ఈ కొండడు
ప్రపంచాన్ని సమ్మోహన పర్చే
అందగాడు
మన తలల పైన ఆ సూర్యుడు
వీడి రక్త కణం
నెమలిని పురివిప్పినప్పుడు
అమేజాన్ చిత్తడి నేలలో కదిలే రాచనాగు
అలుపు లేని గుర్రం
ఫీనిక్స్ వలే
వీడి వయసుతో పోటీ పడుతుంది
మీదికి కొండ
లోన సముద్రం
బాల్యమూ
వృద్దాప్యమూ
వీడి తీరాన అమృత ఘడియలనేరుకుంటై
వీడెక్కడుంటె అక్కడ
రాత్రి కలగన్న మహాటవి
ధట్టంగా వాటేసుకుంటది
ఒక ధైర్యం
వాడిలా వచ్చి
చిరిగిన మనసు పొరకు
కొత్త ఉత్తేజం తెస్తది
“వీడు” అనే వజ్రాల లోయతో
ప్రకృతికి అంత మిడిసి పాటు
ఈ బంగారు బాతు
రాజకీయ నాయకుని చేతి నుండి
ఎగిరి పోదని ఎవడూ అనుకోడు
వీడి గడ్డం కింద
వెయ్యి బంగాళా ఖాతాలున్నాయి