రాజ్యం గొంతుకగా వీవీ పై విమర్శ

విప్లవ కవి, రచయిత వరవరరావు రెండు సంవత్సరాలుగా భీమా-కోరేగావ్ కేసులో బెయిలు లేకుండా, అక్రమ జైలు నిర్బంధంలో ఉన్నాడు. ఆయన జైలులో ఉండగా కోవిడ్ బారిన పడి, సోడియం లెవల్స్ పడిపోయి మెదడుపై ప్రభావం పడడంతో అతి కష్టంగా ప్రభుత్వం హాస్పిటల్ లో చేర్పించింది. మొత్తంగా కోలుకోక ముందే ఆయనను మళ్ళీ జైలుకు విడుదల చేశారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పటినుండి, అంటే రెండు నెలలకు పైగా ఆయనకు మూత్రం కోసం పెట్టిన పైపును తొలగించలేదు. దానితో ఆయనకు మూత్రం లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆరోగ్యం మళ్ళీ విషమించిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 3, 2020 న జైలులో ఆయన 80 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. ఆ సందర్భంగా తెలుగు నేల మీదనే కాక దేశవిదేశాల నుండి చాలా మంది ఆయన మీద కవిత్వం రాశారు. ఎంతో మంది ఆయన కవిత్వం చదివి సోషల్ మీడియాలో వినిపించారు. సంవత్సరానికి పైగా బెంగాల్ రచయితలు, కళాకారులు నడుపుతున్న ‘రిలీజ్ ది పోయేట్’ కాంపెయిన్ సోషల్ మీడియాలో చాలా మందిని చేరింది.

ఒకవైపు ప్రజాఉద్యామాలలో చురుకుగా పాల్గొనేవాళ్లూ, సానుభూతిపరులూ, వరవరరావు స్నేహితులు, అభిమానులు ఆయన కోసం ఆందోళన పడుతూ, కోవిడ్ చేయబట్టి రోడ్ల మీదకు రాలేని పరిస్థితుల్లో, ఆయన విడుదల కోసం సోషల్ మీడియాలో కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా రీచ్ ఎంత అనేది పక్కన పెడితే, వివి కి కోవిడ్ వచ్చిన సందర్భంలో సోషల్ మీడియా లో జరిగిన ప్రచారం ఎంతో కొంత ఆయనను హాస్పిటల్ కు తరలించడానికి దోహదపడిందని చెప్పవచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళుగా, విప్లవోద్యమాల, ప్రజల బాగు కోరుకునే వాళ్ళుగా చెలామణీ అవ్వాలని చూసే కొందరు వివి కోసం జరిగే కాంపెయిన్ లను తప్పుబట్టడానికి బయలుదేరారు. అయితే ఇది ఈరోజు కొత్తగా జరిగే విషయం ఏమీ కాదు. ఇట్లాంటి శక్తులు చరిత్ర పొడుగునా ప్రజలకు మిత్రులమని చెప్పుకుంటూ ప్రజాఉద్యమాలను కుంటుపరిచే పనులకు పూనుకుంటారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే వివి విడుదల కోసం జరిగే కాంపెయిన్ లను వ్యక్తి పూజగా తప్పు పడుతూ విక్టర్ విజయ్ కుమార్ ఆంధ్రజ్యోతిలో (నవంబర్ 13, 2020) వ్యాసం రాశాడు.

విక్టర్ విజయ్ కుమార్ తన వ్యాసాన్ని గంభీరమైన బాలగోపాల్ వ్యాఖ్యతో మొదలు పెట్టాడు కాని దానిని చాలా అసందర్భంగా వాడుకున్నాడు. ఇప్పుడు సమసమాజమేదో వచ్చి మన ఇంటి ముంగిట్లో వుంది కాని వీవీ వ్యక్తిపూజతో దానికేదో ఆపద వచ్చినట్లు భావించి రాసినట్లుంది. ఇప్పుడు మొత్తం సమాజమున్నది హిందుత్వ ఫాసిస్టు ముంగిటనే సోయి విక్టర్ కు లేదనుకుంటాము. లేకపోతే కక్ష సాధింపుతో దేశంలోనే అత్యంత ప్రముఖులైన పదహారు మంది పౌరసమాజప్రతినిధులను బంధీ చేసి హింసిస్తుంటే దానిని ఎలాంటి షరతులు లేకుండా ఖండించాల్సింది పోయి ‘వ్యక్తి పూజ చేస్తారా?’ అంటూ కూనిరాగాలు తీయడమేంటి? విక్టర్ ఫోకస్ అంతా వీవీ మీదనే వున్నట్లుంది లేకపోతే మిగతావాళ్ళ గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక రూపాల నిరసనల గురించి కూడా తెలిసే వుండేది.

