యుద్ధ సమయం

ముష్టి ఘాతాల పిడి గుద్దులుండవు
ఖడ్గ ఛాలనాల ఖండిత శిరస్సులుండవు
అణు విస్ఫోటనాల శ్మశాన మైదానాలుండవు
యుద్ధం ఊసరవెల్లి
నిక్కి నిక్కి చూస్తుంటుంది
యుద్ధం జిత్తులమారి నక్క
పొంచి పొంచి వస్తుంటుంది
యుద్ధం గద్ద
దేశాకాశాల్ని గీరుకుంటూ పోతుంటుంది
బతుకుల్ని శవాకారుల్ని చేసేది యుద్ధరీతి
బతుకులకు శ్వాసలను నింపేది
యుద్ధ నీతి
కనిపించే యుద్ధం తెలుసు
కనిపించని యుద్ధానికి తెరలేమీ లేవు
పొలిమేర లేవీ లేవు, కనికారాలేమీ లేవు
చెయ్యి, ముక్కు, నోరు విష కుడ్యాల ప్రసార సాధనాలైనవి
నవీన నాగరిక తెగులు
రమణీయ జీవన శిల్పాన్నాక్రమించింది
పారే నది పాదాలు కట్టివేయబడ్తయి
కూసే పిట్టకి
గురి చూసే వేటగాడుంటడు
రైతు తప్ప
ధరిత్రిని దోచుకొనేదెందరో
ఏ కన్నీరు ఏ పెనం మీద పడి
ఆవిరయిందో
ఎంత రక్తమో వొలికి, నేల
వ్రణరంగ మయిందో
ఒక కేక విశ్వ కిరణంలో
ధ్వనిస్తున్నది
ఒక హెచ్చరిక మానవేతిహాసంలో
కొత్త అధ్యాయంగా చేరుతున్నది
సమస్త భూమండల మొక
కారాగారమయింది
ద్విపాద చర నరుడే
న్యాయ పరీక్ష ముందు ఖైదీగా మిగిలిండు
కరకు చీకట్లలో కాంతి పుంజాలనో
వెలుగుల నడుమ నిశి నీడలనో
విషాదాల సరసన ఖుషీ మతలబులనో
ఆనందాల వేళల దుఃఖానుభవాలనో
దేనిలో దేన్ని వెతుక్కోవాలో…
కాలం ఇంట్ల కొచ్చింది
ముండ్ల క్రిమి మనతో యుద్ధం
మనం మనతో, పంచభూతాలతో వుండటానికి యుద్ధం
యుద్ధ ప్రారంభానికి
సమర శంఖం పూరించినట్లే
విరిగే కిరీటం
ముగింపు గెలుపుకు సంకేత మిస్తుంది
సన సన్నగా తెల్లవారే పిలుపు వినపడుతుంది
తేట తేట వెలుగుల ప్రపంచానికి
మనిషే, స్వాగత తోరణ మవుతడు.

జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.

Leave a Reply