చలం అనగానే మైదానం అంటారు వెంటనే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్లూ కూడా.
చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివేరు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో.
మైదానం నవల ఆకర్షణ అంతటిది.
కారణం అది రాజేశ్వరి చెప్పిన కథ. తన సాహసోపేతమైన శృంగార జీవితం గురించి ఒక స్త్రీ చెప్పిన లేదా చెప్పుకున్న కథ.
చలం గారి కాల్పనిక నవలలు ఎనిమిది. అందులో ఈ మైదానం నాల్గవ నవల. 1927 లో వచ్చింది. తిరిగి 1977 లో ఆంధ్రజ్యోతి వారపత్రిక లో సీరియల్ గా వచ్చినప్పుడు కూడా రచయిత తో పాటు సంపాదకులు కూడా తిట్లు తిన్నారని చెప్పుకున్నాం.
కానీ రాజేశ్వరి 2027 కి కూడా ఎప్పటిలానే తనకథ చెప్తూనే ఉంటుంది. కొత్త పాఠకులు పుట్టుకు వస్తోఉంటారు కూడా.
ఇంతకీ ఆమె చెప్పిన కథ ఏమిటి?
మైదానం లో కథ అమీర్ కథ కాదు. అది మీరా కథ కూడా కాదు. కేవలం రాజేశ్వరి కథ. ఆమె తన గురించి స్వేచ్ఛ గురించి చెప్పిన కథ.
చలం గారి ఎనిమిది నవలల లోనూ ఉత్తమ పురుష లో కథ చెప్పినవి మూడు. ఒకటి అమీనా, రెండు మైదానం, మూడు అరుణ. అందులో అమీనా, అరుణ లలో ఉత్తమ పురుష కథనం మగవాడిది, పైగా రచయితదే. చలమే అమీనా గురించీ అరుణ గురించీ చెప్తాడు. నిజానికి ఆ రెండు పాత్రలూ ప్రతీక లే.
ఇక మైదానం ఒక్క నవల లో మాత్రం స్త్రీ కంఠం తో కథ వినిపిస్తోంది .చలం కావాలనే ఈ కథ రాజేశ్వరి చేత చెప్పించాడు. ముందు అనుకున్నట్టు ఇది అమీర్, మీరా ల కథ కాదు కనుక. కేవలం రాజేశ్వరి వంటి స్వేచ్ఛాన్వేషి కథ కనుక.
మైదానం నవలను రెండు భాగాలుగా విడదీస్తే గనక అమీర్ తో శృంగార జీవితం మొదటి భాగం. ఆమె గర్భం ధరించిన్నప్పటినుంచి చివరి దాకా రెండో భాగం.
ఇందులో రాజేశ్వరి చలం చెప్పిన రెండు స్వేచ్ఛలు సంపాదించింది. మొదటిది బయటి స్వేచ్ఛ. రెండోది అంతరంగ స్వేచ్ఛ.
అందుకే చలం ఆ స్వేచ్ఛాసంపాదనల నేపధ్యం గానీ, నలుగులాట గానీ, పర్యవసానాల పట్ల నిర్భీతి గానీ ఆమె చేతనే చెప్పించాడు.
రాజేశ్వరి ఈ కథ ఎప్పుడు చెప్పిందంటే తను తీసుకున్న స్వేచ్ఛ కు సమాజం దృష్టిలో వైఫల్యం సంభవించినప్పుడు కాదు. తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొని కూడా తను నిబ్బరంగా నిలబడినప్పుడు చెప్పింది.
మొదలు పెట్టడమే ఇలా మొదలుపెడుతుంది. “లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను నాకెంతో కష్టం గా ఉంటుంది. ఇదివరకంతా ఈ మనుషుల్లోంచి, నీతివర్తనుల్లోంచి వెళ్లిపోయి ఎడారి లో జీవించడం వల్ల నేను చేసినపని ఘోరత్వం నీచత్వం బోధపడలేదు. ఆ జీవితమంతా సుందరమైన దివ్య స్వప్నం వలే, ఆ ఎడారి పుణ్యభూమి వలే ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలే తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల ఆ అనుభవం ఎంత ఉన్నతమో అద్భుతమో నువ్వే ఆలోచించు. అమీర్ నీ మీరానీ అనుభవించిన తర్వాత మన చుట్టూ బ్రతికే ఈ ప్రజలందరూ పురుషులేనా అనిపిస్తుంది నాకు.
