యుద్ధ ప్రార్థనాగీతం

(దేశభక్తి పేరుతో యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వ్యతిరేకంగా మార్క్ ట్వెయిన్ 1905 లో రాసిన వ్యంగ్య గీతం ఇది. స్పెయిన్ – అమెరికా యుద్ధానికీ, అమెరికా – ఫిలిప్పీన్స్ యుద్ధానికీ వ్యతిరేకంగా దీన్ని రాసాడని చెబుతారు. ఈ రచనని దైవదూషణగా పరిగణిస్తారనే భయంతో, తాను మరణించే వరకూ దీనిని ప్రచురించలేదు. మార్క్ ట్వెయిన్ 1910లో మరణించారు. ఆ తర్వాత, 1923లో గానీ వెలుగులోకి రాలేదీ రచన. యుద్ధోన్మాద వ్యతిరేక రచనలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ యుద్ధప్రార్ధనా గీతాన్ని ఇక్కడ చదవండి)

అదొక మహదానందదాయకమైన కాలం. దేశమంతా ఆందోళనలతో అట్టుడికిపోయింది. యుద్ధం మొదలయ్యింది. అందరి హృదయాలలో పవిత్ర దేశభక్తి జ్వాలలు రగులుకున్నాయి. యుద్ధభేరీలు మోగుతున్నాయి. యుద్ధ సంగీతం వినిపిస్తూవుంది. బొమ్మ పిస్తోళ్లు పేలుతున్నాయి. టపాసులు రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. అందరి చేతులలో, ఇళ్ళ కప్పుల మీదా, పై వసారాలలో జెండాలు రెపరెపలాడుతూ మెరుస్తూవున్నాయి. యువ వాలంటీర్లు తమ కొత్త సైనిక దుస్తులలో విశాలమైన వీధులలో కదం తొక్కుతున్నారు. వాళ్లకి తల్లిదండ్రులూ, అక్క చెల్లెళ్ళూ, ప్రియురాళ్ళూ గర్వంగా, ఉత్సాహం నిండిన గొంతులతో జేజేలు పలుకుతున్నారు. రాత్రిళ్ళు సభలలో జనం విరగబడుతున్నారు. దేశభక్తి రగిలించే ఉపన్యాసాలు వాళ్ళ హృదయాలని ప్రేరేపిస్తున్నాయి. మధ్య,మధ్యలో ఉప్పెనలాంటి కరతాళ ధ్వనులు, అప్పుడప్పుడూ చెక్కిళ్ళపై జాలువారే కన్నీళ్లు. ప్రార్ధనా స్థలాలలో ఉపదేశకులు  దేశానికీ, దేశ పతాకానికీ అంకితంకావాలని ఉపదేశిస్తున్నారు. యుద్ధాధిపతిని ఆవాహన చేస్తూ, సత్కార్యానికి సహాయపడమని వేడుకొంటున్నారు. వాళ్ళ మాటలు శ్రోతల్ని కదిలిస్తున్నాయి.

నిజంగా సంతోషకరమైన సమయమది. అసంతృప్త హృదయులు ఒక అరడజనుమంది యుధ్ధానికి అంగీకరించకుండా,   అది న్యాయమైనది కాదేమోనన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు. వాళ్లని వెంటనే మీ ప్రాణాలు జాగ్రత్త అని కటువుగా, కోపంగా  హెచ్చరించారు. వాళ్ళు కూడా తొందరగానే వెళ్ళిపోయారు. ఇంకేమీ సమస్యలు సృష్టించలేదు. 

ఆదివారం ఉదయం వచ్చేసింది. ఆ మరుసటిరోజు బెటాలియన్లు యుద్ధరంగానికి తరలి వెళ్ళిపోతాయి. చర్చి మొత్తం నిండిపోయింది. వాలంటీర్లు వున్నారు. యవ్వనం తొణికిసలాడే వాళ్ళ ముఖాలలో యుద్ధ స్వప్నాల మెరుపులు – దృఢమైన ముందడుగు, వేగం పుంజుకోవడం, మెరుపు దాడి, మెరిసే ఖడ్గాలు, పరారౌతున్న శత్రువు, కోలాహలం, చుట్టూ కమ్ముకుంటున్న పొగ, వెంటబడి తరమడం, శత్రువు లొంగుబాటు!

