రంగుల పీడకలలు

చిన్నప్పుడు ఒక కలర్ పెన్సిల్స్ డబ్బా
చేతికి చిక్కినప్పటి సంతోషం గుర్తుందా?
పొద్దున్నే నిదుర లేచి
తెల్ల కాగితాలపై గీయవలసిన బొమ్మలు
రాత్రి నిదురలో రంగుల కలలై
మురిపించిన జ్ఞాపకాలు తడిగానే వున్నాయా ?

కలర్ పెన్సిల్స్ డబ్బా చేతికి రావడమంటే
రంగు రంగుల ఇంద్ర ధనుస్సు
రంగుల సీతాకోక చిలుకలు
మొత్తంగా వర్ణమయ ప్రపంచమొకటి
చేతుల్లోకి రావడమంత సంతోషం కదా అప్పుడు

ఒక నీలి రంగు పెన్సిల్‌తో
గల గల పారుతూ సెలయేరు వొచ్ఛేది
ఒక ఆకుపచ్చ రంగు పెన్సిల్‌తో
గాలికి ఊగే చెట్లు మొలిచేవి
ఒక నారింజ రంగు పెన్సిల్‌తో
ఉదయపు లేత ఎండ మెరిసేది
చూస్తూ వుండగానే
తెల్ల కాగితం పైన ఒక పునఃసృష్టి జరిగేది

యవ్వనంలో కూడా రంగుల్ రంగులే కదా
ఎర్ర వోణీ నీలి వోణీ పచ్చ వోణీ
ఊరి వీధుల్లో కాలేజీకి వెళుతూ
రంగు రంగుల వోణీల రెక్కలపై
సీతాకోక చిలుకలు
గాల్లోకి ఎగిరేసుకుపోయేవి

ఒక రంగు ఐశ్వర్యానికి ప్రతీక అనీ
ఇంకో రంగు శాంతికి ప్రతీక అనీ
మరొక రంగు ధైర్యానికీ ప్రతీక అనీ
జాతీయ పతాకం లోని రంగుల ప్రతీకలతో
ఒక దేశాన్నే పోల్చుకునే వాళ్ళం కదా

కాలమిట్లా మారిపోయిందేమిటి తండ్రీ
రంగులలో ఈ కొత్త భయాల జాడలేమిటి నాయనా

మనుషుల నుండి మనుషులను
మతం పేర వేరు చేసే అమానవ చేష్టలకు
ప్రతీక ఒక రంగు కావడమేమిటి

ఒక తెగను మరొక తెగ తెగనరికే
పైశాచిక క్రీడకు ఒక రంగు ప్రతీక కావడమేమిటి

ఒక అమాయక ఆదివాసీ అరణ్యాన్ని
గుప్పిట బంధించే వికృత వేటకు
సింహాసనం ఒక రంగు పేరు పెట్టడమేమిటి

ఇపుడు రంగుల పేర్లు విన్నపుడల్లా
భయం, అడవి రాకాసి తీగలై అల్లుకుపోతోంది
ఇపుడు రంగులు రాత్రి నిదురలో
పీడకలలై వెంటాడుతున్నాయి

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

2 thoughts on “రంగుల పీడకలలు

  1. పొలిటికల్ టచ్ విత్ కలర్పుల్ పోయెం

  2. “ఇపుడు రంగుల పేర్లు విన్నపుడల్లా
    భయం, అడవి రాకాసి తీగలై అల్లుకుపోతోంది
    ఇపుడు రంగులు రాత్రి నిదురలో
    పీడకలలై వెంటాడుతున్నాయి” నిజమే ఈ మధ్య గీతాంజలి గారు రాసినట్టు నిద్రలో గోవులు భయపెట్టేస్తున్నాయి . చాలా బాగా చెప్పారు విజయకుమార్ గారూ .

Leave a Reply