నేను బండి దిగేటప్పటికి
లేచి పోయిందిట్రా
చాలా బావుంది రా మనిషి
కావాల్సిందే శాస్తి ముండకి
అంటూ ఉంటే నాకు అర్థమైంది లోకమార్గం. “
అమీర్ అసహనం తో తనను తాను పొడుచుకొని చనిపోయిన తర్వాత , కారణం ఎవరో తెలియక ఆ నేరాన్ని ఒకరికి తెలియకుండా ఒకరు రాజేశ్వరీ మీరాలు తమ మీద వేసుకుని పోలీసుల అధీనం లోకి వెళ్లేక.. అప్పుడు.. రాజేశ్వరి మాటాడిన మాటలు ఇవి.
ఇక్కడ నుంచి నేపథ్యం గా మైదానం నవల సాగుతుంది.
తన స్వేచ్ఛ తాలూకు పర్యవసానానికి ఏ మాత్రమూ వెనుతిరగని అస్తిత్వంతో రాజేశ్వరి ఇలా మొదట్లోనే ప్రత్యక్షమవుతుంది.
రాజేశ్వరి మామూలు మనుషుల కన్న ప్రత్యేకమైనది. ఆమె లోని భావుకత, స్పందించగల విశేషమైన శక్తి గొప్ప అనుభవం ఎదురైనప్పుడు కట్టలు తెంచుకున్నాయి. ఇల్లూ భర్తా ఆమెకు అవసరం లేదనిపించింది. ఇల్లంటే భద్రత, భర్తంటే రక్షణ అనుకుంటే గనక ఆమె తీవ్రమైన మోహానుభవం తో వాటిని సులువు గా వదిలేసింది.
మధ్యాహ్నపు సోమరిగాలి తాకితేనే ఒళ్లు ఝల్లు మనే ఆమె తనకు అమీర్ విశాలవక్షపు ఒత్తిడి స్వర్గం గా ఉండకుండా ఉంటుందా అని అడుగుతుంది.
అమీర్ తో అనుభవం చాటు మాటుగా భర్త తో ఉంటూనే సాగించవచ్చు. “కానీ ఇలా వెళ్లింది ఎందుకూ అంటే అమీర్ తో కామం తీర్చుకోడానికి కాదు అతని ముఖం చూస్తూ అతన్ని పూజించడానికి, అతని కళ్ల లోని ఆరాధన చూసేందుకు” అంటుంది.
అందుకే రాజేశ్వరి సమాజం పరిభాషలో లేచిపోయింది.
ఇది రాజేశ్వరి తీసుకున్న మొదటి స్వేచ్ఛ.
చలం స్త్రీ పుస్తకం లో స్వేచ్ఛ ను రెండు రకాలుగా విడదీస్తాడు. బయటి స్వేచ్ఛ, లోపలి స్వేచ్ఛ అని.
ఇప్పటి దాకా అంటే మైదానం లో మొదటి భాగం దాకా రాజేశ్వరి తీసుకున్నది మొదటి స్వేచ్ఛ బయటి స్వేచ్ఛ.
కొందరు ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఈ బయటి స్వేచ్ఛ వేపు వస్తున్నారు. కానీ పర్యవసానాలు చూసి పలాయితులు గా కానీ స్వార్ధపరులుగా గానీ హిపోక్రేట్స్( కపటులు) గా గానీ మిగులుతున్నారు. రెండో స్వేచ్చ వేపు వారి దృష్టి లేదు.
ఉత్త స్వేచ్ఛ వల్ల ఏమి ప్రయోజనం? ఆ స్వేచ్ఛ వల్ల సుఖమూ శాంతీ ఆత్మవైశాల్యమూ కలగనిది?? అంటాడు చలం.
అందుకే రెండో భాగం లో రాజేశ్వరిని ఆత్మవైశాల్యాన్ని ఇచ్చే రెండో స్వేచ్ఛ వేపు ప్రయాణింపజేసాడు.
