రహస్యం కాని రహస్యం

కొన్ని పేజీలు
మామూలుగానే దొర్లుతూ పోతాయి
ఉదయాలను అద్దుకున్న పేజీలు
రంగులలో ముంచి
దండెం మీద ఆరేసిన
ముఖమల్ వస్త్రం లాంటి పేజీలు
ప్రపంచం ముందుకు
అవలీలగా దొర్లుకుంటూ వచ్చేస్తాయి
గెలుపు ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించబడ్డ
పుస్తకాలకు గొప్ప గిరాకీ వుంటుంది
పొద్దున్నే ఎన్నింటికి లేచావో
రాసుంటుంది
రాత్రి ఎన్ని సార్లు
నిద్రను విదిలించి కొట్టావో
చెప్పే పేజీలుండవు
ఒక విజయం గురించి
ఒక విజేత పేరిట
ప్రపంచం రాసుకున్నవన్నీ
కట్టుకథలే
నది కావడానికి ముందు
రాళ్ళను చీల్చుకుంటూ నడిచిన
ఒంటరి కాళ్ళను అడగాలి
వేకువ తన కనురెప్పలు
విప్పక మునుపు
చీకటిలో ఛిద్రమైన గతాల గురించి
ఓటమి శిబిరాలలో
వాకబు చేయాలి
ఒకటో నెంబరు అంకె మీద
నిలబడ్డ కాళ్ళతో పాటు
ప్రవహించిన పాదాల గురించి
ఆరా తీయాలి
ఆకాశంలో మళ్ళీ మళ్ళీ
మూడు రంగులు పూయాలంటే
ముళ్ళు గుచ్చుకుని ఆగిపోయిన
చేతులన్నిటినీ లెక్కించాలి
రాళ్ళు తగిలి పగిలిన కలలన్నిటినీ
దోసిల్లలోకి తీసుకుని విశ్లేషించాలి
గ్రీష్మాలకు చిట్లి
శిశిరాలకు కొట్టుకుపోయిన
ఆశలన్నిటితోనూ సంభాషించాలి
ఈ మాత్రం కిటుకు
ఏ సాదాసీదా రైతుకైనా తెలిసేదే
పంట ఏదన్నది కాదు
ముందు మట్టిలో సారాన్ని నింపాలి

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply