యుద్ధమే మరి ఆహారాన్వేషణ

నకనకలాడే కడుపాకలిని తీర్చుకోడానికి చేసే
పెనుగులాట కన్నా మించిన యుద్ధమేముంటుంది
డొక్కార గట్టుకున్న ప్రజలకు
అది ఎగబడడం అను, దొమ్మీ అను
ఆక్రమణ సైన్యంపై నిరాయుధ దాడి అను
అన్నం మెతుకు కోసం, రొట్టెకోసం ఆయుధాన్నీ
లక్ష్యపెట్టరు, గుండెల్లో దిగే బుల్లెట్ నూ లెక్కపెట్టరు

అనంతకోటి ఆదివాసీల ఆహారాన్వేషణ యుద్ధం
ఇంకా ముగియలేదు
పాలస్తీనియన్ లు సూర్యగోళం నుంచి సముద్రంలో విరిగిపడిన
భూఖండంలోని నేలను కాళ్లకింద కోల్పోయినవాళ్లే
వాళ్ల నేలనూ ఆక్రమించుకుంటివి
సముద్రాన్నీ ఆక్రమించుకుంటివి
ఆకాశాన్నీ ఆక్రమించుకుంటివి
శరణార్థుల శిబిరాలనాక్రమించుకుంటివి
ఆరోగ్యాలను, ఆసుపత్రులను ధ్వంసం చేస్తివి   
రఫా ప్రవాసాన్నీ, గాజా సరిహద్దుల్ని
ఆక్రమించుకుంటివి
ఆపన్న హస్తం అందించిన అన్నం గిన్నెను
సాయుధ సైనికులతో ఆక్రమించుకుంటివి
నీ ఆక్రమణ ఆకలి, చమురు ఆకలి
ఇంధనాల ఆకలి, జాతి విద్వేషం ఆకలి
జియోనిస్టు విస్తరణ ఆకలి, అమెరికా సామ్రాజ్యవాద ఆకలి
మనుషుల శవాలను తిన్నా తీరేది కాదు.
యుద్ధాలతో భూగోళాన్ని పంచుకున్నా తీరేది కాదు

నీ బుల్లెట్ లతో నేలరాలిన ఆకలి శవాల నెత్తుటిలో 
తడిసిన ఆహారం ఉందే
అది ఆ చేతులు పండించిన నెత్తురు చెమటయిన పంట
అది మా అడవుల నుంచీ
పొలాల నుంచీ, బీళ్ల నుంచీ, దేశ సరిహద్దుల నుంచీ
శత్రు ఆంక్షలన్నింటినీ ధిక్కరించి
గాజా నేలంతా పారుతున్న కష్టజీవుల
అన్నపు ఆకలి స్వేచ్ఛకోసం చేసే
విముక్తి యుద్ధం
అది మనుషుల్నీ ప్రకృతినీ ఆదుకోవడానికి చేసే న్యాయ యుద్ధం
నీది మనుషుల్నీ, ప్రకృతినీ విధ్వంసం చేసే ఆక్రమణ యుద్ధం

2 thoughts on “యుద్ధమే మరి ఆహారాన్వేషణ

Leave a Reply