అసలు వ్యక్తి పూజ (personality cult) అంటే ఏమిటి? ఒక వ్యక్తిని కృత్రిమంగా అందలంపైకి ఎత్తిపట్టి, కేవలం ఆ వ్యక్తి ఇమేజ్ చుట్టూ ఒక వ్యవస్థ లేదా సంస్థను ఏర్పర్చడం. కల్ట్ సంస్కృతిలో తమ నాయకుడే సంస్థ. ఆ సంస్థలోని సభ్యులందరూ ఆ నాయకుని అధికారాన్ని, మాటలను అంతిమ సత్యంగా అంగీకరించడం. మొత్తంగా ఆ వ్యక్తిని ఒక దైవసమానమైన, మానవాతీతమైన లక్షణాలు ఉన్నట్టుగా పరిగణించి ఆరాధిస్తూ, ప్రచారం చేయడం. అట్లాంటి సంస్థలో విమర్శ, ఆత్మ విమర్శ లకు తావు ఉండదు. సంస్థ చెప్పుకునే లక్ష్యాలకు, ఆచరణకూ వైరుధ్యం ఎదురుపడినప్పుడు, దానిని ఎత్తిచూపినప్పుడు, వ్యక్తి పూజ చేసే సంస్థ, దాని సభ్యులు, ఆత్మ విమర్శ బదులు ఏదో ఒక సాకు కోసం వెతుక్కుంటాయి. తమ దైవసమానమైన నాయకుడి మాటలను ఉటంకిస్తాయి.

నిజమే! ప్రజాసంస్థల్లో, ఉద్యమాల్లో ఎలాంటి వ్యక్తిపూజకు తావు ఉండకూడదు. అదే సమయంలో చరిత్ర గురించి మాట్లాడే సందర్భాలలో లేదా సమకాలీన రాజకీయ సందర్భాలలో వ్యక్తుల కృషిని, సంఘర్షణలను గుర్తించడం తప్పు కాదు. అట్లా గుర్తించకపోతే చరిత్ర నిర్మాణంలో వ్యక్తుల పాత్రను కాదనడనమే. వ్యక్తుల కృషిని, విజయాలను రద్దు చేయడం, వ్యక్తిగత స్థాయిలో వాళ్ళ కష్టాలను తక్కువ చేయడం, సమాజపు విస్తృత కోణంలో మన (ప్రజల) పాత్రనుండి మనల్ని దూరం చేస్కోవడమే. మునుపటి విప్లవకారుల, ఉద్యమకారుల కృషికి అర్థం ఉన్నట్టే, మన కృషికీ అర్థం, ప్రయోజనం ఉంటుందనే నమ్మకం అవసరం.

అయితే వ్యక్తుల కృషిని గుర్తించడానికి, వ్యక్తి పూజకు ముఖ్యమైన తేడా వాళ్ళను విశ్లేషించే పద్ధతిలో ఉంటుంది. మార్క్సిస్ట్ పద్ధతి వ్యక్తులను ఒక శాస్త్రీయ దృక్పథంతో, భౌతిక వాస్తవాల మీద ఆధారపడి అంచనా వేస్తుంది. వ్యక్తిపూజ చేసే కల్ట్ పద్ధతి ఒక మనిషి చేసే పనులను బట్టి వాళ్ళను అంచనా వేయదు, ఉద్వేగాల మీద ఆధారపడి మనుషులను అంచనా వేస్తుంది. మార్క్స్, ఎంగెల్స్ లేదా లెనిన్ ను చరిత్రలో వాళ్ళ కృషి, వాళ్ళ విశ్లేషణ విప్లవానికి దోహదపడింది కనుక మార్క్సిస్టులు వాళ్ళను ఎత్తిపడతారు కాని, వాళ్ళపట్ల ఉద్వేగాలవల్ల, పూజ్యభావం వల్ల కాదు.

వరవరరావు అక్రమ నిర్బంధ సందర్భంలో అతని విడుదల కోసం జరుగుతున్న కాంపెయిన్ వ్యక్తి పూజ ఎట్లా అవుతుందో ఈ వాదాన్ని ముందుకు తీసుకువచ్చిన వాళ్ళు చెప్పాలి. విరసం తమ లక్ష్యాలకు విరుద్ధంగా, ప్రజల కన్నా, ప్రజాఉద్యమాల కన్నా వివి ఇమేజ్ పెద్దదిగా ప్రొజెక్ట్ చేస్తుందా? విరసం అంటే వివి, వివి అంటే విరసం గా చలామణీ అవుతుందా? నిజమే! కొన్ని సందర్భాల్లో ప్రజాసంఘాలు, ఉద్యమాలు వ్యక్తులను ఎత్తిపడుతాయి. ఎత్తిపట్టాలి కూడా. నిజానికి, వ్యక్తులు తమ మేలు కోసమని చేసుకునే దైవ పూజలకన్నా ఒక సంక్షోభ సందర్భంలో రాజ్యం మెడలు వొంచడానికి కౌంటర్ హెజమోనిక్ చర్చను నిర్మాణం చేయడానికి వ్యక్తుల గొప్పతనాన్ని కీర్తించడం తప్పేమి కాదు. ఆ “పూజ” ఉద్యమంలో భాగమైనప్పుడు అది కొత్త రాజకీయ ఎత్తుగడలను ప్రవేశపెడుతుంది. వ్యక్తులు నిర్బంధంలో ఉన్నప్పుడో, అమరులయినప్పుడో వ్యక్తుల విశిష్టమైన లక్షణాలను గుర్తిస్తూనే, వారి నుండి ప్రేరణను పొందుతూనే, వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వేలకొలది వీరులు పుడతారని ప్రజా ఉద్యమాలు నమ్ముతాయి. ఒక వ్యక్తిపైనే ఉద్యమం ఆధారపడి ఉంటుందని, ఆ వ్యక్తి లేకపోతే ఉద్యమాలు ఆగిపోతాయని వాళ్ళు నమ్మరు. వ్యక్తులపైనే తప్ప ప్రజాసమూహపు శక్తిపై నమ్మకం లేని సంస్థలు వాటి గోతిని అవ్వే తవ్వుకుంటాయి.

ప్రస్తుత సందర్భంలో వ్యక్తి పూజ అని గింజుకునే వాళ్ళకు వరవరరావు గురించి చేసే కాంపెయిన్ ఎందుకు ఇంత అసహనం కలిగిస్తుంది? నిజంగానే వీళ్ళకు విరసం లాంటి గొప్ప సంస్థ వ్యక్తి పూజలో కూరుకుపోతుంటే చూసి బాధపడి, సంస్థను రక్షించాలనే ప్రేమతో ఈ విమర్శ చేస్తున్నారా? విమర్శ గురించి మావో ఇట్లా అంటాడు. “వ్యక్తుల లోపాలను విమర్శించడం అవసరం… కానీ ఆ పని చేసేటప్పుడు మనం నిజంగా ప్రజల పక్షం వహించి, వాళ్ళను సంరక్షించడానికి, చైతన్యపరచాలానే హృదయపూర్వకమైన ఆతృతతో మాట్లాడాలి. తోటి కామ్రేడ్లతో శత్రువుల్లా వ్యవహరించడం, శత్రువు పక్షాన నిలబడడమే.” 80 ఏండ్ల తోటి ఉద్యమకారుడు అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న సందర్భంలో ఆయన విడుదల కోసం చేసే కార్యక్రమాలను వ్యక్తి పూజ అనడం ఎవరి ప్రయోజనాల కోసం? అది ఖచ్చితంగా శత్రువు వైపు నిలబడడమే! ఒక ఉద్వేగభరితమైన సందర్భంలో కొంత మంది నోళ్లలో నుండి వి.వి గురించి అతిశయోక్తులు వినబడ్డాయే అనుకోండి, అదే ముఖ్యమయిన విషయంగా ఎత్తిచూపడం, రాజ్యం చేసే దుర్మార్గమైన నిర్బంధానికి వత్తాసు పలకడమే!

ఒక కవి వీవీని “లెజెండ్” గా తన భావనను వ్యక్తీకరించడం అతను వీవీని అర్థం చేసుకునేదాని మీద ఆధారపడివుంటుంది. అయితే వీవీ రేపు విడుదలయ్యాక “నేనే లెజెండ్” ను అని చెప్పుకుంటే దానిని తప్పుపట్టడాన్ని అర్థంచేసుకోవచ్చు. ఆయన ప్రమేయం లేకుండా జరుగుతున్న పరిణామాలన్నింటిని ఒక పథకం ప్రకారం చేస్తున్నట్లుగా ఆపాదించడం గర్హనీయం. అంతే కాదు వీవీకి ఉన్న సోషల్ కాపిటల్ (విక్టర్ చెప్పకుండనే చెబుతున్నది ఆయన కులం గురించి) మూలంగానే ఆయన వ్యక్తిపూజ చేస్తున్నారనే అర్థం వచ్చేలా రాశాడు. అసలు సోషల్ కాపిటల్ అనేదే ఒక దివాలాకోరు భావన. ఒక మనిషి ఒక ప్రతిఫలం ఆశించి నిర్మాణం చేసుకునే ఒక సామాజిక సంబంధమే సోషల్ కాపిటల్ అని సామ్రాజ్యవాద తాబేదార్లు ప్రవేశపెట్టిన పొస్ట్ మోడర్న్ భావన. దాని అర్థం తెలువకుండా వాడినా, వాస్తవానికి విక్టర్ వాడిన అర్థంలో చూస్తే వీవీ అసలు అరెస్టే కాకూడదు. ఎందుకంటే ఈరోజు దేశంలో అధికారాన్ని కొనసాగిస్తున్నది హిందుత్వ బ్రాహ్మణీయ శక్తులే కదా! ఎందుకు ఇంతగా దిగజారుడు తనం? వీవీతో కానీ ఆయన జీవితమంతా నమ్ముకున్న విప్లవ రాజకీయాలతో కానీ ఏమైనా పేచీ వుంటే సూటిగా చర్చ చేయవచ్చు. కాని వీవీనే ఈసడించుకున్న కులానికి సోషల్ కాపిటల్ భావనలు ముడిపెట్టి మాట్లాడటం ఎవరికి ప్రయోజనం కలిగిస్తుందో విక్టరే చెప్పాలి.

విరసం భూస్వామ్య భావజాలంలో కూరుకుపోతుందని గుండెలు బాదుకుంటున్న ఈ విక్టర్ అనే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతినిధి ఎం.ఎస్.ఆర్ గురించి వాడిన మాటలేంది? “పిల్లోడు,” “పిల్లచేష్టలు”… ఇవేనా ఒక “ఆధునికవాది” వాడే మాటలు. ఇందులో పితృస్వామ్యమే కాదు, కరడుగట్టిన భూస్వామ్యం, ఎదుటి మనిషి వ్యక్తిత్వానికి విలువ ఇవ్వని అరాచకత్వం అన్నీ కలగలిపి వున్నాయి. ఎం.ఎస్.ఆర్ తన అవగాహన మేరకు ఈ సమాజంలో దోపిడీ, పీడన వుందని, దాని నిర్మూలనకు కేవలం ప్రార్థనలు చేస్తే ఏమీ ఒరగదు కాబట్టి ఆ వ్యవస్థలను సాయుధంగానే రూపుమాపాలని నమ్మి దానినే ఆచరించి అమరుడయ్యాడు. సరే అతనిది అపరిపక్వమనే అనుకుందాం. మరి ఇంత పరిపక్వంతో విక్టర్ ఏం చేస్తున్నట్టు సమాజం ఇంత అల్లకల్లోలంగా ఉంటే?

రాజ్యం ఏమి చేయదలుచుకుందో చాలా స్పష్టంగా దాని చర్యలతో చెబుతుంది. న్యాయస్థానాలు, మీడియా, హాస్పిటల్స్ తో సహా అన్ని ప్రభుత్వ శాఖలూ రాజ్యం వైపేనని స్పష్టం చేస్తున్న సందర్భం ఇది. నోరు మెదిపితే అంతు చూస్తామంటూ ఫాసిస్ట్ రాజ్యం స్వైరవిహారం చేస్తున్న కాలం ఇది. ప్రగతిశీల ముసుగులో, ప్రజల పక్షాన ఉన్నట్టు నటిస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజ్యానికి గొంతుగా వ్యవహరిస్తుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అజ్ఞానంతో ఆ పని చేస్తూ ఉంటే, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరివైపో నిర్ణయించుకోవాల్సిన సమయమిది. మనం మాట్లాడే ప్రతి మాటా ఎవరి ప్రయోజనాలకు దోహదపడుతుందో ఆలోచించి, ఆచితూచి మాట్లాడవలసిన సందర్భమిది.