యుద్దం నుండి ఇంటికి రావడం, పతకాలు అలంకరించుకున్న వీరులకి ఆప్యాయపు ఆహ్వానం, విజయ వైభవ  కెరటాలలో కేరింతలు, వాలంటీర్లతో పాటు తమకి ప్రియమైన వాళ్ళందరూ గర్వంగా, సంతోషంగా కూర్చున్నారక్కడ. యుద్ధరంగానికి పంపడానికి కొడుకులు, అన్నదమ్ములు లేని ఇరుగుపొరుగు జనాలలో ఒకలాంటి ఈర్ష్య. దేశ పతాకం గెలుపుకోసం దోహదం చేయలేకపోయామే, లేదంటే యుద్ధరంగంలో అత్యుత్తమమైన వీర మరణానికి తమవాళ్ళు ఎవరూ నోచుకోలేదే అని. ప్రార్ధనలు ప్రారంభమయ్యాయి. పాత నిబంధన గ్రంధంనుంచి ఒక యుద్ధ అధ్యాయాన్ని చదివేరు. మొదటి ప్రార్ధన చదివేరు. తర్వాత భవనమంతా కంపించేలా వాయిద్య ఘోష వినిపించింది. ఒక్క ఉదుటున అందరూ లేచినిలబడ్డారు. వాళ్ళ కళ్ళు మెరుస్తున్నాయి. హృదయాలు స్పందిస్తున్నాయి. ప్రార్ధనాగీతం ప్రతిధ్వనించింది. 

భయోత్పాతం సృష్టించే భగవంతుడా! ఆదేశించే ప్రభువా!

నీ పిలుపే ఒక మేఘగర్జన, మెరుపులే నీ ఖడ్గప్రహారం

ఆ తర్వాత ‘దీర్ఘ ప్రార్ధన’. అలాంటిదాన్ని   అంతకుముందు ఎవరూ ఎరగరు. ఉద్వేగభరితమైన, అద్భుతమైన భాషలో, మనసుల్ని కదిలించే ప్రార్ధన అది. ఆ ప్రార్ధన సారాంశమిది. నిత్య దయామయుడు, సహాయకుడు ఐన మన తండ్రి, మన ఉత్తమ యువ సైనికులని కాచుకుంటాడు, దేశభక్తియుతమైన మన యువ సైనికులకి సహాయపడతాడు, సాంత్వన చేకూరుస్తాడు. ఆశీర్వదిస్తాడు, యుద్ధంలో ప్రమాద ఘడియలు ముంచుకొచ్చినపుడు కాపాడుతాడు, తన బలీయమైన హస్తం వాళ్ళని బలవంతులుగా, ఆత్మవిశ్వాసం నిండిన వాళ్ళుగా నిలబెడుతుంది. రక్తసిక్త రంగంలో అజేయులుగా నిలుపుతుంది. శత్రువుని తుత్తునియలు చేస్తుంది. దేశానికీ, దేశ పతాకానికీ  శాశ్వతమైన గౌరవాన్నీ, వైభవాన్నీ సంపాదించి నిలబెడుతుంది. 

అంతలోనే వయసు మళ్ళిన ఒక ఆగంతకుడు వచ్చాడు. మెల్లగా, అడుగుల సవ్వడి వినపడకుండా, సభా మధ్యంలోకి నడుస్తూ, ప్రార్ధిస్తున్న మతబోధకుడివైపే స్థిరంగా చూశాడతడు. పొడవాటి తన దేహాన్నంతటినీ కప్పివేస్తూ, పాదాలని తాకే వస్త్రాలు ధరించాడు. తలపై ఎలాంటి ఆచ్ఛాదనా లేదతనికి. తెల్లటి పొడవాటి జుట్టు భుజాల్ని కప్పివేస్తున్నది. అనాహ్లాదకరమైన అతని ముఖం వింతగా, భయానకంగా పాలిపోయి వుంది. అందరూ ఆశ్చర్య చకికితులై తనవైపే చూస్తుండగా, అతను ఆగకుండా మౌనంగా వేదికపైకి నడిచివెళ్ళి , మతబోధకుడి  సరసనే నిలబడిపోయాడు. ఆ మతబోధకుడు కళ్ళుమూసుకుని ప్రార్ధన చేస్తున్నందున అతని రాకని గుర్తించకుండా దాన్ని అలాగే చదువుతూ పోయాడు. ‘ప్రభువా, తండ్రీ, భగవంతుడా, మా దేశ సంరక్షకుడా, మా ఆయుధాలని ఆశీర్వదించు, మాకు విజయాన్ని అందించు’ అంటూ తన ప్రార్ధనని ఆ మత బోధకుడు ముగించాడు. 

