రాజపత్రమే సాక్ష్యం

వుయ్ ద పీపుల్
భారత ప్రజలమైన మేము
మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం రాజ్యాంగం హక్కుల అక్షయపాత్ర
చేయాలనుకోకు దాన్ని విచ్ఛిన్నం
తింటున్న తిండి కట్టిన వస్త్రం
బహానాలుగా చెప్పి పట్టిన కుటిల శస్త్రం
జాతీయత పేరున విసురుతున్నఅస్త్రం
కానున్నది భస్మాసుర హస్తం

వుయ్ ద పీపుల్
భారత ప్రజలమైన మేము
మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం నువ్వు చేసే రాజ్యాంగ అతిక్రమణే ఓ పేద్ద రాజద్రోహం
ఓటు హక్కు నా ఆయుధం
అధికార పీఠాన్ని నీకందించిన ఆధారం
కొందరిని కొన్నావో మరికొందరిని పొందావో నేనడగను
కానీ అందరి హక్కులను బుక్కుతానంటే మాత్రం నేనొప్పను

వుయ్ ద పీపుల్
భారత ప్రజలమైన మేము
మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం ప్రజాస్వామ్యాన్ని బొంకుగా మార్చి
లౌకిక వాదాన్ని రంకుగా చేసే
కిసీ (మాయి)మైకే లాల్ కో నహీం హై హక్
ఏ మాతా పుత్రునికి లేదు సత్తా
అందరి పుట్టుకల సాక్షాలు అడిగే ఓ డాష్
అసలు నువ్వు ఎందుకు పుట్టావు బిడ్డా
అని రోదిస్తోంది నీవు నిలిచిన గడ్డ

వుయ్ ద పీపుల్
భారత ప్రజలమైన మేము
మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం శృత పాండిత్యాల గీతలు గీసి
భాష పేరున మతం పేరున కథలు రాసి
జెండాలుగా ఎజెండాలుగా విడదీస్తూన్న ముసుగు వీరులుల్లారా బైరిగడ్డాల్లారా
బూతు బాగోతాల బాబాల్లారా
మనని మనం ఓడించుకొని
విడిపోయి విడదీసి లొంగిపోయి
అమ్ముడయ్యే నాయకుల్లారా
గౌడ డిండిమభట్టు కంచుడక్కాను పగలగొట్టే పాండిత్యం కాదు
ఒరె వారీ నువ్వనేది సమజైతలేదంటే
వివరంగా చెప్పకుండా నోరుమూసుకో అనుడేందిరా
మూల మూలనున్న మూలవాసీలను కలుపుకుపోయే ఐకమత్యం కావాలిరా
నేను నేను నేనంటూ కొట్లాడే డాషుల్లారా
మనం మనం అంటూ ఘనంగా నిలబడి
మేము భారత ప్రజలమనే మార్గదర్శకులు కావాలి
వుయ్ ద పీపుల్
మేము భారత ప్రజలమైన మేము
మాకు మేము సమర్పించుకున్న రాజపత్రం సాక్ష్యం

జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.

Leave a Reply