ఇక వరవరరావు గురించి చెప్పాలంటే, అవును, కొందరు వ్యక్తులలో అసాధారణమైన లక్షణాలు ఉంటాయి. అసాధారణమైనవి అంటే అవి అనితర సాధ్యమైనవేమీ కావు. స్పృహతో, సాధనతో, నిబద్ధతతో అవి మనుషులెవరికయినా సాధ్యమే. వీవీ లాంటి కొంత మంది మనుషులు వాళ్ళు జీవించిన ప్రత్యేక చారిత్రిక సందర్భం, వాళ్ళ ప్రత్యేకమైన జీవితానుభవాలు, వాళ్ళ స్పృహ వంటి అనేక కారణాల కలయిక వల్ల ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. అలాంటి వ్యక్తిత్వాన్ని స్పృహతో పెంపొందిచుకున్న మనుషులు వాళ్ళ స్నేహంతో, మనిషితనంతో, ఆచరణతో ఇతరులను ప్రభావితం చేస్తారు. మనుషులెంత ఉన్నతంగా ఉండడం సాధ్యమో చూపిస్తూ, నూతన మానవుని పట్ల, సమాజం పట్ల ఆశను కల్పిస్తారు. ఈరోజు ఎవరు దానిని గుర్తించినా గుర్తించకపోయినా, చరిత్రనే వాళ్ళ స్థానాన్ని నిర్ణయిస్తుంది.

చివరిగా, ప్రజా ఉద్యమాలపై జరిగే కుట్రలలో విజేతలెవ్వరో, పరాజితులెవ్వరో కూడా రేపటి చరిత్రే నిర్థారిస్తుంది!

పుట్టింది హైదరాబాద్. పెరిగింది మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో. వైద్య విద్య కె. ఎం. సీ, వరంగల్. ‘ప్రజాకళ’ (2006-2007), ‘ప్రాణహిత’ (2007-2010) వెబ్ పత్రికల ఎడిటోరియల్ టీం మెంబర్. వృత్తి - వైద్యం. అభిరుచి - సాహిత్యం. ప్రస్తుతం అమెరికాలోని ఇండియనాపోలిస్ లో ఫామిలీ ఫిజీషియన్ గా ప్రాక్టీస్ చేస్తోంది.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

10 thoughts on “రాజ్యం గొంతుకగా వీవీ పై విమర్శ

 1. This not the first time this man wrote like this.
  A man who praised Adani for his exellent achievement ee can understand on whose side he is.

  To cover his hatred to VIRSAM he has written hating it for Saibaba’s arrest. That article also wrote in Andhrajyothi. He will not read what Saibaba wrote from jail in 2019 about VV and why he should be released. That fellow is shameless and capable of Vyktipuja though he Writes about Saibaba.

  I am surprised that Some of the well wishers who are friends with this fellow are not condemning him so far.

 2. వ్యక్తి పూజ గా భావించుట తగదు. ప్రశ్నలు బతకాలి

 3. He is person who thinks that he is an extraordinary intellectual nd illogically degrades anyone else, whom he hates. (for no reason.)We find no ideology in his writings. A patriarch to the core, but considers himself a thorough Democrat.

 4. వ్యక్తి పూజ అంటే ఏమిటో చక్కగా చెప్పారు

 5. వ్యక్తిని గురించి వివరంగా చర్చ చేయడం వ్యక్తి పూజ ఎలా అవుతుంది?

 6. వరవరరావు ఒక వెక్తి కాదు , ఆయన ఒక శక్తివంతమైన మరో రాజ్యం .😊
  బోధి హీన్
  హీనయాన బుద్దిజం .

 7. ఆంధ్ర జ్యోతి లో ప్రచురితమైన విక్టర్ గారి వ్యాసం అసంధర్బంగా ఉంది . ఓ రకమైన perverted expression లా అనిపించింది .

 8. vv లాంటి అసామాన్య విప్లవోద్యమ అభిమానిని, రచయితను, పౌరహక్కుల వాదిని కులహంకార వాదిగా పేర్కొనడం ఖచ్చితంగా దుర్మార్గమే . అది విప్లవప్రతీఘాతుకత్వమే . చెక్కిళ్ళ చైతన్య గారు చక్కగా వివరించారు.

 9. విజయకుమార్ కు సరైన, అవసరమైన సమాధానం.

Leave a Reply