యుద్ధరంగం నుంచి సాహితీ సృజన అపూర్వ అనుభవం

1. మీ కుటుంబ నేపథ్యం, బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్తారా?
తాయమ్మ కరుణ : నేను పుట్టేనాటికి మాది ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఎదిగే నాటికి దిగువ మధ్యతరగతి కుటుంబంగా మారిపోయింది. ఆస్తులన్నీ హరించుకుపోయాయి. మా నాయిన నాలుగు దఫాలు మా తాటికల్‌ గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారట. ‘‘ఎప్పుడూ నువ్వే వుంటవానే’’ అని ఒకతను అనడం వల్ల ఆయన్నే సర్పంచిగా నిలబెట్టి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అంతేగాక చండ్రపుల్లారెడ్డి వర్గంలో మా నాయిన స్థానిక నాయకుడుగా వున్నాడు. జనశక్తి పార్టీలో ఆయన స్థాయి ఏమిటనేది నాకు తెలియదు. కానీ ఈ మధ్యే ఒక అన్న ద్వారా తెలిసింది, చాలా ప్లీనంలలో పాల్గొన్నాడని, చండ్రపుల్లారెడ్డికి దగ్గరగా ఉండేవాడని. బండ్రు నర్సింహులు, యానాల మల్లారెడ్డిలతో కలిసి ఆయన పనిచేశారు. నేను పుట్టకముందే మా ఇంటి మీద పోలీసుల దాడులు జరిగాయట. ఊరిని, ఇంటిని చుట్టుముట్టి ఇంట్లో సోదాలు చేశారట పోలీసులు. నిజానికి పోలీసుల ఈ సోదాకు కొద్దిసమయం క్రితమే పార్టీ నాయకుడిని తీసుకుని మా నాయిన వెళ్లిపోయాడట. పార్టీ వద్దన్నదని కాంట్రాక్టర్‌గా వున్న మా నాయన ఆ పనుల నుంచి తప్పుకున్నారట. తాతల కాలం నుంచి వచ్చిన వైద్యం వారసత్వంగా మొదటి నుంచీ చేస్తూనే వున్నారు. మా ఊరు, చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యంతోపాటు అనేకమందికి సహాయాలు కూడా చేశారు. ఇప్పటికీ ఎంతోమంది ‘‘పరమేశంగారి వల్లే మా ప్రాణాలు దక్కినయి’’ అని నాతో అన్నారు. అడిగిన వారికి దానధర్మాలు చేశారు. ప్రజల మనిషిగా మంచి గుర్తింపు వుంది. కానీ, ఇంట్లో మా అమ్మ పట్ల అందరిలాగే ఆనాటి మామూలు భర్తలాగే చాలా దుర్మార్గంగా వ్యవహరించారు.

ఇంటినంతా నడిపింది మా అమ్మనే. వడ్ల మిల్లు పడుతుండే. మా నాయన సంపాదించినదంతా తన ఖర్చులకు, ప్రజలకు చేసే సహాయాలకు సరిపోయింది. మా అమ్మ కూడా చిన్నతనాన కమ్యూనిస్టులకు సెంట్రీగా చేసేదట. పది ఏండ్ల కింద అనుకుంటా మా ఊరు తాటికల్‌ వెళ్లినప్పుడు మాటల సందర్భంలో ఒక అవ్వ ‘‘కమినిస్టోళ్లు పోరాటం వదిలిపెట్టిన తర్వాత ఊర్ల ఉన్న తుపాకులన్నిటిని బాయిల పడేసిండ్రు’’ అన్నది. మా ఊరి పోరాటం, చరిత్ర గురించి కూడా రాయాల్సి ఉంది.

