రగలని నేలకోసం

నల్లమేఘాలు తెల్లబోతాయి
పలుగుపోట్లు కొండ గుండెతో పాటు
మబ్బు మోముకీ గాయాలు చేస్తాయి

ధనమై పొంగితే ఇంధనం
గిరిపుత్రుల చేతిలో సత్తు బొచ్చెగా మిగులుతుంది
మలయం కొండబిడ్డల కళ్ళల్లో మాత్రమే మెదులుతుంది

అవును
నేలతల్లి కడుపు కొస్తే
జీవకోటి కడుపుని కొడుతుంది

అలిగిన మేఘాన్ని అడుగు
తెగిన అడవి గొంతుల చిట్టా
కన్నీరుగా కురిపిస్తుంది

రగిలే ధరణినడుగు
కొండ గాలులను నిశ్వాసించే
తిత్తుల చిరుగుల గాధలు చెప్తుంది

చచ్చిపోయిన అడవిని అడుగు
కడుపున బిడ్డలు రాలి
గదుల్లో తన దుస్తులెలా అయ్యాయో చెప్తుంది

ఇంకా మిగిలివున్న మనుషులనడుగు
వంగిన కాలుగా, రెప్ప తీయలేని కన్నుగా
మళ్ళీ పుట్టిన రేడియేషన్ అసలు నిజం చెప్తారు

అవును!
ఈ తవ్వకం
ఎడారికి రహదారే
కాదంటారా..!?
హ్యాపీ జర్నీ టు నల్లమల డిసెర్ట్

జననం: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం, గన్నవరం గ్రామం. డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి వుద్యోగ విరమణ పొందారు. పల్లెలన్నావ్యవసాయమన్నా ఇష్టం. రచనలు: లోయలో మనిషి (1997), తొలకరి చినుకులు(2001), చల్లకవ్వం (2002), రెప్పల చప్పుడు(2004), తదేకగీతం(2006), పచ్చని వెన్నెల(2007), మట్టి పొరల్లోంచి (2018), చేను చెక్కిన శిల్పాలు (2019). 2007 నుంచి గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యకుడిగా, 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యకుడిగా వ్యవహరిస్తున్నారు. 'రమ్యభారతి' సాహిత్య త్రైమాసిక పత్రిక సహకారంతో 2007 నుంచి చిన్న కథల పోటీలు నిర్వహించి 'సోమేపల్లి సాహితీ పురస్కారం' అందచేస్తున్నారు.

Leave a Reply