రాజేశ్వరి గర్భాన్ని అమీర్ వద్దనడం ఆమె సంఘర్షణ పడి చివరికి అమీర్ మీది ఎక్కువ ఇష్టం వల్ల దాన్ని వద్దనుకోవడం ఇదంతా ఒక అధ్యాయం. తర్వాత మీరా అనే నవ యువకుడి ప్రవేశం. ఆమె మీద అతని ప్రేమ, ఆమె వాత్సల్యం వాటిమధ్య అమీర్ మీద తగ్గని మోహం.
క్రమంగా ఇవన్నీ ఆమె అంతరంగ ప్రపంచం లోని పట్లను ఎలా వదులు చేసుకుంటూ వచ్చేయో చలం స్పష్టంగా ఆమె తోనే చెప్పిస్తాడు.
మొదట్లో తురక పిల్లను కోరే అమీర్ మీద కోపం, ద్వేషం.గర్భం వద్దన్నప్పుడు దూరంగా జరిగిపోయి కూడా తిరిగి క్షమించడం ఇలాంటి సందర్భాల్లో ఆమె అంతరంగ పరిమళాన్ని నెమ్మదిగా మనతో శ్వాసింప చేస్తాడు.
ఈ మాటలు చూడండి.
“నా ప్రేమనీ, నా గతిని, నా ఆనందాన్నీ తలుచుకున్నన్నాళ్లూ నా హృదయం మండి అమీర్ని తలుచుకున్నప్పుడల్లా ద్వేషం తో ఉడికి బాధతో తపించాను. కానీ ఎప్పుడు నా స్వంత సౌఖ్యాన్నీ, స్వంత బాధ్యతను మరచి అమీర్ ఆనందంతో నా జీవిత సమస్యని ఐక్యం చేసానో, ఎప్పటినుంచీ నా జీవితోద్దేశం అతని ఆనందానికి త్యాగమేనని నిశ్చయించుకున్నానో ఆ నిముషాన్నుంచి ఆ కోపమే, ద్వేషమే అమృతంగా మాధుర్యం గా మారి నన్ను దివ్య ప్రేమానుభవం లో ఓలలాడించింది.”
ఈ మాటలు చెప్పడానికి ముందు ఆమె ఒంటరిగా ఆ ప్రకృతి ని ఎలా ఆస్వాదించిందో చెప్తుంది.
“ఆమె (తోళ్లసాయెబు కూతురు) వచ్చి అమీర్ దగ్గరగా కూర్చుంది. నేను లేచి ఏటి వద్దకు వెళ్లి నీటి ఒడ్డు నే ఇసుక లో కూర్చున్నాను. ఒంటరిగా కూర్చున్న నన్ను రాత్రీ, ఏరూ గుర్తుపట్టేయి. నా ముందరి పెద్ద ఆకాశం, విస్తీర్ణ మైదానం చీకట్లో ఆ మూల ప్రేమించుకునే వాళ్ళిద్దరూ – అంతా ఈశ్వరుడి సౌందర్యాన్ని నా ముందుకు తీసుకొచ్చాయి. నా హృదయం ఆనందం తో నిండింది. అమీర్ కోసం నేను ఆనిముషాన చేసిన త్యాగం పరమేశ్వరుడి కరుణను నా మీద వర్షింపచేసిందేమో అన్నంత ఔన్నత్యాన్ని కలిగించింది.”
చివరికి ఇలా అంటుంది-
“అమీర్నించి నా ప్రేమ త్యాగపు పక్షాల మీద విస్తీర్ణమై లోకాన్నంతా ఆవరించింది. మన బాధతో ఇంకొకరికి ఆనందం కల్పిమచామనే జ్ఞానం కన్నా గొప్ప ఆనందం లోకం లో లేదు అనిపించింది. “
ఇది రాజేశ్వరి సంపాదించిన లోపలి స్వేచ్ఛ అనే అనిపిస్తుంది.
మీరా తన జీవితం లోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదలలేక కలపలేక పెనుగులాడుతుంది.
ఒక్కరే ఉండాలనేది ఆదర్శమే కానీ ఆమె హృదయం లో కలిగిన మోహప్రేమ, వాత్సల్య ప్రేమ ఇద్దరూ కావాలనిపింపజేసాయి.