బాల్యం విషయానికి వస్తే… నల్లగొండ జిల్లా, నకిరేకల్‌ మండలంలోని తాటికల్‌ గ్రామంలో నేను మూడో తరగతి వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నకిరేకల్‌కు వచ్చాము. నాలుగో తరగతి వదిలి ఐదులో చేర్చారు. ఈ ఊర్లో మా ఇంటిదగ్గర నా వయసు అమ్మాయిలు లేకపోవడం వల్ల దాదాపు ఆటలనేవి బంద్‌. అదీగాక అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చాలా చిన్నవయసులోనే (దాదాపు పది పదకొండేండ్లకే) ఇంటి బాధ్యతలను ఎత్తుకోవాల్సి వచ్చింది. నా తర్వాత చెల్లె, ఇద్దరు తమ్ముళ్లు. వంట చెయ్యడం, వడ్లు పట్టడం, ముఖ్యంగా చిన్నతమ్ముడిని చూసుకోవడం… బడికి పోవడం… క్షణం తీరిక ఉండేది కాదు. వీటికితోడు నీళ్లు మోయడం… ఇది ఎంత పెద్ద పనో. చెల్లె, నేను కలిసి బోరింగ్‌ నుంచి కుండలకొద్ది నీళ్లు మోసేవాళ్లం. ఇక విద్యాభ్యాసం… ఇంటర్‌ రెండో ఏడాది నుంచి హైదరాబాద్‌లోనే సాగింది. బేగంపేట వుమెన్స్‌ కాలేజీలో బీఎస్సీ చదివాను. ఆంధ్ర మహిళా సభ కాలేజీలో బీఈడీ చదువుతూ మధ్యలోనే వదిలేసి ఉద్యమంలోకి వెళ్లిన. అక్కడి నుంచి వచ్చాక జర్నలిజంలో పీజీ డిప్లొమా చేసాను.

2. సాహిత్య ప్రపంచంలోకి ఎట్లా వచ్చారు?
తా.క: ఒక్కమాటలో చెప్పాలంటే ఉద్యమంతోనే నా అసలైన సాహిత్య ప్రపంచం మొదలైంది. మా పెద్దతమ్ముడి ద్వారా కథలు చదవడం అలవాటైంది. వాడు నాకంటే ఐదేళ్లు చిన్నవాడు. కానీ చాలా చిన్నవయసు నుంచే లైబ్రరీకి వెళ్లేవాడు (వాడు ఐదేండ్ల వయసులోనే రెండో తరగతి పూర్తి చేశాడు). చందమామ, బాలమిత్రలు చదివేవాడు. ఇంటికి కూడా తెచ్చేవాడు. వాడికి వేమన పద్యాలెన్నో కంఠతా వచ్చేవి. ఆరేడేళ్ల వయసులోనే చాలా పద్యాలు కూడా రాసాడు. భువనగిరి గురుకుల పాఠశాలకు వెళ్లాక కూడా కొంత కాలం రాసాడు. అప్పట్లో న్యూస్‌పేపర్లలో సీరియల్స్‌ వస్తుండేవి. వాటిని కూడా ఇష్టంగా చదివేదాన్ని.
టెన్త్‌కు వచ్చేసరికి డిటెక్టివ్‌ నవలలు, యండమూరి వీరేంద్రనాథ్‌ నవలలు చదివేదాన్ని. కానీ అవి నచ్చలేదు. ముఖ్యంగా ఆ ‘తులసీదళం’ తర్వాత ఆయనవి దాదాపు చదవలేదు. నాయన కమ్యూనిస్టు అవ్వడం, అమ్మకు దేవుడిపై నమ్మకం లేకపోవడం వల్ల మా ఇంట్లో దేవుడి ఫొటో కూడా వుండేది కాదు. అదీగాక చిన్నప్పటి నుంచి జనశక్తి వారి మీటింగ్‌లకు పోవడం వల్ల కూడా ఆ చైతన్యం చిన్నప్పటి నుండే ఉండేది. అందుకు కూడా యండమూరి నవలలు నచ్చలేదేమో. టెన్త్‌ తర్వాత నేను ఏ సాహిత్య పుస్తకాలు చదవలేదు. కానీ డిగ్రీ తర్వాత మళ్లీ సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఆయనవి ఒకటి, రెండు చదివాను. ఇప్పుడు ఆయన రచనలు ఇంకా నచ్చలేదు. ఇకపోతే, డిగ్రీ తర్వాత మహిళా పోరాటాల్లో పాల్గొంటుండటం వల్ల మళ్లీ సాహిత్యం చదవడం మొదలైంది. ముఖ్యంగా మఠం రవికుమార్‌ (మంజీర)ను పెళ్లి చేసుకోవడంతో అంటే… ఉద్యమంలోకి పూర్తికాలం కార్యకర్తగా వెళ్లడంతో నా సాహిత్య ప్రస్థానం మొదలైంది. మంజీర స్వతహాగా కవి, రచయిత. దీనికితోడు మమ్మల్ని రెగ్యులర్‌గా కలిసే ఐ.వి. సాంబశివరావు మాస్టారు. మా రవి (మంజీర) గదిలో నేను వెళ్లేనాటికే బోలెడన్ని పుస్తకాలు వున్నవి. వాటిని చదవడంతో పాటు మాస్టారుతో జరిగే సాహిత్య చర్చలు, సాయంత్రాలు రోడ్ల వెంట తిప్పుతూ కథలపై రవి (మంజీర) చెప్పే విశ్లేషణలు… నా సాహిత్య అభిలాషను మేల్కొలిపాయి.

3. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలు ఎవరు?
తా.క: రావిశాస్త్రి, మాగ్జిం గోర్కి, టాల్‌స్టాయ్‌.

4. మీలో కథా రచన ఎట్లా మొదలైంది?
తా.క: మనసు బాగాలేనప్పుడు రావిశాస్త్రి గారి కథలు చదివితే (గతంలో పలుమార్లు చదివినవే అయినప్పటికీ) మాస్టారు (ఐ.వి.) మామూలయ్యేవారు. మా దగ్గరికి వచ్చి ఆ కథలపై మళ్లీ చర్చించేవారు. అందువల్లనే రావిశాస్త్రి గారి రచనలు ఎక్కువగా చదివాను కావచ్చు. నా మీద శాస్త్రిగారి ప్రభావం కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో శాస్త్రిగారు చనిపోయినప్పుడు ‘ఛాత్రిబాబుకు ముత్యాలమ్మ నివాళి’ రాసాను. ముత్యాలమ్మ పాత్ర రావిశాస్త్రి గారి ‘మాయ’ కథలోనిది. ఉత్తరాంధ్ర యాస నేను ఎప్పుడూ విననూ కూడా వినలేదు. కానీ పై రచన మాత్రం మొత్తం ఉత్తరాంధ్ర యాసలో శాస్త్రిగారి స్టైల్‌లోనే రాశాను. అది నా మొట్టమొదటి రచన. దీనికితోడు మాకు పెళ్లి చేసినప్పుడు నా ఆర్గనైజర్‌ ‘సంవత్సరంలోగా మా అమ్మ గురించి కథ రాయాల’ని నా దగ్గర మాట తీసుకున్నది. కథ రాశావా అంటూ సరిగ్గా సంవత్సరానికి వుత్తరం రాసింది. అప్పటికే మిగతా సాహిత్యంతోపాటు కథలెలా రాయాలనే విషయంపై శాస్త్రి గారి ‘రావిశాస్త్రీయం’, కారా గారి ‘కథాకథనం’ చదివి వుండటం, తెలుగులోని సాహిత్యంతోపాటు రష్యన్‌, చైనా సాహిత్యం చదివి వుండటం… ఇవన్నీ మా అమ్మ కథ ‘తాయమ్మ కథ’ రాయగలిగాను.

5. మీ తొలి రచన ఏది? ఎక్కడ ప్రచురితమైంది?

తా.క: తొలి రచన అంటే ‘ఛాత్రిబాబుకు ముత్యాలమ్మ నివాళి’ అరుణతార పత్రికలో, తొలి కథ ‘తాయమ్మ కథ’ మహిళామార్గం పత్రికలో అచ్చయినవి.

6. కథ అల్లిక ఎప్పుడు మొదలైంది?
తా.క: మా అమ్మ ముచ్చట చెప్తే కథ చెప్పినట్టే వుంటది. వినే మన కళ్లకు ఆ వాతావరణం కూడా కనిపిస్తది. చిన్నప్పటి నుంచి వింటుండటం వల్లనేమో కథను అల్లగలిగాను. ఇకపోతే నా మట్టుకు నాకు కథ రాయాలంటే…. ముఖ్యంగా ఎదుటివారి కన్నీటికి స్పందించే గుణం, మంచి చెడుల విచక్షణ ఉన్నవారు కథలు అల్లగలరు అనుకుంటా. అందుకే కథ చదివితే ఆ రచయిత గుణమేంటో కూడా తెలుస్తుంది కదా.

7. 1996 తర్వాత 2000 దాకా కథలు రాయటం ఎందుకు ఆపారు?
తా.క: ఆ కాలంలో నేను దండకారణ్యంలో పని చేస్తున్నాను. దళజీవితంలో తీరిక సమయం దొరకక పోవడంవల్ల రాయలేదు.

8. మొదట్నుంచీ సొంత పేరుతోనే రాశారా? కలం పేరుతోనా?
తా.క: ఏవో ఒకటి, రెండు సొంత పేరుతో రచనలు చేసానేమో. అవేమిటో కూడా ఇప్పుడు గుర్తులేవు. ‘కరుణ’ అనే కలం పేరుతో కథలు రాయడం ప్రారంభించాను. నేను కథలు రాయని కాలంలో వేరొక విరసం రచయిత ‘కరుణ’ పేరుతో రాయడం, దానికితోడు ‘తాయమ్మ కథ’కు వచ్చిన పేరు వల్ల 2001 నుంచి నేను రాసిన కథలకు ‘తాయమ్మ కరుణ’ అనే పేరు స్థిరపడింది. నిజానికి ఇప్పుడు ‘తాయమ్మ’ లేకుండా కేవలం ‘కరుణ’ అంటే గుర్తుపట్టేవాళ్లు చాలా తక్కువ మంది.

9. ఏయే కలం పేర్లతో రాశారు?
తా.క: ఉద్యమ కథలను మాత్రం ‘టుంబ్రి’ పేరుతో రాసేదాన్ని. ఇప్పుడు అన్ని కథలను ‘తాయమ్మ కరుణ’గానే రాస్తున్నా. మరో విషయం, ‘విప్లవ మహిళ’ అనే లోపలి పత్రికను నిర్వహించినప్పుడు పలు పేర్లతో రాసాను.

10. మీ కలం పేరు ‘కరుణ’ ఎవరు పెట్టారు? ఆ పేరు పెట్టడానికి కారణం?
తా.క: పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమంలోకి వెళ్లినవారు ఎవ్వరైనాసరే… వెంటనే పేరు మార్చుకోవాల్సి వుంటుంది. అట్లా నా పేరు ‘కరుణ’గా మంజీర (రవి) పెట్టాడు. ఆయనకు కరుణ పేరు ఎందుకనో చాలా ఇష్టం. అందువల్లనే తన కలం పేరు ‘కరుణాకర్‌’ పెట్టుకుందామని నోట్‌బుక్‌ మీద రాసుకున్నాడట (మంజీర… నలంద్‌, ఆర్‌.కె., రవికుమార్‌ పేర్లతో కవితలు, వ్యాసాలు రాసాడు). దానిని ఎం.ఎస్‌.ఆర్‌ (‘కాగడాగా వెలిగిన క్షణం’ రచయిత, అమరుడు) చూసి తన కలం పేరుగా పెట్టుకున్నాడట. వీళ్లిద్దరూ కొంతకాలం కలిసి ఒకే గదిలో వున్నారు. దాంతో మంజీర తను పెట్టుకోలేని పేరును నాకు పెట్టాడు.

11. ఐవీ సాంబశివరావు, మంజీర పరిచయం గురించి చెప్తారా?
తా.క: వీరి గురించి పైన కొంత వివరించాను. మంజీర నాకు పరిచయం అయ్యేనాటి కంటే ముందే నా గురించి ఆయనకు తెలుసు. మహిళాసంఘంలో పనిచేస్తుండటం వల్ల నా గురించి విని వున్నాడు. కానీ ఆయన గురించి నాకు ఏ మాత్రం తెలియదు. పెళ్లి విషయం వచ్చినప్పుడు నా గురించి చెప్పగానే ఒప్పుకున్నాడట. తను చెప్పే రాజకీయ తరగతులకు నేను వెళ్లాల్సి వుండె. ఎందుకనో వెళ్లలేదు. నేను వస్తానని ఎదురుచూశాడట కూడా. ఎలాగైతేనేమి ఎట్టకేలకు కలుసుకున్నాం. నేను ఉద్యమంలోకి పూర్తికాలం వెళ్లాక జీవితాన్ని పంచుకున్నాం.

ఐవీ సాంబశివరావు మాస్టారు… నేను వెళ్లేనాటికి దండకారణ్యం నుంచి ‘క్రాంతి’, ‘వాన్‌గార్డ్‌’ పత్రికల బాధ్యతల్లోకి మళ్లీ వచ్చారు. ఒక్కరే వుంటున్నారు. అందుకని రోజూ మా రూమ్‌కి వచ్చేవారు. ఏదైనా ఒకరోజు ఆయనకు పని వుండి రాలేకపోతే… రెక్కలుగట్టుకొని వచ్చి వాలేవారు. అసలు బడికి పోయే విద్యార్థిలాగా తలకు నూనె పెట్టుకుని నున్నగా దువ్వుకుని, ఓ సంచిని తగిలించుకుని పొద్దున తొమ్మిది గంటలకల్లా వచ్చేవారు. ఎక్కువగా రావిశాస్త్రి, కారా మాస్టారి రచనల గురించి చెప్తుండేవారు. విశాఖ సముద్రపు ఒడ్డున కూర్చుని వారు చేసే సాహిత్య చర్చలు, కథలో ఒక కొత్త పదం వాడినా దాని గురించిన చర్చలు, రావిశాస్త్రి గారు రాసిన కథలను అచ్చుకు ముందే కూర్చుని ఉమ్మడిగా చదివి జరిపిన చర్చలు… ఇలా ఎన్నో విషయాలు చెప్తుండేవారు మాష్టారు. మంజీర సహచర్యం, పార్టీ నాయకత్వ కామ్రేడ్స్‌, అందులోనూ మాస్టారి సాహిత్య చర్చలు… ఈ ప్రపంచమంతా నాకు కొత్త. చాలా ఆసక్తిగా వినేదాన్ని, గమనించేదాన్ని.

12. కథా రచనలో ఐవీ మాస్టారు సలహాలు, సూచనలు ఎట్లా ప్రేరణగా నిలిచాయి?
తా.క: నా కథల విషయంలో ఐవీ మాస్టారి సలహాలు, సూచనలు నాకు ఏమీ లేవు. అయితే రావిశాస్త్రి కథలను మాస్టారు విశ్లేషించేటప్పుడు కొన్ని నేర్చుకున్నాను. ఒకటి, రచయిత కథలో దూరకూడదు. పాత్రల స్వభావానికి మించిన సంభాషణలను కథలో చెప్పించకూడదు. గంట కాల పరిమితితో ఉన్న కథలను రాయవచ్చు, సంవత్సరాల కాలపరిమితిలో సాగే కథలను అయినా రాయవచ్చు. కథలో చెప్పిన విషయాలను చివరికంటా కొనసాగించాలి. ఉదా. రంగయ్యకు అప్పుడు పదేళ్లు అని కథ మొదలుపెట్టి, 20 ఏళ్ల తర్వాతి విషయం చెప్పేటప్పుడు మొదట పదేండ్లను కలుపుకుని అతని వయస్సు 30 ఏళ్లు ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. రచయితకు నిజాయితీ వుండాలి. తదితరాలు మాష్టారు సంభాషణల ద్వారా, సాహిత్యాన్ని చదవడం వల్ల తెలుసుకున్నాను. ఇకపోతే, రావిశాస్త్రిగారు చనిపోయినప్పుడు నేను రాసిన ‘ఛాత్రిబాబుకు ముత్యాలమ్మకు నివాళి’ మాష్టారు చేతికి ఇచ్చాను. ఆయనే అరుణతారకు పోస్ట్‌ చేశారు. ‘‘రాస్కెల్‌, చాలా బాగా రాసింది’’ అని మంజీర దగ్గర మెచ్చుకున్నారట. ఆ తర్వాత విరసానికి నన్ను మెంబర్‌గా చేసుకొమ్మని ఉత్తరం రాసారు. మిగతా నా రచనలన్నీ ప్రింటయిన తర్వాతే ఆయన చదివారు. ఒకసారి మాత్రం నాతో, ‘‘కొ.కు. తర్వాత మిడిల్‌క్లాస్‌ జీవితాలను బాగా పట్టుకున్నావు నాన్నా. రాయు’’ అన్నారు.

13. ‘మాస్టారు, మంజీర లేకుండా కరుణ లేదు’ అని రాసుకున్నారు కదా ` మీ ‘తాయమ్మ, మరికొన్ని కథలు’ సంపుటిలో. ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. వాళ్ల స్ఫూర్తిని ఎట్లా కొనసాగిస్తున్నారు?
తా.క: ఇది నాకు చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే, పార్టీలో కొనసాగడం లేదు. అప్పాయింట్‌మెంట్‌ మిస్సయ్యి బయటే ఉండిపోవాల్సి వచ్చింది నేను. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక గడుపుతున్న ఈ జీవితం… తాడు మీద కర్ర పట్టుకుని పడిపోకుండా సర్కస్‌ చేస్తున్నట్టుగా అనిపిస్తూ వుంటుంది… కొన్నిసార్లు నాకు. ప్రస్తుత కాలంలో డబ్బు, పరపతి లేకుండా, అందునా ఒంటరిగా బతకడం అంటే కత్తి మీద సామునే కదా. మంజీర చనిపోయి, పార్టీ దూరమై, నా అన్నవారు లేకుండా, చేతిలో ఒక్క పైసా లేకుండా హాస్టల్‌లో వుండి బతికినదాన్ని. నేను నమ్మిన విలువలను నుంచి ఎప్పుడూ పక్కకు జరగలేదు. మంజీర, మాస్టారుల స్ఫూర్తి ఎప్పటికీ నాలో వుంటుంది.

14. తాయమ్మ కథకు స్ఫూర్తి ఎవరు?
తా.క: మా అమ్మ జీవితం. కొంత కల్పితం వున్నప్పటికీ తొంభై శాతం అమ్మ మాకు పదే పదే చెప్పిన విషయాలే కథలో పేర్కొన్నాను.

15. ఆ కథ రాసేటప్పుడు మీలో ఎలాంటి సంఘర్షణ జరిగింది?
తా.క: ముఖ్యంగా చివరి ఏడుపు సీను రాసేటప్పుడు ఏడుస్తూనే రాసాను. నిజానికి కథ రాసేటప్పుడు ఏ పాత్ర ఎట్లా స్పందిస్తే రచయితా అట్లా స్పందిస్తారు కదా. మొదటనే పెద్ద కథ ఎన్నుకోవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డాను. దాదాపు నెలరోజులు అదే పనిలో ఉన్నాను. ప్రతిరోజూ మంజీరకు చదివి వినిపించేదాన్ని. బాగా వస్తుంది రాయమని ప్రోత్సహించేవాడు. కథ అయిపోయేవరకు నాకు ఇంకో ధ్యాసలేదు. పాత్రలతో ఎప్పుడూ సంభాషిస్తూనే గడిపేదాన్ని. ఇప్పటికీ కథ రాయాలంటే అంతే.

16. మీ అమ్మ గురించి రాసినంతగా మీ నాన్న గురించి రాయకపోవడానికి కారణం?
తా.క: ఆయన గురించి రాయొద్దని రాయకుండా లేను. అమ్మతో ఉన్నంత సాన్నిహిత్యం నాయనతో లేదు. అదీగాక, ఆడపిల్లలమని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. ఇంట్లో దుర్మార్గంగా వ్యవహరించినా బయట మాత్రం చాలా మంచి మనిషి. మా నాయన బయటి ప్రపంచం గురించి ఆలోచన వచ్చినప్పుడు ‘తాయమ్మ కథ’ను ఇంకో కోణంలో కూడా రాసి ఉండేదాన్ని కదా అనిపిస్తుంది ఇప్పుడు. బహుశా నవలగా రాసేదాన్నేమో. మా నాయన గురించి మొదట్లో కొంత చెప్పాను. చిన్నదైనా సరే ఒక పుస్తకం తేవాలనుకుంటున్న. ఆయనతో కలిసి పనిచేసిన వారిని కలవాల్సి ఉంది. నిజానికి అది రాయదగిన చరిత్ర కూడా.

17. ‘కవులమ్మ ఆడిదేనా?’ కథకు నేపథ్యం?
తా.క: మా నాయినమ్మ ఒకామె వుండె. ఆమె మాటవిరుపు, ఆమెలోని ఉదాసీనత, ఆమె పడిన కష్టాలు బహుశా చిన్నప్పుడు నా మనసుకు హత్తుకుని వుండి వుంటాయి. నేను తెలంగాణకు వచ్చిన తర్వాత శ్రీకాకుళంలోని కథానిలయానికి వెళ్లాను ` కథల గురించి చదువుకోవడానికి. అప్పుడు కారా మాస్టారు రోజూ 2 గంటలపాటు సాహిత్యంపై క్లాస్‌ తీసుకునేవారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే ఈ ‘కవులమ్మ ఆడిదేనా?’ కథ రాసాను. ఇందులో కథ నడిపే తీరుపై కొంత శ్రద్ధ తీసుకున్నాను.

18. సాహితీ సృజనలో దండకారణ్య రచయితల ప్రత్యేకతలు ఏమిటి?
తా.క: పార్టీ పనిచేస్తున్న అన్నిచోట్ల ఉన్న ప్రత్యేకతలే దండకారణ్యంలోనూ వున్నాయి. పార్టీలో ఎక్కడ క్యాంపులు జరిగినా సాహిత్యాన్ని ప్రోత్సహించడం… అంటే, తెల్లకాగితాన్ని ఇచ్చి ఏదో ఒకటి రాయమని, రాసిన వాటిని సాయంత్రాలు చదవడం అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఉద్యమాన్ని నడపడంపట్ల పార్టీ ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తుందో, సాంస్కృతిక విప్లవంలో భాగంగా సాహిత్య సృజనను చేయడం కూడా అంతే నిబద్ధతతో స్వీకరిస్తుంది. అందుకు కృషిచేస్తుంది. కానీ ఎందువల్లనో పార్టీలో మహిళా కామ్రేడ్సే ఎక్కువగా సాహిత్య సృజన చేస్తున్నారు. అందుకు ఉదాహరణ… ‘వియ్యుక్క’ సంపుటాలు. 50 మందికి పైగా మహిళా కామ్రేడ్స్‌… 500కి పైగా కథలు రాసారు. నిజానికి వీటిపై విస్తృతమైన చర్చ జరగాల్సి వుంది.

19. సాయుధ విప్లవసందేశాన్ని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకుపోవాలంటే రచయితలుగా ఇంకా ఎలాంటి కృషిచేయాల్సి వుంది?
తా.క: రచయితలుగా కృషి చేయడమంటే ప్రధానంగా రాయడమే కదా. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఆచరణలో ఉండటం. ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ప్రజల తరఫున మాట్లాడటం, నిలబడటం అని నేను భావిస్తున్నా.
ఈ విషయంలో విప్లవ రచయితలు లోపల, బయటా ఉన్నవారు బాగానే కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రాసేవారు తక్కువ, పని ఒత్తిడి ఎక్కువ, సమయ లేమి… రాయాల్సినంత రాయకపోవడానికి ప్రధాన కారణాలు అనుకుంటున్నా. బహుశా సోషల్‌ మీడియా ద్వారా చిన్న చిన్న కథలు, వ్యాసాలు అయినా రాస్తే జనంలోకి ఎక్కువగా తీసుకుపో గలమేమో. రాయాల్సిన వారి సంఖ్య మాత్రం కచ్చితంగా పెరగాల్సి వుంది. ఇకపోతే ఇతరుల రచనలు చదవడం, వాటి మీద వ్యాఖ్యానించడం కూడా చేయాల్సి ఉంది. కానీ పైన చెప్పినట్టు పనిఒత్తిడి, సమయలేమి.

20. యాభై ఐదేళ్ల విప్లవ కథలో యెన్ని తరాల రచయిత్రులు ఉన్నారు? వాళ్ల ప్రత్యేకతలు ఏమిటి?
తా.క: మొదటగా విప్లవకథ అంటే బయట వున్నవారు రాసినవా? ఉద్యమంలో వుండి పని చేస్తున్నవారు రాసినవా? అనే ప్రశ్న వస్తుంది. ఉద్యమంలో ఉండి రాసిన వాళ్లలో డా.నళిని మొట్టమొదట 1973లో రాసింది.
1980లలో నుంచి ఎల్లంకి అరుణ మొదలు యాభై మందికి పైగా ఉద్యమంలో పనిచేసిన, చేస్తున్న మహిళా కామ్రేడ్స్‌ కథలు రాసారు. ఇందులో ఒక్క కథ రాసిన వారు కూడా ఉన్నారు. సంఖ్య రీత్యా అందరి కంటే ఎక్కువ కథలను షహీదా రాసింది. ఆ తర్వాత తాయమ్మకరుణ, బి.అనురాధ, మిడ్కో, డా.నళిని రాసారు. ప్రత్యేకంగా లోపలి (ఉద్యమ) కథలను తాయమ్మ కరుణ, జైలు కథలను బి. అనురాధ ఎక్కువగా రాసారు. మైనారిటీ, హిందూత్వంపై షహీదా ఎక్కువ (ఏడింటిని) రాసింది. ఆదివాసులలోకి మతం రావడం, కుల విభజన జరుగుతున్న క్రమాన్ని నేను కూడా ‘అంటరానితనం’ కథ రాసాను. ఇక కులం మీదా బి. అనురాధ ఎక్కువ (ఎనిమిది) కథలను రాసింది. ఎన్‌కౌంటర్‌లలో చనిపోయినవారి మృతదేహాల స్వాధీనంలోనూ రాజ్యం స్వభావం, తాము చేస్తున్న ఫైట్‌ గురించి పద్మకుమారి కథలు రాసింది. అలాగే కవిని, యామిని, సుజాత, మైనా, వసుధ కథలు రాసారు, రాస్తున్నారు. నర్మద (నిత్య పేరుతోనూ రాసింది. అమరురాలు) కథలు రాసింది. ‘వియ్యుక్క’ సంకలనాలను చదివితే కథల్లోని మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు.

21. విప్లవ కథ వస్తు, శిల్పాలలో ఎలాంటి పరిణతి సాధించింది?
తా.క: వస్తువు విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు మాకు. ఇక శిల్పమంటారా? పాఠకుడి చూపు మరలకుండా చదివించే ఏ కథైకైనా, నవలకైనా శిల్పం బాగున్నట్టే కదా. విప్లవ కథలు అలా చదివిస్తాయి. పాత్రలతోపాటు పరుగులు పెడ్తరు. గసపోస్తరు. వస్తువు ఎంత ప్రధానమైనదో విప్లవకథ చదివితే అర్థమవుతుంది. విషయమేందంటే… విప్లవకథలు చదవకుండానే విమర్శించేవారు ఎక్కువున్నారు అనిపిస్తుంది. నేర్చుకోవడానికి మేమెప్పుడూ సిద్ధమే.

22. యుద్ధరంగంలోంచి సాహితీ సృజన చేయడం ఎట్లా అనిపించింది? ఆ అనుభవాల్ని చెప్తారా?
తా.క: లోపల పనిచేస్తున్నప్పుడు రాసేవాళ్లను చాలా ప్రోత్సహిస్తారు. అది ఏదైనా గానీ. ఈర్ష్య, అసూయలు నేనైతే ఎదుర్కోలేదు. రాసినవాటిని క్యాంపుల్లో అయితే చదివి తమ అభిప్రాయాలను చెప్పేవారు. నిజానికి రచయితలే చదివేవారు. అందరూ శ్రద్ధగా వినేవారు. రాసేవాళ్లం కలుసుకున్నప్పుడు పండగే. సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్లం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఒక కామ్రేడ్‌ను పోలీసులు మాయం చేశారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఆ తల్లి వేదన గురించి విన్నప్పుడు నేను, మరో మహిళాకామ్రేడ్‌… నేనంటే నేను రాస్తామని పోటీపడ్డాము. ఆఖరికి తనకే వదిలిపెట్టాను. తను రాయలేదు. బహుశా పనుల ఒత్తిడి అయ్యుంటుంది. ఉద్యమం నుంచి బయటికి వచ్చాక ఆ కథను ‘అమ్మ’ పేరుతో నేను రాశాను. ‘‘పార్టీలోని మంచి గురించి అందరూ రాయొచ్చు, పార్టీపై విమర్శనాత్మక కథలను రాయ’’మని రామన్న చెప్పాడు. మా మంజీర సంగతి చెప్పనే అవసరం లేదు. అడవిలోకి వెళ్లాక తనో చోట, నేనో చోట. తను ఉత్తరాలు ఎక్కువగా సాహిత్యంపైనే ఉండేవి. చైనా సాహిత్యంలో పార్టీపై విమర్శ ఉండదు, రష్యా సాహిత్యంలో వుంటుంది అని ‘అపరిచిత’ నవల గురించి చెప్పేవాడు. బాగా రాయలేదేమో అని ‘తాయమ్మకథ’ రాసినప్పుడు నేను అంటే… ‘‘కథలో మహిళ జీవన పోరాటం వుంది, ప్రస్తుతం (1993 చివర్లో) తెలంగాణ యాసలో ఎవ్వరూ రాయడం లేదు. ఇది మంచి కథ. ఎవ్వరైనా వేసుకుంటారు’’ అని వెన్నుతట్టి పోస్ట్‌ చెయ్యమన్నాడు. దండకారణ్యం వెళ్లిన నెలరోజులకు అనుకుంటా… ఒక క్యాంపుకు చేరుకున్నాము. అక్కడ సాధన వున్నాడు. ఓ రోజు సాయంత్రం టీ తాగిన తర్వాత సాధన… నన్ను కూచోబెట్టుకుని మాట్లాడుతున్నడు. ఆ సందర్భంగా ‘టుంబ్రి’ నేనే తెలిసి, మొదట ఆశ్చర్యం పోయి తర్వాత సంతోషపడ్డాడు. టుంబ్రి పేరుతో రాసిన నా ‘రేపటి గెరిల్లాలు’ కథ చదివానని, పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టాలని అనుకున్నామని చెప్పాడు. నర్మదక్కయితే పెద్దగా మాట్లాడక పోతుండే కానీ తల్లిలా కనిపెట్టుకుని వుండేది. నిజానికి ఎవరం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. కానీ ఆత్మీయులం, కామ్రేడ్స్‌మి. ఒకరిపట్ల ఒకరికి అన్నివేళలా బాధ్యతగా వుండేవాళ్లం. ఆ రోజులు నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే వుంటాయి.

ఇంటర్వ్యూ : 5 మార్చ్, 2022.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

One thought on “యుద్ధరంగం నుంచి సాహితీ సృజన అపూర్వ అనుభవం

  1. తాయమ్మ కరుణ సాహిత్య – ఉద్యమ జీవిత ఆచరణని ఈ ఇంటర్వ్యూ గొప్పగా ఆవిష్కరించింది. కరుణ సుధాకర్.. ఇద్దరికీ విప్లవాభినందనలు.💯💕☑️

Leave a Reply