ఆ ఆగంతకుడు మత బోధకుని చేయిని తాకి, పక్కకి తప్పుకోమని సైగ చేశాడు.  ఆశ్చర్యంనుంచి తేరుకొని మతబోధకుడు అందుకు తలొగ్గాడు. ఆగంతకుడు మతబోధకుని స్థానంలో నిలబడ్డాడు. మంత్రముగ్ధులై వున్న జనాలని కొద్దిక్షణాలపాటు పరికించి చూశాడా ఆగంతకుడు. అతని కళ్ళు నిజాయితీగా వున్నాయి. అవి ఒక వింత తేజస్సుతో వెలుగుతూ వున్నాయి. తీక్షణమైన కంఠ స్వరంతో ఆటను మాట్లాడసాగాడు,

“నేను సర్వశక్తి సంపన్నుడైన భగవంతుని సింహాసనం చెంతనుండి సందేశాన్ని తీసుకుని వస్తున్నాను”. సభ మొత్తం దిగ్భ్రాంతితో నిర్ఘాంతపోయింది. ఆగంతకుడు దాన్ని గమనించాడో లేదో తెలియదు. గమనించినా దాన్ని అతను పట్టించుకోలేదు. “తన సేవకుడు, మీకు కాపరి అయిన తన ప్రార్ధనని దేవదేవుడు ఆలకించాడు. ఈ ప్రార్ధన పర్యవసానాలని దేవదేవుని దూతగా నేను మీకు వివరించిన తర్వాత, మీ కోరిక అదే అయినట్లయితే భగవంతుడు ఆ కోరికని మన్నిస్తాడు. అంటే దాని పూర్తి పర్యవసానాలని మీకు నేను వివరించాలి. మనుషుల అనేక ఇతర ప్రార్ధనలలాంటిదే ఇది. ఇందులో పైకి పలికిన మాటలకి మించినవి, కొంచెంసేపు ఆగి, ఆలోచించితే తప్ప తెలియనివి ఈ కోరికలో వున్నాయి. “ఈ దేవుని సేవకుడు, తన ప్రార్ధన చేశాడు. కానీ, తానూ ఒక్కసారి ఆగి ఆలోచించాడా? ఇందులో వునాది ఒక్క ప్రార్ధనయేనా? కాదు, ఇందులో రెండు ప్రార్ధనలు వున్నాయి – ఒకటి మాటలలో ఉచ్ఛరించినది, ఇంకొకటి మాటలలో చెప్పనిది. ఇవి రెండూ దేవునికి వినిపించాయి. దేవుడు అన్ని విన్నపాలనీ, మాటలలో పలికిన వాటినీ, మాటలలో చెప్పని వాటినీ అన్నింటినీ వింటాడు. ఆలోచించండి – ఈ విషయం మీ మనసులలో ఉంచుకోండి. మీరొక ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నట్లయితే, జాగ్రత్త వహించండి! ఎందుకంటే, మీరు వుద్దేశించకుండానే మీ పొరుగువానికి ఒక శాపాన్ని కోరుకుంటుండవచ్చు. మీ పంతకోసం మీరు వర్షాన్నివరంగా కోరుకుంటే, మీ పొరుగువానికి అవసరం లేని, వాని పంటకు నష్టం కలిగించే శాపాన్ని కోరుకుంటుండవచ్చు.”

“మీరు మీ సేవకుడు ఇప్పుడు చేసిన ప్రార్ధనని, మాటలలో పలికిన ప్రార్ధనని విన్నారు. మాటలలో పలకని మిగతా భాగాన్ని మాటలలో మీకు వివరిచడానికి నన్ను భగవంతుడు దూతగా పంపించాడు. మీ బోధకుడూ, మీరూ అందుకు మౌనంగా ప్రార్ధించారు. దానిని బలంగా కోరుకున్నారు. తెలియకుండా, ఆలోచించకుండా అలా ప్రార్ధించారా? అల అని దేవుడు భావిస్తున్నాడు. “ప్రభువా, భగవంతుడా మాకు విజయాన్ని ప్రసాదించు” అన్న మాటలు మీరు విన్నారు. అవి చాలు. మీరు పలికిన ప్రార్ధన అంతా అర్ధవంతమైన ఆ రెండు మాటలలోనే క్లుప్తంగా ఇమిడివుంది. అంతకు మించిన వివరణ అవసరం లేదు. మీరు విజయం కోసం ప్రార్ధించినప్పుడు, ఆ విజయంతోపాటు వచ్చే పర్యవసానాలని మీరు మాటలలో చెప్పలేదు. ఆ పర్యవసానాలు మీరు కోరుకున్న విజయంతోపాటే సంభవిస్తాయి. అది మరొక విధంగా సాధ్యం కాదు. మీ ప్రార్థన విన్న తర్వాత, మాటలలో చెప్పని మీ ప్రార్థనని కూడా విన్నాడు. మాటలలోలేని ఆ ప్రార్ధనని మీకు మాటలలో విన్పించమని ఆయన నన్ను మీ దగ్గరకు పంపించాడు.”