ఇక్కడ కూడా ఆమె లోని ప్రేమ నీతి తాలూకు పట్లు ను వదులు చేసింది . పట్టు ఏదైనా స్వేచ్ఛ కు అడ్డే.
ఇలా అనుకుంటుంది తనలో.
ఇద్దరిలో ఎవరినీ వదలడానికి చేతకాక, ఏ ఒకరినీ వదలకూడదనే పేరాశ తో ఆ ఇద్దరినీ ప్రయత్నించి ఒకచోట చేర్చడం అనర్ధకం అంటోనే ఉంది అంతరాత్మ. కానీ నా శక్తి లో ఉండే నా అహంభావం నన్ను పోత్సాహపరచింది.
కానీ అహంభావమేనా? స్వార్ధమేనా? కాదేమో! అమీర్ మీది ప్రేమ. నేను లేకపోతే అమీర్ ఏమవుతాడో అని అతనిమీద జాలి. నేను లేకపోతే మీరా బతకలేడే అని అతనిమీద జాలి.
నా హృదయం లో ఉండే మార్దవం కాదా నన్ను ఈ స్థితికి తెచ్చింది. నా కన్న కఠినాత్మురాలు, తన సౌఖ్యమే చూసుకునే దుర్మార్గురాలు తనకు నచ్చినవాణ్ని దరిచేర్చి రెండోవాణ్ని వదిలేసేది. అలా జరుగితేనే బాగుండేదేమో అనుకుంటుంది.
చివరికి “నా బాధ అంతా ఇద్దరినీ కలపడానికి నేను చేస్తున్న బ్రహ్మప్రయత్నమంతా తలుచుకుని ఏడ్చేను.” అంటుంది.
రాజేశ్వరి అమీర్ వేరొక స్త్రీతో కలిసిఉన్నప్పుడు అసూయ లేకుండా సహించగల శక్తి ని తద్వారా ప్రేమించగలగడాన్ని సంపాదించుకుంది. ఇలా అమీర్ ని కూడా మార్చగలనేమో అని ఆశపడింది. కానీ ఇది లోపలి స్వేచ్ఛ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. అది అమీర్ కి రాలేదు.
మొదటి రోజుల నాడు వారిద్దరి మధ్య ఉన్నది తీవ్రమైన మోహమే.
రాజేశ్వరి ఆ మోహం నుంచి ప్రేమ వేపు ప్రయాణించింది. అమీర్ రాలేకపోయాడు.అందుకే తనను తాను చంపుకున్నాడు.
లోపలి స్వేచ్ఛ ఇచ్చే క్షమ, ఓరిమి మాత్రమే మోహాన్ని ప్రేమగా మార్చగలవని అతనికి తెలియదు. తెలిసినా అలా మారడం అంత సులువు కాదు. మారాలంటే లోపలి గోడలను చాలా వాటిని బద్దలుకొట్టుకోవాలి.
కానీ ఆమె కు తెలిసిందనీ, ఎంతో మధనం తర్వాత ఆమె అలా మారిందనీ ఆమె మాటల్లోంచే తెలుస్తుంది.
ఇది ఆమె చెప్పిన ఆమె అంతరంగ స్వేచ్ఛ కథ.
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అని భారతం లోని ఒక సూక్తి. ఏమిచెయ్యడానికేనా తగినంత శక్తి ఉండి కూడా సహించగలవాడు పుణ్యపురుషుడు అని అర్ధం.
ఈ మాట లో పుణ్య దగ్గర స్వేచ్ఛ అన్నమాట పెట్టుకోవాలి.
అదే ప్రేమ, అదే స్వేచ్ఛ.
రాజేశ్వరి చెప్పిన కథ ఇదే.
ప్రతి వాక్యం లో స్పష్టత.విశ్లేషణ కథ నుంచి,కథనం వైపు, మానసిక స్థితి వైపు తీసుకు వెళ్ళిన మీ రచనా శక్తికి శుభాకాంక్షలు.
