- ‘పడావు’ దీర్ఘ కవిత రాయడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి?
‘పడావు’ దీర్ఘ కవిత 2003లో వచ్చింది. తెలంగాణ ‘పడావు’ ఆంధ్రపాలకులు పడావు పెట్టిన రాయలసీమలోని అనంతపురం విరసం సభల్లో ఆవిష్కరించారు. ఆనాడు ప్రతీ రంగంలో తెలంగాణ తీవ్ర అన్యాయానికి, వివక్షకు గురైంది. దానికి పరిష్కారంగా ‘తెలంగాణ జనసభ’ ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ కోసం తెలంగాణలో విద్యార్థులు, యువత, మేధావులు, కవులు, రచయితలు, కళాకారుల్లో గొప్ప కదలిక తెచ్చి, తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాదులు వేసింది. ప్రత్యేక ప్రజాస్వామిక తెలంగాణ ఎందుకు అవసరమో తెలంగాణకు అవగాహన కలిగించింది. ఆ అవగాహన తెలంగాణ జనసభ ఉద్యమ ప్రేరణ, ఆనాటి ఆంధ్రపాలకుల పాలన ‘పడావు’ రాయడానికి కారణమైంది. మలిదశ ఉద్యమ క్రమంలో ‘పడావు’ గాఢమైన ప్రభావం వేసిందని చెప్పవచ్చు. మిత్రుడు గుడిహాళం రఘునాథం వరంగల్ లో ఉన్నప్పుడు మొదటిసారి ఫోన్లో కె. శివారెడ్డితో మాట్లాడే క్రమంలో నా పేరు చెప్పగానే ‘పడావు శ్రీనివాస్ వే కదా? అన్నాడు. విమర్శకుడు, కవి జిలుకర శీనన్న పడావు గురించి నాతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా పడావు One of the Telugu Classic Poetry అంటాడు. నల్లమల నుంచి అప్పట్లో ‘అరుణతార’లో ప్రచురించబడిన ‘ఉత్తరం’, ‘పడావు’, ‘జంగ్ – ఏ – కశ్మీర్ గురించి మరికొన్ని పుస్తకాలతో పాటు మాట్లాడింది. - ‘రాజు ప్రజలకు వ్యతిరేక పదం’ రాయడానికి నేపథ్యం?
‘రాజు ప్రజలకు వ్యతిరేక పదం’ దీర్ఘ కవిత తెలంగాణ జనసభ పత్రికలో ప్రచురితమైంది. ఇది మలిదశ ఉద్యమ నాయకుడి మీద రాసినన కవిత. ఆ నాయకుడి మాటలు, కార్యాచరణ, ఫాం హౌస్, ఆయన తీరుతెన్నులు, మధ్యమధ్య ఉద్యమానికి సెలవులు తీసుకోవడం, నిజాం ప్రభువును ఎత్తుకోవడం… ఆ కవితలో ఉన్న లక్షణాలతోనే ఆయన పాలన సాగింది. ఆ కవితను నల్లెల్ల రాజయ్య బుక్ వేద్దామనుకున్నాడు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆయన అమరుడయ్యాడు. బహుశా ఉద్యమ కాలంలోనే ఆ నాయకుడిలోని నియంతను పసిగట్టిన కవిత. ఆ నాయకుడికి వ్యతిరేకంగా ఉద్యమ కాలంలోనే వచ్చిన మొదటి కవితనుకుంట. - ‘నెత్తుట్లో ఇంద్రధనస్సు’ గురించి వివరించండి.
