన హక్కుల సంఘాల కార్యకర్తలకు, లాయర్లకు, మీడియా మిత్రులకు, తోటి సహచరులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఆ ఉపన్యాసం మొత్తం ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది. “రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం” అని గుండెలు బాదుకునే ప్రతిఒక్కరూ చూడాల్సిన వీడియో అది. ఆయన మాటలు జాగ్రత్తగా మనసు పెట్టి వింటే రాజ్యవ్యవస్థ అసలు స్వభావం అర్థమవుతుంది.

పదేళ్లుగా ప్రజాస్వామికవాదులు, పౌరహక్కుల సంఘాలు, ప్రపంచ పౌర సమాజం కేవలం ప్రజల మీద కొనసాగుతున్న హింస, పీడన, విధ్వంసం గురించి ప్రశ్నించినందుకే ఆయనను అక్రమంగా నిర్బంధించారని చెబుతూనే వున్నారు. 

నేను సెప్టెంబర్ 2019లో సాయిబాబ తల్లి సూర్యవతమ్మతో మాట్లాడినప్పుడు నన్ను పదే పదే అడిగిన ప్రశ్న ఒక్కటే: “నా కొడుకు ఏం తప్పు చేసిండు?” అని. బహుశా ఆ తల్లి బతికి వుంటే ఈ రోజు ఎంత ఆనందపడేదో!  

ఆ తల్లితో చేసిన సంభాషణ అదే పనిగా గుర్తుకొస్తావుంది. “అవును నాయనా! మనమందరం మాట్లాడుకొని నా కొడుకును ఎట్లాగైనా బయటికి తీసుకురావాలి. నా బెంగంతా ఆయన గురించే తండ్రీ. నా కొడుకు మీద గవర్నమెంట్ ఎందుకు పగ పట్టిందో? వాడేమైనా నడవగలడా? బరువులు ఎత్తగలడా? తుపాకితో కాల్చగలడా?” అని ఆ తల్లి అన్నప్పుడు ఈ రాజ్యం మానవీయ సమాజం గురించి ఊహ చేయడాన్ని, ఆ భావాలను ప్రకటించుకోవడాన్ని భరించలేదని ఎలా చెప్పాలో నాకు తెల్వలేదు. నిజమే. ఆమె బెంగంతా సాయిబాబ మీదనే. సాయిబాబ ప్రెస్ మీట్ లో కన్నీళ్ళు పెట్టుకొని చెప్పినట్లు, ఆమె కొడుకును తన చేతుల మీద మోస్తూ పెంచింది. ఆయనే ప్రాణంగా బతికింది. అయినా ఆమె తన పిల్లలు తమ స్వార్థం కోసమే బతకాలని కోరుకోలేదు. వాళ్ళు ప్రజా రాజకీయాల్లో భాగం కావడాన్ని స్వాగతించింది. “నా పిల్లలు ఏం తప్పు చేస్తుండ్రు? నలుగురికి మంచి జరగాలనే పోరాటం చేస్తుండ్రు కదా! అని సంతోషపడ్డ” అని గర్వంగా చెప్పింది. “నలుగురికి మంచి జరుగొచ్చేమో కానీ, మీకేమొచ్చింది?” అని అడిగిన. “అందరూ మాకేమొస్తది అనుకుంటే, ఇక మనుషులెట్ల బతుకుతరు? మేము కష్టాలు పడుతమేమో గానీ మిగిలినోళ్లన్నా మంచిగ బతుకుతరు కదా?” అని బదులిచ్చింది. అమ్మ చివరిగా మాట్లాడుతూ, “నాకు మోడీ దగ్గరకు వెళ్ళి అడగాలని వుంది. నా కొడుకును వదిలిపెట్టమని కాదు. నా కొడుకు ఏం తప్పు చేసిండో చెప్పమని. ఎప్పటికైనా ప్రభుత్వం తప్పు తెలుసుకుంటది. నా కొడుకు బయటికి వస్తడు. ఆ నమ్మకం నాకుంది” అని అన్నది.

