రాత్రికి రాత్రి

రాత్రికి రాత్రి
నేను సుసంపన్నమౌతాను
పరిమళిస్తాను
నాన బెట్టిన విత్తనం
ముడి విప్పి మొలకెత్తినట్టు
తెల్లారుజాముకు బతుకుతాను

రాత్రిపూట
కన్ను కొరికిన క్షణం
మహా చిత్రమైన కునుకు
చిక్కని చీకటి పొద

ఎవరో తరిమినట్టుకల
కిందకు తోస్తున్నట్టు కల
మూసిన తలుపులు,కిటికీలు మధ్య
లేచిపోయిన మనస్సు
కలత కలత నిద్ర

ఉసిళ్ళు పిగిలినట్టు దృశ్యాలు
తెరలు తెరలు గా బతుకులు
పడగ విప్పి ఆడుతున్న
విష సర్పాల ఆట
కలత కలత నిద్ర

అదేపనిగా
కిందకు చూసే ఆకాశం
మాటిమాటికి ఉలిక్కిపడే సముద్రం
వణుకుతున్న రక్తం
ఆగుతున్న ఊపిరి
మబ్బులు పట్టిన నీడలు
ఊడలు దిగిన భయం
మసక మసక రహస్యాలు
కలవరింతల సందోహం
తొలకరిలా పట్టిన చెమట

మిత్రుడు పోయినట్టు కల
చెట్టు కూలిన చెడ్డ కల
పండిన పైరును
బెదిరిస్తున్న నల్లటి మేఘం
ఎండుతున్న పంటను
వెక్కిరిస్తున్న తెల్లటిమేఘం
మోగుతున్నఅతీంద్రియ శబ్దాల వీణ

ప్రతీ రాత్రి
ఒక తాత్కాలిక మరణం
తెల్లారిన
ప్రతీ క్షణం ఓ పురిటి బిడ్డ

పుట్టింది నెల్లూరు జిల్లా, ఓజిలి, రాచపాలెం. కాకినాడలోని పిఠాపురం రాజా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధిపతి. 'నీటిపూలవాన', 'గోరువంకల గానం' అనే రెండు పిల్లల కవితా సంకలనాలు వేశారు. ఎక్సరే, తానా, రంజని, కుందుర్తి వంటి పురస్కారాలు పొంది ఉన్నారు. రాధేయ కవితా పురస్కార నిర్వాహకులలో ఒకరు.

8 thoughts on “రాత్రికి రాత్రి

  1. Chala Chala baga rasaru sir meru. Conclusion adbhutam 👏👏👏❤️❤️👌👌👌

  2. ప్రతి రాత్రి ఒక తాత్కాలిక మరణం….
    పోయం చాలా బావుంది సర్

    1. పదచిత్రాలు గొప్పగా వున్నాయి. మంచి కవిత. మిత్రునికి అభినందనలు

  3. ప్రతీ క్షణం ఓ పురిటి బిడ్డ…👌సూపర్ సర్…💐అభినందనలు….

Leave a Reply