‘నెత్తుట్లో ఇంద్రధనస్సు’ దీర్ఘ కవిత ‘దు:ఖ భాష’ సంపుటిలో ఉంది. ఓదెల స్వప్న, తాడిచెర్ల సమ్మక్క, ముత్తారం జానకి, పల్లెంకుంట లక్ష్మి, సూరయ్యపల్లి ప్రమీల, మొట్లపల్లి లత, దొంగవనపర్తి శ్వేత… ఏడుగురు దొంగ ఎదురు కాల్పుల్లో చంపబడినపుడు రాసిన కవిత అది. ‘దు:ఖ భాష’ చదివి ప్రముఖ కవి నిఖిలేశ్వర్ రాసిన ఒక ఉత్తరంలో ‘నెత్తుట్లో ఇంద్రధనస్సు’ను తెలుగులో మంచి ‘ఎపిక్ పొయెం’ అన్నడు. అది మొదట అక్టోబర్ – డిసెంబర్ 2000 అరుణతార సంచికలో వచ్చింది. ‘మా మట్టికోసం… మా హైదరాబాద్ కోసం’ ఆవిష్కరిస్తూ, ‘‘శ్రీనివాస్ మట్టి ముట్టుకుంటే కవిత్వమైతది’’ అని వరవరరావు గారు అన్నడు. డా.ఆచార్య ఫణీంద్ర ‘సమైక్య శాపం’ దీర్ఘకవితను 8 నవంబర్ 2013న తన బ్లాగులో సమీక్షిస్తూ ‘‘మరో వందేళ్లకైనా తెలంగాణ ఎందుకు విడిపోయిందో తెలుసుకోవాలంటే ఈనాటి సీమాంధ్ర ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కల్పనలు, కథనాలు చదవనక్కర లేదు. లేదా తెలంగాణవాదుల ఉపన్యాసాలు, వ్యాసాలు చదువనక్కరలేదు. ప్రతిభావంతంగా పదునెక్కిన పంక్తులతో గుండెల్లోకి సూటిగా దూసుకుపోయే ఈ ఉద్యమ కవిత్వం చదివితే చాలు`సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ఆ కవిత్వం వాస్తవికతను నలుగురిలో నగ్నంగా నిలబెట్టి చూపింది. ఎందుకంటే… ఆ కవిత్వంలో నిగ్గదీసి అడిగే నిజాయితీ ఉంది. అదిగో… అలాంటి కవిత్వంలోని ఒక నాలుగు పంక్తులను నిన్న నేను చదవడం తటస్థించింది. చదివినప్పటినుండి ఆ పంక్తులు నా మస్తిష్కంలో సుడిగుండంలోని వలయాలుగా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. మా ప్రాంతానికి వలసలు వచ్చారు. మా నీళ్లను, నిధులను, ఉద్యోగాలను స్వీకరించారు. మా సంస్కృతిని తమ సంస్కృతిగా అంగీకరించలేకపోయారు. కనీసం మా ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ పుణ్యక్షేత్రం ఉందో గట్టిగా చెప్పలేరు. వారి వ్యవహారిక భాష మాకు ప్రామాణిక భాషైంది. మా వ్యవహారిక భాష వారి ఈసడిరపులకు గురైంది. వారి ప్రాజెక్టులు చాలా పూర్తయి పరవళ్లు తొక్కాయి. మా ప్రాజెక్టులు ఒకరి రెండు తప్ప అన్నీ పునాది రాళ్ళుగానే మిగిలాయి. తుదకు విశాలాంధ్ర ఒక సమ్మేళనం కాలేకపోయింది. ప్రజాస్వామ్యం ముసుగులో ఒక సామ్రాజ్య విస్తరణగా నిలిచింది. ఇదే స్వభావాన్ని కేవలం నాలుగైదు పంక్తుల్లో నిక్షిప్తం చేసారా కవి. ఆ కవిపేరు వడ్డెబోయిన శ్రీనివాస్. ఆ కవితా పంక్తులు…. ‘‘నేను గోదావరి పాయలా బయలుదేరి సముద్రమై నీతో కలిసిపోవాలనుకున్నాను నీవు సముద్రంలా బయలుదేరి నాగార్జున సాగరు ఎడమ కాలువ కూడా కాలేకపోయావు’’ అంటూ డా.ఆచార్య ఫణీంద్ర గారు సుదీర్ఘ విశ్లేషణ చేశారు. - ‘రేలా… ఒక నెత్తుటి పదచిత్రం’ కవిత రాయడానికి మీలో కలిగిన సంఘర్షణ, సంవేదన గురించి చెప్పండి.
‘రేలా… ఒక నెత్తుటి పదచిత్రం’ పేరుతో సెప్టెంబర్-అక్టోబర్ 2024 అరుణతార సంచికలో ప్రచురితమైంది. ఒక రష్యా, చైనా పురా వెలుగులేవో ఈ నేల మీద పున:జీవించే యత్నంలో పారిస్ కమ్యూన్ పరిమళాలేవో మన ముక్కు పుటాలను తాకబోతున్నపుడు ఆ మానవీయ ప్రయోగశాల దారుణమైన యుద్ధంలో చిక్కుకుంది. తన పౌరులమీదే భారతదేశం యుద్ధానికి దిగింది. కార్పొరేట్ల కోసం దేశాన్ని ఇవాళ ఏం చేయడానికైనా సిద్ధమైన పాలకులతో దేశం నిండిపోయింది. అమానవీయమైన కార్యాలతో దేశం పోరాడుతున్న సమయంలోనే వేరువేరు కాలాలలో, వేరువేరు ప్రాంతాలలో జరిగిన దుర్మార్గాలన్నీ ఒక్కటై దండకారణ్యం మీద విరుచుకుపడుతున్నాయి. ఒక గాజా, 1946-52 తెలంగాణ, ఒక కశ్మీర్, ఒక మణిపూర్, వంటివి ఇజ్రాయిల్ మద్ధతుదారులైన పాలకుల ‘ఆఖరి యుద్ధం’లో దండకారణ్యం ముట్టడికి గురై నెత్తుటి వరద పారుతున్నపుడు ‘రేలా… ఒక నెత్తుటి పదచిత్రం’ పుట్టింది. - మీ పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు మీ సాహిత్యాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు?
నా కవిత్వం మొదటి పత్రికల్లో వస్తుంటే నా పిల్లలు, కుటుంబ సభ్యులు ఆనందించారు. అభినందించారు. ఎప్పుడైతే ఇంటిమీద పోలీసుల దాడులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడాలు చూశాక ఆనందం తగ్గింది. నా రాతలు వాళ్లను ఇబ్బంది పెడుతున్నట్టు బాధపడ్డరు. మునుపటి అభినందనలు ఇప్పుడు లేవు. నాకోసం వాళ్ల పడ్డ తిప్పలు… నన్ను వెతుక్కోవడం కోసం అనేకానేక పోలీస్ స్టేషన్లు తిరగడాలు … పోలీసులు నన్ను పెట్టిన దారుణ చిత్రహింసలు … వాళ్ల పట్ల పోలీసుల ప్రవర్తన నాపట్ల నా రాతల పట్ల కొంత వ్యతిరేకతను పెంచిన మాట నిజమే. ఆఖరుకు బెయిలు ష్యూరిటీ కోసం వాళ్ల ఎదురుచూపులు, ఆ సమయంలో సరైన అండ లేకపోవడం ఇవ్వన్నీ వాళ్లని చాలా ఇబ్బంది పెట్టిన మాటా నిజమే. ఐనా ఏదో గౌరవ భావం వాళ్ల ప్రవర్తనలో ఉంటుంది. నా రొండో తమ్ముని పిల్లల్లో ఒకరు కవిత్వం రాసే ప్రయత్నం చేస్తుంటుంది. ఒకరు నా కథల మీద, కవిత్వం మీద చర్చ పెడతాడు. నా మూడో తమ్ముడు అడపా దడపా కవిత్వం రాస్తుంటాడు. ఐతే నా బిడ్డ మొదట్లో వ్యాసాలు రాసి పాఠశాల స్థాయిలో బహుమతులు పొందింది. నా సంఘటనల తర్వాత అటువైపు ఆమె చూడలేదు. మా నాన్న వీడేదో గట్టిగా రాస్తాండని అక్కడా ఇక్కడా చెప్పేవాడు. మా దూరపు బంధువులు మాత్రం నన్ను కలిసినపుడు, నాతో మాట్లాడినపుడు సంబరపడేవాళ్లు. బంధువులు నా రచనల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. - అద్భుతమైన కవిత్వం రాసే మీరు ‘పాట’ వైపు ఎందుకు రాలేదు?
లేదు సుధా! పాట కూడా రాశాను. ఐతే నేను గాయకుణ్ని కాకపోవడం వల్ల నా పాటలు సరిగా సమాజంలోకి వెళ్లలేదనే అనుకుంటున్న. గాయకులతో కూడా సరిగా సాన్నిహిత్యం లేదు. రైతుల మీద…
‘‘మోసమెంత జేస్తారు రైతుల
పాణమెంత దీస్తారు రైతుల’’,
‘‘ఓటెత్తుకెళ్లిండ్రు అయ్యో రైతా
ఒడ్డెక్కి కూకుండ్రు అయ్యో రైతా’’ మూడు నాలుగు రాశాను. అమరుడు శ్రీకాంత్ రైతు సేవాసమితి చాలా సభల్లో…
‘‘ఆత్మహత్యలు అప్పులు తీర్చవురో రైతన్నల్లారా
నాగలెత్తి నడుమే కట్టాలే రైతన్నల్లారా’’ పాట పాడాడు.
సారా వ్యతిరేక పోరాట సందర్భంగా…
‘‘వద్దుర బిడ్డో
తాగొద్దుర బిడ్డ
సారింట్ల పీనుగెల్ల
సావుదెచ్చుకోకు బిడ్డ’’ రాశాను.
రాజ్యంతో పోరాటానికి దిగి తిరిగి రాజ్యంలో కలెగల్సిన సందర్భంలో …
‘‘రాజ్యాన్ని ప్రశ్నించి
రాజ్యమై పోతుండ్రు
రాజన్నా…
నీ పక్కన
రాజుకున్న గొంతుజూడు
రంగుల మారిందేమో
రంగరించి మరీజూడు’’ పాట రాశాను.
తెలంగాణ ఉద్యమ సందర్భంగా….
‘‘పల్లె గుండెల్లోన పల్లేరుగాయె
తెలంగాణ తెచ్చి తీరాలే’’ తెలంగాణ విద్యార్థుల కోసం రాసిన పాట. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలకు వ్యతిరేకంగా రాసిన పాట…
‘‘సావొద్దు సావొద్దు నా ముద్దుబిడ్డ
పోరి సాధించాలి ఈ వీరగడ్డ’’ పాట జయధీర్ తిరుమలరావు వేసిన సంకలనంలో చోటు చేసుకుంది. మైక్రోఫైనాన్స్‌కు వ్యతిరేకంగా ఇట్లా కొన్ని పాటలు రాశాను. హైదరాబాద్‌ను విడదీసే కుట్రకు వ్యతిరేకంగా రాసిన పాట. దీన్ని మిత్రుడు పాటగాడు వరంగల్ వెంకటేశ్వర్లు పాడాడు. - ఈ తరం కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
ఈ తరం కవులు, రచయితలు అద్భుతంగా రాస్తున్నారు. సొంత వ్యక్తీకరణతో ఆకర్షిస్తున్నారు. ఐతే దృక్పథ రాహిత్యం వారు కోరుకున్నది అందేలా చేస్తుంది. సరైన దృక్పథం లేకుంటే గుడ్డెద్దు చేన్లబడ్డట్టే. తనను అణచివేస్తున్న రాజ్యం కూడా వారికి అద్భుతంగా కన్పిస్తుంది. ప్రజల మీద అణచివేతను ఎంత గొప్పగా రాస్తారో రాజ్యాన్నీ అంతే శ్లాఘిస్తారు. కాబట్టి క్రూరమైన రాజ్యానికి, ఆర్తనాదాల ప్రజలకు మధ్య ఉండే ఆ గీతను స్వయంగా చెరిపేసుకుంటారు. అదే జరిగితే మనం నిలబడ్డ చోటు లోపభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి దృక్పథ లోపాన్ని దిద్దుకోవాల్సిన అవసరం ఈనాటి చాలామంది రాస్తున్నవాళ్లకున్నది. లేకుంటే పాలితులు, పాలకులు, బాధితులు, వధకుల విచక్షణ కోల్పోతాం. ఐతే దృక్పథ స్పష్టత ఉన్నవాళ్లు కూడా దాన్ని కోల్పోతారు. వాళ్ల అవసరాల మేరకు.
Sir /I want get his books /needs email and phone number plz