“ప్రభూ, మా తండ్రీ! యుద్ధరంగానికి తరలి వెళ్ళే మా యువ దేశభక్తులకీ, మా ఆరాధ్యహృదయులకీ చేరువగా నిలిచివుండు. ప్రియాతిప్రియమైన మా నులివెచ్చని గదుల సుమధుర ప్రశాంతతతోపాటు మా ఆలోచనలుగూడా వాళ్ళతోనే సాగుతాయి. ప్రభూ, దేవా: మా ఫిరంగి గుండ్లు శత్రు సైనికులని నెత్తుటిముద్దలుగామార్చి, తునాతునకలుగా చేసేందుకు సహాయం చేయి. చిరునవ్వువెలుగులు చిందించే శత్రువుల పంట పొలాలని వాళ్ళ కళేబరాలతో కప్పివేసి వాటిని కాంతి విహీనం చేయడానికి సహాయం చేయి. వేదనతో ఘూర్ణిల్లే క్షతగాత్రుల ఆర్తనాదాలలో, హాహాకారాలలో మా తుపాకీ పేలుళ్లు వినిపించకుండా చూడు. వాళ్ళ ప్రశాంత గృహాలని మంటలో మహాగ్ని కీలలలో మసిచేసేలా మాకు చేయూతనివ్వు. భర్తల్ని కోల్పోయిన అంతులేని శోకంతో వాళ్ళ భార్యల గుండెల్ని పిండివేయడానికి సహకారమివ్వు. వాళ్ళు సర్వస్వాన్నీ కోల్పోయి, పసిపిల్లలతో, ఆకలిదప్పులతో, మండుటెండలలో మాడిపోతూ, గడ్డకట్టే శీతాకాలపు చలిగాలుల కోతలో గజగజ వణికిపోతూ, దిక్కులేని వాళ్ళయి తిరుగాడుతూ, కృంగి,కృశించి, అలసి సొలసి సొమ్మసిల్లి  పోతూ, సమాధులలో ఖననమయ్యే చావుని ప్రసాదించమని నిన్ను వేడుకొంటుంటే, ఆ ఆశ్రయం కూడా వాళ్ళకి దక్కకుండా చూడు.”

“నిన్ను ఆరాధించే మాకోసం, వాళ్ళ ఆశలని ధ్వంసం చేయి, వాళ్ళ జీవితాలని నాశనం చేయి, వాళ్ళ దీనయాత్రని సుదీర్ఘమొనరించు, వాళ్ళ అడుగులు భారంగా సాగేలా చూడు, దారిపొడవునా వాళ్ళు ఎడతెగని శోకంతో కన్నీళ్లు కార్చేలా చూడు, గాయపడిన పాదాలతో వాళ్ళు నడిచే మంచు దారులని రక్తసిక్తంగావించు.”

“ప్రేమమయుడైన తండ్రీ, నీ ప్రేమ స్ఫూర్తితో మేము నిన్ను వేడుకొంటున్నాము. నిత్య విశ్వాస ఆశ్రయముగా, స్నేహితునిగా వెలుగొందు నిన్ను సహాయపడమని మా దీన, విధేయహృదయాలతో విన్నవించుకొంటున్నాము. ఆమెన్.”

(కొంచెంసేపు ఆగిన తర్వాత) “ఇదీ మీ ప్రార్ధన. ఇంకా దీనినే మీరు కోరుకుంటున్నట్లయితే చెప్పండి. దేవదూతగా నేను వేచి వున్నాను”.

** ** ** **

తర్వాత, ఆ మనిషి పిచ్చివాడని అనుకున్నారు. ఎందుకంటే, అతను మాట్లాడిన మాటలకి అసలు అర్ధమే లేదు..

  • మార్క్ ట్వెయిన్

అనువాదం: సుధా కిరణ్

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply