రష్యా-యుక్రెయిన్ పోరు ప్రపంచ యుద్ధంగా మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అణ్వస్త్ర యుద్ధంగానూ పరిణమించే ప్రమాదమూ పొడసూపుతున్నది. తృటిలో ముగుస్తుందన్నట్టుగా 2022 ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం సుదీర్ఘంగా సాగుతూ వేయి రోజులు పూర్తిచేసుకున్నది. సరిగ్గా ఆ సందర్భంలోనే ఆందోళనకర ఘటనలు రష్యా, యుక్రెయిన్లలో చోటుచేసుకున్నాయి. అమెరికా తదితర దేశాలు యుక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని యుద్ధంలో నాటో ప్రత్యక్షంగా పాల్గొనడంగా పరిగణిస్తామని రష్యా ఇదివరకే హెచ్చరించింది. తాజాగా అనేక ఇతర ఆయుధాలతో పాటుగా మందుపాతరలను కూడా సరఫరా చేసేందుకు అమెరికా ముందుకురావడం మరో కీలక పరిణామం. వైమానిక దాడులు జరుగుతాయనే సూచనలతో కీవ్ లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేశారన్న వార్తలతో అటు పశ్చిమ యూరప్ దేశాల్లో యుద్ధం భయం వ్యాపిస్తుండటం మనం గమనించవచ్చు. ఈ ఘటనల క్రమంపై సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నది.
అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. ఇప్పుడు అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ, ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయనను తప్పించి కమలా హారిస్ ను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమి ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ యుక్రెయిన్ కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తివంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని (అటాకమ్స్) వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని యుక్రెయిన్ కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రయాన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని యుక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు, పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో… మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో యుక్రెయిన్ ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే.
యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరింత ఉసిగొలిపాడు. ఎక్కడ యుద్ధం జరిగినా తమకు వైరం గల దేశంపై యుద్ధానికి శ్రీకారం చుట్టిన దేశానికి అమెరికా అన్ని విధాలుగా సహకరిస్తుంది. యుక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మరింత పెంచడానికి బైడెన్ యుక్రెయిన్ ను ఆధునాతన ఆయుధాలు ఇచ్చి ప్రోత్సహించాడు. తొలినుంచి రష్యా పైకి యుక్రెయిన్ యుద్ధాన్ని అమెరికా అనుమతించింది. అయితే రష్యా లోపలి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ (అటాకమ్స్) ప్రయోగించడానికి బైడెన్ అనుమతించారు. ఇటీవల ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాతనే బైడెన్ రష్యాపై దాడికి అనుమతించారు. బైడెన్ అనుమతి ఇచ్చిన 24 గంటల్లోనే పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన క్షిపణులను ఉపయోగించి యుక్రెయిన్ ప్రభుత్వం రష్యాపై తొలి దాడి చేసింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ పై యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకున్నదని తాము భావిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. యుద్ధం కొత్త మలుపు తిరిగిందని భావించవలసి వస్తోంది. అణ్వాయుధ రహిత దేశాలపై అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వెంటనే ఆమోదం తెలిపారు. దాంతో యుక్రెయిన్ సహా అణ్వాయుధరహిత దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు రష్యా సైన్యానికి అనుమతి లభించింది. దీనంతటికీ కారణం ఒక విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అని చెప్పవచ్చు.
రష్యా సరిహద్దులపై నవంబర్ 19న ఆరు అటాకమ్స్ క్షిపణులను రష్యాపైక్ యుక్రెయిన్ ప్రయోగించింది. అయితే ఐదు క్షిపణులను మధ్యలోనే కూల్చివేశామని, అరవ క్షిపణి మూలంగా మంటలు రేగాయేగాని ఎవరూ మరణించలేదని రష్యా తెలిపింది. యుక్రెయిన్ దాడికి స్పందనగా రష్యా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి (ఐబిసిఎం)తో యుక్రెయిన్లో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రష్యా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం తరువాత యుక్రెయిన్ లో కోట్లాది మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్, ఒడెస్సా, డినిప్రొపెట్రోవిస్క్ లలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర వస్తువుల సరఫరాపై అది తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఖండాంతర క్షిపణితో పాటు ఎక్స్ 47 ఎం2 కింజర్ బాలిస్టిక్ క్షిపణిని కూడ రష్యా ప్రయోగించింది.
జో బైడెన్ చేసిన తప్పిదం వల్ల ప్రపంచ స్థాయిలో అణుయుద్ధం వచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో నాటో దేశాలలో కొన్ని దేశాలు ఆందోళన చెంది, తమ దేశ ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పరిణామాలతో అణ్వాయుధాల ప్రయోగానికి రష్యా సిద్ధంకావచ్చునని అనుకుంటున్నారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పుతిన్ తో మాట్లాడారు. రష్యాకు తోడ్పాటు అందించడానికి సిద్ధమయ్యారు. ఎక్కువ క్షిపణులు ఉత్పత్తి చేయాలని తమ దేశ ఆయుధ నిపుణలను ఆదేశించారు. దీంతో ప్రపంచయుద్ధ పరిస్థితి తలెత్తుతుందా అని అంతర్జాతీయంగా అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ ఉసిగొల్పడంతో యుక్రెయిన్ యుద్ధం కొత్తమలుపు తిరిగింది. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేది పెద్ద సందేహమే. అయితే ట్రంప్ జనవరి 20న రెండవసారి అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత కాల్పుల విరమణకు చర్చలు జరగవచ్చునని కూడా అనుకుంటున్నారు. అయితే ట్రంప్, బైడెన్ చర్చల అనంతరం అత్యంత వేగంగా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగిన సామర్థ్యమున్న స్టార్మ్ షాడో మిసైల్ ని రష్యాపై దాడికి ఉపయోగించవచ్చునని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి అనుమతిచ్చారు. బైడెన్ కి పెద్దగా
ప్రాముఖ్యత ట్రంప్ ఇవ్వలేదని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నా దారిన నేను వెళతానని ట్రంప్ చెప్పినట్లుగానే మీడియా వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ 2025, జనవరి 20న పదవీ బాధ్యతలు తీసుకుంటారు. ఆ తరువాత శాంతి ప్రణాళికను ట్రంప్ తీసుకుంటారని యుక్రెయిన్ తో చర్చలు జరుపుతారని ట్రంప్ సలహాదారులు వివిధ ఇంటర్వ్యూలలో సూచనప్రాయంగా తెలిపారు.
జెలెన్ స్కీ పుతిన్ తో మాట్లాడాలని కూడా ట్రంప్ సలహాదారులు సూచనలిచ్చినట్లుగా తెలుస్తోంది. యుక్రెయిన్, రష్యా మధ్య శాంతి ప్రణాళికకు ట్రంప్ ప్రయత్నిస్తారన్న అంశంపై నాటో దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీనివల్ల రష్యా పైచేయి సాధిస్తుందని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే పుతిన్ ఐరోపా తూర్పు ప్రాంతానికి విస్తరించే అవకాశం ఉందని నాటో సభ్యదేశాలు అనుకుంటున్నాయి. హంగరీ, పోలెండ్ దేశాలు రష్యా అంటే ఆందోళన చెందుతున్నాయని, కొన్ని స్కాండినేవియా దేశాలు కూడా భయపడుతున్నాయని చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో మార్పువచ్చే అవకాశం ఉందని జెలెన్ స్కీ భావిస్తున్నాడు. ఐరోపా పార్లమెంటులో ఈ వారంలో మాట్లాడిన జెలెన్ స్కీ నిజమైన శాంతిని కోరినట్లు
తెలుస్తోంది. ట్రంప్ పదవీ స్వీకారం తర్వాత అమెరికా సహాయం లభించడం సందేహమేనని జెలెన్ స్కీ భావిస్తున్నారు. ట్రంప్ రంగంలోకి వస్తే తాను బేరసారాలాడే పరిస్థితికి రావచ్చునని జెలెన్ స్కీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
యుక్రెయిన్ ను అడ్డుపెట్టుకొని రష్యామీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక బైడెన్ కు లేకుంటే ఈ యుద్ధం నిజానికి ఎప్పుడో ఆగిపోవాలి. రెండేళ్ళ క్రితం కొన్ని కీలకమైన భూభాగాలు కోల్పోయిన యుక్రెయిన్ కు , ఇప్పుడు అది ఉన్నస్థితికి తేడా ఉంది. ఆయుధ సరఫరాలు నిరవధికంగా కొనసాగుతుంటే ఏ యుద్ధమూ ఆగదు. యుక్రెయిన్ యుద్ధంలో అటువైపు అణ్వాయుధాలున్న రష్యా ఉన్నందున ఆయుధాల వినియోగం మీద అమెరికా ఇంతకాలమూ కొన్ని నియంత్రణలు పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనలకు స్వస్తి చెప్పి, రష్యా భాషలో చెప్పాలంటే, మూడో ప్రపంచ యుద్ధానికి టైడెన్ స్వాగతం పలుకుతున్నారు. తాను దిగేలోగా, రేపు ట్రంపు పరిష్కారం సాధ్యంకాని స్థాయికి యుద్ధాన్ని తీసుకుపోవాలనీ, దౌత్యాలు, చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడాలకు వీల్లేని రీతిలో చిక్కుముడులు వేసి పోవాలనీ ఆయన అనుకుంటున్నారు. ఇది బైడెన్ దుర్నీతికి పరాకాష్ట. యుద్ధాన్ని అంతమొందించేందుకు కృషి చేయడానికి బదులు యుద్ధాన్ని ప్రోత్సహించడం ఆయన అవివేకానికి నిదర్శనం.
యుద్ధంతో ఇప్పటికే యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. రష్యా దాడుల్లో సర్వమూ నేలనుట్టమై, నాలుగో వంతు జనాభాను కోల్పోయి, ఆర్థికంగా తేరుకోలేని దశకు చేరుకుంది. పునర్నిర్మాణానికి ఐదు వందల మిలియన్ డాలర్లు ఖర్చవుతాయన్నది సంవత్సరం క్రితం వేసిన అంచనా. ట్రంప్ అధికారం చేపట్టడానికి రావడానికి దాదాపు మరో 50 రోజులు పడుతుంది. యుక్రెయిన్ లో 60 లక్షల మంది శరణార్థులుగా మారారు. జనాభాలో నాల్గవ వంతు మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. అయినా అమెరికా నుంచి మరిన్ని క్షిపణులను తెప్పించుకుని రష్యన్లను మరింతగా బాధించాలని జెలెన్ స్కీ భావిస్తున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోని బ్లింకెన్ నవంబర్ రెండవ వారంలో ఇలా చెప్పాడు… జనవరి 20కి, ప్రస్తుతానికి మధ్య అవకాశం ఉన్న ప్రతి డాలరు యుక్రెయిన్ కి అందించడానికి ప్రయత్నిస్తామని అన్నాడు. ఇంతకాలం ఉదారంగా ఉన్న బైడెన్ ఇప్పుడు యుక్రెయిన్ కి సహాయం చేయడంలో కొన్ని చట్టపరమై మార్పులు చేశారని ఇది దురదృష్టకరమని జెలెన్ స్కీ అన్నాడు.
ఈ యుద్ధానికి అంతం అనేది ఉండకపోవడంతో ఇది ప్రపంచ యుద్ధంగా పరిణమించే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ డ్రోన్లతో రష్యా దాడి చేస్తోంది. ఉత్తరకొరియా యుద్ధ ట్యాంకులు, బాలిస్టిక్ మిసైల్ లు రష్యాకు అందించవచ్చు. ఉత్తరకొరియాకు సంబంధించిన 11 వేల సైనిక దళాలను రష్యా యుక్రెయిన్ వైపు సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. వీరు యుక్రెయిన్ దళాలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. యుక్రెయిన్ దళాలు కూడా రష్యా కురిస్క్ ప్రాంతంలో నిలపనున్నట్లు సమాచారం అందుతోంది. రష్యా, చైనా, ఉత్తరకొరియాలు ఒక్కటి కానున్నాయని ఈ పరిణామం వ్యూహాత్మక మిలిటరీ ట్రూపు అవుతుందని తెలుస్తోంది. చైనా తన సైనికదళాలను వీరికి తోడుగా పంపకపోవచ్చు. రష్యా, చైనా, ఉత్తరకొరియాలు ఒక్కటైతే పాశ్చాత్య దేశాలను ఎదుర్కొనేందుకు రష్యాకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ దేశంలో ఆక్రమించుకున్న ప్రాంతాలనుంచి రష్యా ఉపసంహరించుకోవాలనే డిమాండ్ ను జెలెన్ స్కీ విడిచి పెట్టలేదు. భవిష్యత్తులో రష్యా నుంచి నాటో దేశాలు కాపాడలేకపోవచ్చునని యుక్రెయిన్ భావిస్తోంది.
యుక్రెయిన్ సైనిక దళాలు తమ ప్రాంతంలో ఆక్రమించుకున్న ప్రదేశాల నుంచి తక్షణం ఉపసంహరించుకోవాలని పుతిన్ కోరుతున్నారు. చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నానని అయితే యుక్రెయిన్ ప్రయోజనాలకు రక్షణ, భద్రత కావాలని జెలెన్ స్కీ అంటున్నారు. సరిహద్దుల్లో కొన్ని సర్దుబాట్లతో శాంతి ప్రణాళికను ట్రంప్ రూపొందిస్తారని ఆయన సలహాదారులు అంటున్నారు. పుతిన్ ను ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. రష్యాపైన సాంకేతికంగా అత్యంత సమర్థమైన క్షిపణులను ప్రయోగించినప్పటికీ పుతిన్ బలమైన స్థానంలోనే ఉంటారని చెబుతున్నారు. ట్రంప్ ఏ చర్యలు తీసుకున్నా అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే వ్యవహరిస్తారు. ఏదో విధంగా యుక్రెయిన్-రష్యాల మధ్య శాంతిని నెలకొల్పితే అంతర్జాతీయ దౌత్యంలో ట్రంప్ పెద్ద విజయం సాధించినట్లే.
దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అంగీకరించేది లేదని గతంలో నాటో కూటమి దేశాలు ప్రకటించిన దానికి బైడెన్ నిర్ణయం విరుద్ధం. ఇలా జరిగితే ఇతర దేశాలు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్నట్లుగా భావించి తమ శత్రువులుగానే పరిగణిస్తామని, అవసరమైతే అణ్వాయుధాలను కూడా ప్రయోగించేందుకు వెనుకాడబోమని గతంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే నాటోలోని టర్కీతో పాటు మరికొన్ని దేశాలు బైడెన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. బ్రిటన్, ఫ్రాన్సు వంటి దేశాలు సమర్థించటమే గాక తాము అందచేసిన ఆధునిక ఆయుధాలను ప్రయోగించేందుకు అనుమతించాయి. అణుబాంబులున్న ఏదైనా దేశం సాయంలో మరేదైనా దేశం తమపై దాడికి ప్రయత్నిస్తే, తాము ఆ రెండు దేశాలు కలిసి చేస్తున్న యుద్ధంగానే పరిగణిస్తామని రష్యా తెలిపింది. ఇలాంటి సందర్భాలలో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా అణుదాడికి దిగవచ్చంటూ.. తాజా సవరణలు తెలుపుతున్నాయి. దాంతో.. ప్రస్తుత దాడుల్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తే.. అణుదాడులకు సైతం వెనుకాడకపోవచ్చని అనుమానిస్తున్నారు. సంక్షోభాన్ని మరింత విస్తరించేందుకు ప్రాతిపదిక చేశాయి. ఇది ఒక్క ఐరోపాకే కాదు, యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే పరిణామం. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజల ముందు అమెరికా దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసుకోవాలి. బైడెన్ ప్రభుత్వాన్ని నిలదీయాలి.
Reddy garu
U r right sir —agree with u
Weak RUSSIA —that is USA motto
Only 47 days left for Biden — lot of changes takes place in trump
Administration