ఆ తల్లి విశ్వాసం గెలిచింది. కానీ సాయిబాబ తాను నిర్బంధంలో పడిన అవస్థలు వింటుంటే, తన శరీరంలో ఒక్కో భాగం ఎట్లా పనిచేయకుండా పోతున్నాయో చెబుతుంటే ఆయన మాటలు వినడానికే కష్టంగా వుంది. ఆయన కేవలం తన కష్టాలే చెప్పలేదు. పదిహేను వందల మంది ఉండాల్సిన జైళ్ళో మూడు వేల మంది ఖైదీలను ఉంచితే వాళ్ళకు కనీసం పడుకునే, కూర్చునే జాగ లేదంటే ఆశ్చర్యం అనిపించలేదు. మనిషికి కనీసం ఆరు అడుగుల స్థలం లేక “కుక్కల మాదిరిగా” కొట్టుకునే స్థితి ఆ జైళ్ళలో ఉందంటే ఎంత దారుణం!

అందులో ఎక్కువ భాగం వున్న ఆదివాసీ ఖైదీలకు తాము చేసిన నేరాలేంటో తెల్వదు. ఏ శిక్ష వేశారో కూడా తెలియని పరిస్థితి. తనతో పాటుగా కుట్రలో భాగం చేసిన పాండు నరోటి ఎవ్వరో సాయిబాబకు అంత వరకూ తెల్వదు. అతనికీ సాయిబాబ అంటే ఎవరో తెల్వదు. కానీ రాజ్యం దృష్టిలో ఇద్దరూ కుట్రదారులు. పాండు నరోటి మొదటిసారి సాయిబాబను కల్సినప్పుడు “అసలు జడ్జిమెంటు అంటే ఏంటిది?” అని అడిగాడట. చట్టాలు, న్యాయవ్యవస్థ అనే అంశాలే తెలియని ఒక ఆదివాసీని కుట్ర కేసులో భాగం చేశారంటే ఆ కేసు ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవచ్చు. 

పాండు నరోటి తన కళ్ళ ముందే చనిపోయిన జ్ఞాపకం బహుశా సాయిబాబను ఇంకా వెంటాడుతూనే ఉన్నట్లుంది. ఆ మరణాన్ని రాజ్య హత్యగానే పేర్కొన్నాడు. పాండు నరోటి, మరో ఆదివాసీ ఖైదీ తనకు చేసిన సహాయాన్ని చెబుతుంటే వాళ్ళే లేకపోయుంటే సాయిబాబ బతికి బయటకు వచ్చేవాడా! అనిపిస్తుంది. తనను ఉంచిన అండా సెల్ లో వీల్ చైర్ తిరగలేదు. కాబట్టి టాయిలెట్ కు పోవాలన్నా, ములాఖత్ లకు పోవాలన్నా, మరే అవసరం కోసమైనా ఆ ఆదివాసీలు తనను ఎత్తాల్సిందే. ఇది ఒక్క రోజు, రెండు రోజులు కాదు. దాదాపు ఎనిమిదేళ్లు.

అందుకేనేమో “బయట ఉన్నప్పుడు ప్రజల సమస్యలను నా సమస్యలని భావించి కొట్లాడిన. నన్ను జైళ్ళో పెడితే ప్రజలు నా సమస్యను వాళ్ళ సమస్యగా భావించి సహాయం చేసిండ్రు” అని సాయిబాబ ప్రెస్ మీట్ లో చెప్పాడు. బహుశా ప్రజల మీద అంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టే పదేండ్ల కేసు జీవితంలో తన ఆరోగ్యం ధ్వంసం అయినా, ఉద్యోగం పోయినా, తన తల్లిని కోల్పోయినా, తన భార్యా బిడ్డకు దూరమైనా తాను నమ్మిన రాజకీయ, మానవీయ విలువల మీద విశ్వాసం పోలేదనిపించింది.

తన కేసును మొదటగా వాదించిన మానవ హక్కుల న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ను అక్రమంగా నిర్బంధించి తనకు కావాల్సిన అత్యవసర మెడిసిన్స్ అందనివ్వకుండా జైలు అధికారులు చేస్తున్నారని చెప్పాడు. తనను జైళ్ళోనే చంపే కుట్ర చేస్తున్నారని సురేంద్ర గాడ్లింగ్ జైలు అధికారులను హత్యాప్రయత్న నేరం కింద ఆ అధికారులను విచారించాలని  కోర్టును ఆశ్రయించాడంటే పరిస్థితి ఎంతగా విషమించి పోతుందో అర్థమవుతుంది.

ముంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును అభిందించాల్సిందే. దానిని పౌరహక్కుల పరిరక్షణలో ఎత్తిపట్టాల్సిందే. అయితే అది కేవలం న్యాయసూత్రాల మీదనే ఆధారపడి వచ్చిన తీర్పని భావిస్తే అర్థ సత్యమే అవుతుంది. కోర్టు బయట దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కార్యకర్తలు, అకడమిక్ స్వేచ్ఛ కోసం పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులు, జర్నలిస్టులు, ఆర్టిస్టులు, కవులు నిరంతరంగా కొనసాగించిన నిరసన కార్యక్రమాల ప్రభావానికి కోర్టు తీర్పుకు ఉన్న గతితార్కిక సంబంధాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆ అర్థంలో చూస్తే సాయిబాబ, ఇతరులు జైలు నుండి విడుదల కావడం ప్రజా ఉద్యమాల విజయమనే చెప్పుకోవాలి. 

ఇప్పుడు ఈ కేసులో పదేండ్ల జీవితాన్ని కోల్పోవడమే కాదు, జైలు దుర్భర జీవితం మూలంగా పదేళ్ళకు పైగా తమ జీవితకాలమే తగ్గిపోయే ప్రమాదం ఉంది. పాండు నరోటి తన ప్రాణాలనే కోల్పోయాడు. వీటికన్నింటికి తప్పు చేసిన ప్రభుత్వానిదే బాధ్యత చేస్తూ బాధిత కుటుంబాలకు సరైన న్యాయం జరిగే వరకు వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం సమాజానికి ఉంది.

ఈ మొత్తం వ్యవహారంలో మొదట సాయిబాబ మీద ఉపా చట్టం కింద కేసు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హోం మంత్రిగా వున్న చిదంబరం “సాయిబాబను రెండుసార్లు నిర్ధోషిగా కోర్టు ప్రకటించినా ఇంకా ఆయనను జైల్లో ఉంచాలని చూడడం చాలా అసాధారణ చర్యగా” ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం క్రూర హాస్యానికి నిదర్శనం. అసలు మొదటగా పౌర, ప్రజాస్వామిక శక్తులను కట్టడి చెయ్యాలని, వాళ్ళను మావోయిస్టు ఉద్యమానికి “అర్బన్ కనెక్ట్” అని పేరు పెట్టి పౌరసమాజం మీద దాడిని మొదలు పెట్టిందే ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దాడిని మరింత ఉధృతం చేస్తూ మరిన్ని కుట్రలను అల్లింది, ఆ తర్వాత వచ్చిన బీజీపీ.

నిజానికి కుట్ర కేసులన్నీ రాజ్యం, పాలక వర్గాల ప్రయోజనాలు కాపాడడానికి తీసుకునే రాజకీయ నిర్ణయాలు. వాటిని అమలు చేయించడానికి అన్ని వ్యవస్థలను (పోలీస్, న్యాయ వ్యవస్థలతో పాటు మీడియాను) తమ జేబు సంస్థలుగా వాడుకుంటుంది. అందుకే సాయిబాబ కేసులో సైతం దొంగ సాక్ష్యాలతో, తప్పుడు ఆధారాలతో కేసును నిర్మాణం చేశారు. వాటి ఆధారంగా ఒక “న్యాయమూర్తి” జీవితఖైదు విధించాడు. అన్యాయమైన శిక్ష వేసి తన జీవితానికి ఒక పరీక్ష పెట్టారని, వాస్తవానికి ఆ పరీక్ష న్యాయ వస్థకు కూడా అని సాయిబాబ చెప్పాడు. పౌరాణిక కావ్యం రామాయణంలో రాముడు సీతకు పెట్టిన అగ్నిపరీక్షనే తనకూ పెట్టారని అన్నాడు. నిజమే. రామరాజ్యం తెస్తామని చెప్పుకునే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు పాలనలో అగ్నిపరీక్షలకు, అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సాయిబాబలు ఎందరో?! 

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

One thought on “రామరాజ్యంలో ప్రొ.సాయిబాబలు ఎందరో!

  1. Congress and BIP both are same —chidambaram corrupted politician —his son got 42 accounts in different banks—chemcha to sonia//ramarajyam -BIG JOKE SIR
    TRUTH- JUSTICE winners in this in this drama
    Ashok ji – nice one sir

Leave a Reply