అక్కా నాకు ఫేసు బుక్కులో ముందుగా వారి ఆందోళనకి భయాలకి నమ్మలేక పోవడానికి కారణం ఆత్మ న్యూనతే..అని గాఢంగా నమ్మినా అప్పుడప్పుడు మీలాంటి ఆ తరపు రచయిత్రులని చదివినప్పుడల్లా…భలే గమ్మత్తుగా మీరు ఇంత నిజాయితీతో ఆనాటి నుంచి స్త్రీ స్వేచ్చా సాధికారత లను అద్భుతంగా రాస్తుంటే వారికి ఇంకా అనుమానాలు ఎందుకు అనేది నాకు అర్ధమయ్యి అర్ధమవ్వకుండా పోయింది.. కానీ ఇలాంటి రచనలను ఒకరి ఆలోచనలలోనుంచి చదవడం మానేసి విభిన్న తరాల ఆలోచనలు చదవగానే నాకర్ధమయ్యింది..గీతలో కృష్ణుడు చెప్పినది మాత్రమే…అది స్వధర్మాన్ని మించినది లేదు పరాయి ధర్మం ఎప్పుడూ తాచు పామే..ఇష్ట పడినా దూరం నుంచి అభిమానించాలే తప్పా అనుసరణ ఎప్పుడూ కాటేయించుకోవడమే.
బాపూ గారు వెంకట రమణ గారు ముత్యాల ముగ్గుకి ప్రేరణ గాడ్ ఫాదర్ అనే ఆంగ్ల మూవీనే…అని చెప్పారు…అవి మన సమాజానికి ఆంధ్ర ప్రదేశ్ లోని సంస్కృతుల్లోకి తీసుకు రావాలంటే ఆంధ్ర లో రాయవరం అనే చోట ఓ మునసబు గారు చేసిన అక్రమాలను కాస్త ఎక్కువ చేసి చూబించారు కొత్తదనంతో..
అలాగే పాశ్చాత్య నవలలు ఓ పది కలిపి…తాను చూసిన సంఘటనలతో ఒక చక్కని సహానుభూతిని వ్యక్తీకరించడంలో అద్భుతమైన పరిణితి చూపించారు చలం గారు. ఆంగ్ల నేపధ్యంలో తెల్ల అమ్మాయి నల్ల వాడితో లేచి పోయి..పడిన కష్టాలు తెలుగీకరిస్తే…మైదానం.
ఇంక ప్రభావానికి వస్తే..ఆనాటి ఆడ వారికి అందులో శృంగార వర్ణనలు తమని తొక్కి వేసిన అత్తింటి పుట్టింటి వారిని ధిక్కారం చేసే స్థితిలోకి తీసుకెళ్ళాయి..కానీ ఈ ప్రభావం 1% మించలేదు అనేది పచ్చి నిజం…ఒక వేళ మామూలుగా ప్రశ్నించినా చితక్కొట్టి అణిచి వేసారు.
అంతే కాదు రచయిత సమాజ బహిష్కరణకి గురి అయ్యినది స్వయంగానే చెప్పుకున్నారు.. ఆ వెలి నుంచి బయట పడడానికి భక్తి సూత్రాలు అనే రచన చేసి..పసుపు నీళ్ళు జల్లుకున్నారు..మారని సమాజాన్ని చూసి..
ఇంక మిగిలిన కల్పనలు రచయిత గురించి సమర్ధకులు విమర్శకులు..సమానంగానే సృష్టించారు ఎవరికి తోచిన విధంగా వారు వారి వారి సంస్కారలకు అణుగుణంగా..
చలం ప్రేమికుల “దినం” ఈ సామాజిక మాధ్యమాల నేపధ్యం లో ఒక పండుగ గా మారింది… అమ్మాయిలు అబ్బాయిలు ఫేసు బుక్కులో పైత్య కారులు..చలం ప్రేమికుల దినం పేరిట స్వేచ్చగా రమణాశ్రమంలో కలవడం ఒక కొత్త రకం ట్రెండ్ ఉత్సవం గా మారింది.
రాజేశ్వరిలో నాకు సీత సావిత్రి గౌతమీ సుమతీ లాంటి పతి వ్రతలే కనిపిస్తారు…ఆలోచనల్లో కానీ అభ్యుదయంలో కానీ స్వేచ్చలో కానీ భావ వ్యక్తీకరణలో కానీ…ఆచరణలో కానీ…
రామయణ భారతాలకి ఇంకా భాగవత కధలకి ..తమకు తోచిన భాష్యమో గానమో ప్రవచనమో చేసుకునే ఆరాధకులకి ఈ చలం ప్రేమికులకి లేదా ఆయన రచనలకు రాజేశ్వరి ఆలోచనలను ఎంతో గొప్పగా నిర్వచించ బోయే మీలాంటి మధ్య తరగతి అభ్యుదయ స్త్రీ మిత వాద రచయిత్రులు ఇప్పటికీ ఏదో రాసుకొస్తోనే ఉన్నారు…
ఇందులో అస్తిత్వ వ్యక్తీకరణమే..అంతా…తప్పా..చలం రాజేశ్వరిని నిర్వచించాలి అంటే చలమే చెప్పాలి..చెప్పిన దానికి నిజమైన భాష్యం మానసిక తత్వ నిపుణులచేత…చెప్పిస్తే…అదొక రకమైన హార్మోన్ సమతుల్యత చెడడమే ఇలాంటి పనులు మాటలు..చేష్టలూ అనేది అర్ధం అవుతుంది.. ఆ విధంగా చూస్తే మనువు ఇంకా పెద్ద హిట్లర్ అంత గొప్ప మానవతా వాదిగా స్త్రీని నీయంత్రించాల్సిన అవసరాన్ని చెప్పిన విధానాన్ని తప్పు పట్ట వలసిన అవసరం లేదేమో అనిపిస్తుంది.. కొన్ని స్వేచ్చలు చాలా ప్రమాదకరమైనవి చలం స్త్రీ స్వేచ్చ..స్త్రీలో నిద్రాణమైన శృంగారాన్ని సమాజపు కట్టు బాట్లు శృఖలాలుగా నిర్వచించి అవి తప్పించి (సమాజానికి దూరంగా మైదానాల్లోకి తీసుకొచ్చి..)స్వేచ్చ నిచ్చి..క్రీడిస్తే జరిగేది ఒక తరహా సమాజం పోయి కొత్త సమాజం సృష్టించడమే…తప్పా మైదనం కధకొచ్చి మాత్రం స్త్రీ గడప దాటితే అందరికీ ఒక ఆట వస్తువే..ఆమె హార్మోనులని సరి అయ్యిన సమయంలో శృతి చేస్తే…అందరూ…లొంగి పోతారు అనేది పచ్చి నిజం.. అది స్త్రీ శరీర ధర్మమే ఋతు ధర్మం..మానవాళి పునరుత్పత్తికి కావలసిన ఒక అద్భుతమైన క్షేత్రమే స్త్రీ శరీరం… అందుకే తమ శరీరాన్ని అప్రయోజకుడికి ధార పోసుకోకుండా…ఉండడానికే..ఎన్నో సూక్తులు సుద్ధులు స్త్రీకి చెప్పారు..అవి సరిగ్గా అర్ధం చేసుకోని వారే స్త్రీ వాదులుగా మారారు. అంత మాత్రాన్ని స్త్రీని తొక్కేసారు అనేది పూర్తిగా అభద్ధం కానే కాదు… స్త్రీనే కాదు ప్రతీ బలహీనమైన ప్రాణిని సృష్టిలో బలమైన ప్రాణి దోచుకుంటుంది..
ఇంక మీరు రాసినవన్నీ మీ భావాలు తప్పా సాధారణీకరించడానికి వీలు పడిన దృగ్విషయాలు..ఎందుకంటే..ఒక్కో శరీరం ఒక్కోలా స్పందిస్తుంది…ఒక్కో సమయంలో ..కాబట్టి అలాంటి సున్నితమైన శరీరాన్ని ఎలా నీయంత్రించుకోవాలి అనేది స్త్రీ సమస్య కాబట్టి స్త్రీకే వదిలి వెయ్యాలి అనేది ఉన్నతమైన భావనే..కానీ…వదిలేస్తే జరిగే పరిణామాలు మాత్రం అలానే ఉంటాయి..
అన్ని ప్రేమలు విశ్వ ప్రేమలో ములిగి తేలవు……..అన్ని ఆలోచనలు ఆరాధనలు.. సమారాధనలు..సంతర్పణలయ్యితే…చివరాఖరుకిఅసూయ జెలసీ ద్వేషం క్రోధం యుద్ధం మరణాలతో ముగిస్తాయి
👌👌👌